The Project Gutenberg eBook of శుభలేఖ This ebook is for the use of anyone anywhere in the United States and most other parts of the world at no cost and with almost no restrictions whatsoever. You may copy it, give it away or re-use it under the terms of the Project Gutenberg License included with this ebook or online at www.gutenberg.org. If you are not located in the United States, you will have to check the laws of the country where you are located before using this eBook. Title: శుభలేఖ Author: Mahidhara Ramamohan Rao Release date: February 28, 2012 [eBook #39004] Most recently updated: January 8, 2021 Language: Telugu Credits: Produced by volunteers at Pustakam.net *** START OF THE PROJECT GUTENBERG EBOOK శుభలేఖ *** Produced by volunteers at Pustakam.net శుభలేఖ మహీధర రామమోహనరావు విజేత పబ్లికేషన్స్ 40-9/4-5 కె. జె. గుప్తా మునిసిపల్ ఎంప్లాయీస్ కాలనీ విజయవాడ-520010 శుభలేఖ మహీధర రామమోహనరావు ప్రతులు-1000 ప్రథమ ముద్రణ-1996 సెప్టెంబర్ కవర్ డిజైన్-బాలి వెల:రూ. 35-00/- ప్రతులకు: విజేత పబ్లికేషన్స్ 40-9/4-5 కె. జె. గుప్తా మునిసిపల్ ఎంప్లాయీస్ కాలనీ, విజయవాడ-10 ముద్రణ: వంశీకృష్ణా ప్రింటర్స్ విజయా టాకీస్ వెనుక, విజయవాడ-2. జాతీయోద్యమం మన జాతిని స్వాతంత్ర్య సాధనకు ఉన్ముఖుల్ని చేయడం ఒక్కటే కాదు. నూరేళ్ళు పైగా సాగిన ఆ వుద్యమం దేశ ప్రజల మనస్సులో బ్రిటిష్ ప్రభుత్వం మీదనే కాదు, అసలు ప్రభుత్వ వ్యవస్థకే శత్రుత్వం నింపింది. ఫలితంగా స్వాత్రంత్యానంతరం దేశ పునర్నిర్మాణానికి గాక ప్రభుత్వాల్ని కూలదోయడమే ప్రజల, పార్టీ లక్ష్యం అయింది. కాంగ్రెసు, కమ్యూనిస్టు, బి.జే.పి., బి.ఎస్‌పి, డి.ఎం.కే., తెలుగు దేశం ప్రతి ఒక్కరూ మిగిలిన వారితోనే కాదు. తమ వారితో కూడా శత్రుత్వమే. అధికారంలోవున్న ప్రభుత్వాన్ని కూలదోయడం ఒక్కటే లక్ష్యం. అల్లకల్లోలం సృష్టించి పాలన సాగకుండా చేసి పడతొయ్యడం కోసం రౌడీల్నీ, కిరాయి హంతకుల్నీ చేర్చి ప్రజా సామాన్యాన్ని హత్యలు పాలు చేయడానికి అందరూ సన్నద్దులే. ఈ ఘట్టంతో ప్రజాసేవారంగాల్నే అంటి పెట్టుకొని వుండి, అందరితో సత్సంబంధాల్ని సాగిస్తున్న వ్యక్తి సుబ్బరాజు, ఎం. వి. నా దృష్టిలో మహనీయుడు. ఆయన నా మిత్రుడు కావడం గర్వకారణం. అందుకే ఈ సుమాంజలి. --మహీధర రామమోహనరావు శుభలేఖ శుభలేఖ పిడుగులా వచ్చి పడిందని రాస్తే కావ్య మీమాంసకులు కనుబొమలు విరుస్తారేమో కాని, చంద్రశేఖరశాస్త్రి చేతికి వచ్చిన ఆ శుభలేఖ పిడుగులాగే అతని నెత్తినణిచింది. పాత ఊళ్ళో ఉన్నఆఫీసుకెళ్ళే సన్నాహంలో శాస్త్రి రిక్షా వానికోసం గుమ్మంలో నిలబడి ఉన్నాడు. ఆఫీసులో తాగేందుకు మరచెంబుతో మంచినీళ్ళు తెచ్చి గుమ్మంలో పెట్టింది సత్యవతమ్మ. వెళ్ళేటప్పుడు కేకెయ్యండీ. తలుపేసుకుంటాను" ఓ అడుగు లోపలికేసి నిలబడింది. "కాళ్ళు పీకేలా ఏం నిలబడతారు? ఆ మోడా లాక్కుని కూర్చోరాదా?" అంది. భార్య శ్రద్ధకు శాస్త్రి చిరునవ్వు నవ్వేడు. "ఈ నిలబడ్డందుకు ప్రతిగా సాయంకాలం వరకూ కుర్చీలోంచి లేవనులే." సత్యవతమ్మ లోనికెళ్ళింది. ఒక్క నిముషం నిలబడింది. భార్య సలహా పాటించడానికై శాస్త్రి కదలబోయేడు. "పోస్ట్!" మరు నిముషంలో గేట్ తోసుకుని ఒక చెయ్యి రెండు మూడు పత్రికలూ, రెండు మూడు ఉత్తరాలూ లోన బడేసి అదృశ్యమయింది. కూర్చోబోయిన వాడల్లా లేచి శాస్త్రి వాటిని తీసుకున్నాడు. వాటిలో ఓ కవరు కొట్టవచ్చినట్లు దృష్టినాకర్షించింది. మిగిలినవాటన్నింటిని పక్కనపెట్టి ముందు దాన్నే విప్పేడు. మంచి ఆర్టు పేపరు మీద అందంగా, నిరాడంబరంగా ముద్రించిన వివాహాహ్వానం. కవరు అంచులకు రాసిన పసుపు మరకలను బట్టి అనుకోవలసిందే గాని, ఆ పత్రికను చూస్తే అదో వివాహాహ్వానం అనిపించదు. దానిమీద శుభమస్తు, శ్రీరస్తు వంటివి లేవు. సాంప్రదాయకంగా వేసే--"జానక్యా: కమలామలాంజలి పుటే" శ్లోకం కనబడదు. తిథి వార నక్షత్రాల ప్రసక్తేలేదు. పత్రికల్లో వచ్చే వార్తలకయినా అంతకన్న మెరుగులుంటాయి. "మేం వివాహం చేసుకుంటున్నాం." శతం జీవ శరదో వర్ధమాన ఇత్యాభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయు ర్మురుత ఏ నావర్ధయన్తి శత మేవ మేవ శతాత్మానం భవతి శతమనన్తం భవతి శత మైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః అంటూ పెద్ద అక్షరాలలో వున్న శీర్షిక పంక్తిని చూసి శాస్త్రి అప్రయత్నంగానే "శుభం భూయాత్" అనేసి నవ్వుకున్నాడు. నవ్వుకుంటూ, ఆ వివాహం చేసుకొంటున్నదెవరా యని దిగువనకు చూసేసరికి అంత పెద్ద అక్షరాలలోనే "మీ ఆశీస్సుల నాశిస్తున్నాం" అన్న చివరి పంక్తి కనబడింది. "ఓస్, ఇంతే కద మహద్భాగ్యం దానిదేముంది? తప్పకుండా" అంటూ ఆశీర్వచన పనస నందుకున్నాడు. "శతం జీవ శరదో వర్ధమాన...." ఆఫీసుకి ప్రయాణమై గుమ్మంలో నిలబడ్డ భర్త అశీర్వచనాన్నెత్తుకోడం వినిపించి, సత్యవతమ్మ చేతిలో పని వదలి సావిట్లోకి వచ్చింది. ఆమెని చూసి శాస్త్రి తన పనికి తానే నవ్వేడు. "ఎవరో పెళ్ళి చేసుకొంటున్నారట. వెడితే తాంబూలం ఇవ్వవలిసి వస్తుందనో యేమో, అక్కడి నుంచే ఆశీర్వదించండన్నారు. మనదేం పోయిందని ఆశీర్వదిస్తున్నా" "ఇంతకీ ఆ పెళ్ళి చేసుకోబోయే వాళ్ళ పేర్లన్నా చూసేరా?" "నిజమే సుమీ" శాస్త్రి పత్రిక తీసి చదవడం ప్రారంభించేడు. "ఆగస్టు 15వ తేదీ." "రేపే నన్నమాట!" అంది సత్యవతి. "సాయంకాలం ఏడు గంటలకి." "వీళ్ళకి ఏడంకెమీద మోజుంది కాబోలు." "అడ్వొకేట్ శాస్త్రి ఆధ్వర్యాన...." "పురోహితుడి ప్రాముఖ్యం ఏమిటి చెప్మా, శుభలేఖలోకి ఎక్కించడానికి?" అంది సత్యవతి. "పంచెల చాపు ఎగ్గొట్టినా ఏడవకుండేందుకు ముందే తేనె నాకించడం కాబోలు." "ఇంతకీ...." "వస్తున్నా మరి ఇంక సంతకాలు చూడు." "అసదుల్లాఖాన్, ఫిలాసఫీ ఆనర్సు, విజయవాడ...." సత్యవతమ్మ ఆశ్చర్యం కనబరచింది. "అసదుల్లా! మీ శిష్యుడే, అందుకే మీకు పంపించేడు." శాస్త్రి ముఖం నుంచి నవ్వు హఠాత్తుగా మాయమయింది. తరువాతి పేరు చదువుతున్నవాడు చటుక్కున ఆగిపోయేడు. ముఖాన తెల్లదనం. గుండెలు పట్టేసినట్లయింది. "అయ్యో!" అతని వాలకం, ఆక్రందన చూసి సత్యవతమ్మ కంగారుపడింది. చటుక్కున భుజం పట్టుకుని పక్కనున్న మోడాలో కూర్చుండబెట్టబోయింది. "నడు, లోపలికి!" ఆ క్షీణస్వరం చేయి పట్టుకొని గాని నిలబడలేనంత బలహీనత చూసి ఆమె మరింత ఆందోళన పడింది. ఆ స్థితికి కారణం ఆ శుభలేఖే అయి ఉంటుందని తోచలేదు. ఈ మధ్య వినిపించే మరణాలన్నిటికీ గుండె పోటే కారణమని వింటోందేమో ఆలోచన అటే పోయింది. పడక కుర్చీలో కూర్చోబెడుతూ ఆదుర్దాగా అడిగింది. "ఎలా ఉంది? డాక్టరు కోసం...." శాస్త్రి ఆమె చేయి పట్టుకొని వదలలేకున్నాడు. నెమ్మదిగా, అస్పష్టంగా "నువ్వు కూర్చో ముందు" అన్నాడు. ఆయన కళ్ళల్లో నీరు తిరుగుతున్నట్లనిపించి సత్యవతమ్మ మరింత కంగారు పడింది, బేజారెత్తిపోయింది. "వాళ్ళ ప్రసాదుని డాక్టరు కోసం పంపిస్తా ఒక్క నిముషం కదలకుండా పడుకోండి." సమాధానం కోసం ఆగకుండానే పక్క వాటా వారిని పిలిచింది. "ప్రసాదూ! ప్రసాదూ!" ఆమె ఆదుర్దా , పిలుపూ శాస్త్రికి నిజంగానే గుండె జబ్బు తెప్పించేలా ఉన్నాయి. పక్క వాటా వాళ్ళూ, వాళ్ళతో వీధిలోని వాళ్ళూ, పేటలో వాళ్ళూ ఉరకలేస్తూ వస్తున్నట్లే అనిపించింది. హడలిపోయేడు. ఏం జరిగిందంటే ఏం చెప్తాడు? నలుగురూ శుభలేఖ చూస్తారు. ఇంకేమన్నా ఉందా? అప్పుడే పక్క వాటాలోంచి కృష్ణవేణమ్మ పలుకుతూంది. నాలుగేళ్ళ పిల్ల ఏదో మంకుతనం చేస్తూంది కాబోలు కోప్పడుతూంది. "అబ్బ ఉండవే పాడు గోల! పిన్నిగారు పిలుస్తున్నారు. ఎందుకోచూడు" శాస్త్రి చటుక్కున భార్యనోరు మూసేడు. చేతిలోని శుభలేఖ కళ్ళముందు ఆడించేడు. "గోల చెయ్యకు కొంప మునిగిపోయింది!" కృష్ణవేణమ్మ కంఠం ఎత్తి పిలుస్తూంది. "ఏమిటి పిన్నిగారూ? పిలిచేరా?" అసలు విషయం అర్థం కాకపోయినా శుభలేఖలో మాట ఏదో మగడిని ఆందోళన పరచిందని సత్యవతి గ్రహించింది. గోల కాకూడదని క్షణంలో సర్దుకొంది. "అబ్బే, ఏం లేదు. పిల్లది మహా గొడవ చేస్తూంది. భోజనాలయాయా? ప్రసాదు బడి కెళ్ళేడా?" "ఏదీ, ఇప్పుడే వాడిని పంపించి విస్తట్లో పెట్టుకున్నా, బాబయ్యగారింకా వెళ్ళినట్లులేదే!"-అంది కృష్ణవేణమ్మ. "లేదు. తలనొప్పిగా ఉందని ఇంట్లొనే ఉండిపోయారు," రాబోయే ప్రశ్నక్కూడా సమాధానం చెప్పేసి, ఆమె మగని వేపు తిరిగింది. "తాతకీ, వాళ్ళకీ తెలియదంటారా?" ఆమె ఆలోచనలన్నీ తన మగనినినంత కంగారు పెడుతున్న దేమిటాయని సాగుతున్నాయి. పెళ్ళికొడుకు అసదుల్లా తన మగడు పని చేస్తున్న కంపెనీ యజమాని మనమడు. తన పెళ్ళి విషయం తాతగారికి చెప్పి ఉండడు. లేకుంటే తమకి తెలిసి ఉండేది. అంటే తమ వాళ్ళెవరూ అంగీకరించలేని పెళ్ళి చేసుకొంటున్నాడు కాబోలు! ఆ వార్తవింటే ముసలాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళ ప్రాణాలన్నీ ఆ మనమడి మీదే పెట్టుకు బ్రతుకుతున్నారు. కంపెనీ దెబ్బ తినేస్తుంది. తమ నోట్లో మన్నడిపోతుంది.--ఆ పంథాలో సాగుతున్నాయి ఆమె ఆలోచనలు. ఆ ఆలోచనను ధృవపరచుకొనేందుకే ఆ ప్రశ్న వేసింది. కాని శాస్త్రి ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. "హఫీజ్ మహమ్మదుకు తెలుసుననే అంటావా?" "ఏమో, పాపం! మనమడి మీద ప్రాణాలెట్టుకున్నాడు. ఆయనకి తెలిసి, ఆయన ఇష్టం మీదనే ఈ పెళ్ళి జరుగుతూంటే మీకెవరికీ తెలియకుండా ఉంటుందా?" ఎవరికి ఎంతవరకు తెలుసునో గాని, శుభలేఖలోని అసలు విషయం భార్యకు తెలియదని ఆమె ప్రశ్నను బట్టి శాస్త్రికి అర్థం అయింది. తాను చూపిన శుభలేఖని ఆమె చదవలేదన్న మాట! వధువు పేరునామె చూడనేలేదు. "రెండో వారెవరో ఎరుగుదువా?" పెళ్ళికూతురనే మాటను కూడా శాస్త్రి ఉచ్చరించలేకపోయాడు. ఆ మాట తలచుకోగానే కంఠం డెక్కు పట్టింది. శుభలేఖ నామెచేతిలో పెట్టి తల తిప్పుకున్నాడు. సత్యవతమ్మ గబగబా వెళ్ళి కళ్ళజోడు తెచ్చుకుంది. "అసదుల్లా ఖాన్ ఫిలాసఫీ ఆనర్సు, విజయవాడ. ఎం. ఉమాదేవి, విజయవాడ." మరొక సందర్భంలో అయితే ఆ పేరు చదివినా ఏమీ అనిపించి ఉండేది కాదు. కాని ఇప్పుడు వేరు. మగని అవస్థ చూశాక ఆమెకు అనుమానం కలిగింది. "ఎవరీ ఉమ?" శాస్త్రి సమాధానం చెప్పలేకపోయాడు. కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ తల తిప్పుకున్నాడు. సత్యవతి గ్రహించింది. "అయ్యో! అయ్యో!" "నిరుడా కుర్రాడు వచ్చి అడిగినప్పుడు పెళ్ళి చేసేసినా బాగుండిపోను! సగోత్రం అని అభ్యంతరం చెప్పేను. ఇప్పుడు మతం కూడా కాదే!" శాస్త్రి చిన్నపిల్లవాడిలా ఏడ్చాడు. సత్యవతమ్మ మంచి వ్యవహార జ్ణానం గల మనిషి. మగనికి ముందు ధైర్యం చెప్పాలి. "నా కిందులో ఏదో తిరకాసు కనిపిస్తూంది. మన ఉమ కాదీ అమ్మాయి యెవరో?" అతడా అనుమానం లేదన్నట్లు తల తిప్పేడు. "విజయవాడ అమ్మాయిట." "విజయవాడలో ఉమ అంటే మన అమ్మాయేనా, ఏంటి?" "ఇంటి పేరు 'ఎం' అని ఉంది." "'ఎం' అక్షరంతో ప్రారంభమయ్యే ఇంటి పేర్లు ఎన్ని లేవు?" "చదువు...." "అది మాత్రం...." "అంతే నంటావా?" "ఓ మారు జ్ఞాపకం చేసుకోండి. మీరు సగోత్రమని అభ్యంతరం చెప్పినప్పుడు ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఉమ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. అతనిమీద అంత ఆసక్తి చూపినది. ఇప్పుడు మరొకర్ని చేసుకోవడానికి సిద్ధమయిందంటే నమ్మలేను!" శాస్త్రి ఆనాటి ఘటనలన్నీ గుర్తు చేసుకున్నాడు. తానే ఈ పరిస్థితిని కల్పించుకున్నాననుకొంటూ కుమిలిపోయేడు. 2 సరిగ్గా పది నెలలయింది. రెండో కొడుకు రామకృష్ణ అతనిని వెంటబెట్టుకు వచ్చేడు. వాళ్ళ వెనకనే రిక్షా దిగిన ఉమని చూసేక ఏదో అనుమానం కలిగింది. "ఇప్పుడొచ్చేవేమమ్మా? సెలవులేమన్నా ఉన్నాయా?" అన్నాడు శాస్త్రి. మొదట తటపటాయించినట్లనిపించినా వెంటనే సర్దుకొంది. "చిన్నన్నయ్య వచ్చాడు. బెజవాడ వెడుతున్నా వస్తావా, అన్నాడు. రావాలనిపించింది వచ్చాను." తరవాత రామకృష్ణ చెప్పేడు. శాస్త్రి, భార్య కూడా అతనిని చూసి ఆనందపడ్డారు. పాతికేళ్ళవాడు మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. ఎత్తరి. దానికి తగిన పుష్టి, కన్ను, ముక్కు తీరుంది. ఆకర్షకంగా ఉన్నాడు. విషయం విన్నాక శాస్త్రి వేసిన మొట్టమొదటి మొదటి ప్రశ్న--"వారిదేశాఖ?" అని. రామకృష్ణ తెల్లబోయేడు. వర్ణాంతరం చేయడానికి తండ్రి ఒప్పుకోడు. కనుక, భాస్కరరావు బ్రాహ్మణ కులం వాడేనా అన్నదొక్కటే తెలుసుకున్నాడు. శాఖల్ని గురించి తెలుసుకోవడం అవసరం అనుకోలేదు. తెలుసుకోలేదు. అయితే ఆ మాట ఒప్పుకోకుండా ఎదురు ప్రశ్న వేసేడు. "ఏం శాఖల పట్టింపు కూడా పెట్టుకుంటారా?" శాస్త్రి విశాల హృదయం కనబరిచేడు. "ఆ పట్టింపులు పెద్దగా చూడనక్కరలేదనుకో. తెలుసుకోవడంలో తప్పులేదు కదా!" "నే నడగలేదు." "పోనీ గోత్రం ఏమిటనేనా తెలుసుకున్నావా?" అన్నాడాయన ఎకసక్కెంగా. రామకృష్ణ అదీ అవసరం అనుకోలేదు. కాని, ఏ వివరాలు తెలుసుకోకుండా పడుచువాళ్ళనే విధంగా సమ్ముఖపరచావని తప్పుపడుతూంటే సహించలేకపోయేడు. "మన గోత్ర ఋషి భరద్వాజుడు కూడా వేగినేటి వాడేనా? ఆయనదీ మనింటి పేరేనా? మనకి పూర్వం ఎన్ని తరాల క్రితం వాడయి ఉంటాడంటారు?" అన్నాడు రామకృష్ణ ఎకసక్కెంగా. చంద్రశేఖర శాస్త్రి ఆ సమస్యను ఆ రూపంలో ఎన్నడూ ఆలోచించలేదు. అందుచేత ఆయన వద్ద సమాధానాలు లేవు. "మనకి కొన్ని ఆచారాలు, అలవాట్లూ ఉన్నాయి. అవెందుకొచ్చేయి? అలాగే ఎందుకున్నాయనంటే చెప్పలేకపోవచ్చు కాని, తగినంత కారణం లేనిదే వచ్చి ఉండవు...." "కారణం లేనిదే వచ్చాయని నేనూ అనడం లేదు. మంచి కారణమే ఉంది. గోత్రం అన్న శబ్దంలోనే ఉంది ఆ సూచన. "మనుష్యుడు పశుపాలకుడుగా పరిణితి పొందిన నాటి శబ్దం అది. పశుపాలకులుగా జీవిస్తున్న ఒక్కొక్క జట్టు తమ తమ నాయకుడి పేరుతో చలామణీ అవుతూండి ఉండాలి. ఆ రోజుల్లొనే ఆ జట్టు వాళ్ళంతా సంఖ్యలు పెరిగి, నాలుగు మూలలకీ చెదిరిపోయినా, ఫలానా దీక్షితులుగారి మనుమలని మమ్మల్నన్నట్లే, ఆ మొదటి నాయకుడీ పేరు మీదనో, తరవాత వచ్చినా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన మరొకరి పేరు మీదనో చెలామణి అయ్యారు. ఆ విధంగా వారు ఏక గోత్రీకులయ్యేరు. ఒకే జట్టుగా ఉన్నప్పుడే అమలులోకి వచ్చిన అంతర్వివాహ నిషేధం తరవాతా కొనసాగింది. బహుశా వేల ఏళ్ళే కాదు. వేల తరాలే గడిచిపోయేయి. ఆ జట్లు పాకేయి. ఇతరేతరుల సంపర్కంలో ఆ రక్తం సమ్మిశ్రితం అయిపోయింది. "ఈ వేళ ఒకే గోత్రం వారు రక్త సంబంధీకులయి ఉంటారనేదానికి అర్థం లేదు. "నాన్నగారూ! మనుష్యుడు ఒక్కచోటనే ఉండిపోలేదు. ఎంతో దూరం వచ్చేసేడు. మన శాఖలు, మన తెలుగువాళ్ళలో కనిపించే ఇంటి పేర్లు దానికి సాక్షిభూతాలు. చరిత్రకు కూడా అందని కాలంనాటి పునాదుల మీద ఈవేళ భవనాలు లేపబోకండి.." చంద్రశేఖర శాస్త్రి ఉస్సురని పోయాడు. నెమ్మదిగా అన్నాడు. "అయితే గోత్రం ఒకటేనన్నమాట." "నే నడగలేదు. నాకు తెలియదు. ఒకటేనని ఎందుకనుకోవాలి?" "తెల్సుకుందాం" అన్నాడాయన దృఢంగా. "ఒకటే అయితే?" "ఈ వివాహం కూడదు!" "ఇంతా విని...." "నీవి వట్టి ఊహలు గాక నిజమనేందుకు సాక్ష్యం ఏమిటి?" అంటూ ఒక్క మాటలో రామకృష్ణ వాదాన్ని పక్కకు తోసేశాడు. రామకృష్ణ ఒక్కనిముషం చురుక్కుమనేలా చూసేడు. "కొన్నేళ్ళ క్రితం నాగార్జున కొండకెళ్ళేం గుర్తుందా?" "అదెందుకొచ్చిందిప్పుడు?" అన్నాడు శాస్త్రి అనుమానంగా. మాటల్లో ఎక్కడో మెలిక వేసి తనను వాదంలో బోల్తాకొట్టిస్తాడని రామకృష్ణయెడ ఆయనకు తగని భయం. "చెప్తున్నా, ఇక్ష్వాకు రాజు వీరబాహుదత్తుడు అశ్వమేధయాగం చేసిన గుర్తులూ యజ్ఞకుండాన్నీ చూసేరు గుర్తు ఉందా?" "ఔను" "ఆ రోజున క్యూరేటరు ఒక విషయం చెప్పారు. దానిమీద మీరాయనతో వాదం వేసుకున్నారు." "కావచ్చు." "వీరబాహుదత్తుడు ఇన్ని అడుగుల ఇన్ని అంగుళాల ఎత్తు మనిషి అన్నారాయన. అలా కచ్చితంగా చెప్పడానికి--ఆ వీరబాహుదత్తుడు కనీసం 15-16 వందల ఏళ్ళ పూర్వపువాడు--ఆయన చూపిన ఉపపత్తి గుర్తుండి ఉంటుంది." "ఔను" "యజ్ఞశాల మెట్లలో ఒక దానికి రంధ్రం, తూము ఉన్నాయి. దాన్ని బట్టి ఆయన ఆ లెక్క చెప్పేరు. అవబృథ స్నాన జలంలో యజమాని మునిగి చనిపోకుండేందుకు ఆయన గొంతు ఎత్తులో ఆ తూమును అమర్చేరనీ, దానిగుండా అదనపు జలం దొర్లిపోయిందనీ అన్నారు. ఆ అంచనా బట్టి వీరబాహుదత్తుడు ఇంత ఎత్తు మనిషి అయి ఉంటాడని ఆయన లెక్క" శాస్త్రి ఆనాటి దృశ్యాలనూ, మాటలనూ, చర్చలనూ జ్ఞాపకం చేసుకుంటూ చాలా సేపు కూర్చున్నాడు. కొడుకు ఉద్దేశ్యం అర్థం అయింది. అవన్నీ నిజానికి ఊహలే, కాని సాక్ష్యాధారం మీద చేసిన ఊహలు. చరిత్రలో, ఆచారాలలో, సాహిత్యంలో, తవ్వకాలలో కనిపిస్తున్న అవశేషాల మీద నిర్మించిన ఊహలు. ప్రత్యక్ష సాక్ష్యం కన్న బలమైన ఆధారాలున్న ఊహలు. అయితేనేం ఒప్పుకోడానికి మనస్సు అంగీకరించడం లేదు. "సృష్టిలో ప్రతిదానికీ ఓ ప్రయోజనం ఉంది. కుల విభజన కూడా...." "అయితే?"--అన్నాడు కనుబొమలు కుంచించి రామకృష్ణ. "నువ్వు" "బ్రాహ్మణోస్యముఖమాశీత్"--అనే నిర్దేశాన్ని ఒప్పుకోనక్కర్లేదు. కుల విభజనకు దైవోద్దిష్టాన్ని అంగీకరించకు. కాని, చరిత్రలో దానికున్న ప్రత్యేకతను కాదనలేవుగా. మీరు--మార్క్సిస్టులు--చెప్పినట్లే ఒప్పుకుందాం. అది సంఘంలో వచ్చిన శ్రమ విభజన స్వరూపమేనని ముఖం, బాహువులు, పాదాలు మొదలైన సంకేతాల వల్లనే అర్థం అవుతూందంటావుగా. బాగుంది. ఒప్పుకుందాం. మన దేశంలో కులం వృత్తి విభజనకు ప్రాతిపదిక కావడం, వృత్తులు కులాలలో స్థిరపడడం వలన చాలా నిశితమైన వృత్తి నైపుణ్యం ఏర్పడిందంటావు. ఔనా?" "అది కూడా పూర్తిగా నిజం కాదు. కులం వర్ణం ఒకటి కాదు. వర్ణం ఆర్య తెగలది. అంతవరకది శ్రమ విభజన మూలకమే అనుకోవచ్చు. కాని కులం అలా కాదే. దీనితో తెగల జీవితపు అవలక్షణాలు, మంచి లక్షణాలూ, పని విభజనా, నమ్మిశ్రణమూ, తెగల ప్రత్యేకతా, సమ్మిశ్రణమూ అన్నీ గుదిపడ్డాయి. మన గోత్రాలూ, గోత్ర ఋషులూ వట్టి ఎరువు సొమ్ములు!" శాస్త్రి నవ్వేడు. "కంభంపాటి సత్యనారాయణగారి పుస్తకం వప్పచెప్పేవురా !" రామకృష్ణ తల అడ్డంగా తిప్పేడు. "అంతే కాదు నాన్నగారూ! ఒకనాడు ఉన్నతస్థాయికి చేరిన మన నైపుణ్యం మచ్చుకి కూడా మిగలకపోవడానికి, ఉత్తములూ, ఉన్నతులూ పేరుతో వట్టి పనికిమాలిన మోసగాళ్ళు తయారవడానికి కూడా ఈ కుల విభజనే మూలం అనొద్దూ మరి!" శాస్త్రి నవ్వేడు. "నాణానికి బొమ్మా, బొరుసూ రెండూ ఉంటాయి." 3 "అదే నేను చెప్పేదీను." "మంచిది. అయితే చెడుగు ఉంది గనక మంచిని కూడా తోసేసుకుంటామా? ఆ చెడుగును తొలిగించే విధం ఆలోచించాలి. ఎలుకలు చూరులో చేరేయి గనక ఇల్లు తగలబెట్టుకుంటామా?" "చూడండి, నాన్నగారూ, విషయం మనస్సుకి సూటిగా పట్టించడానికై సాహిత్యం అలంకారాన్ని తీసుకుంది. కాని, అది ఆ విషయాన్ని అన్ని కోణాల నుంచీ చూడడానికి సాయపడదు. వాల్మీకి రాముణ్ణి వర్ణిస్తూ "సముద్ర ఇవ గంభీరః" అన్నాడు. దీనికి నీటి మూటలాంటివాడని అర్థం చెప్పలేదు." "అంటే ఏమంటావు?" "ఏమీ లేదు. చరిత్ర గతితో సమాజం దేశ కాలపరిస్థితుల్ని బట్టి ఒక నిర్మాణ రూపాన్ని తీసుకుంటుంది. ఆ చట్రంలో అభివృద్ధి సాగినంత కాలం సాగుతుంది. అసాధ్యం అయినప్పుడు మార్పు తప్పదు. ఆ చట్రంలో ఇమడలేని స్థితి ఒకటి వస్తుంది. ఆ ఘట్టంలో మార్పు తెచ్చుకోకపోతే చైనా పడుచుల కాళ్ళకు కట్టిన కట్ల లాగా ఎముకల్ని విరిచేస్తాయి. విరూపం చేస్తాయి. విపరీతమైన బాధ కలిగిస్తాయి." "మళ్ళీ నువ్వో ఉపమానం తెస్తున్నావ్రా!...." "దాని ఉపయోగం పరిమితం." "పోనీ, ఆ చట్రాన్ని సడలించవచ్చు కదా!" "సడలించడం అనండి, మార్చడం అనండి, ఏదైనా సమాజం అవసరాన్ని బట్టే ఉంటుంది. మీ కోరిక ప్రకారం అడుగులు లెక్క వెయ్యడం సరిపడదు." చంద్రశేఖరశాస్త్రి ఏమీ అనలేదు. సడలించడానికి తాను వొప్పుకున్నాడు. ఏమిటి సడలించడం అంటే? శాఖలేవైనా బ్రాహ్మణులంతా ఒకటిగా పరిగణించాలా? కులాన్ని అంగీకరిస్తే శాఖల్ని ఎందుకు ఒప్పుకోకూడదు? లేకపోతే మతాన్ని బట్టి విభజన నంగీకరించాలా? ఏది మతం అంటే? దేవుణ్ణి గురించిన భావనకా ప్రాధాన్యం, లేక ఆచారాలకా? వీటి మధ్య గోత్రం స్థానం ఏమిటి?--అన్నీ ప్రశ్నలే. ఎన్నో, ప్రశ్నలు. శాస్త్రి తన ఆలోచనల నుంచి తేరుకోక పూర్వమే రామకృష్ణ మరల అందుకున్నాడు. అయితే ఈ మారతడు ఎత్తుకొన్న కోణం వేరు. "ఆ కుర్రవాడు ఉమ అంటే ప్రాణం పెడుతున్నాడు." "ఉమ ఏమంటుంది?" "ఆమెకీ ఇష్టమే." "ఇష్టం వేరూ, ప్రేమాభిమానాలు వేరూను." "పెద్ద కూతురు ఇప్పుడు పెళ్ళి వద్దు, చదువుకుంటానంటూంటే తోసేసి, జమీందారీ సంబంధం వచ్చిందని పెళ్ళి చేసేసిన తండ్రి ఈ వేళ రెండో కూతురు విషయంలో ఇష్టానికీ, ప్రేమాభిమానాలకీ అంతరం ఆలోచిస్తున్నాడు. "మీరే పరిశీలించండి. రెండు రోజులుంటారుగా." శాస్త్రి ఏమీ అనలేదు. రామకృష్ణే మళ్ళీ అందుకున్నాడు. "ఉమే కాదంటే ఈ సమస్య ఇంత వరకు రాకనేపోవును." "ఊఁ...." మళ్ళీ ఒక్క క్షణం ఇద్దరూ నిశ్వబ్దంగా ఉండిపోయారు. "మొదట ఆయన నా వద్దకు వచ్చాడు. ఉమకు ఆ ఆలోచనే లేదు." జరిగిన కథనంతా చెప్తే తండ్రి తన అభ్యంతరం ఎంత బలహీనమో ఊహిస్తాడని రామకృష్ణ చెప్పబోయాడు. కాని శాస్త్రి దృష్టి అటు లేదు. "దీని వలన అపకారం జరిగితే....?" నిజంగా నమ్మకం ఉండే ఆ మాట అంటున్నారా అన్నట్లు రామకృష్ణ సారి చూశాడు. అది గమనించి శాస్త్రి తత్తరపడ్డాడు. "అవునోయ్--దేనికి, దేనికి ఎంత సంబంధం ఉంటుందో చెప్పలేము. ఈ మధ్య ఒక సోవియట్ శాస్త్రవేత్త వ్రాసిన వ్యాసం చదివాను." తను కమ్యూనిస్టు గనక సోవియట్ శాస్త్రవేత్త వాక్యాన్ని తిరుగులేని సాక్ష్యంగా తీసుకుంటానని నమ్మకం కాబోలుననుకున్నాడు. వెంటనే తిప్పికొట్టేడు. "మన గోత్ర వివాహాలు మంచిది కాదని వ్రాసేడా?" "ఒరేయ్! వెటకారం మాను! ఆయన మీ అందరికీ అతి ప్రియమైన స్టాటిస్టిక్స్‌తోనే తన అభిప్రాయం చెప్పాడు." "ఏమంటాడు?" "సూర్యుడిలో ప్రజ్వలనాలు బలంగా ఉన్న రోజున భూమి మీద కారు ప్రమాదాలు హెచ్చుగా ఉన్నాయన్నాడాయన." తండ్రి ప్రయత్నం చూసి రామకృష్ణకి నవ్వు వచ్చింది. కానీ ఆయనను హేళన చేసినట్లుంటుందని పళ్ళతోనే బిగపట్టుకున్నాడు. "దానికి ఎంత బలమైన సాక్ష్యం ఉందో నేనెరగను. కారణాలు ఏమిటన్నాడో నాకు తెలియదు. నాన్నగారూ! చూడండి. మనం అజ్ఞాతంగా ఉండిపోయిన విషయాన్ని అడ్డం పెట్టుకుని, అర్థం లేదని తెలిసిన ఆచారాల విషయంలో మన చేతులు కట్టేసుక్కూర్చుందామనరాదు. శాస్త్ర పరిశోధన సాగిన కొద్దీ మిగిలిపోయిన వాని సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అదే మనలోని వైరుధ్యం. దీనికి అంతం అంటూ ఉండదు కనక, అసలు ఆలోచించే ప్రయత్నమే వద్దని కూర్చుంటామా?" శాస్త్రికి కోపం వచ్చింది. ఈ కొడుకు మొదటి నుంచీ తన తర్కవాద బలంతో తన్ను అడ్డుదారులు పట్టిస్తున్నాడనే బెదురు ఆయనకు ఉంది. ఆరేళ్ళ క్రితం, ఉమ చదువు విషయంలో కూడా అతడిల్లాగానే తన మాట చెల్లించుకున్నాడు. తన నోరు కట్టేశాడు. ఆనాటి ఘట్టం మనస్సులో మెదిలింది. ఉమ వైద్య శాస్త్రం చదువుతానంది. తాను మను ధర్మ శాస్త్రాన్ని అడ్డం పెట్టేడు. ఆనాడు రామకృష్ణ తనను విదిలించేసిన పద్దతిని శాస్త్రి తన జీవితంలోనే మరవలేడు. "ధర్మం! మన ధర్మానికి మనుష్యుడి యోగక్షేమాలతో ఏ మాత్రం పని లేదు. టాగూరు వ్రాసిన 'అచలాయతనం' మన ధర్మ శ్రద్ధకో పేరడీ. మన ముంగండ చెరువులోని చేపల ప్రాణ రక్షణకు మనవాళ్ళిచ్చే పట్టుదల మన ధార్మికతకు పెద్ద సాక్ష్యం" అంటూ ముఖం వికారంగా పెట్టాడు. అంతలో సర్దుకుని, తన అభిప్రాయాన్ని వివరించసాగాడు. "బాధతో ఉన్న మనిషికి ఉపశమనం కలిగించడమూ, ప్రాణదానం చెయ్యడమూ, వైద్య శాస్త్ర లక్ష్యం. కానీ మన దురదృష్టం. మను ధర్మశాస్త్రం దానిని అపాంక్తేయ వృత్తిగా పేరు పెట్టింది. ఎందుకన్నదో ఊహించగలం. ఉపశమనం కలిగించడంలో తోటి మానవుణ్ణి ముట్టుకోవాలి. వాని పుళ్ళు కడగాలి. పరిచర్య చెయ్యాలి. కుల భేదాలూ, స్పృశ్యతా స్పృశ్యతలూ పునాదిగా కట్టిన మన సమాజ భవనం అటువంటి ధర్మచ్యుతిని తట్టుకుని నిలబడగలదా? అందుచేత ఆ పని మనకు తగదు. అదీ మన ధర్మం." అంటూ వెలవరించుకున్నాడు. "ఈ మాట నా దగ్గరంటే అన్నారు. కానీ మరెక్కడా అనబోకండి. నవ్వి పోతారు" అంటూ హితబోధ చేశాడు. ఆ మాట విన్నాక శాస్త్రి మరి ధర్మ శాస్త్రాల ప్రసక్తి మానేశాడు. లౌకికవాదంతోనే కొడుకు వాదాలను ప్రత్యాఖ్యానం చెయ్యదలచేడు. "డాక్టరుకు కుటుంబ జీవితంతో సుఖం ఉండదు. ఒక్కక్షణం సంతోషంగా మగడితో కూర్చుని కబుర్లు చెప్పుకోడానికుండదు. అర్థరాత్రీ, అపరాత్రీ ఉండదు. ఏదో, ఎవరికో ప్రాణంమీదికొచ్చిందంటారు. ఏం చేస్తున్నా ఎక్కడి దక్కడ వదలి పరుగెత్తవలసిందే! పిల్లల్ని చూసుకోడానికుండదు. మగణ్ణి పలకరించడానికుండదు. ఛెస్.... కానైతే అది మంచి వృత్తే, డబ్బు బాగా వస్తుంది. పేరూ, ప్రతిష్ఠా ఉంటాయి. కాని సుఖం ఉండదు--వద్దు." ఈ మారు రామకృష్ణ నవ్వాడు. "ఏం ఎందుకు నవ్వుతావు?" "ఏం చెయ్యమంటారు? వనజని ఎట్లాగైనా బతికించండని ఆ రెండు రోజులు ఎంత మంది డాక్టర్లకు సంసారం సుఖం లేకుండా చేశామో గుర్తు తెచ్చుకోండి. పాపం వాళ్ళెవళ్ళూ అందుకు బాధపడలేదు. తమ సంసార సుఖం చెడగొడుతున్నామని విసుక్కోలేదు. వాళ్ళు, ఇప్పుడు మీలాగే వాళ్ళూ ఆలోచిస్తూండి ఉంటే...." వనజ రామకృష్ణ భార్య. మొదటి కాన్పులోనే ప్రసవించలేక చనిపోయింది. అది జరిగి అప్పటికింకా రెండేళ్ళు కూడా గడవలేదేమో. అందరి మనస్సుల్లో ఆ గాయం పచ్చి ఇంకా ఆరలేదు. శాస్త్రి కళ్ళు తుడుచుకుని వెనక్కి తగ్గాడు. గట్టిగా కాదనలేకపోయాడు. ఉమ వెళ్ళి మెడిసిన్‌లో చేరిపోయింది. ఇప్పుడేనా తాను గట్టిగా నిలబడకపోతే తన చేత ఆ ధార్మిక కృత్యాలకు తల ఒగ్గిస్తాడే కుమారరత్నం అనుకున్నాడు. కాని, ఏ మాటా అనే లోపునే మెట్ల మీద గొంతులు వినిపించేయి. "అరుగో వాళ్ళిద్దరూ వస్తున్నారు. మీరే మాట్లాడండి." అంటూ రామకృష్ణ లేచాడు. "ఇద్దరూ కలిసి వస్తున్నారంటే?" "వాళ్ళొక నిర్ణయానికి వచ్చేరని, అది మీతో చెప్పడానికి వస్తున్నారనీను." "చెప్పడానికా?" అన్నాడు శాస్త్రి ఆలోచనగా. "అనుమతి కోరడానికి కాదు. నిర్ణయం తెలియపరచడానికి వస్తున్నారన్నమాట!" తనలో తను అనుకుంటున్నట్లన్నాడు. "చెప్పడమో, అనుమతి తీసుకోవడమో ఆ మాటను సార్థకం చేసుకోవలసింది మీరు." "ఉహూఁ...." అన్నాడు శాస్త్రి. "నేను వెడుతున్నా" శాస్త్రి తల పంకించేడు....రామకృష్ణ గుమ్మంలోకి వచ్చేడు. ఎదుట ఉమ! 4 తండ్రితో చెప్పడానికి వ్యవధి చిక్కని విషయాలను రామకృష్ణ తల్లివద్ద కూర్చుని సావకాశంగా వివరించేడు. ఉమా, భాస్కరరావుల పరిచయ కథ విని సత్యవతమ్మ పకపకా నవ్వింది. * * * * * సాయంకాలం సముద్రం ఒడ్డున కూర్చుని ఉమ ఇసుకతో ఆడుకుంటోంది. హఠాత్తుగా పార్వతీశం పిలుపుతో ఉలికిపడింది. "విత్ యువర్ పర్మిషన్. మేమూ కూర్చుంటాము." అంటూ పార్వతీశం ఆమె ఎదుట చతికిలబడ్డాడు. "రా భాస్కరం" అంటూ తన పక్కనే మిత్రుడికి చోటు చూపించాడు. "వారి ఏకాంతానికి మనం భంగం కలిగుస్తున్నామేమో" అంటూ భాస్కరం సందేహించాడు. ఉమ చేతులనున్న ఇసుక దులుపుకుని సర్దుకుని కూర్చుంది. "సముద్రం ఒడ్డున, జనం మధ్య, ఇసకలో కూర్చున్న దానికి ఏకాంతం ఏమిటి? అట్టే టెక్కులు పోక, రా" అంటూ పార్వతీశం మిత్రుని చేయి పట్టుకున్నాడు. "ఇతడు నా స్నేహితుడు భాస్కరం. మొన్ననే...." అని పరిచయం ప్రారంభించాడు. "ఇంక ఆపులే....