The Project Gutenberg eBook of ఈ దారి ఎక్కడికి? (రధచక్రాలు - ఉత్తరగాధ) This ebook is for the use of anyone anywhere in the United States and most other parts of the world at no cost and with almost no restrictions whatsoever. You may copy it, give it away or re-use it under the terms of the Project Gutenberg License included with this ebook or online at www.gutenberg.org. If you are not located in the United States, you will have to check the laws of the country where you are located before using this eBook. Title: ఈ దారి ఎక్కడికి? (రధచక్రాలు - ఉత్తరగాధ) Author: Mahidhara Ramamohan Rao Release date: October 10, 2015 [eBook #50178] Most recently updated: October 22, 2024 Language: Telugu Credits: Produced by the volunteers at Pustakam.net *** START OF THE PROJECT GUTENBERG EBOOK ఈ దారి ఎక్కడికి? (రధచక్రాలు - ఉత్తరగాధ) *** ఈ దారి ఎక్కడికి? (రధచక్రాలు - ఉత్తరగాధ) మహీధర రామమోహనరావు అవంతి ప్రచురణలు                                                                                                                                                                                                 ప్రజాశక్తి నగర్, విజయవాడ - 10 హృదయవేదన నా రధచక్రాలు నవలకిది ఉత్తరకధ. ఇరవయి రెండేళ్ల అనంతరపు 1969 నవంబరు ఘటనలు ఇందులోని కధావస్తువు. “మన తెలుగుదేశంలో జాతీయోద్యమాన్ని మూలమూలలకంటా తీసుకుపోవటంలో కాంగ్రెసు అసామాన్య కృషి చేసింది. రాజకీయవిజ్ఞానాన్నీ, త్యాగనిరతినీ ప్రజాసామాన్యంలోకి పాకించడంలో కమ్యూనిస్టుపార్టీ అసాధారణ కృషి చేసింది. ఈ పార్టీల కృషిని గుర్తించగలిగినప్పుడే ఆనాటి తెలుగు దేశం మనకర్ధం అవుతుంది.” “1946 చివరి భాగం నాటి తెలుగుదేశం నా నవలకు పూర్వరంగం. మన తెలుగుదేశపు ప్రజావుద్యమాల అభివృద్ధిలో అది ఒక సంధియుగం.” “అటుతర్వాత తెలుగుదేశంలో జరిగిన ఘటనలకు నాంది ఆ రోజుల్లోనే జరిగింది.” రధచక్రాలు పీఠికలోని వాక్యాలివి. ఆ నవల ఉత్తరకధగా వ్రాసిన “ఈదారి ఎక్కడికి?” ఆనాటి మహోద్యమాలలో వచ్చిన విశీర్ణతను దీగ్భ్రమతో నెమరువేస్తూంది. ఈ విశీర్ణతకు కూడా బీజాలు ఆ నవలలోనే చిత్రించబడడం చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. సామాజిక వాస్తవికతాచిత్రణకది గీటు! ఇందులోని ప్రశ్న - ఈ విశీర్ణతకు తప్పెవరిదనేది కాదు. అది ఎందుకొచ్చిందనీ కాదు. విశీర్ణత చారిత్రక సత్యం. దీనినింకా ఎంత దూరం కొనసాగనివ్వాలనేదే ప్రశ్న. ఇంకెంత దూ….రం….? మహీధర 1-1-72 మద్రాసు   పూజ్యమిత్రులు “చంద్రం” గారికి మొదటి భాగం ఒకటో ప్రకరణం “అగ్రహారం. దిగేవారు ఎవరో దిగండి.” కండక్టరు కేక విని జానకి ఉలికిపడింది. వెనక చక్రాల్ని ఈడ్చుకుంటూ బస్సు ఒక్క వూపులో నిలబడింది. “వేగం దిగాలి” అన్నాడు కండక్టరు. ఈమారు అతని కంఠంలో దాష్టీకం వినబడింది. బండి కుదుపుకు తూలిపోతూనే జానకి లేచి నిలబడింది. “పైన బెడ్డింగు వుంది, దింపు” అంటూ పురమాయించి, కొడుకు వెంటరాగా బస్సు దిగింది. అప్పటికే కండక్టరు పైకెక్కాడు. “ఇదేనా చూసుకోండి” అంటూనే సమాధానం కోసం కూడా ఆగకుండా “అందుకోరా-“ అని క్రిందనున్న కుర్రవానికి అందించేడు. తాను దిగి వచ్చేశాడు. ‘మాదే’ నన్న మాట రవీంద్ర నోట వుండగనే ‘అది మీదే’నని భరోసా ఇచ్చేడు. బస్సు కదిలిపోయింది. “యారింటికి ఎల్తారండి?” అని అడుగుతున్నాడు, బెడ్డింగు అందుకొని కింద పెట్టిన కుర్రాడు. తాను దిగవలసిన చోటు అదేనా అన్నట్లు జానకి దిక్కులు చూస్తూంది. గోదావరి వంతెన దాటి బస్సు వస్తూంటే, రోడ్డు ప్రక్కనున్న ఒకటో, రెండో చెట్లూ, మురుగు కోడు మీద వంతెనా లాంటివి ఆ మసక వెలుతురులో ఏవేవో పూర్వపు జ్ఞాపకాల్ని కెర్లించినట్లు తోచింది. కాని, ఇక్కడ అటువంటిది ఏమీ కనబడ్డం లేదు. ఈ దీపాలన్నీ వెలుగుతూంటే ఆ ప్రదేశం అంతా పట్టపగలులా వుంది కూడానూ! “ఏమిటల్లా చూస్తున్నావు?” అన్నాడు రవీంద్ర. “నేను ఎరిగిన చోటు కాదిది” అంది జానకి. ఆమె ఆ రూపంలో ఆ రోడ్డును ఎరగదు. ఈ వేళప్పటికి ఆ ప్రాంతమంతా నిర్జనంగా వుండేది. ఓ దుకాణం, ఓ దీపం వుండేది కాదు. అల్లాంటిది బస్సువాడు కలకలలాడుతూ మంచి సందడిగా వున్న బజారులో కాఫీ హోటలుకెదురుగా, ఇదే అగ్రహారం అని దింపిపోయేడు. కాఫీ హోటళ్ళు, సోడా దుకాణాలు, సైకిలు షాపులు, పళ్ళషాపులు, బట్టల షాపులు, సెలూన్లు, చిల్లరకొట్లు నియాన్ లైట్ల వెలుతురులో మెరిసిపోతున్నాయి. రోడ్డంతా పట్టపగలులా వుంది. జనం గుంపులు గుంపులుగా వున్నారు. ఆమెకు దిగ్భ్రమగా వుంది. “మనం దిగవలసింది ఇక్కడేనా? పొరపాటున బస్సువాడు మరో చోట దింపలేదుగద” అంది ఇంగ్లీషులో. “కనుక్కుంటా వుండు” అని రవీంద్ర కాఫీ హోటలు గుమ్మంలో కిళ్ళీషాపు ముందు నిలబడి వున్నవారి వేపు వెళ్ళాడు. వారూ అతని రాక కోసం ఎదురు చూస్తూన్నట్లు తమ సంభాషణ ఆపేరు. బస్సు రావడం, పోవడం వారి ఏకాగ్రతకు భంగం కలిగించలేదు గాని, ఒక స్త్రీ కంఠంలో ఇంగ్లీషు వినబడి వారు తిరగబడి చూశారు. “అగ్రహారం ఇదేనాండి?” అన్నాడు రవీంద్ర వారి దగ్గరగా అడుగు వేసి. ఆపాటి ప్రశ్న నన్నడిగితే చెప్పనా అన్నట్లు కూలి కుర్రాడు ఎదురు ప్రశ్న వేశాడు, “యారింటికెళ్ళాలండి?” “సత్యానందం గారింటికి” అంది జానకి. “పావలా ఇవ్వండి, నడండి” అంటూ వాడు బెడ్డింగు భుజానికెత్తుకున్నాడు. రవీంద్ర పలకరించిన ఆయన జానకి సమాధానం విని ఒక అడుగు ఇవతలికి వేశాడు. “అగ్రహారం ఇదేనమ్మా” అంటూ కూలి కుర్రాడికి ఎక్కడికి వెళ్లాలో చెప్పేడు. ‘సోమన్నా! తెలుసట్రా, ప్రెసిడెంటుగారు గుడివీధిలో క్రొత్తగా కట్టిన మేడ.’ అంతలో మళ్ళీ – “రిక్షాలో వెళ్ళండి. చీకటి, ఇబ్బంది పడతారేమో” అని సలహా యిచ్చేడు. “సత్యానందంగోరి ఇల్లు నేను ఎరక్కపోడమేటండి” అంటూ జానకికి రిక్షాలో వెళ్ళడం అనవసర శ్రమ అని చెప్పేడు సోమన్న. “రాజవీధిలోకి మళ్ళి పది అడుగులు వేస్తే గుడి వీదండి. రిక్షా ఎక్కి దిగినంత సేపు పట్టదండి.” అంత దగ్గరలో వున్నదని చెప్పినందుకు తన కూలి నిరుకు చేసుకోడం అవసరం అనిపించి ‘పావలా ఇప్పించండి’ అన్నాడు. ఆ గ్రామస్థుణ్ణి జానకి గుర్తుపట్టింది. ధైర్యం కలిగింది. తనను బస్సువాడు దింపింది, అగ్రహారంలోనే. ఆయన మాత్రం జానకిని గుర్తు పట్టలేదు. ‘ఇల్లు దగ్గరేనమ్మా!’ అని ఆమెకు ధైర్యం చెప్పి, ఎరగని వాళ్ళను చేసి, హెచ్చు కూలి అడుగుతున్నందుకు సోమన్నని కోప్పడ్డాడు. “కొత్తవాళ్ళని బురిడి కొట్టించకూడదు. పది పైసలు ఇస్తారు తీసుకెళ్ళు.” సోమన్నకి కోపం వచ్చింది. “మా బాబుల్నాడు ఈ బస్సులు వున్నయ్యేటండి” అన్నాడు. ఆయన నవ్వేడు. “లేవురా. ఇప్పుడున్నాయి గనకనే ఈ పదిపైసలూ వస్తున్నాయి. వెళ్ళు తీసుకెళ్ళు” అని ఆయన మిత్రబృందం వేపు అడుగు వేసేడు. సోమన్న వెనక రాజవీధిలోకి మళ్ళుతున్న జానకికి వెనక నుంచి వారంతా తనను గురించే మాట్లాడుకోడం వినిపిస్తూంది. “ఎవరామెట?” “సత్యానందం ఇంటికిట. ఎవరో భద్రమ్మగారి బంధువులై వుంటారు” అంటున్నాడు, తమకు ధైర్యం చెప్పిన ఆయన. “ఎక్కడో చూసిన మొహంలా వుంది” అంటున్నాడు మరొకడు. రెండో ప్రకరణం “ఆయన వెంకటనరసయ్యగారు కాదూ?” అంది జానకి తన అభిప్రాయాన్ని పరీక్షించుకొంటున్నట్లు. సోమన్న ఇంకా కోపంలోంచి తేరుకోలేదు. “ఆఁ ఆరె! ఎరువులూ, సిమెంటూ బ్లాకులో అమ్మి పది పన్నెండెకరాలు కొన్నారు. డబ్బు మూలుగుతోంది.” “అలాగా!” అంది జానకి. “బాబుల్నాడు ఎరుగుదురా అంట. బాబులు! పణసదార కిలో మూడు రూపాయలూ, నాల్రూపాయలూ ఎవరి బాబుల్నాడు అమ్మేరంట? కానీ ఇస్తే బెల్లం పట్టెడు ముక్క ఇచ్చేవోరంటుంది మా యమ్మ. ఇప్పుడు ఆపాటి ముక్క పావుకిలో అని అర్ధరూపాయి వూడగొడుతున్నారు. బియ్యం కిలో రూపాయి పావలా ఎవరి బాబులు ఎరుగుదురో....కూలాడి దగ్గరికొచ్చేతలికి పావలా కూలి బాబుల్నాడు నేదని గేపకం.” “అల్లాగే. పావలా ఇస్తానులే” అని జానకి వానికి తృప్తి కలిగించింది.... నడుస్తున్న వీధి నిర్మానుష్యంగా వుంది. తలుపులు తెరిచే వున్నాయి, ఇళ్ళకి. సావిళ్ళలోంచి రేడియోలో తెలుగు వార్తలు వెంటాడుతున్నాయి. కాని, ఎక్కడా మనుష్య సంచారం వున్నట్టు లేదు. “ఏడుగంటల వార్తలు వస్తున్నాయి. ఎక్కడా మనిషి పొడ కనబడదేమిటమ్మా!” అంటూ రవీంద్ర తల్లిని ఆశ్చర్యంగా ప్రశ్నించేడు. “పల్లెటూళ్ళంటే ఏమిటనుకొన్నావు?” అంది జానకి. అంతలో పల్లెటూరి అలవాట్లు గుర్తొచ్చాయి. “భోజనాల వేళ, అంతా యిళ్ళలో వుండి వుంటారు.” “అప్పుడేనా భోజనాలు?” “బొంబాయిలాంటి పట్టణాల్లో అలవాట్లు వేరు. ఇక్కడ ఇంతే.” “అమ్మో!” అన్నాడు రవీంద్ర. నెల్లాళ్ళు వుండాలని వచ్చిన వుత్సాహం బస్సు దగేసరికే హరించుకుపోయినట్లనిపించింది. జానకి నవ్వింది. “ఇంకా వూళ్ళో అడుగేనా పెట్టకుండానే వెళ్ళిపోదామనేలా వున్నావే.” తల్లి నవ్వుతూంటే, రవీంద్రా నవ్వేడు. వారి సంభాషణ వింటున్న సోమన్న – “తమరు బొంబాయి నుంచి వొత్తున్నారాండీ” అన్నాడు. పరిసరాలూ, ఇళ్ళూ గుర్తు చేసుకొంటున్న జానకి ఏమీ సమాధానం ఇవ్వలేదు ఆ మాటకి. “ఈ ఇల్లు....” “డాకటేరుగారిదండి” అని సోమన్న ఆమె వాక్యం పూర్తి చేశాడు. “సుందరరావుగారు బాగున్నారా?” “డాకటరుగారి తండ్రిగారాండి?” అని సోమన్న ప్రశ్న. “బావున్నారండి, ఆరికేమండి.” జానకి సుందరరావును డాక్టరుగా ఎరుగును. సోమన్న మాట వింటే మరొకరెవరో డాక్టరన్నట్లుంది. “మరి డాక్టరెవరు?” “రంగనాయకులు గారండి. మంచి చెయ్యండి.” “ఎవరు రంగనాయకులా?” అంది జానకి ఆశ్చర్యంగా. ‘అంతవాడయ్యాడన్న మాట.’ అనుకొంది, అర్థస్వగతంగా. సోమన్న హూషారుగా చెప్పుకుపోయేడు. “మీరు బస్సు దిగినకాడికి కూంత అసింటా వుందండి ఆసుపిటలు. మంచి బాబు! కూలోడు, బీదోడు అంటే ఉట్టినే మందిస్తారండి. ఇంజీషన్లూ అవీ మన్ని తెచ్చుకోమంటారండి....” హఠాత్తుగా వానికి తమ డాక్టరుగారిని జానకి ఏకవచనంలో పేర్కొందనీ, అంతవాడు అయ్యాడా అన్నదనీ జ్ఞాపకం వచ్చింది. “తవరిది ఈ యూరేనాటండి.” అనాలోచితంగా జానకి అనేసింది. “ఆ. ఎప్పుడో, బతికున్న రోజుల్లో.” అంతలో ఆమెకే అనుమానం కలిగింది. ఆ వుళ్ళో తాను బ్రతికినదీ ఒక బ్రతుకేనా అనిపించింది. మాట మారుస్తూ “ఇదే కదూ గుడివీధి!” అంది. “ఔనండి. ఆ కనపడేదేనండి సత్యానందం గారిల్లు.” తాము ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చినవారిల్లు అదే అనేసరికి రవీంద్ర వుత్సుకత చూపుతూ ‘ఏదీ?’ అన్నాడు. ఆ చీకట్లో సోమన్న చూపిన ఇల్లేదో అతడికి తెలియలేదు. “మిద్దెమీద లైట్లున్న ఇల్లండి. అదే ఆ లైటు స్తంబం అగతలండి.” మూడో ప్రకరణం ఇంటి గేటు ముందు జానకి చటుక్కున నిలబడింది. తాను ఎరిగిన ఇల్లు కాదది. అప్పుడు ఇల్లు వీధి మీదికే వుండేది. పూర్వకాలపు మండువా పెంకుటిల్లు. పెద్ద ఎత్తు అరుగులూ అదీ. ఇప్పుడు ఆ వెనకటి చిన్నెలే లేవు. దానిని పూర్తిగా తీసేసి కొంత ముందు జాగా వదిలి లోపలగా కట్టేరు. చుట్టూ ప్రహరీ. ఇంటికీ ప్రహరీకీ మధ్య నల్లని పోగులు కనబడుతున్నాయి. పూలమొక్కలు కాబోలు. మేడ మీదా, దిగువ గదుల్లోనూ ట్యూబ్‌లైట్లు వెలుగుతున్నాయి. హాలులో రేడియో పలుకుతూంది. “ఊరూ ఇల్లూ మాత్రమేనా మనుష్యులు కూడా మారిపోయారా?” అనుకొంది. “మెట్లు. జాగ్రత్తగా రా నాన్నా!” అంటూ నెమ్మదిగా గేటు తెరిచింది. సావడిలోని లైటు వెలుతురు పడి, గేటు నుంచి ఇంటి వరకూ తిన్నని సిమెంటు దారి, దానికి అటూ యిటూ బంతి మొక్కల వరసలూ కనిపిస్తూ వున్నాయి. వెనక వస్తున్న కూలి కుర్రాడికి, ‘గేటువేసి ర’మ్మని హెచ్చరిక చెప్తూ జానకి ముందుకడుగు వేసింది. గేటు తీసిన చప్పుడు హాలులోకి వినబడి వుంటుంది. మాట వినిపించింది. “అంత గట్టిగా ఎందుకే రాధీ, రేడియో? తగ్గించు. వీధిలైటు వేయి మీనా, ఎవరో వస్తున్నట్లున్నారు.” “భద్రక్కే” అంది జానకి నెమ్మదిగా కొడుకుతో. ఆమె అభిప్రాయాన్ని ధృవపరుస్తూ భద్ర గుమ్మంలోకి వచ్చింది, వరాండాలో లైటు రెండు మూడుమార్లు మిటకరించి, తెల్లగా వెలిగింది. ఆ వెలుతురులో కొత్తవారెవరో బెడ్డింగు పట్టించుకొని వస్తూండడం గమనించి, భద్ర మెట్ల మీదకి అడుగుపెడుతూ ఆహ్వానించింది. “రాండమ్మా! రాండి.” ఆ ఆహ్వానమే ఆమె తనను గుర్తుపట్టలేదని చెప్తూంది. ఆమె మెట్లు కూడా దిగి తమ ముందుకే వచ్చింది. అయినా గుర్తు పట్టలేదు. జానకి మనస్సులో కొంటెతనం పొటమరించింది. కొంచెంసేపు ఆట పట్టించాలి! “ఇల్లా ఇసకపూడి వెడుతూ బస్సు దిగేం. చీకటి పడిపోయింది. ఈ రాత్రికి....” జానకి తమ రాకకో కథ కల్పించింది. ఆ కథను భద్ర నిజమనే నమ్మింది. జానకిని ఆమె గుర్తించలేదు. ఆమె కంఠస్వరమన్నా గుర్తు తెలియలేదు. చాల ఆప్యాయంగా ఇంట్లోకి ఆహ్వానించింది. “మంచిపని చేసేరు. చీకట్లో పుంతని పడిపోవాలి. రాళ్ళూ, ముళ్ళే కాదు. పురుగూ, పుట్రా తిరుగుతూంటుంది. అమావాస్య ముందు కూడానూ....” ఏకటాకీని జానకి తమ యింటికి రావడం ఎంత మంచి నిర్ణయమో గుక్క తిప్పుకోకుండా చెప్పి, చివర మళ్ళీ అంది. “వూరు గాని అడవి కాదు. మంచి పని చేశారు....రా, బాబూ!” అంటూ ఆమె వెనకనే వున్న రవీంద్రను సాదరంగా పలకరించింది. అతడు నమస్కరిస్తూంటే నవ్వుతూ ఆశీర్వదించింది. “మీ అబ్బాయా? బాగుంది రాండి” అంటూ వారితో పాటు తానూ మెట్లపైకి వచ్చింది. బెడ్డింగు లోపలికి తీసుకెళ్ళమని సోమన్నను ఆదేశించింది. “మీనా, బెడ్డింగు బల్ల మీద పెట్టించు తల్లీ!” అష్టావధానం చేసినట్లు అందరితో మాట్లాడుతూ భద్ర గృహిణీ ధర్మం నిర్వర్తిస్తూంటే జానకి నవ్వు ఆపుకుంటూ ఆమె వెనకనే లోపలికి వచ్చింది. బెడ్డింగు బల్ల మీద, చెప్పినచోట పెట్టేసి కూలి కుర్రాడు వచ్చి చెయ్యి చాపేడు. జానకి వాని చేతిలో పావలా పడేసింది. వాడు తన సంతృప్తిని నమస్కార రూపంలో వెల్లడించేడు. ‘దండాలండి.’ తర్వాత భద్ర వేపు తిరిగి, తాను లేకపోతే ఆ అతిధులు రోడ్డు మీద చాల కష్టపడి వుండేవారన్నట్లు వర్ణించేడు. “సత్యానందంగోరి ఇల్లు ఎరుగుదురా అంటున్నారండి. వోరయ్య! ఆరిల్లు తెలీకపోడమేంటండి? ఈ వూరు వోలు మొత్తం మీద ఆరిని ఎరగనోళ్ళెవరండి? రాండి. తీసుకెళ్తానన్నా. ఎంకట నరసయ్యగోరు నేను సరిగ్గా తీసుకెల్లలేననేమో రిక్షా చేసుకు ఎల్లమన్నారండి. నేను తీసుకెల్లలేననే! పర్నేదు. నాతో రాండి. దిగెడతానన్నా” అంటూ వాడు వెడనవ్వు నవ్వేడు. “మంచిపని చేసేవు. వెళ్ళిరా” అంటూ భద్ర వానిని పంపేసి, మళ్ళీ అతిధులు యోగక్షేమాలు అందుకొంది. “కాళ్ళు కడుక్కుందురు గాని రాండి. అమ్మా అనూ! ఒక చెంబుతో నీళ్ళూ, తుండూ తెచ్చి ఇయ్యి....కొంచెం సేపు విశ్రాంతి తీసుకొనేసరికి వేణ్ణీళ్ళు కాగుతాయి....” “మీరేమీ శ్రమ పెట్టుకోవద్దు. ఇప్పుడు వంటా వార్పూ అని కూర్చోకండి. మా వద్ద రొట్టే, బిస్కట్లూ వున్నాయి. ఈ రాత్రికి ఆశ్రయం దొరికింది....” అది వూరే గాని అడవి గాదని భద్ర మరోమారు జ్ఞాపకం చేసింది. వేణ్ణీళ్ళు వద్దంటే వినలేదు. వినిపించుకోలేదు. “చలి తిరిగింది. ఇంకా నయం మాకేమీ శ్రమ లేదు. కుక్కరు మీద వంటా, హీటరులో నీళ్ళూ – ఇదీ శ్రమేనా? మీబోటి వాళ్లు ఏమిస్తే వస్తారు. రాండి. కాళ్ళు కడుక్కుందురుగాని....” ఆమె ముందు దారితీసి స్నానాలగది చూసింది-“సబ్బు అదిగో. నీళ్ళు అందులో వున్నాయి. తుండు ఇక్కడ పెడుతున్నా.” భద్రకు తానెవ్వరో తెలియదు. తెలియకుండానే ఎంతో ఆప్యాయత కనబరుస్తూంది. తన మాట కూడా చొరనివ్వకుండా సౌకర్యాలు అమరుస్తూంది. ఆమెకు తానెవరో చెప్పకపోవడం ఒక విధంగా ఆటగా వున్నా కష్టంగానే వుంది. అయితే సత్యానందాన్ని కూడా కొంతసేపు ఆటపట్టించే వరకూ బయటపడదలచలేదు, జానకి. ‘అక్క మనస్సు ఆరోగ్యంగానే వుంది’ అనుకొంది. ఆమెను తన ఆత్మబంధువుగా భావించి అక్కడికే వెతుక్కుంటూ వచ్చినందుకు సంతృప్తి కలిగింది. నాలుగో ప్రకరణం జానకి సావట్లోకి వచ్చేసరికి రవీంద్ర పిల్లలతో స్నేహం చేసేసేడు. మీనా చేతిలో అతడిచ్చిన బిస్కట్ల డబ్బా చూసి మంచిపని చేసేవన్నట్లు తల ఎగరేసింది. “మీనా చాలా మంచి అమ్మాయమ్మా!” అతని కవ్వింపు అర్థం చేసుకొంది, జానకి. “అనూరాధ మాత్రం?” మంచితనానికి పొగడ్త సంపాదించి, చెల్లెలు తనవంక కవ్విస్తూ చూస్తూంటే పదేళ్ళ అనూరాధకి తాను చేసింది పొరపాటనిపిస్తూంది. ఈమారు బెట్టుసరి చెయ్యకుండానే అతడిచ్చిన రెండో డబ్బా పుచ్చుకుంది. అప్పుడే కాఫీ కప్పుతో హాలులోకి వచ్చిన భద్ర పిల్లల చేతుల్లో బహుమానాలు చూసి-“అవెందుకండీ-“ అంది. జానకి చటుక్కున చనువుగా అంది. “మాకు మాత్రం ఇవెందుకండీ?” భద్ర ఒక్కేక్షణం తెల్లబోయి పక్కున నవ్వింది. “ఊ. తీసుకోండి. చల్లారిపోతుంది. రా నాయనా!” వారిద్దరూ చెరో కప్పు తీసుకు కూర్చున్నాక – “నీ పేరేమిటయ్యా! అడగేలేదు –“ అంది. “రవీంద్ర.” “మొహమాటపడకు. ఇంకావుంది. చల్లారిపోతుందని ఫ్లాస్కులో పోశా. ఎప్పుడెక్కేరో బస్సు. పాడు రోడ్లు, ఒళ్ళు హూనం అయిపోతూంది....” “ఇంక అక్కర్లేదండి” అన్నాడు రవీంద్ర. జానకి చిరునవ్వు నవ్వింది. “మా పొట్టల వైశాల్యం, ఆకలి పరిమితీ గురించి మీకేదో గట్టి అభిప్రాయమే వున్నట్టుంది-“ అంది. భద్ర నవ్వింది. “ఇంకా నయం..సరే కూర్చుని పిల్లలతో కబుర్లు చెప్తూండండి. వస్తా.” ఆమెతో పాటు తానూ వంటింట్లోకి వెంబడించాలని వున్నా జానకి అతి కష్టం మీద నిగ్రహించుకొంది. వెడితే తాను ఎంతోసేపు రహస్యం కాపాడుకోలేదు. రవీంద్రకు ఇదంతా ఇరకాటంగానే వుంది. తల్లి ఎంతో ఉత్సాహపడి వచ్చింది ఆ యింటికి. ఎంతో ఆప్తురాలని చెప్పిన ఆ యింటి గృహిణి ఆమెను గుర్తుపట్టలేదు. తల్లి అంత మారిపోయిందా? చిన్నప్పుడు యెల్లా వుండేదో.... అయితే వాళ్ళు తనను చూసి యిరవై ఒక్క ఏళ్లు గడిచేయనీ, తన్ను గుర్తుపట్టడం అనుమానమే అన్నట్లూ చెప్పింది. కనక, ఈ పరిస్థితి కష్టం అనిపించలేదు. పైగా కొంత వినోదంగానే వుంది. “నువ్వేం చదువుతున్నావు?” అని జానకి అనూరాధను దగ్గరకు తీసుకొంటూ అడిగింది. ఆ ప్రశ్న తనను అడక్కపోవడం సహించరానిదిగా మీనాకు తోచింది. అక్కగారు సమాధానం యివ్వడానికి వ్యవధి ఇవ్వకుండా ఏమన్నా చెప్పినా వినబడకుండా పెద్దగా “అయిదోక్లాసు” అంది. తనను చెప్పనీయకుండా అడ్డం వచ్చినందుకు అనూరాధ నిరసనగా చూసింది. కాని మీనా లెక్కచేయలేదు. “క్రిందటి నెల గాంధిగారి మీద వ్యాసం వ్రాసినందుకు దానికి బొమ్మల పుస్తకం బహుమతి యిచ్చేరు, చూపించనా....” రవీంద్ర “తరవాత చూపిద్దువుగానిలే” అన్నా వినిపించుకోకుండా, గంతులేసి చెయ్యి విడిపించుకొని పరుగెత్తింది. రవీంద్ర నవ్వాడు. జానకి “చిన్నతనం వుబలాటం” అంది. పెద్ద ఆరిందాలాగ అనూరాధ – “అదెప్పుడూ అంతే. ఎవ్వరిమాటా వినబడకుండా అరిచి చెప్తుంది.” అంది. “నువ్వు? ఏమీ మాటే ఆడవు” అన్నాడు, రవీంద్ర. ఆనూరాధ సిగ్గుపడింది. “మరి మీ అక్క సాధన ఏదీ?” అని జానకి అడిగింది. అంతలో మళ్ళీ నాలిక కరచుకొంది. ఆ యింటిలో ఎవ్వరినీ యెరగనట్లు నటిస్తున్నదాయె. మరి సాధన అనే అమ్మాయి, ఆమె అక్కగారు ఆ యింట్లో వున్నదని యెలా తెసుసన్న ప్రశ్న రాదూ? వచ్చింది. యథాలాపంగా సాధన మేడమీద చదువుకొంటుందనేసినా, అనూరాధకు ఆ ప్రశ్న తోచకపోలేదు. “మీకు మా అక్కయ్య తెలుసునా?” జానకి యేంచెప్పాలా అని ఆలోచిస్తూంటే రవీంద్ర గంభీరంగా తల వూపేడు. అనూరాధ తన వూహ పొడిగించింది. “మీరెవరో తెలిసింది.” రవీంద్ర వాళ్ళ అక్క క్లాస్‌మేట్ అయి వుంటాడు. “మీరు మా అక్క కాలేజీలో లెక్చరరా?” వయస్సును పట్టి రవీంద్రకూ, వేషధారణనుబట్టి జానకికీ పాత్రలను అనూరాధ నిర్ణయం చేసింది. కట్టు, బొట్టు, తలకట్టు, కాలిజోడు, చేతిన గడియారం, పర్సు – ఇవన్నీ ఆమె వుద్యోగాన్ని నిర్ధారణ చేయడంలో సాయపడ్డాయి. ఔను, కాదు అననక్కర్లేకుండా మీనా పుస్తకం తీసుకొని తుఫానులా వచ్చింది. రవీంద్ర ఆమెను పక్కనే కూర్చోబెట్టుకొని, బుద్ధిమంతుడల్లే ఆమె చూపిన బొమ్మలూ, చేస్తున్న వ్యాఖ్యలూ వింటున్నాడు. జానకి అనూరాధని స్కూలు కబుర్లు అడుగుతూంది. ఆ మాటల మధ్యలో మీనా అందుకొనేవరకూ ఆమె అటు ఒక చెవివేసి వున్నదని ఎవ్వరికీ తెలియదు. హఠాత్తుగా....’నిన్ననే….’ అంది. అంటూ చెప్పెయ్యనా అన్నట్టు అక్కవంక చూసింది. ఆమెకు అర్థం కాలేదు. కనుబొమలు కుంచించింది-‘నిన్ననేమిటి?’-అంది. “మరేమోనే....”-అంటూ తాను చెప్పబోయే వార్తను గురించి వూరించింది. రవీంద్ర చిరునవ్వుతో భుజం తట్టేడు. “నిన్ననేమయింది?” “రంగమ్మగారు సైన్సు మేస్టారిని చీపురుకట్ట తీసుకొని వీధిలోకి తరుముకొచ్చింది.” అంటూ కిలకిల నవ్వింది. ఈ పిల్ల వూళ్ళోవున్న రంకు పురాణాలన్నీ ఏకరువు పెడుతుంది కాబోలురా, భగవంతుడా – అని జానకి భయపడింది. ఆ ఘటనలో పదేళ్ళ అనూరాధకి వినోద భాగంకన్న విచారించవలసిన అంశం బలంగా కనబడింది. చెల్లెల్ని కోప్పడింది. “ఎందుకా నవ్వు? పాపం రంగమ్మగారికి పిచ్చి ఎత్తింది.” “పాపం” అని జానకి సానుభూతి చూపించింది. తన మాట శ్రోతల్ని కదిలించలేక పోవడం, అనూరాధ మాటకు జానకి సానుభూతి తెలపడం మీనాకు చిన్నతనం అనిపించింది. వెంటనే కధ మార్చింది. “ఆవిడ కొడుకు చచ్చిపోయేడు. అందుకు పిచ్చిదైపోయింది.” “ఔనా?” అంది జానకి. అనూరాధ తల తిప్పింది. “పాపం. ఎన్నేళ్లుంటాయి?” “మా అన్నయ్యకి స్నేహితుడు. కేశవరావు అని” సంభాషణ తన తలకు మించి సాగిపోతూంటే మీనాకు దాని మీద అభిరుచి పోయింది. మార్గాంతరం కోసం వెతుకుతుంటే వీధిగేటు చప్పుడయింది. మీనాక్షి ఒక్కగంతు వేసింది. “నాన్నారు, వచ్చేశారు.” ఒక్క పరుగున వచ్చిన కూతుర్ని చటుక్కుని ఎగరేసి ఎత్తుకుంటూ సత్యానందం సావట్లో అడుగు పెట్టేడు. “నాకోసం ఎవరన్నా వచ్చేరా, తల్లీ” అంటూ బల్ల వేపు తిరిగేడు. జానకి కుర్చీలోంచి లేచింది. “కూర్చోండి” అని ఆమెను వారిస్తూంటే రవీంద్ర ముందుకు వచ్చేడు. “నమస్కారం.” సత్యానందం ప్రతి నమస్కారం చేసేడు. “మీ అమ్మగారా! కూర్చోండి.” అనూరాధ ఆమెను పరిచయం చేసింది. “అక్క కాలేజీలో లెక్చరరు. ఆయన అక్క....” సత్యానందం మాట మధ్యలోనే సంతోషం తెలిపేడు. “అలాగా, చాల సంతోషం. తమ దర్శనం ఎన్నడూ చెయ్యలేదు. కూర్చొండి. కూర్చో నాయనా! ఏదీ సాధన కనబడదు. ఎంత సేపయింది తమరు దయచేసి? రోడ్డుమీద ఎవరో చెప్పేరు. ఎవరో ఆడవాళ్ళు బస్సు దిగి మా యిల్లు అడిగేరని... తమరే నన్నమాట. చాల మంచిపని చేశారు.” అంటూ కూతుర్ని అడిగేడు. “అక్కతో చెప్పేవా, మేడం వచ్చేరని?” అనూరాధ చిన్నబోయింది, తన పొరపాటుకి. “లేదూ? చెప్పొద్దు తల్లీ!...పోనీ అమ్మతోనన్నా చెప్పేవా?” జానకి వస్స్తున్న నవ్వు ఆపుకొంటూ—‘అమ్మగారు కనిపించేరండి, కాఫీ అవీ యిచ్చేరు. వారి ఆదరణ మరిచిపోలేము. ఇప్పుడే లోపలికి వెళ్ళేరు,’ అంది.  భార్య వారికి కాఫీ అవీ యిచ్చి ఆదరించిందని విన్నాక సత్యానందం వారినే ‘ఎవరు? ఎందుకొచ్చేరు?’ లాంటి ప్రశ్నలు వేయడం అనవసరం అనుకొన్నాడు. భద్రని అడిగితే తెలుస్తుందనుకొన్నాడు. “బాగుంది. బాగుంది. కూర్చోండి, సాధనను పంపిస్తాను.” అతిధుల విషయంలో తన బాధ్యత తీరిందన్నట్లు సంతృప్తితో లోగుమ్మంవేపు కదిలేడు. ఇంక జానకి పట్టలేకపోయింది. ఫక్కున నవ్వేసింది. “ఏం బావా? మీ యింట్లో వాళ్ళందరికీ అంత మరుపు వొచ్చేసిందా? ” ఆ నవ్వుకి నిలబడిపోయిన సత్యానందం ఆ ఆరోపణకి తెల్లబోయేడు. “ఏమిటల్లా చూస్తావు?.... గుర్తు రాలేదూ? నేను జానకిని. వీడు రవీంద్ర... ” ఆ పేర్లు ఎక్కడ విన్నానా యన్నట్లు సత్యానందం నోట్లోనే వల్లించుకొన్నాడు. “జానకి ....రవీంద్ర... జానకి…” జానకి అర్థం చేసుకొంది. తమరు అక్కడికి రాగలరనే ఆలోచన కూడా లేని మనిషికి ఆ పరిచయం కేవలం గంద్రగోళమే. ఇంక నవ్వలేకపోయింది. “బొంబాయినుంచి వస్తున్నాం...” బొంబాయినుంచి అనడంతోనే సత్యానందానికి ఆమె గుర్తువచ్చింది. ఆశ్చర్యం, సంతోషంతో ముఖం వెలిగింది. చటుక్కున ముందుకు వచ్చి రవీంద్ర భుజం మీద చెయ్యివేసి, కౌగలించుకొన్నాడు. “నువ్వు రవీంద్రవా? పెద్దవాడవయ్యావు. .” అతని కళ్ళలో నీళ్ళు చూసి రవీంద్ర కదిలిపోయేడు. “తమరందర్నీ చూడాలనే…..” సత్యానందం కళ్ళు తుడుచుకుని సోఫాలో కూర్చున్నాడు. రవీంద్రను కూర్చోబెట్టుకొని-- 'రా, జానకీ', అన్నాడు. పక్కనే కుర్చీలో కూర్చున్న జానకిని పరీక్షగా చూస్తూ, ‘ఎంత మారిపోయేవు!’ అన్నాడు. తాను మారినట్లు జానకి ఎరుగును. కాని అత్యంత సన్నిహితులు కూడా గుర్తు పట్టలేనంతగా మార్పు వున్నదని ఆమెకు ఆ క్షణం వరకు తోచలేదు. “గుర్తు పట్టలేకపోయాను” అన్నాడు. ఆ మార్పు సంవత్సరాలని పట్టి వచ్చింది కానే కాదు. ఇద్దరూ ఎరుగుదురు. కాని పైకి ఒక్కరూ చెప్పరు. సత్యానందం చివరకు ఒక కారణం కల్పించుకొన్నాడు. “ఊహించనిచోట, ఊహించలేని మనిషిని చూస్తే గుర్తుపట్టడం కష్టం.” జానకికి తన ప్రయత్నం ఙ్ఞాపకం వచ్చి నవ్వింది. “మీరెల్లా వున్నారో చూడాలని.. .” “....ఉత్తరమేనా వ్రాయకుండా వచ్చేవు. ఔనా-” అన్నాడు. నాలుగో ప్రకరణం అంతలో భద్రతోకూడా ఇల్లాగే ఆటాడివుంటుందనిపించింది. “ఇక్కడ ఇంత శాంతంగా కూర్చున్నావు. భద్రతోకూడా ఇల్లాగే నాటకం ఆడేవా?” జానకి నవ్వింది. సందేహం ఏం వుంది? సత్యానందం లేచి నిలబడి, ఆమె రెక్క పట్టుకు బయలుదేరతీసేడు. “రా, లే... భద్రా! భద్రా! ” పిలుపుమీద పిలుపుగా భర్తమాట విని భద్ర చేతిలో పని పక్కకి పెట్టి లేచింది. ‘వస్తున్నా’ అంటూ సమాధానం ఇస్తూ వంటింటి గుమ్మం లోకి వచ్చింది. కొత్తగా తమ యింటికి వచ్చిన ఆమెను తన భర్త రెక్క పట్టుకు తీసుకు వస్తున్నాడు. ఆమె నవ్వుతూంది. వాళ్ళ వెనకాల ఆమె కొడుకూ, తమ పిల్లలూ తెల్లముఖాలు వేసుకు వస్తున్నారు. ఆ వూరేగింపు చూసి భద్ర తెల్లబోయింది. సత్యానందం ఆమెను తీసుకువచ్చి తన యెదట నిలవబెట్టేడు. “ఈమెగారెవరో గుర్తుపట్టేవా? జానకి... మన జానకి...ఇదిగో ఇతడు రవీంద్ర....కొడుకు... ” ఆమెనోట అప్రయత్నంగానే ఆ పేరు మలిగింది... ‘జానకి’. గబగబ వచ్చి రెండు భుజాలూ పట్టుకొని కుదిలించేసింది. కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. కౌగలించుకొంది. ‘ఎంత నాటకమాడేవే!’ అని కోప్పడింది. వాళ్ళిద్దరి ఉద్వేగాలూ, సంతోషాలూ చూస్తుంటే సత్యానందానికి కంఠం నిండి వచ్చింది. చటుక్కుని వెనక్కి తిరిగేడు. “మనం పైకి పోదాం. రాండోయ్! వాళ్లని మాట్లాడుకోనీండి. ” పిల్లల్ని వెంటబెట్టుకొని సత్యానందం మేడమీదకు వెళ్ళిపోయేడు. “గుర్తుపట్టనట్లూ, ఎరగనట్లూ అంతసేపు ఎల్లా వుండగలిగేవంటా” అదే ప్రశ్నను భద్ర అనేక దృక్కోణాలనుంచి వేస్తూంది. ఆ మాట వచ్చినప్పుడల్లా జానకి నవ్వుతూంటుంది. “ముఖం ఎక్కడో చూసినట్లనిపించకపోలేదు. కాని, గుర్తు రాలేదు. గుర్తు అనిపించినా నువ్వని ఎల్లా అనుకుంటాం. మహాతల్లివి. ఉత్తరాలే వ్రాయడం మానేసేవు. వస్తావని ఎల్లా అనుకుంటాను. ఎంత మారిపోయేవు.” జానకి మారిపోయిందనిపించినప్పుడల్లా ఆ మార్పుకు కారణభూతుడైన విశ్వం ఇద్దరి మనస్సుల్లో మెదులుతున్నాడు. కాని, ఇద్దరూ కూడ అతని పేరు పైకి చెప్పలేకుండా వున్నారు. ఇరవై రెండేళ్ళ క్రితం సరిగ్గా ఈ రోజుల్లోనే భద్ర జానకిని పెళ్ళి కూతుర్ని చేసి పంపింది. రెండేళ్ళ తర్వాత అతనిని పోలీసులు పట్టుకొని కాల్చేశారన్నారు. కాదు, కనిపించడంలేదన్నారు. భర్తతో రాష్ట్రం దాటి వెళ్లిన జానకి మరి తిరిగి రాలేదు. బొంబాయిలో వుందన్నారు. ‘ఏదో వుద్యోగం చేసుకుంటున్నా! నువ్వు పెట్టిన భిక్షే’ నంటూ ఎప్పుడో మొదటి రోజుల్లో వ్రాసిన జాబు తప్ప మళ్ళీ వుత్తరాలూ లేవు. నాటికి....నేడు...మళ్ళీ... ఇద్దరి మనస్సులలో ఆనాటి కధలు మెదులుతూంటే నిశ్శబ్దం అయిపోతుంటారు. మళ్ళీ ప్రారంభం. “నీది రాతి గుండె...” అని భద్రే మళ్ళీ మొదలెడుతుంది. జానకి నవ్వుతుంది. అయిదో ప్రకరణం భోజనం చేస్తూ చేస్తూ భద్ర దిగాలుపడి గోడకి జేర్లబడిపోయింది. “కృష్ణుడు యేం చేస్తున్నాడో యేమిటో... ” అనుకొంది. ఆమె కొడుకు రామకృష్ణ వరంగలులో మెడికల్ కాలేజీలో చదువుతున్నాడు. తెలంగాణా కల్లోలాల తాకిడికి కాలేజీ మూతపడి రమారమి ఆరునెలలు యింట్లోనే వుండిపోయేడు. ఆ మధ్యనే కాలేజీలు తెరుస్తే మళ్ళీ వెళ్ళేడు. అతడు అక్కడ యేం కష్టపడి పోతున్నాడో యని తల్లి ఆదుర్దా. ఆమె ఆదుర్దాకి అర్థం లేదన్నట్లు జానకి చాల చులకన చేసింది. “ఏం చేస్తుంటాడు? తొమ్మిదిన్నర అయిందా? హాస్టలులో భోజనాలయిపోయి వుంటాయి. గదుల్లో కూర్చుని చదువుకుంటూ వుండి వుంటారు. కాక పెళ్ళాం పిల్లకూడా అక్కడే చదువుతూందన్నావా? ఇద్దరూ ఏ సినిమా ప్రోగ్రామో వేసుకుని వుంటారు. ఏం చిన్నపిల్లాడా? పెళ్ళాన్ని ఏరుకోగల వయస్సు వున్నవాడు...” “పాపం వాళ్ళలాంటి వాళ్ళు కారే---” అంది భద్ర. జానకి నవ్వింది. “మరి పెళ్ళాన్ని యేం చేద్దామనుకున్నాడంటావు?” భద్ర కూడా నవ్వింది. అంతలో దిగాలుపడింది. “ఏమో, ఏం చదువో ఏం పాడో” అంది, భద్ర నిరుత్సాహంగా. “మా వూళ్ళో మీరు వుండడానికి వీలులేదు. లేచిపోండంటూంటే యెందుకక్కడికి చెప్పు? అక్కడగాక మరో చోట యేర్పాటు చెయ్యండంటే ఈయన వినిపించుకోరు. వాడంతకంటె. ఎక్కడ మాత్రం ఇంతకంటె బాగుందంటాడు. మధ్య నాకు మనసుండబట్టడంలేదు….” “అంటాడేమిటి! నువ్వు పత్రికలు చూడ్డం లేదా?” “చూడకేం చూస్తున్నా. అయితే అనుభవం మనది కాదు గనక అక్కడేమేనా మెరుగేమో ననిపిస్తూంటుంది.” “రాసికి అంగోస్త్రం చుట్టేవాళ్ళు ప్రతిచోటా వెలిసేరు. అయితే బాధ పడేవాళ్ళు వేరు. ఎక్కడికక్కడే ఆదేశం తమ తాత ముల్లెలాగ అంగోస్త్రం చుట్టి కళ్ళురుముతున్న వాళ్ళు వచ్చేరు. తప్పదు. ఈ గొడవేదో ఎక్కడికాక్కడ చూసుకోవాలేగాని...” తన కొడుకు చదువు కుదుటపడడం, ఎవ్వరూ వంటిమీద ఏ పెట్రోలో పోసి అగ్గిపుల్ల గియ్యకపోవడం తప్ప మరో ఆలోచనలేదు భద్రకి. ఇప్పటికేనా మరల కాలేజీలు తెరవనిచ్చినందుకు సంతోషం కనబరిచింది. “ఏదో గుడ్డిలో మెల్ల. ఇప్పటికేనా చల్లబడ్డారు. అదీ నయమే.” జానకి పకపక నవ్వింది. “వాళ్ళెప్పుడూ గుడ్డివాళ్ళు కాదే తల్లీ! దేశం ఏమైపోయిందో, పిల్లగాళ్ళ చదువులు ఏమౌతాయో వాళ్ళకి పట్టిందంటావా? కాలెజీలూ, స్కూళ్ళూ మూతబడితే చదువు నష్టపోయింది నీకొడుకొక్కడిదేనా? కాదు, నూటికి తొంభయ్యయిదుమంది తెలంగాణం వాళ్ళదే. కాని చదువు పోగొట్టుకొన్న అభాగ్యుల్లో ఈ నాయకుల పిల్లలు వుండివుండరు. ఏమీ సందేహం అక్కర్లేదు.” జానకి ధోరణిని అడ్డంకొడుతూ వీధిలో పెద్ద అలజడీ, కేకలూ వినిపించేయి. ఇద్దరూ ఆలకించేరు. మొదట కొంతసేపు ఆర్థంకాలేదు. తర్వాత అవేవో నినాదాలు వినిపించేయి. “ఏదన్నా వూరేగింపు వుందేమో, కేకలు అల్లా వున్నాయి, ” అంది భద్ర. “ఎవరి వూరేగింపూ?” “చెప్పలేం. బహుశా జనసంఘం వాళ్ళదేమో. ఈమధ్య ఒకటి రెండుమాట్లు వాళ్ళ హడావిడి విన్నాం.” “అదీ వుందీ?” “అయ్యో!” “ఎవరేమిటి దాని పెద్దలు?” “ఇంకా ప్రత్యేకంగా యెవరూ గోదాలోకి దిగినట్లు లేదు. షావుకారు జగన్నాధంగారు ఙ్ఞాపకం వున్నారా?” “బాగుంది!” “ఆయన పోయేరు. ఆయన తమ్ముడు ఒకడు కథలూ అవీ వ్రాస్తుంటాడు. జనసంఘం పత్రిక వుంది బెజవాడలో. ఆ పత్రికవాళ్ళు జరిపిన కథల పోటీలో అతని కథకి బహుమతి వచ్చింది. నెల్లాళ్లక్రితం వాళ్ళింటికి జనసంఘం నాయకులు వచ్చి వూళ్ళో మీటింగు పెట్టి వెళ్ళేరు. అంతే.”  ఇంతలో వూరేగింపు వారి వీధిలోకే తిరిగినట్లు తోచింది. నినాదాలు బిగ్గరగా, స్పష్టంగా వినిపిస్తున్నాయి. “ప్రజాద్రోహులు... నశించాలి.” జానకి భద్ర ముఖంలోకి చూసింది. ఆమె జానకి విస్తట్లో పెరుగు పోస్తూ, “మార్క్సిస్టులదై వుంటుంది-“ అంది అనుభవఙ్ఞానంతో. జానకి చటుక్కున లేచింది. భద్ర లబలబలాడింది. “భోజనం పూర్తి చెయ్యి. తిట్లతో కడుపు నిండదు. వాళ్ళ విప్లవం తిట్లు వినడానికి అన్నం మానుకోవాలా ఖర్మ!” అంటూ చేయిపట్టుకులాగి కూర్చోబెట్టింది. జానకి ‘చూడాలి’ అంది. “ఏమీ బెంగపెట్టుకోకు. నీకోసం అయినా పదినిమిషాలు మన గుమ్మంలో నిలబడతారు. ఫర్వాలేదు.” భద్ర జానకి చెయ్యి వదలలేదు. భోజనం పుర్తిచేశాక చేయి వదిలింది. “ఆకు నే తీస్తా. చేయి కడుక్కువెళ్ళి ఆ వినోదం ఏదో చూడు.” కాని, జానకి లేచిపోలేదు. ఇద్దరూ కలిసే వీధిగుమ్మంలోకి వచ్చేరు. వస్తూ భద్ర గేటుమీద ఆర్చిలో వున్న లైటు వేసింది. మెర్క్యురీ లైటు వెల్తురు వెన్నెలలాగ వీధి అంతా నిండింది. ఆరో ప్రకరణం మేడ మీద పిట్టగోడ నానుకొని నలుగురైదుగురు చూస్తూండడం, వీధి తలుపు తీసుకొని ఆడవాళ్ళు గుమ్మంలో నిలబడడంతో ఊరేగింపు కంఠం ఏకస్వరంలో నిలబడింది. స్వరమూ దృఢపడింది. దానికి వూతలా బిగించిన పిడికిళ్ళు గాలిని గుద్దుతున్నాయి. “ప్రజా ద్రోహులు...” ఆ కీచుగొంతుక విని జానకి అటు తిరిగింది. ఆశ్చర్యం కలిగింది. “వాడు జోగన్న కాడూ?” “ఆ జోగన్నే.” “వాడు మార్క్సిస్టా?” “ఆ.” “ఎప్పటినుంచి?” అంది జానకి. ఆమెకు గ్రామంలో రౌడీగా పేరు పడ్డ జోగన్నను మార్క్సిస్టులు జేరతియ్యడం వింతగా వుంది. “52 ఎన్నికల్లో మందలో కలిసేడు. పార్టీ కలిసివున్న కాలంలోనే కమ్యూనిస్టు విభూతి ఇచ్చేరు. ఇప్పుడు మార్క్సిస్టు...” అంటూ భద్ర సంగ్రహంగా చెప్పేసింది.  “ఇంక వూరుకో. మనం మాట్లాడుకోడం చూసి వాళ్ళు మరీ రెచ్చిపోతారు” అంది. కాని, ఆ వినడమో, విన్నట్లు వూహించడమో అదివరకే జరిగిపోయింది. నినాదాలు చిత్ర చిత్ర రూపాలలో ప్రస్తరిస్తున్నారు. “ప్రజాద్రోహులు-నశించాలి.” “కమ్యూనిజానికి వెనుపోటు పొడిచిన-” “బూర్జువా భూస్వామి కాంగ్రెసుతో చేతులు కలిపిన-” గుమ్మానికి ఎదురుగా వూరేగింపు నిలబడిపోయింది. వూరేగింపు ముందు లావుపాటి బట్టతల మనిషి ఎవరా అని జానకి ఆలోచన. ఆయన ఎవరో భద్ర నోట విని నిర్విణ్ణురాలే అయిపోయింది. “డాక్టరు సుందరరావుగారా!” భద్ర తలవూపి వూరుకుంది. “పక్కన ఆ కళ్ళజోడు?” “ఆయన కొడుకు రంగనాయకులు.” “అతడు డాక్టరుట కాదూ?” “ఊ.” “ఇద్దరూ...” “ఈవేళ పరమ మహేశ్వరులు. వీరశైవులు....” జానకి ముఖాన చిరునవ్వు తోచింది. వర్ణన వినేసరికి. “ఈ నాలుగైదేళ్లనుండి మాకు మధ్య మధ్య కమ్యూనిస్టు తిట్టు పదకోశంలో కొత్తగా చేరిన పదాలు వినే అవకాశం కలిగిస్తున్నారు.” వరండాలో స్త్రీల పెదవుల కదలికలు తమ్ము గురించే అనిపించి వూరేగుంపులో కీచుగొంతు మరింత పదునెక్కింది. “పోలీసుబంట్లు ..... నశించాలి.” మేడమీద పిల్లలు పెద్దగా నవ్విన ధ్వని. సత్యానందం కంఠం వినబడి జానకి తిరిగి చూసింది. వీధి గదిలో అతడు కూర్చుని వున్నాడు. తలుపులు, కిటికీలు అన్నీ తెరిచి, లైట్లు వేసి వున్నాయి. ద్వారం మీద బోర్డు కనిపిస్తూంది. -“భారత కమ్యూనిస్టు పార్టీ గ్రామశాఖ కార్యాలయం--” ఊరేగింపు అక్కడెందుకు నిలబడిందో జానకికి అర్థం అయింది. “ఏమిటి బావా!” “మీరు పైకి వెళ్లండి. అల్లా నవ్వకూడదని పిల్లలకి చెప్పండి. మర్యాద కాదు.” ఆ మాట పూర్తి కాకుండానే వీధిలో పెద్ద గంద్రగోళం ప్రారంభమయింది. భద్ర ఆదుర్దాగా మెట్ల చివరకు గబగబ నడిచి నిలబడింది. “అయ్యో! రంగమ్మగారు.” మరుక్షణంలో గట్టిగానే మగణ్ణి కేకేసింది. “త్వరగా రాండి. రంగమ్మగారిని పట్టుకోండి. సుందరరావుగారి మీదపడి కొడుతూంది. అయ్యో చొక్కా చింపేస్తూంది.” బ్రాహ్మణాగ్రహారంలో ఆడదాని నోట ఎప్పుడైనా వినిపించే అవకాశం వుందా అనిపించేటంత జుగుప్సాకరమైన పదజాలంతో రంగమ్మ సుందరరావును తిడుతూంది. మీదపడి రక్కింది. ఆ ఆవేశంలో ఆమె నోటినుంచి వెలువడ్డ తుంపరలతో ఆయన ముఖం తడిసిపోతూంది. హఠాత్తుగా వచ్చిపడ్డ ఈ ఉత్పాతం ఏమిటో, ఎందుకో మొదట ఆయనకు అర్థం కాలేదు. సత్యానందం ఇంటి వద్దకు వచ్చేకనే ఆమె తన మీద పడిపోయిందని చూసేడు. ఆమె ఎక్కడనుంచి వచ్చిందో చూడలేదు. కాని, ఆ యింట్లోనుంచే వచ్చిందనిపించింది. సత్యానందమే ఆమెను తమ మీదికి వదిలి వుంటాడు. పోలీసు బంట్లు అని తామిచ్చిన నినాదం నొప్పి కలిగించింది. ఈ దౌర్జన్యానికి పూనుకొన్నారనిపించింది. శత్రువు మరింత పొడుచుకుని, కుళ్ళేటట్లు చేయడానికై మళ్ళీ ఆ నినాదం ఇచ్చేడు. “పోలీసు ఏజెంట్లు….” రంగమ్మను దూరంగా లాగేయడానికి చేసే ప్రయత్నంలో ఎవ్వడూ దానినందుకోలేదు. కాని, ఆ నినాదమే రంగమ్మ ఆవేశాన్ని రెచ్చకొట్టింది. “నాబాబుని పోలీసులకి వప్పచెప్పిన లాంజ....కొడుకువి నీవే కాదట్రా….నిన్ను చంపేస్తా. మహమ్మాయి వండేస్తా….పేగులు తోడేస్తా. నీ కడుపు కాలిపోనూ….” రంగమ్మ ఆయాసపడిపోతూంది. పట్టుకొన్న వాళ్ళకి లొంగడంలేదు. వాళ్ళ చేతుల్లోంచి బయటపడడానికి గింజుకొంటూంది. గిజాయించుకొంటూంది. సైన్సు మాస్టారు ఆమెను అనునయించడానికి ప్రయత్నిస్తున్నాడు. “రంగా! రంగా! తప్పు, చూడు. నువ్వు ఎవరిని తిడుతున్నావో చూసేవా? ఇదుగో డాక్టరుగారు. వాళ్ళ నాన్నగారు ఆయన. రంగా! విన్నావా?....” “నేను వినను, వీడా డాక్టరుగారి తండ్రి! కాదు. పోలీసు ఏజంటు వీడే. ఆరోజున నాబాబును చైనా మనిషి అని పట్టించి ఇచ్చేడు. వీడే, వీడే!” ఆ ఆరోపణ సుందరరావును నిర్వాక్కుణ్ణి చేసింది. తమ పార్టీలోంచి నక్సల్ బరీ వాదులు విడిపోయి, జనశక్తిని  స్వాధీనం చేసుకొన్నప్పుడు వాళ్ళ చర్యల్ని ఖండిస్తూ సభలు పెట్టేడు. “భగత్ సింగ్ మార్గమే మా మార్గం” అన్న నినాదాలు ఇవ్వడం లోని ప్రమాదాలు అతి ఓర్పుగా వివరించేడు. పోలీసులు, ప్రభుత్వం వలన రాగల నిర్బంధాలు చెప్పేడు. గ్రామంలో ఆ జట్టు కుర్రాళ్ళకి రంగమ్మ కొడుకు కేశవరావు నాయకుడు. అతడు తనతో వేసుకొన్న వాదనలు ఖండించి, తన మతం స్థాపించుకొన్నాడు. దానినే ఈమె పోలీసులకు వప్పచెప్పడంగా వర్ణిస్తూంది. సుందరరావుకి అసహ్యం వేసింది. తాను కుర్రవాడిని ఆ ప్రమాదంలో పడకుండా కాపాడాలనుకొన్నాడు. వినలేదు. పోయి, మిడతలా మాడిపోయేడు. దానికి తననే తిట్టడం దుర్భరం అనిపించింది. కాని, ఏమీ చెయ్యలేడు. ఆడది. ఆత్మరక్షణ పేరుతోనేనా నాలుగు తగిలించడానికి వీలులేదు. సత్యానందం ఇంక దూరంగా ఉండలేకపోయేడు. గబగబ ముందుకొచ్చి సుందరరావు మొగం మీదకు పోతున్న రంగమ్మ చేయి గట్టిగా పట్టుకొన్నాడు. “భద్రా, జానకీ ఈవిణ్ణి పట్టుకోండి.” నలుగురూ పోగడి, ఆమెను భర్త సాయంతో బయటకు తెచ్చేరు. “కాస్త శా౦తించేవరకూ లోపలికి తీసుకురాండి” అని భద్ర లోపలికి దారి తీసింది. దానివలన రాగల నిందను యెరిగినా సత్యానందం యేమీ అనలేదు. తీసుకుపోతున్నా ఆమె అరుస్తూనే వుంది-”నువ్వు పోలీసోళ్ళ తాబేదారువురా….నిన్ను చంపేస్తా….” ఆ అల్లరికీ, తిట్లకూ, సత్యానందం సుందరరావుయెడ సానుభూతి చూపేడు. “ఆవిణ్ణీ, ఆవిడ మాటల్నీ పట్టించుకోకండి. కొడుకుపోయిన దుఃఖంలో ఆమెకు మతిపోయింది. మనం అంతా ఎరిగిందే....” ఆ వోదార్పు సుందరరావుకు తోడికోడలి దెప్పుడులా వినిపించింది. కోపంతో పెదవులు అదిరిపోతున్నాయి. “నీకిందులో పాత్ర యేమీ లేదనుకోవాలనా?” అన్నాడు. నీ మాటకు విలువనివ్వడం అనవసరం అన్నట్లు సత్యానందం మరేమీ అనకుండా వెనుతిరిగేడు. అతడూ వెనుతిరగగానే వూరేగి౦పులోంచి యెవరో విసిరిన రాయి తగిలి, గేటులో పైన వున్న లైటు డోము పగిలి గాజుముక్కలు గల్లున క్రిందపడ్డాయి. సత్యానందం చటుక్కున నిలబడ్డాడు. వెనకనుంచి డాక్టరు రంగనాయకులు గొంతు ఖంగుమని వినిపించింది. “ఎవరిదా పని?” ఎవ్వరూ మరల మాట్లాడలేదు. మరల అతని కంఠమే వినిపించింది. “క్షమించండి! సత్యానందంగారూ!” వెనువెంటనే సుందరావు కయ్ మన్నాడు. “ప్రజావుద్యమాలకు వెన్నుపోటు పొడిచే ద్రోహచర్యలమీద ప్రజల కోపం బహుముఖాలుగా వ్యక్తమవుతుంది. ప్రజల న్యాయమైన ఆగ్రహానికి కమ్యూనిస్టులు క్షమార్పణ చెప్పుకోనక్కర లేదు.” “బాగా చెప్పేరు. కుర్రాడు. అతడికింకా అనుభవం చాలదు” అన్నాడు వెక్కసంగా సంత్యాన౦దం. గాజు పెంకులమీద అడుగు పడకుండా, జాగ్రత్తగా చూసుకొంటూ అతడు లోపలికెళ్ళేడు. “భద్రా, వాళ్ళంతా వెళ్ళిపోయేక చీపురు తీసుకొని గేట్లో గాజుపెంకులు ఓ పక్కకు తుడిచెయ్యవోయి. ఎవరన్నా తొక్కితే కాలు తెగుతుంది.” “గాజు పెంకులు ఎక్కడివి?” అంది భద్ర ఆశ్చర్యంగా. “మెర్క్యురీ లైటు డోము పగిలిపోయి౦దిలే” అన్నాడు, సత్యానందం తాపీగా.   