మీరు తనకు పినతల్లి అని చెప్పేడు. మెడిసిన్ చదువుకున్నారని చెప్పేడు. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది" అన్నాడు. ఉమ ఏదో గొణిగింది. "ఏదీ మీ పరిచర వానర సమూహం? ఒక్కరూ కనబడరు!" అని పార్వతీశం తన ఆసక్తిని వెలిబుచ్చేడు. "నీల సినిమా కెళ్ళింది" అంది చిరునవ్వుతో ఉమ. మళ్ళీ కొత్తమనిషి ముందు అతని రహస్యం బయటపెడుతున్నానేమోనని సంకోచించింది. "మాలతి షాపింగ్ అంది. మిగతా అంతా తలోపని మీదా పోయారు. ఏం తోచలేదు. వచ్చి కూర్చున్నా" కొత్తమనిషి ఉండడం వలన సంభాషణ సాగడంలేదు. మాటలు సాగించే భారం అంతా పార్వతీశం మీదనే పడింది. "తాతయ్య ఉత్తరం వ్రాసేరు" "చదువు అవకాశం దొరికినప్పుడు ఆయన వదులుకున్నారట. ఆ కథ అంతా పది పదిహేను పేజీల వుత్తరం...." "ఏమనుకున్నావో కూడా చెప్పు...." అని భాస్కరరావు ప్రోత్సహించేడు. ఇంటి వ్యవహారాలతోనూ, ఇంటి పరిస్థితులతోనూ బాగా పరిచయం వున్న మిత్రుడేనన్నమాట....అనుకుంది ఉమ. "మీరేమోయ్, చెప్తారు! శ్రీశ్రీ చెప్పినట్లు వడ్డించిన విస్తరి మీ జీవితం." ఉమ ఎరుగును కనక మాట మార్చడానికి ప్రయత్నించింది. "అక్క బాగుందా," "ఆఁ....ఓమారు రావాలనుకుంటుంది" ఉమ నవ్వింది. "నన్ను రావద్దన్నదన్నమాట!" పార్వతీశం ఊరుకున్నాడు. సంభాషణ మళ్ళీ తప్పుదారినపడింది. ఉమ మళ్ళీ మొదటికే వచ్చింది. "ప్రస్తుత ప్రపంచంలో ఓ మాదిరిగానన్నా బతికెయ్యాలంటే మనసు సున్నితత్వాన్ని కాస్తంత చంపుకోవాలిరా బాబూ!" "అదేనండి వీడితో వచ్చిన గోల! ఎంత చెప్పినా అంతేనండి" అంటూ భాస్కరరావు మాట కలిపేరు. "అబ్బ....వదలండోయ్! సరదాకి సముద్రం వొడ్డుకి వచ్చినా ఇదే గొడవా? పోయి త్వరగా ఆ ఉద్యోగంలో చేరుదూ. మనసు సున్నితత్వాన్నేమిటి? అసలు మనుష్యత్వాన్నే చంపుకోవచ్చు" సంభాషణతో మలుపు కోసం చూస్తున్న ఉమ చటుక్కున అందుకుంది. "మీరేం చేస్తున్నారు?" "ఏం చెయ్యడంలేదు. మొన్ననే సెలక్షన్స్ వచ్చేయి" అన్నాడు భాస్కరం. దేనికో ఆ సెలక్షన్ అనుకుంది ఉమ. ఆమె ప్రశ్న రూపొందక పూర్వమే పార్వతీశం ఆ లోటు భర్తీ చేశాడు. "ఐ.పి.ఎస్. కు సెలెక్ట్ అయ్యేడు" "బాగుంది. కంగ్రాచ్యులేషన్స్" ఉమ మాట పద్ధతికి భాస్కరం ఉలిక్కిపడ్డాడు. "మీకా శాఖ మీద సద్భావం లేనట్లుందే!" "ఉద్యోగం చేయడం జరిగితే నేనది ఎన్నుకోను సుమండి" అంది ఉమ. "నేనూ అదే అన్నాను. ఫస్ట్‌క్లాస్, రేంక్‌తో ఎం.ఎస్‌సి. అయ్యేవు. ఏ రీసెర్చికో పోరా అంటే...." "అదేం మాటలే! ఇందులో మాత్రం రీసెర్చికి అవకాశం లేకపోయిందటా! లాఠీచార్జీలతో, ఫైరింగ్స్‌తో, థర్డ్‌డిగ్రీ మెథడ్స్ ప్రయోగించడంతో బోలెడు సైంటిఫిక్ డెవలప్‌మెంటుకి ఛాన్సుంది" అంటూ ఉమ నవ్వింది. ఆ మాటలకి భాస్కరం ముఖం రంగు మారిందని గమనించి వెంటనే క్షమాపణ చెప్పుకుంది. "క్షమించండి హాస్యానికన్నాను." "ఫర్వాలేదు. మీ స్పందన ఈనాడు దేశంలో జరుగుతున్న దుర్మార్గాలకు ఫలితం." "మీ రెందులో ఎం.ఎస్‌సి. ?" "న్యూక్లియర్ ఫిజిక్స్" ఇక సంభాషణ సాగడం కష్టం కాలేదు. చదువులు, కాంపిటేషన్ ఫీజులు, సమ్మెలు, ఉద్యోగాలు, పరిశ్రమలు, దేశంలో అభివృద్ధి, బోలెడు సమస్యలు పడుచు వాళ్ళు నలుగురు చేరితే దొర్లి వచ్చే కబుర్లతో ముగ్గురికీ కాలమే తెలియలేదు. ఆఖరున సెలవు తీసుకునేవేళకి మొదటి సంకోచాలూ కవ్వింపులూ మరచిపోయేరు. ఆ విధంగా వారి పరిచయం ప్రారంభమయింది. 5 హఠాత్తుగా రాజమండ్రిలో ఉన్న చిన్నన్న రామకృష్ణ నుంచి ఉత్తరం వచ్చింది. "భాస్కరరావు అనే అతన్ని గురించి ఏమన్నా తెలుసా? ఆయనకు నువ్వు తెలుసట. అందుకు రాస్తున్నా, ఎటువంటివాడు? ఏం చదివేడు? ఏం చేస్తున్నాడు? వెంటనే వ్రాయి" అనేది ఆ ఉత్తరం సారాంశం. ఏం రాస్తుంది తాను? ప్రత్యేకంగా ఏమీ కనబడలేదు. కనుక తన పరిచయం అయిన నాటినుంచి ఆనాటి వరకూ జరిగిన సంఘటనలను వివరిస్తూ సుదీర్ఘమైన ఉత్తరం రాసింది. "భాస్కరంగారితో మొదటిమాటు సముద్రం ఒడ్డున కలిసిందే పరిచయం. తరువాత పార్వతీశంతోనూ, విడిగానూ పది పన్నెండుమార్లు కనిపించారు. ఓమారు అన్న కొడుక్కు అక్షరాభ్యాసం అనీ, నేనోమారు వారి ఇంటి వీధిలో కనిపించాను గనకా తమ ఇంటికి తీసుకెళ్ళేరు. అన్నగారికి, వదినగారికీ, తల్లిగారికీ పరిచయం చేశారు. మొదటిమారు అన్నగారితోనూ రెండవమారు తల్లిగారితోనూ చర్చలు ఘాటుగానే జరిగాయి. వాళ్ళ అన్నగారు నెహ్రూ దేశాన్ని ధ్వంసం చేశాడన్నాడు. ఆయన అభ్యంతరాలు సోషలిజం కావాలన్నాడనీ కాదు, ప్రణాళికల నభిమానించాడనీ కాదు. ముస్లిముల్ని దేశంలో ఉండనిచ్చినందుకు, పాకిస్తాన్ వాళ్ళు చేసినట్లు చేయనందుకు మత సామరస్యం పేరుతో దేశాన్ని ముస్లిములకూ, క్రైస్తవులకూ అప్పచెప్పేశాడని ఆయన అభిప్రాయం. ఆయన వాదం బహు చిత్రంగా కనిపించింది. కుటుంబ నియంత్రణను ముస్లిములు పాటించరు. క్రైస్తవులూను. మతరీత్యా వాళ్ళ కభ్యంతరాలు. మతాల జోలికి పోవద్దని మన నిర్ణయం. సంజయ్ గాంధీ సాగించిన 'పాండవ వంశ నాశ గాథ’లో కూడా నష్టపడినది హిందూ కుటుంబాలేనని ఆయన అభిప్రాయం. మన జనాభా క్షీణిస్తుంది. సాపేక్షంగా వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. చివరికి హిందూ దేశంలో హిందువులు అల్ప సంఖ్యాకులవుతారని ఆయన వాదం. ఆఖరున మీ మీద కూడా ఓ విసురు విసిరాడు. సోవియట్‌లో ముస్లిము రాష్ట్రాల జనాభా పెరిగిపోతుండడమూ, రష్యను జనాభా తరగిపోతూండడమూ చూసి రష్యను కమ్యూనిస్టు నాయకులు కల్లోలపడుతున్నారనీ, వారిని చూసైనా మన కమ్యూనిస్టులు బుద్దితెచ్చుకోవడం లేదన్నారు. తన వాదానికి బలంగా న్యూయార్క్ నుంచి వస్తున్న 'ప్రాబ్లమ్స్ ఆఫ్ కమ్యూనిజం' పత్రికలు చూపారు." ఉమ చాలాసేపు ఆ ధోరణిని భరించలేకపోయింది. "మా నాన్నగారు ఒక ముస్లిము కంపెనీలో ఆఫీస్ మేనేజర్. ఆ విధంగా మాకు వారి కుటుంబంతో చాలా దగ్గర. ఆయన, ఆయన కుటుంబం చాలా మంచి వాళ్ళు. ఆయన మనుమడు ఈ యూనివర్సిటీలోనే ఎం.ఏ. ఫిలాసఫీ చదువుతున్నాడు. చాలా యోగ్యుడు." అలాగే ఆమె తనకు తెలిసిన మతస్థుల గురించి వర్ణించింది. "వాళ్ళందరూ భారతీయులు కారంటారా?" అని నిలదీసింది. "మత ద్వేషాల సమస్య వచ్చేసరికి శైవం, వీర శైవం, జైనం, బౌద్ధం మొదలైన మతాల గురించి చెప్పాను. నోరి నరసింహశాస్త్రి గారు రాసిన నారాయణభట్టు నుదహరించి మత ద్వేషాలు, హత్యాకాండ సాగించడానికి విదేశీయ మతాలే కానక్కర్లేదన్నాను. "మరో రోజున అసదుల్లాని వారికి పరిచయం చేశాను. ఆ రోజున విశాలాంధ్ర పబ్లిషింగ్ సెంటర్ కెళ్తే అసదుల్లా కనిపించాడు. అప్పుడే మీ భాస్కరరావు, ఆయన అన్నగారు అక్కడికి వచ్చారు. వెనకటి చర్చలు గుర్తు వచ్చాయి. పరిచయం చేశాను. చాలా మర్యాదగానే వ్యవహరించారు ఇద్దరూ. "అసదుల్లా మాట మర్యాదా, వ్యవహరించిన తీరూ కన్న అతని ఆకారం నా కళ్ళకు నచ్చింది. మంచి పర్సనాలిటీ!" అన్నారు భాస్కరరావుగారు--మరో రోజున తానుగా ఆయన ప్రసక్తి తెచ్చి. అతనిదీ ఏడాది ఎం.ఏ. అయిపోతుంది కదూ! తరువాత అద్వైతం తీసుకుని డాక్టరేట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడని చెప్పాను. "భాస్కరరావు గారు విస్తుపోయారు. "ఛా!" అని ఇంత దీర్ఘం తీశారు. "ఆయన కుటుంబంతో నాకు కలిగిన ప్రథమ పరిచయం కథ ఇది. రెండో పరిచయం కూడా ఇలాగే నడిచింది. అయితే ఈమారు భాస్కరరావుగారి తల్లి గారిది పూర్వపక్షం. నా చేతినున్న ఉంగరంలో వేంకటేశ్వరుడి చిత్రం ఉండటం ఎంత అవసరమో, అంత చిన్న చిన్న విషయాలతోనైనా దైవభక్తిని చూపక యువతరం 'దేవుడూ నై--దయ్యమూ నై' గాళ్ళుగా ఎలా తయారవుతున్నారో ఏకబిగిన వాయించారు. "నాకు ఒళ్ళు రగిలింది. కాని బయట పడకుండా అమాయకంగా అడిగినట్లు అడిగాను--"బస్సు టిక్కెట్లు మడతబెట్టి దోపడానికీ ఉంగరం బాగా పనికొస్తుందండీ! వేంకటేశ్వరుడి బొమ్మ ఉన్నదైతే అసలు టిక్కెట్టే కొనక్కర్లేదంటారా?" అన్నాను. "ఇక చూడు, ఆమె రంకె లేసింది. ఓ! తెయ్యి మని పోయింది. ఆయాసం వచ్చి దగ్గుతూంటే మరొకటంటించాను. "నా ఆలోచన నేం కాదండీ! ఆర్. ఎస్. సుదర్శనంగారు 'కళ్యాణవేదిక ' అనే కథ రాశారు. అందులో గృహిణి వేంకటేశ్వరుడి నిలువెత్తు పటం వెనుక గూట్లో దొంగ డబ్బు దాచినట్లు రాశారు. అందులో దేవుడు ఈ దొంగసొత్తు కాపాడలేకపోయాడనే ఆయన రాశారు. అయితే చిన్న బస్సు టిక్కెట్టు డబ్బులే కదా! ఆ చిన్న సాయం ...." "ఆవిడ మినహా ఇంట్లోవాళ్ళంతా ఎంజాయ్ చేశారు మా సరస సల్లాపాన్ని" "అన్నట్లు--భాస్కరరావుగారికి ఐ.పి.ఎస్.కి సెలక్షన్ వచ్చిందని చెప్పానా! లేదు కదూ! వారం రోజులక్రితం ఆయన హఠాత్తుగా మా హాస్టలుకు వచ్చారు. తనకు ఫారిన్ సర్వీసెస్ ఆప్షన్ కూడా ఉన్నదనీ, దానికి ప్రిఫరెన్స్ ఇద్దామనుకుంటున్నానని చెప్పి, ఏమంటావన్నారు. దానికి కారణం ఉందిలే. మా మొదటి సముద్రపు ఒడ్డు పరిచయం రోజున పోలీసు ఆఫీసరైతే సైంటిఫిక్‌గా లాఠీఛార్జి చేయించవచ్చునని ఎగతాళి చేశాను. బహుశా కష్టపెట్టుకొని ఉంటారు. "ఆయనకు నేనేం చెప్పను? మన ప్రవృత్తుల్ని బట్టి మన వృత్తిని ఎన్నుకుంటాము. దాన్నే అభిరుచి అనేస్తాము. ఎవరి అభిరుచి వారిది. మర్యాదకు అడిగారు. మర్యాదగానే ఆ మాట చెప్పాను. ఆయనకది తృప్తి కలిగించినట్లు లేదు. "ఇది ఆయనను గురించి నేనెరిగినదీ, నేను చెప్పగలదీను. నువ్వెందుకడిగావో తెలియదు. నీకు కావలసిన సమాచారమేమిటో నేనెరుగను. కనుక నాకు తెలిసినదంతా రాశాను. పొల్లు ఊదేసుకుని నీకు పనికి వచ్చేదేమన్నా ఉంటే ఏరుకో!" ఉమ అన్నకు సమాధానం ఇచ్చాక, ఇప్పుడింక ఆలోచన ప్రారంభించింది. కాని, ఎంత ఆలోచించినా ఆమెకు అసలు విషయం తెలియలేదు. 'బహుశా ఏదో పెళ్ళి సంబంధం గురించి అయి ఉంటుంది' అనుకుంది. "అన్నయ్యకీ మధ్య పెళ్ళిళ్ళ పేరయ్య వేషం వేసే సరదా ఎక్కువయింది" అనుకుని నవ్వుకుంది. మరునాడు పార్వతీశం చెప్తేగాని ఆమెకు అసలు విషయం అర్థం కాలేదు. 6 పార్వతీశాన్ని చూడగానే ఉమ వేసిన మొదటి ప్రశ్న అతని రాజమండ్రి ప్రయాణం గురించి. అతడు ఎదురు ప్రశ్న వేశాడు. "ఎవరు చెప్పారు?" "చిన్నమామయ్య రాశాడు." "ఏమంటాడు?" "నీ ఫ్రెండ్ పెళ్ళి సంబంధం కోసం వచ్చావన్నాడు. ఎవరేమిటా అమ్మాయి?" అంటూ తన ఊహలను నిజంలాగా బుకాయించింది. "మామయ్యకి తెలిసిన అమ్మాయిలే! మేము మామయ్య నడుగుతే నీకెందుకు రాశాట్ట?" "క్రాస్ చెకింగ్" "మరి నువ్వేమన్నావు?" "ఏమంటాను, మీ స్నేహితుడి సంగతి నాకేం తెలుసునని రాస్తాను. నాలుగైదుమాట్లు సముద్రం ఒడ్డునా, బజార్లోనూ కలుసుకోవడం, హలో అంటే హలో అనుకోవడం తప్ప నాకాయన్ని గురించి ఏమీ తెలియదని రాశాను." "మహ దొడ్డపని చేశావు. అసలు నిన్ననవలసిన పనేమిటి? మా వాడి బుద్ధి అలా ఏడిసింది. వెళ్ళి వెళ్ళి మామయ్య మధ్యవర్తిత్వం అడగడం అందుకు చెప్పాలి." "బహుశా ఆ అమ్మాయీ వాళ్ళు మామయ్యకి బాగా తెలుసునేమో!" బాగా తెలిసిన అమ్మాయే నని పార్వతీశం ఒప్పుకున్నాడు. "ఆ అమ్మాయికి ఈయనగారు తెలుసునా?" "ఆహా!" "మరి మామయ్య మధ్యవర్తిత్వం ఎవరితో--తల్లిదండ్రులతోనా?" "కొంచెం ఇంచుమించుగా...." ఉమకి అర్థం కాలేదు. "నీ ధోరణి చూస్తే ఇదేదో అర్థాంగీకారంలా ఉందే. సరాసరి ఆ అమ్మాయితో మాట్లాడక ఈ ఇంచుమించు రాయబారాలేమిటి, నీ తలకాయ?" "మట్లాడాడే బాబూ!" "మరి?" "మనవాడి 'లవ్ సిగ్నల్స్' నామె 'రిసీవ్' చేసుకోవడం లేదే." ఉమ నవ్వింది. "పోనీ, మీ నీలకి పురమాయించకపోయావూ! ఎక్కడో ఉన్న మామయ్యనడిగితే ఏం చేస్తాడు?" "నీలకి ఆవిడ దగ్గర మహా భయం." "అంటే మీరంతా ఎరిగున్న ఆవిడే నన్నమాట!" "బాగా తెలిసినావిడ." "బాగుంటుందా?" "గ్రే మేటరు మరీ బొత్తిగా తక్కువ." ఉమ పకపక నవ్వింది. "నీ శల్య సారధ్యం బొత్తిగా పనిచేసినట్లు కనిపించదు." లేదని పార్వతీశం ఒప్పుకుంటూనే ప్రశ్నించాడు--"వాడికేం తక్కువే. ఆస్తుంది, చదువుంది, ఉద్యోగం ఉన్నట్లే. మహాతల్లివి నీ మూలంగా సందిగ్ధంలో పడ్డాడు గాని, ఆరోగ్యం వుంది, ఆకారం ఉంది. ఏమిటి లోటు చెప్పవేం?" ఉమ ఆలోచించింది. "ఆమె ఉద్దేశం ఏమిటో మరి?" "నువ్వు చెప్పు." "ఏ విషయం? "మళ్ళీ మొదటి కొచ్చిందయ్యా! మామయ్య అడిగిన ప్రశ్న అతన్ని గురించి ఏం చెప్తావు?" "మామయ్య చూశాడు. మీరిద్దరూ ఆయన దగ్గర రెండు రోజులున్నారు. అతని కంటె...." "మామయ్య ఎందు కడిగాడో ఊహించలేవా? అతను మగాడు. ఆడదాని దృష్టిలోంచి భాస్కరాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నదాయన గారి ప్రశ్న. ఆడవాళ్ళలో కూడా వాళ్ళ వివాహపు హోదానిబట్టి దృష్టి కోణాలు మారుతాయి. పెళ్ళయిన వాళ్ళయితే అగతగిలిన బ్రహ్మచారి గాళ్ళకి జంటని వెతకటమే ఆలోచన. పెళ్ళి స్థిరపడి ఇంకా పెళ్ళి కాని ఆడది తన వరుడితో తైపారు వేసి కొలవడం మొదలెడుతుంది. అది ఎటైనా దారి తీయవచ్చు. పెళ్ళి కాని వాళ్ళ చూపూ, అంచనా మరొక విధంగా ఉంటుంది. చీటికీ, మాటికీ డైలెక్టిక్స్ అంటుంటాడు కదా ఆయనగారు!" "అలా అయినా నే చెప్పేది నా అభిప్రాయం అవుతుంది గానీ...." పార్వతీశం విసుక్కున్నాడు."ఇప్పుడు కావలసింది నీ అభిప్రాయమే పెద్దమ్మా!" ఉమ ఆశ్చర్యంగా అడిగింది- "నా అభిప్రాయం కోసం విశాఖపట్టణం నుంచి రాజమండ్రికి అన్నయ్య దగ్గర కెళ్ళారా?" "అంతే మరి!" "అయితే గ్రే మాటరు లేనిది నాకు కాదురా, అబ్బాయి!" "చంపావు, ఫో! ఇప్పుడయినా చెప్పు!" "ఒరేయ్, పార్వతీశం! ఈ మెయిల్ రాయబారాలు, మొయిలు రాయబారాలు అంటే నాకసహ్యం. మీ స్నేహితుడు అన్నయ్య నుంచి సమాధానం కోరాడు. ఆయనే ఇస్తాడు. చెక్కెయ్. ఇలాంటి అనవసరపు పెద్దరికాలు నెత్తినేసుకోకు. అది అకాల వార్ధక్య లక్షణం. ఏమంటావు?" పార్వతీశం నిష్క్రమించాక నిజంగానే ఉమ ఆలోచనలో పడింది. తన అన్నగారితో, తల్లితో పెడసరంగా వ్యవహరించినా భాస్కరరావు తనకు దూరం ఎందుకు పోలేదో అర్థమయ్యాక ఇప్పుడు తమ పరిచయ ఘట్టాలు ఒక్కొక్కటే నెమరుకు రాసాగాయి. 7 చెల్లెలి ఉత్తరం చూసి రామకృష్ణ ఫక్కున నవ్వాడు. వెంటనే ఓ కాగితం తీసుకొని నాలుగు వాక్యాలు రాసి, వెంటనే పోస్టు చేశాడు. "సారీ! మీరొక కాండిడేట్‌గా ఉండవచ్చుననే ఆలోచన కూడా మా ఉమకున్నట్లు లేదు. ఆమె ఉత్తరాన్నిబట్టి నేను అర్థం చేసుకున్నదిది. మీకున్న పరిచయం కలిగించలేని ఆలోచనను నేను కలిగించాలనుకోవడం ఉపయోగకరం కాని, ఉచితం కాని అనుకోవడంలేదు. సెలవు!" పది రోజుల క్రితం పార్వతీశాన్ని వెంట తీసుకుని భాస్కరరావు రాజమండ్రి వచ్చాడు. ఇద్దరూ అతని బస కొచ్చారు. ఆ సమయంలో తన మిత్రుడు డాక్టరు వెంకటస్వామి, ఇరుగు పొరుగు ఉన్న ఇద్దరు, ముగ్గురు లెక్చరర్లూ తెలుగుదేశంలో కన్నెపిల్లల వివాహ సమస్యల మీద తీవ్ర చర్చ సాగిస్తున్నారు. కట్నాలు, ప్రేమలు, కులాలు, వయస్సులు, ఉద్యోగాలు--ఎన్నో సమస్యల మీద వాగ్వివాదాలు నడుస్తున్నాయి. వాళ్ళు వెళ్ళిపోయాక కూడా ఆ సమస్య ఎదో ఒకటి సెల వేసినట్టు అతడున్న రెండు రోజులూ ఉబికివస్తూనే ఉన్నాయి. చాలా సరదాగానే గడిచాయి ఆ రెండు రోజులూ. ఆ రోజున ఈ చర్చలు ప్రారంభం కావడానికి మూలం డాక్టరు వెంకటస్వామి తెచ్చిన ఉత్తరం. ఆయన కొడుకు మాస్కో యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. ఆయనగారు రాసిన తన అనుభవ గాథ ఆ చర్చను రెచ్చగొట్టింది. అతడు ఒక నవల కోసం యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళాడు. లైబ్రేరియన్‌కి ఏభైయ్యేళ్ళుంటాయి. బాగా చదువుకుంది. విషయ పరిజ్ఞానం ఉన్నది కూడా. "డాక్టర్ జివాగో" కావాలన్నాను. ఆమె ఆశ్చర్యంగా చూసింది, నవ్వింది. "మా వాళ్ళు ఇన్ని నవలలు రాస్తున్నారు. మా దేశంలో ప్రచురింపబడి ఉండని ఆ నవల మీదకే దృష్టి ఎందుకుపోయింది" అని అడిగారామె. అక్కడున్న ప్రేక్షకులలో ఒకరు వెంటనే వ్యాఖ్యానించారు. "అవును And quiet flows the Don ఉంది. గోర్కీ రచనలున్నాయి. క్లాసిక్స్ కావాలంటే టాల్‌స్టాయ్, గోగోవ్, పుష్కిన్, తుర్జనేవ్ ఎంతమంది లేరు? ఏదీ అడగక సోవియట్ ప్రభుత్వం నిరాకరించిన...." వెంటనే మరొకరు అందుకున్నారు--"నోబుల్ కమిటీ మెచ్చుకున్నదది." "అందుచేతనే అడిగాడంటావా?" అన్నాడు రామకృష్ణ. "మావాడే చెప్పాడు వినరాదా! ఏమిటాతొందర!" అంటూ గదిమి డాక్టరు స్వామి ఉత్తరం మళ్ళీ తీసుకున్నాడు. "బహుశా ప్రభుత్వాలూ, వాళ్ళ ద్వేషాభిమానాలూ మీద మా దేశంలో అనుమానాలు జీర్ణించిపోయాయి--అందుకనేమో" నన్నాను. ఆమె నవ్వింది. "మా ప్రభుత్వాన్ని మా దేశంలో తలెత్తుతూండే అవాంఛనీయ ధోరణుల్నీ విమర్శించే నవలలు బోలెడున్నాయి. వర్ధమాన దేశాల యువకులు వాటిని చదవడం వాళ్ళ దేశాల భవిష్య కల్పనకు ఉపయోగకరంగా వుంటుంది. మా వ్యవస్థను నిందించేది మీ దేశాల్లోనే చూసుకుందురుగాని.... ఏమంటారు?" అందామె. "మంచి తెలివైనది. బాగా చెప్పింది." అన్నాడు రామకృష్ణ. "యూరీ గెర్మన్ రాసిన ట్రయాలజీ 'ఎటర్నల్ బేటిల్' చదవమంటూ ఆమె సలహా ఇచ్చారు. కానీ అది ఆ క్షణంలో అందుబాటులో లేదు. రిజిస్టరు చూసి 'బ-462' గదిలో అమ్మాయి పట్టుకెళ్ళిందని చెప్పింది. వెళ్ళి పరిచయం చేసుకోండి--మంచి చురుకైన అమ్మాయి. చక్కని చిన్నది!" అంది. "ఆ వర్ణన విన్నాక సిగ్గేసింది వెళ్ళడానికి. అందంగా, చురుగ్గా ఉంటుందని తెలిసి పరుగెత్తాననుకొంటారని నా సంకోచం. మరో వారం పోయాక లైబ్రరీకి వెళ్ళినప్పుడు ఆమే కనిపించారు. జ్ఞాపకం వుంచుకుని మళ్ళీ అడిగారు. "వెళ్ళావా, నేను చెప్పింది నిజమేనా? బాగుంటుంది కదూ! మీరు స్నేహితులయ్యారా? బాగా మాట్లాడుతుంది, మంచి అమ్మాయి" అంది. నేను నవ్వాను. "ఎందుకు నవ్వుతా" వందామె. "మా దేశంలో పెళ్ళాం కాని స్నేహితురాలుంటే తప్పు పడతారు." ఆమె ఆశ్చర్యపడ్డారు. "స్నేహం చేయడానికీ, పెళ్ళికి ముడి పెడితే ఎలాగ?" అని ఆమె ప్రశ్న. "ఆమెకర్థం అయ్యేలా చెప్పలేకపోయాను" అంటూ ఆ ఉత్తరం ముగిసింది. "మన ఆర్ష సంప్రదాయాలు అర్థం కావడం కష్టం" అన్నాడు భాస్కరరావు. "ఇనప కచ్చడాలు కట్టుకున్న ముని ముచ్చులం కదా!" అని రామకృష్ణ హాస్యం చేశాడు. తరువాత అర్థమయింది--అతని రాకలో నవ్యతతోపాటు ఆర్ష సంప్రదాయ పాలనాభిమానం కూడా గట్టిగా ఉన్నదని. ఆ సాయంకాలం పార్వతీశం బజారులో పనులు చూసుకు వస్తానని వెళ్ళినప్పుడు, భాస్కరరావు తాము వచ్చిన పని చెప్పారు. "మీ ఉమను పెళ్ళి చేసుకోవాలని నా కోరిక." రామకృష్ణ ఆశ్చర్యపడ్డాడు. వాళ్ళిద్దరూ వచ్చిన క్షణం నుంచి అనేక సందర్భాలలో ఉమ ప్రసక్తి వచ్చింది. ఆమెతో భాస్కరరావుకు మంచి పరిచయం, స్నేహం ఉందని అర్థమయింది కాని.... "ఆమె ఏమంటుంది?" "ఆమెను అడిగే ముందు పెద్దవాళ్ళనడగటం న్యాయం అనుకున్నా." అటువంటి న్యాయ బుద్ధే పిల్లదానికి తెలియకుండా పెళ్ళిళ్ళు కుదిర్చే సంప్రదాయాన్ని తెచ్చింది--అనుకున్నాడు రామకృష్ణ. పైకి మాత్రం "మీ న్యాయబుద్ధి మెచ్చుకోతగిందే. కాని, ఇక్కడ పెళ్ళి చేసుకోవలసినది వయసు వచ్చిన విద్యావంతురాలు. మీకు స్నేహమూ, పరిచయమూ ఉన్నదే, ఆమెతో మాట్లాడి నిర్ణయానికి వచ్చి ఉంటే బాగుండేది." అన్నాడు. "మొదటనే ఆమెకు నా మీద దురభిప్రాయం ఏర్పడిందని నా భయం. అటు తరువాత మా కుటుంబ సభ్యులతో కలిగిన పరిచయాలు కూడా వ్యతిరేక భావాన్నే కలిగించి ఉంటాయని నా అనుమానం." "దురభిప్రాయం కలిగే ఘటన...." "ఏం లేదు. నేను పోలీసు డిపార్టుమెంట్‌కు ఎంపికయ్యాను. ఆమెకది అభ్యంతరం." "ఆమెకు అటువంటి అభ్యంతరం ఉంటే నేను చేయగలిగేదేముంది?" "ఫారిన్ సర్వీసెస్‌కి నాకు ఆప్షన్ వుంది." తన చెల్లెలికి అభ్యంతరాలు వుంటే అవేమిటో అర్థమయిందని రామకృష్ణ భావించాడు. "అవన్నీ అప్రధానాలు. ఏ ఉద్యోగం చేసుకోవాలి, ఏం చేయాలి అనేవి తర్వాత గాని ఆలోచనకి రావు. పడుచువాళ్ళిద్దరికీ ఒకరిమీద ఒకరికి ఆపేక్షలుంటే ఇటువంటివి సర్దుకుంటాయి. ఇప్పుడు మీరనడంలేదూ? అలాగే. అసలు సంగతి వేరు, మీ విషయంలో ఆమె అభిప్రాయం ఏమిటి?" భాస్కరరావు చెప్పలేకపోయాడు. "కనిపిస్తే బాగానే మాట్లాడుతుంది. ఈ మధ్య కనబడ్డంలేదే అంటుంది. యోగక్షేమాలు తెలుసుకుంటుంది. అందుచేత వ్యతిరేకత లేదనే నా అభిప్రాయం." "పెళ్ళికి చూసుకోవలసింది వ్యతిరేకత లేకపోవడాన్ని కాదు, అనుకూలత ఉందా, లేదా అని గాని...." "అది తెలుసుకోవడం నాకు చేతకాదు" భాస్కరరావు ఒప్పుకున్నాడు. "అందుకే మీ సహాయం కోరుతున్నా" నన్నాడు. "వ్యతిరేకత ఉంటే...." భాస్కరరావు అటువంటి పర్యవసానాన్ని ఊహించడం లేదని అతని ముఖంలోనే అర్థమయింది. "అంత గాఢంగా కోరుతున్నవాడు...." ఆడపిల్లను పెళ్ళికి ఒప్పించడానికి మగవాడి కోరిక చాలుతుందా అనిపించి కూడా రామకృష్ణ "సరే" నన్నాడు. వెంటనే చెల్లెలికి జాబు రాశాడు. ఆమె సమాధానమూ ఇచ్చింది. అందులో ఎక్కడా....భాస్కరరావును గురించి అడిగితే అతని అన్నను, తల్లిని, వదినను గురించి రాసింది. అతని యెడల ప్రత్యేక దృష్టిని తోపించే ఘటన ఒకటీ లేదు. పైగా, అసదుల్లా ఆకారం గురించి మెచ్చుకున్నాడన్న ప్రసక్తి బుద్ధిపూర్వకంగా రాసినదే అయితే అది భాస్కరం ఆలోచనా ధోరణి గురించిన వ్యతిరేక వ్యాఖ్యానంగా తీసుకోవలసి వుంటుంది కూడా. భాస్కరరావు విషయమై జాలే కలిగింది. మరుక్షణంలో ఆలోచన మారింది. తాను అసలు విషయం సరాసరి కదల్చక పోవడం చేత ఆమె కూడా అలాగే రాయలేదు కదా అనిపించింది. చదువుకొన్న అమ్మాయిలకు వరులు దొరకడం గగనమైపోతున్న రోజులు, దొరికినా భరించలేని కట్నాల గోడలు పెరిగిపోతున్నాయి. తమ సామాజికాచారాలు, అలవాట్లూ యువతీ యువకులు తమకుగా పరిచయాలు పెంచుకోడానికీ, పెళ్ళిళ్ళు కుదుర్చుకోడానికీ ఆటంకంగా వున్నాయి. ఫలితంగా పాతికేళ్ళు వచ్చిన విద్యావంతురాండ్రకి కూడా తల్లిదండ్రులే వరుల్ని వెతకవలసి వస్తూంది. ఆ విషయమే చెపుతూ తన మిత్రులు చెంచయ్యగారన్నారంటూ విన్నమాట గుర్తొచ్చి రామకృష్ణ నవ్వుకున్నాడు. "పెంచాను, చదువు చెప్పించాను. ఇప్పుడో కుర్రాణ్ణి నేను ప్రేమించి, దానికి పెళ్ళి చేయాలంటే ఏం చావను?" అన్నాడుటాయన. నిజమే. మన సంప్రదాయాలకు తోడు మన సాహిత్యకారులొకళ్ళు తోడయ్యారు. స్వతంత్రంగా వ్యవహరించబోతే ఆడపిల్లకు సమాజంలో రక్షణ లేదు సుమా అని ఒకటే బెదురు పోస్తున్నారు. కాలూ, చెయ్యీ కదలని ముసిలాడికీ, గోచీ పెట్టుకోలేని నాదాన్ బచ్చాగాడికీ కూడా సెక్సు తృష్ణే-- పాతికేళ్ళ పడుచుకూడా ప్రతిఘటించలేదన్నంతగా. ఈ పరిస్థితుల్లో తనంత తానుగా వచ్చిన ఈ యువకుడి అభిప్రాయాన్ని అంత నిర్లక్ష్యంగా చూడడం ఉచితం కాదేమో! కనీసం స్పష్టంగా తెలుసుకోవటం మంచిది కదా--అనిపించింది. వెంటనే బెజవాడ తండ్రికీ, విశాఖపట్నంలోని చెల్లెలికీ కూడా రాయడానికి కలం తీశాడు. ప్రారంభించిన ఉత్తరం నాలుగు వాక్యాలు కూడా రాయక మునుపే రాత ఆగిపోయింది. భాస్కరరావు వివరాలేమిటంటే తన వద్ద ఒక్క సమాచారం లేదు. తల్లిదండ్రుల పేర్లు తెలియవు. తండ్రి పోయాడని మాత్రం తెలుసు. వాళ్ళ ఇంటి పేరు 'సి' అన్నాడు. అంటే ఏదో చెప్పాడు. గుర్తులేదు. బ్రాహ్మణుల్లో వాళ్ళ శాఖ ఏమిటి? ఇంటి పేరు తెలిస్తే చాలా సందర్భాల్లో శాఖ ఏమిటో పట్టుకోవచ్చు. ఇంతకీ అతడు బ్రాహ్మణుడేనా? వాళ్ళ గోత్రం ఏమిటి? ప్రస్తుతం దానికి ప్రాముఖ్యం లేకపోయినా సగోత్ర వివాహాన్ని తన తండ్రి ఏ మాత్రం అంగీకరించడు. వాళ్ళ కుటుంబం ఎటువంటిది? అనువంశికంగా ఉండే మొండి జబ్బులూ, అవకరాలూ లేవు కదా. సంప్రదాయం ఎటువంటిది? తండ్రి తెలుసుకోగోరే సవా లక్ష ప్రశ్నలలో ఒక్కదానిక్కూడా తన వద్ద సమాధానం లేదే. ఏం రాస్తాడు? కలం కింద పెట్టేసి, వెంటనే కాలేజీకి సెలవు పంపించి, రైలుకి పరుగెత్తాడు. 8 రైలు దిగుతూనే రామకృష్ణ తన కార్యక్రమం ఎక్కడ ప్రారంభించాలా అని ఒక్క క్షణం ఆలోచించాడు. తరువాత ఏం చేసినా ముందు చెల్లెల్ని చూడాలి అనుకున్నాడు. అప్పటికి ఉమ ఆస్పత్రిలో ఉందేమో. కనుక పార్వతీశాన్ని కలుసుకుని పరిణామాలు తెలుసుకుని తయారుకావడం మంచిది అనుకున్నాడు. వెంటనే సామాను హోటల్లో పడేసి, అక్కగారింటికి బయలుదేరాడు. అక్కడికి వెళ్ళేసరికి అన్నింటినీ మింగేసే పెద్ద సమస్య ఎదురై కూర్చుంది. వెళ్ళేసరికి అక్క మగడు ఇంట్లోనే ఉన్నాడు. కానీ రెండు కుటుంబాల మధ్య గల పొరపొరల ఫలితంగా ఆయన ఒక్క గురగురతో మాత్రమే మరిదికి స్వాగతం ఇచ్చాడు. "అక్కయ్య ఇంట్లో ఉందా, బావగారూ! అంతా క్షేమమేనా?" "ఇంకా అంతవరకూ రాలేదు మీ దయవల్ల. రండి, కూర్చోండి!" అక్క మగని స్వభావం ఎరిగిన రామకృష్ణ పట్టించుకోదలచుకోలేదు. పేరు పేరు వరసన ఇంట్లో వారందరి యోగక్షేమాలూ ప్రశ్నించాడు. పిల్లల చదువులు తెలుసుకున్నాడు. తల్లి ఆరోగ్యం వాకబు చేశాడు, ఏక పద సమాధానాలైతే నేం విసుక్కోకుండా సంభాషణ సాగిస్తుంటే అక్క తాయారు వచ్చింది. చెల్లెలు చదువుకుంటూ స్వతంత్ర జీవనానికి ప్రాతిపదిక వేసుకుంటున్నందుకు బ్రహ్మానందం కనబరిచింది. "అయినా పెళ్ళంటూ తప్పదు కదా!" అన్నాడు రామకృష్ణ తన రాక విషయం చెప్పడానికి పునాదిగా. "పెళ్ళీ, పిల్లలూ--మే మంతా అనుభవిస్తున్నాం చాలు. అదైనా సుఖపడుతుంది--చదువుకోనీయండి!" అంది తాయారు--విసుగు తోపిస్తూ. ఎప్పుడొచ్చిందో ఎవరూ గమనించి ఉండని ఛాయమ్మ కోడలి వెక్కసపుదనాన్ని సహించలేకపోయింది. టప్పున అనేసింది--"ఏ తురకాడినో, దూదేకులాడినో పెళ్ళాడెయ్యనూ వచ్చు, ఒక్క చదువేం కర్మ?" "ఏమిటొ మీ వెర్రి గాని, అత్తయ్యగారూ! మన ఛాందస కుటుంబాలలో కన్న ఏ దూదేకుల వాడితో సంసారమైనా సుఖంగా ఉండదంటారా?" అన్నాడు, రామకృష్ణ నోరారా బంధుత్వం కలుపుతూ. ఆ కుటుంబ చరిత్ర ఎరిగిన తాయారు మరింత ఈసడింపుగా అనేసింది--"పెళ్ళి చేసుకోవడం అనుకున్నప్పుడు నచ్చడమే గాని, మిగతావి పట్టించుకోకపోయినా బాధ లేదు. పెళ్ళి చేసుకున్నవాడుండగానే స్వంత కులం వాడితోనే ఊరేగినా తప్పుగాని!" "ఏడిశావు! ఇంట్లోకి తగలడు!" అన్నాడు లక్ష్మణ శాస్త్రి. భార్య ఎత్తిపొడుపు అతని కళ్ళలో రక్తిమ తెచ్చింది. వెనకటల్లే తాయారు తడిసిన పిల్లిలా ఇంట్లోకి జారుకోకపోవడమే కాదు, సమాధానమివ్వడం కూడా చూశాక రామకృష్ణకు ఆశ్చర్యమే కలిగింది. "తప్పేం అన్నాను? జరుగుతున్న లోకవృత్తం చెప్పాను గాని...." "ఏమిటే ఆ లోకవృత్తం?" అంటూ ఛాయమ్మ గర్జించింది. లక్ష్మణ శాస్త్రి చెయ్యి బల్ల మీదున్న రూళ్ళ కర్ర మీదికి వెడుతోంది. తన కళ్ళ ముందు బావగారు తన అక్కమీద చెయ్యి చేసుకుంటే దాన్ని విరగొట్టేస్తానని తండ్రి ముందు చేసిన ప్రతిజ్ఞను గుర్తు చేసుకుంటున్నాడు. వాతావరణం బహు ఉద్రిక్త స్థితికి చేరింది. కాని టక్కున చల్లబడిపోయింది. రామకృష్ణకు అర్థం కాలేదు. తాయారు ఏమీ ఎరగనట్లే కూర్చుంది. ఎప్పుడు వచ్చాడో పార్వతీశం బహు తాపీగా మేనమామను పలకరిస్తున్నాడు. "ఎప్పుడొచ్చావు, మామయ్యా! పిన్నిని చూశావా? తీసుకురాకపోయావా?" "మనిద్దరం కలిసే వెడదామని ఇలాగే వచ్చానురా!" అన్నాడు రామకృష్ణ. "చాలా కాలమైంది చూసి, ఓ మారు నేనూ వస్తాను!" అంది తాయారు. "అలాగేనమ్మా!" అన్నాడు పార్వతీశం. ఛాయమ్మ ఊరుకోలేకపోయింది. "పోనీ నువ్వూచేరు. ఆ సరదా తీరుతుంది. అక్కా చెల్లెలూ...." తాయారు ఊరుకోలేదు. "డబ్బుకోసం మిమ్మల్నడగాలని గాని...." "మీ నాన్నగారివ్వరేమిటి?" అన్నాడు లక్ష్మణశాస్త్రి వెక్కిరింతగా. "మీకే అప్రతిష్ట అని చూస్తున్నాను గాని, అగ్రహారీకులుమని చెప్పుకుంటారు--ఆ మాత్రం ఇవ్వలేరా అన్నారంటే ఎవరికా చిన్నతనం?" అంది తాయారు. "నీకు చదవాలనుంటే నా వాటా ఉందమ్మా! డబ్బుదేముంది?" అన్నాడు పార్వతీశం నిర్లక్ష్యంగా. "నీకూ ఓ వాటా, నీదీ ఓ బతుకూ!" అన్నాడు లక్ష్మణ శాస్త్రి. రామకృష్ణకు ఆ మాటలన్నీ అర్థమవుతున్నాయి. కాని పరిస్థితులే అర్థం కావడంలేదు. ఆ కుటుంబంలో వచ్చిన పరిణామాలను మొన్న వచ్చినప్పుడు కూడా మేనల్లుడు చెప్పనే లేదు. నివ్వెరపోయి చూస్తున్నాడు. "బాగుందమ్మా వరస! బాగుంది!" అంటూ ఛాయమ్మ గొణుక్కుంది. పార్వతీశం చిరునవ్వుతో టేబులు దగ్గరగా కుర్చీలాక్కుని కూర్చున్నాడు. పక్కనే వున్న రూళ్ళ కర్రను దొర్లిస్తూ అతని చేతులు ఆడుకుంటున్నాయి. ఆ మరుక్షణంలోనే లక్ష్మణశాస్త్రి కుర్చీలోనుంచి లేచాడు. ముసలమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయింది. మగడు ఖాళీ చేసిన కుర్చీలో తాయారు సర్దుకుని ప్రశ్నిస్తోంది. "నాన్నగారు ఎలా వున్నారు? అమ్మ...." 9 ఆ కుటుంబ పరిణామాల కథ విన్నాక మేనల్లుణ్ని అభినందించకుండా వుండలేకపోయాడు రామకృష్ణ. కాని, పార్వతీశం ఒక్క నిట్టూర్పు విడిచాడు. "పెద్దపులి వేషం వేయడం సులభం కాదు, మామయ్యా!" రామకృష్ణ ఇందాకటి ఘటనను తలచుకొని నవ్వాడు. "మంచి పాగా వేశావన్నమాటే. మీ నాయనమ్మ...." "నటనగా ప్రారంభించినదే ఈవేళ అది నా స్వభావం అయిపోతోంది, మమయ్యా! దౌర్జన్యాన్ని ఎదురించడానికి మనిషి దుర్జనుడు కావలసి రావడం చాలా దురదృష్టకరం...." ఈ మారు రామకృష్ణ నవ్వలేకపోయాడు. తాయారు అనుక్షణం హడలిపోతూ అణిగి పడి ఉండనక్కర్లేకుండా తల ఎత్తుకు తిరగ గలగడానికి తోడ్పడాలంటే మేనల్లుడు మానవత్వాన్నే కోల్పోవలసి వస్తోందని బాధపడ్డాడు. కోపిష్టివాడనీ, తండ్రినీ, నాయనమ్మనూ కూడా చావగొడతాడని అప్రతిష్ట పాలవడం చిన్న విషయమేం కాదు. "అప్రతిష్ట సమస్య కాదు. మామయ్యా! నిజంగానే చావగొట్ట గలుగుతున్నాననేదే నా బాధ. ఆరు నెలల క్రితం ఒకరోజున అమ్మను పెట్టిన హింస చూడలేక కర్ర తీశాను. ముసలమ్మ వీపు తట్లు తేలింది. నాన్న రెండు రోజులు నిలబడలేక పోయాడు. ఎలా కొట్టగలిగానో నాకే తెలియదు. అమ్మే వెళ్ళి వాళ్ళకి చాకిరిచేసింది. సినిమాలూ, తెలుగు కథల్లోలాగా వాళ్ళ మనసులు మారిపోయి ఒక్క దెబ్బకి మంచి వాళ్ళయిపోయి ఉంటారనుకుంటున్నావా? నీకలాంటి భ్రమలేం వద్దు. నాకు వాళ్ళ మొహం చూడాలనిపించలేదు. చూడలేదు. ఆ హద్దులు తొలగిపోయిన తర్వాత ఎవరిమీదా, అమ్మమీద సరేసరి, కోపం చూపనక్కరలేదు. వాళ్ళ కంఠ ధ్వని గట్టిగా వినిపిస్తేచాలు చెయ్యి కర్రమీద కెడుతుంది." చాలా సాధువనీ, తల్లిపోలిక--వీడెలా బ్రతుకుతాడోననీ తలచిన మేనల్లుడేనా? రామకృష్ణ ఆశ్చర్యపోయాడు. "మళ్ళీ అతి చెయ్యకూడదు. అసలు కర్ర తీయడం కూడా మంచిది కాదు. ఊరికే కళ్ళతో...." "మీరంతా అలాగే అంటారని నాకు తెలుసు. కళ్ళతోనో, కాళ్ళతోనో బెదిరించి ఉండవలసింది మీరు. అంతా వదిలేశారు. ఇరవై--ఇరవై అయిదేళ్ళు. ఒక రోజూ, రెండురోజులూ కాదు." "నిజమే"నని రామకృష్ణ ఒప్పుకున్నాడు. "కాని దూరాన ఉన్న మేము చేయగలిగిందేం లేదు. అసలు మనిషిని గ్రహించడానికి కనీస ప్రయత్నం కూడా చేయకపోతే దగ్గరనే ఉన్నా చేయగలిగేదేమీ ఉండదు. మేక, గొర్రె, కోడి గలగల అరచి గోలైనా చేస్తాయి. చంపుతుంటే మీ అమ్మ తల విదిలించుకునేందుకు కూడా ప్రయత్నించదు. ఇక మిగిలింది, ఈవలికి తెచ్చేయడం. ఒప్పుకోదు. ఇక మేం చేయవలసిందేమిటి?" పార్వతీశం ఒప్పుకున్నాడు. "భారత మహిళ అంటే సక్కుబాయిలా ఉండాలని ఎవరు నేర్పారో కాని, అమ్మ మాటలు ఎప్పుడూ నువ్వు విననట్లుంది." "చెప్పగా విన్నాను." "ప్రపంచంలో ఆడాళ్ళంతా చెడిపోయిన వాళ్ళేనన్నట్లు మాట్లాడుతుంది. మామయ్యా! ఈ ఛాందస కుటుంబాల్లో ఎందుకు పుట్టామురా భగవంతుడా అనిపిస్తూంటుంది. మానవత్వం పోగొట్టుకోవడం తప్ప మరో దారి లేదూ?" ఇద్దరూ ఒక్క నిముషం ఊరుకున్నారు. పార్వతీశమే మళ్ళీ ప్రారంభించాడు. "ఇంతకీ ఇంట్లో ఉండి నేను మనిషిగా మిగలను. ఆస్తి పంచి నా వాటా నాకిచ్చేయమన్నాను." తన అక్కగారికి ఇప్పుడున్న రక్షణ కూడా మిగలదనీ, ఆమె బాధలు మరింత పెరుగుతాయనీ రామకృష్ణ భయం. కాని, పైకేమీ అనలేకపోయాడు. "పంచుకొని?" "బయటకు పోతాను." "మళ్ళీ వాళ్ళు...." "అమ్మను నాతో వచ్చేయమంటున్నా." "రాదు!" "ఆమె ప్రారబ్దం!" రామకృష్ణ ఆ మాటను హర్షించలేకపోయాడు. "అది మంచిది కాదేమో!" కోరగా చూస్తూ పార్వతీశం హేళన చేశాడు. "మీరంతా తమాషా మనుషులు, మామయ్యా! ప్రతి పనికీ ఏదో వంకర పేరు పెడితే గాని మీ రాజకీయాత్మకి తృప్తి ఉండదు అనవేం. నాది పలాయన వాదం అంటావు. అంతేనా?" తన మనస్సులోని పదాన్నే పార్వతీశం చెప్పడంతో రామకృష్ణ సిగ్గు పడ్డాడు. "అబ్బే" "పోనీలే...." "మీ నాన్న ఒప్పుకున్నాడా?" "నన్ను వదుల్చుకోవడం ఈవేళ ఆయనకి చాలా అవసరం." "పోయి ఏం చేద్దామని?" "ఏదో ఉద్యోగం, ఏదో పని...." "ఇప్పటినుంచీ?" "బతకాలి కదా?" "...." "అమ్మ వస్తానని సిద్ధపడితే?" "...." "ఆయన ఆస్తి పంచడానికి మెలిక వేస్తే?" "...." "ఆమె, నేనూ ఎవరి మీదా వచ్చి పడదలచుకోలేదు." రామకృష్ణ ఏ మాటా అనేలోపున పార్వతీశం తన ముందు ప్రయత్నాన్ని బయటపెట్టాడు. "ఇక్కడే వుండి అమానుషంగా తయారుకావడం నాకిష్టం కాదు. చదువు పోనీ, ఆస్తి ఇవ్వకపోనీ, అమ్మ రాకనేపోనీ--కనీసం మానవుడుగా మిగలడానికి ప్రయత్నిస్తాను. అది మాత్రం నిశ్చయం." "అంతేలే. ఒకరి కోసం మనం మనుషులం కావాలి గాని, ఎవరి కోసమూ పశువులం కాకూడదు." 10 పార్వతీశాన్ని వెంటబెట్టుకుని రామకృష్ణ హోటలుకి తిరిగి వచ్చేసరికి గుమ్మంలోనే భాస్కరరావు కనిపించాడు. వారిని చూడగానే అతని ముఖం వికసించింది. అనుకోకుండా రామకృష్ణ రావడం శుభసూచకమనిపించింది. ఉమ తన ప్రయత్నాలకు అనుకూలత కనబరచి ఉండాలనిపించింది. ముగ్గురూ గదిలో సుఖాసీనంగా కాఫీలకు ఆర్డరిచ్చారు. "నాకు ట్రైనింగ్‌కి పిలుపు వచ్చింది. ఆ సందర్భంగా మిత్రులు నలుగురికీ చిన్న టీ పార్టీ ఏర్పాటు చేస్తున్నాను. మీ చెల్లెలుగారు కూడా మాట యిచ్చారు. సరకులు ఆర్డరివ్వడానికే వచ్చాను. మరి మీరు కూడా...." రామకృష్ణ అభినందనలు తెలిపాడు. అతని కుటుంబంతో పరిచయం చేసుకోడానికి అంతటి అవకాశం కలుగుతున్నందుకు సంతోషం ప్రకటించాడు. భాస్కరరావు "థాంక్స్" తెలిపాడు. మరుక్షణంలో టీ పార్టీ హోటలులోనే అని విని రామకృష్ణ తన ఆలోచనను వ్యక్తం చేశాడు. "మీ అన్నగారున్నారా, ఊళ్ళో?" భాస్కరరావు ఉన్నారంటూ తల తిప్పాడు. "ఆనక టీ పార్టీలో వారిని పరిచయం చేసుకోగలుగుతా" నంటూ రామకృష్ణ అర్థ స్వగతంగా అన్నాడు. "ఆయన రారు." తాను అంత స్పష్టంగా చెప్పినా, అన్న టీ పార్టీకి రాడంటాడే గాని, ఇంటికి రమ్మనడేమని రామకృష్ణ ఆలోచనలో పడ్డాడు. భాస్కరరావు కొంచెంసేపు తటపటాయించాడు. చివరకేమి నిశ్చయించుకున్నాడో అనేశాడు - "మా అన్న పట్టణంలో పేరు పడ్డ రౌడీలలో ఒకడు. అతని పేరు చెబితే ఏ జట్కావాడన్నా అదే చెప్తాడు. అతను రాజకీయాల కన్నా ఆ రౌడీయిజానికే ప్రసిద్ది." రామకృష్ణ విస్తుపోయాడు. అంత నిశ్శంకంగా చెప్తున్నందుకు మెచ్చుకోలే కలిగింది. "దాని అర్థం...." ఒక్కక్షణం ఆగాడు. "మీ ప్రతిపాదన వాళ్ళకిష్టం లేదనే కదా!" భాస్కరరావు తల వూపాడు. "అయినా మీరు రాజమండ్రి వచ్చినప్పటి ఆలోచనలోనే ఉన్నారనుకోవాలా?" "ఆ కుటుంబ సంబంధాలు మీకు అయిష్టం గాకపోతే...." "అంటే?" "ఎలా చెప్పమంటారు?" రామకృష్ణ ఒక్క నిముషం ఆలోచించాడు. "ఉమను మీ ఇంటికి తీసుకెళ్ళారట ఏ ఉద్దేశంతో?" "నేను ప్రవేశించవలసిందిగా కోరే కుటుంబం ఎటువంటిదో నోటితో చెప్పడం ఇష్టం లేక." "వారి జీవిత పద్ధతులూ, ఆలోచనలూ మీకు నచ్చలేదూ?" "ఔను." "మిమ్మల్ని ఆ కుటుంబంలోని వాడినిగా గాక, కేవలం మిమ్మల్నిగానే చూడమంటారు." తన అభిప్రాయాన్ని ఎట్టకేలకు గ్రహించారు చాలునన్నట్లు భాస్కరరావు ఒక పెద్ద ఊర్పు తీసుకున్నాడు. "సరిగ్గా అంతే!" రాజమండ్రి నుంచి వచ్చాక ఉమతో మాట్లాడాడా? ఆమె అభిప్రాయం తెలుసుకున్నాడా? ఏమంది? ఎన్నో ప్రశ్నలు నాలుక చివర వరకు వచ్చాయి. కొద్ది గంటలలో ఆమె వస్తూనే ఉంది. ఆమెనే అడగవచ్చులే అని ఊరుకున్నాడు. మళ్ళీ ప్రశ్నించాడు. "ఉమను ఎందుకు చూపించాననుకున్నారు వాళ్ళు?" "గ్రహించారు." "మరి....?" "ఆమె వాళ్ళకు నచ్చదని నాకు తెలుసు" "అర్థ మవుతోంది" అనుకున్నాడు రామకృష్ణ "వాళ్ళు వేరే సంబంధాలు చూస్తున్నారన్న మాట!" "ఐ.పి.ఎస్.కి సెలక్ట్ అయ్యాను కదా! చాలా సంబంధాలు వచ్చాయి. వాటిల్లో ఒకదాని విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు." "ఆ ప్రశ్న అడగడంలో అర్థం లేదు గాని, మీకు నచ్చకపోవడానికి కారణం?" "ప్రత్యేకించి ఏం లేదు. అయిదారు నెలల క్రితం వరకూ ఆ ఆలోచన లేదు. ఇప్పుడు ఒక దృష్టి పడింది గనుక అటు ఆలోచన సాగడంలేదు." రామకృష్ణ తల పంకించాడు. ఒక్కొక్క చిన్న విషయాన్ని బయటకు తీయడానికి అన్నేసి ప్రశ్నలు వేయడం చికాకుగా ఉంది. తన కుటుంబ విషయాలను పైకి చెప్పుకోవడానికి భాస్కరరావు ఇబ్బంది పడుతున్నాడు. "నా నోటితో చెప్పడం నాకే మర్యాద కాదు. నా పరిస్థితులు పార్వతీశానికి తెలుసు. అతనినడగండి. అవి సంతృప్తి కలిగించకపోతే ...." రామకృష్ణ చిరునవ్వు నవ్వాడు. ఒక్క నిముషం ఇద్దరూ నిశ్వబ్దంగా కూర్చున్నారు. ఏం తోచిందో భాస్కరరావు అసలు విషయానికి వచ్చాడు. "మా వాళ్ళు చూపించిన కుటుంబంతో సంబంధం పెట్టుకోవడం నాకు సుతరామూ ఇష్టంలేదు." రామకృష్ణ ఏమీ అనలేదు. మళ్ళీ భాస్కరరావే ఎత్తుకున్నాడు. "నేను కోరినట్లే ఆ అమ్మాయిని కూడా ఆమెను గానే ఎందుకు చూడరాదని మీరు ప్రశ్నిస్తారేమో!" మంచి మాట అన్నావన్నట్లు రామకృష్ణ తల విసిరాడు. "ఆమె అభిప్రాయాలు నాకేమీ తెలియవు. తన పుట్టింటి సంపాదనకూ నా ఉద్యోగాన్ని బిగించి ఉండడమే ఆమె ఉద్దేశం కావచ్చు. నాకు తెలియదు. ఆమె తండ్రి జిల్లాలోనే పెద్ద భూస్వామి, చిన్న ఇండస్ట్రియలిస్టూ, మా అన్న స్నేహితుడు." "నీ ఉద్యోగానికంత ఉపయోగం ఉండొచ్చునని ఎప్పుడు గ్రహించావూ?" భాస్కరరావు సిగ్గు పడ్డాడు. " చాలామంది పడుచు వాళ్ళ మాదిరిగా నాకూ ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్.ల మీద వెర్రి మోజు ఉంది. అందుకే ఎం.ఎస్‌సి.లో రేంక్ తెచ్చుకున్నా డాక్టరేట్‌కు పోవాలనిపించలేదు." "మరి ఇప్పుడు?" "మీ చెల్లెల్ని కలుసుకున్న మొట్టమొదటి రోజునే ప్రజలు నా ఉద్యోగానికెటువంటి విలువ ఇస్తున్నారో అర్థం అయింది. అప్పటి నుంచీ ఆలోచిస్తున్నాను." రామకృష్ణ తృప్తిపడ్డట్లు చిరునవ్వు నవ్వాడు. 11 జరిగిన ఘటనలన్నీ ఒకదాని పక్కనొకటి సరిగ్గా సర్దుకొంటుంటే ఉమ ఆశ్చర్యం ప్రకటించింది. "నాకిదేమీ తట్టనే లేదు." అంది అన్నగారితో. "నీ కళ్ళు ఎక్కడున్నాయి? బుర్ర ఎక్కడుంది?" అన్నాడు రామకృష్ణ వెక్కిరింతగా. ఇద్దరూ ఒక్క నిముషం ఊరుకున్నారు. రామకృష్ణే కదిలించాడు. "ఏమంటావు?" "నేనతన్ని గురించి ఆ దృష్టితో ఎన్నడూ అలోచించలేదు." "కొంపతవ్వి సోదరుడిలా చూశానంటావేమిటి?" "ఛ!" ఆ కృత్రిమ బంధుత్వ ప్రకటన పుస్తకాలలో చదివినా, సినిమాలలో విన్నా అన్నాచెల్లెలిద్దరికి పరమసహ్యం. దాన్ని గురించి వారనేక పర్యాయాలు అపహాస్యం చేశారు. "ప్రపంచాన్నంతనీ కత్తెయ్యనా, బద్దెయ్యనా అన్న పద్ధతిలో విడదీస్తూంటే వినడానిక్కూడా అసహ్యం. కాని వాళ్ళంతా నా శత్రువులే అన్నాడట ఓ బుద్ధిమంతుడు. అలాగే ఉంటుంది--నా మగడు కాని వాళ్ళంతా సోదరులే అనడం" అంటూంటుంది ఉమ. ఆ వాక్యాన్నే కాస్త మెలివేస్తాడు రామకృష్ణ--"సోదరుడు కాని వాడల్లా మొగుడే అన్నట్లే" అని సవివరించాడు ఓమారు. ఆ ప్రసక్తి వచ్చినప్పుడల్లా ఆ వాక్యోప వాక్యాలు గుర్తు వచ్చి ఇద్దరూ విరగబడి నవ్వుతుంటారు. ఇప్పుడూ అదే జరిగింది. "అనడం లేదులే. బంధుత్వం చీటీ తగిలించవలసి ఉంటుందనుకోలేదు. అంతే!" అంది ఉమ. "తగిలించవలసి ఉంటుందనుకోలేదా, తగిలించాలనుకోలేదా? కొంచెం మాకర్థమయ్యే తెనుగు మాట్లాడు." కిందటి రోజున పార్వతీశాన్ని తానా విధంగానే డబాయించిన సంగతి గుర్తు వచ్చి ఉమ ఒక్కక్షణం తెల్లబోయి ఫక్కున నవ్వేసింది. ఆ కథ విన్నాక రామకృష్ణ ఆశ్చర్యపడ్డాడు. "వాడికి తెలియకపోవడమేమిటి? వాడు తన మిత్రుణ్ని పూర్తిగా బలపరుస్తున్నాడు. వాడు చెప్పిన హెచ్చరిక వింటే నువ్వు ...." "ఏమన్నాడేం?" "పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువ అన్నాడన్న సామెత మీబోటి వాళ్ళను చూసే పుట్టిందన్నాడు." "అబ్బా అంతవాడయ్యాడా?" "నీ మీద వాడికి ఇంత కోపంగా వుంది." "ఎందుకు?" "నువ్వు ఏమీ ఎరగనట్లు నటిస్తున్నావని వాడి అభిప్రాయం." "నటన ఎందుకంటాడు?" "ఆదర్శాల పేరుతో మీరంతా నిజంగా కనిపిస్తున్న సమస్యల్ని ఎదుర్కోలేక పారిపోతున్నరని పనిలోపని నా మీద కూడా ఓ విసురు విసిరాడు." "అంటే?" "జాగ్రత్తగా విను. ఈనాడు ప్రతి ఉద్యోగమూ పాడుగానే వుంది. కనుక ఏ పనీ చేయకుండా ఊరుకోవడమా ఆదర్శం అంటే? మనం న్యాయంగా బతకడమూ, అన్యాయం చేయకపోవడమూ సాధారణుడి కర్తవ్యం. తనకు నష్టం కలిగినా అన్యాయాన్ని ఎదుర్కోవడం ఆదర్శ లక్షణం. అంతేగాని పోలీసు ఆఫీసరుగా సెలెక్ట్ అవుతున్నాడు గనుక 'నమ్మరాదు' అనుకోవడం ఎప్పటికీ ఆదర్శం కాదు. నే చెప్పాను--విన్నాడు కాదు. అయితే పిన్నికి ఆ తెలివి లేదు." అన్నాడు. ఉమ ఫక్కున నవ్వింది. "నిన్నటి చిరాకుకు మూలం అదన్నమాట." కొంచెంసేపు నిశ్వబ్దంగా కూర్చుని రామకృష్ణే ప్రారంభించాడు. "వాడి మాటలోనూ సబబు లేకపోలేదు." "నేనా రోజున పెద్దగా ఆలోచించి అన్నమాట కాదది. సైన్సు స్టూడెంటుకి పోలీసు ఉద్యోగం ఏమిటన్నాను. ఆ డిపార్టుమెంటు అంటే అనుమానాలూ, అసహ్యమూ లేకపోలేదనుకో కాని, ఆ క్షణంలో ఆ ఆలోచనతో అన్న మాట కాదు." "అతని అభిప్రాయాన్ని ఆరు నెలలు మాట్లాడీ గ్రహించలేకపోయావు." "గ్రహించని మాట నిజమే. ఎందుచేత నంటే చెప్పలేను. బహుశా చదువుకున్న పడుచువాళ్ళకి, ముఖ్యంగా ఈ సర్వీసెస్‌లోకి పోయే వాళ్ళకి డబ్బు మీదనే గాని మరో దృష్టి ఉండదనే భావం అంతరాంతరాల్లో ఉండి ఉంటుంది. రెండవది నాకూ పెళ్ళి ఆలోచన లేకపోవడం కారణం అయి వుంటుంది." "ఇప్పుడూ...." "ఈ రెండు మూడు రోజుల నుంచీ ఆలోచిస్తున్నాననుకో." ఉమ ఒక్క నిముషం ఆలోచించింది. "నేనే ఆయనతో మాట్లాడుతా." "అలా చెయ్యి" రామకృష్ణ లేచాడు. "అతడికి నీ మీద మక్కువ ఉంది. నువ్వు ప్రతిస్పందన చూపగలుగుతే తప్పు లేదనుకుంటాను." "ఒక నిర్ణయానికి వచ్చేననుకోకు. నేను కాదనుకుంటే?" ఏం చేస్తామన్నట్లు రామకృష్ణ భుజాలు కదిలించాడు, "దురదృష్టవంతుడనుకుంటా." "నేను దురదృష్టవంతురాలిననవు." "ఉహూఁ. నువ్వు ఆశించినదేముంది పొందలేకపోయావనుకోవడానికి? అతడి విషయంలో అది కాదే...." 12 భాస్కరరావు అందించిన గులాబీ పూవును ధాంక్స్‌తో అందుకుని ఉమ చిరునవ్వుతో కుర్చీ చూపించింది. "కూర్చోండి." ఇద్దరూ కూర్చున్నారు. సంభాషణ దొర్లించడానికై భాస్కరరావు క్రితం రోజు టీ పార్టీకి వచ్చి, తన యెడల చూపిన సహృదయతకు అభినందన తెలిపాడు. "మీ అన్నగారు కూడా అనుకోకుండా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను." "అంతకు పూర్వమే రెండు రోజుల క్రితమే ఉత్తరం రాశాడు. అందువల్ల తాను వచ్చే ఆలోచన ఉన్నట్లే లేదు." "బయలుదేరబోయే ముందు నాకూ ఓ ఉత్తరం రాశారు. అది నా చేతికి అందక పూర్వమే ఆయన వచ్చేశారు." మాట జరగడం కోసమే మాట్లాడుతున్న సంభాషణ అనవసరమైన మలుపుకే తిరుగుతూంది. "బహుశా ఆ ఉత్తరం పోస్టు చేశాక, ఏదో అసంతృప్తి అనిపించి ఉంటుంది. వెంటనే బయలుదేరి ఉంటాడు." భాస్కరరావు తన జేబులోంచి ఉత్తరం తీసి ఆమె చేతికిచ్చాడు. చదివి అతని చేతికిచ్చేసింది. "అతని ఊహ నిజమే." "మీ మనస్సులో ఆసక్తి కలిగించలేకపోవడం నా దురదృష్టం." అన్నాడు భాస్కరరావు విచారంగా. "అది నా తెలివి తక్కువతనానికి నిదర్శనం కాకూడదా? ఇప్పుడు ఆలోచిస్తూంటే మీరు మీ ఆలోచనల్ని దాచిపెట్టుకున్నారనిపించడంలేదు." ఇద్దరూ తమ తమ లోపాల్ని గుర్తించడంతో గతం అక్కడికి మూతపడింది. భాస్కరరావు ఈమారు తన ప్రతిపాదనను స్పష్టం చేశాడు. "మీ మీద ఆశలు పెట్టుకుని ఉన్నాను. కాదనవద్దు." ఉమ ఆలోచించింది. "మీ కుటుంబానికెవరికీ ఇది ఇష్టం ఉండదని అన్నయ్య చెప్పాడు." "నేనే చెప్పాను ఆయనకు." "మా వాళ్ళు మీకేమీ ఇవ్వరు. ఇవ్వలేకపోవడం కాదు. ఇవ్వరు." "మిమ్మల్నయినా ఇస్తారా?" అంటూ భాస్కరం చిరునవ్వు నవ్వాడు. ఉమ బల్ల మీదనే ఉన్న రామకృష్ణ ఉత్తరాన్ని ముందుకు తోసింది. అది రామకృష్ణ భాస్కరానికి రాసిందే. దాని అర్థం భాస్కరానికి తెలిసింది. ఆమెను ఒకరు ఇచ్చే పరిస్థితి లేదనీ, అంతా ఆమె ఇష్టమేననీ దానిలో రామకృష్ణ సూచించాడు. భాస్కరం తల తిప్పాడు. "ఔను. ధాంక్స్!" "షరతు లేదో పెడుతున్నాననుకోకండి. ఇక్కడ మనం సాక్షిమాత్రులంగా ఉండి, బాధ్యతలన్నీ పెద్దవాళ్ళ మీదకు నెట్టివేసే పరిస్థితి లేదు కనుక ఏ నిర్ణయానికీ బాధ్యులం మనమే అవుతాం." "చెప్పండి." "ధనాన్నీ పెద్ద సంబంధాల్నీ కాదని వస్తున్నట్లు మా అన్నయ్య చెప్పాడు." "మీ చదువుకీ, ఆలోచనలకీ, సంస్కారానికి పోటీ పెట్టి చూసుకున్నాను. మీ ముందు అవన్నీ విలువ లేనివి అనే నిర్ణయానికి వచ్చానని చెప్పాను. ఆ మాట వారు చెప్పలేదా?" "మీకు కావలసినవి నాలో కల్పించుకుంటున్నారేమో చూసుకున్నారా?" భాస్కరరావు కళ్ళలో ప్రతిఫలిస్తున్న మెచ్చుకోలే దానికి సమాధానం. "అన్నింటి కన్నా ముఖ్యమైనది వేరే ఉంది. నేను దేవుడు, దయ్యం మీద పిసరంత కూడా నమ్మకం లేనిదాన్ని. నేను విలువ నిచ్చేది మనుషులలోని మంచితనానికి. కుల, మతాలకు నా దృష్టిలో చారిత్రక ప్రాధాన్యం తప్ప మరోటి లేదు." భాస్కరరావు తల ఊపాడు. "ఎరుగుదును. ప్రతి నెల ఒకమారు తిరుపతి దేవుడు దర్శనం చేసుకుంటామని మా అమ్మ అన్నప్పుడు మీరిచ్చిన సమాధానాన్ని బట్టి అర్థం చేసుకున్నాను." "ఏమన్నానో నాకిప్పుడు గుర్తు లేదు. వారిని నొప్పించలేదనుకుంటాను." "నాకు అన్ని పాపాలు చేసే అలవాటు లేదు సుమండీ!' అన్నారు. ఆ సమాధానాన్ని మా అమ్మా, అన్నా ఎన్నటికీ క్షమించరు." "తమ విషయం చెప్పుకుంటే నాకేమి అభ్యంతరం! శనివారం రాత్రి భోజనం మాని, ఫలహారంతో సరిపెట్టుకోవడం లేదని అవహేళన చేసినందుకు." భాస్కరరావు ఏమీ అనలేదు. ఒక్క క్షణం పోయాక ఉమ అంది - "నేను ఊరుకుంటే పోయేది." "నాకు దేవుడంటే విశ్వాసం ఉంది." "సంప్రదాయాల మీద పట్టుదలా ఉందనుకుంటున్నా." "ఎందుకనిపించింది?" "మా అన్న సిఫారసు కోసం వెళ్ళడం బట్టి అనుకున్నాను." భాస్కరరావు ఆలోచించాడు. "ఔను." "మన ప్రవృత్తులలో పెద్ద తేడా కనిపించడంలేదూ?" "ఉండడం మీకు అభ్యంతరమా?" "మీ విశ్వాసాలకి నా అభ్యంతరం ఎందుకు? అయితే మీతోపాటు నేనూ పూజా పునస్కారాలకు కూర్చోవలసి ఉంటే?" ఎంత మక్కువ ఉన్నా భాస్కరరావు ఆ విషయంలో చటుక్కున అక్కర్లేదనలేకపోయాడు. సంకల్పం చేసేటప్పుడే "ధర్మ పత్నీ సమేతస్య" అనుకోవాలి. పక్కన భార్య కూడా కూర్చుని ఆచమనం చేయాలి. ఇవన్నీ సంప్రదాయాలు మాత్రమేనా? ఒక సంస్కారానికి ఆ ప్రతీకలే మత ధర్మాలు. మన సంస్కారం పెరిగినా, ఆ ప్రతీకలు సంప్రదాయ రూపంలో మిగిలాయి. అందులో భార్య అభిప్రాయాలకు విలువ లేదు. పెళ్ళినాడే ఆమె వాటిని పక్కకు పెట్టాలి. "ఏకమవాజుపస్య" అని ఆ రోజునే నిర్దేశిస్తాడు. ఉమ తన స్వాతంత్ర్యం సంప్రదాయాలకు, మత విశ్వాసాలకూ కూడా విరుద్ధంగానే భావిస్తూంది. భాస్కరరావు ఆలోచనలో పడడం గమనించింది. "అటువంటి ఆలోచనలే కష్టం అనిపిస్తుంది. నేనెరుగుదును." "నేనెప్పుడూ ఈ సమస్య ఇలా ఉంటుందనుకోలేదు." "మీరూ ఆలోచించండి. ఇవన్నీ జీవిత సమస్యలు. దినదినం, అనుక్షణం మనల్ని వెంటాడే సమస్యలూను." భాస్కరరావు చటుక్కున తెలివి తెచ్చుకున్నట్లు నిలువునా కూర్చున్నాడు. జేబు రుమాలు తీసి ఒక్కమారు ముఖం తుడుచుకున్నాడు. "వీనిని పరిష్కరించుకోవడం సాధ్యంకాదా?" "ఎందుక్కాదు? అయితే ఈ సమస్యలు మన సంస్కారానికి సంబంధించినవి గాక జ్ఞాతజ్ఞాతానికీ, అంతరాత్మకీ సంబంధించినవి. వాటిని అధిగమించడం చాలా కష్టం. ఏమంటే అవి మన విశ్వాసాల రూపంలో...." తన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లుగా అనిపించి భాస్కరరావు తత్తర పడ్డాడు. "మీ విశ్వాసాలకు ఆటంకం కలిగిస్తాననుకోవద్దు." ఉమ నెమ్మదిగా అంది--"నేను మాత్రం సంస్కారానికీ, అంతరాత్మకీ మధ్య నున్న వైరుధ్యాలకి అతీతురాలినంటారా?" భాస్కరానికి ఏమి చెప్పడానికి తోచలేదు. తన కోరికను మర్యాదగా తోసి పుచ్చేందుకు ఇదంతా ఉపోద్ఘాతమేమో అనిపించింది. "దాంపత్య సంబంధాలు, వివాహ వాంఛా నిజానికి మనోద్వేగానికి సంబంధించిన ప్రవృత్తులు. కాని నేడవి పాదార్థిక బేరసారాలకు దారితీయడం దురదృష్టం ప్రత్యేకంగా....ఇప్పుడీ ఘట్టంలో. నా దురదృష్టం." ఉమ అతని ముఖంలోకి చూసింది. " అదృష్ట దురదృష్టాలు మీ ఒక్కరికేనా? నాకు మాత్రం కావా?" ఆ మాట అర్థం ఏమిటో తెలియక భాస్కరరావు తెల్లబోయాడు. అంతలో సర్దుకున్నాడు. చెయ్యి జాపాడు. "మీకభ్యంతరం లేకపోతే ఆ అదృష్ట దురదృష్టాలేమిటో మన మిద్దరం కలిసే తేల్చుకుందాం." ఉమ చటుక్కున తన చేతిని అతని కందించింది. "ధాంక్స్ ఉమా!" ఇద్దరి ముఖాలూ ఉద్ధీప్తమయ్యాయి. ఒక్క నిముషం ఇద్దరూ నిశ్వబ్దంగా కూర్చున్నారు. భాస్కరరావే మళ్ళీ తమ ముందు కర్తవ్యాన్ని సూచించాడు.. "మీ నాన్నగారి వద్దకు ఈ రోజే బయలుదేరుదాం ఏమంటావు?" "ఇంకొక్కటి మనం స్పష్టం చేసుకోవాలి." "పరీక్ష పూర్తవలేదన్నమాట" అన్నాడు నవ్వుతూ భాస్కరరావు. "హౌస్ సర్జన్సీ పూర్తి కావడంతో నేను బోర్డు కట్టబోవడంలేదు." "ఎం.డి. చేసే పట్టుదలతో ఉన్నావనీ పార్వతీశం చెప్పాడు." "ఔను" "నా అభిప్రాయం అదే. అయితే...." "ఊఁ...." "వెంటనే రిజిస్ట్రారాఫీసుకి వెడదాం." "నేనెప్పుడూ ఆలోచించలేదు, కాని, మా అమ్మా, నాన్నా దానికి ఒప్పుకోకపోవచ్చు." "నీ ఉద్దేశ్యం ఏమిటి?" "పెళ్ళి జరగవలసిన పద్ధతికి ప్రాముఖ్యం ఇవ్వాలా?" భాస్కరరావు నవ్వాడు. ఉమ తెల్లబోయింది "సంప్రదాయ పద్ధతికి ఒప్పుకుంటున్నాననా?" భాస్కరరావు తల ఊపాడు. "గౌరీ పూజ చేయాలే నువ్వు. దానికి ఎలా కూర్చుంటావు? అంతేనా? మీ నాన్నా, అమ్మా నిన్ను నాకు దానం చెయ్యాలి. దానం--భూదానం, వస్త్రదానం, ఆస్తిదానం లాగే కదా ఇదీను. ఇవన్నీ ఎలా ఒప్పుకుంటావు?" "నేనవన్నీ ఆలోచించలేదు." అంది నీరసంగా. హోటల్ గదిలో రామకృష్ణ ముందు ఆ సమస్యను పెట్టేసరికి అతడు నవ్వాడు. మనం రెండు పడవల మీదా చెరోకాలూ పెట్టి ప్రయాణం చేద్దామనుకుంటే లాభం లేదే తల్లీ! సంప్రదాయం అన్నది గత సమాజం నుంచి సంక్రమించిన వారసత్వం. సంస్కారం అన్నది కాలానుగుణంగా మనం పెంచుకున్న మానసిక ప్రవృత్తి. వీటిలో మనకు ఏది కావాలో ఎక్కడికక్కడ తేల్చుకోవలసిందే గాని...." "మరి అమ్మా నాన్నా...." "ఈయన గారి అమ్మా, అన్నా ఉన్నారు. వారి మాట?" దానికి ఉమ వద్ద సమాధానం లేదు. "నూతన పరిస్థితులలో వివాహ వ్యవహారాన్ని పెద్దవాళ్ళ చేతుల నుంచి చిన్నవాళ్ళు పూర్తిగా తీసేసుకోవలసిందే." ఉమ క్షీణ స్వరంతో "వాళ్ళకి చెప్పను కూడా వద్దా?" అంది. "నిర్ణయించుకునేముందు నువ్వు వాళ్ళకి చెప్పలేదు. మేమిలా నిర్ణయించుకున్నాం, మాకు పెళ్ళి చేసేయ్యండని ఆ భారం వారికి అప్పచెప్తానంటావు. అయితే ఆ చెప్పడంతో ఫలితాలు మీ మనోదారుఢ్యం మీద ఆధారపడి ఉంటాయి. అభ్యంతరాలనీ, కోపాల్నీ, బెదిరింపుల్నీ, తిట్లు, ఏడుపులు, మొత్తుకోళ్ళనీ నిగ్రహించి నిలబడగల శక్తి ఉందా? వెళ్ళండి. చెప్పండి. స్నేహితుల్ని పిలవడంలేదూ? అలాగే పిలవండి. ఇష్టం ఉండి వస్తే మంచిదే. రారూ, చేయగలిగేది లేదు--మీ నిర్ణయాన్ని వాళ్ళ అభ్యంతరాలకు గురి చేయడం తప్ప." ఉమ ఏదో నిర్ణయానికి వచ్చినట్లు భాస్కరరావు ముఖం చూసింది. "ఏమంటారు?" "మీ ఇష్టం." "మీ అమ్మగారి వద్దకు వెళ్ళి చెప్దాం" "వాళ్ళు తిడితే భరించగలవా?" భాస్కరరావు ఆశ్చర్యం కనబరిచాడు. "వెడదాం. చాటూమాటు భయం ఎందుకు?" భాస్కరరావు బావ ముఖం చూశాడు. వేంకటేశ్వరుడి పటం, శనివారం ఏక భుక్తం మీద పెరిగిన వాగ్వాదాన్ని స్వయంగా విన్నాడేమో అతనికి జంకుగానే ఉంది. "అదే మంచిది. ఒకరి నొకరు తెలుసుకోవడానికీ ఇది అవసరమే. తర్వాత మా ఇంటికి వెళ్ళండి." "మీరూ రావాలి మాతో" అన్నాడు భాస్కరం. 