వెనకనుంచి కొత్త నినాదం వినిపించింది. ప్రజాసేవకులమీద రివిజనిస్టుల దౌర్జన్యాలు-” ఆ గొంతు సుందరరావుది. “నశించాలి” అది ఊరేగింపు వాంఛ. సుందరరావు దానిని నిరాకరించేడు. “శాపనార్ధాలు లాభంలేదు. ఖండితంగా చెప్పాలి-’సాగనివ్వం’ అనండి.” ఏడో ప్రకరణం రంగమ్మ దుఃఖానికి కారణం విని జానకి నిర్విణ్ణురాలయింది. ఆమెకు తన జీవితం జ్ఞాపకం వచ్చి తూలిపోయింది. ఆమె పరిస్థితిని గమనించి భద్ర కంగారు పడింది. పెద్దకూతురును పిలిచింది. “పిన్నిని మేడమీదకు తీసుకుపోయి పక్క వెయ్యి. ఒంట్లో బాగులేదు.” తల్లి అనారోగ్యం వార్త విని రవీంద్ర పరుగెత్తి వచ్చేడు. సాధనా, అతడూ చెరో చెయ్యీ పట్టుకొని ఆమెను మేడమీద గదిలో పడుకోబెట్టేరు. ఇద్దరూ చెరొకవైపునా కుర్చీలు లాక్కుని కూర్చున్నారు. “ఎల్లా ఉందమ్మా?” “నాకేంరా, బాగానే వున్నా-” అంది కాని, ఆ మాటతోనే ఏడ్పు వచ్చేసింది. నోట్లో పైటకొంగు కుక్కుకొని, పరుపుమీద బోర్లా దొర్లి తల దాచుకుంది. పక్కలు యెగరెయ్యడం చూస్తే ఆమె వెక్కివెక్కి ఏడుస్తున్నదని అర్ధం అవుతూంది. సాధన ఏమిటిది అన్నట్లు అతనివంక చూసింది. ఊరుకోమన్నట్లు కన్ను మలిపేడు. తల్లి నడ్డిమీద సమాశ్వసనంగా చెయ్యి వేసుకొని నిశ్శబ్దంగా కూర్చున్నాడు. తల్లి దుఃఖకారణం రవీంద్ర గ్రహించేడు. అతడు తండ్రిని ఎరగడు. కాని, అతని మరణగాధ తెలుసు. ఆ గాధ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా తల్లి అల్లా ఏడుస్తుంది. ఒకటిరెండు రోజులు మందకొడిగా, పరధ్యానంగా వుంటుంది. రంగమ్మ దుఃఖకారణం వినడంతో జానకికి భర్త గుర్తు వచ్చేడు. రవీ౦ద్ర కూడా భయపడుతూనే వున్నాడు. వీధిలో జరిగిన గంద్రగోళం, గలభా యేమిటో సాధన యిందాక అతనికి చెప్పింది. “ఆవిడ పేరు రంగారజమ్మ. అంతా రంగమ్మగారంటారు. మా ఊరి హైస్కూలు సైన్సు మేష్టారి భార్య.” “కొడుకు చచ్చిపోతే పిచ్చి యెక్కిందని యిందాకా అనూరాధ చెప్పింది, ఈవిడేనా?” “ఎప్పుడు చెప్పిందీ, అప్పుడే.” “మేం వచ్చినప్పుడేలే.” “ఆమెకి ఒక్కడే కొడుకు. వరంగల్ లో అన్నయ్యతో మెడిసిన్ చదువుతున్నాడు. నెలరోజుల క్రిందట అరెస్టు చేశారన్నారు. ఆ మాట వినగానే రంగామ్మగారికి మతి చలించింది. “ఆయన నక్సలైటా?” “ఔనట.” అని సాధన తలవూపింది. “మంచివాడూ, తెలివిగలవాడూ, ఫైనలియర్ లో వున్నాడు. మా నాన్నతో అస్తమానం వాదం వేసుకొనేవాడు. మా అన్నయ్యా అతడూ చాల స్నేహంగా వుంటారు. ఈ వార్త విన్నాక మా అన్నయ్యని గురించి అమ్మ బెంగపెట్టుక్కూర్చుంది….” ....రాత్రి పన్నెండు కొట్టేవరకూ ఆ యింట్లో యెవ్వరూ నిద్రపోలేదు. సరదాగా రెండునెలలు గడపాలని జానకి ఇరవైయయేళ్ళ తర్వాత ఊళ్లోకి రావడం, మనస్సులోని గాయం కలకవేసి జానకి బాధపడడం సత్యానందం దంపతుల్ని ఎంతో ఖిన్నపరచింది. చాలసేపు దగ్గర కూర్చుని ఆ కబుర్లూ, ఈ కబుర్లూ చెప్పారు. పిల్లలంతా నిద్రవచ్చి పోయి పడుకున్నారు. కొంత సర్దుకొన్న దనిపించేక సత్యానందం వెళ్ళిపోయేడు. భద్ర ఆమె పక్కనే మంచం వేసుకు పడుకుంది. ఇద్దరికీ నిద్రలేదు. ఆ సంగతి ఇద్దరూ యెరుగుదురు. కాని ఇద్దరూ ఎరగనట్లే చాలసేపు నటించేరు. ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. అంతా నిద్రపోయారు. ఆ నమ్మకం కలిగేక భద్ర లేచి కూర్చుంది. “జానకీ!” “ఊ.” “నిద్రపోలేదూ?” “రావడంలేదు.” భద్ర మంచం మీద వొరిగింది. “కళ్ళు మూసుకో, అదే వస్తుంది.” మరల కొంచెం సేపయ్యాక జానకి పలకరించింది. “అక్కా!” “ఊ.” “నన్ను పెళ్ళి చేసుకొని ఉండకపోతే ఆయన బ్రతికి వుండేవారేమో. నా దురదృష్టం ఆయన్ని కొట్టుకుపోయిందో, ఏమో....” భద్ర లేచి కూర్చుంది. ఆ అనుమానానికి సమాధానం ఏం వుంది? కోపం చూపింది. “ఏం మతిగాని పోయిందా యేం? చదువుకున్నదానివి కూడాను.” “కాదక్కా! ఎంత చదువుకున్నా ఆ అనుమానం సెలవేస్తూనే వుంది. మన పూర్వం వాళ్ళు పెట్టిన నిషేధాలూ, చెప్పిన అభ్యంతరాలూ నిజమేనేమో అనిపిస్తూంటుంది. ఒక ని౦డుప్రాణాన్ని నా అజ్ఞానానికి బలిపెట్టేనేమో.” ఆమె దుఃఖం చూస్తూంటే భద్రకూ కంఠం నిండి వచ్చింది తన బలహీనతను కమ్ముకొనేందుకు అవహేళనకు అందుకుంది. “ఇది మరీ బాగుంది కాదూ! చాలా బాగుంది. వెర్రి కుదిరింది. రోకలి తలకు చుట్టమన్నాడట నీలాంటివాడే. కాకపోతే ఏమిటే అది అప్పుడు-ఆ మూడు నాలుగేళ్ళలో ఒక్క తెలుగు దేశంలో మూడునాలుగు వందలమందిని పోలీసాళ్ళు చంపేశారన్నారు. మళ్ళీ యిప్పుడు ఈ ఏడాదీ ఆరు నెలలలోనూ అప్పుడే ఏభై అరవై మందిని చంపేశారంటున్నారు. చంపివేయబడ్డవాళ్ళంతా వితంతువుల్ని పెళ్లాడినవాళ్ళు కారు. వాళ్ళ పెళ్ళాలు చెడ్డ నక్షత్రం చూసుకొని సమర్తాడినవాళ్ళూ కాదు....” ఒక్క నిముషం ఊరుకొని భద్రే మళ్ళీ అంది. “పాపం కేశవరావుకి పెళ్ళే కాలేదు. మరాతనికి ఎవరి శని చుట్టుకుంద౦టావో.” ఆ మాటకి కూడా జానకి వెక్కి వెక్కి ఏడవడమే గాని ఏ సమాధానమూ ఇవ్వలేదు. ఆమెను చూస్తూంటే భద్రకు కళ్ళనీళ్ళు తిరిగేయి. ‘ఊరుకో’ అనబోయింది ఆ మాట అనబోయేసరికి తనకే కంఠం నిండి వచ్చింది. ఊరుకుంది. కొద్దిసేపటికి యిద్దరూ సర్దుకొన్నారు. భద్ర కళ్ళు తుడుచుకొంది. “ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నీలాగే ఆలోచించడం మొదలెడితే దానికి అంతం ఉందా? మన దురదృష్టాలు ఈ హత్యలకి ప్రోత్సాహం ఇప్పిస్తే మరి అయ్యో అనుకోవలసిన పని కూడా వుండదు.” “తెలుసు....నాకు తెలుసు. ఇది వట్టి మూర్ఖత్వమని. కాని మనసు నిలబడదు. ఒక్కొక్కప్పుడు ఆయన బ్రతికే వున్నారేమో ననిపిస్తుంది. ఆ ఆశ కలిగినప్పుడు అన్నం కూడా నోటికి పోదు....లేకపోతే చెట్టంత మనిషి ఏమయిపోతారు?....అందరి విషయంలోలాగ ఆయన మరి లేరనుకొంటే వుండే బాధ వేరు. ఒక ఏడుపు ఏడుస్తాం. మరి వూరుకొంటాం. మనస్సుకీ ఆరాటం వుండదు.” వీపు రాస్తూ, భద్ర కాతర స్వరంలో అడిగింది-”నీకింకా ఆశ ఉందా?” జానకి తల అడ్డంగా తిప్పింది. అందులో ఆమెకు ఏమాత్రం సందేహం లేదనేదే కనిపిస్తూంది. కాని మాటమాత్రం అంత ఖండితంగా లేదు. “మనకి యెంతో ప్రేమ వున్నవాళ్ళయినా, పరమద్వేషం వున్నా వాళ్ళు చచ్చిపోయారంటే కూడా నమ్మలేం. అల్లూరి సీతారామరాజు కోసం మరో వందేళ్ళు గడిచాక కూడా వెతుకుతాం. సుభాష్ బోసు మాటేమిటి? వాళ్ళమీద మనకున్న ప్రేమా, అభిమాన౦ అట్లాంటివి. ఎంతో ద్వేషించే హిట్లరు నిజంగా చచ్చిపోయాడంటారా అని పాతికేళ్ళ తరవాత కూడా ఎందరు ప్రశ్నించడం లేదు? మనుష్యుల బలహీనత అది. నా విషయంలో అదే జరుగుతూంది.” ఒక్క నిముష౦ తటపటాయించినట్లు ఆగింది. “ఇప్పటికీ ఆ ఆశ చచ్చిపోయిందనుకోలేను. ఆయన వచ్చి నాకోసం అక్కడ వెతుకుతుంటారేమో. నేనిక్కడున్నానే, పోదామా-అనిపిస్తూందంటే నమ్ముతావా?” “నీకు మతిపోయింది.” “రాత్రి రంగామ్మగారిని చూసినప్పటినుంచి మనస్సు తరుముతూంది.” “ఏమిటి నీ ఆశకి ఆధారం?” “ఏమీలేదు. భ్రమ.” చాలసేపు ఇద్దరూ ఊరుకొన్నారు. తరవాత మళ్ళీ జానకే ప్రారంభించింది. “మేము చంపెసేమంటే ఆరోజుల్లో కాదు, ఈరోజుల్లో మాత్రం పోలీసులకి అడ్డు ఏముంది? పట్టుబడి పారిపోతూంటే కాల్చేశామంటారు. ఎదురుబొదురు కాల్పుల్లో చచ్చిపోయారంటారు. ఆత్మరక్షణకి కాల్చేశామంటారు. వాళ్ళకి ఎదురేముంది? కాని ఇక్కడ అటువంటిదేమీ లేదు. మనిషి అదృశ్యం అయిపోయేడు. ఏమయిపోయినట్లు? గవర్నమెంటు ఎక్కడికేనా ప్రవాసం పంపేసి ఎరగనట్లు నటిస్తూందా?” తానే నమ్మలేని కారణాలనూ, అనుమానాలనూ జానకి బయట పెట్టింది. వానికున్న ఆపత్తులరీత్యా ఇంతవరకు వానిని ఎవ్వరి దగ్గరా చెప్పలేకపోయింది. తన చదువునూ, తెలివినీ అపహాస్యం చేస్తారని భయం. భద్రకూడా ఆ దుఃఖంలో సహభాగురాలు. కనుక వానిని చెప్పడానికి సిగ్గు కలగలేదు. భద్రకు అసలు రావలసిన ప్రశ్న తోచలేదు. క్షీణస్వరంతో “ఎక్కడికి పంపిస్తారంటావు?” అంది. ఆ ప్రశ్న చూస్తే, అమెకది ఆలోచించవలసిన సంగతేనని తోచిందనిపిస్తుంది. జానికికి ధైర్యం చిక్కింది. తన మనస్సులోని అనుమానాలను ప్రస్తరించసాగింది. “అండమాన్, నికోబార్ దీవులు సముద్రం మధ్యలో, ఉత్తర దక్షిణాలకి ఓ వెయ్యిమైళ్ళ పొడుగున, చిన్నా పెద్దా రెండుమూడు వేలవరకూ ఉన్నాయంటారు. ఏ దీవిలోనేనా వున్నారేమో....సాధ్యం కాదంటావా?” భద్రకు ఆమెమీద విపరీతమైన జాలి కలిగింది. సాధ్యంకాదని చెప్పడానిక్కూడా మనసొప్పలేదు. “వెర్రిదానివి” అంటూ కౌగిలించుకొంది. చాలాసేపు ఇద్దరూ ఒకరినొకరు ఆనుకొని నిశ్సబ్దంగా కూర్చున్నారు. మరల జానకే ఆరంభించి౦ది, “ఎక్కడికేనా కదిలితే చాలు-ముందు ఏయే కాగితాలు ఏం చెయ్యాలో, ఎవరికి ఏమేం ఇవ్వాలో అన్నీ వప్పగి౦తలు పెట్టేవారు, అనుకొన్న వేళకు రాకపోతే ఏం చెయ్యాలో చెప్పేవారు.” భద్ర మామూలుగానే అనేసింది. “మళ్ళీ రామనిపించేది కాబోలు.” ఆ వప్పచెప్పడాలు మామూలే నంది జానకి. “ఎందుకా వప్పగి౦తలు? పట్టుబడితే చంపేస్తారనే జ్ఞానం ఉన్నట్లే కద! కాని ప్రాణం అంటే తీపి, చావంటే బెదురూ లేదా? అంత నిర్లిప్తంగా ఎల్లా ఉండగలిగే వారు?” తన ప్రశ్నకి తానే సామాధానం ఇచ్చుకొంది. “ప్రజలకీ, దేశానికీ మంచి చేస్తున్నామనే విశ్వాసం! ఆ ప్రయత్నంలో మనప్రాణం పోయినా ఫర్వాలేదనే నిర్లక్ష్యం!....మొదట వెర్రిభయం వేసేది. ఏడుపు వచ్చేది. తిరిగొస్తే చంటిపిల్లలా కరుచుకుపోయేదాన్ని....” ఆ మానసికాందోళన తీవ్రతను తన అనుభవాలతో భద్ర సరిచూసుకొంటూ౦ది. “క్రమంగా ఆ వప్పగి౦తలు అలవాటయిపోయాయి. భయం వెయ్యడం మానింది. ఈమారు సంతోషమూ కలగడంలేదు. వీధిలోకిపోయి వచ్చినట్లే అనిపించసాగింది. కాని....ఒకమాటు….వెళ్ళిన మనిషి మరి రాలేదు.” జానకి నోట మాట డెక్కుపట్టినట్లయింది. క్షీణస్వరంతో మూలిగింది. “మరి....రానేలేదు.” జానకి చాలాసేపు ఏడ్చింది. ఏళ్ళ తరబడి చెప్పుకునేందుకు ఎవరూ లేక, అణచిపెట్టుకొన్నబాధ, ఒక్కమారు కట్టలు తెంచుకొని బయటకు పొంగినట్లుయింది. భద్ర ఆమె కళ్ళు తుడిచి దగ్గరకు తీసుకొంది. “ఇంతకాలం ఇంత బాధను ఎల్లా దాచుకొన్నావే తల్లీ!” ఏదో జ్ఞాపకం వచ్చినట్లు జానకి చెప్పుకుపోయింది. “ఆశ అనిపిస్తూంటుంది.” “హఠాత్తుగా మాయమైన మనిషి అంత హఠాత్తుగానూ వచ్చేస్తారేమో. తీరా వస్తే నేనక్కడ లేకపోతే?....” ఆమె బొ౦బాయినే కాదు, ఆ వీధిని, ఆ యింటిని కూడ వదలలేకపోయింది. అక్కడే వుద్యోగం చేసుకొంటూ పై చదువులు చదివింది. ఆ చదువు మనస్సుకో వ్యావృత్తి కలిగించడం కోసం. పరీక్షలు ప్యాసయింది. ఉద్యోగాలు మారింది. కాని ఇల్లు మార్చలేదు, చాలాకాలం.... ఆ ఆశ పోనేలేదు. హైర్-పర్చేజు పద్ధతిలో ఫ్లాట్ కొనుక్కున్నా అది ఎవరికో అద్దెకిచ్చి తాను మొదటి చోటనే ఆ ఇంట్లోనే వుంది. ఆ ఇల్లు తీసేశారు. అప్పుడు తన ఇంటికి వెళ్ళినా వారానికి వోమారేనా పాత ఇంటి వీధికి వెడుతుంది. అక్కడున్న పార్కులో కూర్చుని వస్తూంటుంది. ఆ కథ విని భద్ర కూడా కళ్ళనీళ్ళు పెట్టుకొంది. వారి కబుర్ల సడి విని పక్కగదిలో పడుకున్న సత్యానందం లేచి వచ్చాడు. లైటు వేసేడు. ఇద్దరూ కూర్చుని వున్నారు. “మీరిద్దరూ నిద్రపోనేలేదా? ఎంత అయిందో చూసుకొన్నారా? రెండు దాటింది.” భద్ర కళ్ళు తుడుచుకుంటూ గోడనున్న గడియారం వంక చూసింది. సత్యానందం గ్రహించేడు. “ఏమిటిది! భద్రా! నువ్వుకూడానా! దానికి ధైర్యం చెప్పడానికి బదులు నువ్వూ ఏడుస్తున్నావూ? ....బాగుంది వరస! ....ఏమిటిది జానకీ!” అంటూ ఊరడింపుగా తల నిమిరేడు. “నాకొకరు ధైర్యం చెప్పాలిసిన అవసరం ఉందా బావా! రాయయిపోయా కదా!"" అని జానకి ఏడ్చింది. "వూరుకో. అలా కాగలిగితే మంచిదే. కావడం అవసరం కూడా. లేకపోతే మన దేశంలో ఒక్కరోజు బతకలేము" అన్నాడు, సత్యానందం సగం వోదార్పుగా, సగం విశ్వాసంతో. ఎనిమిదో ప్రకరణం రాత్రి ఘటనలు సత్యానందం మనస్సుకు చాలా చాలా కలవరం కలిగించాయి. వానిమీద వచ్చిన వ్యాఖ్యలు విన్నప్పుడు చాలా బాధ కలిగింది. ఊరేగింపులో వాళ్ళు తన్ను తిట్టేరు. తన పార్టీని తిట్టేరు. ఈ తిట్లు ఈ అయిదు ఆరేళ్ళుగా అలవాటయిపోయాయి. ఇప్పుడు బాధ కలగడం లేదు. నవ్వూ రావడంలేదు. జాలి కలుగుతూంది. రాజకీయ పార్టీలలో తిట్లూ అహంభావప్రదర్శనా బలహీనతకు గుర్తు. బలహీనతను కమ్ముకొని, శక్తి పెంచుకొనడానికి వానినే అధారం చేసుకొంటే మరింత బలహీన పడతారు. కేరళలో ఐక్య సంఘటన ప్రభుత్వం అల్లాగే శిథిలం అయింది. పశ్చిమబెంగాల్ ఐక్యసంఘటనలో మార్క్సిస్టు పార్టీ అటువంటి స్థితినే తెచ్చుకొంటూంది. కాని సుందరరావు దానినెందుకు గుర్తించడు? అతనికి తన కన్న యెక్కువ పార్టీజీవితం వుంది. ఆ ప్రారంభ దినాలలోనే మార్క్సిజం గురించి బాగా చదివేడు. నిజం చెప్పాలంటే తనకే సిద్ధాంత పరిజ్ఞానం తక్కువ. కాని, తనకే యింత విస్పష్టంగా కనిపిస్తున్న ప్రమాదం సుందరరావుకు యెందుకు తెలియడం లేదు? ఎందుకు అర్థం చేసుకోడు? తన సిద్ధాంత పరిజ్ఞానం తక్కువగనక తన ఆలోచనే తప్పుతూందా? అయితే అనుభవం? తన యింటి గేటు మీది లైటు డోము అయిదారు రూపాయిలిస్తే వస్తుంది. అదో నష్టం కాదు. దానిని పూడ్చుకోవడం కష్టంకాదు. కాని, రంగమ్మగారి బాధ అతని కడుపులో చెయ్యిపెట్టి కలిపేస్తూంది. ఆమెది తీరే నష్టంకాదు. చెట్టంత కొడుకు. నేడో రేపో చేతికి అందుకొంటాడనుకొన్నవాడు. పైగా ఏకపుత్రుడు. పోయేడంటే యెంత బాధ? ఆ బాధలో ఆమెకు మతే పోయింది. అంతేకాదు. ఎంతో శాంతురాలనీ, మంచి మనిషి అనీ పేరు పడ్డ ఆమె పెద్దపులి అయ్యింది....అయ్యయ్యో...! అనుకొన్నాడు. కాని, ఆమె దుఃఖం, అంత బాధ కూడా గ్రామంలో అందరి సానుభుతీ సంపాదించలేదు. అదే అతని బాధ. వారి వ్యాఖ్యలు చూస్తూంటే దేశం ఏమయిపోతూందనిపిస్తూంది. స్వాతంత్ర్యానికి పూర్వం జనంలో వున్న సహృదయత ఏమయింది? ఏమయింది! "మతి స్వాధీనంలో లేనప్పుడే మనిషి అసలు రంగు బయటపడుతుంది. అందరూ అనుకొనేటట్లు ఆమె శాంతురాలూ కాదు. మంచిదీ కాదు-" అన్నారు ఒకళ్ళిద్దరు, మనస్తత్వ పరిజ్ఞానం కనబరుస్తూ. "సుందరరావుకి మంచి పరాభవం జరిగింది. మీరామెను పట్టుకొని వుండకూడదు. కమ్యూనిస్టు పార్టీలో చేరినా గాంధేయ మనస్తత్వం వదులుకోలేద"ని కొందరు తననీ తప్పు పట్టేరు. "ఏ పార్టీవాడైతేనేం, అగ్రహారంలో బ్రాహ్మణ్ణి, కిందికులం మనిషి అల్లా బండబూతులు తిట్టడమా" అని కొందరు కలివిడంబానికి విస్తుపోయారు. సైన్సుమేష్టారూ, ఆయన భార్యా గ్రామంలో ఎంత మన్నన సంపాదించుకొన్నా కులానికి కమ్మ. పాత బెణుకులాగ ఈవేళ కూడా కులం సమస్య కలక వేస్తూనే వుంది? ఏమిటిది మనం వెడుతున్నది ముందుకా, వెనక్కా? ఒక అడుగు ముందుకి - రెండడుగులు వెనక్కి-అన్న లెనిన్ పదం గుర్తుకు వచ్చి నవ్వు వచ్చింది. ....దానికి జానకి దుఃఖగాధ కూడా తోడయి మనిషి ఉంగీిడెత్తినట్లయిపోయేడు. ‘పంచ్’లో కాబోలు వేశారన్న కార్టూన్ మాట గుర్తువచ్చింది. మునిగిపోయిన వోడను పిల్లకు చూపి, తల్లిచేప-ఇల్లాంటివి ఇరవైయేళ్ళకు వోమారు పైనుంచి వస్తుంటాయి-అందిట. జానకికి ఆపద వచ్చి యిరవైయేళ్ళు కావచ్చింది! మళ్ళీ రంగమ్మ! దీనికి విముక్తి లేదా? విముక్తి! దేశం విముక్తి పొందింది. కాని ప్రజలకి విముక్తి రాలేదు. "దేశమంటే మన్నుకాదోయ్, దేశమంటే మనుజులోయ్!" మన్ను, మనుష్యులు! ….జాతీయాభిమానం తలఎత్తిన రోజునే దేశ విముక్తి జరగలేదు. కనీసం నూరేళ్ళు పట్టింది. ఎన్నో సిపాయి తిరుగుబాట్లు, ఆత్మత్యాగాలు, సహాయనిరాకరణలు! సత్యాగ్రహాలు! శాసనోల్లంఘనలు! మళ్ళీ సైనికుల తిరుగుబాట్లు! సమ్మెలు! అదంతా సుదీర్ఘమైన రక్త ప్రవాహాల గాధ! కన్నీటి గాధ! త్యాగాల గాధ! అల్లాగని, జనం సుఖపడేందుకు చేసే ప్రయత్నాలలో ఈ ప్రాణహరణలు, కన్నీళ్ళూ తప్పనిసరి పీడలని సరిపుచ్చుకోవలసిందేనా? వీనికి విరుగుడేమిటి? తెల్లవారి నిత్యజీవిత వ్యవహారాలలో పడినా అతనిని ఈ ఆలోచనలు వదలలేదు. యంత్రవత్తుగా పనులు చేసుకుపోతున్నాడు. భద్ర గమనించింది. "ఏమల్లా వున్నారు?" అనడిగింది. "ఏంలేదే. ఎల్లావున్నాను?" అది ప్రశ్నా కాదు. సమాధానమూ కాదు. తప్పించుకొనేందుకు చేసిన వ్యర్థప్రయత్నం. భద్ర అర్థం చేసుకొంది. "కూర్చోండి. కాఫీ ఇస్తాను" అని పీట వాల్చింది. "జానకి ఏది?" "స్నానంచేసి బట్ట కట్టుకొంటూంది. వస్తూంది." "వోమాటు రంగమ్మగారింటికి తీసుకెళ్ళు. ఎవరో ఒకరు వస్తూ, పోతూంటే మనస్సుకి కాస్త ఉపశాంతి…." భద్ర నిరుత్సాహంగానే అంగీకరించింది...."ఉపశాంతి కాకేముంది? జానకి ఏం చేస్తూంది? జ్ఞాపకం వచ్చినప్పుడు వో ఏడుపు ఏడుస్తారు. కళ్ళు తుడుచుకొని వూరుకొంటారు…." సత్యానందం ఒక్క నిట్టూర్పు విడిచేడు. భద్రే అంది. "ముఖ్యమంత్రి కాలేజీహాస్టల్‌మేటు, జైలుమేటు అన్నారు. మీకు స్నేహమూ వుంది. ఏమిటీ దురన్యాయం అని--వోమారు మాట్లాడిరారాదూ?" సత్యానందానికి వెనుకటిగాధలు జ్ఞాపకం వచ్చి మ్లాన హాసం చేసాడు. "ఇరవయ్యేళ్ళ క్రితం నువ్వే వో మాట అన్నావు గుర్తుందా?  ఏదో ఇల్లాంటి విషయమే వచ్చి నిన్ను మద్రాసు వెళ్ళి మీ బాబయ్యనూ, ముఖ్యమంత్రినీ కలుసుకురమ్మన్నాను. మంత్రులు బంధువులుగా లేనివాళ్ళేం చెయ్యాలన్నావు!" "ఏమో ఏమన్నానో, కాని వెళ్ళేను కాదా!" సత్యానందం ఆనాటి ఘట్టాలింకా జ్ఞాపకం చేసుకొన్నాడు. "అప్పుడు జాన్ కూడా అదేమాట అన్నాడు. రాజకీయాలను బంధువుల మధ్య వచ్చిన పేచీలలాగా సర్దుకోబోతే ప్రజలకే నష్టం అన్నాడు..." జాన్ ప్రసక్తిని భద్ర సహించలేకపోయింది. "జాన్ మాటలు నాదగ్గిర చెప్పకండి. తానూ వో మనిషే. తవుడూ వో రొట్టే. అతగాడి మంత్రాంగమే వూరి నింతవరకూ తెచ్చింది." "తొందరపడకు భద్రా! జాన్ బలహీనుడయి అల్లా తయారయాడు కాని, చెడ్డవాడు కాదు." "మీరే మెచ్చుకోవాలి." భార్య యిచ్చిన కాఫీ చప్పరిస్తూ సత్యానందం నిశ్శబ్దంగా వూరుకొన్నాడు. అతని మనస్సులో ఆనాటి కథలన్నీ సినీమాబొమ్మలలా కదులుతున్నాయి. ఆనాడు ఉమ్మడి మద్రాసు అసెంబ్లీలో చర్చలు సాగుతున్నదృష్ట్యా అగ్రహారంలో జరుగుతున్న అసలు విషయాన్ని ముఖ్యమంత్రికి రాయబారి ద్వారా తెలుపుతే చాలునన్నాడు తాను. ప్రజలలో ప్రబోధంచేసి వారిని చైతన్యవంతుల్ని చేయడం అసలు చేయవలసిన పని అన్నాడు జాన్. ఆ పేరున సభలూ ప్రదర్శనలూ జరిపితే ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి, ప్రతిష్ఠకోసం పాకులాడేలాగ చేస్తామని తన భయం. తానే తప్పేడు. కాని, చివరకు ఏం జరిగిందో ఎలా జరిగిందో. అంతా కలలో మాదిరిగా జరిగిపోయింది. ప్రజలలో చైతన్యం కావాలనే వాళ్ళు వాళ్ళ చైతన్యానికి విరుద్ధంగా నిర్ణయాలు చేసి వాటిని అమలు జరపండన్నారు. ఏవిధమైన సన్నాహాలూ లేకుండా, ప్రత్యక్ష పరిస్థితులను గమనించుకోకుండా దేశవ్యాప్త రైల్వేసమ్మె నిర్ణయం ఏమిటని ఆనాడు రహస్యదారుల్ని పడి గ్రామం చేరిన విశ్వాన్ని తానే అడిగేడు. ఆయనే ఒక విశ్వాసంతో గాక విమూఢదశలో పని చేస్తున్నట్టుగా అనిపించింది. ఆయనే కాదు. అందరూ అల్లాగే  కలలోలాగ, దిగ్భృమ చెందినట్లు, మోహావిష్టులలాగ పని చేస్తున్నారనిపించింది. తెలివి వచ్చి, కళ్ళు తెరచేసరికి తాము ఎవ్వరూ తమ స్థానాలలో లేరు. తాను కమ్యూనిస్టు పార్టీలో చేరేడు. జాన్ ప్రజాప్రబోధం విడిచి ప్రజోద్ధరణకు పూనుకున్నాడు. విశ్వం అసలు లేకుండానే పోయేడు! నాటినుంచి నేటివరకు ప్రతి ఒక్కరూ తమ గుర్రాలమీద బిగిసే కూర్చున్నారనిపిస్తూంది. ఇదెల్లా జరిగింది? జరిగిన దెంతవరకు సవ్యం? ఏది సత్యం? ఏదసత్యం! కరిగిపోతున్నాయి సరిహద్దు రాళ్ళు. కదులుతున్నాయి కాలపుకీళ్ళు! ఈ యింట్లో భయం వాసన ఎటూ దారీ తెన్నూ లేదు ఇది రాక్షసపతి రాజధాని. బలిచక్రవర్తి నివాస భూమి. “ఎవరిదీ పద్యం? ఎక్కడ చదివేను” అనుకొంటూ సత్యానందం గోడకి జేరబడ్డాడు. తొమ్మిదో ప్రకరణం “ఎవరో అబ్బాయి  వచ్చి కూర్చున్నాడులా వుంది బావా!”-అంటూ జానకి వంటయింట్లోకి వచ్చింది. “ఒక్కరేనా?”-అంటూ సత్యానందం చేతిలో కప్పు కింద పెట్టేడు. అతడింకా చాలామంది రాకకి ఎదురుచూస్తున్నాడన్నమాట. “ఏం విశేషం?”-అంది. “సాహిత్యవారం.” కమ్యూనిస్టుపార్టీ ప్రతి ఏడాదీ ఒక వారాన్ని సాహిత్యాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళడమే ప్రధాన కార్యక్రమంగా కేటాయించడం ఎన్నో ఏళ్ళుగా అలవాటు. దానికై పార్టీ యంత్రాన్నంతనూ కదిలిస్తుంది. పార్టీ సభ్యులంతా ఆ వారంరోజులూ శ్రద్ధగా పుస్తకాలు తీసుకొని వూళ్ళోకి వెడతారు. ఆ మాట వినగానే భద్ర కంగారు కనబరచింది. “వీధిలోకెడితే ఈపూట ఏ రెండింటికోగాని ఇంటికి తిరిగిరారన్నమాట. జానకి కూడా వచ్చింది. ఈవేళకి వాళ్ళని వెళ్ళిరమ్మనండి” అని సలహా యిచ్చింది. సత్యానందం నవ్వేడు. ‘గట్టిదానివే’ అన్నాడు. “అసలు నిన్ననే ప్రారంభించవలసింది. పుస్తకాలు పూర్తిగా చేరకా, అందరూ తెమిలి పనుల్లోంచి బయటపడకా వోరోజు వుట్టినేపోయింది.” జానకి తన కోసం పని ఆపవద్దంది. “ఈ ఏడాది మంచి పుస్తకాలు తెలుగువి వున్నాయా? లేక అన్నీ మాస్కో పుస్తకాలేనా?” “వీధిగదిలో వున్నాయి. నీకు నచ్చినవేవో నువ్వే చూసుకో”-అని సత్యానందం కదిలేడు. “పోనీ, ఏదన్నా టిఫిన్ చేస్తాను. తినివెళ్ళండి. ఇల్లాంటి పనున్నప్పుడు ముందు చెప్పకూడదా?”-అని భద్ర లేచింది. “చెయ్యి. వుంటే వస్తా”నన్నాడు సత్యానందం. భర్త వుండడని భద్రకు తెలుసు. వీధిలో సహచరుల్ని కూర్చోబెట్టి అతడు ఇంట్లో ఉపాహారాలు, ఫలహారాలూ సేవించడు. తింటే నలుగురూ తినాలి. “వాళ్ళనికూడా వుండమనండి. మళ్ళీ ఏవేళవుతుందో తిరిగి వచ్చేసరికి.” “కానీ. అయిదుగురికి చెయ్యి అలాఅయితే”-అంటూ అతడు సావట్లోకి వెళ్ళాడు. “ఏం చేస్తావు?” అంటూ జానకి ఆమెకు సాయం కదిలింది. పదో ప్రకరణం “ఏమిటండి నిన్న రాత్రి ఏదో చాలా గొడవ జరిగిందట!” అంటూ కామేశ్వరరావు సత్యానందం రాగానే కుర్చీలోంచి లేచి ఎదురు వచ్చేడు. “మీరంతా వచ్చేరా. రాండి. ఆఫీసుగదిలోకే వెడదాం” అంటూ సత్యానందం స్విచ్‌బోర్డ్ మీదున్న తాళంచెవి తీసుకున్నాడు. “నిన్న మార్క్సిస్టు పార్టీవారు కేరళ వెన్నుపోటు నిరసనదినం జరిపేరు.” “రంగమ్మ తన కొడుకును పట్టించియిచ్చేవని తిట్టిందట! వెన్నుపోటూ, కన్నుపోటూ రోగం బాగా కుదుర్చింది” అన్నాడు వెంకట్రామయ్య. తాళం తీస్తున్న సత్యానందం ఆ మాటకు చురుక్కుమన్నట్లయి వెనుతిరిగి చూసేడు. కాని, అప్పుడేమీ అనలేదు. గదిలోకిపోయి కూర్చున్నాక ఏ ఒక్కరితోనూ అన్నట్లుగా కాకుండా ఉమ్మడిగానే తన అసంతృప్తి తెలిపేడు. “సుందరరావుగారి రోగం కుదరడానికి కేశవరావులాంటి మెరికల్లాంటి కుర్రవాళ్ళే చచ్చిపోవాలా?” “అతని చావు కోరి తెచ్చుకొన్నది. మనమేం చెయ్యగలం?”-అన్నాడు వెంకట్రామయ్య. “మీ సిద్ధాంతాం తప్పుదారిన పడిందని చెప్పి చూశాం. అలా చెప్పడం కేవలం రివిజనిజమేనన్నారు. విప్లవపంధా వదిలేశామట. ఇప్పుడేం మిగిలిందో....” అన్నాడు కామేశ్వరరావు. మిగిలిన వాళ్ళుకూడా తప్పంతా కేశవరావుదే అయినట్లూ, పాలీసు వాళ్ళూ ప్రభుత్వమూ ఆత్మరక్షణ కోసం అతనిని చంపక తప్పదన్నట్లూ మాట్లాడుతూంటే సత్యానందానికి బాధ కలిగింది. ఈవేళ కూడా పుస్తకాల అమ్మకం మూలబడినట్లే అనుకొన్నాడు. నెమ్మదిగా ఆచి, తూచి మాటలారంభించేడు. “కేశవరావు వాదం దృక్పధంలో వున్న భేదాన్ని తెలుపుతుందేగాని, అతడిని స్వార్ధపరుడనగలమా?” ఎవ్వరూ అనలేరు. చిన్న వయస్సు. చదువుంది. ఒక ఏడాదిలో డాక్టరవుతున్నాడు. ఎక్కడ బోర్డు కట్టుకున్నా జీవితం సుఖంగా గడుస్తుంది. పెళ్ళి చేసుకొని, దేశం ఏమైపోయినా తాను సుఖపడగలడు. కాని, అతడా దారి తోసిపారేశాడు. తొక్కుతున్న దారి ముళ్ళదారి అని తెలుసు. కాని, అదే ఎన్నుకున్నాడు. ఎవరికోసం? ఎందుకోసం? అందరూ ఆ మాట ఒప్పుకొన్నారు. కాని, ఎవ్వరూ అతని మాటల కటుత్వం మరిచిపోలేదు. “మనం కమ్యూనిస్టులమే కాదన్నాడండి-“ అన్నాడు కామేశ్వరరావు. “సోవియట్ యూనియనుది సోషల్ సామ్రాజ్యవాదం అన్నాడండి” అన్నాడు మందేశ్వరరావు. “-చైనా మార్గమే మనదీ అన్నాడండి. కాదనడం వర్గ సంకరాన్ని కోరడంట. పార్లమెంటరీ విధానానికి అమ్ముడుపోవడమట. శాంతియుత సోషలిస్టు పంధా వట్టి మోసమన్నాడండి!” అంటాడు వెంకట్రామయ్య. కాని, సిద్ధాంతాలలో వున్న లవలేశాలు, భేదాలు ఈవేళ అధికారంలో వున్నవారికి పట్టవు. కేశవరావు వాదనలు తెలియడానికైనా విచారణ అంటూ జరగలేదు. అతనిని వరంగలులో అరెస్టు చేశారు. పార్వతీపురం వద్ద చంపేశారు. ఇది అన్యాయం. ఘోరం. తమ మాటకు ఎదురు చెప్పినవాడినీ, చెప్తాడనుకున్నవాడినీ దారిలోంచి తప్పించడానికి ఆ వాదాలు ఒక సాకు మాత్రమే. ఆ పద్ధతిని ప్రభుత్వం అవలంబించదలచిందనీ, దానికి బాహాటంగా యేర్పాట్లు చేస్తూందనీ చెప్పడానికి హోం మంత్రి అన్ని పత్రికలకీ తన పూర్తి ప్రకటన యివ్వడమే సూచన. ప్రభుత్వం దుర్బుద్ధిని, దురన్యాయాన్ని ప్రజలకి చెప్పాలి. దానికి వ్యతిరేకంగా జనాన్ని సమీకరించాలి. లేకపోతే బంజర్ల సాగు వుద్యమం అంటున్న కమ్యూనిస్టు పార్టీ, ఇతర పార్టీలూ ఆ దాడులకు గురి అవుతాయి. అందుకే ప్రభుత్వం తయారవుతూంది. దానికి వ్యతిరేకంగా జనాన్ని, అన్ని పార్టీలవారినీ కూడగట్టాలి. అందరూ అంగీకరించేరు. “కాని ఏలాగ? ఎవరొస్తారు?” అని అందరికీ అనుమానమే. సత్యానందం ఒక ప్రతిపాదన చేశాడు. “మనం సాహిత్యవారం ప్రారంభిస్తున్నాం. ఇది జరిగినన్నాళ్లూ చుట్టుపక్కల వూళ్లూ, పేటల్లో సభలు పెడదాం. ఆ విధంగా రెండూ ఒకదానికొకటి జతపడి మంచిపని జరుగుతుంది.” “మన రాష్ట్రపార్టీ అనుమతి....” అని కామేశ్వరరావు నీళ్ళు నమిలాడు. గ్రామపార్టీ సభ్యులలో చదువుకొన్నవాళ్ళలో అతడొకడు. ఏ పనీ జరగకుండా పార్టీ నిర్మాణ సూత్రాల సాయంతోనే ఆటంకాలు సూచించగల అద్భుత మేధావంతుడని అతనిమీద సత్యానందానికి అభిప్రాయం వుంది. అందుచేత నెమ్మదిగానే మందలించేడు. “ఇదిగో చూడు. మనం చేసే పనులన్నింటికీ అల్లా అనుమతి తెచ్చుకు మరీ చేద్దామంటే కుదురుతుందా? ఆ అనుమతి కోరడం అసలు పని ఎగగొట్టడానికి ఒక మార్గం అవుతుందంతే. పార్టీ స్థూలంగా వో మార్గం యిచ్చింది. నిర్బంధ వ్యతిరేకత. ప్రాధమిక హక్కుల కోసం ఆందోళన. ప్రజల ఆవశ్యకతల కోసం పని చెయ్యడం. ఆ పనిలో అన్ని పార్టీలనూ తోడు తెచ్చుకోడం....” “కాంగ్రెసు వాళ్ళని కూడానా?” “మన వూళ్ళలో కాంగ్రెసును అభిమానించే జనం వున్నారు మరి....” “సిండికేటు జట్టును....” “వాళ్ళు మనుష్యులలోకి రారంటే తప్ప నిర్బంధ వ్యతిరేకతకై జనసంఘం వాళ్లు వస్తే మాత్రం నువ్వెందుకు కాదనాలి!” “ఎవ్వరూ కలిసి రారండి” అని వెంకట్రామయ్య నిస్పృహ. “కలిసి వచ్చేందుకు ప్రయత్నించాలి” అన్నాడు సత్యానందం దృఢంగా. “అయితే ఇవ్వాళ పాలెంలో మీటింగు పెడదాం. మేం జనాన్ని కలుసుకుంటాం. మీరు పార్టీ పెద్దల్ని కలుసుకోండి,” అన్నాడు మందేశ్వరరావు. సత్యానందం అంగీకరించేడు. “కామేశ్వరరావు నాతో వస్తాడు.” “నేనెవరి దగ్గరకేనా వస్తాగాని సుందరరావు మొహం చూడను. అతడు....” కామేశ్వరరావు ఆయన గుణవర్ణన చేసేవాడే కాని, సత్యానందం ఆపేడు. “నీ అభ్యంతరం నేనెరుగుదును. కాని, యిది ప్రజా కార్యమయ్యా!....” “ప్రజా కార్యమో, ప్రభు కార్యమో. నా పార్టీని తిట్టేవాడి మొహం చూడ్డం కూడా నాకు అసహ్యం.” “మనం కమ్యూనిస్టులం. మనకు ప్రజలను కాదన్న పార్టీ వేరే లేదు. అందుచేత....” “నా వల్ల కాదండీ.” “రానంటున్నాడు కద, పోనీండి,” అని వెంకట్రామయ్య సర్దబోయేడు. “పోనీయకేం వుంది? నేనే వెళ్ళి వస్తా, నాకల్లాంటి పట్టింపులు లేవు. అంతే. ‘ఒరులేయవి యొనరించిన, నరవర! అప్రియంబు తన మనంబున కగు, దా నొరులకు నని సేయకునికి పరాయణము పరమ ధర్మపధముల కెల్లన్‌’ - అన్నాడు భారతకారుడు. కమ్యూనిస్టు జీవిత పద్ధతుల్లో అదొక మాత్రమని నా అభిప్రాయం సుమా:” “మీరు కమ్యూనిస్టు అయినా గాంధీయిజాన్ని వదలలేదు” అన్నాడు కామేశ్వరరావు. సత్యానందం నవ్వే దానికి  సమాధానం. పదకొండో ప్రకరణం గుమ్మంలోకి వచ్చిన సత్యానందాన్ని తండ్రి చూసేడనీ, చూడనట్లు నటిస్తున్నాడనీ రంగనాయకులు గ్రహించేడు. కాని, ఆ విషయం ఎరగనట్లే తాను నటించదలచేడు. “రాండి, బాబాయి!” అని ప్రత్యుత్థానంగా ఆహ్వానిస్తూ తండ్రికి అతని రాక తెలిపాడు. “సత్యానందంగారు వచ్చారు.” సుందరరావు అప్పుడేనా తాను చదువుతున్న ప్రజాశక్తి పత్రికలోంచి తల ఎత్తలేదు. కాని, కొడుకు మాట వినబడినందుకు గుర్తుగా ‘హు’ అని ముక్కేడు. తనకు లభించగల స్వాగతం ఎలా వుంటుందో సత్యానందానికి తెలుసు. ఎరిగి వుండే వచ్చాడు. కనక కష్టం పెట్టుకోలేదు. పైగా డాక్టరు కొడుకు పిలిచాడు. మర్యాద చేస్తున్నాడు. చాలు. అదీ లేకపోయినా ఫర్వాలేదు. కనక తాత్సారం చేయకుండా తాను వచ్చిన పనికి ఉపోద్ఘాతం ప్రారంభించేడు. “నిన్న రాత్రి మీ వూరేగింపు మా యింటి దగ్గర వుండగా జరిగిన సంఘటనకు నాకెంతో విచారంగా వుంది....” పత్రికలోంచి తల ఎత్తకుండానే సుందరరావు గుర్రుమన్నాడు. “మీ యింటి దగ్గర జరిగి వుండకపోతే విచారపడవలసి వుండేది కాదు.” ఆ మాటలోని పొడుపును సత్యానందం గుర్తించదలచలేదు. “సుందరరావుగారూ! ఆ ఘటన మనకెంత కష్టం కలిగించినా ఆవలి వ్యక్తినీ, దానికి వెనకనున్న....” “కారణం నువ్వే గనక అనుభవించమంటావు” అన్నాడు, అర్ధోక్తిగా. “….కధనూ మనం ఎరుగుదుం. ఆ రంగమ్మగారు చాల యోగ్యత గల మనిషియని మనం ఎరుగుదుం. అందుచేత, మనకి బాధ కలిగించినా పట్టించుకోకూడదంటాను. ఏమంటావు డాక్టర్‌!” అన్నాడు, సత్యానందం ఒక్క బిగిని. తండ్రి కొడుకులనిద్దర్నీ కలిపి. “పాపం, కొడుకు పోయిన బాధలో ఆమెకు మతి పోయింది” అని రంగనాయకులు సానుభూతి ప్రకటించేడు. సత్యానందం యిచ్చకాలాడుతుంటే తన కొడుకు తానతందాన అంటున్నాడనిపించి సుందరరావు పళ్లు నూరేడు. కాని యేమీ అనకుండా పత్రికలో తల దూర్చేశాడు. ఆ విధంగా ఉపోద్ఘాతం ముగించి సత్యానందం ఇంక అసలు కధకు వచ్చాడు. “నక్సలైట్లను అణచివెయ్యడం పేరుతో ఆంధ్ర ప్రభుత్వం శ్రీకాకుళం, ఖమ్మం జిల్లాలను నరకకూపం చేస్తూంది. పోలీసులూ, గ్రామ పెత్తందార్లూ 20 ఏళ్ళనాడు తెలుగుదేశం అంతటా సాగించిన దుర్ణయాలను ఇప్పుడా జిల్లాలలో సాగిస్తున్నారు. ఎవడి చేతనో “మావో కావాలి” అనిపించి, ఆ దురంతాలు  మిగతా జిల్లాలకి కూడా పాకిస్తే ఆశ్చర్యపడనక్కర్లేదు....” సుందరరావు పత్రికలోంచి తల ఎత్తకుండానే తగిలించాడు. “మన రాష్ట్రప్రభుత్వం కాంగ్రెసులో వచ్చిన చీలికలలో అభ్యుదయ పక్షానికి చెందిన వాళ్ళదేననుకొంటాను?” నాలుక చివర వరకూ వచ్చిన ఎత్తిపొడుపు మాటను సత్యానందం అతి కష్టం మీద ఆపుకొన్నాడు. “కాంగ్రెసులో ఏర్పడుతున్న పృధకీకరణం గురించి మన పార్టీలు రెంటికీ భిన్నాభిప్రాయాలున్నాయి. ఈనాడు ఆ సంస్థలో వస్తున్న చీలికలో దాని ప్రతిబింబం కనిపిస్తూందని మా అభిప్రాయం. మీరు....” “మా అభిప్రాయాన్ని మేం చెప్పుకోగలం. ఆ శ్రమ నీకు వద్దు!.... “ఎందుకు చెప్పుకోలేరు? నాకా అనుమానం ఏమాత్రం లేదు. అయితే అధికారంలో వున్న కాంగ్రెసు ముఠాను సమర్థించే వాళ్ళంతా అభ్యుదయవాదులా? ఎవరి శాతం ఎంత?....అనే చర్చ ప్రస్తుతం కాదు. ఆ పార్టీ రాజకీయ నాయకత్వం గురించి మనకు భిన్నాభిప్రాయం వున్నా నక్సలైట్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ఇద్దరం వ్యతిరేకిస్తున్నాం....” రంగనాయకులకు ఆ శబ్దం చాల చప్పగా వినిపించింది. వెంటనే “ఖండిస్తున్నాం” అన్నాడు. “ఆ దురంతాలు కట్టిపెట్టేటట్లు ప్రచారం, ఆందోళన చెయ్యాలనేదీ మీ పార్టీ ఆశయమే.” “మేం చేస్తూనే వున్నాం” అన్నాడు సుందరరావు. “అందుకే మీ వద్దకు వచ్చాను. నవంబరు వారోత్సవంలో దీనిని ప్రధానంగా తీసుకు పని చెయ్యాలనీ, దానికి సాధ్యమైనంత వరకు అన్ని పార్టీలనూ కలుపుకొని, సాధ్యమైనంత హెచ్చుమందిలోకి దీనిని పాకించాలనీ నిశ్చయించుకొన్నాం. ఆ వుద్దేశంతోటే మీవద్దకొచ్చాను.” “మీ ప్రయత్నం ఆలోచించవలసిందే” నన్నాడు రంగనాయకులు. “అంతకంటె ముఖ్యంగా చేయవలసినవీ ఆలోచించవలసినవీ బోలెడు వున్నాయి” అన్నాడు సుందరరావు. “తప్పకుండా. అవి ఆలోచించడం కోసం ఇద్దరికీ అంగీకారం వున్న యిల్లాంటి ముఖ్య అవసర విషయాన్ని వాయిదా వెయ్యవద్దు. ఏమంటావు, రంగనాయకులు!” “నువ్వు బాతాఖానీకొచ్చేవా?....” రంగనాయకుల్ని సంబోధించినందుకది హెచ్చరిక. సత్యానందం సర్దుకొన్నాడు. “చెప్పండి.” “పార్టీ తరపున పార్టీతో మాట్లాడదలచుకుంటే చెప్పవలసిందీ, చెయ్యవలసిందీ వేరు. కాక, వ్యక్తులతో కబుర్లు చెప్పిపోదలచుకొంటే, మంచిది. మీ మీటింగు ఆలోచన బాగుంది. కానివ్వండి....” “మీరు మీ పార్టీ తరపున సభల ఏర్పాట్లలో కలిసి రావాలనే మా కోరిక.” “అయితే అంతకు ముందు జరగవలసింది ఒకటుంది” అన్నాడు, సుందరరావు. “సెలవివ్వండి.” “నిన్న మా పార్టీ జెండాకు ఆ వెర్రిదాని చేత అవమానం చేయించేవు. దానికి క్షమార్పణ చెప్పుకుంటే తప్ప మీ పార్టీతో ఏ పనికీ కలియడం సాధ్యం కాదు.” సత్యానందం తెల్లబోయేడు. “నేను చేయించానా?” “వందమంది చూసేరు.” “నీ అభిప్రాయం కూడా అంతేనా? డాక్టర్‌!” రంగనాయకులు సిగ్గుపడ్డాడు. తల తిప్పుకొన్నాడు. సత్యానందం తండ్రి కొడుకుల్ని మార్చి మార్చి చూసేడు. “అది నా ఇంటి ముందు జరిగిందని తప్ప ఆ ఘటనతో నాకేమీ సంబంధం లేదు. నాకు సంబంధం లేని ఒక పని కోసం క్షమార్పణ చెప్పుకోవలసిన అవసరంలేదని నే వెళ్ళిపోవచ్చు. కాని, నా క్షమార్పణ ఒక ప్రజాకార్యం బాగుపడడానికి తోడ్పడితే ఆ మాట చెప్పడానికి నాకభ్యంతరం లేదు.” సుందరరావు విజయం సాధించినట్లు, పరాజితుని వంక పురుగుని చూసినట్లు చూస్తూ చిరునవ్వు నవ్వేడు. రంగనాయకులు సిగ్గుతో ముణుచుకు పోతూంటే సత్యానందం క్షమార్పణ చెప్పుకొన్నాడు. “ఆమె చేసిన తప్పుకు ఆమె తరపున నేనే క్షమార్పణ చెప్పుకుంటున్నా.” “ఆమె మతిలేనిది. ఆమె నీ చేతి పనిముట్టు అయింది. తప్పు నీది. ఆమెను ప్రోత్సహించినందుకు, ఆమెచేత ఆ పాడు పని చేయించినందుకు నువ్వు బహిరంగ సభలో, నడివీధిలో క్షమార్పణ చెప్పాలి.” ఈమారు పురుగును చూసినట్లు చూడడం వంతు సత్యానందానిది. పన్నెండో ప్రకరణం సత్యానందం వెళ్ళిపోయాక సుందరరావు నిస్తబ్ధుడుగా కూర్చున్న కొడుకు వంక తిరిగేడు. “ఏమిటి నీ ధోరణి? ఖండిస్తున్నాం, అని అతగాడి మాటలకి తానతందాన మొదలెట్టేవు! కాలు తడి కాకుండా మెరక దారి చూసుకోవాలని బుద్ధి పుట్టిందేమిటి?” పిరికితనం పేరెట్టి, వెక్కిరించి నోరు నొక్కేస్తే తప్ప పార్టీలో ఏకభావం నిలబెట్టలేమనే అభిప్రాయం సుందరరావుది. కమ్యూనిస్టు పార్టీలో దుందుడుకు ధోరణుల్ని విమర్శించినవారికి పిరికితనం ఆరోపించి, నోరు నొక్కడం ఇరవయ్యేళ్ళ క్రితం బ్రహ్మాండంగా పని చేసింది. ఇప్పుడూ అదే పంధా. అంతవరకూ మనస్సులో సుళ్ళు తిరుగుతున్న ఆలోచనలన్నీ మెరక దారి ప్రసక్తి రాగానే ఇంకిపోయేయి. “మనం కూడా....” అంటూ నత్తులు కొట్టేడు. “ఔనోయ్‌....” అని సుందరరావు గర్జించేడు! “మీరంతా అదృష్టవంతులురా. తినే దెబ్బలూ, పడే  జైళ్ళూ అవేవో మేము అనుభవించేశాము. ఒక్కొక్క పుస్తకానికి నానా మారాముళ్ళూ పడి తెచ్చి చదివేం. ఇప్పుడవేం మీకక్కర్లేదు. వో మారేనా లెనిన్‌ను చదివేరా? మాకు వంకలు పెట్టబోతున్నావూ? ఏమిటి, నీ – ‘మనం కూడా....?’ లెనిన్ ఏమన్నాడో తెలుసా? రాజకీయ, సాంఘిక, నైతిక పదజాలాలన్నింటి వెనకా, ప్రకటనలూ, వాగ్దానాలూ అన్నింటి వెనకా వర్గ ప్రయోజనాలు వుంటాయి. ఆ విషయాన్ని తెలుసుకోనంత కాలం ప్రజలు రాజకీయాల్లో మోసపోతారు. ఇది గతంలో జరిగింది. ఇక ముందూ జరుగుతుంది అన్నారు ఆయన. మరిచిపోకు.” “వాళ్ళు తలపెట్టింది ప్రజాకార్యం. దానికే మనమూ....” అని నసిగేడు, రంగనాయకులు. సుందరరావు నవ్వేడు. “బాగుందయ్యా! ఒకే లక్ష్యం కోసం అని అందరూ చెప్తారు. కాని అనుసరించే పంధానుబట్టి లక్ష్యం స్వభావమే మారిపోతుంది. మరిచిపోకు. మనది విప్లవ పంధా. వాళ్ళది సంస్కారవాద పంధా. రివిజనిస్టు మార్గం. మనది కార్మిక మార్గం. వాళ్ళది బూర్జువా పంధా.” అదేమిటో అర్థం కానట్లు రంగనాయకులు తండ్రి ముఖం వంక దేబెగా చూసేడు. “రాజకీయాలను తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంగా పుచ్చుకుంటామంటే కుదరదు. ఒక చిన్న వూళ్ళో మనం తీసుకొనే ధోరణి పట్టి అంతర్జాతీయ రాజకీయాలదాకా మన అభిమానాలూ, తెలివీ తేలిపోతుంది.” రంగనాయకులికి తండ్రి మనస్సు అర్థం అయింది. విప్లవం సమకూడాలంటే లెనిన్ మూడు జరగాలన్నాడు. శత్రుకూటం శైథిల్యం, ప్రజలలో విప్లవాభిముఖ్యం, వారిని నడపగల పార్టీ. మొదటి రెండూ సమకూడేయి. మూడోది గట్టిపరచుకోవాలి. ఆ ప్రయత్నం నాలుగైదేళ్ళుగా ఏకాగ్రతతో చేస్తున్నా తమ అడుగు ముందుకు పోవడం లేదు. పైగా కేరళలో తమ పార్టీ ఏకాకి అయింది. పశ్చిమ బెంగాల్‌లో అదే జరుగుతూంది. కారణం తమ ఆలోచనలలో లోపం వున్నదని రంగనాయకులు వూహ. మిగిలిన పార్టీలు అడ్డు వస్తున్నాయి. గనక వానిని పుటమార్చి, బలం తెచ్చుకొని, విప్లవం నడిపి, సోషలిజం.... తండ్రియందు ఎంత గౌరవం, ఆయన మాటయందు గురి, నాయకత్వంలో భక్తి భావం వున్న రంగనాయకులు అన్యాపదేశంగానైనా తన అభిప్రాయం సూచించకుండా వుండలేకపోయేడు. “జనం అందర్నీ సమకూర్చాలని కదా ఆయన ప్రయత్నం....” సుందరరావు కొడుకు అనుమానాల్ని అవహేళన చేసేడు. “ఒరేయి రాజకీయాల్లో తల నెరిసిందిరా నాది. కుర్రనాగమ్మవు. ఒంటిమీద కంతి కొయ్యడం నేర్చుకున్నావు గాని, సమాజం కంతి కోసే పని మేము నేర్చాం. అందులో రాటుదేలాం. ఎవరెందుకు మాట్లాడుతున్నారో, మాకు అర్థం అవుతుంది. పద్మనాభం సిండికేట్ ముఠా గనక అధికారంలో వున్న కాంగ్రెసు ముఠా మీది కసికొద్దీ, ప్రభుత్వాన్ని పడతిట్టడానికి సభకి రావచ్చు. అధికార కాంగ్రెసు ముఠా అభ్యుదయవాదులుగా పోజు పెడుతున్నారుగా. అందుచేత విశ్వనాధం ‘నేనూ బండెద్దునే. నా ముడ్డికీ పేడరాయ’మని తయారవచ్చు. తప్పంతా పోలీసులదేనని తప్పుకోవచ్చు. కాని, ఈ దొంగల్ని మనం ఎలా కలుపుకు కూర్చుంటాం? ఇదేం విందుభోజనమా? రాజకీయాలురా అబ్బాయి! రాజకీయాలు!” ఎన్నో చెప్పాలనుంది. కాని, రంగనాయకులకి మాట తొణకలేదు. సుందరరావు వదలలేదు. ‘వ్యక్తులుగా వస్తే వాళ్ళని తప్పక రమ్మందాం. మన వాళ్ళు ‘ప్రజాతంత్ర వాదుల్ని’ కలుపుకోమంటున్నారు. కాని అడ్డమైన ఆడవా పార్టీనీ బండిలోకి ఎక్కించుకోమనలేదు....” డాక్టరు రంగనాయకులికి నోరు విడలేదు. లేచేడు....”సరే, కానీండి” అన్నాడు. సుందరరావుకు అర్థం అయింది. తల పంకించేడు. కాని, ఆఖరి మాటగా మరో వాదం జతపరిచేడు. “శత్రువును గాఢంగా ద్వేషించలేనివాడు మిత్రుణ్ని ప్రేమించనూలేడన్నాడు స్టాలిన్. వీళ్ళకి నక్సలైట్ల మీద నిజంగా అభిమానం వుంటే ఆ సభకి కాంగ్రెసు వాళ్ళని పిలుస్తామనరు.” పదమూడో ప్రకరణం “బెల్లం కాచే చెట్లు చూపిస్తానంటూంది, సాధన. వోమారు వాళ్ళ పొలం పోయివస్తామమ్మా!” అని రవీంద్ర తల్లి అనుజ్ఞ కోరుతూంటే వెనకనే వచ్చిన పిల్లలు పకపకా నవ్వుతున్నారు. జానకికీ నవ్వు వచ్చింది. “బెల్లం చెట్లని కాయదోయ్, వీళ్ళు నిన్ను ఆట పట్టిస్తున్నారు.” రవీంద్ర “వోహో, అల్లాగా”-అంటూ సాధన వేపు చూసి తల పంకించేడు. సాథన తన్ను కానట్లు నిర్లక్ష్యంగా వూరుకొంది. ఆమె పెదవుల వొంపులో చిరునవ్వూ, కళ్ళ మెరుపులో కొంటెతనం తొంగిచూడకుండ లేదు. జానకికి అర్థం అయింది. కొడుకు పుట్టింది లగాయతు బొంబాయి వదలకపోవడం చేత, అతనికి నిత్యావసర వస్తువులు చాలవాని స్వస్వరూప జ్ఞానం లేదు. కొబ్బరికాయ ఎలా వుంటుందనే విషయం పిల్లలతో వాదన వేసుకున్నాడు. సత్యానందం అటకమీది కాయ తీయించి, వలిపించి చూపితే తప్ప, అంతవరకూ  బోడకాయనే అసలు కొబ్బరికాయగా భావిస్తున్నట్లు అతనికి తెలియదు. అక్కడికీ అతనిని తాను ఎగ్జిబిషన్లకు తిప్పింది. సినీమాలలో చూపింది. పాఠాలు చెప్పింది. కాని, అతనికా చదువు చాలదు. ‘అన్నీ తిరిగి చూసిరావడం అవసరం’ అనుకొంది. కాని పొలాలు, తోటలు వెంట పంపితే ఏం ఆపదలు వస్తాయోననే భయం రెండోపక్క వుండనే వుంది. “బొంబాయిలో లాగ సిమెంటు రోడ్లుండవు. బెడ్డలు కత్తుల్లా వుంటాయి. ముళ్లు. తోటలో నడుస్తూంటే పార్కులో తిరిగినట్లుంటుందనుకుంటున్నావేమో. గట్టున పోతుంటే చిత్రమూలం, ఉత్తరేణివెన్నులు బట్టలు దూసుకొని వదలవు.” ఆ ఇబ్బందుల మాట విన్నాక రవీంద్రకు అదేమిటో చూడాలిసిందేననిపించింది. “బూట్లు వేసుకు వెడతాలే” అన్నాడు. సాధన అభ్యంతరం చెప్పింది. రెండుచోట్ల పంటబోదెలు తగులుతాయి. బూట్లు విప్పడం, తొడగడం పెద్ద బెడద. పైగా కాలికి ఏ బురదన్నా పట్టుకొంటే అవి చేతపట్టుకు నడవాలి. మామూలు ఆకుజోడు వేసుకోమంది. అతడు లోనికి వెళ్ళి దుస్తులు మార్చుకు వచ్చేలోపున, అతని కూడా వెడుతున్న చిన్నపిల్లలకి జానకి పదిమాట్లు జాగ్రత్త చెప్పింది. “నూతి దగ్గరకు వెళ్ళనీయకండి. ఎరగక తొంగి చూస్తాడు. తూలిపోతే ప్రమాదం. పంట కాలవల దగ్గర జాగ్రత్త.” “అలాగే అత్తయ్యా!” అని సాధన హామీ యిచ్చింది. తనకంటె చిన్నపిల్లలకి తన రక్షణ భారం వప్పచెపుతూంటే రవీంద్రకి అభిమానమే కలిగింది. “ఏమిటమ్మా! నువ్వు మరీను.” అతని అభిమానం చూస్తే తన తెలివితక్కువతనానికి జానకికి నవ్వు వచ్చింది.  