13 భాస్కరరావు తనతో వచ్చిన రామకృష్ణనూ, ఉమనూ పరిచయం చేస్తుంటే అన్న భోగేంద్రశాయికి వారి రాక ఉద్దేశం అర్థమయిందనిపించింది. లేచి లోపలికి ఆహ్వానించాడు. కుర్చీలు చూపాడు. భార్యను పిలిచి మంచినీళ్ళు తెప్పించాడు. తల్లిని పిలిచి వారిని పరిచయం చేశాడు. ఆమె 'బాగున్నావా?' అంటూ, "మళ్ళీ కనబడలేదేమమ్మా?" అని కుశల ప్రశ్నలు వేసింది. భాస్కరరావు భయాలకు వ్యతిరేకంగా వారు చూపుతున్న మర్యాదాభిమానాలకు రామకృష్ణ సంతోషపడ్డాడు. చటుక్కున ఆ మాటనుపయోగించుకున్నాడు. "అది ఎప్పుడూ కనబడుతూనే ఉండేడట్లు చూసుకోవడం మీ చేతుల్లోనే ఉంది." "అంత అదృష్టానికి పెట్టిపుట్టవద్దా, నాయనా! అంత మాటన్నావు చాలు!" అంటూ అన్నపూర్ణమ్మ ఒక్క నిట్టూర్పు విడిచింది. రామకృష్ణ వదలలేదు. "మీరు 'ఊఁ' అనండి. నేను అది కోరడానికే వచ్చాను. మా చెల్లెల్ని మీ రెండో కోడలుగా చేసుకోండి." మర్యాద మాటల దశ దాటి కచ్చితమైన ప్రతిపాదన వచ్చేసరికి వాతావరణం బిర్రబిగిసినట్లయింది. ఆ ప్రసక్తి తేగానే భాస్కరరావు కనుసంజ్ఞతో ఉమ అతని పక్క నిలబడింది. ఇద్దరూ నమస్కరించేందుకై అన్నపూర్ణమ్మ వైపు అడుగేశారు. "అదెలా సాధ్యం?" అన్నాడు భోగేంద్రశాయి. "నిన్ననే తాంబూలాలు పుచుకున్నాం వేరే సంబంధానికి. ఇదే నాలుగు రోజుల క్రితం అయితే" "రాజాము అగ్రహారీకుల సంబంధం ఎప్పటి నుంచో అనుకుంటున్నదే." భాస్కరరావు తెల్లబోయాడు. "నా పెళ్ళికి నాకు తెలియకుండా మీరు తాంబూలాలు పుచ్చుకోవడమేమిటి?" "ఇంకెవరు పుచ్చుకుంటారోయ్, మహా పెద్ద కబుర్లు చెబుతున్నావు. రా, ఇవతలికి!" అన్నపూర్ణమ్మ విసురుగా వచ్చి అతన్ని ఉమ పక్క నుంచి లాగేయడానికి చేయి పట్టుకుంది. భాస్కరరావు ఆమెను దులపరించుకుని తోసేశాడు. తాను ఉమకు అడ్డుగా నిలబడ్డాడు. "ఆ!" అంది అన్నపూర్ణమ్మ. భోగేంద్రశాయి ముఖంలో ఒక్క నిముషం కోప రేఖలు కనిపించాయి. కాని అంతలో సర్దుకున్నాడు. "అమ్మా! నువ్వూరుకో, ఉండు!" అన్నపూర్ణమ్మకు అంతమంది ముందు తన కొడుకు తనను విసిరికొట్టేయడం మహావమానం అనిపించింది. "నువ్వాట్టే కాలం బతికి బట్టకట్టే లక్షణం కాదురోయ్, చిన్నాడా!" "పోనిద్దూ! వెధవ బతుకు బతికేం? ఏ తల్లి కన్నబిడ్డవురా అని ఎవరన్నా అడుగుతే ఏం చెప్పుకోవాలి?" "భాస్కరం!" సానునయంగా పలకరించబోయాడు శాయి. "ఏమిటి?" "పెద్ద మనుషులతో మాట తప్పడం ఎంత అప్రతిష్ఠ!" "ఇదిగో, అన్నయ్యా! ఇది నీ ప్రతిష్ఠకి సంబంధించిన సమస్య అనుకుంటున్నావు. ఇది నా బ్రతుకుకే సంబంధించిన దనుకుంటున్నాను." "ప్రతిష్ఠపోయిం తర్వాత బ్రతుక్కు విలువేమిట్రా?" భాస్కరం ఉచ్చిపోయేలా చూశాడు. "నా బతుకు నాది కనకనా? నీ ప్రతిష్ఠ కోసం నా బ్రతుకు చెడాలి. భేష్!" బ్రతుకు, ప్రతిష్ఠ సంబంధంతో ఉన్న అసందర్భాన్ని అర్థం చేసుకున్న భోగేంద్రశాయి తగ్గలేదు. "మన భారతీయులకు కుటుంబ జీవితం మన వ్యక్తి జీవితంతో ముడిపడే ఉంది. అవి రెండూ భిన్నం కాదు." "ఊఁ!" ఒక్క నిముషం ఇద్దరూ నిశ్వబ్దంగా ఊరుకున్నారు. తమకు తెలియకుండానే కుటుంబ సంబంధాలతో వచ్చిన విపర్యాయాలలోతును ఆలోచిస్తున్నట్లు తోచి రామకృష్ణ చిరునవ్వుతో చూస్తున్నాడు. "ఇది నా స్వంత విషయం. పెద్దవాళ్ళు కదా అని చెప్పవచ్చాను. నిజానికి చెప్పవలసిన పనిలేదు. ఇంక...." ఇంక ఈ విషయంలో సర్దుబాటు చేయబోవడం మంచి దనిపించి రామకృష్ణ అందుకున్నాడు. "మీ రిద్దరూ కూడా చిన్న విషయం మీద తొందరపడుతున్నారు." "ఏమిటండి? ఇది చిన్న విషయమా?" అన్నాడు భోగేంద్రశాయి చిరాగ్గా. "చెప్పొచ్చాడు!" అని విసురుకుంది అన్నపూర్ణమ్మ. "మీరూ అలా అంటా రేమిటి?" భాస్కరరావు అసంతృప్తి చూపాడు. "కాక, ఎవరి విషయం వాళ్ళకి గొప్ప అనిపిస్తుంది. మీరు అన్న మాట వినకుండా మీ ఇష్టానుసారం పెళ్ళి చేసుకుంటే ఆ కష్టమో, సుఖమో మీది. వారికేం పోతుంది?" "కట్నం. ఏభైవేల కట్నం." రామకృష్ణ నవ్వాడు. "మీరు పెళ్ళి చేసుకుంటే కట్నం మీ అన్నయ్య కిస్తారా?" తన చెల్లెల్ని చెప్పవచ్చిన పెద్దమనిషి ధోరణి అర్థం కాక భోగేంద్రశాయి తేరిపార చూశాడు. బహుశా అతనికీ ఈ సంబంధం ఇష్టం లేదేమో చెల్లెలి పట్టు మీద వచ్చాడేమో! ఇప్పుడీ అవకాశం చూసుకుని ఎదురు తిరుగుతూండవచ్చు ననిపించింది. "అలా చెప్పండి." "ఏభైవేలు నష్టపోయేది ఆయన." "కాక, కట్నం డబ్బు నా ఒళ్ళో పడుతుందా?" "ఔను మరి! అంత డబ్బు పోతున్నదని విచారం ఆయనకే లేనప్పుడు మీదేం పోయింది? ఇప్పుడు చెప్పండి. ఇది చిన్న విషయం కాదంటారా?" అందరూ విస్తుపోయినట్లు కళ్ళప్పగించి నిలబడిపోయారు. "కొంచెం మనసులు శాంతించాక మాట్లాడుకోవచ్చు. నడవండి, ఉమా!" భోగేంద్రశాయి, అన్నపూర్ణమ్మ నోట మాట లేకుండా నిలబడిపోయారు. వధూవరుల్ని చెరోచేతా పట్టుకుని రామకృష్ణ గుమ్మం వైపు నడిపించాడు. "పెళ్ళి కాకుండానే వేరింటి కాపురం పెట్టించేయండి" అన్నాడు భోగేంద్రశాయి. వెక్కిరింతగా. "ఔనండీ! ఆ విషయం తోచనేలేదు." అంటూ రామకృష్ణ తిరిగి చూశాడు. "అయినా ఆ విషయం ఆలోచించుకోవలసింది వాళ్ళు. "నఖలు తద్వాచ్యం వధూ బంధుభిః" 14 ముగ్గురూ హోటలుకు వచ్చారు. గుమ్మంలో అడుగు పెడుతూనే రామకృష్ణ అనంతర కర్తవ్యం నిర్దేశించాడు. "ముందు భోజనం తరువాత సావకాశంగా ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. ముఖాలు కడుక్కుని రండి! ఈ లోపున కౌంటరు వద్ద చెప్పి వస్తా!" తన బంధువుల వ్యవహారానికి చిన్నపుచ్చుకొని నిస్తబ్దంగా ఉండిపోయిన భాస్కరాన్ని ఉమే కదిలించింది. "ఈ చిన్నదానికేనా ఇంత బాధపడడం? వెళ్ళి ముఖం కడుక్కుని రండి!" "ఇది చిన్న విషయమా?" "జీవితంలో అతి చిన్న సమస్య కూడా ఆ క్షణంలో భయంకరంగానే కనిపించవచ్చు. కాని తరువాత వచ్చేవి నిజంగానే భయంకరం కావచ్చు." "మనసులో ఏం ఉన్నా అంత అనాగరికంగా వ్యవహరిస్తుందనుకోలేదు." అన్నగారి మాటలు, చేతల కన్నా తల్లి ప్రవర్తన అతనికి చాలా బాధ కలిగించిందని ఉమకు అర్థమయింది. "డబ్బు పోవడం కన్నా పెద్దరికం పోతుందనేది ఎక్కువ బాధ పెడుతుందంటాడు మా అన్నయ్య." అంది. అంతలో రామకృష్ణ వచ్చాడు. "భోజనం గదిలోకే తెస్తాడు. మీ రింకా ఇలాగే ఉన్నారేం? లేవండి." ముగ్గురూ భోజనాలు ముగించారు. సర్వరు తెచ్చిన కిల్లీలు నములుతూ కూర్చున్నారు. క్లీనరు వచ్చి బల్లలు శుభ్రం చేసి వెళ్ళాడు. రామకృష్ణ సిగరెట్టు ముట్టించి, పెట్టె భాస్కరరావు ముందుకు నెట్టాడు. "ఇప్పుడు చెప్పవయ్యా!" "మిమ్మల్ని ఇరుకున పెట్టాను క్షమించండి." రామకృష్ణ చెయ్యి ఆడించాడు. "వదిలేయ్! అది కాదిప్పుడు ఆలోచించవలసింది. ముందేం చేద్దామనుకుంటున్నారు?" "చెప్పవలసింది మీరు. ముఖ్యంగా ఉమ. మా వాళ్ళనీ, వాళ్ళ సంస్కారాన్ని--ఇన్ ఆల్ ఇట్స్ న్యూడిటీ చూశారా మరి!" అంటూ భాస్కరరావు ఉమ వంక క్షమించమన్నట్లు జాలిగా చూశాడు. దానికీ రామకృష్ణే సమాధానం ఇచ్చాడు. "ఇంతవరకు సగమే కనబడింది. ఇంక ఆవిడ తాలూకు వాళ్ళం మేమెలా వ్యవహరిస్తామో! మీకు ధైర్యముంటే ఆ వైభోగమూ చూద్దురుగాని. ముందు తేల్చుకోవలసింది వేరు. మీ వివాహానికి మీ వాళ్ళు ఒప్పుకోరు. సాహసించి చేసుకుంటే అనుక్షణం మీ బతుకుల మీద దండయాత్ర సాగిస్తూనూ ఉండవచ్చు. ఊరుకోనూ వచ్చు అందుచేత...." భాస్కరరావు ఆదుర్దాగా ప్రశ్నించాడు. "అలా అంటారేం? నా దేముంది తేల్చుకునేందుకు? ఉమ చెప్పాలి." "ఆమె కూడా చెప్పవలసే వస్తుంది. కానీ నీది కీలకం. మా వాళ్ళు కూడా ఇదే ధోరణి నవలంబిస్తే పెద్ద మునిగిపోయేది లేదు. కానీ మీ వాళ్ళ వ్యతిరేకత...." "అదీ పరవాలేదు. వాళ్ళతో కలిసి వాళ్ళ దగ్గరుండవలసి వస్తే మీరు చెప్పే ఇబ్బంది గాని...." "అంటే నువ్వు...." "మా అన్నయ్య సలహానే పాటించవలసి వస్తుంది." "తప్పు లేదు. థర్టీస్‌లో కమ్యూనిస్టులం రాజకీయపు వెసులుబాటు కోసం ఉమ్మడి కుటుంబాల్ని బద్దలు కొట్టేశాం. ఈ వేళ సామాజిక పురోగతి కోసం ఇంకా మిగిలి ఉన్న పేగు బంధాన్ని కోసెయ్యాలి. తప్పదు. మనం బయట పడాలంటే తప్పడం లేదు. ఏం చేస్తాం?" భాస్కరం ఉమ దిశగా చూశాడు. "నన్నేం చెప్పమంటారు?" అంది నిస్సహాయంగా. "నీ మనసులోని మాటేదో చెప్పు" అని రామకృష్ణ అందించాడు. "దీనికి ఇదమిత్ధ మనే సూత్రం ఉందేమిటి? ఎప్పటికప్పుడు ఆ క్షణానికున్న పరిస్థితుల్ని బట్టి ఆలోచించి సర్దుకోవలసిందె తప్ప...." భాస్కరరావు ఔనన్నట్లు తల ఊపాడు. రామకృష్ణ ఏమీ అనలేదు. "మీరుద్యోగానికి వెళ్ళిపోతున్నారు." "ట్రైనింగ్‌కి." అని సర్దాడు భాస్కరరావు. "అదే. మీరింక ఆ ఇంటిలో మకాం వేసేది ఉండదుకదా!" "నిజమే. మకాం వేసేది లేకపోయినా, ఆ ఇంటిలో ఉండే హక్కు అతనికుంటుంది. దానినతడు తన ఇల్లుగానే భావించగలడు." "కావచ్చు." ఉమ ఒప్పుకొంది. "అలాగే ఆయన తల్లికికూడా ఆయన ఎక్కడున్నా ఆ ఇంటికి రావడానికి, ఉండడానికీ హక్కు ఉంటుంది కదా!" అని రామకృష్ణ. "నిజంగా హక్కు ఉందా, లేక...." దానికేమి పేరు పెట్టాలో తెలియక ఉమ ఆగింది. "కానీ...." అని హెచ్చరించాడు రామకృష్ణ. భాస్కరరావు ఆసక్తితో వింటున్నాడు. "ఆ ఇంటిలో ఈయనకున్నది చట్టబద్ధమైన హక్కు. ఈయన ఇంటిలో ఆమెకుండేది నైతికమయిన హక్కు." "అంతేనంటావా?" అన్నాడు రామకృష్ణ. "నా ఉద్దేశంలో కుటుంబం గురించిన మన ఆలోచనా ధోరణి మారాల్సి ఉందంటాను. కేవలం భోజనం సరిగ్గా కుదరక పెళ్ళి చేసుకోవడం అనవసరం. హోటళ్ళున్నాయి. వంట వాళ్ళున్నారు. కుక్కర్లున్నారు. బెర్నార్డ్ షా ఎక్కడో అన్నట్లు వివాహం అనేది చౌకలో పిల్లల్ని బాగా పెంచేందుకు సమాజం కల్పించిన ఏర్పాటనే మాటను నేనంగీకరించలేను. వీటన్నిటినీ మించిన అవసరం దానికుంది. అది కేవలం శారీరకమైనదే కాదు. మానసికం కూడా. అదే పడుచు వాళ్ళని సన్నిహితం చేస్తుంది. ఆ అవసరం అనుభూతం కానివాళ్ళకు పెళ్ళితో పనిలేదు. ఓ పనివాడు చాలు. అమ్మ ఆసరా చాలు. ఓ హోటలు గదో, సత్రం చావిడో ఎక్కీతొక్కీను" ఆమె అక్కడ ఆగింది. "ఇంతకీ నీ ఉద్దేశం?" అంటూ రామకృష్ణ ప్రోత్సహించాడు. "ఆ అవసరం కనబడ్డనాడు ఏర్పడిన కుటుంబం ఆ ఇద్దరిదే అవుతుంది. దాంట్లొ పై వాళ్ళకు చోటుండొచ్చు. కానీ హక్కు ఉండదు. అమ్మయినా సరే, నాన్నయినా సరే." "ఊ, మీ అభిప్రాయం ఏమిటి?" అన్నాడు రామకృష్ణ. "ఉమ అబిప్రాయం సరైనదే ననుకుంటాను. నే నెప్పుడూ ఆలోచించలేదు కాని...." అన్నాడు భాస్కరరావు. "సమాజం ఇలా నడవాలని ముందే ఆలోచించుకుని ఎప్పుడూ నిబంధనలు పెట్టుకోదు. ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకోవడంలో మనం తీసుకునే నిర్ణయాలే కార్యక్రమంలో సామాజిక నిబంధనలవుతుంటాయి. దురదృష్టం ఏమిటంటే మానవుడు తాను చేసిన పనినే తనది కానట్లు, తనకు అతీతమైనదన్నట్లు భావించడమూ, దానిని సర్దుకోవాలంటే ప్రపంచం ఏమయిపోతుందోనన్నట్లు భయపడడమూను, కానీండి." అన్నాడు రామకృష్ణ సాలోచనగా. * * * * * సుదీర్ఘంగా సాగిన ఆ వారం పదిరోజుల కథ విని సత్యవతి నవ్వి కొడుకును హాస్యం చేసింది. "అందరూ ఎరిగినదాన్నే ఇంత బరువుగా వినిపించడం మీ మార్క్సు గారి పద్దతా, ఏమిరా?" 15 చంద్రశేఖర శాస్త్రి "రా, అమ్మా!" అన్నాడు ఆమె కోసమే ఎదురు చూస్తున్నట్లు. "మీ స్నేహితులు ఏం చేస్తున్నారు? ఆయనకు ఏం కావాలో, ఏమిటో చూస్తున్నావా? అమ్మ అస్తమానం వంటింట్లో ఉంటుంది. ఆయనకు మన ఇల్లు కొత్త, మొగమాట పడతారు" అంటూ చెప్పుకుపోతున్నాడు. తమ మనసులో కొట్టుమిట్టాడుతున్న ద్వైదీభావాన్ని ఒక క్రమంలోకి తెచ్చుకొనే వ్యవధి కోసం ఆయన ప్రయత్నం. ఆ ప్రయత్నంతోనే తన ఎదుట ఉన్న కూతురితో ఏదో మాట్లాడేస్తున్నాడు. కాని దాని అర్థాన్ని గమనించుకోవడంలేదు. నిన్నటి నుంచీ ఇంటిలో ఉమ పెళ్ళి విషయం మీదనే ప్రతి ఒక్కరూ రెండో వారితో చర్చిస్తున్నారు. ఇప్పుడీ మాటలతో శాస్త్రి వారి వివాహానికి తన అంగీకారం తెలిపినట్లే అయింది. ఉమ ఉత్సాహంగా గదిలోకి అడుగు పెట్టింది. ఆమె వెనుకనే నమస్కారం తెలుపుతూ భాస్కరరావూ వచ్చాడు. "రండి, రండి! అమ్మా ఆ కుర్చీ ఇలా లాగు. కూర్చోండి!" గుమ్మంలోంచి సత్యవతి పలకరించింది "రమ్మన్నారుట ఎందుకు?" శాస్త్రి ఒక్క క్షణం విస్తుపోయినట్లు చూశాడు. అంతలో సర్దుకున్నాడు. "రామకృష్ణ చెప్పాడా? మంచిది. నేనూ అనుకుంటున్నాను. రా, ఇలా కూర్చో!" అంటూ సోఫాలో తన పక్కనున్న కాగితాలు తీసి పక్కనున్న బల్ల మీద పడేశాడు. సత్యవతి చిరునవ్వుతో ఆయన పక్కనే కూర్చుంది. ఏదో మాటవరస కలుపుతూ, " ఇదిగో, వీళ్ళిద్ధరూ ఇక్కడనే వున్నారే!" అంది. ఆ ఇద్దరూ ఒక్కచోటనే ఉన్నట్లు గుర్తించడమే ఆమెకు సమస్య అర్థమైనట్లూ, దాని కామె సుముఖురాలే నన్నట్లూ కనిపించింది. రామకృష్ణ జరగబోతున్న ఘట్టం గురించి ఆమెకు చెప్పే వుంచాడు. ఆమెకూ భాస్కరరావు నచ్చాడు. చేయబోయే ఉద్యోగం గురించీ, చదువు గురించీ విన్నది, తృప్తి పడింది. తీరా తండ్రి ముందుకు వచ్చాక అసలు విషయం ఎలా ప్రారంభించాలో ఉమకు అర్థం కాలేదు. సలహా కోసం భాస్కరరావు ముఖం కేసి చూసింది. అతనికీ బిడియంగానే ఉంది 'నువ్వే ప్రారంభించ ' మన్నట్లు తల ఎగరేశాడు. 'బాబోయ్' అన్నట్లామె కళ్ళు రెపరెప లాడించింది. వారి హావభావాలు గమనిస్తున్న సత్యవతి ఫక్కున నవ్వింది. "ఏమిట్రా, మీ గొడవ!" ఆ మాట ఊతం తీసుకుని భాస్కరరావు చటుక్కున లేచాడు - "మీ ఆశీర్వచనం కోరివచ్చాము." చంద్రశేఖరశాస్త్రి ఏ మాటా చెప్పేలోపున ఆ జంట ఒకరి తర్వాత ఒకరికి తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. దంపతులు అప్రయత్నంగానే వారి తలలు స్పృశిస్తూ ఆశీర్వచనమూ చేసేశారు. "దీర్ఘాయుష్మాన్ భవ!" "దీర్ఘ సుమంగళీ భవ!" పాదాభివందనం చేసి నిలబడ్డ కూతురును సత్యవతి దగ్గరకు తీసుకుంది. ఆమె కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి. "బాగుందే, తల్లీ! బాగుంది!" చంద్రశేఖరశాస్త్రి స్వరంలో కూడా డగ్గుత్తిక వినిపించింది, "కూర్చోండి. బాబూ!" నలుగురూ కూర్చున్నాక శాస్త్రి కూతుర్నే ప్రశ్నించాడు. "ఇంకేమిటి? ఏం చేయాలనుకుంటున్నావమ్మా?" ఆ ప్రశ్న కర్థం తెలియక ఉమ తెల్లబోయింది. తల్లివంక చూసింది. సత్యవతమ్మ హాస్యమాడింది. "ఏమనుకొంటుంది? ముహూర్తం పెట్టించమంటుంది." శాస్త్రి తాను కూడా హాస్యంలొ జత కలిపాడు. "మనం పెట్టించేందుకేముంది? ఒక్క నెలరోజుల వ్యవధిలో అదీ వాళ్ళే పెట్టేసుకోగలరు." తామే ఒక నిర్ణయానికి వచ్చి, ఆశీర్వచనం కోరుతున్నామన్నందుకు కలిగిన మనస్తాపం సూచనేమో ననిపించి పడుచువాళ్ళిద్దరూ ఉలిక్కిపడ్డారు. "అబ్బే, అదేం లేదండీ?" అన్నాడు భాస్కరరావు. "తప్పేం లేదు. మీరు మంచి పనే చేశారు." అని శాస్త్రి దిలాసా ఇచ్చాడు. తమ ఇంట కలిగిన అనుభవంతో పోల్చుకుని భాస్కరరావు ఉత్సాహపడ్డాడు. కూతురి ఆలోచన లేమిటో శాస్త్రి తెలుసుకోదలిచాడు. "నీ ఎం. ఎస్. ప్రయత్నం ఉందనుకుంటాను." "కాంపిటీటివ్ పరీక్షలకు కూర్చుంటాను." "నా ట్రయినింగ్ కూడా రెండేళ్ళే ఉంటుంది కదండీ! ఆమె చదువు మానరాదనే అనుకున్నామండీ!" శాస్త్రి ఉలిక్కిపడ్డాడు. అనుకొన్నాడు--కూతురు జీవితంలో తమ ప్రమేయం ఏమీ మిగలలేదన్నమాట! ఆయన మనసు పదే పదే భాస్కరరావు గోత్రం ఏమయి ఉంటుందోనని జంకుతోంది. ఇంటిపేర్లను బట్టి గోత్రాలు అర్థం అవుతాయి. అయితే కొంతవరకే. ఒకే ఇంటిపేరూ, భిన్న గోత్రాలు వాళ్ళున్నారు. అదీగాక అన్ని యింటి పేర్ల గోత్రాలూ తనకు తెలుసునా? పైగా జిల్లాలు దాటీ, శాఖలు దాటీ వచ్చిన సంబంధం! నాడుల నిబంధన విధించాడనే ఏలేశ్వరోపాధ్యాయుల మనఃక్షోభ అర్దమయిందనిపించింది శాస్త్రికి. తాను తప్పు చేస్తున్నానేమో అనిపించినా, కొడుకు చెప్పింది కూడా న్యాయమే అనిపిస్తోంది. పైగా ఈ పడుచు వాళ్ళ ధోరణి చూస్తున్నాడు. తమ చిన్ననాటితో పోలిస్తే, ఆనాడు నలుగురైదుగురు పిల్లల్ని కన్న దంపతులు కూడా అంత దోస్తీ చూపేవారుకారు. ఇక్కడింకా పెళ్ళైనా కాలేదు. అప్పుడే కన్ను గిరిసి అభ్యర్ధనలు, 'అనుకొన్నాము'. ఇలాంటి వాళ్ళని గోత్రం పేరుతో వేరు చేయడం న్యాయం మాట అటుంచి, సాధ్యమా? కానప్పుడు అవి తవ్వడం ఎందుకు? అని సరి పుచ్చుకుంటున్నాడు. "మంచిది అవన్నీ మాకు అర్థమయ్యే విషయాలు కాదు." భాస్కరం చాలా దృఢంగా చెప్పాడు--"ఇప్పుడు వెంటనే చదువు కట్టి పెట్టడంలో అర్థం లేదండి!" "ఔను నాన్నా! నేను ఎం. డి. యో, ఎం. ఎస్సీయో చేయవలసిందే" భాస్కరరావు ఆమె వంక సగర్వంగా చూశాడు. "ఎంతవరకు చదవాలి, ఎప్పుడాపాలి అన్నది వాళ్ళు చూసుకుంటారు. ముహూర్తం పెట్టించేయండి" అని సత్యవతమ్మ మగనికి సలహా యిచ్చింది. "అన్నయ్యని పిలుచుకురా, తల్లీ!" శాస్త్రి కూతురికి పురమాయించాడు. ఆమె కిందికి వెళ్ళింది. "మీరా దృఢనిశ్చయంతో ఉన్నప్పుడు ఆ చదువేదో ముగిశాకే ముహూర్తం పెట్టుకోవచ్చు. ఇప్పుడు తొందర పడటం ఏమంత మంచిది?" అన్నాడు శాస్త్రి. కనీసం ఇప్పటికి దాటించేస్తే తరువాత చూసుకోవచ్చు ననే ధోరణిలో. భాస్కరరావు తెల్లబోయాడు. ఇటువంటి మునద్దీ పేచీ వస్తుందనే ఆలోచన వుంటే తమ ఎత్తుబడినే భిన్నంగా ఏర్పాటు చేసుకునేవాడు. ఉమ యిక్కడుంటే సంభాషణ ఏ రూపం తీసుకునేదో? వివాహం వెంటనే జరిగి తీరవలసిందే ననడానికి మొగమాటపడ్డాడు. మనసులో ఎంత కోరిక వున్నా పైకి తేలలేకపోయాడు. "పెద్ద వాళ్ళు ఎలా నిర్ణయిస్తే అలాగే"నని జారవిడవవలసి వచ్చింది. సత్యవతి అభ్యంతరం చెప్పింది--"ఒక నిర్ణయానికి వచ్చాక వాయిదాలెందుకు? చిన్నపిల్లలా, ఏమన్నానా?" భర్త ప్రయత్నం ఆమెకు అర్థం కాలేదు. తన వాదాన్ని ప్రత్యాఖ్యానం చేసే సాధనం కూడా ఆమే అందించి శాస్త్రి శ్రమ తగ్గించింది. "పెళ్ళి అయ్యాక కూడా వయసు వచ్చిన వాళ్ళను దూరంగా ఉంచడం న్యాయం కాదు, ఆ కాస్త అడ్డు తీరితే యింక పిల్లలు. మరి చదువేముంటుంది? చదువుకోదలచినప్పుడు వెంటనే పెళ్ళి చేసుకోవడంలో అర్థం లేదు." "ఆఁ, మీ చాదస్తం కానీ! వాళ్ళ కష్ట సుఖాలు వాళ్లెరగరా ఏం?" అంతకన్న పరాయి పడుచువాని ముందు ఆ కష్ట సుఖాల ఎరుక స్వభావాన్ని సత్యవతి స్పష్టం చేయలేకపోయింది. భాస్కరరావు మనసూ ఆ అభ్యంతరాన్నీ అంగీకరించలేదు. ఈనాడు సంతాన నిరోధాన్ని సమాజమే తన చేతిలోకి తీసుకుంది. యిక సందేహం, సిగ్గూ అనవసరమే. పైగా వధువు మెడిసిన్ చదువుకుంది. ఆమెకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలియవా? యిన్ని ఆలోచనలూ మనసులోనే. ఆ పెద్దల ముందు ఏమీ పైకి అనలేక పోయాడు. ఇంతలో రామకృష్ణను వెంటబెట్టుకుని ఉమ పైకొచ్చింది. వేరు ప్రశ్నకూ, మారు మాటకు అవకాశం ఇవ్వకుండా శాస్త్రి తన అభిప్రాయాన్ని ప్రకటించాడు. "బాగానే ఉందోయ్! అయితే ఒకటే చెప్తున్నా--ఇద్దరికీ చదువులున్నాయి. కనీసం ఏ ఒక్కరు బయటపడాలన్నా రెండేళ్ళు పడుతుంది. అంతవరకూ ఒకరు దక్షిణాన్నా, వేరొకరు ఉత్తరానా. ఇప్పుడు పెళ్ళి చేసుకుని సుఖం లేదు. అర్థమూ లేదు. ఏమంటావు?" ఉమ తెల్లబోయింది. రామకృష్ణకు తండ్రి ఆలోచన అర్థమయింది. తన మనసును తృప్తిపరచుకునే వరకు ఆయన ఆ వివాహం జరపలేడు. పోనీ అని ఆ గోత్రమేదో తేల్చుకొని ఒక నిర్ణయానికి వచ్చినట్లూ లేదు. అడగలేదనేది స్పష్టమే. తెలుసుకుని మనసు బాధ పెట్టుకోవడం కన్నా ఇదే మేలు. కాని, మళ్ళీ ఇదేమిటి?" ఈ మారు శాస్త్రి తన ఆలోచనలకు ఒక కారణాన్ని కూడా జతపరిచాడు. ఈ లోపున వాళ్ళ అమ్మగారూ, అన్నగారూ కూడా సర్దుకోగలుగుతారు. పెద్దవాళ్ళను సాధ్యమైనంత వరకు మంచి చేసుకోవడం మంచిది. శుభప్రదమూనూ." రామకృష్ణ అనుమానిస్తూనే భాస్కరరావు ముఖం చూశాడు, నిస్పృహ నిర్వేదంతో కూడిన వినోదరేఖ కనపడింది. శాస్త్రి మళ్ళీ తన వాదాన్ని ప్రస్తరించాడు. "చూడు, నువ్వు చెప్పిందాన్ని బట్టి ఈ క్షణంలో వివాహం తలబెడితే వారెవరూ వస్తారనుకోను. కొంచెం చల్లబడనిస్తే అన్నీ సర్దుకుంటాయి. లక్షణంగా పెళ్ళి చేసుకుంటూ పేచీలు అనవసరం." "ఒకవేళ...." "అలాగే ఆ కోపాలూ, తాపాలూ కొనసాగితే అప్పుడేమంటుంది. పెళ్ళి చేసేసుకుంటారు. ఏం?" 16 క్రిందికి వచ్చాక రామకృష్ణ చాలా ఆలోచించేడు. తండ్రి ఆలోచనా ధోరణి అతనికి తెలిసి తెలియనట్లు ఉంది. అదేదో తేల్చుకోవాలని నిశ్చయించుకొన్నాడు. మధ్యాహ్నం ఆయన విశ్రాంతి తీసుకొనే వేళకి తల్లిని తీసుకుని ఆయన గదికి బయలుదేరేడు. "భాస్కరం లేవగానే అల్మారాలో పళ్ళూ, బిస్కెట్లూ ఉన్నాయి. కాఫీ ఫ్లాస్కులో పోసేను. ఇయ్యి" అంటూ కూతురుకు పురమాయించి సత్యవతి కొడుకు వెంట బయలుదేరింది. మెట్ల మీద కాలు పెడుతూ అతడు తల్లిని కదిలించేడు. "ఏమిటీ నాన్నగారి అభిప్రాయం? కావాలని వచ్చేడు గనక నిర్లక్ష్యమా? ఉమ మనస్థితి కూడా చూసుకోవద్దా?" చిరకాల పరిచయంలో భర్త మనస్తత్వాన్ని సూచనగా గ్రహించగల సత్యవతమ్మ కొడుకును తొందర పడవద్దంది. "ఆయన మనస్సులో ఎక్కడో ఏదో అసంతృప్తి మెదులుతూంది." "నాకు తెలుసును, ఆ అసంతృప్తి ఎందుకో, ఆ కుర్రవానిది మన గోత్రమే అయితే నీకేమన్నా అభ్యంతరమా?" సత్యవతి తెల్లబోయింది. "వాళ్ళదీ భరద్వాజ గోత్రమేనా?" "ఏమో నేనడగలేదు. ఈ సందర్భంగా అసలు అడగను. దానిమీద నాకు సుతరామూ నమ్మకం లేదు." "ఏమో నాకేమీ తెలియదు"--సత్యవతమ్మ నాన్చింది. "అడగలేదు అయితేనేం? మన శాఖవాడు కాదు. ఏ మూలనుంచేనా బంధుత్వం ఉందనుకుందుకేనా మన పూర్వులూ, వాళ్ళ పూర్వులూ నాలుగైదు తరాలకు మధ్యకాలంలో ఒక జిల్లాలో కూడా ఉన్నట్లు లేదు. అటువంటి సందర్భంలో చదువు, రూపం, గుణం వయస్సు సరిపడినప్పుడు, కోరి వచ్చినవాడిని, ఉమ కూడా ఇష్టపడుతున్నప్పుడు--అర్థంలేని అభ్యంతరం చెప్పి తోసెయ్యడం--ఆలోచించు." గదిలో అడుగు పెడుతూండగనే తండ్రి వేసిన ప్రశ్నకు రామకృష్ణ తెల్లబోయేడు. "కుర్రాళ్ళిద్దరూ ఏమంటున్నారు?" తెల్లబోయిన కొడుకు వంక చూస్తూ శాస్త్రి మందహాసం చేశాడు. "ఏమిటలా చూస్తావు?" "నువిలారా, కూర్చో" అంటూ భార్యకు చోటు చూపిస్తూ అన్నాడు. "నే నాతని గోత్రం అడగలేదు. అడగతలుచుకోలేదు." "అనుకున్నాను" అన్నాడు రామకృష్ణ, "మరి పేచీయే లేదు." "ఎందుకు లేదు. నే నా పెళ్ళి చేయలేను. కన్యాదానం చేసే దెవరికి? ఫలానా గోత్రాయ, ఫలానా వారి పౌత్రాయ, ఫలానా వారి పుత్రాయ, ఫలానా శర్మాయ--ఔనుగాని, అన్నట్లు ఆయనకు వడుగేనా...." "నే నడగలేదు" అన్నాడు రామకృష్ణ విసుగ్గా. "మరేం తెలుసుకున్నావోయ్?" "నాన్నా! ఆయన పెట్టెలో ఉన్న చొక్కాలూ, ప్యాంట్ల రంగులూ, నమూనాలూ తెలుసుకోవడం నాకంత ముఖ్యం అనిపించలేదు." "ఏం మాటరా అది?" అంది సత్యవతమ్మ మందలింపుగా. "ఔనమ్మా! మీరంతా నాలుగైదు వందలు పోసి ఒడుగులు చేశారు. మా అన్నదమ్ములం ఒక్కడి మెళ్ళోనేనా జంధ్యం ఉందనుకోను. కనీసం నా మెళ్ళో లేదు. మంచా, చెడ్డా అని కాదు. దానికి నేడున్న విలువ మాత్రమే చెపుతున్నా మీకంత ముఖ్యం అయితే--అంటే ఇంతక్రితం జంధ్యం వేసుకొని ఉండకపోతే--ఇప్పుడు వేసుకోవడానికి ఆయనకి అభ్యంతరం ఉండకపోవచ్చు--అదీ నేను చెప్పలేను సుమా....ఇంతకీ నే నడగలేదు...." "ఉహూ" అన్నాడు శాస్త్రి. "అవన్నీ తెలుసుకోవడం, తేల్చుకోడం కష్టంకాదు. చిన్నచిన్న విషయాల్ని మేరువులంత చేసుకోవడంలో అర్థంలేదు" అంది సత్యవతమ్మ సర్దుబాటుగా. "అది కాదమ్మా! ఆయన తన కీ నమ్మకాలు లేవంటాడనుకో...." "అదే చెప్తాడు...." అందామె. "వద్దు" అంటే ఏమవుతుందో ఆమె ఆలోచించలేదు. పిల్లనివ్వనంటుందా? అలా అనగలుగుతే ఓ పద్ధతి. కాని కూతురేమంటుంది? తమకుండే అభ్యంతరాలు అమె కుండవని తెలుసు. అయితే ఏ పరిమితిదాకా? ఇష్టపడుతున్న పడుచువానికన్న అతని మెడలోని జంధ్యానికి ఎక్కువ విలువ నిస్తుందా?--ఏమీ తేల్చుకోలేక పోయింది. "ఇవన్నీ ఆలోచించేనోయ్. ఆ స్థితికి నా మనస్సు సర్దుకునే వరకూ కన్యాదానానికి సంకల్పం చెయ్యలేను...." "అంతవరకూ కూర్చోనుంటారు." "నే నేమీ అనలేదు." రామకృష్ణకు ఏమీ తోచలేదు. పెళ్ళి చెయ్యలేనంటారు. మనిషిలో కోపమూ కనబడదు. అయితే.... అనుమానం ....స్పష్టం చేసుకోవాలనుకున్నాడు. "మీకు మనస్సు కుదిరేవరకూ...." "కుదురుతుందని నేనూ చెప్పలేను." "అంటే?" "అది వాళ్ళ ఇష్టం...." "అంటే...." "ఒరేయ్. నా చేత వాగించకు. ఇంత గ్రంథం నడిపిన వాడివి ఇప్పుడు హఠాత్తుగా తెలుగు భాష అర్థం కాకుండా పోయింది?" మళ్ళీ అదే అనుమానం. ఆయన కంఠంలో కోపం లేదు. కాని ఆ మాటేమిటి? "అదేం మాటండి, వాడిని కోప్పడతారు? ఇంకా నయం! వాడంటూ పూనుకొని పొత్తు పరుస్తున్నాడనా?"--అంది సత్యవతి నొచ్చుకొంటూ. శాస్త్రి నొచ్చుకోలేదు. కోపమూ చూపలేదు. నవ్వేడు. "పోనీ వాడు కాదనుకో. ఆ పిల్లలు ఇద్దరూనేనాయె. ఈ నిర్ణయాలకు రాగల వాళ్ళు ఇతరుల ప్రమేయం లేకుండా ముందేం చెయ్యాలో నిర్ణయించుకోలేరా, నన్నడుగుతే నా అభిప్రాయం చెప్పేను. నా నమ్మకాలు నాకున్నయి. మంచివో, చెడ్డవో వాటినే ఇతరులూ నమ్మాలనను. నన్నెవ్వరూ శాసించకండి. ఇంక నన్ను బాధించకండి." ఇంతసేపటికి రామకృష్ణ తనకు అర్థం అయిందనుకున్నాడు. "రిజిష్టర్డ్ పెళ్ళి చేసుకోండి. దానికైనా నన్ను పిలవ" ద్దని చెప్పడం అది. "మీ ఇష్టం" అంటూ రామకృష్ణ లేచేడు. 17 రామకృష్ణ కిందికి వచ్చేసరికి సావిట్లొ ఉమ అతని కోసమే కాచుకున్నట్లుగా కూర్చుని ఉంది. అతడు కనబడగానే లేచి ఎదురు వచ్చింది. "పొద్దుటి నుంచీ ఆలోచిస్తున్నాను. తేలడం లేదు. కాస్త చెప్పు." ఏమిటన్నట్లు రామకృష్ణ కనుబొమ్మ లెత్తాడు. "చదువు ఒక దశకు వచ్చేక, పెళ్ళికీ, దానికీ పోటీ పెట్టవలసిన పని లేదనుకుంటాను." "ఆ మాట ఎందుకు వచ్చింది?" "ఎం.డి. చెయ్యాలనుకోవడమే నాన్న అభ్యంతరానికి కారణమయితే...." "అలా అని ఎవరు చెప్పేరే చిట్టితల్లీ?"--అని రామకృష్ణ వెక్కిరించేడు. "నిజంగానే అంటున్నాను." "చదువు మానేస్తానంటే పెళ్ళి చెయ్యడానికి ఎవరూ సిద్ధంగా లేరు." "పెళ్ళికోసం తల్లకిందులైపోవడం లేదు. నేనేం." "నే నన్నానా ఆ మాట?" "మరి నీ మాట కర్థం ఏమిటి?"--ఉమ నిలదీసింది. "అదే మాటని ప్రశ్నార్థకంగా మారుస్తే నీకు అర్థం అయ్యేది. రెండేళ్ళ అనంతరమే కాదు. నాలుగేళ్ళ తరవాత కూడా ఈ పెళ్ళి మాట ఎత్తవద్దంటే చదువుతూనే ఉంటావా?" తన మనస్సులో కలిగిన నిరాశని ఉమ పైకి తెలియనివ్వలేదు. "అయితే ఆయన్ని పంపెయ్యి." రామకృష్ణ కృత్రిమాశ్చర్యం కనబరిచేడు. "అదేమిటి? ఆయన ఏవో ట్రైనింగనీ, ఉద్యోగమనీ ఏవేవో అంటున్నాడనుకొన్నానే. అవన్నీ మానేసి నాన్న దగ్గర శబ్దమంజరి పాఠం ప్రారంభించాలనుకుంటున్నాడా?" ఉమకి కోమ వచ్చింది. "ఒరేయ్! ఉట్టి సిల్లీగా మాట్లాడకు." "లేకపోతే నేను పొమ్మని చెప్పడం ఎందుకు? ఓ రోజో, రెండ్రోజులో...." "ఇంకోవారం కూర్చోమను, నాకు పోయిందేంలేదు. నేను పొద్దుటే మెయిలుకి పోతున్నా...." "ఉద్దరిస్తావు!" మాట పూర్తి చేయకుండానే ఉమ ముఖం వంక చూసి రామకృష్ణ మాట మార్చేడు. "ఇదిగో ఉమా! మనకి కావలసిం దేమిటో మనకి తెలిసి ఉండాలి. మనకు కావలసిందానిని సంపాదించుకొనే పట్టుదలా, స్థైర్యమూ, ధైర్యమూ ఉండాలి." అతని మాటలలో ఏదో విశేష ముందని తోచి ఉమ నిలబడింది. "నాకు తెలుసు...." "అయితే మంచిదే. ధైర్యంగా ఉండు." "అంటే...." "ధైర్యమంటే ఏమిటంటావా?" "ఒరేయ్!" "తగ్గు. తగ్గు. అమ్మ ఏమంటుంది. నాన్న ఏమనుకుంటారో. ఇన్నేళ్ళు పెంచి, పోషించి, చదువు చెప్పించి ఇంతదాన్ని చేసేరే, వారి మాట కాదనేదా? ఇంటికి రావద్దంటారేమో, మళ్ళీ ఎవర్నీ చూడ్డం పడదేమో! ఇలాంటి ఆలోచనలు కట్టిపెట్టడానికి చాలా ధైర్యం కావాలి." ఉమ అతని ఉద్దేశాన్ని గ్రహించింది. కాని దానికి వెనుక నున్న కారణం స్పష్టం కాలేదు. తన చదువూ, భాస్కరరావు కుటుంబ వ్యతిరేకతా మాత్రమే తండ్రి అభ్యంతరానికి కారణాలని ఆమె ఇంతవరకూ అనుకుంటూంది. కాని ఈ మాటలు వింటే వెనక పెద్ద గ్రంథమే ఉన్నట్లు తోస్తూంది. ఏమిటో అది? "నీ మాటలు కాస్త అర్థమయ్యేలా చెప్పరా బాబు!" "నాకు తెలుగూ, ఇంగ్లీషూ తప్ప మరో భాష రాదు. అవి రెండూ నీకు తెలుసుననుకుంటాను"--అన్నాడు రామకృష్ణ ఆశ్చర్యం అభినయిస్తూ. "వచ్చును"--ఉమ ఒప్పుకొంది. "కాని ఈ అబ్‌స్ట్రాక్ట్ కవిత్వం చచ్చినా అర్థం కావడంలేదు." "అయితే సరే." ఉమ శ్రద్ధగా వినడానికి మళ్ళీ కుర్చీలో చతికిలబడింది. కానీ, రామకృష్ణ అప్పటికేమీ చెప్పదలుచుకోలేదు. "నువ్వు చీర మార్చుకుంటావేమో, తయారవు. ఆయనతో చెప్తా. ముగ్గురం ఏ బ్యారేజిమీదకేనా పోదాం." ఏదో పెద్ద గ్రంథమే ఉన్నదనుకుంది. మాట్లాడ కుండా లేచి వెళ్ళింది. పక్కగదిలో ఉన్న భాస్కరరావు రామకృష్ణ పిలుపుతో గుమ్మంలోకి వచ్చేడు. "ఎండ చల్లబడింది ఇంట్లో ఏం కూర్చుంటాం? లేవండి. అలా బ్యారేజీవేపు పోయి వద్దాం" "నేను సిద్ధంగానే ఉన్నా నడవండి" అని భాస్కరరావు ముందుకు వచ్చేడు. "నా ఆలస్యమూ లేదు. రాండి"--రామకృష్ణ వీధి గుమ్మంవేపు నడిచాడు. భాస్కరరావు తెల్లబోయి నిలబడ్డాడు. ఏమీ ఎరగనట్లు రామకృష్ణ వెనక్కి తిరిగిచూసి "ఆగిపోయేరేం? మంచినీళ్ళు ఏమన్నా కావాలా?" అని ప్రశ్నల వర్షం కురిపించేడు. భాస్కరరావు సిగ్గుపడి నసిగేడు. చేత్తో జేబు తట్టుకున్నాడు. "ఓహో నిన్న ఉమ కిచ్చారా?" రాత్రి ఇంటికి వస్తూనే పర్సూ, జేబులో వస్తువులూ టేబులు మీద పడెయ్యక ఉమ చేతి కివ్వమని తానే చెప్పేడు. "పోనీండి. అదేం పనిలో, ఎక్కడ ఉందో రాండి నా దగ్గరుంది." ఈమారు భాస్కరరావు నసగలేదు. "ఇదేమిటి లెండి. ఆమె నడిగి తీసుకొనే వెడదాం." అన్నాడు ఖండితంగా. "అయితే ఉమని." "ఆమె కూడా వస్తారేమో అడుగుదాం." రామకృష్ణ ఏమనేలోపున ఉమ వచ్చేసింది. అన్నగారి వేపు చూసి, ఆశ్చర్యంతో--"నువ్వింకా ఇలాగే ఉన్నా వేమిటి? అమ్మ పిలుస్తూంది. ఎందుకో...." అని కబురందించింది. "ఔను. మరిచేపోయేను." అంటూ రామకృష్ణ హడావిడిగా ఇంట్లోకి పరుగెత్తేడు. ఉమ పర్సును భాస్కరరావుకు అందిస్తూ--"చూసుకోండి. విడిగా ఉన్న చిల్లరా, తాళంచెవీ అందులోనే పడేశాను" అంది. పర్సు జేబులో పెట్టుకుంటూ--"నువ్వుకూడా రారాదూ, అలా తిరిగి వద్దాం" అన్నాడు. "మన ఇద్దరితో ఏదో మాట్లాడాలన్నాడు అన్నయ్య." "నన్ను ఒక్కణ్ణే బయలుదేరమని ఉంగిడెత్తించేసేరేం మరి." తన్ను ఆట పట్టించినట్లు అర్థం అయి భాస్కరరావు నవ్వేడు. ఉమ వంత కలిపింది. "అతడితో వచ్చిన ఇబ్బందే అది. నిజమేదో, హాస్యమేదో అర్థం కాదు. వేళాకోళం చేస్తూ నిజమనిపించేటంత గంభీరంగా ముఖం పెడతాడు." 