వెళ్ళి రమ్మంది. కాని వాళ్ళు తీరా వెళ్ళేక అన్నీ భయాలు. ఒకటే దిగులు. “పట్టణంలో కార్లూ, ప్రమాదాలూ భయం వుంది వాడు చెప్పినట్లు. కాని, అవి మనం ఎరిగిన నిత్యభయాలు. వానికి మనస్సు అలవాటు పడిపోయింది. కాని మోకాలులోతు మించని పంటబోదె, దాని మీద వేసిన తాటిపట్టె ఒంటిబద్ద పెద్ద భయం. ఏమంటే వాడు ఎరగనిది...” అంటూ జానకి తన భయానికి కారణ కల్పన ప్రారంభించింది.  “కొడుకుని చంకదింపడంలేదు. జాగ్రత్త.” అని అప్పుడే రెండు మాట్లు వేళాకోళం చేసిన భద్ర ఆమె ఆరాటం చూసి జాలిపడింది. “మరెందుకు వెళ్ళనిచ్చేవు. ఆనక మీ బావగారితో వెళ్ళునుకదా!” అంతలో మళ్ళీ దిలాసా ఇచ్చింది. “ఫర్వాలేదులే. అనూరాధ అల్లరిబాజాయే గాని, సాధన అల్లా కాదు. ఏం భయం లేదు.” “వాడికి తెలుగుదేశం తెలియదు. తనవాళ్ళనెవరినీ ఎరగడు. అదివరకీ ఇరవయ్యేళ్ళలో బొంబాయి పరాయిదేశం అనిపించలేదు. కాని ఫిబ్రవరిలో శివసేన వాళ్ళ అల్లర్లూ, ఆ ప్రభుత్వం వాటిని సాగనిచ్చిన తీరూ చూశాక వాడి మాట ఏమిటనిపించింది.....” “పత్రికల్లో చదివేంగాని….అదీగాక అదేదో బెల్గాం గురించిన పేచీ అనుకున్నామే….” అని భద్ర ఆశ్చర్యపడింది. “అది పైకి చెప్పేది. అసలది ప్రజాతంత్ర వుద్యమాల్నీ, ప్రజా వుద్యమాల్నీ బద్దలుకొట్టడానికి పుట్టింది….”  “మన తెలంగాణా….” “అబ్బెబ్బే! వాటికి పోలికలేదు. ఇది గ్రామపెత్తందార్లు కట్టిన ముఠాలాంటిది. కాని, అది ఒక ఫాసిస్టు సంస్థ.” ఇద్దరూ ఒకనిముషం వూరుకున్నారు. జానకే మళ్ళీ ప్రారంభించింది. “అప్పటినుంచీ వాడిని మన ప్రాంతం తీసుకురావాలని ఆలోచన. ఇక్కడున్న బంధువులు మాత్రం ఎవరు? ఒక్క మీరు. మీకు పరిచయం చేయాలి. నేను లేకపోయినా వాడు అగతికుడు కాకూడదు.” భద్ర కోప్పడింది. “నువ్వు లేకపోవడం ఎందుకు రావాలి. పాడు మాటలూ నువ్వూను” జానకి మ్లానహాసం చేసింది. “ఏం ఓఘాయిత్యమా?” “వయస్సు మీరిపోయిందా? ముసలి కబుర్లూ నువ్వూను. వట్టినే కూర్చుంటే దిక్కుమాలిన ఆలోచనలన్నీ వస్తాయి. పో. వోమారు వీధిలోకి వెళ్ళి నలుగురినీ పలకరించిరా. అవతల వీధిలోనే కదా మీ అన్నయ్యగారిల్లు. వోమారు చూసి పలకరించిరా. బాగుండదు!” “ఎవరికి?” అంది జానకి ఎకసక్కెంగా, అయిష్టం కనబరుస్తూ. “ఏమిటే ఆ ప్రశ్న.” “ఔనమ్మా! మేమిద్దరం ఓ తల్లిబిడ్డలం అంటారు. కానీ మామధ్య ఆ ప్రేమా, పేగూ లేదు. బహుశా వో చెల్లెలు వున్నదనే గుర్తే వాడికి వుంటుందనుకోను. ఇంక బాగుండనిదెవరికి? లోకానికా? చూద్దాంలే. లోకం కోసమే అయితే అంత ఈపూటే వెళ్ళడం అనవసరం.” భద్ర ఏమీ అనలేదు. కాని ఆ సమాధానం ఆమెకు నచ్చలేదని ముఖమే చెప్తూంది. “సడే, సంబడం. వంటపని చూసుకొందాం, రా. పిల్లలొచ్చే వేళకి అవాలి.” పద్నాలుగో ప్రకరణం సాధనతో ఏవేవో కబుర్లు ఆవేశంగా చెప్తూ వీధివెంట పోతున్న రవీంద్ర చాలమంది దృష్టినే ఆకర్షించేడు. పైజామా, లాల్చీలో మంచి ఆరోగ్యంగా వున్న ఎత్తైన విగ్రహం. తెలుగు, హిందీ, ఇంగ్లీషు వాళ్ళకి తెలియని మరేదో భాషాపదాలు మాటలలో దొర్లిపోతున్నాయి. అతని రెండుచేతులూ చెరోవైపునా పట్టుకొని మీనా, అనూరాధా సగర్వంగా నడుస్తున్నారు. అతనిని చూడగనే ప్రకాశమ్మ, భాగ్యమ్మ, బంగారమ్మలంతా వెనుతిరిగి చూసేరు. ఇతడెవరా అనుకొన్నారు. ఆ ఆలోచనకు సమాధానం దొరకక, సరాసరి సాధననే అడిగేద్దామనుకొనేసరికి వాళ్ళు దాటిపోతున్నారు.  ఆ ఆందోళనను రవీంద్ర గ్రహించలేదు. కాని, సాధన గ్రహించింది. గ్రహించినా, ఏమీ ఎరగనట్లే, రవీంద్రతో సంభాషణలో మునిగివున్నట్లే నడిచిపోతూంది. రోడ్డు ఎక్కుతూంటే, కాఫీ హోటలు గుమ్మాలు దిగి తమవేపే వస్తున్న పద్మనాభం కనిపించేడు. సాధన నెమ్మది స్వరంలో రవీంద్రను హెచ్చరించింది. “మీ అంకుల్.” రవీంద్రకు ఆ బాంధవ్యం అర్థం కాలేదు. తన తండ్రికి తమ్ముళ్ళున్నారని తల్లి చెప్పింది. తనకూ ఒక అన్న వున్నాడని చెప్పింది. అయితే అతడెవ్వరినీ చూడలేదు. కనక ఈ ఇంగ్లీషు భాషా బంధుత్వ పదం- 'అంకుల్ ' ఎవరికి వర్తిస్తుందో? అడిగి తెలుసుకొనేందుకు వ్యవధి లేదు. “వో” అని మాత్రం వూరుకొన్నాడు. పద్మనాభం దగ్గరకు వచ్చేసేడనేగాదు. అంతకన్న తన మాటను వివరించవలసి వుండవచ్చని కూడా సాధనకి తోచలేదు. మీనాక్షి చిన్నపిల్లల వుబలాటం చూపుతూ – ‘పద్మనాభం మామయ్య’ అని కేకపెట్టి, చనువుగా చెయ్యి పట్టుకొంది. “ఇల్లా ఎక్కడికే పొద్దుటే బయలుదేరేరు?” అని అడుగుతూ పద్మనాభం అందరి ముఖాలూ చూసేడు. వాళ్ళతోవున్న రవీంద్రను ఎవరా- అనుకొన్నాడు. అనుకోవడం, అడగడం ఒక్కమారే జరిగిపోయాయి.  “ఎవరి అబ్బాయే.”- అని సాధనను అడిగేడు. ఆమె చెప్పేలోపున సరాసరి రవీంద్రనే అడిగేసేడు.  “ఏ వూరు నాయనా! మీది?” ఆ హటాత్ప్రశ్నకు రవీంద్ర సిధ్ధంగా లేడు. కంగారుపడ్డాడు. బొంబాయిలో ఆ మాదిరి ప్రశ్న వస్తే ‘ఆంధ్ర’ అనో, ‘రాజమండ్రీ’ అనో చెప్పినవాడే. ఈమారు తడుముకోకుండా ‘బాంబే’ అన్నాడు. “జానకి అత్తయ్య కొడుకు” - అని సాధన తనవంతు ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. జానకి అత్తయ్య యెవరో యెరగనని చెప్పడానికి పద్మనాభం సంకోచించలేదు. “నేనెరగని జానకి అత్తయ్య యెవరే నీకు బొంబాయిలో”-అన్నాడు గద్దింపుగా. ఈమారు సాధన తెలివిగా ఆ అత్తయ్య యెవరో చెప్పింది. అయితే చెప్పినతీరు మాత్రం వేరు. “మీ మామయ్య ఈయన. మీ అమ్మకి అన్నయ్య”-అని రవీంద్రకు పరిచయం చేసింది. రవీంద్ర వెంటనే చేతులు జోడించి ‘నమస్కారం’ అన్నాడు. ఆ సమాచారానికి పద్మనాభం విస్తుపోయేడు. అతడు తనకో చెల్లెలు వున్నదన్న విషయాన్ని మరచేపోయేడని చెప్పవచ్చు. బాలవితంతువైవుండి మళ్ళీ పెళ్ళి చేసుకోవడం తమ కుటుంబ పరిశుద్ధతకు పెద్ద మచ్చ తేవడమేనని అతని భావం. వీరేశలింగం పంతులుగారి సంస్కారోద్యమం ఫలితంగా దేశంలో వితంతు వివాహాలంటే వ్యతిరేకత తగ్గినా, అది తమ అగ్రహారంలోకి అంతవరకు ప్రవేశించలేదు. పైగా, చేసుకొంటూ కమ్యూనిస్టు విశ్వాన్ని చేసుకోడం తన రాజకీయ విశ్వాసాల్ని అవమానించడంగా భావించేడు. జానకి పెళ్ళికాగానే ఇల్లు మాత్రం అన్నకు వ్రాసి యిచ్చేసి, భూమి అయిదెకరాలూ అమ్మేసుకొని భర్తతో వెళ్ళిపోయింది. అంతవరకూ తనకు ఆధారంగావున్న ఆ భూమిని అమ్ముకోవడం పద్మనాభానికి నచ్చలేదు. తిట్టేడు. మొగుడు యావలోపడి గొంతు కోసుకొంటున్నదన్నాడు. ఆ భూమికోసమే విశ్వం ఆమెను పెళ్ళి చేసుకొంటూన్నాడు-అన్నాడు.  “ఈ డబ్బు నలుగురు కామ్రేడ్సూ మార్చుకు తినేస్తారు. తర్వాత ఫోవే ముండా అంటారు. దీనిపని వపనమే”-అంటూ పద్మనాభం ఆ శబ్దార్థం కోసం బాధపడనక్కర్లేకుండా, యెడమ అరచేతిలో కుడిచేతి చూపుడువేలు అటూ ఇటూ తిరగేసి రుద్దుతూ, చిటికెలు వేసేడు. అప్పటికీ దానిని కత్తి నూరడంగా అర్థం చేసుకోలేకపోతారేమోనని నిఘంటువు చదివేడు. “వపనం క్షౌరముచ్యతే.” కాని జానకి తిట్లనూ, శాపాలు, బెదిరింపులనూ లెక్కచేయలేదు. ఇంక పద్మనాభం చెల్లెలిపేరు తనవద్ద వినపడరాదని ప్రతిఙ్ఞ చేశాడు. ఇంచుమించు ఆమాట నిలబెట్టుకున్నాడు. ఆ నవదంపతులు వూరు వదిలిపోయేరన్నారు. కొంతకాలానికి అతనిని బొంబాయిలో పట్టుకొని పోలీసులు చంపేశారన్నారు. అయినా అతడు విచారపడలేదు.చెల్లెలు ఏమయింది? ఏం చేస్తూందని కనుక్కోనూలేదు. ఈవేళ హఠాత్తుగా ఆ చెల్లెలి కొడుకు- ఇరవయ్యేళ్ళవాడు కట్టెదట నిలచి నమస్కరిస్తున్నాడు. ఆ నమస్కారం స్వీకరించాలన్న ఆలోచన కూడా తోచలేదు. ఆశ్చర్యంతో, మాటరాక నోరు తెరిచేడు. ‘జానకి….’ అతడాశ్చర్యం నుంచి తేరుకునేలోపునే సాధన ముందుకు అడుగువేసింది. “మళ్ళీ కనిపిస్తాడు. తోటలోకి బయలుదేరాం. పొద్దు పోతుంది.” రవీంద్ర మర్యాద తప్పకుండా సెలవు చెప్పుకొని మరి కదిలేడు. పదిహేనో ప్రకరణం పొలానికని బయలుదేరిన మగడు అంత త్వరగా ఇంటికి రావడం చూసి కనకరత్నమ్మ–“ఏమన్నా మరచిపోయారా?” అనడిగింది. కాని పద్మనాభం ఏమీ అనలేదు. గదివేపు తిరగబోయిన వాడల్లా మనసు మార్చుకొని పెరట్లోకి నడిచేడు. తులసికోట పక్కద్వారం తెరుచుకొని వెనక పెరట్లోకి వెళ్ళేడు. అక్కడ పెద్ద వుసిరిచెట్టు బాగా విస్తరించినది వుంది. దాని మొదట్లో చుట్టూ విశాలమైన అరుగు. తిన్నగా వెళ్ళి దానిమీద గుడ్డపరచుకు కూర్చున్నాడు. స్నేహితులతో తరచువేసే పేకాటకు ఇమ్ముగా వుంటుందని వేసిన అరుగు అది. శుభ్రంగా మెత్తి, అలికి, ముగ్గులు పెట్టి వుంది. పద్మనాభం అక్కడే వొరిగాడు. చెట్టునిండా వుసిరికాయలు గుత్తులు గుత్తులుగా వ్రేలాడుతున్నాయి. ఇదివరకెప్పుడూ అనిపించలేదుగాని, ఆ క్షణంలో ఆ చెట్టువేసింది జానకే అని గుర్తు వచ్చింది. క్షీరాబ్ది ద్వాదశినాడు పూజకోసం తెచ్చిన కొమ్మని నీరు తగిలేచోట గుచ్చింది. ఆ కొమ్మ వేళ్ళు పెట్టి చిగిర్చింది. ఈవేళ అది బాగా పెరిగి ఒక మహావృక్షం అయింది. ఆ మాట అతనికిదివరకెన్నడూ తట్టలేదు. కాని ఈవేళ తోచింది. అది జానకి వేసిన చెట్టు. ఆ చెట్టు వేసిన జానకి వూళ్ళోకి వచ్చింది. కాని ఆ యింటికి రాలేదు. వచ్చివుంటే ఏం చేసేవాడు? తప్పకుండా తిట్టి, పొమ్మని, తలుపులు వేసుకొని వుండేవాడు. కాని, అతనికి ఆమె ఆ అవకాశం ఇవ్వలేదు. రాలేదు. అల్లా రాకపోవడం అభిమానం అనిపిస్తూంది. కనకరత్నం దొడ్డి గుమ్మంలోంచి తొంగిచూసింది. ఆమె మొదట వూహించినట్టు భర్తతో మిత్రకూటం రాలేదు. అయితే మగడు చెట్టు క్రింద ఏం చేస్తున్నట్టు? వచ్చి చూసింది. అతడొక్కడే వున్నాడు. పడుకొని వున్నాడు. “ఏమిటలా పడుకొన్నారేం?”-అంటూ ఆమె పెరట్లోకి అడుగు పెట్టింది. పద్మనాభం పడుకున్నవాడు తల యెత్తేడు. “ఏం లేదుగాని, ఇల్లారా. ” ఆమె సమీపించింది. “కూర్చో….” “వంటింట్లో బోలెడు పనుంది. కూర్చుంటే ఎల్లాగ?”-అంటూనే అతనికి అంత దూరంలో అరుగును ఆనుకుని కూర్చుంది. ఆమెకు దగ్గరగా వుండడానికి పద్మనాభం లేచి కూర్చున్నాడు. “అంత దూరం ఏమిటి? ఇల్లా దగ్గరగా రా.” “చెప్పండి, ఏమిటో.”- అంటూ కనకరత్నం దగ్గరగా జరిగింది. “పిల్లలు ఏం గొడవ చేస్తున్నారో.”-అని తొందర చేసింది. “మా జానకి వూళ్ళోకి వచ్చిందట.” “మీ జానకి యెవరు?”.... అతడు చెప్పలేకపోయేడు. ఎప్పుడన్నా చెల్లెలు ప్రసక్తి వస్తే పళ్ళు పటపటలాడించిన తాను అనుకోకుండా ‘మా జానకి’ అనేశాడు. కాని ఆ ‘మా’ తన చెల్లెలేనని చెప్పలేకపోయాడు. అతని తటపటాయింపు చూసి కనకరత్నమ్మ వూహించింది. “మీ చెల్లెలా? ఏరీ?” “సత్యానందంగారింటికి వచ్చిందట, కొడుకూ, అదీ....” “కొడుకున్నాడా?” అతడు తలతిప్పేడు. “ఓ ఇరవయ్యేళ్ళుంటాయి. బాగానే వున్నాడు. తండ్రి పోలికే.” కనకరత్నమ్మ ఆ కుర్రవాని తల్లినీ, తండ్రినీ కూడా ఎరగదు. పెళ్ళి అయి తాను ఈ ఇంట అడుగుబెట్టడానికి రెండు మూడేళ్ళ క్రితమే ఆడపడుచు పెళ్ళి చేసుకు వెళ్ళిపోయింది. కనక వాళ్ళ పోలికలు చెప్పినా అర్థం కావు. వూరుకొంది. “అన్నపూర్ణ అంది. ఇందాక వీధిన వస్తూంటే వాళ్ళ గుమ్మంలో కొత్త ఆమె ఎవరో కనిపించిందంది. బహూశా సాధన వాళ్ళ కాలేజీలో లెక్చరరో ఏమో అంది.” “అయితే జానకే అయివుంటుంది. బొంబాయిలో ఏదో లెక్చరరుగానే వుందనుకొంటారు”-అన్నాడు పద్మనాభం. “పలకరించిందా?” అన్నాడు. “ఆమెకేం తెలుసు?” “ఔను లే.” ఒక్క నిముషం ఇద్దరూ వూరుకున్నారు. కనకరత్నమ్మే తెముల్చుకుంది. “ఆ కుర్రాడేం చదువుకున్నాడు?” “అడగలేదు. వేషం చూస్తే ఆర్టిస్టులా వున్నాడు.” “చూసేనన్నారు మరి. పలకరించలేదా?” తాను చేసినది పలకరించడం క్రిందకు వస్తుందో, రాదో అతనికే అర్థం కాలేదు. ఊరుకున్నాడు. “ఓమారు వెళ్లి పలకరించి రండి. మనింటిక్కూడ రమ్మనండి.”-అని సలహా యిచ్చింది. తన మనస్సులోని ద్వైవిధ్యాన్ని కమ్ముకుంటూ పద్మనాభం తనకు చెల్లెల్ని ఇంటికి పిలవడం యిష్టం లేనట్లు మాట్లాడేడు. "ఎందుకొచ్చిన తద్దినం? వీధినపోయే పెద్దమ్మా! మా యింటిదాకా వచ్చి వెళ్ళమన్నట్లు! ఆడపిల్లల వాళ్ళం." వితంతు వివాహం చేసుకొన్న చెల్లెలు ఇంటికి వస్తూ పోతూ వుంటే తన కూతుళ్ళకి పెళ్ళిళ్ళు కావేమోనని భయపడుతున్నట్లు.. పద్మనాభం అభ్యంతరాన్ని కనకరత్నమ్మ ఖాతరు చేయలేదు. "సత్యానందంగారి వాళ్ళకు లేని భయం మనకొచ్చిందేమిటి?" "వాడో కమ్యూనిస్టు. వాళ్ళందరిదీ వొకటే కూటం. అన్నింటికీ తెగించారు. తెగించిన వాడికి తెడ్డే లింగం." కనకరత్నం చిరునవ్వు నవ్వింది. "సత్యానందంగారూ మీరూ అంతా లొల్లాపత్తుగానే వుంటారుగదా!" పద్మనాభం ఆ స్నేహాన్ని తేలికగా తోసేశాడు. "చిన్నప్పటినుంచీ యెరుగుదుం. స్కూల్ ఫైనల్ దాకా వొకే స్కూలులో చదువుకున్నాం. అదీ మా స్నేహం. కాని, మా ఇద్దరి అభిప్రాయాలూ యెప్పుడూ ఉత్తర దక్షిణాలే." మరల ఇద్దరూ వొక్క క్షణం నిశ్శబ్దం. తన భార్య ప్రశ్నకి తన సమాధానం పూర్తి అయినట్లు తోచక పద్మనాభం యీ మారు వివరణ అందుకున్నాడు. "జానకి అన్నా, దాని మగడన్నా ఆ మగడు పెళ్ళాలిద్దరికీ వల్లమాలిన అభిమానం. అతడంటే ఆమెకు మేనత్త కొడుకు. కాని సత్యానందానికి? పెళ్ళాం తరఫు బంధుత్వమనా? ఉహు. బయటపడడానికి వీలులేకపోయిందిగాని మనస్సులో యెప్పుడూ వాడు కమ్యూనిస్టే. 1950లో అతగాడిని చంపేసేరన్నారు. కాంగ్రెసు మొహాన మసిపులమడానికి మంచి వీలు దొరికిందనుకొన్నాడు. అది అన్యాయం అన్నాడు. నేను కమ్యూనిస్టు పార్టీలో చేరుతున్నాను. ఏం చేస్తారో చెయ్యండి-అన్నాడు. వాడి వొంటిమీద దెబ్బ పడితే, ఊళ్ళో మాకు మంచినీళ్ళు పుట్టవని నేనూ, విశ్వనాధమూ కాళ్ళు విరగ్గొట్టుకొని బయటపడేశాము….అదో సాకు తప్ప వాడెప్పుడూ కమ్యూనిస్టే-” మగని ధోరణి కనకరత్నమ్మకు సరిపడలేదు. “సరే బాబూ! మీ రాజకీయాలు ఎలాగన్నా పోనియ్యండి. మనిషి మర్యాదలూ, బంధుత్వాలూ రాజకీయాలకోసం వదులుకోవాలా? చెల్లెలి మగడు కమ్యూనిస్టైతే మీకు పాపం చుట్టుకుంటుందా?” తన అభ్యంతరం రాజకీయం కాదని వొప్పుకోలేడు, అతడు. ఊరుకొన్నాడు. కాని, కనకరత్నమ్మ వదలలేదు. “మధ్యాహ్నం అందరి భోజనాలూ అయ్యాక నేను అల్లా వెళ్ళి వస్తా. ఈ లోపున మీరు వెళ్ళండి. పలకరించండి. చాలాకాలానికి వూళ్ళోకి వచ్చి మన యింటికి రాకపోవడం బాగులేదు. రమ్మని పిలవండి….” పద్మనాభం విసువు కనబరిచేడు. “ఈ ఇరవయ్యేళ్ళూ వున్నట్లు ఇప్పుడూ అక్కడే వుండకపోయిందా? వీళ్ళంతా సుఖంగా బ్రతికిపోతున్నారని బాధ పెట్టడానికి కాకపోతే యెందుకు వచ్చినట్లు?....” తన భర్త చిరాకు పడవలసిన అవసరం ఏమీ లేదనిపించినా కనకరత్నమ్మ ఏమీ అనలేకపోయింది. “బాగుందండీ మీ వరస! ” “బాగుండకేం. వున్నది కాస్తా వూడ్చి పట్టుకుపోయినా రాజకీయ బాధితుడినిగా వో అయిదెకరాలు భూమివచ్చింది. ఇంత తిండి తింటున్నాం. దేహీ అనక్కర్లేకుండా నలుగురిలో తలలెత్తుకు తిరగగలుగుతున్నాం. ఇప్పుడీ రాకతో మళ్ళీ వెనకటి కథలన్నీ….” కనకరత్నమ్మ యీమారు ఖచ్చితంగా అడ్డు తగిలింది! “కథలూ లేదు కాకరకాయలూ లేదు. లక్షణంగా పెళ్ళి చేసుకు వెళ్ళారు. ఎప్పటివో మా ముత్తవ్వ రోజులనాటి మాట చెప్తారేం? పూర్వంలా పది పన్నెండేళ్ళ వయస్సులోనే ముండమోసి, చెవుల వెనక్కి ముసుగు తోసుకుంటూ...” “అట్టే పింజారి కబుర్లు చెప్పకు. పడుపడనే సైతేగాని పడే నా సైతి లేదందిట, వెనకటికి. కబుర్లు చెప్తారు. చెయ్యగానే కాకుల్లా పట్టుకొంటారు. ఇంత ఊళ్ళో నేనమ్మా వున్నానని అది తెగించింది....కాని....” “తెగించలేని కామయ్యగారి రాముడు స్థితి చూస్తున్నాంగా. ఏడాదికో భ్రూణహత్య చేస్తూ, నెత్తిన ముసుగు వేసుకోగానే సరిపోయిందా?....” కామయ్యగారి రాముడు జీవితాన్ని వుదాహరించి ప్రత్యాఖ్యానం చేశాక పద్మనాభం మరి మాట్లాడలేదు. కనకరత్నమ్మ గుర్తుచేసిన ఆ హత్యాకాండకు బలి అయిన అజ్ఞాత శిశువుల్లో ఒకరిద్దరి పిత్రుత్వబాధ్యత పద్మనాభానిక్కూడా వుందని గ్రామంలో చెప్పుకొంటారు. దానిని కనకరత్నం ఎరుగునో, ఎరగదో. కాని, ఆ మాట వచ్చాక పద్మనాభం ఇంక వాదం అనవసరం అనుకొన్నాడు. “అంతే నంటావా?” అన్నాడు. సన్నగా. “ఓమారు ముందు మీరు వెళ్ళిరండి. తరువాత నేవెడతా.” “ఏమో. ఇదంతా ఏం గొడవలు వస్తాయో చివరికి! నాకిష్టంలేదు సుమా.” అంటూనే లేచాడు. తుండు దులిపి భుజాన వేసుకొన్నాడు. పదహారో ప్రకరణం “ఒరేయ్! సత్యానందం!” అంటూ పద్మనాభం వీధి గుమ్మంలోంచే తన రాకను తెలియబరచేడు. వంటింట్లో వున్న భద్ర ఆ కేక వినబడగానే కత్తిపీట ముందునుంచి లేచింది. “మీ అన్నయ్య వచ్చేడు. సావిట్లోకి నడు. పలకరిద్దువు గాని....” బియ్యంలో బెడ్డలు ఏరుతున్న జానకి ఆ మాటను పట్టించుకోలేదు. “నా కెవ్వర్నీ పలకరించాలని లేదు. పలకరించాలనుకున్న వాళ్ళ ఇంటికి రానే వచ్చాను.” అంది తాపీగా. “తెలియక అడుగుతా. నువ్వు మార్క్సిస్టువు కాదు గదా? -” అంది భద్ర. ఆ మాట వెనుకవున్న ఆలోచనను జానకి గ్రహించింది. కసికి, తిట్టుబోతు తనానికి, భిన్నాభిప్రాయాన్ని చెవిని పెట్టలేకపోవడానికి, వ్యతిరేకులతో సామాన్య మర్యాదలు కూడా పాటించలేక పోవడానికీ దేశంలో ‘మార్క్సిస్టు’ పర్యాయపదం అయింది. ఆమెకు తెలుసు. భద్ర వెడుతూ అనేసిన మాట కొరడాతో ఛెళ్ళు మనిపించినట్లయింది. ఒక్క నిముషం అలోచించి లేచింది....భద్ర వంటింటి గుమ్మంలోకి వచ్చేసరికే పద్మనాభం లోపలి హాలులోకి వస్తున్నాడు. ఆమెను చూసి ఆగేడు. “వున్నావా?” అన్నాడు. “ఎక్కడా మాట అలికిడి కూడా లేదు. పిల్లలంతా ఏరీ? వీధి తలుపులు బార్లా తెరిచి వున్నాయి. ఎవడో మాట అల్లా వుంచి, కుక్క వొచ్చి ఇల్లంతా చక్కబెట్టినా అంతేకద.” “ఇప్పుడే పిల్లలు అల్లా తోటలోకి వెడతామని బయలుదేరి వెళ్ళేరు. నేను వంటింట్లోకి వెళ్ళా. ఆయన వీధి గదిలో ఉండాలే, లేరా?” అంటూ భద్ర నిజం, అబద్దాలూ కలబోసి సర్దుకొంది. “కూర్చో. వో మాటు వదిన్ని ఆనక రమ్మన్నానని చెప్పు. ఎక్కడా కనబడ్డమే లేదు” అంది. పద్మనాభం కబుర్లు చెప్తూనే హాలులోకి వెనుతిరిగేడు. “దానికి పిల్లలతోనే సరిపోతూంది. చెప్తా. వస్తుందిలే, ఏడీ వీడేడి? కుర్రవాడి దగ్గరనుంచి ఉత్తరాలు వస్తున్నాయా?” పద్మనాభం కుశల ప్రశ్నలు వేస్తూ హాలులోని కుర్చీలో కూర్చున్నాడు. అతనికి జానకి కనిపించలేదు. ఆమెను గురించి ప్రసంగం ఎల్లా తీసుకురావాలో అర్ధం కావడంలేదు. ఇదివరకు ఆ పేరు తనముందు తీసుకురావద్దని శాసించిన వారిలో భద్రా ఉంది. ఆమెవద్ద ఇప్పుడు తానే సరాసరి జానకి ప్రసంగం తేవడం చేతకాలేదు. ఎల్లాగా అనుకుంటూండగా టేబిలు క్రింద ఆడవాళ్ళ కాలిజోడు కొత్తది కనిపించింది. “ఇందాకా అన్నపూర్ణ మీ ఇంటికి సాధన కాలేజీ లెక్చరరు ఎవరో వచ్చేరు కాబోలు అంది. అదిగో కాలిజోడు కనిపిస్తూంది. ఆవిడ ఏరీ....?” భద్ర నవ్వింది. “సాధనా లేదు. లెక్చరరూ లేదు. ఎవరిని చూసి ఏమనుకుందో. అది ఎప్పుడొచ్చింది ఇల్లాగ?...నిన్నరాత్రి....” వెనకనే వస్తున్న జానకి భద్ర పడుతున్న ఇబ్బందిని గ్రహించింది. తానే బయటపడింది. “అంతా బాగున్నారా?” అంది. “ఎవరు? జానకి!”-నిజానికి పద్మనాభం స్వరంలో ఆశ్చర్యమూ, గుర్తింపు కష్టమూనే తోచేయి. చెల్లెలు మారి ఉంటుందనుకొన్నాడు. కాని, ఈ రూపంలో అతడు ఊహించనేలేదు. పరోక్షంలో ఇద్దరి మనస్సులలో కనిపించిన వైమనస్యం కొద్దిగా కూడా పలకరింపులలో వినబడకపోయేసరికి భద్ర ‘అమ్మయ్య’ అనుకొంది. వాళ్ళు మనోద్వేగాలు కూడగట్టుకునేందుకు వ్యవధి ఇస్తూ తానే సంభాషణ నడిపింది. “నిన్నరాత్రి వచ్చింది. వొంట్లో బాగులేదు. ఎక్కడికీ కదలలేదు. బహుశా అన్నపూర్ణ దీనినే చూసి ఉంటుంది. కూర్చోవే. కబుర్లు చెబుతూండండి. కాఫీ తెస్తాను.” “ఇప్పుడు కాఫీ ఎందుకమ్మా!” అని పద్మనాభం అభ్యంతరం చెప్పినా భద్ర వినిపించుకోలేదు. “ఫర్వాలేదు. క్షణంలో పని. కూర్చుని మాట్లాడుకొంటూ వుండండి.” అని వెళ్ళిపోయింది. “నిన్నరాత్రి వచ్చేవా? ఏమిటి అనారోగ్యం?” “ముందు తీసుకొంటున్నావా? ఎన్నాళ్ళనుంచి? ఫర్వాలేదు. అక్కడున్నవాళ్ళు దీర్ఘకాలం బ్రతుకుతారంటారు.” “పాపీ చిరాయుః అన్నారు కదా”-అంది జానకి అన్నగారి ధైర్య వచనాలను తేలిక చేస్తూ. పునర్వివాహం చేసుకోడం మహాపాపంగా తాను భార్యతో అన్నమాటకు ఇది ఎత్తిపొడుపులా వినిపించి పద్మనాభం ఉలిక్కిపడ్డాడు. వెంటనే బదులు తీర్చేడు. “మీరు నమ్మే మార్క్సిజం పుణ్యపాపాలను ఒప్పుకోదు కాబోలునే” అన్నాడు. జానకి కూడా మాట తనమీద ఉంచుకోలేదు. “అది ఒప్పుకోనివి చాలా వున్నాయి. ఏం చేస్తాం? అన్నింటికీ మన మాటా, ఇష్టానిష్టాలు సాగిచస్తాయా? అందుకే సహజీవనం అంటూ వోమాట అడ్డుపెట్టుకొని లాక్కొస్తున్నాం.” ఆ మాటకు అర్ధం ఏమిటో తెల్చుకోలేక పద్మనాభం ఆగిపోయేడు. ఇష్టం లేకపోతే మాత్రం నీతో మాట్లాడక తీరుతుందా అంటూందా? ఏమో. కాని, పద్మనాభం నిగ్రహించుకొన్నాడు. రాకరాక ఊళ్ళోకి వచ్చిన చెల్లెల్ని పనిమాలా వెళ్లి తిట్టివచ్చేడంటారని పస్తాయించేడు. అతడేమన్నా అంటేనే బదులు చెప్దామన్నట్లు జానకి ఊరుకుంది. చిన్న ట్రేలో కాఫీలు పెట్టుకొని హాలులోకి వస్తూ, భద్ర వారిద్దరూ నిశ్శబ్దంగా కూర్చుని ఉండడం చూసింది. దానికి ఏదో కారణం ఊహించుకొని సర్దుబాటుగా మాట్లాడింది. “పిల్లవాడు తోటనుంచి వచ్చేక బయలుదేరి వద్దామనుకొంటూంది. ఇంతలో నువ్వే వచ్చేవు” అంది. “ఔనౌను. నీ కొడుకు వున్నాడన్నారు. మరిచేపోయాను. ఏడీ. తోటలో కెళ్ళేడా?....” అని పద్మనాభం అందుకొన్నాడు. అంతవరకూ తన కొడుకు గురించే ప్రస్తావించనందుకు మనస్సులో కటకట పడుతున్న జానకి ఇప్పుడు తమ సంభాషణ ఆ దారికి పోవడం ఇష్టంలేక మాట మార్చింది. “అప్పుడే ఎప్పుడు తయారుచేసేవు కాఫీ” అంటూ ట్రేలోంచి ఒక కప్పు తీసి అన్నగారికిచ్చి తానొకటి తీసుకొంది. “కూర్చో నువ్వుకూడా.” మూడోకప్పు చేతిలోకి తీసుకొంటూ భద్ర కూర్చుంది. “నీలాంటి అతిధి వస్తే చిన్నపుచ్చుకోకుండేందుకే “ఇన్‌స్టెంట్ కాఫీ” డబ్బా ఒకటి ఎప్పుడూ ఇంట్లో వుంచుతాం. పాలు కాగుతూనే ఉంటాయి.” సంభాషణ బాధాకరం కాని మార్గం పట్టడంతో పద్మనాభం సర్దుకొన్నాడు. “మార్కెట్టులో కొచ్చిన ప్రతి కొత్త సౌకర్యాన్నీ సత్యానందం ఇంట్లోకి తెస్తాడు. వాడిని చూసి గాస్ స్టవూ, కుక్కరూ వూళ్ళో వో అరడజను మంది తెచ్చేరు.” “తెచ్చేరు గనకనే ప్రాణం హాయిగా ఉంటూంది. ఎవరన్నా కొత్త మొహం అరుగుమీద కనిపిస్తే వీళ్ళకి వొండిపెట్టాలి కాబోలురా భగవంతుడా అని భయపడి పోనక్కర్లేదు.” “ఆఁ. రాయసాలు బలిసి. మన పెద్దవాళ్ళకి ఈ గ్యాసుపొయ్యిలు తెలుసా? కుక్కర్లు ఎరుగుదురా? ఎంతవంటా డొక్కలూ, కమ్మలూ, పిడకలూతోనే కాదూ. బొగ్గుల కుంపటీ, కిరసనాయల్ స్టవూ ఈమధ్య వచ్చిన నాగరికాలు....” అంటూ అధునాతన సౌకర్యాల అనావశ్యకత మీద బండి తోలేడు. అతని చేతినున్న ఖరీదైన వాచీచూసి “ఈ మనిషి ఎప్పుడూ ఒక్కలాగే వున్నా” డనుకొంది జానకి. మనస్సులోని వెలపరాన్ని దాచుకొంటూ, పైకి సౌమ్యంగానే అంది. “మన అవసరాల్ని పట్టి సౌకర్యాలు.” “పిల్లల చదువులంటూ వచ్చేక....” అంటున్న భద్ర మాటను మధ్యలోనే తుంచేస్తూ, పద్మనాభం-“మీ పిల్లలేనా చదువుతున్నది. మేం ఎవ్వరం చదవలేదా? మా పిల్లలు చదువుకోవడం లేదా?” అన్నాడు. వెటకారంగా. చటుక్కున జానకి సంభాషణ మార్చింది. “నీకు పిల్లలెందరు? ఏం చదువుతున్నారు?” అంది. “ఆరుగురు. అంతా ఆడపిల్లలే” అంది, భద్ర. “ఏదో చదువుతున్నామంటారు. అవన్నీ వాళ్లమ్మే చూసుకొంటుంది” అన్నాడు పద్మనాభం. వివరాలు భద్ర చెప్పింది. “వాళ్ళ పెద్దపిల్ల మన సాధన ఈడుది. స్కూల్ ఫైనల్ ప్యాసయింది. మానిపించేసేడు. మంచి తెలివిగల పిల్ల.” “చదువుతా మన్నంత వరకు చెప్పించడానికి మనకేమన్నా పెద్దలు సంపాదించిన ఆస్తులేం లేవు. ఆ రాజకీయ బాధితుడునిగా అయిదెకరాలు భూమి దొరికింది గనక వీధిన పడడంలేదు. అంతే.” “ఏం బీద అర్పులారుస్తావయ్యా!” అని భద్ర ఏదో చెప్పబోతూండగానే అడ్డుకొన్నాడు. “అదీగాక, నువ్వూ బి.యే. చదివేవు. చదివి ఏం చేస్తున్నావు? వంటింట్లో ఉండేదానికి కాలేజీ చదువులెందుకు? అసలే సీట్లు దొరకడం లేదే అని గోల పెట్టేస్తూంటే....జనం...” సంభాషణ ఎటు మార్చినా వెక్కిరింత, పెచీలోకి తిరుగుతూండడం జానకికి చాల ఇబ్బందిగా వుంది. ఏమిటీ పీడ అనుకుంటూండగా పద్మనాభానికి జానకి కొడుకు మాట గుర్తు వచ్చింది. “మీ కుర్రాడు ఇందాకా పొలం వెడుతూ రోడ్డు దగ్గర ఎదురయ్యేడు. ఆర్టిస్టు వేషంలో వున్నాడు. ఏం చదువుతున్నాడు?” అన్నాడు. “ఆర్టిస్టు వేషం ఎమిటి! ఆర్టిస్టే” అంది భద్ర. “జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్” లో చదివేడు. కమ్మర్షియల్ ఆర్టూ, కార్టూన్ డ్రాయింగులో డిప్లొమా తీసుకొన్నాడు, ఈ ఏడాదే.” చెల్లెలు చెప్తున్న చదువులు గురించి పద్మనాభానికేమీ తెలియదు. కార్టూన్ మాట విన్నాడు. దానికి స్కూలూ, పరీక్షా, చదువులూ ఉన్నాయా? తెలియదు. “ఇదీ ప్రపంచం, చిత్రలోకం, లోకం తీరు, పెద్దమనిషి వంటివేనా కార్టూన్ డ్రాయింగ్ అంటే?” బొంబాయిలో ఇంతకాలమూ వుండిపోవడంచేత తెలుగు పత్రికలతో విశేష సంభంధం లేని జానకికి ఆ పేర్లు ఏమిటో తెలియక తెల్లబోయింది. “కొంచెం ఇంచుమించుగా అంతే” అంది భద్ర. “ఆ వంకర టింకర బొమ్మలకి వో స్కూలూ, వో డిప్లొమానా?” అన్నాడు వికారంగా ముఖంపెట్టి పద్మనాభం. అడక్కుండా, పెట్టకుండా తన అజ్ఞానాన్ని అంత సులభంగా బయటపెట్టుకొన్న అన్నగారిమీద అప్రయత్నంగానే అసహ్యం కలిగింది. కాని, పైకేమీ అనలేదు. భద్రే సమాధానం ఇచ్చింది. “ఏం. ఏ. లూ, ఎం. ఎస్‌సి. లూ, పి. హెచ్ డి. లూ చేసినా మళ్ళీ ఏ మీబోటిగాళ్ళనో రాజబంధువుల్ని పట్టుకోవాలి. బాబ్బాబు ఎక్కడో వో బంట్రోతు పనేనా ఇప్పించమని కడుపూ కాళ్ళూ పట్టుకోవాలి. అంతకంటె స్వతంత్రమైన బ్రతుకు ఆర్టిస్టుది....” రాజబంధువు అన్న పదమూ, ఉద్యోగాలు తమ చేతుల్లో ఉన్నాయన్న పొగడికా విన్నాక పద్మనాభం బోర విరుచుకొంది. ఈ పది పదిహేనేళ్ళుగా అగ్రహారం హైద్రాబాదు మధ్య తిరిగిన అనుభవంతో హామీ ఇచ్చేడు. “ఏ బి.యే.యో అయిపోతే ఏ ఆఫీసులోనన్నా చెయ్యి పట్టుకు వేయించవచ్చు...” మాట మధ్యలో భద్ర అందుకొంది. “దురదృష్టం. ఇప్పుడా అవకాశమూ లేదనుకొంటా.” కాంగ్రెసులో వచ్చిన తగాదాలలో పద్మనాభం ఒక వర్గంవాడు. ఇప్పుడు పద్మనాభం మాట హైద్రాబాద్ లో వినేవాడుండడని భద్ర కవ్వించింది. “ఇల్లలకగానే పండగ అవదమ్మా! ఇవతల వున్నవాళ్ళు దిగ్దంతులు. కుర్రవాజమ్మలని రొష్టు పెట్టడం ఎందుకు! గంతులెయ్యనీ. ఆయాసం వచ్చి వాళ్ళే చతికిలబడతారని చూస్తున్నారు. ఈ ఉడత వూపులకి కదిలే మొదలా కాంగ్రెసు? ఏం ఫర్వాలేదు.” ఇంక అంతకన్న రెచ్చగొట్టడానికి భద్ర సాహసించలేకపోయింది. జానకి కూడా అన్నగారి రాజకీయాలూ, అహంభావమూ, దురహంకారమూ వెలపరం కలిగిస్తూంటే ఊరుకొంది. ఒక్క నిమిషం ఆగి పద్మనాభమే మళ్ళీ ప్రారంభించేడు. “ఏ బి. యే. యో అయిందనిపించవలసింది. కూడెట్టనా, గుడ్డపెట్టనా ఎందుకొచ్చిన పిచ్చి గీతలు” అని సలహా ఇచ్చేడు. జానక్కి వొళ్ళు మండింది. “ఖుదా హాఫిజ్!” ఆ మాటకి అర్ధం తెలియకపోయినా, సందర్భం, ఉచ్చరించిన పద్దతీ, ముఖ కవళికా చూసాక ఆ మాట తన గొప్పతనాన్ని తేలికపరిచేదేనని నిర్ణయించుకోడం కష్టం కాలేదు. తనచేత తిట్లూ, మొట్టికాయలూ తిన్న జానకి మాటతీరూ, ఆలోచనా ధోరణీ తనకు ఏమాత్రం అందడం లేదు. ఆమె ఆకారమే చెప్తూంది-ఇరవై రెండేళ్ళనాటి జానకి కాదు. పట్నవాస జీవితంలో అలవడ్డ ప్రాగల్భ్యమే కాదు. చదువు, సంస్కారం-జానకి సర్వవిధాలా చాలాచాలా ఎత్తు పెరిగిపోయింది. ఆమె ఎదట అడుగడుగునా తన లొచ్చు స్థితి కనిపించిపోతూంది. వయస్సు పెద్దరికం, మగతనం, రాజకీయ జీవితమూ ఆ లోచ్చుదనాన్ని అంగీకరించడం లేదు. చటుక్కున లేచేడు. “ఆనక మీ వదిన వస్తుంది. ఉంటావుగా-” అన్నాడు. ఈ మారు మాటలో మృదుత్వం లేదు. ఆ కరుకుదనానికి కారణం జానకి అర్ధం చేసుకొంది. ఏమీ అనదలచలేదు. మర్యాద తప్పకుండానే సమాధానపూర్వకంగా అంది. “పాపం పిల్లలతో సతమత మవుతూండి వుంటుంది. ఆమెను శ్రమ పెట్టడం...” “శ్రమేమిటిలే. వస్తుంది” అనేశాడు. అన్నాక జానకి మాటకు వేరే అర్ధం ఉందేమో ననిపించింది. చూడ్డానికి రాకపోయినా విచారపడనన్న పుల్లవిరుపా? తానే వస్తానన్న సానుభాతా? తెలియలేదు. “సరే. ఏం చేస్తుందో రాత్రి భోజనానికి నువ్వూ, కొడుకూ అక్కడికే రాండి.” జానకి ముఖంలో కనబడిన అయిష్టాన్ని భద్ర గమనించింది. “పగలు ఏదోవేళ వస్తుందిలే. మళ్ళీ రాత్రనీ, వో భోజనమనీ ఎందుకు?” “పగలు రాదేమో అనుకొన్నా. అల్లా అయితే ఈ పూటే, రా” అన్నాడు. జానకి చర్రున మాట విసిరేసింది. “పగలు వీధిలోకి రాకూడని పనేం చెయ్యలేదు. అంత రాత్రిళ్ళే తిరిగడానికి.” “మనం అనుకోగానే సరా! లోకం కూడా మెచ్చాలి. సరే, అవన్నీ ఇప్పుడెందుకులే....” అని సాచేసాడు. జానకి మాత్రం అంత సులభంగా తోసేయ్యలేదు. మాట మధ్యలోనే తుస్కారించింది. “లోకం మెచ్చని నా పనికి ఇతరులెవ్వరూ కష్టాలు తెచ్చుకోవద్దు. నేనేమీ తప్పు పని చెయ్యలేదు. ఇతరులకి బాధ కలిగించకుండా నా బ్రతుకేదో నేను బ్రతుకుతున్నా. లోకం మర్యాదగా భావించే పద్ధతిలోనే బ్రతుకుతున్నా. కాని నా వలన మీకు అప్రతిష్ట కలుగుతుందని తోస్తే పిలవకండి. రాత్రీ, పగలూ అనేదేముంది?.... పద్మనాభానికి చెల్లెలి నిర్లక్ష్యం తామసం కలిగించింది. “అంత ఆత్మవిశ్వాసం ఉన్నదానివి ఈ ఇరవయ్యేళ్ళూ ఎందుకు మొహం చాటు చేశావు?” అన్నాడు హేళనగా. తోక తొక్కిన తాచులాగ జానకి బుసలు కొట్టింది. “మీ ఎవ్వరి ప్రాపకం అక్కర్లేదు, కనకనే.” “ఇప్పుడు వచ్చిందా అవసరం?” “ఎవరి అవసరం వచ్చినా నీ అవసరం, నీబోటివాళ్ళ అవసరం రాలేదు. రాదు” అంటూ జానకి విసురుకొని లోపలికి వెళ్ళిపోయింది. చురచుర తాటాకు మంటలాగా చూస్తుండగానే పాకిపోయిన ఆ కలహాన్ని నిలవరించడానికి అదను దొరక్క భద్ర తెల్లబోయి చూస్తూంది. “ఏం మాటయ్యా, అది”-అని పద్మనాభాన్ని మందలింపుగా అంది. “చేసిన పనికా, పట్టిన అదృష్టానికా ఆ మిడిసిపాటు? కాని కూటికి కక్కుర్తిపడ్డా కడుపునిండకుండా చేస్తివేమయ్యా దేవుడా అని ఏడవక ఏం చూసుకొని ఆ ఎగిరిపాటు?” పద్మనాభం గిరుక్కున తిరిగేడు. “ఏం మనిషివయ్యా” అనేసింది, భద్ర. ఆమె కంఠంలో వినిపించిన జుగుప్సను అతడు పట్టించుకోలేదు. తన తిట్టే చివరిది. అది అతని తృప్తి. ఆ తృప్తితోనే చరచర వీధిలోకి నడిచేడు. విసురుగా వచ్చిన పద్మనాభం గేటు తెరిచేసరికి అప్పుడే గుమ్మంలోకి వచ్చిన పిల్లల జట్టును చూసి చటుక్కున నిలబడ్డాడు. అతనిని చూడగనే అందరికన్న ముందున్న రవీంద్ర రెండుచేతులూ జోడించేడు. “మామాజీ! నమస్తే” అన్నాడు. చెల్లెలు చేసిందన్న “కక్కుర్తిపని” ఫలితం ఎదురుగా నిలబడి నమస్కారం చేస్తూంటే పద్మనాభానికది గౌరవంగా గాక, వెక్కిరింతగానే కనబండింది. కోపం వచ్చింది. గుడ్లు ఎర్రజేసేడు. హుంకరించేడు. ఆ విధమైన ప్రవర్తన అర్ధంగాక రవీంద్ర తెల్లబోయి పక్కకు తప్పుకొన్నాడు. అతనిని దూసుకొని పద్మనాభం వీధిలోకి వెళ్ళిపోయేడు. ఆశ్చర్యంతో రవీంద్ర తన వెనకనే వున్న సాధనను కళ్ళతోనే ప్రశ్నించేడు. “ఏమిటీ మనిషి?” ఆమె తెలియదనట్లు పెదవి విరిచింది. ఊరుకోమన్నట్లు కన్నులరమోడ్చి, తల వంచింది. మీనాక్షి అమాయికంగా అనేసింది. “పద్మనాభం మామయ్యా, నాన్నా వాదించుకొన్నారేమో.” పదిహేడో ప్రకరణం భోజనాలయ్యాయి. పిల్లలంతా మేదమీడకు చేరేరు. పెద్దవాళ్ళు సావిట్లో కూర్చుని తాంబాలాలు వేసుకొంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. “సాయంకాలం నాలుగింటికి అల్లా పాలెంవేపు వెడదాం. ఓమారు జాన్‌నీ, వాళ్ళనీ చూసివద్దాం” అంది జానకి. “జాన్‌నా?” అన్నాడు సత్యానందం. ఏదో జ్ఞాపకం వచ్చినట్లు కళ్ళల్లో మెరుపు కనబడింది. “ఔను. అదీ ఆలోచనే. కాని, ఈవేళ నాకు కుదరదు. వీలయితే నువ్వు పోయి చూసి రా. లేదా, రాత్రే కదా వచ్చేవు. ఒంట్లో బాగా లేదనుకొన్నావా. ఊరుకో. రేపు వుదయం వెడదాం.” “పోనీలే. నీపని చూసుకో, ఏమైంది? అమ్మకాలు ప్రారంభమైనట్లేనా?” “అయినట్లే, వాటిని నిర్బంధ వ్యతిరేక వారంతో జత కలిపాం. ఈవేళ ఇసకపూడిలో సభ. రాత్రి. అదీ మా హడావిడి. “ అతనిమాట పూర్తికాకుండానే మేడమీదినుంచి ఉరకలేస్తూ మీనా పరుగెత్తి వచ్చింది. “మరియమ్మ!” “ఏమిటా ఉరుకులు. మెట్లమీదినుంచి పడ్డావంటే తొస్సిదానివైపోతావు” అంటూ భద్ర ఆప్యాయంగా కూతుర్ని దగ్గరికి తీసుకొంది. “మరియమ్మ!”-అంది, మీనా ఆయాసపడుతూ. “ఏదీ?” “గుడిమూలలో కనిపించింది.” తనపని అయిపోయినట్లు మళ్ళీ పరుగెత్తబోతూంటే సత్యానందం గమ్మున చేయి పట్టుకున్నాడు. “ఏమిటా హడావిడి?” “ఉండండి నాన్నారూ! బావ ఫోటో తీస్తున్నాడు.” “వాళ్ళు ఫోటోల హడావిడిలో వున్నారు”-అంది జానకి. “ఎవరు, రవీంద్రా తీసేది? కెమేరా తెచ్చేడా?....అయితే నేనూ వస్తానుండు”-అంటూ సత్యానందం లేచి మీనాను ఎత్తుకొన్నాడు. “గౌను నలిగిపోతుంది, నాన్నారూ”-అని మీనా లబలబలాడింది. సత్యానందం ఆమెను ముద్దుపెట్టుకొని దింపేడు. “తొరగా వెడదాం. రాండి”-అంటూ మీనా తండ్రి చెయ్యి వదిలించుకొని మెట్లవేపు పరుగు తీసింది. “మీరు కబుర్లు చెప్పుకొంటూ౦డండి. నేను పైకిపోతా” నంటూ సత్యానందం కూతుర్ని కేకేసేడు. “నేనూ వస్తున్నా, ఆగు మరి.” మెట్లమీద మాయం అవుతూ మీనా పలికింది. “తొరగా రాండి.” జానకి నవ్వింది. “వాళ్ళతో మనం పోలేకపోయినా, మన్ని భరిస్తారు” అంది. పద్దెనిమిదో ప్రకరణం తనకు స్వాగతం చెప్తున్న భద్ర పక్కనే వున్న జానకిని మరియమ్మ గుర్తుపట్టలేకనే పోయింది. “జానకమ్మగారు వచ్చేరని తెలిసింది. చూసిపోదామని వచ్చా” నంది మరియమ్మ. తనను ఆమె గుర్తు పట్టలేదు. మరియమ్మ వస్తున్నదని మీనా వచ్చి చెప్పడం, ఆమెను చూస్తూనే భద్ర పేరుపెట్టి పిలిచి ఆహ్వానించడం వలన తెలిసిందేగాని ఆమె కూడా మారిపోయింది. మనిషిలో ఆ వెనకటి జీవనోత్సాహం లేదు. జుట్టు నెరుపు కనబడుతూంది. మనిషి లావు బారింది. ఆ మరియమ్మేనా ఈమె?-అనుకొంది. “ఇప్పుడే మీమాట అనుకుంటున్నాం. నాలుగ్గంటలకి బయలుదేరి రావాలనుకొంటున్నాం. ఇంతలో నువ్వే వచ్చావు.” అప్పుడుగాని మరియమ్మకు ఆ కొత్త యామెలో జానకి పోలికలు కనబడలేదు. “మిమ్మల్ని గుర్తుపట్టలేక పోయాను. బాగా మారిపోయేరు.” “బాగున్నావా” అని జానకి ఆప్యాయంగా కుశల ప్రశ్న వేసింది. “అదేబాగు” అంటున్న మరియమ్మను భద్ర లోపలికి రమ్మంది. “గుమ్మంలో మాటలేమిటి రా, లోపలికి.” పూర్వస్మృతులు మనస్సును కలతపెడుతుంటే ముగ్గురూ ఒక నిముషం మాట్లాడకుండా ముఖాలు చూసుకొంటూ కూర్చున్నారు. కొద్దిసేపట్లో జానకే తెముల్చుకొంది. “మీ అయ్య ఎలా వున్నాడు?” మరియమ్మ ఒక్క నిముషం తటపటాయించింది. “లేచి నడవలేడు. పోలీసు క్యాంపులో కొట్టేశారు. రెండు కాళ్ళూ అవిటి అయిపోయాయి. అల్లుణ్ణి అడ్డం పెట్టుకొని ఈడ్చుకు వస్తున్నాడు.” అల్లుడు అనేసరికి జానకి ఆమె ముఖం వంక చూసింది. యుద్ధకాలంలో ఆమె మగడు బర్మాలో చిక్కడి పోయాడనీ, కబురు లేదనీ అనుకొన్నారు. తిరిగి వచ్చేడు కాబోలు ననుకొంది. ఆమె చూపు గ్రహించి భద్ర చెప్పింది. “మరియమ్మ పోలీసు గొడవలు అయ్యాక మనువు చేసుకొంది. ఇప్పుడు ముగ్గురు పిల్లలున్నారు.” “ఏమన్నా పెద్దవాళ్ళయ్యారా?”...అంది జానకి. “ఏం పెద్దవాళ్ళు….అంతా, ఇంతా...” అంటూనే మరియమ్మ మాట మార్చింది. “అన్నయ్యగారి ద్వారా మీకు ఇక్కడి కబుర్లు తెలుస్తూనే వుంటాయి.” “ఏమీ రాయడు. ఎప్పుడేనా వ్రాస్తే అంతా బాగున్నారంటాడు.” “ఏమంత సంతోషకరమైన వార్తలు? ఏదో ఉద్యోగంలో వున్నారు. ఇక్కడి కష్టవార్తలన్నీ వ్రాసేదేమిటని ఊరుకొని వుంటారు.” అంది మరియమ్మ. “బొంబాయిలో పార్టీ మహాసభ జరిగినప్పుడు వచ్చేనని ఫోను చేసేడు. ఆహ్వాన సంఘం ఆఫీసులోనే వున్నాడు ఉండడం. ఓమారు నాకోసం వచ్చేడట. నేను లేను. సభలు అయ్యాక ఒకరోజు వుంటానన్నాడు....” “ఇంతలో ఇక్కడ రామకృష్ణకి టైఫాయిడ్ వచ్చింది. నాకు గాభరా పుట్టి టెలిగ్రాం ఇచ్చేను. వచ్చేశారు….జానకిని చూడనేలేదు. ఒక్కమారు ఫోన్‌లో మాట్లాడగలిగేను. వచ్చేటప్పుడు ఫోన్ చేసినా అందలేదు”-అన్నారు....అంది భద్ర. ముగ్గురూ ఒక్కక్షణం ఊరుకున్నారు. మరియమ్మ ప్రసంగం మార్చింది. “ప్రొద్దుట మీ అబ్బాయిని చూసా! వీరి అమ్మాయిలతో పొలం వెడుతున్నారు. చిన్నపాప చెప్పారు. మా జానకి అత్తయ్య కొడుకు అన్నారు. నాకు అర్ధం కాలేదు. సాధన చెప్పారు. మీరూ వచ్చేరన్నారు. వెంటనే వచ్చి పడిపోవాలనిపించింది. కాని, ఆదివారం. సెలవుండే ఈ రోజునే అన్ని పనులూ వస్తాయి. అవన్నీ తెముల్చుకు వచ్చేసరికి ఈ వేళయింది.” ఆ ఆప్యాయతకు మిగిలిన ఇద్దరూ కదిలిపోయేరు. “ఇప్పుడే మా బావతో అంటున్నా. నాలుగ్గంటలకు వెడదామని” అంది జానకి. “అంతవరకూ మనసొప్ప లేదు.”....అంది మరియమ్మ. ఇద్దరూ కబుర్లలో పడ్డారు. వారిని మాటల్లో వదలి భద్ర ఇంట్లోకి బయలుదేరింది. “ఇప్పుడే వస్తున్నా. కూర్చో.” “పనులు చూసుకోండి. కబుర్లు చెప్పుకుంటూ౦టాం” అని మరియమ్మ అనుమతించింది. పందొమ్మిదో ప్రకరణం పళ్ళెంలో రెండు చపాతీలూ, కూరావేసి తీసుకొని, భద్ర హడావిడిగా వచ్చింది. “ఆ బల్ల దగ్గరగా లాక్కో.” మరియమ్మ మొగమాటపడింది. “ఎందుకండి, ఇవన్నీ” భద్ర వొప్పుకోలేదు. గడియారం వంక చూపింది. “ఎంతయిందో చూసేవా?” “పదకొండున్నర. మేము సాధారణంగా వొంటిగంట దాటేకనే తింటామండి”-అంది. “వంట చేసుకొనే వచ్చేనండి” అంది. కాని భద్ర వొప్పుకోలేదు. మరియమ్మ లేవకా తప్పలేదు. ఎక్కవ పట్టుదల కూడదనుకొంది. “చెయ్యి కడుక్కు వస్తా.” “స్నానాల గది ఎరుగుదువు గదా. తొట్టిలో నీళ్ళున్నాయి. చెంబూ, సబ్బూ అక్కడే వున్నాయి. తుండు దండెం మీద....” మరియమ్మ వెళ్ళాక జానకి అమాంతం లేచి భద్రను కౌగిలించుకొంది. భద్ర నవ్వుతూ. “ఏమిటీ, ఉప్పలాయి!” అంది. “చాల మంచిపని చేశావు.” ఏమిటో ఆ మంచిపని చెప్పకపోయినా భద్ర గ్రహించింది. “మరియమ్మ చాలా మంచిమనిషే.” “పేపర్లలో నేను చదువుతున్న వార్తలు పట్టి నేను ఊహించినది వేరు.” ఆమె కంచికర్ల, ఒంగోలు, ఖమ్మం వగైరా చోట్ల హరిజనుల మీద జరిగిన దౌర్జన్యం వార్తలు గురించి మాట్లాడుతూందని భద్ర గ్రహించింది. “నువ్వు చదివినవీ నిజమే. నువ్వు చూస్తున్నదీ నిజమే. ఇది వెనకటి అగ్రహారం కాదు. అన్ని వీదుల్లోకీ హరిజనులు ధారాళంగా వస్తున్నారు. అయితే అన్ని ఇళ్ళలోకీ రానివ్వడం లేదు. చదువుకున్న వాళ్ళనీ, ఉద్యోగాలలో వున్నవాళ్ళనీ కాస్త గౌరవించడం నేరుస్తున్నారు. మనింటికి వస్తారు. సుందరరావుగారింటికి వస్తారు. ఇంకొకరిద్దరుకూడా కలిసారు. వాళ్ళని రానిచ్చినందుకు మొదట తిట్టేరు. తరవాత అలవాటయిపోయింది. తమరు దూరంగా ఉంచినా, దగ్గరకు తీసినవారిని ఏమీ అనరు. మనతో సమంగా కూర్చో బెట్టుకొంటే చూడనట్లు పోతారు. కాని, తమతో సమంగా కూర్చో బెట్టడానికి వొప్పుకోరు.....ఇవన్నీ......” “ఔనౌను. ఇలాంటివన్నీ ఏదో ఉత్పాతం విరుచుకు పడితే తప్ప! మామూలు రోజులల్లో మార్పు ఇంచుమించు కనబడనే కనబడదు.” అంది, జానకి. మరియమ్మ చేతులు కడుక్కుని వచ్చింది. “అక్కయ్యగారు, ఊరికే పంపరు. ఎప్పుడు వచ్చినా. రావడానిక్కూడా సిగ్గు అనిపిస్తుంది.” “మంచిదానివి. అల్లాంటిపని చేశావు గనక.....