18 ఇంటికి వచ్చేక కూడా రామకృష్ణ తమ సంప్రదింపుల పర్యవసానం ఏమిటో ఏమీ చెప్పలేదు. చంద్రశేఖరశాస్త్రి ఆ ప్రసంగమే తేలేదు. రెండో కొడుకు కార్యదక్షత మీద ఆయన కెంతో నమ్మకం. కాని, తల్లి పట్టలేక అడిగేసింది. రామకృష్ణ తొణకకుండా సమాధానం యిచ్చేడు. "అమ్మా! యింక మీరు దానికి పెళ్ళి చెయ్యగలుగుతారనుకోను. తెలివితేటలూ, సాహసము ఉంటే తెగబడి అదే చేసుకుంటుంది. లేకపోతే మీ దివ్య సన్నిధిలో పడుచుదనం వెళ్ళదీస్తుంది. తరవాత దాని ప్రారబ్దం!" అని చెయ్యి విదిలించి లేచిపోయేడు. సత్యవతి నిర్ఘాంతపోయింది. మగణ్ణి నిలదీసింది--"ఏమిటి మీ ఉద్దేశ్యం?" శాస్త్రి తన ఉద్దేశ మేమిటో చెప్పలేదు. కాని, బోలెడంత దిలాసా మాత్రం ఇచ్చేడు. తన అభిప్రాయం ఏమిటో రామకృష్ణ గ్రహించేడు. వ్యవహారం అతడే చక్కపరుస్తాడని ధైర్యం. ఆ ధైర్యంతోనే భార్యకు సర్ది చెప్పబోయేడు. కాని, ఆమెకు ఆ ధైర్యం కలగలేదు. భాస్కరరావు వెళ్ళిపోతూ సెలవు తీసుకొంటూంటే మాత్రం దుఃఖం వచ్చింది. "అత్తయ్యగారూ!" అని నోరారా పిలిచి సెలవు తీసుకొంటూంటే ఆమె కళ్ళ నీళ్ళు తిరిగేయి. డగ్గుత్తికతో ఆశీర్వదించింది. "దయ ఉంచండి." అని అతడూ కదిలేడు. రిక్షాలో కాలు పెడుతూ అతడు ఉమ వేపు చూసిన చూపు నామె మరిచిపోలేననుకొంది. ఉమ కూడా ఏదో పోగొట్టుకొన్నట్లు రోజంతా పరధ్యానంగా ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూనే ఉంది. ఆమెను చూస్తూంటే తల్లి ప్రాణం కొట్టుకుపోయింది. కౌగలించుకుని ఏడ్చింది. అంతలో కళ్ళనీళ్ళు తుడిచేసుకుంది. "ఏమే అమ్మా! చదువుకున్న దానివి. ఈ దిక్కుమాలిన ఆచారాలు తలా తోకా లేకుండా ఇలాగే ఉంటాయి ఎందుకు వెనకతీసేవే తల్లీ!" అంది సత్యవతి. "మరేం చేయమంటావు? మీ రిద్దరూ కూడా రాకుండా పెళ్ళెందుకు చేసుకోడం? ఆయనా అదే అన్నారు. ఏదో ఒకవైపు వాళ్ళకి అనిష్టమయితే సర్దుకోగలమనుకొన్నాము. అందర్నీ బాధపెట్టిన ఈ పెళ్ళికి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి 'ప్రేమపాశం' ముగింపు రాకూడదు. కాస్త యిబ్బంది వస్తే ఆదుకునే వాళ్ళు లేకుండా చేసుకోవడంలో అర్థం లేదు--అన్నారు. నాకూ అదే అనిపించింది. పోనీ, నాన్న ఆగమన్నది రెండు మూడేళ్ళే కదా అనుకున్నాం." సత్యవతి నిర్ఘాంతపోయింది. ఇటీవలి కాలంలో చదువుకున్న ఆడపిల్లలూ, మగపిల్లలూ పెద్దవాళ్ళని ధిక్కరించి, స్వతంత్రించి పెళ్ళిళ్ళు చేసుకోవడాన్ని ఆమె అనేకసార్లు ఇవే వాదాలతో నిరసిస్తూ వచ్చింది. "పెళ్ళి అన్నది అందరూ మెచ్చేదిగా ఉండాలి. అందరికీ సంతోషం కలిగించాలి. ఇంతప్పటి నుంచి నానా కష్టాలూ పడి పెంచుతారు. కాస్త నలత వచ్చిందంటే నిద్రాహారాలు మాని గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకొని చూస్తారు. అప్పులూ, సప్పులూ చేసి చదువులు చెప్పిస్తారు. ప్రయోజకుల్ని చేస్తారు. ఈ కష్టానికా ఈ శిక్ష" అని తాను వాదించేది. తన కొడుకులలో రామకృష్ణ అందరికన్న గట్టిగా ఎదురు వాదించేవాడు. "కాపురం చేయవలసిందీ, కలిసి జీవించవలిసిందీ వాళ్ళమ్మా!" అని అతడు ఎదుర్కొనేవాడు--ఆ మాట జ్ఞాపకం వచ్చింది. "చిన్నన్నయ్య ఎందుకూరుకున్నాడు? వాడేమన్నాడు?" ఉమ ఉదాసీనంగా సమాధానం యిచ్చింది-- "ఏమీ అనలేదు. నాన్నలాగే వాడూ దాచేసేడు. మీ యిష్టం! నేనేం చెప్పేది లేదు అనేసేడు." 19 సత్యవతమ్మకు ఆ మాట విన్నాక ధైర్యం కలిగింది. రామకృష్ణ అలా అన్నాడంటే ఇదంతా అబధ్ధమేనని ఆమెకు అనిపించింది. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కులం, మతం, సంప్రదాయాలూ ధిక్కరించి పెళ్ళి చేసుకునే వాళ్ళందరికీ రామకృష్ణ కొండంత ఆసరా. పినతండ్రి కొడుకు శాఖాంతర వివాహం చేసుకోవడానికి అతడి సలహా. మేనత్త కూతురు కులాంతర వివాహం చేసుకోడానికి వాని సాయం కోరింది. దాని మీద నాలుగేళ్ళక్రితం నడిచిన వాదోపవాదాలు ఎన్నటికీ మరవలేదే! "పిల్లలకు ఇష్టం కాని సంబంధాలను తల్లిదండ్రులు మాత్రం ఎందుకు చూస్తారేం?" అంది తాను ఓమారు. "పెళ్ళి అన్నప్పుడు ఎన్ని చూడాలి? కులం, గోత్రం, కుటుంబం, సంప్రదాయం, పరువులు, ప్రతిష్ఠలు, రోగాలు, రొచ్చులు--ఎన్ని చూడాలి. పిల్లవాళ్ళు అంత ఆబ్జెక్టివ్‌గా, ఇంపెర్సనల్‌గా చూడరు. సెంటిమెంటల్‌గా ఆలోచిస్తారు" అని శాస్త్రి వాదం. మిగిలిన పిల్లలంతా ఊరుకున్నారు. కానీ రామకృష్ణ ఒప్పుకోలేదు. పేర్లు మారినా ఒకే తరహా ఉదాహరణలు. తల్లిదండ్రులే కుదిర్చిన పెళ్ళిళ్ళలో తనకు కనిపించినవో, కనిపించా యనుకున్నవో లోపాలు ఏకరువు పెట్టేశాడు. వెంకమ్మ ముఖం గుండ్రంగా ఇత్తడి సిబ్బిలా ఉండడం, పిచ్చమ్మ పేరు బాగుండక పోవడం, రామశాస్త్రి సన్నికల్లు పొత్రంలా కుదిమట్టంగా అడ్డం బలిసి ఉండడం, రాఘవయ్య గెడకర్రలా పొడుగ్గా ఉండడం, సత్యనారాయణ తండ్రిని అమ్మా, ఆలీ బూతులు తిట్టగలగడం--అన్నీ అతని వాదానికి బలకరాలే! ఎన్నో పేర్లు, ఎన్నో ఉపమానాలు, ఈసడింపులు, అనిష్ఠాలూను! "ఆ లోపాలు ఆ జంటలకు కనబడలేదు. సుఖంగా సంసారాలు చేసుకుంటున్నారు" అన్నారు తామిద్దరూ కూడా. "ఏం చేస్తారేమిటి? ఇంతే పెట్టి పుట్టాం కాబోలురా భగవంతుడా అని పెద్దవాళ్ళు చేసిన పనికి ఏడ్చి సరిపుచ్చుకుంటున్నారు" అంటూ వెంకమ్మ, పిచ్చమ్మల భర్తల తరపున రామకృష్ణ తన బాధ ఒలకపోశాడు. తామిద్దరూ అతని అభినయం చూసి నవ్వకుండా ఉండలేకపోయారు. "మరైతే ఈ అడ్డతలల ఆడపిల్లలూ, సన్నికల్లు పొత్రం మగపిల్లలూ ఏమైపోవాలి." రామకృష్ణా నవ్వేశాడు. "ఈ అవకరాల పిల్లల కన్నెచెరలూ, బ్రహ్మచర్య వ్రతాలు విడిపించడం కోసమే దీక్ష పట్టినట్లు మాట్లాడుతా వేమిటమ్మా? అలా అయితే ఈ ప్రేమ వివాహాల జంటలన్నీ రంభా-నలకుబేరులూ, రతీ-మన్మథులూనా ఏమిటి? వాళ్ళలోనూ అవకరాలకు లోటా?" మళ్ళీ ఓ అరడజనుసార్లు వాళ్ళ జంటల్లో తనకు నచ్చని గుణగణాల వర్ణనా. 'వాణ్ణి వాదాల్లో ఒప్పించగలగడం బ్రహ్మతరం కా'దనుకుంది తాను. మళ్ళీ తానే అన్నిటికీ అన్నీ చెప్పాడు. "నాకు అవకరంగా కనిపించినవి అందరికీ అలాగే అనిపించనక్కర్లేదు. ఎవరి ఆలోచన, ఇష్టం వాళ్ళవి. అదీగాక వాళ్లనే కోరి చేసుకునే వారికి నాకు కనిపించిన అవకరాల్ని కనబడనియ్యని బలమైన లక్షణా లేవో కనిపిస్తాయి. 'తాను వలచింది రంభ--తాను మునిగింది గంగ' అన్నమాట పుట్టింది అందుకే. అందుచేతనే ఆ ఎన్నికేదో వాళ్ళకే వదిలేస్తే వాళ్ళే సర్దుకుంటారు. అలా కాదని ఏ నాబోటి గాణ్నోసలహా అడుగుతేనూ, పెద్దరికం ఇస్తేనూ..." "ప్రతి చిన్నదానికీ సమష్టి చర్చలూ, సమష్టి నిర్ణయాలూ, సమష్టి బాధ్యతలూ కావాలనేవాడివేనా?" అంటూ శాస్త్రి కొడుకు రాజకీయ దృక్పథాన్ని వేళాకోళం చేశాడు. రామకృష్ణ నవ్వాడు. "నవ్వక ఏం చేయమంటారు? తేడా తెలియకనేనా మీరా మాట అన్నది?" ఒక్క నిముషం ఊరుకుని, మళ్ళీ తానే పూర్తి చేశాడు. "మందికి సంబంధించిన విషయాలలో మేము సమష్టి చర్చలు జరగాలంటాం. మీకో, నాకో తోచిన పద్ధతిని నిర్ణయించేసేసి, అగ్నిహోత్రావధానుల భాషలో 'తాంబూలాలు ఇచ్చేశాను. తన్నుకు చావండి' అంటే కుదరదంటాం. అదీగాక ఇక్కడ కూడా ఆ సమస్యకి సంబంధించిన వాళ్ళిద్దరినీ కూర్చుని ఆలోచించుకోనివ్వాలంటున్నాం కాని, మరొకటి కాదే! భారత--పాకిస్తాన్‌లు వ్యవహారాలలో మూడోవాళ్ళ జోక్యం పనికిరాదని ఇందిరా గాంధీ అనలేదూ? అంతే!" "ఆ సమస్య వాళ్ళిద్దరిదే కాదోయ్! రెండు కుటుంబాలకీ, వాటి ప్రతిష్టలకీ సంబంధించినది. నువ్వు చెప్పినట్లే పోనీ పిల్లల పెళ్ళి సమస్య రెండు కుటుంబాల సమష్టి సమస్య అని ఎందుకనుకోవూ!" అన్నాడు శాస్త్రి. అయినా రామకృష్ణ తగ్గలేదు. ఒక్కక్షణం సందేహించాడు. అంతలో దృఢం చేసుకున్నాడు. "పెళ్ళి అయిన మరుక్షణం నుంచి కొత్త జంట కుటుంబం వేరు. అంతక్రితం తామున్న కుటుంబాల నుంచి వారు విడిపోతారు. వాటితో ఏమన్నా సంబంధాలు మిగిలినా అది ఐచ్ఛికమూ, తాత్కాలికమూను. మన కుటుంబమే దానికి సాక్ష్యం." శాస్త్రి ఆలోచించాడు. "తర్కం దృష్ట్యా అంతేననుకో." కాని సత్యవతమ్మ 'అటువంటి పరిస్థితికి కారణాలు వేరు' అంటుంది. "అందుకేరా, కుటుంబాలు దూరం అయిపోతాయనే దగ్గర వాళ్ళను ఏరుకోవడం. మేనరికాలూ, అవీ ఎందుకు వచ్చాయంటావు?" "ఒదిన మీ అన్న కూతురే ననుకుంటా?" సత్యవతమ్మ పెద్దకొడుక్కి మేనరికమే చేశారు. అయితే ఆ అమ్మాయి అత్తవారింటికి వచ్చినా, అత్తవారి వాళ్ళు తన ఇంటికి వచ్చినా, హిస్టీరియా ఫిట్స్ వచ్చేస్తాయి. ఆమె బాధ చూడలేక కుటుంబంలో ఎవరూ కాకినాడ, రామారావు పేట పొలిమేరల్లోకి కూడా వెళ్ళరు. ఆ కొడుకు అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఇల్లు కట్టుకున్నాడు. సత్యవతమ్మకి మాట తొణకలేదు. రామకృష్ణే మళ్ళీ ప్రారంభించాడు--"అనేక కారణాల చేత మీరు వివాహాల విషయంలో మీ పట్టుదలలు సడలించుకోవాలమ్మా! వెనకటల్లే పిల్లలు ఆ విషయంలో మీ పెద్దవాళ్ళ సాయం మీద ఆధారపడి ఉండవలసిన అవసరం లేదు. ఎవరన్నా అమాయకులు "అమ్మా! పెళ్ళే" అంటే. "నీకు కావాలసిన దాన్ని మచ్చిక చేసుకోరా, బాబీ!" అని చెప్పి పంపిన రోజులు వచ్చాయి. ఏమంటే ఈనాటి అవసరాలు వేరు, మీ కాలంనాటి అవసరాలు వేరూనూ. మీ రోజుల్లో పెళ్ళి చేస్తామురా నాయనా అంటే మొండికేసి చదువుందనీ, ఉద్యోగం రానీ, స్థిరపడనీ, ఫలానా పిల్ల--ఫలానా లక్షణాలు గల పిల్ల అని కాదు సుమండీ, వాడే చూపిస్తాడు. ఫలానా పిల్ల మాత్రమే కావాలనీ అడ్డం వేసే కుర్రాళ్ళుండేవారేమో ఆలోచించండి." "అలాంటి వాళ్ళెంద రున్నారులే. ఏ నీబోటి గడుగ్గాయో తప్ప!" అని చంద్రశేఖర శాస్త్రి కొడుకుని డెకారించాడు. "ఎందరో ఉండరు. కాని, మనం ఈ సమస్యనింతగా చర్చించవలసి రావడమే నేను ఒంటరిగాణ్ని కానని అర్థం అవడంలేదా, నాన్నా?" ఈ చర్చలు అనంతం. పిల్లలు నలుగురూ ఇంటికి వచ్చారంటే ఏదో రూపంలో పునరావృతం అవుతూనే వుండేది. తర్కానికైనా శాస్త్రి కొన్ని సందర్భాలలో సర్దుకునేవాడు. కాని సత్యవతమ్మ తల్లి ప్రాణం అంగీకరించేది కాదు. పిల్లలు విడిపోవడం, దూరం కావడం అన్నదే ఆమెకు ఇష్టం కాదు. దూరంగా ఉంటున్నారంటే సమాజ గతిలో భాగంగా అంగీకరించేది కాదు. అమె ఆప్యాయతలనూ, అనుబంధాలనూ ఆచారాలతో మేకుబందీ చేసుక్కూర్చుంది. కాని, ఆనాడు కూతురు ముఖం చూశాక ఆమె ఆలోచనలో పడింది. ఆలోచనలో కన్నా ఆత్మ పరీక్షలో పడిందనవచ్చు. చివరకు మళ్ళీ అనుబంధాలే జయించాయి. ఆచారల మేకుబందీని పీకేయడానికి ఒప్పుకుంది. ఆమె ప్రోత్సాహాన్ని కూతురు చాలా నిరుత్సాహంతోనే ఆమోదించింది. "సరేలే!" 20 శాస్త్రికి ఏం చేయాలో దిక్కుతోచలేదు. సత్యవతమ్మకు ఆవేశం కన్నా వ్యవహార జ్ఞానం ఎక్కువ. ఆమె చెప్పిన పూర్వ కథలన్నింటికన్నా ఇచ్చిన సలహా శాస్త్రిలో ఊపిరి పోసింది. "హఫీజ్ మహమ్మదును కలుసుకుని, ఇదంతా ఏమిటో తెలుసుకోండి." కటిక చీకట్లో పడి ఉన్న వాడికి కాంతిరేఖ కనబడినట్లయింది. "ఎంత పని చేశాడు ముసిలాడు: పెట్టిన చెయ్యి నరకడమంటే ఇదే... కృతఘ్నుడు!" ఈ శుభలేఖ రచనలో హఫీజ్ మహమ్మదు పాత్ర ఏమిటో, ఎంతటిదో తెలియకపోయినా ద్వేషనిరూపణకు ఒక దారి దొరికింది శాస్త్రికి. ఒక్క నిముషం ఆగి, తన ఆలోచనను పూర్తిచేశాడు - "ఏం చేసినా పాపం లేదు!" సత్యవతమ్మ గట్టిగా నొక్కి చెప్పింది. "ఇదే నిజమయితే మన చేతులు దాటి పోయిందనుకోవాలి. అబద్ధమైతే అల్లరి చేసుకుని ప్రయోజనం లేదు. ధైర్యంగా...." శాస్త్రికి లేనిదే ఆ ధైర్యం. సహజంగా ఆయన శాంతుడు. కాని కోపం, ఆవేశం వస్తే ఉగ్రనరసింహం. ఈ విషయంలో హఫీజ్ మహమ్మదుకు ప్రసక్తి ఉందనిపించేనా ఆ ముసిలాడి పీక నులిమేస్తాడు. "తర్వాత ఏ మషయీది!" మనసుకి అనుమానం అన్నది కలగకపోవాలే గాని, ఒకమారు అది ప్రవేశించిందా--ఎక్కడెక్కడి ఘటనలనూ దానికి సరిపుచ్చే అసాధారణ శక్తి దానికుంది. అంతలో కాదేమో అన్న సందేహమూ వస్తోంది. "అలాంటి ద్రోహం చేస్తాడా?" తానాతని కుటుంబానికి చేసిన సహాయమూ, ఉపకారమూ మరచిపోయాడా? చంద్రశేఖర శాస్త్రి పని చేస్తున్న కంపెనీ యజమాని హఫీజ్ మహమ్మద్ బాగా వయసు చెల్లినవాడు. ఆయన దగ్గర రమారమి నలభయ్యేళ్ళ క్రితం సాధారణ గుమాస్తాగా ప్రవేశించిన శాస్త్రి ఈ వేళ ఆ కంపెనీ జనరల్ మేనేజరు. ఆ హోదా కన్న మిన్నగా హఫీజ్ మహమ్మదుకు శాస్త్రి మీదే గట్టి నమ్మకం, అభిమానం, గౌరవమూను. అదో చిత్రమైన పరిస్థితులలో ఏర్పడింది. భారతదేశం స్వాతంత్ర్యం సంపాదించుకున్న కొత్తలో హఫీజ్ మహమ్మదు పెద్ద భార్య, కొడుకులు ముగ్గురూ నిజాం సంస్థానంలోకి చేరుకున్నారు. ముస్లిం సంస్థానపు అస్తిత్వాన్ని కాపాడేందుకు నడుం కట్టిన కాశిం రజ్వీకి ప్రధానులైన సర్దారులుగా పనిచేశారు. వారిలో ఒకరు బీబీ నగరంలో దురంత చర్యలు జరిపిన రజాకారు దళం నాయకుడు అంటారు. పోలీసు చర్య కాలంలో ఆ ముగ్గురూ హైదరాబాదు నుంచి ఎకాయెకి కరాచీలో అడుగు పెట్టారు. తన ఆస్తిలో వారి వాటాగా హఫీజ్ మహమ్మదు అందినంత డబ్బు పోగుచేసి వాళ్ళకిచ్చేశాడు. దానికి ఫలితంగా నాలుగైదేళ్ళ పాటు వ్యాపారమూ దెబ్బతింది. ఓ ఏడాదిపాటు ఆయన జైలు జీవితమూ చవిచూడవలసి వచ్చింది. ఆ కష్టాలకు నిలబడ్డాడే గాని వ్యాపారం అమ్ముకుని పాకిస్తాను పోవాలనే సలహాలను ఆయన చెవి చొరనివ్వలేదు. తన మూడో భార్య తాలూకు మనవడిని తల్లీదండ్రీ లేని నాలుగేళ్ళ పసికూన అసదుల్లాను మేనమామలు తన దగ్గరుంచుకుంటామన్నా పంపలేదు. కుటుంబమూ, కంపెనీ చాలా చిక్కుల్లో ఉన్న నాలుగైదేళ్ళూ శాస్త్రి ఎంతో మెలుకువా, శక్తి సామర్థ్యాలూ చూపి వాటిని నిలబెట్టాడు. ఆయన మీద వ్యాపారం వదిలినందుకు హఫీజ్ మహమ్మదుకు విచారించవలసిన అవసరం కలగలేదు. అవన్నీ గుర్తు చేసుకుని శాస్త్రి మళ్ళీ ఆక్రోశించాడు. "నాకేనటయ్యా ఇంత అపకారం తలపెట్టడం?" సత్యవతమ్మకు ఆయన మీద అనుమానం రావడంలేదు. "ఆయన ఎరిగుండకపోవచ్చు నండీ! ఇందులో ఏదో మెలిక ఉంది. వెళ్ళి మాట్లాడి రండి." అదీ నిజమేననిపిస్తోంది శాస్త్రికి. తమ ఇద్దరికీ మధ్య యజమాని--ఉద్యోగి సంబంధాలనూ, వయోభేదాల్ని మించిన ఆప్యాయత ఏర్పడింది. మత భేదం, భాషా భేదం ఉన్నా ఇద్దరూ పరమమిత్రులయ్యారు. కొడుకులు తన్ను వదిలిపోయిన విచారాన్నీ మానసిక వ్యథనూ చెప్పుకునేందుకు ఆయన శాస్త్రినే ఎన్నుకున్నాడు. ఎన్నో జీవిత రహస్యాలను ఆయనకు చెప్పుకుని ఊరట పొందేవాడు. మా తాత లక్నో నుంచి ఇక్కడికి వచ్చారు. ఆయన తండ్రి ఢిల్లీ దర్బారులో ఉండేవారట. ఆయనకు ఏడెనిమిది తరాల పూర్వీకులు కుర్దిస్తాన్ నుంచి వచ్చారట." అంటూ ఆయన తరచూ చెప్పుకునేవాడు. అయితే వాళ్ళు ప్రభువులుగానో, బానిసలుగానో, వర్తకులుగానో బతికారు. సంపదలు గడించకపోయినా మర్యాదస్తులనిపించుకున్నారు. తన పూర్వులీ దేశానికి వచ్చి మూడు వందలేళ్ళయింది. తెలుగు దేశానికి వచ్చే నూరేళ్ళు పైనయింది. హఫీజ్ మహమ్మదు, ఆయన కొడుకులు, కూతుళ్ళు, మనుమలు అంతా తెలుగుదేశంలోనే పుట్టారు. ఇస్లాంపేటలో ఇప్పుడున్న పెద్దమేడ, పార్కు వీధిలో ఉన్న పెద్ద ఎగుమతి--దిగుమతి వ్యాపారం, నాలుగైదు లక్షల బ్యాంకు నిల్వలు--ఇవన్నీ తెలుగుదేశంలో ఉండి సంపాదించుకున్నవే! "నూరేళ్ళ నుంచి తెలుగుదేశంలో ఉన్నాం కాని తెలుగువాళ్ళం కాలేకపోయాం. ఆఖరుకి పది పన్నెండు తరాలుగా బతుకుతున్నా భారతదేశం మా దనుకోలేకపోయాం" పాకిస్తాన్ చేరిన కొడుకుల్ని తలచుకుని బాధపడేవాడు. "శాస్త్రీజీ! రజాకారు గొడవల తరువాత కూడా ముస్లిములు తెలుగుదేశంలో నిరపాయంగా ఉండగలుగుతున్నారు. మరో, మరో రాష్ట్రం అయితే రజాకారు దుండగాల వంటివి జరిగినాక, నెహ్రూ ప్రభుత్వం ఎంత తన్నుకున్నా సామాన్య ముస్లిం కుటుంబం బతుకు ఇంత నిరపాయంగా ఉండేది కాదు." అది మెరమెచ్చు మాట కాదు. హృదయంలోంచి వచ్చింది కాని. ఆయన తాను తెలుగు నేర్చుకోసాగాడు. మనుమడు అసదుల్లాని తెలుగువాడుగా తీర్చిదిద్దాడు. శాస్త్రి ఆ వృద్ధ మిత్రుని ప్రయత్నాన్ని అభినందించాడు. అసదుల్లా హైస్కూలు తరగతుల్లో సంస్కృతం తీసుకోదలచినప్పుడు ఆ క్లాసు టీచరు నిరుత్సాహపరిచాడు. కాని తనే హుషారు చేసాడు. "ఏం భయం లేదు. నీకు కష్టం తోస్తే నా దగ్గరకు రా! నే చెప్తా!" అని భరోసా ఇచ్చాడు. ఆ అభయప్రదానం అసదుల్లాను తన కుటుంబం మధ్యకు తెచ్చింది. అంతవరకూ తన కొడుకులతో అతనికున్న స్నేహం సినిమాలూ, వినోద విహారాల వరకూ మాత్రమే పరిమితం కాని. అంతే కాదు. ఆనాడిచ్చిన హుషారు తరువాత తన్నే ఇరుకున పెట్టింది. అయినా విచారపడలేదు. ఈనాడు విచారం కాదు, బాధ! "ఏమిటిది? ఎందుకిలా అయింది?" అని అంగలార్చాడు. 21 "కానలేకపోయాను. తురకాడికి సూత్రభాష్యం ఏమిటని కానలేకపోయాను" అన్నాడు. తానెంత చెప్పినా ఆ శుభలేఖ నిజమైనదే అనే అనుమానం మగని మనసు నుంచి పోవడం లేదని సత్యవతమ్మకు అర్థమయింది. "మనవాళ్ళు ఇంగ్లీషూ, మరో భాషా చదువుకోగా లేనిది, తురకాడికి సంస్కృతం పనికిరాదా ఏమిటి? మీరూ, మీ అనుమానాలూను!" సత్యవతమ్మ ఇదే మాటతోనే ఆనాడు అటువంటి అసాంప్రదాయికపు పనికి ఒప్పించిందని శాస్త్రికి గుర్తుకు వచ్చింది. "ఇలా సమర్థించే కొంప నిక్కడికి తెచ్చారు" అని శాస్త్రి 'గయ్' మన్నాడు. పండితరాయల ఉదాహరణ నిచ్చి శాస్త్రే తన కాళ్ళకు బంధాలు వేసుకున్నా అప్పుడు గుర్తు చేయడానికి సత్యవతమ్మ సందేహించింది. నవ్వి ఊరుకుంది. శాస్త్రికి తాను పుట్టిన ఊరు ముంగండంటే వెర్రి అభిమానం. ఆ ఊరు ప్రసక్తి వచ్చినప్పుడు ఏమాత్రం నిగ్రహించుకోలేడు. శివాలెత్తిపోతాడు. ఎదుటివాడికి విసుగు కలుగుతుందేమోననే ఆలోచన కూడా రాదు. కొబ్బరి, అరటి తోటల మధ్య, తూర్పు పడమరలుగా, దక్షిణోత్తరాలుగా వెళ్ళే రెండు రోడ్లకీ సంఖ్యానది అనే గోదావరి పాయ [ఇప్పుడిది మురుగు కోడుగా ఉపయోగిస్తోంది]కీ మధ్య ఉన్న ముక్కోణాకారపు వైశాల్యంలో తీర్చిదిద్దినట్లు కట్టిన ఊరు. విశాలమైన వీధులు. పెద్ద మంచినీళ్ళ చెరువు. చెరువు గట్టు మీద రావిచెట్టు నీడలు. ఆ నీడల్లో వారాల విద్యార్థుల వ్యాకరణ పఠనలూ, వేదఘోషలు. పండిత పరివేష్ఠనలు. తాను విన్నవి, చూసినవి ఇంకా ఏ మార్పూ లేకుండా అదే విధంగా కొనసాగుతున్నట్టు చెప్పుకుపోతాడు. మురిసిపోతాడు. కొత్తగా ఆ ఊరు చూసి వచ్చిన వాడికి అదంతా వట్టి కోతలుగా కనిపిస్తుందేమోనన్న అనుమానం కూడా ఉండదు. ఆ సంగతులు చెప్పేటప్పుడు ఆయన ముఖాన కనిపించే దీప్తీ, కళ్ళలో అగుపించే మిలమిలలూ ఆశ్చర్యం కలిగిస్తాయి. హఫీజు మహమ్మదు బహు తెలివిగా శాస్త్రి బలహీనతను ఉపయోగించుకొని, ముందుకాళ్ళకు బంధం వేశాడనీ, నోరు మెదపకుండా చేశాడనే, శాస్త్రే ఎన్నోమార్లు తన వృద్ధ మిత్రుని కుట్ర బుద్ధికి తార్కాణం చూసి గలగలా నవ్వాడు--ఈ ఏడాదీ ఈ మధ్య కాలంలో. హఫీజు కూడా తన కొంటి ఎత్తులు తలుచుకుని విరగబడి నవ్వాడు. ఒకరోజున మిత్రులిద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. హఠాత్తుగా హఫీజు మహమ్మదు ప్రశ్నించాడు "శాస్త్రీ సాబ్ ముంగండ ఎక్కడుంది?" "కోనసీమ నడిబొడ్డులో ఉన్న ఊరు. అంత అందమైన ఊరును మీరెక్కడా చూసి ఉండరు." హఫీజు ఎంతో ఆనందం కనబరిఛాడు. "ఆ, అలాగా!"లతో శాస్త్రికి బాగా పురి ఎక్కించాడు. ఒకమారు అటువంటి ఊరును చూడవలసిందే నన్న దృఢ నిశ్చయం తెలిపాడు. "తప్పకుండా, దానిదేముందీ? నాలుగు రోజులు వెసులుబాటు చూసుకుని కారులో పోయొద్దాం." "జగన్నాథ పండితరాయలది ఆ ఊరేనట కదా! ఆయన పుట్టి పెరిగిన ఇల్లో, కనీసం దాని గుర్తుగా ఓ దిబ్బో ఏమన్నా ఉన్నాయా?" జగన్నాథ పండితరాయలు పేరు చెప్తే ముంగండ వాళ్ళ నాలిక కథాకళి నృత్యమే చేస్తుంది. ఆయన్ని గురించి ప్రచారంలో వున్న కథలు నిజమయి, ఆయన జీవితం అలాగే సాగి ఉంటే, ఆ మహా పండితుడు బతికి తన ఊరు రావడం సాధ్యమే అయితే, ఆయన కీవేళ ముంగండలో మంచినీళ్ళయినా పుట్టవు. అయితే ఆయన చచ్చిపోయే రమారమి నాలుగు వందల ఏళ్ళు గడిచిపోయాయి. ఆయన తిరిగి వచ్చి మంచినీళ్ళు అడిగే ప్రమాదం ఏ మాత్రం లేదు. కనుక వాళ్ళు ఆయన అనాచారాల్నీ, వెకిలి పనుల్నీ గొప్పతనంగా వర్ణించి ఆనందించగలుగుతున్నారు. ఆ విషయంలో శాస్త్రి శుద్ధ ముంగండవాడు. "పండితరాయలది ముంగండ అనడమే గాని, ఆయన వంశం వాళ్ళమని చెప్పుకొనే వారెవ్వరూ లేరక్కడ. ఆయన ఇంటిపేరుతో కొన్ని కుటుంబాలున్నాయి. కాని, ఆయన ఇల్లు ఇక్కడుండేదని చెప్పే ఓ మట్టి దిబ్బయినా లేదు" అని నిజం జెప్పేశాడు శాస్త్రి. అయితే పండితరాయల్ని గురించి కథలు చెప్పడానికి ఇవేవీ ఆటంకం కావు. అచ్చ తెనుగులో చెప్పవలసివస్తే "ఈ తురక పిల్లని పక్కలోకి తెచ్చుకొంటేనా?" అంటూ లొట్టలు వేయడంగానే భావించవలసిన అనౌచిత్యాన్ని రాగయుక్తంగా సంస్కృత శ్లోకంలో శాస్త్రి వినిపిస్తాడు. ఆ ముస్లిం పడుచు కోసం ఆయన తోడి పండితుల్ని వ్యతిరేకం చేసుకున్న కథలు వినిపిస్తాడు. హఫీజు మహమ్మదు హుక్కా పీలుస్తూ కన్నులరమోడ్చి శాస్త్రి చెప్తున్న కథలన్నీ విన్నాడు. ఆ గాధల్లో వినిపించే రసికతకుగాక, వినిపించే మానవతకు జోహారులర్పించి, ప్రసంగాన్ని తనకు అవసరమైన ధోరణికి మళ్ళించాడు. "మహా జ్ఞానులు! మత భేదాలకూ, కుల భేదాలకూ వెనుక వున్న మానవతను వారు మరవలేదు." చంద్రశేఖర శాస్త్రి ఒప్పుకున్నాడు. "మనుష్యుణ్ణి తెలిసేందుకు సంకేతంగా ఒక్కొక్క భాష ఒక్కొక్క పదాన్ని ఎన్నుకొంది. 'మేన్' అన్నా 'మానవ!' అన్నా, ‘ఆద్మీ' అన్నా మనకు తోచే రూపం ఒక్కటే. రెండు కాళ్ళ మీద నిలువునా నిలబడి, బడబడ మాట్లాడగల ఆకారమే తోస్తుంది. చేతులు, మెడ, తల, ఒక ప్రత్యేక విధమైన శరీర నిర్మాణం కనబడుతుంది. నలుపు తెలుపులు, పొట్టీ పొడుగులు, కళ్ళ రంగులు, జుట్టు రంగులు, అవకరాలు--ఇవేమీ గణనకు రావు. అలాగే ఈ ప్రపంచ గతి కంతకూ సూత్రధారిగా ఏదో శక్తి వున్నదనే భావన కూడా. ఆ భావన ఒకే రకం. కాని, దానికిచ్చిన పేర్లు, సంకేతాలు భిన్నం. "ఏకో దేవో కేశవోవా శివోవా" అన్నాడు భర్తృహరి అనే కవి. హరిహరులకు ఏకాధ్యవసాయం చేశారు తిక్కయజ్వ 'రామ రహీం'--అంటూ ఆ ఆలోచనకు మరింత వైశాల్యం ఇచ్చాడు కబీరు..." "హాఁ, హాఁ, ఖూబ్! సచ్ హై!" మొదలైన మెచ్చుకోలు మాటలతో హఫీజు శాస్త్రిని హుషారు చేస్తూ వచ్చాడు. శాస్త్రి ఆ హుషారులో కొట్టుకుపోయాడు. "శంకర భగవత్పాదులు అక్కడితో ఆగలేదు. ఆత్మ--పరమాత్మలకు అద్వైతభావం కల్పించి పరమాత్మ అంటే ఎవరో కాదు 'సోహం'--‘వాడే నేను నేనే వాడు’ అన్నారు. అక్కడ నేను అన్నది ఆయన ఒక్కరేనని కాదు. ఆలోచించగల ప్రతి మానవుడూ నని గాని..." చాలామంది ముంగండ వాళ్ళకిలాగే శాస్త్రికి కూడా జగన్నాథ పండితరాయల గురించిన శృంగార గాథలు తెలిసినంతగా మత భేదాలకు అతీతమయిన మానవతాదృష్టి నాయన ఏ విధంగా ప్రదర్శించేరో బాగా తెలియదు. అయినా అసఫ్‌జా విలాసం, అల్లోపనిషత్తు పేర్లు మరిచి పోలేదు. ఆ గాథల మధ్య హఫీజు అసలు విషయాన్ని బయట పెట్టాడు. "శాస్త్రిజీ! అసదుల్లా ఆనర్సు పూర్తి అయ్యాక అక్కడే డాక్టరేట్‌కు." అసదుల్లా తెలివి తేటలమీద శాస్త్రికి చాలా మంచి అభిప్రాయం వుంది. అభినందించాడు. "మంచి ఆలోచన." "అయితే, శాస్త్రీజీ! అందుకు మీ సహాయం అవసరం ఉంటుందనుకొంటున్నాడు." బి.ఏ. మాత్రమే చదువుకున్న తాను డాక్టరేట్ చేయదలచిన అసదుల్లాకు ఏ విధంగా సాయపడగలుగుతాడో ఊహకు అందకపోయినా, వాగ్దానం చెయ్యడానికది ఆటంకం కాలేదు. "దాని దేముంది?" అప్పుడు చెప్పాడు హఫీజు--ఆ సహాయం ఏమిటో, ఎటువంటిదో. అసదుల్లా అద్వైతం మీద డాక్టరేట్ చెయ్యాలని ఆలోచిస్తున్నాడు. దానికై సంప్రదాయబద్ధమైన పరిజ్ఞానం సంపాదించడం కోసం శంకరుడు రాసిన సూత్రభాష్యం గురుముఖతః చదవాలనుకొంటున్నాడు. అందుకు శాస్త్రియే సమర్థుడని విన్నాడు. ఆయన శిష్యరికం చేయగోరుతున్నాడు. శాస్త్రికి వాగ్బంధం జరిగిపోయింది. సూత్రభాష్యం మతాంతరుడికి పఠన పాఠనాలు జరపవచ్చునేమో ఎప్పుడూ ఊహించుకోలేదు. కాని సంప్రదాయం ప్రకారం అది తప్పు అనిపిస్తోంది. కాని ఒక్క క్షణం క్రితం వరకు చెప్పిందేమిటి? తన ఊరివాడు, తన శాఖవాడు మహా పండితుడు అని ఎంతో గొప్పగా చెప్పుకున్న మాన్య పండితుడికి లేని పట్టింపును తానిప్పుడేమని చెప్పగలడు? ఆయన షాజహాన్ పెద్ద కొడుకు దారా షికోకు స్నేహితుడే కాదు. ఆయనకు ఉపనిషత్తులు పాఠం చెప్పాడు. వారిద్దరూ కలిసి ఆ ఉపనిషత్తులను పారశీక భాషలోకి అనువదించారన్నాడు. అలాంటిది, తానేమని అభ్యంతరం చెప్పగలడు? "ఆలోచిద్దాం. ఇంకా వ్యవధి వుంది గదా!" అని అప్పటికి సాచివేశాడు. హఫీజు మహమ్మదు కూడా మరి ఆ విషయాన్ని ఎత్తలేదు. ఆయనకు శాస్త్రి ఛాందసాలు కొన్ని తెలుసు. ఆలోచించుకోడానికి వ్యవధినిస్తూ ఊరుకున్నాడు. 22 కాని, ఆ సాచివేత ఎంతోకాలం సాగలేదు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే చదువుతున్న తన ఆఖరు కొడుకుతో కలసి అసదుల్లా ఆ ఏడాది ఆఖరులోపున రెండు మూడు సార్లు శాస్త్రి ఇంటికి వచ్చాడు. ఆయనతో అసలు విషయం ఎత్తక పోయినా ఆ జ్ఞాపకం కలిగిస్తూ వచ్చాడు. వాళ్ళిద్దరూ ఒక ఈడువాళ్ళు కాలేజీల వరకు సహపాఠకులు, చిన్నప్పటి నుంచి తమ ఇంటికి రాకపోకలు వున్నవాడే. వచ్చినప్పుడు శాస్త్రితోనూ, కబుర్లు విడెయ్యడం అలవాటున్నవాడే, అందులోనూ విశేషం లేదు. కాని హఫీజు ప్రస్తావన దృష్ట్యా తన ఆలోచనను త్వరితపరచడం కోసమే అతడు వస్తున్నట్లనిపించింది. చివరకు ఓ రోజున ఆ ఆలోచనను తెంచుకోక తప్పలేదు. "ఒక మతం వాడు మరో మతం ప్రాతిపదికను తెలుసుకోవాలనుకోవడం తప్పా? పైగా గీత భాష్యాన్ని మతం అనడంకన్నా ఒక తాత్విక దృక్పథంగా భావించడం న్యాయం కాదా?" వంటి ప్రశ్నలు తెచ్చాడు అసదుల్లా. తాత్వికాలోచనకు మత ప్రాతిపదికకూ భేదం, అంతరం లేని సమాజం హైందవ సమాజం. ఆ ఆలోచనే తోచలేదు శాస్త్రికి. ఎప్పుడూ ఆలోచనలో పడ్డాడు కాని ప్రశ్న వేయక మానలేదు. "తెలుసుకోవడంలో తప్పేంలేదు. కాని అందుకు ముందు తన మతాన్ని గురించిన ప్రాథమిక పరిజ్ఞానమేనా కలిగి ఉన్నప్పుడు కదా ఇతర మతాల్ని గురించీ, వారి తాత్విక దృక్పథాన్ని గురించీ తెలుసుకోవడంలో ప్రయోజనం?" అసదుల్లా ఆ సూచనను అందుకోదలచలేదు. "ఏ మతాన్ని అనుసరించాలో నిర్ణయించుకోదలచినవారికి మీరు చెప్పిందాని ప్రయోజనం. కంపేరిటివ్ స్టడీ చేయదలచినా అవసరమే." "మరి నీ ఈ ప్రత్యేక శ్రద్ధ ఎందుకు?" అసదుల్లా ఒక్కక్షణం ఆలోచించాడు. "మతాభిమానం మాత్రం కాదు, చాచాజీ! ఒక విధంగా చెప్పాలంటే మత దురభిమానం యెడ అసమ్మతి గానే ఈ ఆలోచన మొదట కలిగింది". శాస్త్ర్రి సాకూతంగా కనుబొమలు ఎత్తాడు. అసదుల్లా తర్వాత మాట చెప్పడమా, మానడమా అని చటుక్కున ఆగాడు. శాస్త్రి చిరునవ్వుతో "ఊఁ, ఆగావేం?" అన్నాడు. ఆయనకు తెలుసు అసదుల్లా నిరీశ్వరవాది. తమ ఇంట కొడుకులూ, కూతుళ్ళూ నలుగురూ ఏ పండుగలకో కలిసినప్పుడు ఏదోరూపంతో, భౌతిక ఆధ్యాత్మిక వాదాల చర్చన వస్తూంటుంది. మనుష్యుని అల్పత్వాన్ని అల్పజ్ఞత్వాన్ని చూపించి దైవాన్ని దైవలీలల్ని వివరించడానికి శృతులూ, స్మృతులూ, ధర్మశాస్త్రాలూ ఉదాహరిస్తూ ఓ రోజున వాదాలలో తానూ కలిశాడు. ఆనాడు అసదుల్లా ఎదుర్కొన్న తీరును, తానూ ఎన్నటికీ మరువలేడు. ఆ వాదం నేటికీ చెవులలో ప్రతిధ్వనిస్తూంది. "మన అజ్ఞానం దేవుడున్నాడనడానికి కారణం అయితే దేవుడు అజ్ఞానంతో పుట్టాడనాలి. అజ్ఞానంలో నివసిస్తున్నాడనాలి. ఈనాడు శాస్త్రవిజ్ఞానం పలు ముఖాలుగా వ్యాపించి దాన్నే రుజువు చేస్తోంది. శాస్త్ర పరిశోధనలు దేవుడి మాన్యాల నుంచి ఎంతెంతో భూమిని స్వాధీనం చేసుకుంటున్నాయి. ఆయన మూలమూలల కొదుగుతున్నాడు. అయినా మీరు ఆ మూలల్నే చూపించి, దేవుని ఆధిక్యానికి నిదర్శనం అంటున్నారు. అంతకంటే దేవుడు లేడనడానికి వేరే బలం ఏం కావాలి?" ఏమి ఉపనిషత్తులు? మహర్షుల దూరదర్శన, దూరశ్రవణాది సిద్ధుల్ని అందరి లాగే తానూ ఆస్తికత్వాన్ని సమర్ధించడానికి ఉదహరిస్తే నవ్వేశాడు. "దాదాజీ? మీ దేవుడు శుద్ధ దురభిమాని. అటువంటి శక్తి నాయన తన్ను భజన చేసిన వాళ్ళకే కలిగించాడు. కాని ఈ వేళ శాస్త్రజ్ఞానం రేడియో, టీ.వీ.