ఇంతకీ ఒక చేపాతీ పెట్టడం కూడా ఒక పెట్టడమేనా?” అంది భద్ర. మరియమ్మ ఉపాహారం చేస్తూ అంది: “ఇక్కడ నన్ను చూసినవాళ్ళు, ఈ దేశంలో కంచికిచెర్లలూ, ఒంగోలు, భీమవరాలూ జరుగుతున్నాయంటే నమ్మరు.” “అదే ఇప్పుడు అనుకుంటున్నాం” అంది జానకి. “ఈ దురంతాలు కొత్తగా పెరిగిపోతున్నాయి. ఇదివరలో ఇంత దురన్యాయం లేదు. ఓ పాలేరుని కొట్టేరనో, దొంగతనం చేసేరని కొట్టేరనో విన్నాం. కాని....” అంది భద్ర. “దురన్యాయాలు. దౌర్జన్యాలూ ఎప్పుడూ వున్నాయి. అయితే ఆ రోజుల్లో సంఘమే వాటికి అనుకూలంగా వుంది గనక బయటికి రాలేదు. మాలవాళ్ళు తమ ముఖాన బ్రహ్మ వ్రాసిపెట్టేడు. భరించక తప్పదనుకున్నారు. ఇప్పుడల్లా కాదుగా” అంది మరియమ్మ. “ఈ వేళ ఇదేమిటని అడుగుతున్నారు. ఈ దురన్యాయాలు సహించమని నిలబడుతున్నారు. ఆ విధంగా నిలబడ్డం యి౦తవరకు పెత్తనం వెలిగించిన వాళ్ళకి కొత్త. అది భయంకరమని గోలెత్తుతున్నారు....” అంది జానకి. “మార్క్సిస్టులో, నక్సల్‌బరీలో జనాన్ని రెచ్చగొడుతున్నారని ఎదురు పట్టిస్తున్నా” రంది భద్ర. ఒక్క నిముషం ముగ్గురూ తమ తమ ఆలోచనల్లో పడిపోయారు. కొద్దిసేపున్నాక మరియమ్మే అంది: “వాళ్ళకి ప్రమాదం ఎక్కడినుంచి వస్తుందో తెలుసును.” ఆమె అభిప్రాయాన్ని, అభిమానాన్నీ జానకి అర్ధం చేసుకొంది. “కాదు. వాళ్ళు మన బాహీనత నెరుగుదురు. అమాయకులు కాదు” అంది. మరియమ్మ కామాట మీద విశ్వాసం లేదని ఆమె ముఖమే చెప్తూంది. జానకి తన అభిప్రాయాన్ని వివరించడానికి పూనుకొంది. “మార్క్సు చెప్పిన వర్గకలాహం ఇది. మన దేశంలో వున్న కులాలు ఆ వర్గ కలహానికి కొన్ని కొత్త మలుపులూ, మెలికలూ తెచ్చాయి. వర్గ కలహంలో ప్రారంభంలో ఎప్పుడూ చారిత్రకంగా భవిష్యత్తులో ప్రధాన పాత్ర నిర్వహించలవసిన వర్గమే బలహీనం. చారిత్రక గతి ఒక్కటే దానికి గల బలం! మిగిలిన బలాలని అది కాలక్రమంలో కూర్చుకోవాలి. అధికారంలో వున్నవాళ్ళదే అంగబలం, అర్ధబలం. అనుభవ బలం వాళ్ళకే వుంటుంది. వీటన్నింటికన్నా వాళ్ళకి ఎక్కువ బలకరం అధికారహీనులలో కలిగే కోపం. ఆవేశం. తమమీద తమకే కలిగే జాలి. ఇంకా ఎంతకాలం అనే ఆదుర్దా. మేం బ్రతికుండగానే అదేదో చూడాలనే అహంభావం. ఏదో మూలనుంచి ప్రారంభిస్తే అదే తేలుతుందనే దుస్సాహసం. తాము తప్ప మిగతా ప్రపంచం వట్టి వాజలనే ఒంటెత్తుతనం. ఇవి శత్రువులకి గొప్ప ఆసరా” అంది. స్పష్టంగా పేర్లు పెట్టకపోయినా జానకి ఎవర్ని గురించి మాట్లాడుతూందో గ్రహించడం మరియమ్మకు కష్టం కాదు. “అందరిలాగే మీరూ కమ్యూనిస్టులదే తప్పంటున్నారు.” జానకి తన వాదం అసంపూర్ణంగా నడుస్తూందని అర్ధం చేసుకొంది. ఇంకాస్త వివరణ కావాలి. “ప్రభుత్వంలో వున్నది ప్రజావ్యతిరేకులుగాని ప్రజలు కారు. వాళ్ళ పొట్టలు వాళ్ళకి ముఖ్యం. లోకం ఆకలి వాళ్ళకి పట్టదు. పట్టడంలేదన్న గోల ప్రజలకు చూపి వాళ్ళని తయారు చేయడానికేగాని, అందువలన పెద్దమార్పు వస్తుందని కాదు....” “నక్సలైట్లు చెప్తున్నదే అది కదా” అంది మరియమ్మ నెమ్మదిగా. “చెప్పడం నిజమే. కాని, వాళ్ళ పనులు చూస్తే అధికారంలో ఉన్నవాళ్ళ నుంచి పెద్ద ఆశలు పెట్టుకొని, అవి జరగకపోయేసరికి అగ్గి పుంతలైపోయారనిపిస్తుంది. లేకపోతే ఆ ఆవేశాలూ, అక్రోశాలు ఉండవు.” ఒక్క క్షణం ఊరుకొని మళ్ళీ సాగించింది. “విప్లవకారులు ఆత్మ మన: ప్రవృత్తి ప్రకారం చేసెయ్యకూడదనే మార్క్సిజం ఎప్పుడూ చెపుతూంది. మన౦ అనుకున్న మాత్రాన, అనుకున్న విధంగా విప్లవాలు రావు. వానికి బాహ్య అభ్యంతర పరిస్థితులు కలిసిరావాలి. కలసి వచ్చేందుకు మనకృషి కావాలి....” ఎన్ని దృక్కోణాలనుంచి చెప్పినా ఇంకా ఏదో మిగిలిపోతున్నట్లే వుంది. మరియమ్మ చర్చనింక పొడిగించ తలచలేదు. గడియారం వ౦క చూసింది. “ఒంటిగంట. మరి పోతా.” గుమ్మంవరకూ ఇద్దరూ ఆమెను సాగనంపేరు. “మీ బాబుతో చెప్పు. వీలయితే నేడు, లేకపోతే రేపు వచ్చి చూస్తా” నంది జానకి. ఇరవయ్యో ప్రకరణం మరియమ్మ వెళ్ళిపోయాక కూడా వారిద్దరూ చాలాసేపువరకు తమ తమ ఆలోచనల నుంచి తెరుకోలేకపోయారు. “మనిషి తేడా, మాట తేడా తప్ప వీళ్ళందరిదీ ఒకటే ధోరణి....” అంది భద్ర. జానకికి అర్ధం కాలేదు. “అంటే?” “మరియమ్మకి కాస్త నేర్పూ, ఓర్పూ ఉన్నాయి. మనష్యుల్ని శత్రువుల్ని చేసుకోదు. మంచి చేసుకోగల తెలివి వుంది. వాళ్ళ అయ్యకి అవేమీ లేవు. అప్రయోజకపు అహంకారం తప్ప. తనతో పాటు మిగతా వాళ్ళంతా కూడా ‘అశ్శరభ శరభ’ అనాలి. అలా అనడం లేదని ఎక్కడ లేని విషం కక్కుతాడు.” జానకికి అదంతా పొడుపుకథలా వుంది. ‘అశ్శరభ శరభ’ అన్నమాట వీరశైవాన్ని జ్ఞాపకం చేసింది. ప్రసంగవశ౦లో దాని ప్రసక్తి అర్ధం అయింది. చిన్నగా నవ్వింది. “ఏమంటాడు?” “మా చిన్న కులాల మాట వచ్చేసరికి మీ పెద్దకులాల వాళ్ళంతా ఒక్కటేనని మీ బావమీద కారాలు నూరుతాడు. ఈయన నేరమల్లా దేశాన్ని తోడు తెచ్చుకోవాలేగాని శత్రువుల్నీ,  తటస్థుల్నీ చేసుకోకూడదంటారు. దేశమంతా ఇంకా మారలేదేమంటాడు అతగాడు....ఒక్కమాటు మారుతుందా? ఓర్పుతో చేతికందిన కొమ్మ పట్టుకులాగి దూరం దానిని దగ్గరకు తెచ్చుకో. అంతేగాని చిటారుకొమ్మ కోసం లొట్టలేస్తే అది చేతికందదయ్యా అంటారీయన..” భర్తకూ, జాన్‌కూ మధ్య జరిగిన వాగ్వాదాలసారం భద్ర అంశాల వారీగా చెప్పుకొచ్చింది.... ఆ వాగ్వాదాలు నేటివి కావు. అనాదిగా వస్తున్నవే. అయితే వాని రూపం కొత్తది. “ఉహూ” అంది జానకి తలపంకిస్తూ. “ఇద్దరి మాటల్లోనూ కొద్దో గొప్పో నిజం వుంది.” ఆ మాటకి భద్ర ఆవేశపడింది. “మరియమ్మ వచ్చింది. కబుర్లు చెప్పింది. మనతోపాటే కూర్చుంది. ఏ పునిస్త్రీ ఆడపడుచు వచ్చినా చేసినట్లే బొట్టు పెట్టి పంపించాం. ఇందులో మనం కులం మాట ఏం తెచ్చాం? ఎందుకది?” “సమస్య నిన్ను గురించీ, నన్ను గురించీ కాదమ్మా! దరహం మీద దేశంలో జరుగుతున్నది గాని....” అంది జానకి సర్దుబాటుగా. భద్ర బుస్సుమంది. “ఇదిగో సర్దిచెప్పకు. వీళ్ళ విప్లవం వంటలు చేసుకు బ్రతికే వెంకట్రాముడుగాణ్ణి చంపడం వరకే. అది వట్టి అర్థం లేని పని అన్నారట మీ బావ. అప్పటికీయన పార్టీ సభ్యుడయి ఎంతో కాలం కాలేదు. నిర్భంధకాండ చూసి అప్పుడే విప్లవ...ఏదో మాట వుందే యిక్కడ... అభినివేశం చెల్లా చెదరయిపోయిందన్నాడట.” జానకి నవ్వింది. భద్రా కలిసింది. “ఇప్పుడు నవ్వుతున్నాం. కాని, అవేం రోజులు! పట్టుకొన్నవాళ్ళని పట్టుకొన్నట్లు ఏదో నెపంతో కాల్చేస్తున్న రోజులు. ఈయన్ని పట్టుకుపోయేరు. ఓ వారం రోజులు నిద్రా ఆహారం లేవనుకో. ఏ క్షణంలో ఏ వార్త వింటామోననే. పాపం విశ్వనాధం, మీ అన్నా అడ్డపడ్డారు. ఈయన బ్రతికి వచ్చేరు. అలా బ్రతికి వుండడం వీళ్ళ కంటికి మహానేరం అయిపోయింది. పార్టీ రహస్యాలు చెప్పేసి ప్రాణం దక్కించుకొన్నారని కొన్నాళ్ళు, క్షమార్పణ చెప్పుకొని బయటపడ్డారని కొన్నాళ్ళు...” ఆనాటి భయాలు, ద్వేషాలు, అనుమానాలు, కక్షలు, అపనిందలతో బాగా పరిచయం వున్న జానకి మాట తప్పించడానికై  ‘వెంకట్రాముడు ఎవరు?’ అంది.  “రోడ్డుపక్క రావికింద వెంకమ్మ మనవడు. వంటలుచేసుకు బతికే వాడు. ఙ్ఞాపకం లేదూ? మరచిపోయి వుంటావు. ఆ రోజుల్లో ప్రతిచోటా పోలీసు చౌకీలు పెట్టేరు కాదూ. మనూళ్ళోనూ పెట్టేరు. రోడ్డు పక్కనుంది గనుక వెంకమ్మగారి వీధిగది అద్దెకు తీసుకున్నారు. ఇంక అక్కడ కూర్చుని దారిన వచ్చేపోయే వాళ్ళని బతకనిచ్చేవారు కారు. ఎవరు నువ్వు? ఎక్కడికెళుతున్నావు? ఎందుకు? ఎరిగున్నవాళ్ళని చూపించు-అంటూ నానా హంగామా జేసేవారు. వాళ్ళకి కావలసింది ఓ పావలా డబ్బులు. ఆఫిసరు అయితే ప్రమోషను. వాళ్ళను చూసి ఈ వెంకట్రాముడూ మొదలెట్టేడు. గొప్ప అనుకొన్నాడో, అధికారం వెలిగిస్తున్నాననుకొన్నాడో, వెర్రి వెధవ. వో రోజున పదిమంది ఆ యింటిమీద పడ్డారు. పోలీసాళ్ళు పారిపోయారు. ఈ వెర్రి పీనుగ తలుపు తీసుకొని ఏమిటేమిటని గుమ్మంలోకి వచ్చేడుట. దంజెప్పెట్టుగా నరికి పారేశారు.” “అభాగ్యుడు” అంది జానకి సానుభూతిగా. “అలా అన్నందుకే జాన్ మీ బావ మీద పడిపోయేడు. “మీదేం పోయిందండీ! ఆడు కొట్టించింది నన్ను. నీడని కూర్చుని ఎన్నేనా నీతులు చెప్పొచ్చును,” అన్నాడు. నేవిన్నా, మండీపోయింది. చెప్పొద్దూ.” “ప్రతి చిన్న మాటకీ మండిపోతే ఎలాగ?” అంది జానకి. కొద్ది గంటలక్రితం అన్నగారిమీద ‘గయ్’ మని పడిపోయిన మనిషి నోట ఆ హితోపదేశం. భద్ర ఆశ్చర్యంతో తేరిపార చూసి, తల పంకించింది. “ఔనమ్మా! తన కంతి అంత నొప్పి మరొకటి లేదు అన్నాట్ట.” సందర్భం అర్థం అయి జానకి నవ్వింది. “అహం అల్లా అనిపిస్తుందిలే ఎవరికైనా….” అని ఆత్మ విమర్శ చేసుకొంది. “అహం కాదు, నీ మొహం కాదు, పరోపదేశ పాండిత్యం....” “ఔనమ్మా! బాబూ! ఒప్పుకొన్నా కదా!....నీకంత కష్టం కలిగించేది అందులో ఏముందని గాని….” “ఆ మాట తలుచుకొంటూంటేనే వొళ్ళు రవిలి పోతుంది. నస్మరంతి గాళ్ళని గురించి చెప్పకు....” అంది వెక్కసంగా భద్ర. “ఇదివరకు అంటరానివాళ్ళూ, చెప్పరానివాళ్ళూ అన్నారు. ఇప్పుడు తలచరానివాళ్ళు కూడా వచ్చేరన్నమాట. మొత్తంమీద మన నడక అభ్యుదయ పథంలోనే వుంది” అని జానకి యెకసక్కెం చేసింది. భద్రకు తన పొరపాటు అర్థం అయినా, తన మాటను సమర్థించుకొనే ప్రయత్నం మానలేదు. “కాకపోతే….?” “అతడేమన్నాడో, నీకంత కష్టం కలిగించిన మాటేమిటో యింతవరకు చెప్పలేదు తెలుసా?” తనకు కోపం, ద్వేషం కలిగించినదేమిటో చెప్పకపోతే తనదే తప్పని నిర్ణయం జరిగేలా వుంది. భద్ర ఆ సందర్భం వివరించసాగింది. “మీ బావలాంటి వాళ్ళు మంచిగా, తియ్యగా మాట్లాడి తమరి….అక్కడో పడికట్టు మాట వుందే….చెప్తా....” “విప్లవ చైతన్యమా....?” అని జానకి అందించింది. “ఆ. సరిగ్గా అదే.....నీకీ మాటలన్నీ వచ్చేసేయే....” “నేనూ ఆ పార్టీ మనిషినే కాదుటమ్మా!” అంది జానకి. “సడే, సౌరభ్యం, మీరేవిట్లు?” మీ కులం ఏమిటనడానికి తెలుగు జిల్లాల్ల్లో ‘మీరేవిట్లు’....అనడం వుంది. రోజుకి ఒకటిగా కమ్యూనిస్టులలో గ్రూపులు ఏర్పడుతుండడం గురించిన వెక్కిరింత అది. జానకి విరగబడి నవ్వింది. భద్ర తన ప్రశ్నను అక్కడితో వదిలేసి తన కథ అందుకుంది. “మా విప్లవ చైతన్యం మొక్క పోగొడుతున్న నిగూఢ శత్రువులు మీరు....ఇంత పెద్ద మాట నాదిలే….కాని అతనిదోమాట వుండలి....ఆ….ప్రథమ శత్రువులు-అదీ!” “అన్నాడూ, ఆ మాట?” “ఆహా! శత్రువుల్లో ప్రథమ ద్వితీయ స్థానాలు నిర్ణయించే వాగ్వాదం లోనే మీ బతుకులు తెల్లారిపోతున్నాయి. వెలమ వారి పంక్తి చేసుక్కూర్చున్నారు. అయితే ఒక నాడేనా సరిగ్గా తేల్చుకోగలిగేరా యని నా అనుమానం. కాని అతడు తేల్చుకొని తన నిర్ణయం కూడా చెప్పేసేడు.” “ఏమిటది?....” ఆ నిర్ణయం ఏమిటో వెంటనే చెప్పకుండా భద్ర దానిమీద తనకు కలిగిన అభిప్రాయాన్ని చెప్పింది. “అది విన్నక 1955 యెన్నికల్లో తెలుగుదేశాన్ని మీ నాయకుల చేతుల్లో పెట్టకపోవడం తెలుగువాళ్ళు చేసిన ఒకే మంచిపని అనుకున్నాను. ఆ విధంగా మీ పార్టీకి ప్రాణం పోశారు. లేకపోతే యీ వేళ కేరళలో చేసినపనే పదిహేనేళ్ళ క్రితం తెలుగుదేశంలో చేసి వుండేవారు.” ఆనాటి ఘటనల ఙ్ఞాపకంతో జానకి ప్రశ్నించింది. “ఏమన్నాడు? నిన్ను కాడికి కట్టిస్తానన్నాడా?” “అల్లా అన్నా అదో అందం..... ‘మిమ్మల్ని కాల్చిపారెయ్యాలి’ అన్నాడు.” జానకి వెలపరించుకొంది. “పోలీసోళ్ళ దెబ్బలు తిన్నకసి....నోటి వట్టం….” అంది. “తెగులు. ఆ మాట వినేసరికి నాకు కంపరం పుట్టుకొచ్చింది. బ్రిటిష్ వాళ్ళు చేశారు. హిట్లరు చేశాడు. ఇక వంతు వీడిదన్నమాట.... మళ్ళీ యీ గుమ్మం తొక్కేవంటే గరిట కాల్చి వాత బెట్టేస్తా. అరుగు దిగమన్నా. తెల్లబోయేడు. అతడు చూస్తుండగానే పనిపిల్లచేత అతడు కూర్చున్నచోటు వేణ్ణీళ్ళతో కడిగించా.” జానకి కళ్ళు చక్రాల్లా అయాయి. “....మరింకెప్పుడూ యీ గుమ్మం తొక్కలేదు” అని భద్ర తన కథ ముగించింది. జానకి అదివిని ఒక్కక్షణం నిర్వాక్కురాలే అయింది. ఒక్క క్షణం పోయాక అంది. “ఎంతపని చేశావు. అక్కా!” “నువ్వూ ఆమాటే అన్నావూ?” “అబ్బే!....” “మీ బావ కూడా అదే అన్నారు. ఆయనకి చెప్పిన సమాధానమే నీకూను. మీ రాజకీయాలు పదట కలపండి. మీ లెఫ్ట్ రైట్‌లతో నాకేం పనిలేదు. మనం మనుషుల్లా బతకాలి. పశువులకి రాజకీయాలెందుకు? వాటికి అవేమీ తెలియవు. వాటి ఆవేశాలూ, అభిమానాలూ అన్నీ యెలిమెంటల్. కాని, ఈ మనుష్య పశువులు....” ఆవేశంలో భద్ర కంఠం నిండి వచ్చింది. జానకి నచ్చచెప్తున్నట్టు పూనుకొంది. “ప్రపంచాన్ని అంత తేలిగ్గా నిర్వచించడం సులభం కాదు అక్కా! వందలూ, వేలయేళ్ళు, జనం తమరిని కాలికింద మట్టేసేరన్న తెలివిడి, మనుష్యులుగా బతకలేకపోతున్నామన్న బాధ, త్వరలో నలుగురిలా బ్రతుకుదామన్న కోరిక, ఇంకా యెంతకాలం ఇల్లాగా అన్న నిరుత్సాహం, ఆవేదన కదిలించేస్తూంటే కలిగిన బక్కకోపం అది. ప్రపంచగతిని అర్థం చేసుకోడం లేదని వాళ్ళని అంటున్నాం. మనంమాత్రం వాళ్ళని అర్థం చేసుకొంటున్నామా?” భద్రకు ఆ మాటలు నచ్చలేదు. “మీ బావా అల్లాగే అన్నారు.” “అంటారు!” “కాని, మీ ఆలోచనలు పెడదారి పట్టేయి. దానికి మొదట బలి అయిపోయేది మీరే. ఆ బక్కకోపం, కసీ మామూలు మనిషిలో అయితే నువ్వు అన్నదే. కాని, మీరంతా రాజకీయవేత్తలు. మీకే అధికారం వస్తే….” అనేక సందర్భాలలో వ్యక్తిగత ప్రతీకార వాదాన్ని నిరసిస్తూ తానూ ఇల్లాగే వాదించింది. కాని, వేరొకరినోట తమ పార్టీ వానిమీద ఆ విమర్శ ఆ రూపంలో రావడం జానకికి కష్టంగా వుంది. “మావో నాశనం చేసింది కమ్యూనిస్టుల్నీ, కమ్యూనిస్టు పార్టీనే. నా అనుమానం ప్రజలలో పుట్టిన అపవాదు వుట్టిదై వుండదనే...” విశ్వం మరణం గురించిన ప్రవాదాన్నే భద్ర ఉటంకిస్తున్నదని జానకి గ్రహించింది. “అనుమానాలతో, దేశాన్ని నాశం చెయ్యవద్దంటున్నాం. అంటూనే రుజువులేని అనుమానాలతో యెవరిమీదనో నిందవేయడం మంచిది కాదు.” భద్ర చుర్రుమనేలా చూసింది. “సడే.”  “కాదక్కా!” “అక్కా లేదు బొక్కా లేదు. నోరు ముయ్యవే. గాంధీగారి “బుర్ర తిరుగుడు” సిధ్ధాంతం మీకు పట్టుకుంది.” ఇరవయ్యేళ్ళ క్రితం చూసిన మనిషి కాదని అడుగడుగునా అనిపిస్తున్నా భద్రలో వచ్చిన తేడా ఏమిటో జానకికి అంతవరకు అర్థం కాలేదు. పల్లెటూరి జీవితంలో మాటలు, ఆలోచనలు అన్నీ మోటుదేలిపోయాయి. ఆశ్చర్యమే అనిపించింది. ఇప్పుడేం చెప్పీ లాభం లేదనిపించింది. “నీదో పిచ్చి”-అని సాచేసింది. ఇరవయ్యొకటో ప్రకరణం కాని సత్యానందంతో మాట వచ్చినప్పుడు అంత తేలిగ్గా తోసెయ్యలేక పోయింది. “ఏమిటిది బావా? మీ అభిప్రాయాలు మంచివో, చెడ్డవో ఇంట్లో ఆడవాళ్ళకి నచ్చచెప్పుకోనక్కర్లేదా?” సత్యానందం ఉక్రోషం కనబరిచేడు. కాని, నవ్వుతూనే- “ఏం చెయ్యమంటావు? తన్నేదా?” ఒకనాడు పెద్దవాళ్ళనీ, ఆచారాల్నీ ధిక్కరించి భార్యల్ని ప్రపంచంలోకి తెచ్చింది వీళ్ళేనా?....అనిపించి జానకి నిర్విణ్ణురాలే అయింది. “కొడితే తప్ప ఆడదానికి ఏదీ అర్థం కాదనేనా నీ ఆలోచన….” సత్యానందం తన తొందరపాటుకు సిగ్గుపడ్డాడు. “ప్రపంచంలో అందరూ ఒకే స్థాయికి పెరుగుతున్నారనుకుంటున్నావేమిటి?” అని ఎకసక్కెం చేసి తప్పించుకో చూసేడు. “అక్కయ్యని ఇతరుల స్థాయికి దిగతియ్యడానికి నువ్వు ఏ మార్గం అవలంబించేవో గాని….” సత్యానందానికి ఈమాటు మాట తోచలేదు. ఇంక భార్యను సమర్థించేడు. “మోటుగా, కోపంగా నోరు చేసుకొందేగాని భద్ర యెదుర్కోలు న్యాయమేనంటాను. నువ్వేమనుకొన్నావో గాని….” జానకి తెల్లబోయింది. “సంఘంలో ఇదివరకు జరిగింది న్యాయమా అంటే మనుష్యుల దృష్ట్యా కాదు. సంఘం దృష్ట్యా అవును. కాని, ఆ అన్యాయం నేడూ సాగడం సంఘం దృష్ట్యా కూడా సరికాదు. నిజమే. ఆ అన్యాయం ఒక సాంఘిక న్యాయంగా, ధర్మంగా మన రక్తమాంసాలలో జీర్ణించిపోయింది. దానిని వదల్చుకొనేందుకు ప్రయత్నాలు సాగుతూనే వున్నాయి. దానికోసం తొందరపడ్డం న్యాయమే....” సత్యానందం ఒక్క నిముషం ఆగేడు! “మరి!” అని జానకి కదిలించింది. “కాని, దానికి మార్గం నన్నో, మరొకరినో వురి తియ్యడం కాదు. నన్నూ మరికొందరినీ తోడు తెచ్చుకోవాలిగాని. నిజంచేత మేము తమతో కూడా వున్నవాళ్ళమేగాని వ్యతిరేకులం కాదు....” జానకికి కష్టం అనిపించింది. “నోటివట్టం మాట పట్టుకొని సాగదియ్యకు బావా! జాన్ నిన్ను వురి తియ్యలేడు. ఖమ్మంలో హరిజనయువకుడి చేతులకి కిరసనాయలు గుడ్డలు చుట్టి వెలిగించేరు.ఒంగోలువద్ద వూళ్ళో చెరువుకి మంచి నీళ్ళకు వస్తే పొడిచి చంపేరు. కంచికిచెర్లలో కిరసనాయిలు మీదపోసి అంటించేరు. ఈ దౌర్జన్యాలని సమర్థించినవాడు మంత్రిగానే వున్నాడు. వాళ్ళు క్రియలు చేస్తున్నారు. వీళ్ళు….”  “నాకు తెలుసు నోటివట్టం మాత్రమేనని. ఒక మహావిప్లవ ప్రవాహంలో ఏవో కొన్ని దుర్ఘటనలు జరిగిపోతాయేమోనని భయపడ్డం కాదిది. ఎందుచేతనంటే విప్లవాలు యెవరిమీదనో కక్షకోసం జరగవు. కాని, ఇక్కడ ఈ మాట వచ్చిందెవరినోట? ఏ రూపంలో వచ్చింది? అతని మనస్సుకది సూచన. నేనైనా భద్రపనిని హర్షించాననుకోకు. కాని, అతని ధోరణివలన ఫలితాలు ఎల్లా వుంటాయో, భద్ర ప్రత్యక్ష నిదర్శనం-” అన్నాడు. జానకి ఏమీ అనలేకపోయింది. ఈ మాదిరి అసంబధ్ధ ప్రలాపాలూ అప్రయోజక దురహంకారాలూ వెనుకనే ప్రజాహంతకులూ, ప్రజాకంటకులూ చక్కగా దాగుతారు. “అయ్యయ్యో!” అని జానకి మనస్సులోనే ఆక్రోశించింది. ఇరవైరెండో ప్రకరణం “అత్తయ్య ఏరీ?” అంటూ వచ్చిన సాధనను భద్ర దగ్గరకు పిలిచింది. “ఇల్లా రా. ఏం చేస్తున్నారు మీరంతా? ఒక్కరూ కనబడ్డం లేదు. కూర్చో.” సాధన కూర్చుంది. “అత్తయ్య యేరీ?” అని మళ్ళీ అడిగింది. “అత్తయ్య యెవరే? జానకా? మంచి వరసే కలిపేవు.”-అని తన మనస్సులోని సమస్యను ఎగతాళిలోకి మార్చి భద్ర నవ్వింది. సాధన తెల్లబోయింది. “ఏం?” “ఆవిడ మీ నాన్నని ఏమని పిలుస్తుంది? నన్నే మంటుంది? నువ్వా పిలుపేమిటి?” “ఓస్. అదా?” అని సాధన తేల్చేసింది. “నాన్నగారు ఆమెకు ఏమన్నా మేనబావా? నువ్వు అక్కవా? ఆ పిలుపు ఆవిడకి బాగుంది. అల్లా పిలిచింది. నాకు ఇల్లా పిలవడమే బాగుంది సుమా!” అంది. “ఆమె మగడు నాకేమౌతాడు?” “ఏమన్నా అవనీ. ఆయన ఇప్పుడు లేరు.” “బాగుందర్రా మీరూ, మీ వాలకాలూ.” అని భద్ర నవ్వేసిందే గాని, అంతకన్న లోతుకు పోలేకపోయింది. “అలసటగా వుందని పడుకొంది. ఎందుకు?” అని మాట మార్చేసింది. “బావ కెమేరాలోకి ఫిలిం అడిగి తెమ్మన్నాడు. పెట్టెలో వుందిట.” “ఏం?ఎక్కడికేనా వెడతారా?” “గన్నవరం అక్విడక్టు చూసివద్దామన్నాడు. వెడతాం.” “దానిని లేపవద్దు. అతడినే వచ్చి తీసుకోమను. పెందరాళే వచ్చెయ్యండి. శీతకాలపు పొద్దు కూడా.” సాధన వెళ్ళింది. భద్ర చాలాసేపు అక్కడే కూర్చుని తన మనస్సులో కలిగిన భయం గురించి ఆలోచిస్తూంది. ఇరవైమూడో ప్రకరణం జానకి నిద్ర తెలివి వచ్చేసరికి ఇంట్లో యెక్కడా మనుషుల అలికిడే వినిపించలేదు. గది అంతా చీకటిగా వుంది. తలుపుల సందుల్లోంచి వస్తున్న మసకవెలుతురు బట్టి వేళ తెలియడంలేదు. బహుశా తెల్లవారుతున్నదనుకొని చటుక్కున లేచింది. గది తలుపులు తెరిచేసరికి అర్థం అయింది. సూర్యాస్తమయపు వేళ. ఎక్కడా మాట వినబడలేదు. “ఏమైనారు వీళ్ళంతా?” అనుకుంది. స్నానాల గదిలోకి వెళ్ళి ముఖం కడుక్కు వస్తూంటే పనిమనిషి యెదురు అయింది. “అమ్మగారెక్కడ గౌరీ!” “మేడమీద వున్నారండి.” బధ్ధకంగా వుంది. కాఫీ తాగుతే బాగుండుననిపించింది. పనిమనిషితో ‘పిలుచుకు రమ్మ’ని చెప్తూండగా భద్రే మెట్లపైన కనిపించింది. ‘లేచావా?’ అని పలకరిస్తూ దిగి వచ్చింది. “ఎంతసేపు పడుకున్నావో తెలుసా? రెండున్నరకి పడుకున్నావు. అయిదు దాటింది. ఈ లోపున రెండు మాట్లు వచ్చి చూసిపోయా.” “లేపలేకపోయావా?” “అలసి వున్నావు. ఒళ్లెరక్కుండా నిద్రపోతున్నావు. లేపాలనిపించలేదు. మంచం పక్కనే టేబిల్ మీద ఫ్లాస్కులో కాఫీ పోశాను. చూసుకున్నావా?” “థాంక్సు” చెప్పి కాఫీ ఇమ్మ౦దామనే అనుకు౦టున్నానంది జానకి. భద్ర కాఫీ కప్పుల్లో పోసి ఒకటి ఆమెకిచ్చి, వేరొకటి తాను తీసుకొంది. జానకి మంచం మీద కూర్చుని కాఫీ చప్పరించింది. తాజా పాలతో చేసినదని రుచి చెప్తూంది. “అప్పుడే పాలు వచ్చేయా?” “సాయంకాలం పిల్లల కోసం ఆవుని ఇంటిదగ్గరే వు౦చేస్తారు. పనిమనిషో, నేనో పాలు తీస్తాం.” “నీకు కూడా చేతనయి౦దన్న మాట. మంచిదే. ఇంతకీ పిల్లలేరీ? ఒక్కరి మాటా వినబడదు?” “ఆక్విడక్టు చూస్తామని అంతా బయలుదేరి వెళ్ళారు. వచ్చే వేళ అయింది.” జానకి ఆందోళన కనబరచింది. “పెద్దవాళ్లెవరూ లేకుండానా? అల్లరి చేసి.....” “ఇరవయ్యేళ్ళ కుర్రాడికి ఇంకా పెద్దవాళ్ళంటూ వో కాపలా ఏమిటే? ఇదేం పట్నమా యేమన్నానా? తప్పిపోతాడనుకోడానికీ,. దారి తెలియదనుకోడానికీ...” మాట అనేశాక భద్రకే నవ్వు వచ్చింది. జానకికి పల్లెటూళ్ళ భయం వొకందుకు. భద్రకు పట్టణం భయం వేరొకందుకు. తన అసందర్భ భయాన్ని కమ్ముకొనేందుకు వాళ్ళ ప్రయాణపు హడావిడిని భద్ర వర్ణించింది. “ఏవేవో స్కెచెస్ వేసేడు. ఫోటోలు తీసేడు. పిల్లలంతా యెక్కడెక్కడి వాళ్ళూ చుట్టూచేరి రొట్టలేస్తున్నారు. అంతా కలిసే బయలుదేరారు.” “తిన్నగా ఇంటికి వస్తారా?” “ఇంకా నయం!” కొడుకు స్వభావాన్ని తలచుకొని జానకి చిరునవ్వు నవ్వింది. “వాడికి జనం కావాలి. చిన్ననాటినుంచీ అంతే. పదిమందినీ పోగు చేస్తాడు. ఏవేవో ఆటలు కల్పిస్తాడు....” “గట్టివాడులే. నువ్వు నన్ను అక్కయ్యా అంటావు. అతగాడికి మాత్రం నేను అత్తయ్యని....” తన మనస్సులో దొలుస్తున్న అనుమానాన్ని ఏదో విధంగా భద్ర బయట పెట్టేసింది. జానకి కనుబొమ్మలెత్తింది. “నిన్న వచ్చినప్పటి నుంచీ అల్లాగే పిలుస్తున్నాడనుకు౦టానే...” “నేను గమని౦చలేదు.” “సాధన, పిల్లలూ కూడ నన్ను అల్లాగే పిలుస్తున్నారు సుమీ.” “సాధనేమందో తెలుసా? నీకైనా ఆవిడ చెల్లెలు కావడానికి తోడబుట్టిందా ఏమన్నానా? అదో పిలుపు. అదామెకు బాగుంది. మాకు ఈ పిలుపే బాగుందంది.” “అదెప్పుడు! ఆ మాట యెందుకు వచ్చింది?” అంది జానకి ఆందోళనగా. “ఇందాకా. నేనే అన్నానులే.” భద్ర ముఖంలో ఏదో బాధ కనబడుతూంటే జానకి సర్దుబాటుగా మాట్లాడింది. “దానికి పెద్ద విలువ ఇస్తున్నావేమిటి కొంపదీసి?” “వాని తండ్రి నాకు మేనత్త కొడుకు? అంటే వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలూను. వావి....” అంది భద్ర సంకోచంగా. జానకి కోప్పడింది. “నీకు మతిగాని పోయిందా యేం? వావీ, వరసా అంటావు! చిన్న పిల్లల పిలుపులకి అర్ధాలు తీస్తావు!” “కాదే బాబూ! మనస్సులోని ఆలోచనలకు మాటలు ప్రతిధ్వనులు.” జానకి నవ్వేసింది. భద్ర బ్రతిమాలుతున్నట్లు అంది. “జానకీ, మరొకలా అనుకోకు. రవీంద్రకూ, సాధనకూ వావి కుదిరితే నా అంత సంతోషపడేది వుండదు. కాని, చెల్లెలు వావి చెప్పకూడదు....” జానకి విస్తుపోయింది. ఈ మారు ఆమెకు నవ్వు రాలేదు! అగ్రహారంలో యెరిగినవాళ్ళు నలుగురినీ చూసి పోదామని ఇరవయ్యేళ్ళ తరువాత ఒక్కమారు వస్తే ఇదేదో కొత్తపేచీ. “రేపో, యెల్లుండో లేచి పోతున్న వాడిని ఏమని పిలిస్తేనేమిటి, నీ వెర్రిగాని.....” ఇద్దరూ కొద్దిసేపు వూరుకొన్నారు. జానకి మాట అర్ధం కొద్దిసేపటికిగాని భద్రకు అర్ధం కాలేదు. అర్ధం అయ్యాక చాల నొచ్చుకుంది. “నువ్వూ, కొడుకూ రావడం నాకెంత సంతోషంగా వుందో తెలుసా? నీకెల్లా చెప్తే అర్ధం అవుతుంది? అతడిని చూస్తే అనుక్షణం మా బావే గుర్తు వస్తున్నాడు. ఆ వయస్సులో అచ్చం అల్లాగే వుండేవాడు. అందుచేతనే ఆ పిలుపు ఏమిటో ఎబ్బెట్టు అనిపిస్తూంది....” తమ రాక విషయంలో భద్రకు అయిష్టం ఏమాత్రమూ లేదని జానకికి నమ్మకమే. కాని, ఒక బలహీన దశలో తాను చూపిన అజ్ఞానాన్ని మందలించిన భద్ర నోట ఈ మాట! సంప్రదాయాల బలం యెరిగిన జానకి భద్ర ఆలోచనలకీ, భయాలకీ జాలిపడింది. “చూడు. లేనిపోని ఆలోచనలు పెట్టుకొని, వాళ్ళ మనస్సులలో గంద్రగోళం సృష్టించకు. అన్నా, చెల్లాయీ అంటే ఆడ, మగ పొడిములు ఉడిగిపోవు. బావా, మరదలూ అంటేనే బయటపడవు.