ల ద్వారా ఆ ప్రజ్ఞను రిక్షావాడికి కూడా కలిగిస్తూందే!" తాను తెల్లబోయాడు. మొదట కోపం వచ్చింది. "వితండ వాదం" అన్నాడు. కాని, తరువాత తన వాద లోపం కనిపించి ఫక్కున నవ్వాడు. ఆస్తికత్వానికీ, మహత్వ ప్రదర్శనకి ముడిపెడితే వచ్చే ప్రమాదం అర్ధం చేసుకున్నాడు. లేకుంటే ఆస్తికత్వాన్ని నిరూపించడం ఎలాగ? అని తనకే పెద్ద సమస్య తెచ్చి పెట్టాడీ పడుచు వాడు! అటువంటి మనిషి తానూ నాస్తికుడనని గంట మోగించడం అవసరమా అని తటపటాయిస్తూంటే నాస్తికుడికి సూత్రభాష్యం చెప్పడమా అనే సందిగ్ధంలో పడ్డాడు శాస్త్రి. ఎంత మైత్రీ ఎంత గౌరవమూ ఉన్నా మతాంతరుడికి సూత్రభాష్యం పాఠం చెప్పవచ్సునేమో ఎంత ఆలోచించినా తెగలేదు. సంప్రదాయ దృష్ట్యా అది అకార్యకరణం అనిపిస్తూంది. వెనుక ఆధారం ఏమాత్రం వున్నా ఈ అనాచారం నెత్తిన పడకుండా తప్పేది కదా అనుకున్నాడు పదిసార్లు. ఉంటే – అన్న ప్రశ్న ఏమిటి? లేదు కనుకనే అరవయ్యయిదేళ్ళు వచ్చినా, విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేదనుకుంటాడు. ఇంకా చదువుకోవలసిన, పెళ్ళిళ్ళు కావలసిన, పిల్లలున్నారు. కుటుంబ పరిస్థితులన్నీ తిరగేసుకున్నాక హాఫీజ్ మహమ్మదు అభ్యర్ధనను తోసిపుచ్చి, ఆ వృద్ధమిత్రుడికి కష్టం కలిగించడం తెలివైనపని అనిపించలేదు. పండిత రాయలంతటివాడు ‘ఢిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ ఎవరైతేనేం కోరికలు తీర్చడం ప్రధానం అనుకున్నప్పుడు తనదేముంది? తానెంతవాడు? అలాగని వెంటనే సర్దుకోనూ లేకపోయేవాడు. ఆఖరు నిముషం వరకూ ఈ అనాచారం నుంచి తప్పించుకునేందుకు ఎన్నో మెలికలు వేస్తూనే వచ్చాడు. నూత్ర భాష్య పఠన, పాఠనాలు అశుచిగా సాగించరాదు. అంటే తానే కాదు, అసదుల్లా కూడా శుచి నియమాలు పాటించాలి. అతడికి ఆ చదువేదో తన ఇంటి వద్దనే చెప్తాడు. అసదుల్లా శుచీ స్నాతుడై ధవళ వస్త్రాలు వేసుకు రావాలి. తాను దేవుని గదిలో ఉండి పాఠం చెప్తాడు. శిష్యుడు గది బయటనే ఉండాలి. ఇవన్నీ హిరణ్యాక్షవరాలేనని శాస్త్రి భావన. కొన్ని లక్షల ఆస్తికి ఏకైక వారసుడైన అసదుల్లా ధనగర్వంతో శాస్త్రినే తన ఇంటికి వచ్చి చెప్పమంటాడనుకున్నాడు. చెప్పనంటే? – తర్వాత ఏమవుతుందనే విషయం మీద శాస్త్రి మనసు పోలేదు. అరేబియా ఎడారిలోనూ కుర్దిస్తాన్ కొండలలోనూ జీవించిన తమ పూర్వులు నీళ్ళు దొరక్క వారానికోమారు స్నానంతో తృప్తిపడ్డారో, ఏమో – వాళ్ళ సంతతులు జల సమృద్ధిగల భారతదేశం వచ్చాక కూడా అక్కడి అవసరాన్ని ఇక్కడి ఆచారంగా పాటిస్తున్నారు. శరీరపు గౌలను అణిచేందుకు అత్తరులో తడిసిన వత్తిని చెవి మడతలలో దోపి సంతృప్తి పడుతున్నారు. ముసలి హాఫీజ్ వరకూ ఉన్న ఈ అలవాటును అసదుల్లా ఒక్కమాటు మార్చుకోగాలడా? ఇక ఆఖరుది బ్రహ్మాస్త్రమనే అనుకున్నాడు – ‘చదువు చెప్పేటప్పుడు నీ ముఖం కూడా కనబడకూడ’ దనడం కన్నా పెద్ద అవమానం ఉండదనీ, నోటితో చెప్పకుండా పొమ్మన్నట్లే అవుతుందని ఆయన ఊహ. అయితే ఆయన అంచనాలన్నీ తల్లక్రిందులయిపోయాయి. పాఠం కోసం వచ్చిన ఆ యువకుణ్ణి బాగా ఎరిగినవాళ్ళే ముస్లిం అనుకోలేదు. కారు దిగి వచ్చి శాస్త్రిగారి కోసం వాకబు చేస్తుంటే ఉమ కూడా అతన్ని గుర్తు పట్టలేదు. "కూర్చోండి. నాన్నగారు జపం చేసుకుంటున్నారు. అయిపోవచ్చింది." ఆమె కుర్చీ చూపిస్తూంటే అసదుల్లా ఫక్కున నవ్వాడు. ఆమె తెల్లబోయి తేరిపార చూసింది. "మీరా? ఏమిటీ వేషం?" అతడు బిళ్ళగోచీ పెట్టి పంచె కట్టాడు. సన్నని లాల్చీ, పైన ఉత్తరీయం. "భాష్యం చెప్పించుకోడానికి." ఉమ తండ్రిని పిలిచింది. పాఠానికని వచ్చిన శిష్యుణ్ణి చూసి, శాస్త్రి పరాజయం అంగీకరించాడు. గురువుకూ, గురుపత్నికీ తెచ్చిన బహుమతుల్ని చూసి ‘ఓరి పిడుగా!’ అనుకున్నాడు. గంపతో ఇన్ని బత్తాయిలూ, ఆపిల్సూ తెచ్చి డ్రైవర్ వారి ముందుంచాడు. శాస్త్రి ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. "ఏమిటిది? ఇవన్నీ ఎందుకు?" ఉమ సమాధానం ఇచ్చింది. "శూన్య హస్తేన నోపేయాత్!" అసదుల్లా ఆమెకు థాంక్స్ చెప్పాడు. గురుపత్నికి చీర ఇవ్వడానికి ఉమా బెహన్ సహాయం కోరాడు. శాస్త్రి ఇంక ఆఖరు ఎత్తుగా శిష్యుణ్ణి బెదరకొట్టడానికి ప్రయత్నించాడు. పాఠం తెమలనివ్వలేదు. ఒక్కొక్క పదాన్నే ఎత్తుకుని వివిధ వాక్యార్ధాలు, శ్లేషార్ధాలూ, పూర్వపక్ష సిద్ధాంతాలూ వివరిస్తూ, ఎక్కడెక్కడికో, ఏయే దర్శనాలూ, శాస్త్రాలలోకో తీసుకుపోయి తిప్పి తిప్పి తీసుకురావడం ప్రారంభించాడు. ఆ గహనాతి గహన విహారాలకు అసదుల్లా మొదట కంగారు పడ్డాడు. అర్ధం కావడం లేదన్నాడు. జ్ఞాపకం ఉండడం లేదని భయపడ్డాడు. అయినా వదలలేదు. నిలదొక్కుకున్నాడు. ఓ వారం అయ్యేసరికి ఫర్వాలేదనుకున్నాడు. పది రోజులకి శాస్త్రి మెత్తబడ్డాడు. శాస్త్రి మంచి పండితుడు. మంచి బోధకుడు కూడా. మొదట ముఖవిధానం చెయ్యాలని ప్రారంభించినా చేతకాలేదు. కొంచెం చాదస్తమే చూపించాడు. పాఠం చెప్పడంలో చెయ్యాలన్నా మోసం చెయ్యలేడు. సెలవులాఖరున వాల్తేరు వెడుతూ అసదుల్లా సెలవు తీసుకోవడానికి వచ్చినప్పుడు శాస్త్రి సంతోషంతో ఆశీర్వదించాడు. అతనికి తెలివి, పట్టుదల ఉన్నాయి. అవి రెండూ శాస్త్రికి తృప్తి నిచ్చాయి. అవన్నీ జరిగి ఇంకా మూడు నెలలు కాకపోయినా, ఏళ్ళు గడిచినట్లనిపిస్తోంది. ఆ ఘటనలు గుర్తు వచ్చి శాస్త్రి ఒక్క నిట్టూర్పు విడిచాడు. "నా అనాచారం, అబ్రాహ్మణ్యం నా నెత్తికొట్టింది!" అనుకున్నాడు. * * * * * శాస్త్రి రిక్షా దిగుతూండగా మేడ మీది నుంచి చూసి హాఫీజ్ మహమ్మదు ఆయనకు ఎదురు వచ్చాడు. తీసుకెళ్ళి ఆయన కోసమేనన్నట్లు లేడి చర్మం పరచిన బల్లమీద కూర్చుండ బెట్టాడు. "ఆయీయే, తష్‌రీ్‌ఫ్ రఖియే!" ఆయన కెదురుగా అంతదూరాన బల్లమీద పరచిన పరుపులతో బాలీసు నానుకుని తాను కూర్చున్నాడు. ఆ వృద్ధుడు చూపుతున్న మర్యాద, ఆప్యాయం చూశాక, దారిలో వస్తూ తాను అడిగెయ్యాలనీ, కడిగెయ్యాలనీ, దులిపెయ్యాలనీ తయారు చేసుకున్న మాటలేవీ శాస్త్రికి జ్ఞాపకం రాలేదు. ఇంకెలా ప్రారంభించాలో కూడా సాధ్యం కాలేదు. ఒకరి మొగం ఒకరు చూసుకుంటూ కొంచెం సేపు కూర్చుండిపోయారు. హాఫీజ్ మహమ్మద్ ప్రారంభించాడు. "శాస్త్రీజీ! తమరు వచ్చిన కారణం తెలుసు ననుకుంటున్నాను. ఒకవిధంగా తమ రాక కోసం కనిపెట్టుకునే ఉన్నానని చెప్పవచ్చు, చాలా ఆశ్చర్యం. ఎంతో సంతోషం, ఆందోళనా కలిగించే వార్త వచ్చింది. పర్యవసానాలు ఎలా ఉన్నా." శాస్త్రి ఏమీ మాట్లాడలేదు. నోరు విప్పితే ఏడుపు వచ్చేలా ఉంది. కళ్ళనీళ్ళు కనబడకుండా రోడ్డుకేసి తిరిగి, రావి మీద గోల చేస్తున్న పక్షులకేసి చూస్తున్నాడు. "ఈవేళ టపాతోనే వచ్చింది." శాస్త్రి తిరిగి చూశాడు. హాఫీజ్ మహమ్మదు బాలీసు కింది నుంచి తీసిన కవరు తనకు వచ్చినటువంటిదే! చూశానన్నట్లు తల ఆడించాడు. తనకూ అటువంటిదే ఒకటి వచ్చినట్లు సూచనగా కోటు జేబు తట్టుకున్నాడు. అంతా సంజ్ఞలతోనే నోరు విప్పితే ఏడుపు వచ్చేసేలా వుంది. కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి. హాఫీజు ఆయన పరిస్థితికి సానుతాపం తెలిపాడు. "శాస్త్రీజీ! తప్పుగా భావించకండి. నన్ను అర్ధం చేసుకోండి. మీ కులాచారాలకు అవమానంగా భావిస్తారనీ, మీ మనసుకు బాధ కలుగుతుందనీ మాత్రమే విచారిస్తున్నాను." చంద్రశేఖరశాస్త్రి భుజాన ఉన్న కండువాతో ముఖం దాచుకున్నాడు. తమ మానసికోద్వేగాల్ని అదుపులో పెట్టుకునేందుకన్నట్లు ఉభయులూ కొద్దిసేపు ఆగారు.... మళ్ళీ హాఫీజ్ మహమ్మద్ ప్రారంభించాడు. ఉమ యెడ తనకున్న ప్రేమనంతటినీ ఒక్క వాక్యంతో వెలిబుచ్చాడు. "మాకీ వృద్ధాప్యంలో ఉమ వంటి దేవత ఆసరా దొరుకుతుందంటే మాకు అంతకన్నా వాంఛనీయం వేరే ఏం ఉంటుంది." శాస్త్రికి తెలుసు. మూడేళ్ళ వయసులో ఓనాడు మారాం చేసి తండ్రితో ఆయన ఆఫీసు కెళ్ళింది. తన సంతానంలో ఆమె ఆఖరుది. అందుచేత విపరీతమైన ముద్దు. ఆయనకే కాదు, ఆ రోజున ఆఫీసులో అందరినీ ఆకట్టుకుంది. హాఫీజ్ మహమ్మద్ కారులో తన ఇంటికే తీసుకెళ్ళాడు. చక్కని గౌను కొని అలంకరించాడు. ఆనాడు మొదలు ఉమ హాఫీజ్ మహమ్మద్ ఇంటికి కూడా బిడ్డ అయింది. అయన్ని ‘దాదాజీ’ అని పిలుస్తుంది. తమ ఎవరివద్దా చేయనంతగా గారం చేస్తుంది ఆయన బీబీ వద్ద. అన్నీ తెలుసు. కాని, ఇదెలాగ? శాస్త్రి ఒక్క మాటలో ముసలివాని కోరిక తన కెంత భయంకర విషయమో చెప్పేశాడు. "అది మా కుటుంబానికెంత మచ్చ? కట్టకట్టుకుని కృష్ణలో దిగడం కన్నా గత్యంతరం ఉందా?" అర్ధమయిందన్నట్లు హాఫీజ్ మహమ్మద్ తల ఊపాడు. శాస్త్రి ఆచారపు పట్టుదల ఆయనకు తెలుసు. ఆఫీసుకు వచ్చేటప్పుడు మంచినీళ్ళు కూడా తెచ్చుకుంటాడు. అవి అయిపోయినా, మైలపడినా అంతే! మరి ఎవరిచేతి నీళ్ళూ ముట్టుకోడు. గొంతు ఎండినా సరే, ఇంటికెళ్ళాలి. స్నానం, సంధ్య కావాలి. అంతవరకూ ఏమీ నోట పెట్టడు. అది ఆయన నియమం. ఒక్కొక్కప్పుడది ప్రాణాంతకంగా పరిణమించిన ఘట్టమూ లేకపోలేదు. అందులోనూ ఆయన పనిచేస్తున్నది విదేశీ వ్యాపారం చేస్తున్న కంపెనీలో. ఆఫీసులో ఆయన కింద పనిచేసే వాళ్ళకే ఎన్నోమార్లు తామసం కలిగింది. కాని ఆయనలోని అసాధారణ మానవ ప్రేమా, నిష్కాపట్యం ఆయన ఆచారాల్నీ, పట్టుదలల్నీ గౌరవ భావంతో సహించేటట్లు చేశాయి. అన్నీ ఎరిగి ఉన్న హాఫీజ్ ఆ మాటను సహించాడు. లేకుంటే మీతో సంబంధం చేయడంకన్నా కృష్ణలో దిగి ఆత్మహత్య చేసుకోవడం మేలు అన్నమాటను ఎవరూ గౌరవంగా భావించలేరు. హాఫీజ్‌కు కూడా ఆ మాట అవమానం కన్న అనుతాపాన్నే కలిగించింది. బ్రాహ్మల మనుకునే వారిలోనే సవాలక్ష భేధాలున్నాయని హాఫీజ్ ఎరుగును. విష్ణువును కొలిచేవారూ, శివుణ్ణి కొలిచేవారూ, ఉన్నారు. వీరికి భిన్నంగా స్మార్తులంటూ ఉన్నారు. వీరంతా హిందువులే నంటారు. కాని ఆ ముగ్గురి మధ్యా ఇచ్చిపుచ్చుకోవటాల మాట అటుంచి కలిసి భోజనం కూడా చేయరని శాస్త్రే ఆయనకు చెప్పాడు. అలాంటిది తాను హిందువేనా కాదు, ముస్లిము. "శాస్త్రీజీ! తమ కుటుంబం అవమానాలపాలు కావడమూ, ఆపదలలో చిక్కుకోవడమూ నా కభిమతం కాదు. ఈ ఘటన మీ కిష్టం కాదు. కనుక ఇలా జరగరాదనుకుంటున్నాను. కాని, ఇదెలా జరిగింది? నా కర్ధం కావడం లేదు." హాఫీజ్ తన ప్రశ్నకు సమాధానం కోరి ఉండలేదు.అయితే దీనికంతకూ ఆయన వెనుక మద్దతు ఉన్నదేమో నన్న అనుమానం తొలగని శాస్త్రి చటుక్కున అనేశాడు. "తమరే చెప్పాలి." తానేమీ చెప్పలేనన్నట్లు హాఫీజ్ తల తిప్పాడు. ఇద్దరూ ఒక్క నిముషం నిశ్శబ్దంగా కూర్చున్నారు. మళ్ళీ హాఫీజ్ ఎత్తుకున్నాడు. "ఈ వేళ ఆగస్టు పద్నాలుగు. రేపు సాయంకాలమే..." సుముహూర్తం--అన్నమాటను చటుక్కున మింగేశాడు. ఆ మాట చెవిని పడకపోయినా మనస్సుకు తగిలి శాస్త్రి ఉలిక్కిపడ్డాడు. బెజవాడ--వాల్తేరుల మధ్య దూరం మూడువందల ఏభై కిలోమీటర్లే. ప్రభుత్వం ధర్మమా అని త్వరితంగా చేర్చే బళ్ళు కూడా ఓ పుంజీడున్నాయి. కాని చోటు దొరకదు. వేళకి నడవవు. ఈ ఆదుర్దా మూలంగా తాను ప్రయాణం చేయగలనా అన్న అనుమానం--భయం పట్టుకున్నాయి. హాఫీజ్ మహమ్మదు చకచకా అందుకున్నాడు. ఫోన్ మీద ఫస్టు క్లాసులో టిక్కెట్టు కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. అసాధ్యమనే మాట వినబడుతోంది. "ఇంక రైల్వే అధికారులను మొహమాటపెట్టక తప్పేలా లేదు. అక్కడా లాభం లేకపోతే నా కారు తీసుకు వెళ్ళండి, మీ కుల ధర్మాలు భంగం కావడం నాకిష్టం లేదు." శాస్త్రి ఏమీ అనలేదు. చూస్తూ కూర్చున్నాడు. రైల్వే అధికారుల్ని అందుకునే ప్రయత్నం చేస్తూనే తన ఆఫీసుకు ఫోన్ చేసి క్యాషియర్‌ను పిలిచాడు. "నా ఖాతాలో రాసి రెండువేలు వెంటనే పంపండి." ముప్పయేళ్ళపై నుంచి పని చేస్తున్న శాస్త్రి వద్ద చేతిలో నూరు రూపాయలు కూడా ఉండవని హాఫీజ్ ఎరుగును. ఇస్తున్న పది--పన్నెండు వందలూ, ఏమవుతున్నాయో యని ఆయనే అనేకసార్లు ఆశ్చర్యం వెలిబుచ్చాడు. డ్రైవరును పిలిచాడు. "పెట్రోలు, ఆయిలు నింపుకొని కారు గుమ్మంలో పెట్టు. జల్దీ ఆనా!" సలాము కొట్టి సత్తారు వెళ్ళాడు. ముసలివాడు ఏ మాత్రం తత్తరపడకుండా ముందే ఆలోచించుకున్నట్లు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుపోతుంటే శాస్త్రి నిశ్శబ్దంగా చూస్తూ కూర్చున్నాడు. మనసులో ఆశ్చర్యం, అనుమానం మార్చి మార్చి కలుగుతున్నాయి. అయితే ఇప్పటి అనుమానం స్వభావం వేరు. హాఫీజ్ మహమ్మదు ప్రోత్సాహం ఆహ్వాన పత్రికకు వెనుక బలం అనే అనుమానం ఇప్పుడు లేదు. అది స్పష్టమయింది. ఈ మారు కలుగుతున్నది, దానికి ప్రత్యక్ష విరుద్దమైనది. ఉమతో తన మనుమడి జీవితం ముడిపడడం ఆయనకూ ఇష్టం కాదేమో! తాను నిర్ధనుడు. ఆయనకింద జీతానికున్న మనిషి. ధనం, హోదా పరిపాలన సాగిస్తున్న కాలంలో ఉమ నాసిగా కనిపిస్తూండవచ్చు. తనకు మెహర్భానీ చేస్తున్నట్లు ఇదంతా నటన కావచ్చు. తనకు కలగగల నష్టాన్ని సవరింపచేసేందుకే తన్ను ఉపయోగించుకోదలచాడేమో! తాను నీచంగా భావించే సంబంధం కూడా తనను అవాంఛనీయమని భావిస్తున్నారన్న ఆలోచనతో మనస్సు కొంతసేపు వ్యాకుల పడింది. దీనితో కొత్త భయం మరొకటి వచ్చి పడింది. ఈ వివాహ ప్రయత్నం హాఫీజ్‌కు తెలియదు. బహుశా ఇష్టమూ వుండదు. అయినా ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. అంటే--అసదుల్లా తగిన బందోబస్తుతో ఉండి ఉంటాడు. బ్రహ్మత్వం స్థానికుడైన ఒక అడ్వొకేట్‌ది. అందులోనూ ఆయనకు విప్లవవాదియైన రచయితగా విద్యార్ధి వర్గంలో మంచి పేరున్నదని ఉమే చెబుతూండేది. సంస్కరణ వివాహాలు జరిపించేటప్పుడు వీరేశలింగం పంతులుగారు పోలీసుల మీద కన్నా విద్యార్ధుల మీద ఎక్కువ భరోసా ఉంచినట్లు తాను చదివాడు. అవన్నీ గుర్తు వచ్చాయి. అన్ని కట్టుదిట్టాలు చేసికొని ఉండి ఉంటారు గనుకనే వివాహ పత్రికను ఇంత బాహాటంగా పంపగలిగారనిపించింది. లేకుంటే గప్‌చిప్‌గా రిజిస్ట్రారాఫీసుకు వెళ్ళి తరువాత ఓ ఉత్తరం రాసిపడెయ్యొచ్చు, మానొచ్చు. ఎవరేం చెయ్యగలుగుతారనుకున్నాడు. తాను వెళ్లి ఏం చేయగలడు? అసదుల్లా తనను లెక్కచేయకపోవచ్చు. అసలు ఉమనే కంటపడనీయకపోవచ్చు. బోలెడు అనుమానాలు. అవన్నీ హాఫీజ్ ముందు వెల్లడించడానికి శాస్త్రి సందేహించలేదు. అన్నీ విని హాఫీజ్ ఒక ప్రశ్న వేశాడు. "పోనీ నేను కూడా వస్తే?" "అదే మంచిదనుకుంటాను!" హాఫీజ్ ఒక్క క్షణం కూడా సందేహించలేదు. వెంటనే రెండు టిక్కెట్ల కోసం ప్రయత్నం ప్రారంభమయింది. "అరే, బడేమియా!" బడేమియా పడుచువాడే. ఆంతరంగిక అనుచరుడు. ప్రయాణానికి చేయవలిసిన ఏర్పాట్లన్నీ వానికి పురమాయించాడు. "జల్దీ కర్ నా!" పనివాణ్ని తొందర పెట్టడమే కాదు, తానూ త్వరపడసాగాడు. "కారులో వెళ్ళండి. ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుని రండి." ఓక్క నిముషం ఆగి, "బెహన్‌జీతో ధైర్యంగా ఉండమనండి." అన్నాడు. 23 శాస్త్రి తిరిగి వచ్చేసరికి పెట్టే బేడా సిద్ధంగా ఉన్నాయి. పనివాళ్ళు వాటిని డిక్కీలోనూ, పైనా సర్దుతున్నారు. "ఏ బండికి దొరికాయి టిక్కెట్లు?" "మెయిలుకైతే రేపు పొద్దున్న వెయిటింగ్ లిస్ట్‌లొ ఉంటాయన్నారు. వద్దు, మనం కారులో పోతున్నాం." శాస్త్రి తెల్లబోయాడు. "అంత దూరం కారులో కష్టం కాదూ, తమకు?" "తప్పదు. శ్రమే మరి. కాని..." ఈ మారు శాస్త్రి తన అనుమానం నిజమే అనుకున్నాడు. ఈ పెళ్ళి జరగడం ఆయనకిష్టం లేదు. అందుకే ప్రయాణం. "శాస్త్రీజీ!" అన్న ఆడగొంతు వినబడి ప్రకృతిలో కొచ్చాడు. అప్రయత్నంగానే "జీ!" అన్నాడు. తల ఎత్తేసరికి హాఫీజ్ భార్య జీనత్. "అదాబ్ అర్జ్!" అని నమస్కరించాడు. ఆమె ప్రతి నమస్కారం పలికింది. తమ దంపతులిరువురి తరపునా జీనత్ ప్రారంభించింది. "ఈ వార్త విషయంలో మా అనుమానాలు మాకున్నాయి. ఆ అనుమానం తీర్చుకునేందుకూ, అవకాశం ఉన్నంతలో తమకు కష్టం కలిగించరాదన్న సంతృప్తి కోసమూనే వారు కూడా ప్రయాణమవుతున్నారు. పెద్దగా దూర ప్రయాణాలు చేసే ఓపిక లేకున్నా బయలుదేరుతున్నారు." "ఫర్వాలేదు, శాస్త్రీజీ నాకన్నా పెద్దగా చిన్నవారేం కాదు. కాని పని అలాంటిది." ఎప్పుడోగాని కంటబడని యజమాని భార్య స్వయంగా వచ్చి ఉపచార వ్యాక్యాలు పలకడం తృప్తి కలిగించినా, ఆమె తీరులోనే ఏదో విలక్షణత తోచి శాస్త్రి ఇంకా ఏమంటుందోనని ఎదురు చూస్తున్నాడు. "అసదుల్లాను ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. కాని...." మాట మధ్యలోనే ఆగిపోయింది. కంఠం పట్టేసింది. ఆమె మాటను హాఫీజ్ పూర్తి చేశాడు. "ఆ నలుసు మీద ఈ ముసిలాళ్ళం ప్రాణాలు పెట్టుకుని ఉన్నాం. తమరు మా వంశాన్ని కాపాడుతామని...." ఇద్దరూ భిక్ష కోరుతున్నట్లు కుర్తా కొంగులు పట్టడం చూసి శాస్త్రి తెల్లబోయాడు. ఆ కుర్రాణ్ని చంపేస్తారనుకుంటున్నారేమిటీ ముసిలాళ్ళు--అనుకున్నాడు. తన చేతికి ఓ కత్తి ఇచ్చి పొడిచెయ్యమన్నా ఆ పని చేయలేడు. "అసదుల్లా నా శిష్యుడు. నా కొడుకుల్లాంటి వాడు. అతనికపకారం చెయ్యగలనని తమకెల్లా అనిపించింది? ఎందుకనిపించింది?" "అది కాదు, శాస్త్రీజీ!" కాని ఆయనదేమిటో చెప్పలేకపోయాడు. శాస్త్రి ఒక్క క్షణం ఆగి, ఇంటినుంచి బయలుదేరినప్పటి తన ఆవేశాన్ని పైకి చెప్పేశాడు. "చెప్పొద్దూ? ఈ వ్యవహారం తమ ద్వారా ఫొక్తు పడిందనిపిస్తే మీ పీక పిసికెయ్యాలనిపించింది." ఆ ఆలోచన కలిగిందని చెప్పడానికి శాస్త్రికి నవ్వు వచ్చింది. మిత్రులిద్దరూ కలిసి ఒక్క నిమిషం నవ్వుకున్నారు. అంతలో తన స్థితి గుర్తు వచ్చి శాస్త్రి ముఖం గంభీరమయింది. "కాని, తీరా వస్తే ఆ పని చెయ్యలేను!" "నా పీక పిసికేస్తే విచారం లేదు. భాయి సాబ్!కాని....కాని..." "చెప్పండి." "మా కోరిక ఇది. ఆ కుర్రాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలనే నిశ్చయంతో ఈ ఏర్పాట్లకు పూనుకొని ఉంటే ఉమను దిగదియ్యనని మాట ఇవ్వండి". శాస్త్రి అవాక్కయి నిలబడిపోయాడు. అయితే ఈ ప్రయాణం ఉద్దేశం ఏమిటనిపించింది. నవదంపతుల్ని ఆశీర్వదించడానికా తాము వెళుతున్నది? ఇం తవరకు తోచివుండని ప్రశ్నలు పరంపరగా వచ్చిపడ్డాయి. ఈ శుభలేఖను నమ్మవలసివస్తే వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకునే ఉండాలి. తల్లిదండ్రులో, బంధువులో కూర్చింది కాదు కదా. అల్లాంటప్పుడు "దిగతియ్యను" అనే వాగ్దానానికి వుండే విలువ ఏపాటిది? తన మాట ఇంకా ఉమ వినే స్థితి ఉంటుందా? దిగతియ్యడం మాట వచ్చేసరికి కొత్త ఆలోచన వచ్చింది. తాను దిగతీస్తే, ఉమ వింటే-తరువాత ఆమె జీవితం ఏమిటి? ఏడాది క్రితం ఆమెను చేసుకునేందుకు వచ్చిన భాస్కరరావు ఇప్పుడు ముందుకు వస్తాడా? అతని మీద ఆనాడు అంత ఆసక్తి ప్రకటించిన కూతురు ఈ వేళ ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంది? మనస్సు ఇటుంటే అప్పుడా ఆలోచన ఎందుకు వచ్చింది? లేక ఈ మధ్య కాలంలో ఏమన్నా అనుకోని పరిస్థితులు వచ్చాయా? కాలుజారి తప్పని పరిస్థితి వచ్చి ఈ పెళ్లికి సిద్దపడి వుంటే తాను దిగతీయడం వలన ప్రయోజనం ఏమిటి? తన మాట కోసం ఆ ముస్లిం దంపతులు తమ కుర్తా కొంగులు పట్టుకుని అలాగే ఎదురు చూస్తున్నారు. "మన మతాలూ, కులాలూ జీవితాన్ని దుఃఖపెట్టేందుక్కాదు శాస్త్రీజీ!" తమ మత ధర్మానుసారం పెళ్ళి అయితే చాలు ముస్లిములకి. వాళ్ళ కులాలూ, మతాలూ వాళ్ళకి అట్టేపట్టవు. కాని తమ కల్లాకాదే! తాము హిందువులు, బ్రాహ్మణుడు, స్మార్తుడు, వేగినాటి. మతమే కాదు. తమలో అంతశ్శాఖల పట్టింపూ వుంది. శాఖలే కాదు, గోత్రాలూ. ఇవన్నీ ఆర్య, అనార్య సంప్రదాయాల కిచడీ అని తన కొడుకు అపహాస్యం చేసినా అది ఉంది.ఈవేళ కాదన్నా ఒక్కమారు మారిపోదు. "అసదుల్లా మనసు మెత్తని వాడు. ఉమకా వయసు వచ్చింది. చదువుకుంది. చిన్ననాటి నుంచి అరమరికలు లేకుండా తిరిగిన వాళ్ళు..." హాఫీజ్ ఈ ఆహ్వాన పత్రిక యధార్ధమే అయి వుంటుందనే ఆలోచనతో దానికి పూర్వరంగాన్ని చూపుకుపోతున్నాడు. శాస్త్రి ఇంకా తెముల్చుకోలేకుండా వున్నాడు. ఏ విధంగానైనా ఈ పెళ్ళికి అంగీకరించవలసివచ్చేలాగే వుంది. ఉమ మొండికేస్తే తాను చెయ్యగలదిలేదు. ఇంత వరకూ వచ్చాక తాను దిగతియ్యడంలో అర్ధం మాత్రం ఏం వుంది? "సరే ......." నన్నాడు శాస్త్రి. అంతలో మరో ఆలోచన. తన రెండో కొడుకు రామకృష్ణను తీసుకువెళ్ళడం ఎందుకేనా మంచిదనిపించింది. ఆ ‘ఎందుకేనా’ అన్నదేమిటో స్పష్టంగా లేదు. "రామకృష్ణను తీసుకెళదాం." ఆ సూచనకు హఫీజు ఎగిరి గంతేశాడు. రామకృష్ణకూ, అసదుల్లాకూ మంచి స్నేహం. ఇల్లాంటి విషయాలలో పడుచు వాళ్ళతో వ్యవహారం సులభమని ఆయన అభిప్రాయం. శాస్త్రి ఆమోదానికి అభినందించి, శుభాకాంక్షలు తెలుపుతూ వృద్ధురాలు ఇంట్లోకి వెళ్ళిపోయింది. రామకృష్ణ పనిచేస్తున్న కాలేజీ ఫోన్ నంబరు తెలుసుకుని హఫీజు ఎస్.టి.డి. చేశాడు. కానీ వచ్చిన సమాధానం నిరుత్సాహకరం. రామకృష్ణ కాలేజీకి క్రితం రోజు నుంచీ రాలేదు. సెలవు పెట్టాడు. "సరే.....ఇంటి వద్దనే పికప్ చేద్దాం" అన్నాడు హఫీజు. 24 కారు విజయవాడ పొలిమేరలు దాటి, వేగం అందుకుంది. పొగల తెరలు పరుచుకుంటూ పోతున్న లారీని దాటిపోయేందుకు డ్రైవరు హారన్‌తో హెచ్చరిస్తున్నాడు. గదుముతున్నాడు. బతిమాలుతున్నాడు. కస్సుమంటున్నాడు. ఎట్టకేలకు లారీవాడు దారి ఇవ్వగా దూసుకు ముందుకుపోయాడు. అంత వరకూ మాట్లాడకుండా ఊరుకున్న హఫీజు ఈ మారు అటువంటి ఇరుకున పడకుండా హెచ్చరించాడు. "ఆహిస్తా ఛలో భయ్యా!" శాస్త్రి ఇవేవీ గమనిస్తున్నట్లే లేదు. సీటుకు చేరబడి ఎదుటికి నిర్నిమేషంగా చూస్తూనే వున్నాడు. లారీ ఎక్జాస్ట్ పొగ కమ్ముకున్నప్పుడు గుర్తించినట్లు లేదు. చెవులు గింగుర్లెత్తేలా మోగిన హారన్ కదిలించినట్లు లేదు. హఫీజుకు మిత్రుని అవస్థ చూస్తే జాలి వేసింది. ఏవన్నా మాటల్లో పెట్టి దృష్టి మరలించకపోతే మనిషి దెబ్బతినేస్తాడనిపించింది. "శాస్త్రీజీ!" "జీ." "ఏమిటంత ఆలోచనతో ఉన్నారు?" "ఇంకేముంది? మన ఎదుట ఉన్నదొక్కటే సమస్య. ఇదెట్లా తటస్థపడింది? ఎందుకు తటస్థపడింది? దీని నుంచి బయటపడటం ఎట్లాగ – అంతే. అదే ఆలోచన" "ఇందులో మొదటి ప్రశ్నకు సమాధానం తెలియందే చివరి దానికి అసలు అవకాశమే లేదు కదా!" "చెప్పండి. ఇదెట్లా తటస్థపడింది?" హఫీజు ఒక్కక్షణం ఆగి – "నాకూ అంతు దొరకడం లేదు" అన్నాడు. ఒకింతసేపు పోయాక మళ్ళీ అన్నాడు. "లోక వ్యవహారం దృష్ట్యా...." "అంటే – పరిచయం ఉండడం. వయస్సు రావడం ..." "నా కంతే తోస్తుంది." "అంటే?" శాస్త్రి వాక్యం ముగించడానికి తటపటాయించాడు. "దీని నుంచి బయట పడడం సాధ్యం కాదు. ఆ ఆలోచన అనవసరం." "ఒక్కటి చెప్పండి" ఏమీ అనకుండా శాస్త్రి మిత్రుని వాక్యం కోసం చూశాడు. కానీ ఆయన సందేహిస్తున్నట్లు కనిపించింది. "చెప్పండి" "వాదం కోసమే నా ప్రశ్న. ఏమీ అనుకోకుండా ఉంటే...." శాస్త్రి మందహాసం చేశాడు. "ఏదన్నా అనుకునే అవసరమూ, అనుకున్న ఘట్టమూ గడిచిపోయాయి. మన మిద్దరం ఒకే కారులో ఉన్నాం. ఒకేచోటికి వెళుతున్నాం. మన ఉద్దేశం కూడా ఒకటే ననుకుంటా." "ఠీక్ హై, ఠీక్ హై." ఇద్దరూ ఒక నిమిషం ఊరుకున్నారు. "మనది కేవలం చర్చ కోసం చర్చ మాత్రమే. అల్లాగే తీసుకుందాం" ఇంత ఉపోద్ఘాతం ఎందుకో అర్ధంకాక శాస్త్రి నిశ్శబ్దంగా ఎదురు చూస్తూ కూర్చున్నాడు. "దీనినుంచి బయటపడడం సాధ్యం కాదని మీ అనుతాపం." "నిజమే మరి. దీర్ఘకాల పరిచయమూ, వయస్సూ ఈ ఘట్టాన్ని సృష్టించినప్పుడు ...." "దీని నుంచి బయటపడాలని కోరడం ఎందుకు? దీన్ని సముచిత పర్యవసానంగా ఎందుకు తీసుకోకూడదు?" "మీ ముస్లిములు ఒప్పుకోగలరా? ఓ ఏడాది క్రితం సౌదీ అరేబియాలో రాజకుమారినీ, ఆమెను ప్రేమించిన వాడినీ బహిరంగంగా రాళ్ళతో కొట్టి చంపేశారే? పది పదిహేను రోజుల క్రితం ఇరాన్‌లోనూ అటువంటిదే జరిగింది. అందుచేత..." మాట అనేశాక కానీ అందులో వున్న అసంబద్ధత మనస్సుకు తోచలేదు. హఫీజు చిరునవ్వు నవ్వాడు. "దానిలోనే అర్ధం అవడం లేదా? జీవగత అనుబంధం, ఆసక్తి, ఇచ్ఛ మొదలయిన మన ఆచారాలూ, నిషేధాలు శిక్షా స్మృతులకూ లొంగవని, వాని పరిధులూ, పరిమితులూ భిన్నమని తెలియడంలేదా?" ఈ మారు చిరునవ్వు వంతు శాస్త్రిది. "మనదాకా వస్తే తప్ప అర్ధం కాదనేది ఇలాంటి సందర్భాల్లోనే" ముస్లిం దేశాలలో జరుగుతున్నది మనకి ఆదర్శం కావాలా? "కాదు, అక్కడ స్త్రీ, పురుషు లిద్దరూ ఒక మతం వాళ్ళు, ఇక్కడ అది కూడా కాదే." "జీవగతోత్తేజాన్ని కూడా తొక్కేసేటంతటి బలం కలదా మతం?" శాస్త్రి ఆలోచనలో పడ్డాడు. "అకడమిక్‌గా చర్చిస్తున్నామని మరవకండి" అని హెచ్చరించాడు హఫీజు. "మతాలనే కాదు. కుల, ధన, భేదాలనూ, శిక్షాస్మృతినీ కూడా లెక్కచేయని బలం దానికుంది. సందేహంలేదు. కాని, కాని..." "ఆచారాల బలం అంటారు...." "సామాజిక నియమాలే ఆచారాలు కదా!" "అయితే?...." "చెప్పండి" "రామకృష్ణ పునర్వివాహం గురించి మీరు చెప్పాలి. ఆమెది భిన్న మతం అన్నారు గుర్తుందా?" "ఔను" "మరిప్పుడీ సందేహం, అభ్యంతరం ఏమిటి?" "వారు విశిష్టాద్వైతులు" "చెప్పారు" "మేము అద్వైతులం" "నాకా భేదాలు అర్ధం కావు" "వారూ అద్వైతులే. కొంచెం భేదం. అది తాత్త్వికాలోచనలకు పరిమితం." "ఈ తాత్త్వికాలోచనలతో కనిపించే భేదం ప్రకృతికీ – మనిషికీ మధ్య, దేవునికీ – మనిషికీ మధ్య, మనిషికీ, మనిషికి మధ్య వున్న, ఉండగల సంబంధాల సమన్వయం గురించినవే కదా!" అంతవరకూ అభ్యంతరం చెప్పవలసింది కనిపించకపోయినా శాస్త్రి చటుక్కున కాదనలేకపోయాడు. ఆలోచనలో పడ్డాడు. "అయిదారేళ్ళ క్రితం అనుకుంటా ఇలస్ట్రేటెడ్ వీక్లీలో కన్నడ రచయిత – ఆయన పేరు సరిగ్గా గుర్తులేదు. అనంత మూర్తి అనుకుంటా. వారి నవల ‘సంస్కారం’ కు అనువాదం చదివాం." "ఔను..." "అప్పుడే అందులో ఉన్న సంఘర్షణ గురించి మీరు చెప్పారు." "ఔను..." "ఆంధ్రలో మీరు ఆ మతం వారిని." "విశిష్టాద్వైతుల్ని, వారిని మధ్వ బ్రాహ్మణులంటాం." "కానీ, కర్ణాటకలో మిమ్మల్ని వారు బ్రాహ్మణులుగా చూడరని చెప్పారు." "ఔను..." "కాని, రామకృష్ణ ఎంపికకు మీరు అభ్యంతరం చెప్పలేదు." "లేదు. అది నిషేధించడం తగిన అభ్యంతరం కాదు. ఆలోచనా ధోరణిలో ఉన్న భేదం తప్ప రెండు మతాలూ వేద ప్రమాణాన్ని అంగీకరిస్తున్నవే." "అసలు దేవునికి కన్న దేవుని వాక్యానికి విలువనిస్తున్నారనాలా?" ఆ నవల మీద వచ్చిన చర్చలో వినబడ్డ మాటలే. కాని, సందర్భాన్ని బట్టి వాటికానాడు కనిపించని కొత్తబలం కనిపించి శాస్త్రి ఉలిక్కిపడ్డాడు. 25 చీకటి పడే వేళకి కారు రాజమండ్రీ చేరింది. "ట్రావెలర్స్ బంగళాకి వెడదాం. కారు పంపుతే రామకృష్ణ వస్తారు. ఈ లోపున మనం విశ్రాంతి తీసుకోవచ్చు." శాస్త్రికి ఆ సలహా బాగానే వుంది. కొడుకును వెంటనే కలుసుకోవడం, సంప్రదించడం అవసరమనిపిస్తున్నా, కారులో జరిగిన చర్చలు మధ్యాహ్నం కనిపించిన ఆదుర్దాను సర్దేసేయి. "సరి. నేను గోదావరీ స్నాన పుణ్యం కూడా దక్కించుకుంటా, ఈ లోపున ." "మీ భోజనం?" "రాత్రి భోజనం మానేసి ఐదారేళ్ళయింది. రెండు అరటి పళ్ళు చాలు. గోదావరి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుంటా." "రామకృష్ణ కోసం వెడుతున్నాడుగా డ్రయివర్. బజారులో దొరికిన పళ్లు తెమ్మంటా." శాస్త్రి గోదావరికి బయలుదేరాడు. మధ్యాహ్నం కలిగిన మానసిక వ్యథ ఇప్పుడేమాత్రం లేదు. హఫీజ్‌తో చర్చలలో మతం వచ్చింది. ప్రపంచ రాజకీయాలు కదిలాయి. సాహిత్యం ప్రసక్తి వచ్చింది. హాస్య ప్రసంగాలు నడిచాయి. ఏమి జరగనట్లే గోదావరి స్నానానికి బయలుదేరాడు. తనకే ఇదేమిటనే ఆలోచన కలుగకపోలేదు. అది ఆశ్చర్యం కలిగించిందేగాని, అంతకన్న ఏమీ చలనం లేదు మనస్సుకి. తెచ్చుకోవాలనుకున్నా ఇందాకటి దు:ఖం లేదు. స్నానం, సంధ్యా ముగించుకుని వచ్చేసరికి పట్టణంలోకి వెళ్ళిన డ్రయివరూ వచ్చాడు. అతనితో ఓ పాతికేళ్ళ పడుచు వచ్చింది. వచ్చేసరికి ఆమె హాఫీజుతో మాట్లాడుతోంది. తన్ను చూడగానే కుర్చీలోంచి లేచి ముందుకు వచ్చి నమస్కారం చేసింది. "వారేనమ్మా! మీ మామగారు" అంటూనే ఆమెని పరిచయం చేశాడు హాఫీజు. "మీ కోడలు భాయీసాబ్." శాస్త్రి తెల్లబోయాడు. రామకృష్ణ పెళ్లి చేసేసుకున్నాడన్నమాట. తమకి చెప్పకుండానే – మాట మాత్రంగా కూడా! మనస్సుకి కష్టం అనిపించింది. ఏమీ అనలేకపోయాడు. ఈ హఠాద్వార్తకి సహజంగా నోట రావలసిన ఆశీర్వాదం కూడా చేతకాలేదు. ఉండమన్నట్లు చేయి ఊపి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అన్య గోత్రీకుడికే కన్యాదానం చేయడానికి తాను నిరాకరించడం చేత కొడుకు తనకు చెప్పకుండానే, పిలవకుండానే పెళ్ళి చేసేసుకున్నాడన్నమాట! ఉమ విషయంలో తాను ఇచ్చిన సలహా అది. ఇప్పుడు రామకృష్ణను తప్పుపట్టవలసిన పనేముంది? "క్షమించండి మామయ్యగారూ! నేను లోపలికి రావచ్చా?" గుమ్మంలోనే క్షమాపణ చెప్పుకుంటూ అనుజ్ఞ కోరుతున్న ఆ యువతిని శాస్త్రి సాదరంగా ఆహ్వానించాడు. కుర్చీ చూపి కూర్చోబెట్టాడు. "వాడేడీ? నువ్వొక్కర్తెవే వచ్చావు. పెళ్ళెప్పుడు చేసుకున్నారు." "ఆగష్టు తొమ్మిదిన రిజిస్ట్రారాఫీసుకు వెళ్ళేం." "అన్న చెల్లెళ్ళిద్దరికి స్వాతంత్ర్య దినోత్సవాలతో తమ జీవితాల్ని ముడిపెట్టుకోవాలనే ఆలోచన ఒక్కమారే కలిగిందేం?" కల్పన ఉలికిపడింది. తానన్న మాటకి శాస్త్రి నాలుక కరచుకున్నాడు. అన్న వివాహాన్ని అభిశంసించడమా? – ఆ వాక్యానికేమిటర్ధం? "రేపు శనివారం ఇద్దరం బెజవాడ రావాలనుకున్నాం. ఇంతలో, నిన్న విశాఖ నుంచి వదినగారు టెలిఫోన్ చేశారు. వెంటనే అటు వెళ్ళారు." "మంచి పనే చేసేడు." ఇక శాస్త్రి జాగ్రత్తపడి కల్పన కుటుంబం, ఆమె ఉద్యోగం, భవిష్యత్తును గురించిన వారి ఆలోచనలు ఆనుపూర్వికగా, సవివరంగా తెలుసుకున్నాడు. ఆశీర్వదించి పంపేడు. "రాండి, తప్పక వస్తూ పోతుండండి." అయిదారేళ్ళుగా తమ ఒత్తిడిని పాటించకుండా పెళ్ళిని నిరాకరిస్తూ వచ్చిన కొడుకు పెళ్ళి చేసుకున్న వార్త శాస్త్రిని ఆలోచనలో పెట్టింది. మధ్యాహ్నంకన్నా మనస్సు ఘటనలను పర్యాలోచించగల నిబ్బరం ఏర్పడింది. తన విశాఖ ప్రయాణం ఉద్దేశం ఏమిటి? ఆ వివాహం జరగకుండా నిషేధించడానికా? ఆ జంటను ఆశీర్వదించడానికా? అర్ధం కావడంలేదు. తీరా వెళ్ళి తాను చెయ్యగల దేమిటి? ఏడ్చి, బతిమాలాలి. ఇప్పుడా మాటకి ఏడ్పు రావటంలేదు. బతిమాలడం అంటే ఏమని? ఈ పెళ్ళి చేసుకోవద్దనా? ‘ఎందుచేత వద్దంటున్నావు’ అని అడిగితే ఏం చెప్పాలి. వరుడుగా అసదుల్లాని ఎంచలేడు. స్ఫురద్రూపి, మంచి విగ్రహం మంచితనం ఉంది. చిన్నప్పటి నుంచి తానెరుగును. పిల్లనివ్వకూడని దుర్లక్షణాలు ఏమీ లేవు. మంచి తెలివీ, విజ్ఞతా, చదువూ ఉన్నాయి. ఇక అభ్యంతరం మతం. దారిలో సాగించిన చర్చలూ, ఇక్కడికి వచ్చాక చూసిన కోడలూ మత భేద అభ్యంతరాన్ని నిరాకరిస్తున్నాయి. అయినా ఎక్కడో ఉంది. మనసు అంగీకరించడంలేదు. ఎందుచేత? అంగీకరించలేక బతిమలాడుకుంటే ఉమ అంగీకరిస్తుందనే అనుకుందాం. తరువాత బాధ్యత? ఆమెకు తాను పెళ్ళి చేయగలడా? శుభలేఖల వరకూ వచ్చిన ఈ మతాంతరపు పెళ్ళి ఆమె వైవాహిక జీవితానికి పెద్ద ప్రతిబంధకం కాక మానదు! చివరకు చేతులు ఎత్తేసి ఆమెను యావజ్జీవ బ్రహ్మచర్యం చేయమనాలి. లేదా, ‘నీకు తోచిన వాడిని నువ్వే వెతుక్కో తల్లీ!’ అనాలి. ఆ మాత్రం దానికి ఆ పని ఇప్పుడే చెయ్యెచ్చునుగా? ఆ మాట తోచేసరికి శాస్త్రికి తన జీవితం పొడుగునా తన అనుభవం – ఇలా తప్పనిసరి పరిస్థితులు ఏర్పడుతుండడమూ, వాటికి తల ఒగ్గుతూ అందులోనే చిన్న చిన్న సర్దుబాట్లు చేస్తూ కాలక్షేపం చేస్తూ పోవడమూ బాగానే కనిపించింది. ప్రపంచం అంతా అలాగే ఉంటుందా? లేక, తన ఒక్కడికేనా ఈ అనుభవం? 26 గతమంతా ఒక్కమారు నెమరుకు వచ్చింది. జీవితంలో వేసిన ప్రతి అడుగూ మరో ప్రపంచంలో పెడుతున్నట్లే ఉండడం చంద్రశేఖర శాస్త్రికి చిన్నప్పటి నుంచీ అనుభవమే. ఇష్టం లేమి, సందేహం, తటపటాయింపు, మొరాయింపు, మెడ్డువారీ. చివరకు ఆ నూతన ప్రపంచంలో అసంతృప్తితోనైనా అడుగుపెట్టక తప్పడంలేదు. తీరా అడుగు వేశాక మరింక ఆ బెదురూ, భయమూ కనిపించకపోవడమే కాదు, ఒక్కొక్కప్పుడు ఆ పాత ప్రపంచంలో ఎలా బ్రతికామా అని ఆశ్చర్యపడిన ఘట్టాలు కూడా లేకపోలేదు. మరి వెనక్కి తిరిగి పోదామనిపించనేలేదు. ఎప్పుడూ. అనిపించినా అది సాధ్యం కాదు. జీవితాన్నే మార్చిన ఘట్టాలతోనే కాదు, అతి సామాన్యమైన చిన్న చిన్న విషయాలలో కూడా అదే అనుభవం. చిన్నప్పుడు శీతాకాలంలో ముంగండ చెరువు పెద్దపావంచాల పిట్టగోడ చివరన ముడిచిపెట్టుక్కూర్చుని, చలికి ‘ఉహుహూ’ అని వణికిపోతూ తుండు ఒంటి నిండా బిగలాక్కుంటూ నీళ్ళలో దిగకుండా కాలయాపన చేస్తూ వచ్చిన రోజులు జ్ఞాపకం వచ్చాయి. ఎవళ్ళకి వాళ్ళు తాము కదలకుండానే పక్కవాడిని ‘దిగరా’ అని పొడిచేవాడు. రెండోవాడు తప్పకుండా కసిరేవాడు. "అబ్బ, ఉండరా! ఒక్క నిముషం. ఆ నీటి కాకిని చూడు. అదీమారు తేలినప్పుడు" అని నడువు పెట్టేవాడు. నీటి కాకి తేలడానికీ, తాము నీటిలో దిగడానికీ నిజానికేమీ సంబంధం లేదు. అదేం మొసలి కాదు – కాలు పట్టుకుని లాక్కుపోతుందనే భయం లేదు. జాప్యం చేయడానికి అదో హద్దు. అందరూ అలాంటివాళ్ళే, కనుక సంతృప్తి పడేవారు. కబుర్లు చెప్పుకుంటూ బైఠాయించేవారు. కొద్దిసేపటిలోనే నీటి కాకి తేలడం హద్దుగా పెట్టుకున్న మాట మరిచిపోయేవారు. ఆ కాకి మునుగుతూ, తేలుతూ తన వేట తాపత్రయంలో తానుండేది. తామంతా అక్కడే కూర్చుండిపోయేవారు. ఇంక ఆలస్యం చేయడానికి వీలులేనంతగా వేళ మించేది. లేచేవారు. నిలబడి రెండు చేతుల వేళ్ళతో చెవులూ, ముక్కులూ మూసుకుని ఒక్క ఊపుతో పల్టీకొట్టి నీటిలో పడేవారు – ఒకరి తరువాత ఒకరు. దిగేవరకే చలి! తర్వాత ఓ అరగంటసేపు చెర్లో ఈత కొట్టేవారు. మోకాలి బంటి నీటిలో పావంచాల మీద నిలబడి తడిగుడ్డలతోనే సంధ్యావందనం చేసేవాడు. చలే అనిపించేదికాదు, మరి! ఇంత చిన్న విషయం నుంచి తన జీవిత విధానాన్నే మార్చివేసిన విద్యా విషయం వరకూ....అదే అనుభవం. ఏభయ్యేళ్ళకు పూర్వం తమ కుటుంబంలో ఇంగ్లీషు చదివిన వారెవరూలేరు. సంస్కృత పండితుడుగా, వైయాకరణిగా పేరు మోసిన సుబ్రహ్మణ్యశాస్త్రి తన కొడుకును తనంతవాణ్ణి చేయాలని పూనుకున్నాడు. చంద్రశేఖరశాస్త్రి ఆయన ఆశల్ని, ఆశయాల్ని సఫలం చేశాడు. పద్దెనిమిదేళ్లు వచ్చే సరికి మంచి సాహిత్య జ్ఞానం సంపాదించాడు. కౌముది జిహ్వాగ్రాన పెట్టుకున్నాడు. పాణినీయం, భట్టోజీ దీక్షితీయమూ తమ ఊరి చెరువుగట్టు మీది రావిచెట్ల గుబురుల్లోని రామచిలకలక్కూడా నేర్పేశాడని గ్రామస్థులంతా మెచ్చుకునేవారు. సరిగ్గా ఆ సమయంలోనే తన విద్యా వ్యవసాయంలో పెద్ద మార్పు వచ్చింది. తన కొడుకుకు సాంప్రదాయక విద్యలోనే తర్ఫీదునివ్వాలనే ఆలోచన సుబ్రహ్మణ్యశాస్త్రిలో ఏర్పడడానికో కారణం వుంది. హూణ విద్య నేర్చుకున్న వాళ్ళంతా వీరేశలింగాలూ, వెంకటరత్నం నాయుడులూ కాకపోయినా, వర్ణాశ్రమ ధర్మాల యెడ వారి శ్రద్ధాసక్తులు వేర్వేరు అంతరువులతో తగ్గిపోతుండడాన్ని ఆయన చూస్తున్నాడు. ప్రాచీన సంప్రదాయాల యెడ నిరసన భావం వారిలో పెరుగుతోంది. వేదాల అపౌరుషేయతను ప్రశ్నిస్తున్నారు. బాలగంగాధరతిలక్ ‘వేదకాల నిర్ణయం’ పాఠ్యగ్రంథంలా చదువుతున్నారు. పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి ‘భారత విమర్శ’ చదవండని ఒకరికొకరు సలహాలిస్తున్నారు. కట్టు, బొట్టు, జుట్టులతో హూణ సంప్రదాయాలననుసరిస్తున్నారు. ఈ ధర్మ భ్రష్ఠత తమ ఇంట్లో అడుగుపెట్టరాదని ఆయన కోరిక. హూణ విద్య నేర్చి, ధర్మభ్రష్టు లయినందుకు బహుమానమేమో అన్నట్లు అటువంటి వారి జీవితాలు బాగానే వెడుతున్నాయి. ధనం సంపాదించుకుంటున్నారు. వారికే సంఘంలో మన్నన, మర్యాదా లభిస్తున్నాయి. సుబ్రహ్మణ్యశాస్త్రికి ధనం మీద పెద్ద మమకారం లేదు. నాలుగు వేళ్ళూ లోపలికి పొతే చాలు. ఆ మాత్రానికి లోటు లేదు. కోనసీమలో నాలుగైదెకరాల బోదె కొబ్బరితోట, మరో మూడు నాలుగెకరాల ఊడ్పుచేస్తూ ఉందంటే – రాజును తాతా "అని పిలవ్వచ్చు" సామాన్య సంసారి. ఆయనకామాత్రం ఉంది. ఏటా ఓ నాలుగు నెలలు సంచారం చేస్తే నాలుగైదు వందలు చేతిలోపడే వార్షికాలున్నాయి. దీనితో తన కుటుంబం సుఖంగా జీవిస్తోంది. తన కొడుకు కూడా అదే విధంగా ధర్మభ్రష్టుడు కాకుండా సుఖ జీవితం గడపగలగాలని ఆయన అభిలాష. విశ్వాసం. అయితే ఆ విశ్వాసం ఎంతో కాలం నిలవలేదు. నలుగురు ఆడపిల్లలకి పెళ్ళిళ్లు చేసేసరికి ఆస్తి మెట్టుమెట్టుగా 'హ్రస్వం లఘు' అయింది. ఆ రోజుల్లో కట్నాలనీ, కానుకలనీ ఓ పెద్ద సమస్య కాదు. ఆయనకున్న పేరు ప్రతిష్టల ఫలితంగా ఆడపిల్లలకి మంచి సంబంధాలే వచ్చాయి. శుభాకార్యాలనేసరికి వార్షికాలిచ్చేవాళ్లు ఇబ్బడి ముబ్బడీ ఇచ్చిన వాళ్ళున్నారు. అయినా ముంగండలాంటి ఊళ్ళో కార్యకరామత్తులు చేయబూనుకున్నప్పుడు ఒకటి రెండెకరాలు కరా రావుడు చుట్టకుండా బయటపడడం అంత సులువేం కాదు. అంతటితో తేలి బయటపడడమే గొప్ప. నాలుగైదు పెళ్ళిళ్ళు పూర్తి అయ్యేసరికి ఆస్తి మూడు వంతులు హరించి పోయింది. పెళ్ళిళ్ళప్పుడు ఇబ్బడి ముబ్బడీ ఇచ్చిన పండితాభిమానులు మరుసటి సంవత్సరం మామూలుగా కూడా సత్కారం చేయలేకపోయారు. ఒక ఏడాది వార్షికం తగ్గించాక మరుసటి సంవత్సరమైనా దాన్ని యధాస్థితికి తెచ్చే స్తోమతా కనబడలేదు. "శాస్త్రులుగారూ! ఏదో ఇలాగ పోనీయండి. తమ పాండిత్యానికి తగిన సత్కారం ఎన్నడూ చేయలేకపోయామే అనేదే మా విచారం, అయితే మా పనీ అంతంతగానే ఉంది. వెనుకటి రోజులుకావు..." ప్రపంచయుద్ధం, యుద్ధానంతరపు ఆర్ధిక బాధలు, సత్యాగ్రహాలు, ఆర్థిక మాంద్యం, ప్రతి ఒక్కటీ తాత చేతికి శుక్రాచార్య ప్రతినిధి స్వరూపాలే. కటువుగా చెప్పినా, మృదువుగా చెప్పినా, కాణీ ఇచ్చినా, కాసిచ్చినా కొద్ది గొప్ప పాఠ భేదాలతో అవే మాటలు పొడుగునా వినపడుతూండేసరికి సుబ్రహ్మణ్యశాస్త్రి నిలబడి ఆలోచించక తప్పలేదు. తాను నిరసించే హూణ భాషనే చదువుకున్న తన ఈడువాళ్ళే ఊళ్ళో నలుగురైదుగురు సుఖ జీవితం గడుపుతున్నారు. వారిలో ఒకరు హైస్కూలు హెడ్మాస్టరు. స్కూల్లోనూ, ఊళ్ళోనూ కూడా మంచి మన్నన పొందుతున్నాడు. మరొకాయన లాయరు. ఒకరు డాక్టరు. ఇద్దరు స్కూళ్ళ ఇన్‌స్పెక్టర్లు. స్థిరమైన ఆదాయాలు – నిజం చెప్పాలంటే వాళ్ళనే ‘నప్రతిగ్రహీత’లనాలి. కొత్త ఆలోచనలకు అవసరం ఏర్పడ్డాక సుబ్రహ్మణ్య శాస్త్రికి తన సంపాదన యాచనగా తోచడంలో ఆశ్చర్యం లేదు. అంతవరకూ హూణ భాషగా ఈసడించినది ఇంగ్లీషు అయింది. ధర్మభ్రష్టులుగా కనిపించిన వారిలో కూడా ఆర్ష సాంప్రదాయాల యెడ అభిమాన చిహ్నాలు కనిపించసాగాయి. క్రాపులలో దాగి ఉన్న పిలకలనిప్పుడు గుర్తిస్తున్నాడు. హడావుడిగానైతేనేం ఆచమనం చేసి గాయత్రీ జపం పూర్తి అయిందనిపిస్తున్నారని సంతోషిస్తున్నాడు. రిటైరయ్యాక భగవద్గీత, సుందరకాండ పారాయణం చేస్తున్నారు. కొందరు బ్రహ్మసూత్రాలకు శంకర భాష్యం చెప్పించుకొనేందుకు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇవన్నీ బేరీజు వేసుకున్నాక సుబ్రహ్మణ్య శాస్త్రి తన విశ్వాసాల్ని మార్చుకోడానికి సందేహించలేదు. ధర్మభ్రష్టత పూర్తిగా విద్య వలన కలగదు. వ్యక్తుల సంస్కారం ప్రధానం. కడుపు నిండే పద్ధతిని బట్టి ఆ సంస్కారం ఉంటుందనే నిర్ణయానికి వచ్చాడు. కొడుకును పిలిచాడు. ఆ విధంగా చంద్రశేఖరశాస్త్రి తన జీవితంలో వచ్చిన తొలి మలుపు మొగదలకి చేరాడు. 27 ఆనాడు తాను చేసిన మెడ్డువారీ గుర్తుకు వచ్చి ఈ వేళ కూడా శాస్త్రి నవ్వుకున్నాడు. తాను అంత మూర్ఖంగా ఎలా మాట్లాడగలిగేనాయని సిగ్గు కూడా కలిగింది. కుటుంబ పరిస్థితులు, తన సంపాదనలు, ప్రపంచ గతిని వివరించి తండ్రి తన్ను ఇంగ్లీషు చదువుకోమన్నాడు. దానికి కావలసిన సమాచారం అంతా ఆయనే సేకరించాడు. "రెండేళ్ళలో నిన్ను బెనారస్ మెట్రిక్ కు కట్టిస్తానని కామేశ్వరరావు చెప్పాడు." కాని, ఆ విషయంలో తన అభిప్రాయం చెప్పేసరికి తండ్రి కొయ్యబారిపోయాడు. అలాగని తాను చెప్పినదీ ఏం లేదు. అంతవరకూ ఆయన చెప్పిన వాదాలే. అయితే ఉదాహరణలు మాత్రం తనవి. సూరయ్యగారి వెంకటశాస్త్రి ఉద్యోగంలో సెలవు దొరకలేదని వారు బ్రాహ్మలకి కాళ్ళు కడిగి తండ్రి తద్దినం అయిందనిపించేశాడు. చిన్నాన్నగారి గోపాలం ఆఫీసు నుంచి చొక్కా తీస్తూంటే జందెంకూడ లేచి వచ్చింది. చూసుకోనేలేదు. మర్నాడు స్నానం చేసేటప్పుడు పెళ్ళాం చెప్పే వరకూ వాడు చూసుకోనేలేదు. అప్పుడైనా మాట్లాడకుండా వెతికి తెచ్చి గప్‌చుప్‌గా మెళ్ళో తగిలించుకున్నాడే గాని, కనీసం గాయత్రీ మంత్రాన్నైనా అనుకోలేదు. రామచంద్ర చయనులు బహిష్టయిన భార్యా, తానూ యింతింత దూరంలో మంచాలేసుకుంటారు. కబుర్లు చెప్తూ మధ్య మధ్య ఆమెను కర్రతో పొడిచి చక్కలిగిలి పెడుతూంటాడు. ఇలాగే అనేక అక్కార్యకరణాలూ, అబ్రహ్మణ్యాలూను. తాను తెచ్చిన వాదాలు, చేసిన బోధలే కొత్త మాటలతో వినబడేసరికి ముసలాయన నీరయిపోయాడు. అయితే ఏమనలేదు. ఆ సంవత్సరం సంచారానికి వెళ్ళేటప్పుడు మాత్రం బయలుదేరదీశాడు. ఇంటికి తిరిగి వస్తూనే చంద్రశేఖరశాస్త్రి స్వయంగా కామేశ్వరరావును కలుసుకున్నాడు. బెనారస్ మెట్రిక్ చదవడానికి కావలసిన పుస్తకాలూ, సరంజామా చూసుకున్నాడు. తండ్రితో తాను ఇంగ్లీషు చదవదలచానని చెప్పేశాడు. ఆయన ఉత్సాహమూ చూపలేదు, వద్దనీ అనలేదు. "నీ ఇష్టం. నా జీవితాధ్యాయం స్వస్త్యంతానికి వస్తోంది. కష్టసుఖాలూ లాభ నష్టాలూ, మంచి చెడ్డలూ నీవి నువ్వే చూసుకోవాలి" అన్నారు. చంద్రశేఖరశాస్త్రి పోయిన కాలాన్ని కూడదీసుకునేందుకు దీక్ష పట్టాడు. సహజంగా తెలివి ఉంది. పట్టుదలా ఉంది. ఒక భాషలో మంచి పాండిత్యం ఉంది. వయస్సులో గ్రహణ శక్తీ కృషితో ధారణ శక్తీ నిశితం అయ్యాయి. మెట్రిక్ పాసయ్యాడు. పోయి కాకినాడలో ఇంటర్మీడియట్‌లో చేరాడు. రెండేళ్ళు ఇట్టే గడిచాయి. మంచి మార్కులతో పాసయ్యాడు. ఏది చదివినా స్కాలర్‌షిప్ దొరికే అవకాశం ఉంది. లెక్చరర్లు ప్రోత్సహించారు. శాస్త్రి తండ్రి సలహా అడిగాడు. చదువుతున్నది ఇంగ్లీషయినా, సాధ్యమైనంత వరకు బ్రాహ్మణధర్మం చెడగొట్టుకోకుండా అవకాశాల కోసం ఆయన వెతికారు. "వైద్యం అన్నావూ, అడ్డమైన వాళ్ళనీ ముట్టుకోవాలి. నానా పుళ్ళూ కడగాలి. అది మనం బ్రాహ్మలం చేయలేం. అందుకే మనువు దానిని అపాంక్తేయంగా బహిష్కరించాడు. మనకు తగదు." "యుద్ధం ప్రారంభమయింది గనుక మంచి ఉద్యోగాలు దొరుకుతాయంటున్నారు. కాని నాకది ఇష్టంలేదు." "వద్దు. మరొకటి బి.ఎల్. కావడం....కాని ఛెస్! పాడు వృత్తి. తెల్లారి లేస్తే అన్నీ అబద్ధాలే! అసలు ఆ బతుకే ఓ అబద్ధాలపుట్ట. మనకది వద్దు." "అలాగే." "ఇంజనీరింగ్ అన్నావూ, మంచి ఉద్యోగాలే దొరుకుతాయి. జీతపురాళ్ళే గాక పైపరమానం కూడ బాగానే ఉంటుంది. చేతికింద పదిమంది ఉంటారు. కాని తిరుగుడు. నెలలో ఇరవై రోజులు మకాములే. నిత్య ప్రయాణాలతో చివరికి సంధ్యావందనం కూడ వెక్కసమైపోతుంది. వద్దది." ".... ...." ఈమారు కొడుకు సమాధానం ఏదీ ఇవ్వలేదని సుబ్రహ్మణ్యశాస్త్రి గమనించనే లేదు. "నా దృష్టిలో మేస్టరీ అంత రాజ ఉద్యోగం లేదు. విద్యాదానం చేశామని తృప్తి ఉంటుంది. ఎక్కడికీ కదలనక్కరలేదు. వారానికో రెండు రోజులు సెలవులు. వానాకాలం అనీ, శీతాకాలం అనీ, వేసవికాలమనీ ఏటా నాలుగు నెలలు సెలవులే. కనుక నా మాటవిని బి.ఎ. లో చేరు." తండ్రిని సలహా అడగకపూర్వమే చంద్రశేఖరశాస్త్రి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇంగ్లీషు చదువు ప్రారంభించినప్పటినుంచి అతని మామ్మగారు అతని ముఖంలో సబ్‌డివిజనల్ ఆఫీసరు కళనే చూస్తున్నారు. ముంగండకి రెండు మైళ్ళలో గన్నవరం వద్ద సబ్‌డివిజనల్ ఆఫీసు వుంది. వశిష్ఠానదిమీద పడవల కాలవను దాటించేందుకు కట్టిన ఆక్విడక్ట్ అక్కడుంది. దాని మొగలో ఈవలి ఒడ్డున గోదావరి పక్కనే ఆఫీసు, ఏటికాలవకీ, గోదావరికీ మూలలో చాలా సుందరమైన ప్రకృతి దృశ్యం మధ్యనున్న ఆ బంగళాను ఆమె గోదావరి స్నానాలకు వెళ్ళినప్పుడూ, వరదలలో ఆక్విడక్టువద్ద నది ఉరవడి దృశ్యాలు చూడబోయినప్పుడూ గమనిస్తూంటుంది. రైతులు, కాలవలమీద కాంట్రాక్టర్లూ, కళాసీలు ఎప్పుడూ ఓ అరడజను మందికి తక్కువ కాకుండా అక్కడుంటారు. ఆకుమడుల కాలంలో వర్షాలు బిగపడితే, నీటి ఎద్దడి ఏర్పడితే రైతులు ఎకరానికింతని చందాలు వేసుకుని ఆఫీసరుగారికి సమర్పిస్తుంటారని పల్లెటూళ్ళలో బాగా ఎరికే. ఆయన ప్రయాణాలకో 'బోట్ హౌస్ ' ఉంటుంది. ఇవన్నీ వింటూంటే, చూస్తుంటే ఆ ముసలమ్మకు అంతకన్న మంచిదీ, పెద్దదీ ఉద్యోగం ఉంటుందనిపించలేదు. ఇంజనీరింగ్ చదివినవాళ్ళకి ఆ ఉద్యోగం వస్తుందని ఆమె విన్నది. కనుక మనుమడిని ఆ చదువుకు వెళ్ళమంది. ఆమె అభిప్రాయం చంద్రశేఖరశాస్త్రికి నచ్చింది. "కుల విద్య మానుకుని, మ్లేచ్చ చదువులకి అడ్డు పడ్డాక కూడా వార్షికాలూ, మాసికాలేనా ప్రారబ్దం!" అన్నాడు. ఆ నిర్ణయాన్ని తండ్రి కాదనలేదు. 28 చంద్రశేఖరశాస్త్రి వెళ్ళి గిండీ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. అక్కడి జీవితం అంతా కొత్తగా ఉంది. కాకినాడలోలాగా అక్కడ వారాలు చేసుకోవడం సాధ్యంకాదు. పట్టణంలో దూరాభారాల సమస్యేకాదు, అసలు చదువు స్వభావమే అంత. కాలేజీ హాస్టలులో ఎంత జాగ్రత్తగా ఉండదలచినా బ్రాహ్మణ్యాన్ని కాపాడుకోవడం ఏ విధంగానూ సాధ్యమనిపించలేదు. రెండోరోజునే సహపాఠకులకి అతని ఆచారపు పట్టుదలల సడి తగిలింది. డైనింగ్ హాలులో ఎంత మూలకు చేరి ఆక్షణం గడుపుకుపోదా మనుకున్నా కుదరకుండా చేస్తున్నారు. పనికట్టుకుని వచ్చి భుజం తట్టి పలకరిస్తున్నారు. యోగక్షేమాలు కనుక్కుంటున్నారు. మొదటిమారు అలా ముట్టుకున్నప్పుడు భోజనం వదలి వెళ్ళిపోయాడు. అది మరింత అలుసయింది. కొంతమంది జాలిపడి అటువంటి పరిస్థితి రాకుండా చేయడానికి సిద్ధపడ్డారు. కాని ఓ వారం అయ్యేసరికి అదీ సాధ్యం కాలేదు. ఇంక నలుగురితో కలిసిపోయి ఆచారపు పట్టింపు కట్టిపెట్టడమో, చదువు కట్టిపెట్టి రైలెక్కేయడమో! శాస్త్రి రెండవదే ఎన్నుకున్నాడు. చదువు--బ్రాహ్మణ ధర్మం సహజీవనం చేయలేవనే ధోరణి బలమవుతున్న కొలదీ భార్య ఆకర్షణ బలపడసాగింది. పరిచయం నెలరోజులదే అయినా కొత్తగా కాపురానికి వచ్చిన ఆ మగ్దమోహన మూర్తి అతనికి అడుగడుగునా సాక్షాత్కరిస్తోంది. అదో పెద్ద బెడదయిపోయింది. కొడుకు ఇంజనీరింగ్ చదువుకు మొగ్గుదల చూపగానే ఏడాదిక్రితమే యుక్తవయస్కురాలయిన కోడల్ని తీసుకురావడం ధర్మం అనుకున్నాడు సుబ్రహ్మణ్యశాస్త్రి. ఆమె పుట్టింటివైపు నుంచికూడా ఒత్తిడి రావడం ఆయన ఆలోచనకు వత్తాసయింది. ఇంటర్మీడియట్ పరీక్షలయి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చంద్రశేఖరశాస్త్రి అత్తవారి ఇంటిమీదుగా వచ్చాడు. అక్కడకు వెళ్ళిన రోజునే భార్య ఏకాంతంలో దొరికింది. మధ్యాహ్నం భోజనం చేసి గదిలోకి వచ్చేసరికి ఆమె అక్కడ మంచం మీద పడుకుని నిద్రపోతోంది. అటూ ఇటూ దగ్గరలో ఎవరూ లేరు. ఎవరికి వాళ్ళు తమ తమ పనుల్లో ఉన్నారు. అతడు చల్లగా గది తలుపులు బిగించాడు. విధవ వదినగారు ఆ సంగతి పసికట్టింది. చెల్లెల్ని కోప్పడింది. "గర్భంగాని వస్తే నలుగురూ పొడుస్తారే" అని తానే ఆమె బుగ్గలు పొడిచింది. తర్వాత అతడు అక్కడున్న నాలుగు రోజులూ మళ్ళీ అటువంటి వీలుదొరక్కుండా శ్రద్ధ తీసుకుంది. అల్లుడి ఆరాటం కనిపెట్టి మామగారు వియ్యంకుడికి పునస్సంధానం విషయం హెచ్చరిస్తూ జాబు రాశాడు. వెంటనే సుబ్రహ్మణ్యశాస్త్రి ఆ ప్రయత్నం చేశాడు. చదువు చెడిపోతుందని శాస్త్రి బెట్టుచేసినా ఎవరూ లెక్కచేయలేదు. అతని ప్రణయగాధ అప్పటికే అందరికీ తెలిసిపోయింది. నవ్వుకున్నారు ఆ బెట్టు చూసి. పైకి మాత్రం "ఈడేరిన పిల్లని నాలుగైదేళ్ళు నీ చదువు పూర్తయ్యేదాక పుట్టింట వదిలివేయడం మర్యాదకా" దని మృదువుగా కోప్పడ్డారు. కార్యం కానిచ్చేశారు. అదివరకు శబ్దార్ధాలే గాని, భావాల లోతులు తెలియని ఘట్టాలన్నీ ఇప్పుడు మనసులో మెదులుతుంటే సంసారానందంతోపాటు కావ్యానందం కూడా అతని అనుభూతిలోకి వచ్చింది. అశిథిల పరిరంభ వ్యాపృతైకైక దోష్ణోరవిదిత గతియామా రాత్రి రేవవ్యరం సేత్--అన్న భవభూతి శ్లోకంలోని లోతులు అతనిని తీరిక సమయాలలో గిలిగింతలు పెట్టసాగాయి. ఓ రోజున చివరికి బిచాణా కట్టేశాడు. జ్ఞాతాస్యాదో వివృత జఘనాం కో విహాతుం సమర్ధః అన్న కాళిదాస మహాకవి పరిజ్ఞానానికి జోహారులర్పించి రైలెక్కేశాడు. వస్తూ అత్తవారింటికే ముందు దారితీశాడు. అతడు చదువు కని మద్రాసు వెళ్ళగానే పుట్టింటివారు సత్యవతిని తీసుకుని వెళ్ళిపోయారు. హఠాత్తుగా, అనుకోకుండా వచ్చి గుమ్మంలో బెడ్డింగు దింపుతున్న చెల్లెలి మగణ్ణి చూసి విధవ వదినగారు చిరునవ్వు నవ్వింది. "సెలవు లిచ్చారేమిటోయ్?" "నేనే వాళ్ళకి సెలవిచ్చేశానండీ!" అయితే భార్యకోసమే కాలేజీ వదిలేశానన్నది ఒక్క భార్యతో తప్ప మరెవరితోనూ శాస్త్రి చెప్పలేకపోయాడు. హాస్టలులో ఉండి బ్రాహ్మణ్యం కాపాడుకోవడం ఎంత కష్టమో--కాదు, అసంభవమో--వర్ణించాడు. తండ్రిగారి సలహాను మొదటనే పాటించనందుకు లెంపలు వేసుకున్నాడు. కులం పోయాక కోటి సంపదలుంటేమాత్రం లాభమేమిటిలే అని ముసలమ్మ గన్నవరం సబ్ డివిజనల్ ఆఫీసరు బంగళా వంక చూసి ఒక్క నిట్టూర్పు విడిచింది. అక్కడితో అతని చదువు ఆఖరయిపోయింది. ఆ ఏడాదికి కాలేజీలో చేరే గడువయిపోయింది. మరుసటి ఏడాదికి పరిస్థితులే మారిపోయాయి. తండ్రి పోవడం, కుటుంబ భారం మీదపడటం, ఉన్న కొద్ది ఆస్తీ అమ్మి అప్పులు తీర్చవలసిరావడం, ఉద్యోగాన్వేషణ, ఉద్యోగం--అదంతా ఓ గొప్ప పరుగుపందెంలా సాగిపోయింది. డిగ్రీమీద తన కుండిన ఆశ తీరలేదు. అదేమో తన సంతానంద్వారా తీరింది. ఆ ఘట్టాలన్నీ మనస్సులో తిరిగి శాస్త్రి ఒక నిట్టూర్పు విడిచాడు, అయితే తన జీవితంలో ఇదో కొత్త ఘట్టమేమో అనుకున్నాడు. 29 దీర్ఘప్రయాణంలో అలసిపోయి వున్న వృద్ద మిత్రుణ్ని చూశాక శాస్త్రి వెంటనే బయలుదేరుదామని తొందర పెట్టలేకపోయాడు. ఇప్పుడు తనకే తొందర అనిపించడంలేదు పైగా అంతవరకూ మనసులో తిరిగిన ఆలోచనల ఫలితంగా తాను పరుగెత్తి వెళ్ళి చేయవలసిందీ, చేయగలదీ కూడా లేదనిపించింది. మరి తొందరెందుకు? "రేపు పొద్దున్న బయలుదేరుదాం. మీరూ అలిసిపోయారు. విశ్రాంతి తీసుకోండి." అన్నాడు. హఫీజ్ మహమ్మదు ఆశ్చర్యపడ్డాడు. శాస్త్రిలో మార్పు ఏమిటో అర్థంకాలేదు. 'కృష్ణలో దిగడం తప్ప దారి లేదనుకున్నాడే ఈ మారు దిగడానికి గోదావరి నెన్నుకోలేదు గదా కొంపతీసి '--అనుకున్నాడు. మిత్రుని మనసులో కదులుచున్న ఆలోచనలను గమనించినట్లు శాస్త్రి తన సూచనకు తాత్విక వివరణనివ్వడం ప్రారంభించాడు. "భగవదుద్దిష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. మనది నిమిత్త మాత్రమే అనడం కన్నా ఎక్కువ చేయడం కేవలం అహంభావం. ప్రతారణమున్నూ కనుక మనం పరుగెత్తి వెళ్ళి చేసేదీ, తాపీగా వెళ్ళినా జరిగేదీ, అసలు వెళ్ళకపోయినా ముంచుకుపోయేదీ ఒకటిగానే ఉంటుంది. సమయానికి వెళ్ళి అడ్డుపడ్డామనీ, ఇంకా ముందు వెళ్ళి వుంటే ఇలా జరగకనేపోయేదనీ భావన ఆత్మ తృప్తి, అహంకార ప్రస్తారం, లోక ప్రతారణాను. అన్నీ పూర్వోద్దిష్ట ప్రకారమే జరుగుతాయి. అది భగవదుద్దిష్టం. ఆ ఉద్దిష్టం మన ప్రారబ్ధ కర్మానుసారంగా వుంటుంది. ఆ వివాహం రేపు జరగవలసి వుంటే అది కర్మాధీనంగా భగవదుద్దిష్టమేమో! అందుకే మధ్యాహ్నం మీకా వాగ్దానం ఇచ్చానేమో!" చటుక్కున గుర్తు వచ్చింది--"మీ కర్మ సిద్ధాంతం భగవంతుడి ప్రమేయాన్ని రద్దు చేసేసిందంటాడు అసదుల్లా. మీరు గతంలో చేసిన కర్మలే ఇప్పటి మీ జీవితాన్ని నడిపిస్తున్నాయంటే నిజానికి మీ జీవితంలో దేవుడి ప్రమేయం లేదనే చెప్పాలి' అంటూండేవాడు." శాస్త్రిని ఏదో విధంగా మాటల్లో పెడితే తప్ప ఈ పిల్లల మూలంగా ఆయన మతి చలిస్తూందనిపించింది. * * * * * రామకృష్ణ కల్పించుకున్నాడు. "ఏమిటీ మీ అభిప్రాయం?" "మన తప్పు ఇతరుల మీద పెట్టవద్దనే. ఆమె ఇష్టం ఎక్కడుంటే అక్కడే పెళ్ళి చేసుకోవచ్చు. దానికి ఇతరులు కుట్ర చేశారనే ఆరోపణ ఎందుకనిగాని." "మీ అభిప్రాయం తెలిసింది గనక సంతోషం. అల్లాగనే చేసుకుంటుంది. అయితే అంత మాత్రం చేత ఈ లేఖ కుట్ర ఫలితం కాకపోదు. మాన నష్టం దావాలో మీరూ ఒక ముద్దాయిగా ఉందురుగాని..." అన్నాడు రామకృష్ణ. భాస్కరరావు తెల్లబోయాడు. "మాన నష్టం...?" "ఏం ఆశ్చర్యంగా ఉందా? ఆడపిల్లల జీవితాలతో చెలగాట మనుకున్నావుట్రా?" పళ్ళు కరకరలాడుతుంటే భాస్కరరావు తిరగబడి చూశాడు. పార్వతీశం! "ఆ మాట అంటున్నది నువ్వేనట్రా!" "ఆవిడ మానాన ఆమె చదువో, దేశోపకారమో అని తన్నుకుంటుంటే, వెధవ పెద్దరికం నెత్తినేసుకుని పెళ్ళి ముగ్గులోకి ఈడ్చిందే నేను. ఎవరితో... నీతో...స్వతంత్రంగా ఆలోచించుకోలేని నీతో." రామకృష్ణ అతన్ని వారించాడు. "తొందర పడకు. చేసుకోదలచిన పిల్లతో మాట్లాడకుండానే పెద్దలతో మాట్లాడి సంప్రదాయం నిలబెట్టుకోదలచుకున్న దానిని గురించి శ్రద్ధ తీసుకోకపోవడంలో తప్పు నాదీ ఉంది. వదిలెయ్యి. మనమంతా ఒకే విధంగా సంప్రదాయాలకు దాసులమే. ఏమిటి భాస్కరరావుగారూ! మీ...!" "ఇష్టం లేనప్పుడు లేదని తోసెయ్యకుండా, రిజిస్ట్రేషన్‌‌కు తేదీ కూడా నిర్ణయించి ఈ విధంగా చెయ్యడంలో అర్థమేమిటి? నన్నవమానంపాలు చెయ్యాలని కాకపోతే..." "ఇష్టం... అనిష్టం సమస్యకి తర్వాత వద్దాం కాని, అవమానం అన్నారు చూడండి మిమ్మల్ని అవమానం పాలు చేసిందీ, అసలు తాను మనుష్యుడే కాదని రుజువు చేసుకున్నదీ వేరొకరు. వారెవరో మీరే చెప్పగలరనుకుంటా. ఈ కాగితం మీద అక్షరాలెవరివో గుర్తు పట్టగలరా?" రామకృష్ణ జేబులోంచి ఓ కాగితాల బొత్తి తీసి విప్పి పట్టుకున్నాడు. అదొక ప్రెస్ ప్రూఫ్ కాపీ. భాస్కరరావు దానికేసి ఓమారు చూసి తల తిప్పుకున్నాడు. "నాకు తెలియదు." "నాకూ తెలియదు. ఇందులో ఇద్దరి దిద్దుబాట్లున్నాయి. సిరాతో చేసినవి. ఆకుపచ్చ బాల్ పాయింట్‌తో చేసినవీ. వాటి మాటే నేనడిగేది." "నాకెల్లా తెలుస్తుంది?" ఆ కంఠస్వరంలో అమాయకత్వం కాక తప్పించుకోవాలనే ధోరణి వ్యక్తం అవుతూంటే రామకృష్ణ మరింత నిలదీశాడు. "మీ అనుమానం నాకూ తోచింది. అయితే మీ స్వభావం తెలుసుకుందామని..." "దీనితో స్వభావం మాటెట్లా తెలుస్తుంది." పార్వతీశం చటుక్కున అనేశాడు. "పెళ్ళి చేసుకోదలచిన పడుచును ఒకడు అవమానిస్తుంటే నువ్వెవరి తరఫున నిలబడుతున్నావో..." "అది ఆమె తెచ్చుకున్న అవమానం. ఆమె ప్రవర్తనలో ఆ లోపం ఉన్నదని..." "డర్టీ రోగ్...!" ఆ స్వరం వినబడిన వేపు భాస్కరరావు తిరిగాడు. ఉమ ముఖం తిప్పుకునే ఉంది. కాని ఆ ముఖంలో అసహ్యం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. ఏదో అనబోతున్న తండ్రిని వారిస్తోంది. తాను లేచాడు. "మీరా ప్రశ్న వెయ్యవలసింది నన్ను కాదు, ప్రెస్ వాడిని." "తొందరపడతారేం? కూర్చోండి. కొన్ని సంగతులు మీకు తెలియవనుకున్నప్పుడు తెలుసుకునే వెళ్ళడం మంచిది" అని అడ్వొకేట్ శాస్త్రి సలహా ఇచ్చాడు. "ఆ దిద్దుబాట్లు చేసిన ఆయనకు ప్రెస్ యజమాని మిత్రుడయి ఉండాలి. ఆయన ఇది తన ప్రెస్‌లోనే వెయ్యలేదని బుకాయించాడు." అని రామకృష్ణ అందుకున్నాడు. "ఆ ప్రెస్ పేరేమిటి?" "అదంత అవసరమా?" అన్నాడు అడ్వొకేట్. "మరేది ముఖ్యం?" "ఒరేయి! నే చెప్తావుండు ఏది ముఖ్యమో?" అని పార్వతీశం అందుకున్నాడు. "ఈ శుభలేఖలు ఈ ఊళ్ళో నిన్న పంచేరు. నిన్నటికి అందేలాగ పొరుగూళ్ళకి పంపించారు. నువ్వు రావడాన్ని బట్టి నీకూ అల్లాగే పంపించి ఉంటారనుకోవాలి." "నాకు మొన్న వచ్చింది" అనేశాడు భాస్కరరావు. "ఎవరా పంపింది?" "అందరికీ పంపిన వారే అయి ఉంటారు." "అదే మేం చెప్పేదీ. ఆ పంపిన వారెవరని మా ప్రశ్న." "గత పరిణామాల దృష్ట్యా దానితోపాటు వివరణా వ్రాసి ఉంటారు. వారెవరు?" "అల్లా ఎందుకనుకున్నారు?" "ఆ శుభలేఖలోని ఒక భాగస్వామితో నీకు ఉన్న లేక ఉందనుకున్న బంధుత్వం దృష్ట్యా వివరణతో నేను వ్రాసినట్లే..." నన్నాడు పార్వతీశం. "నాకది అందలేదని చెప్పాను." "అందే వ్యవధీ, అవకాశమూ లేదని నేనూ చెప్పాను. నా టెలిగ్రాం అందేటప్పటికే నువ్వు బయలుదేరి వచ్చేవని తెలుస్తోంది. మరెందుకు బయలుదేరినట్లు?" అంతవరకూ ఆ గొడవలేమిటో జ్ఞాతాజ్ఞాతంగానే ఉందిగానీ స్పష్టంకాలేదు ముసలి వాళ్ళిద్దరికీ. కలుగజేసుకునేందుకు వీలుకాకుండా ఉమ తండ్రినీ, అసదుల్లా తాతనూ ఆపుతున్నారు. ఇక ఊరుకోలేకపోయారు. "ఏమిటీ గందరగోళం?" "బాత్ క్యా హై?" "ఉమ, భాస్కరరావులు రిజిస్ట్రారాఫీసుకి దరఖాస్తు ఇచ్చేరు." "ఎప్పటికి?" అన్నాడు చంద్రశేఖరశాస్త్రి ఆదుర్దాగా. రామకృష్ణ గ్రహించాడు. "ఫర్వాలేదులెండి. మౌఢ్యం వెళ్ళాకనే ఏర్పాటు చేసేరాయన." "ఇప్పుడా మౌఢ్యమే నన్ను కాపాడింది." అనేసింది ఉమ. "నేనూ అల్లాగే అనుకోవచ్చునేమో?" "మీ ఇద్దరిలో ఎవరికి ఆ ఆలోచన కలిగినా చాలును. మేము అంతా నమ్మగలం. ఇద్దరికీ కూడా ఆ విషయంలో ఏకాభిప్రాయం కుదరడం మరింత మంచిది." అన్నాడు రామకృష్ణ. చంద్రశేఖరశాస్త్రి ఈమారు ఊరుకోలేకపోయాడు. మాట పట్టింపులతో కుర్రవాళ్ళు తాముగా కుదుర్చుకున్న వివాహ సంబంధాన్ని చెడగొట్టుకుంటున్నారనిపించింది. ఇక ఊరుకోకూడదనిపించింది. "తొందరపడకండి. ఈ రభస సృష్టించినది ఎవరో తుంటరులే కాని నిజం కాదని ఇద్దరూ ఎరుగుదురు. మీ మాటలు చూస్తే ఆ తుంటరు లెవరో కూడా ఇద్దరికీ తెలుసుననే తోస్తుంది. ఇక తగు వేమిటి?" "తగువంతా అటు తర్వాతనే. ఈ ఘటన మీద ఆయన అభిప్రాయం గురించే" అన్నాడు రామకృష్ణ. "ఆవేశం, దుఃఖం, మానసిక బాధ మొదలైనవి అనేక దురభిప్రాయాలకి దారి తీస్తాయి. ప్రతి దానికి కత్తా, బద్దా--అని కూర్చోకూడదు." చిన్న సమస్యను కొండంత చేసుకుని యావజ్జీవం పెంచుకోవలసిన సద్భావాన్ని చెడగొట్టుకోరాదని ఆయన దృక్పథం. ముసలాడు ఘటికుడు ఇట్టే తేల్చిపారేసేడని నవ్వుకున్నాడు అడ్వొకేట్ శాస్త్రి. ఇంక ఏం మాట్లాడినా బాధ్యతా రహితంగా వ్యవహరించాడనే మాట వస్తుందని అంతా నిశ్శబ్దంగా ఉన్నారు. "క్యోఁ భాయీసాబ్?" "సచ్ హై, సచ్ హై." ఉమ ఉలికిపడ్డట్టు తేరుకుంది. "ఇందులో కత్తెయ్యనా, బద్దెయ్యనా అనే మీమాంస ఏంలేదు. ఆడదాని విషయంలో మగవాని ఆలోచన ఎల్లా ఉంది, ఉంటుందనేదీ అసలు సంగతి" అంది ఉమ. "తాను పెళ్ళి చేసుకోవాలనుకున్న పడుచును ఒకడు అవమానిస్తే వాని మీద కన్న ఆ పడుచు మీద కోపం చూపే మనిషిని..." రామకృష్ణ ముగించకుండానే పార్వతీశం అందుకున్నాడు. "కోపం అంటావేమిటి... తానూ అవమానించడానికి సిద్దం అయ్యాడు మగాడు." భాస్కరరావు ఒక్కక్షణం ఆలోచిస్తున్నట్లు నిలబడ్డాడు. "నమస్కారం శాస్త్రి గారూ! తమ దర్శనం మళ్ళీ చేసుకుంటాను. ఉంటారుగా?" "కూర్చో బాబూ! మాట్లాడుకుందాం" "కాదండి... నేను ఇంటికి వెళ్ళి కొన్ని పనులు చక్కబెట్టుకు రావాలి. లే. ఉమా వెళ్ళి వద్దాం." ఉమ ఖండితంగా చెప్పేసింది. "మీతో నే నెక్కడికీ రావలసిన పని లేదు. రావడం లేదు. మీరు మళ్ళీ నా కోసం ఎక్కడికీ రావలసిన పని లేదు. రావద్దు." చంద్రశేఖర శాస్త్రి "ఆ! ఆ!" అన్నాడు. రామకృష్ణ--"తొందరపడకు ఉమా" అడ్వొకేట్, శాస్త్రి కూర్చోండి భాస్కరరావుగారూ....వెళుదురుగాని....తొందరేం ఉంది?" కానీ ఉమ ఏ మాత్రమూ తగ్గలేదు. పైగా "అన్నేమిటి, నాన్నేమిటి మగాళ్ళంతా ఒక్కటే! తన అన్న చేసిన వెధవ పనికి ఆయననేమీ అనలేక, అటువంటి దానికి అవకాశం కలిగించే ననగలిగిన మనిషితో నాకు ఏ ప్రమేయం లేదు. పెట్టుకోను. మీ రెవ్వరూ నాకేమీ చెప్పవద్దు." ఇంకామె మరోమాట జారనివ్వలేదు. భాస్కరరావు వెళ్ళిపోయాడు. "అమ్మా!....తొందరపడుతున్నావు." "లేదు నాన్నగారూ....రిజిస్ట్రాఫీసుకి వెళ్ళకుండానే ఆయన స్వభావం అర్థం అయింది. అందుకు సంతోషపడాలి." చంద్రశేఖర శాస్త్రికి మాత్రం సంతోషానికి బదులు దిగులు కలిగింది. "సరే....సరే....నీ ఇష్టం!...." [సమాప్తం] *** END OF THE PROJECT GUTENBERG EBOOK శుభలేఖ *** Updated editions will replace the previous one—the old editions will be renamed. Creating the works from print editions not protected by U.S. copyright law means that no one owns a United States copyright in these works, so the Foundation (and you!) can copy and distribute it in the United States without permission and without paying copyright royalties. Special rules, set forth in the General Terms of Use part of this license, apply to copying and distributing Project Gutenberg™ electronic works to protect the PROJECT GUTENBERG™ concept and trademark. Project Gutenberg is a registered trademark, and may not be used if you charge for an eBook, except by following the terms of the trademark license, including paying royalties for use of the Project Gutenberg trademark. If you do not charge anything for copies of this eBook, complying with the trademark license is very easy. You may use this eBook for nearly any purpose such as creation of derivative works, reports, performances and research. Project Gutenberg eBooks may be modified and printed and given away—you may do practically ANYTHING in the United States with eBooks not protected by U.S. copyright law. Redistribution is subject to the trademark license, especially commercial redistribution. START: FULL LICENSE THE FULL PROJECT GUTENBERG LICENSE PLEASE READ THIS BEFORE YOU DISTRIBUTE OR USE THIS WORK To protect the Project Gutenberg™ mission of promoting the free distribution of electronic works, by using or distributing this work (or any other work associated in any way with the phrase “Project Gutenberg”), you agree to comply with all the terms of the Full Project Gutenberg™ License available with this file or online at www.gutenberg.org/license. Section 1. General Terms of Use and Redistributing Project Gutenberg™ electronic works 1.A. By reading or using any part of this Project Gutenberg™ electronic work, you indicate that you have read, understand, agree to and accept all the terms of this license and intellectual property (trademark/copyright) agreement. If you do not agree to abide by all the terms of this agreement, you must cease using and return or destroy all copies of Project Gutenberg™ electronic works in your possession. If you paid a fee for obtaining a copy of or access to a Project Gutenberg™ electronic work and you do not agree to be bound by the terms of this agreement, you may obtain a refund from the person or entity to whom you paid the fee as set forth in paragraph 1.E.8. 1.B. “Project Gutenberg” is a registered trademark. It may only be used on or associated in any way with an electronic work by people who agree to be bound by the terms of this agreement. There are a few things that you can do with most Project Gutenberg™ electronic works even without complying with the full terms of this agreement. See paragraph 1.C below. There are a lot of things you can do with Project Gutenberg™ electronic works if you follow the terms of this agreement and help preserve free future access to Project Gutenberg™ electronic works. See paragraph 1.E below. 1.C. The Project Gutenberg Literary Archive Foundation (“the Foundation” or PGLAF), owns a compilation copyright in the collection of Project Gutenberg™ electronic works. Nearly all the individual works in the collection are in the public domain in the United States. If an individual work is unprotected by copyright law in the United States and you are located in the United States, we do not claim a right to prevent you from copying, distributing, performing, displaying or creating derivative works based on the work as long as all references to Project Gutenberg are removed. Of course, we hope that you will support the Project Gutenberg™ mission of promoting free access to electronic works by freely sharing Project Gutenberg™ works in compliance with the terms of this agreement for keeping the Project Gutenberg™ name associated with the work. You can easily comply with the terms of this agreement by keeping this work in the same format with its attached full Project Gutenberg™ License when you share it without charge with others. 1.D. The copyright laws of the place where you are located also govern what you can do with this work. Copyright laws in most countries are in a constant state of change. If you are outside the United States, check the laws of your country in addition to the terms of this agreement before downloading, copying, displaying, performing, distributing or creating derivative works based on this work or any other Project Gutenberg™ work. The Foundation makes no representations concerning the copyright status of any work in any country other than the United States. 1.E. Unless you have removed all references to Project Gutenberg: 1.E.1. The following sentence, with active links to, or other immediate access to, the full Project Gutenberg™ License must appear prominently whenever any copy of a Project Gutenberg™ work (any work on which the phrase “Project Gutenberg” appears, or with which the phrase “Project Gutenberg” is associated) is accessed, displayed, performed, viewed, copied or distributed: This eBook is for the use of anyone anywhere in the United States and most other parts of the world at no cost and with almost no restrictions whatsoever. You may copy it, give it away or re-use it under the terms of the Project Gutenberg License included with this eBook or online at www.gutenberg.org. If you are not located in the United States, you will have to check the laws of the country where you are located before using this eBook. 1.E.2. If an individual Project Gutenberg™ electronic work is derived from texts not protected by U.S. copyright law (does not contain a notice indicating that it is posted with permission of the copyright holder), the work can be copied and distributed to anyone in the United States without paying any fees or charges. If you are redistributing or providing access to a work with the phrase “Project Gutenberg” associated with or appearing on the work, you must comply either with the requirements of paragraphs 1.E.1 through 1.E.7 or obtain permission for the use of the work and the Project Gutenberg™ trademark as set forth in paragraphs 1.E.8 or 1.E.9. 1.E.3. If an individual Project Gutenberg™ electronic work is posted with the permission of the copyright holder, your use and distribution must comply with both paragraphs 1.E.1 through 1.E.7 and any additional terms imposed by the copyright holder. Additional terms will be linked to the Project Gutenberg™ License for all works posted with the permission of the copyright holder found at the beginning of this work. 1.E.4. Do not unlink or detach or remove the full Project Gutenberg™ License terms from this work, or any files containing a part of this work or any other work associated with Project Gutenberg™. 1.E.5. Do not copy, display, perform, distribute or redistribute this electronic work, or any part of this electronic work, without prominently displaying the sentence set forth in paragraph 1.E.1 with active links or immediate access to the full terms of the Project Gutenberg™ License. 1.E.6. You may convert to and distribute this work in any binary, compressed, marked up, nonproprietary or proprietary form, including any word processing or hypertext form. However, if you provide access to or distribute copies of a Project Gutenberg™ work in a format other than “Plain Vanilla ASCII” or other format used in the official version posted on the official Project Gutenberg™ website (www.gutenberg.org), you must, at no additional cost, fee or expense to the user, provide a copy, a means of exporting a copy, or a means of obtaining a copy upon request, of the work in its original “Plain Vanilla ASCII” or other form. Any alternate format must include the full Project Gutenberg™ License as specified in paragraph 1.E.1. 1.E.7. Do not charge a fee for access to, viewing, displaying, performing, copying or distributing any Project Gutenberg™ works unless you comply with paragraph 1.E.8 or 1.E.9. 1.E.8. You may charge a reasonable fee for copies of or providing access to or distributing Project Gutenberg™ electronic works provided that: • You pay a royalty fee of 20% of the gross profits you derive from the use of Project Gutenberg™ works calculated using the method you already use to calculate your applicable taxes. The fee is owed to the owner of the Project Gutenberg™ trademark, but he has agreed to donate royalties under this paragraph to the Project Gutenberg Literary Archive Foundation. Royalty payments must be paid within 60 days following each date on which you prepare (or are legally required to prepare) your periodic tax returns. Royalty payments should be clearly marked as such and sent to the Project Gutenberg Literary Archive Foundation at the address specified in Section 4, “Information about donations to the Project Gutenberg Literary Archive Foundation.” • You provide a full refund of any money paid by a user who notifies you in writing (or by e-mail) within 30 days of receipt that s/he does not agree to the terms of the full Project Gutenberg™ License. You must require such a user to return or destroy all copies of the works possessed in a physical medium and discontinue all use of and all access to other copies of Project Gutenberg™ works. • You provide, in accordance with paragraph 1.F.3, a full refund of any money paid for a work or a replacement copy, if a defect in the electronic work is discovered and reported to you within 90 days of receipt of the work. • You comply with all other terms of this agreement for free distribution of Project Gutenberg™ works. 1.E.9. If you wish to charge a fee or distribute a Project Gutenberg™ electronic work or group of works on different terms than are set forth in this agreement, you must obtain permission in writing from the Project Gutenberg Literary Archive Foundation, the manager of the Project Gutenberg™ trademark. Contact the Foundation as set forth in Section 3 below. 1.F. 1.F.1. Project Gutenberg volunteers and employees expend considerable effort to identify, do copyright research on, transcribe and proofread works not protected by U.S. copyright law in creating the Project Gutenberg™ collection. Despite these efforts, Project Gutenberg™ electronic works, and the medium on which they may be stored, may contain “Defects,” such as, but not limited to, incomplete, inaccurate or corrupt data, transcription errors, a copyright or other intellectual property infringement, a defective or damaged disk or other medium, a computer virus, or computer codes that damage or cannot be read by your equipment. 1.F.2. LIMITED WARRANTY, DISCLAIMER OF DAMAGES - Except for the “Right of Replacement or Refund” described in paragraph 1.F.3, the Project Gutenberg Literary Archive Foundation, the owner of the Project Gutenberg™ trademark, and any other party distributing a Project Gutenberg™ electronic work under this agreement, disclaim all liability to you for damages, costs and expenses, including legal fees. YOU AGREE THAT YOU HAVE NO REMEDIES FOR NEGLIGENCE, STRICT LIABILITY, BREACH OF WARRANTY OR BREACH OF CONTRACT EXCEPT THOSE PROVIDED IN PARAGRAPH 1.F.3. YOU AGREE THAT THE FOUNDATION, THE TRADEMARK OWNER, AND ANY DISTRIBUTOR UNDER THIS AGREEMENT WILL NOT BE LIABLE TO YOU FOR ACTUAL, DIRECT, INDIRECT, CONSEQUENTIAL, PUNITIVE OR INCIDENTAL DAMAGES EVEN IF YOU GIVE NOTICE OF THE POSSIBILITY OF SUCH DAMAGE. 1.F.3. LIMITED RIGHT OF REPLACEMENT OR REFUND - If you discover a defect in this electronic work within 90 days of receiving it, you can receive a refund of the money (if any) you paid for it by sending a written explanation to the person you received the work from. If you received the work on a physical medium, you must return the medium with your written explanation. The person or entity that provided you with the defective work may elect to provide a replacement copy in lieu of a refund. If you received the work electronically, the person or entity providing it to you may choose to give you a second opportunity to receive the work electronically in lieu of a refund. If the second copy is also defective, you may demand a refund in writing without further opportunities to fix the problem. 1.F.4. Except for the limited right of replacement or refund set forth in paragraph 1.F.3, this work is provided to you ‘AS-IS’, WITH NO OTHER WARRANTIES OF ANY KIND, EXPRESS OR IMPLIED, INCLUDING BUT NOT LIMITED TO WARRANTIES OF MERCHANTABILITY OR FITNESS FOR ANY PURPOSE. 1.F.5. Some states do not allow disclaimers of certain implied warranties or the exclusion or limitation of certain types of damages. If any disclaimer or limitation set forth in this agreement violates the law of the state applicable to this agreement, the agreement shall be interpreted to make the maximum disclaimer or limitation permitted by the applicable state law. The invalidity or unenforceability of any provision of this agreement shall not void the remaining provisions. 1.F.6. INDEMNITY - You agree to indemnify and hold the Foundation, the trademark owner, any agent or employee of the Foundation, anyone providing copies of Project Gutenberg™ electronic works in accordance with this agreement, and any volunteers associated with the production, promotion and distribution of Project Gutenberg™ electronic works, harmless from all liability, costs and expenses, including legal fees, that arise directly or indirectly from any of the following which you do or cause to occur: (a) distribution of this or any Project Gutenberg™ work, (b) alteration, modification, or additions or deletions to any Project Gutenberg™ work, and (c) any Defect you cause. Section 2. Information about the Mission of Project Gutenberg™ Project Gutenberg™ is synonymous with the free distribution of electronic works in formats readable by the widest variety of computers including obsolete, old, middle-aged and new computers. It exists because of the efforts of hundreds of volunteers and donations from people in all walks of life. Volunteers and financial support to provide volunteers with the assistance they need are critical to reaching Project Gutenberg™’s goals and ensuring that the Project Gutenberg™ collection will remain freely available for generations to come. In 2001, the Project Gutenberg Literary Archive Foundation was created to provide a secure and permanent future for Project Gutenberg™ and future generations. To learn more about the Project Gutenberg Literary Archive Foundation and how your efforts and donations can help, see Sections 3 and 4 and the Foundation information page at www.gutenberg.org. Section 3. Information about the Project Gutenberg Literary Archive Foundation The Project Gutenberg Literary Archive Foundation is a non-profit 501(c)(3) educational corporation organized under the laws of the state of Mississippi and granted tax exempt status by the Internal Revenue Service. The Foundation’s EIN or federal tax identification number is 64-6221541. Contributions to the Project Gutenberg Literary Archive Foundation are tax deductible to the full extent permitted by U.S. federal laws and your state’s laws. The Foundation’s business office is located at 809 North 1500 West, Salt Lake City, UT 84116, (801) 596-1887. Email contact links and up to date contact information can be found at the Foundation’s website and official page at www.gutenberg.org/contact Section 4. Information about Donations to the Project Gutenberg Literary Archive Foundation Project Gutenberg™ depends upon and cannot survive without widespread public support and donations to carry out its mission of increasing the number of public domain and licensed works that can be freely distributed in machine-readable form accessible by the widest array of equipment including outdated equipment. Many small donations ($1 to $5,000) are particularly important to maintaining tax exempt status with the IRS. The Foundation is committed to complying with the laws regulating charities and charitable donations in all 50 states of the United States. Compliance requirements are not uniform and it takes a considerable effort, much paperwork and many fees to meet and keep up with these requirements. We do not solicit donations in locations where we have not received written confirmation of compliance. To SEND DONATIONS or determine the status of compliance for any particular state visit www.gutenberg.org/donate. While we cannot and do not solicit contributions from states where we have not met the solicitation requirements, we know of no prohibition against accepting unsolicited donations from donors in such states who approach us with offers to donate. International donations are gratefully accepted, but we cannot make any statements concerning tax treatment of donations received from outside the United States. U.S. laws alone swamp our small staff. Please check the Project Gutenberg web pages for current donation methods and addresses. Donations are accepted in a number of other ways including checks, online payments and credit card donations. To donate, please visit: www.gutenberg.org/donate. Section 5. General Information About Project Gutenberg™ electronic works Professor Michael S. Hart was the originator of the Project Gutenberg™ concept of a library of electronic works that could be freely shared with anyone. For forty years, he produced and distributed Project Gutenberg™ eBooks with only a loose network of volunteer support. Project Gutenberg™ eBooks are often created from several printed editions, all of which are confirmed as not protected by copyright in the U.S. unless a copyright notice is included. Thus, we do not necessarily keep eBooks in compliance with any particular paper edition. Most people start at our website which has the main PG search facility: www.gutenberg.org. This website includes information about Project Gutenberg™, including how to make donations to the Project Gutenberg Literary Archive Foundation, how to help produce our new eBooks, and how to subscribe to our email newsletter to hear about new eBooks.