“ భద్ర ఏ సమాధానమూ ఇచ్చేలోపున పది పద్దెనిమిదేళ్ళ పిల్ల ఒకామె సావిట్లోంచి పిలిచింది. “భద్రత్తయ్యా!” “ఏమిటే, అన్నపూర్ణా!” “సాధన ఏదీ?” “వాళ్ళంతా కలసి ఆక్విడక్టు చూడబోయేరే. ఏం? పనుందా?” “ఏం లేదు. వూరికెనే.” అయినా ఆ అమ్మాయి ఒకటి రెండు నిముషాలు అక్కడే వేళ్ళాడి, వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక గాని భద్ర తన పొరపాటును తెలుసుకోలేదు. గబగబా వీధిలోకి వెళ్లి చూసింది. కాని, అన్నపూర్ణ కనబడలేదు. వెళ్ళిపోయింది. తిరిగి వచ్చింది. “ఆ అమ్మాయి యెవరు అనేనా అడిగేవు కాదేమే?”....అంది. “ఏం? ఏమయింది?”-అంది, జానకి తాపీగా. “ఆ పిల్ల ఎవరో ఎరుగుదువా? అన్నపూర్ణ.” ఆ పేరు చెప్తే చాలునన్నట్లు జానకి ముఖం చూసింది. కాని ఆమె గుర్తి౦చినట్లు లేదు. భద్రే చెప్పింది. “నీ మేనకోడలు.” “ఇంత పెద్ద పిల్ల వు౦దన్నమాట! అయితే వెళ్లిపోయిందా?” “నిన్ను చూడాలనే వచ్చిందో ఏమో? నాకా ఆలోచనే తట్టలేదు. ఏదో ధ్యాసలో వున్నా...” జానకి నొచ్చుకొంది. “ఎరిగీ పలకరించలేదనుకుంటారో ఏమో ఖర్మ. బంధువులతో ఏదొచ్చినా తగాదాయే. ‘ఆ’ అంటే అపరాధం. ‘ఊ’ అంటే బూతుగా వుంటుంది.” ఒక్కక్షణం క్రితమే బంధుత్వపు పిలుపులు గురించి జరిగిన సంభాషణ గుర్తువచ్చి భద్ర తెల్లబోయింది. అంతలో సర్దుకొని ఫక్కున నవ్వింది. ఈమారు తెల్లబోవడం వంతు జానకిది. “ఏం, నవ్వుతావు?” భద్ర ఏమీ చెప్పకుండా ‘దెబ్బ కొట్టేవు’-అంది. జానకికి అప్పుడు తన మాటకు అర్ధం జ్ఞాపకం వచ్చింది. తానూ నవ్వింది. “ఛా. ఆ ఉద్దేశంతో అనలేదు.” “అంటే అన్నావులే”- అంది భద్ర నవ్వుతూ. ఇరవైనాలుగో ప్రకరణం చీకటిపడ్డాక కనకరత్నమ్మ పెద్దకూతురు అన్నపూర్ణను వెంటబెట్టుకు వచ్చింది. “పాపం, చిన్నవాళ్ళ౦దరినీ ఒంటిగా ఇంట్లో వదిలి వచ్చేవా? తీసుకు రావలసింది,” అంటూ భద్ర ఆమెకు గుమ్మంలో స్వాగతం ఇచ్చింది. “తీసుకు రావలసిందే” అందామె విసుగుదలతో. “వచ్చింది మొదలు ఒకటే అల్లరి! ప్రాణాలు తోడేస్తున్నారు. కూర్చోనివ్వరు. మాట తొణకనివ్వరు.” “పిల్లలయ్యేక అల్లరి చెయ్యరా? అల్లరిచెయ్యని పిల్లలంటే వాళ్ళలో ఏదో లోపం ఉందనే అనుకోవాలి.” అంటూ భద్ర పిల్లలకూ, అల్లరికీ ఉండవలసిన అవినాభావ సంబంధం వర్ణించింది. “రాండి. ఇల్లా కూర్చుందాం” అంటూ సావిట్లో కుర్చీలవేపు దారి తీసింది. “అన్నయ్యగారు వస్తారేమో. లోపలికే వెడదాం” అని కనకరత్నమ్మ సందేహించింది. “రారు. ఇసకపూడిలో సభ వుందని వెళ్ళేరు. వచ్చేవేళకి రాత్రి బాగా పొద్దు పోతుంది.” సభ ప్రసక్తి రాగానే గతరాత్రి సుందరరావుగారి ఊరేగింపు మీద రంగమ్మ చేసిన అల్లరీ, ఆమె పుత్రశోకం, రాజకీయాలు కబుర్లలో నలిగేయి. “అదే ఈ చంపడాలూ, పోలీసు దౌర్జన్యాలూ గురించే ఈ వేళ సభ”-అంది భద్ర. “ఔనమ్మా, మరీ ఘోరకలిగా వుంది. కాలేజీలో చదువుకొంటున్న కుర్రాడిని తీసుకెళ్ళి చంపెయ్యడం....ఈ దిక్కుమాలిన గవర్నమెంటు పోవాలన్నారంటే అనరూ. వాళ్ళు చంపాలనుకుంటే ఆశ్చర్యమా? పాపం రంగమ్మగారి శోకం తీరేది కాదు.” అంటూ కనకరత్నమ్మ విచారం కనబరిచింది. “కూర్చోవే, అన్నపూర్ణా! లేకపోతే సాధనావాళ్ళూ వున్నారు మేడమీదికెళ్ళు. ఇందాకా నువ్వూ వెళ్ళేవు! మరో పది నిముషాల్లో వాళ్ళూ వచ్చేరు.” అన్నపూర్ణ కదలలేదు. కూర్చోలేదు. తల వొంచుకుని, గోడనానుకొని తల్లి కుర్చీపక్క అలాగే నిలబడింది. “వదినెగారు వచ్చేరన్నారు. ఇంట్లో వుంటారు. చూసిరమ్మని నేనే తరిమితే బయలుదేరింది. కనిపించలేదని తిరిగి వచ్చింది.” “సాధన ఉందా అని అడిగింది. లేదన్నాను. నేనూ ఏదో ధ్యాసలో వుండిపోయా. జానకికి పరిచయం చేయాలని తోచనేలేదు. అది తోచి, తీరా చూస్తే ఇది వెళ్ళేపోయింది.” అని భద్ర సాయంకాలం ఘటన వివరించింది. మాట మారుస్తూ- “వంటపని పూర్తిచేసుకొనే బయలుదేరినట్లున్నావు” అంది. “ఆ. అన్నీ అక్కడ పెట్టేసి, ఆకలివేస్తే చిన్నవాళ్ళకి పెట్టమని సరోజకి వప్పచెప్పి వచ్చా. మధ్యాహ్నం నుంచి రావాలని ప్రయత్నం. అమలాపురం వెడుతున్నానన్నారు. వచ్చేసరికి పొద్దు పోతు౦దన్నారు. అందుకే ఇప్పటికేనా తెమిలి బయట పడగలిగేను. ఇంతకీ ఏరీ వదినగారు! ఇంట్లో వున్నారా?” “స్నానం చేస్తూంది. వస్తుంది.” “జగడం వేసుకోడానికి వచ్చా. ఊళ్ళో తమ స్వంత ఇల్లు, స్వంత అన్నగారూ వుండగా ఇక్కడ దిగటం యేమిటో. మీతో ఎంత స్నేహం, ఎంత చనువూ వుంటే మాత్రం?”....అంది. కనకరత్నమ్మ కృత్రిమ గాంభీర్యం చూపుతూ. “ఓస్, దానికి మాది మాత్రం పరాయి ఇల్లేమిటి? అప్పుడు నాకు మాత్రం కోపం రాదా? నేనూరుకొంటానా?” అని భద్ర ఆమె కోపాభినయాన్ని తేలగొట్టేసింది. కనకరత్నమ్మ రాజీభావాన్ని కనబరచింది. “పోనీ ఎక్కడోచోట దిగేరు. దిగేకైనా రాకూడదూ?” “ఎందుకు రాదూ? అదీ సన్నాహంలోనే వుంది. పొద్దునంతా బడలికగా వుంది. మధ్యాహ్నం భోజనం చేసేసరికి పేట లోంచి.....” ఎవరో రాజకీయ బంధువులు వచ్చివుంటారు. వీళ్ళ నాన్నగారు చెప్తుంటారు.” అతి సామాన్యంగానే వున్నా ఆ మాట వెనక కొంచెం కష్టపెట్టుకోవడం వినిపించింది. తమ ఇంటికి రాలేదనేనా? కాక, స్వజాతి వాళ్ళూ, ఆత్మబందువులూ కన్న ఎవరో ఏ కాపుల ఆవిడో, సెట్టిబలిజ అమ్మో, మాల మాదిగలో ఎక్కువయ్యారని ఎగతాళా?-అర్ధం కాలేదు. “అసలు బంధువులే లేకుండా పోయినప్పుడు మనిషి ఎవరినో ఒకర్ని బంధువుల్ని చూసుకొంటాడు. ఊరికే గాలిలో బ్రతకలేం కద!” అంది భద్ర. “హస్యానికన్నాను” అని కనకరత్నం సర్దుకొంది. పది నిముషాలు ఆమాటా ఈమాటా ఆడుతూ, చటుక్కున ప్రశ్నించింది. “మా అల్లుడన్నా కనబడ్డే౦, చూద్దామంటే.” “పిల్లలంతా పైన వున్నారు. లే, వెడదాం”-అని భద్ర లేచింది. కనకరత్నం ఆమె చెయ్యి పట్టుకుకూర్చోబెట్టింది. “వదినగారిని రానీ, వెళ్ళొచ్చు.” “పోనీ నువ్వెళ్ళి మీ బావని పిలుచుకురావే” అంది అన్నపూర్ణతో భద్ర. “నే నెరగను కదా!” “పోనీ సాధనతో చెప్పు” అంది మధ్యేమార్గంగా. “నాకు సిగ్గు బాబూ!” అని అన్నపూర్ణ మెలికలు తిరిగింది. “ఎంత చెప్పినా అది అంతే”....అని కంకరత్నమ్మ అసహాయత తెలిపింది. అంతలో మళ్ళీ అంది. “అత్తయ్యగారితో బొంబాయి వెళ్ళాలి. వాళ్ళింట్లో సోఫాలు, ఫాన్‌లు మంచి లైట్లు వున్నాయి. మనింట్లో చదువుకొనేందుకు మంచి లైటన్నా లేదని గునుస్తావు. మరి ఇప్పటినుండీ అత్తగారినీ, బావగారినీ మచ్చిక చేసుకోవాలి.” ఆ కూతురు అతిసిగ్గూ, తల్లి హాస్యం భద్రకు వెలపరం అనిపించింది. “నీ వెర్రిగాని వాళ్ళ నాన్నకి సరిపడొద్దా? లేనిపోని ఆశలు చూపించకు.” తనను సమర్థిస్తున్నట్టే వున్నా ఆ మాటలోని ఎకసెక్కేన్ని కనకరత్నం అర్ధం చేసుకొంది. కాని వెనక తగ్గలేదు. “మేనరికం ఆశ ఆడపడుచులకి ఉండడంలో ఆశ్చర్యంలేదు. కాదంటే పోయే బంధాలా ఇవి?” కనకరత్నమ్మ గడుస్తనాన్ని భద్ర అర్ధం చేసుకొంది. “ఒక పిల్లకైనా అవడమేనని పద్మనాభం సంప్రదాయాల గురించి రాజీ పడదామనుకొన్నా మీవాళ్ళు అందర్నీ కాదనగలవా? సోమయాజులుగారి దౌహిత్రివి కూడానూ.” ఈ మారు కనకరత్నమ్మ మరో అడుగు ముందుకు వేసింది. “అందరూ తింటున్నది కంబళ్ళలోనే.” “బాగుంది. అల్లా అనుకోగలమా?” “ఆయనగారు ఇవ్వగల కట్నాలకి అంతకన్నా మంచి సంబంధం తీసుకురాగలరా? అలాగని మేమూ లోటు చెయ్యం అనుకో.” భద్రకు ఇదంతా పెద్ద వల పరుచుకుపోతున్నట్లు అనిపించింది. “కట్నం పెద్దది ఇవ్వలేకపోతే మాత్రం కులం చెడగొట్టుకోవాలా?” అంది భద్ర. “ఎవరికమ్మా కులాలూ, కట్నాలూ బేరీజు వేస్తున్నావు?” అంటూ జానకి సావిట్లో అడుగు పెట్టింది. ఆడపడుచును చూస్తూనే కనకరత్నమ్మ లేచి నిలబడింది. ఆమె ఎవరో అర్ధం కాకపోయినా, తనను గౌరవిస్తూ నిలబడడం చూసి, జానకి చేతులు జోడించి అప్రయత్నంగా అనేసింది.... “నమస్కారం. నా పేరు జానకి....తమరిని....” బొంబాయిలో స్కూలు, కాలేజి, మహిళా సంఘాల పనులమీద కొత్తముఖాలు వస్తూ౦టారు. ఉభయుల్నీ ఎరిగి పరిచయాలు చేసే వాళ్ళుండరు. మామూలుగా తానే పరిచయం చెప్పుకోవాలి, చేసుకోవాలి. ఆ అలవాటులో జానకి మాట్లాడేసింది. కనకరత్నమ్మ ప్రతినమస్కారం చేసింది. కాని, ఆ పరిచయ పద్ధతికి కంగారు పడింది. అపద్బా౦ధవిలాగ భద్ర అడ్డుపడింది. “మీ వదినగారు. పద్మనాభం భార్య, కనకరత్నమ్మ. ఇది అన్నపూర్ణ. వాళ్ళ పెద్దమ్మాయి. సాయంకాలం వచ్చిందిగాని నువ్వు చూడలేదు.” జానకి ఒక్కక్షణంలో ఆశ్చర్యంనుంచి తేరుకొని, అన్నపూర్ణ భుజం మీద చెయ్యేసింది. “వెంటనే వెళ్ళిపోయేవేం? నేను ఎరక్కపోతే మాత్రం నువ్వేనా చెప్పొద్దూ!” “దానికి చెడ్డ సిగ్గు” అని కనకరత్నం సాయం వచ్చింది. “మంచిదానివే” అంటూ ఆమెను చెయ్యిపట్టుకు తీసుకెళ్ళి సోఫాలో పక్కన కూర్చోబెట్టుకొని కూర్చుంది. “మీరు మా ఆడపడచు అవుతారు. కాని, ఒకర్ని ఒకరం ఎరగం. ఇది మా పిల్లలలో పెద్దది. నాయనమ్మగారి పేరు పెట్టారు. స్కూల్ ఫైనల్ ప్యాసయింది.” “ఇందాకా భద్రక్క చెప్పింది. బాగా మార్కులు వచ్చేయట కదా పబ్లిక్‌లో....” “మేనత్త పోలిక, చదువు బాగా వస్తుంది.” అదంతా తనను పొంగేయడానికి ప్రయత్నంగా భావించి, జానకి చురుక్కుమనేలాగా చూసింది. “నా పోలిక లెవరికీ వద్దు. ఆ పేరు పెట్టకండి.” కనకరత్నమ్మ నాలుక కరుచుకొంది. జానకిని దువ్వడానికి ఉపయోగించిన మాట విపరీతార్ధం ఇచ్చిందని గ్రహించి నొచ్చుకొంది. ప్రసంగాన్ని మార్చింది. “మీ స్వంత ఇల్లుండగా మరోచోట దిగేరు. వారు ఎంత కావలసిన వారైనా అది అన్యాయంకాదా? ఈ ఊళ్ళో వున్నన్నాళ్ళూ మీరుండవలసింది అక్కడే. మాతోపాటు కలో గంజో తాగాలిసిందే. మేనత్తగారనడంగాని, మిమ్మల్ని పిల్లలే ఏమిటి….” “పిల్లల తల్లే ఎరగదు”-అంది, భద్ర. జానకి అసలు విషయం వదలి సమాధానం ఇచ్చింది. “అదింకా నా ఇల్లంటారేమిటి? మా అన్నయ్యకి ఎప్పుడో రాసి ఇచ్చేసేను. అది అతనిదే. మళ్ళీ మొదటికి తీసుకురాకండి.” కనకరత్నమ్మ తృప్తి పడలేదు. “బాగుందండీ. అన్నయిల్లేమిటి? చెల్లెలి ఇల్లేమిటి? ఒకరిదైతే రెండో వారిదైనట్లు కాదా....” జానకి నవ్వింది. “ఇప్పుడు సివిల్‌లా గురించి చర్చలా ఏమిటి గాని, కూర్చుని చెప్పండి.” కనకరత్నమ్మను గురించి తెలుసుకోవడంలో సంభాషణ మార్గం మళ్ళించింది. ఆమె పుట్టిల్లు ఏ వూరు? ఇంటి పేరేమిటి? పెద్దవాళ్ళు బాగున్నారా? తోబుట్టువులు యెందరు? ఏం చేస్తున్నారు? పెళ్ళిళ్లు? పిల్లలు? ఎవరెవరు యెక్కడెక్కడున్నారు? జానకి ప్రశ్నలనంతం. వారిద్దరినీ మాటలకు వదలి భద్ర ఇంట్లో పని చూసుకు వస్తానని వెళ్ళింది. కనకరత్నమ్మ తన వాళ్ళందర్ని గురించీ మహోత్సాహంతో చెప్తూ అంది: “మీరు యెరగకపోయినా మా అక్కయ్య ద్వారా అప్పుడప్పుడు మీ యోగక్షేమాలు తెలుస్తుంటాయి.” అల్లా తెలిసింది ఒక్కమారే. అయినా, తామంతా ఆమె విషయంలో పరోక్షంగా శ్రద్ధ తీసుకొంటూనే వున్నట్లు సూచనగా ఆమె ఆమాట అంది. తాను యెరగకపోయినా, తన్ను యెరిగినవారు ఎవరో తనను కనిపెట్టే వుంటున్నారనిపించి జానకి కంగారు పడింది. “వారి పేరేమిటి?” “మీరెరగరు. ఒకమారు మా అమ్మా, అక్కా కలిసి, మా అక్కకూతుర్ని స్కూలులో చేర్పించే విషయం మాట్లాడడానికి మీ వద్దకు వచ్చేరట....” “ఎవరెవరో వస్తూనే వుంటారు. కాని, చాలమందికి నేను తెలుగుదాన్నని తెలిసివుండదు.” “మా వాళ్ళకు మొదట అంతవరకే తెలుసు. మాటలో మీ పేరూ, ఇంటిపేరూ తెలిసింది. మా అమ్మ గ్రహించింది. ఆమెకు మీరు ఆ వూళ్లో వున్నట్లే అంతక్రితం తెలుసు. అవన్నీ నలుగురికీ తెలుస్తే మీ వుద్యోగానికి భంగం కలుగుతుందని మరి రాలేదట.” తాను రహస్య జీవితం గడుపుతూ కాలేజీలో వుద్యోగం చేసిందన్నట్లు సూచన వినిపించి జానకి నవ్వింది. “నేనెప్పుడూ రహస్యంగా వుండలేదు. ఉండాలనుకోనూ లేదు. నా పేరుతోనే చదివా. ఆ పేరుతోనే వుద్యోగమూ చేస్తున్నా.” “అలాగా”-అంది కనకరత్నమ్మ. తన మగని క్షేమం కోసం కొంతకాలం ఆమె తన జాడ తెలియనివ్వలేదు. ఆయన మరణానంతరం ఆ జాగ్రత్త అనవసరం అయింది. కాని, ఎవ్వరికీ వ్రాయకపోవడం అలవాటయిపోయింది.- ఆ సంగతులూ, సంజాయిషీలూ అనవసరం. కనక వూరుకుంది. “మీరు యెక్కడున్నదీ తెలియదు అన్నారు మీ అన్నగారు, వోమారు....” “నా యెడ్రసు కావాలంటే దొరక్కపోయిందా?” “మీరెప్పుడూ వ్రాయలేదు.” “నిజమే. వీళ్ళిద్దరూ తప్ప నన్ను గురించి యెవ్వళ్లూ పట్టించుకోలేదు. తప్పెవరిదని కాదు. నేను పెళ్ళి చేసుకోడం తలవంపులనుకొన్న వాళ్ళకి వుత్తరాలు రాసి బాధించనా?” ఆ విషయం నిజమని తెలిసినా కనకరత్నమ్మ ఒప్పుకోలేదు. “అది కేవలం మీ భ్రమ.” జానకి మర్యాద కోసం ఆ మాటను ప్రత్యాఖ్యానం చెయ్యలేదు. “కావచ్చు. అంతే అయితే మంచిదే. ఆ భ్రమలోనే నేనెవరికీ వ్రాయలేదు. అదో అలవాటయిపోయింది. చివరికి వచ్చేటప్పుడు వీళ్ళకీ వ్రాయలేదు. వ్రాయనందుకు నాకెల్లాంటి అభ్యుత్థానం జరిగిందో అడగండి చెప్తుంది.” అంటూ ఇంట్లోంచి వస్తున్న భద్రను చూపింది. కొద్దిసేపు కబుర్లు చెప్పాక కనకరత్నం లేచింది. “ఏం గొడవ చేస్తున్నారో పిల్లలు! చాలా సేపైంది వచ్చి. లేవండి. వెడదాం.” “ఇప్పుడెక్కడికి?” అంది జానకి ఆశ్చర్యంగా. “నిన్ను వాళ్ళింటికి పిల్చుకుపోడానికే వచ్చింది ఆవిడ. నువ్వు వచ్చేసరికి ఆ మాటే మాట్లాడుతున్నాం” అని భద్ర అందించింది. “థేంక్స్‌” అన్న మాట జానకి నోట అప్రయత్నంగా వచ్చేసింది. “అదేమిటి? మీ యింటికి మీరు రావడానికి నాకు థేంక్సా?” “ఎంతో ఆప్యాయతతో పిలిచేరు. అదెంత మాట?” కనకరత్నం అంగీకరించింది. “పోనీండి. అల్లాగే. మరి లేవండి.” “ఇప్పుడు కాదు. నేనింకా వుంటాగా. వెళ్ళేలోపున తప్పకుండా....” “మంచివారే. ఇంకెప్పుడోనా? ఏం కుదరదు. మీరు రానిదే నేనిక్కడినుంచి వెళ్ళను.” “హడావిడి ఏముంది? కూర్చోండి. దూరమా యేమన్నానా? అంత రాలేని వయసు పిల్లలున్నారా ఇంటి దగ్గర? వాళ్ళని కూడా చూసినట్లేనా అవుతుంది” అంది జానకి మొండిగా. ఆ స్వరంలో తీవ్రతను హాస్యంలోకి మళ్ళిస్తూ భద్ర అంది. “ఏం ఘొరావో సరదాగా వుందా?” వెంటనే జానకి సర్దుకుంది. “ఇంకా నెల రోజులుంటాను. వెళ్ళేలోపున తప్పకుండా....” “….ఓ మారు మొహం చూపిస్తామంటారు. అంతేనా?” జానకి నవ్వింది. “మీ యింట భోజనం చెయ్యమంటారు. అంతేనా? నాకేమాత్రం అభ్యంతరం లేదు. కాని....” “ఇప్పుడు కుదరకపోతే ఎప్పుడు వస్తారు చెప్పండి.” దాని అంతేదో తేల్చుకుంటేగాని కదలనన్నట్లు కనకరత్నమ్మ అంటూంటే భద్ర అనునయంగా సర్దడానికి ప్రయత్నించింది. “ఉంటుంది కద, తర్వాత మాట్లాడుకోకూడదా?” “పీట మీద నుంచి లేవలేకుండేంత ఏర్పాట్లు చేద్దామనేనా? వద్దు. భరించలేను” అని జానకి హాస్యమాడింది. అంతలో ఖండితం చేస్తున్నట్లు “వదినా! భోజనాలూ అవీ అంటూ లేనిపోని బెడద తీసుకురాకండి....” అంది. మాట మధ్యలోనే కనకరత్నం అందుకుంది. “బెడదా? వచ్చే పండుగేమిటో తెసుసా?” పండుగ దృష్టిలో లేని జానకి భద్ర ముఖం వేపు చూసింది. “ఇప్పుడు పండుగేముంది?” భద్ర నవ్వింది. “వారం రోజుల్లో దీపావళి వస్తూంటే ఆ ప్రశ్నేమిటి?” “ఔను సుమీ. మరిచేపోయా.” “దీపావళికి ఎక్కడెక్కడున్న ఆడపడుచుల్నీ తీసుకొస్తారు. మీరు వూళ్ళోకి వచ్చి....” అంటూ కనకరత్నం విషయం గాడి తప్పకుండా జాగ్రత్త పడింది. “నేను రాలేదనే మాటెందుగ్గాని, ఈ పూటకి వదిలెయ్యండి. మీ ఆలుమగలు తేల్చుకొని పిలవండి.” “అదేమిటల్లా అంటారు? దీనికి ఆయనతో మాట్లాడడం ఏమిటి? ఆయనే చెప్పేరు పిలుచుకురమ్మని.” “పొద్దుట నాతోనూ చెప్పేడు. నేను రావడం వలన మీకు ఏదో తరిగిపోతుందనేం కాదు. కాని, ఇతరవిధాలయిన కష్టాలుంటాయి. వాడితో ఆ మాటా చెప్పేను.” కనకరత్నం చాలాసేపు నిర్వాక్కురాలుగా కూర్చుండిపోయింది. ఆడపడుచు మాటల నుంచి ఆ అన్నా చెల్లెళ్ళ మధ్య నడిచిన సంభాషణను వూహించడానికి ప్రయత్నించింది. చివరకు నీరసంగా లేచింది. “క్షమించండి.” జానకి ఆమె చేయి తన చేతిలోకి తీసుకొంది. “కష్టపెట్టుకోవద్దు. కోపమూ వద్దు. బొంబాయిలో బయలుదేరేటప్పుడే ఇక్కడ రాగల సమస్యలు మనసులో మెదిలేయి. ఇదివరకల్లా అనేకమార్లు ఏ సెలవులకో రావాలనుకోడం, మానుకోడం జరిగింది. చివరికి మోగమాటాలూ వద్దు. పేచీలూ వద్దు. తిన్నగా వెళ్ళి ఓమారు నలుగుర్నీ చూసేద్దామని వచ్చా. చూస్తా. వెళ్ళిపోతాను. లేనిపోని సమస్యలు నాకు తేవద్దు. మీరు కల్పించుకోవద్దు.” కనకరత్నమ్మ బయలుదేరబోయింది. “ఉండు. బొట్టు పెట్టుకు వెడుదువుగాని.” బొట్టు పెట్టించుకొని వెడుతూ, వెడుతూ నిలబడింది. “చూసేరా, నా తెలివి, మీ అబ్బాయిని చూడనేలేదు.” అల్లుడనే బంధుత్వపు పిలుపు నుపయోగించలేదని భద్ర గమనించింది. “మేడ మీద వున్నారు అంతా. పైకి వెడదాం రాండి.” -అంటూ జానకి ముందుకు అడుగువేసింది. కనకరత్నమ్మ కూతురుతో-“నువ్వెళ్ళి చెల్లాయిలు ఏం చేస్తున్నారో చూస్తావా? నేను ఇప్పుడే వస్తా” అంది. “ఇద్దరం కలిసే వెడదాం” అంటూ అన్నపూర్ణ వారితోపాటే తానూ బయలుదేరింది. ఇరవయ్యయిదో ప్రకరణం కనకరత్నమ్మని గుమ్మం వరకూ సాగనంపి వెనుతిరుగుతూంటే బయట మాట వినిపించింది. “వియ్యపురాలిని చూడడానికి వచ్చేవులా వుంది. వుందా? ఏం చేస్తూంది?” “ఉన్నారు.” మొదటి గొంతు వినగానే భద్ర సన్నగా విసుక్కుంది. “ఈ పూటకింక అన్నప్రాశన యోగం లేదు” అంది. అంటూనే పైకిమాత్రం ముఖాన చిరునవ్వు చూపుతూ ఆహ్వానించింది. “రాండి, సత్యవతమ్మగారూ! చీకట్లో బయలుదేరేరు!....విశ్వనాధంగారి భార్య సత్యవతమ్మగారే. గుర్తుపట్టేవా?” అంటూ జానకికి గుర్తు చేసింది. బాగా మారిపోయేరు. గుర్తుపట్టలేను, చెప్పకపోతే....అనుకొంది, జానకి. “దయచెయ్యండి.” జానకి వచ్చినట్లు తనకు ఎవరు చెప్పారో, ఆ మాట వినగానే తనకెంత ఆనందం కలిగిందో, ఏమనుకొందో, ఇంట్లో పని ఎల్లా వదిలేసి వచ్చిందో గుక్క తిప్పుకోకుండా సత్యవతమ్మ చెప్పుకుపోతూంది. రెండు మూడుసార్లు తన మాట చొప్పించి ఆమె వాక్ప్రవాహానికి అడ్డు వేయడానికి భద్ర ప్రయత్నించి కొంతసేపటికి సాధించింది. “ఈవేళే అనుకున్నాం. పిల్లలంతా పెద్దవాళ్ళయి ప్రయోజకులయ్యారు. ఆవిడే పట్టుపట్టి సుశీలను డాక్టరు చదివించేరు అనుకొన్నాం.” “నేనీ వూరి నుంచి వెళ్ళేనాటికి సుశీల మూడు నాలుగేళ్ళ పిల్ల అనుకుంటాను. పెద్దదై, మెడిసిన్ చదివింది అన్నమాట. బాగుంది. ఇప్పుడేం చేస్తూంది? పెళ్ళయిందా? పిల్లలా?” అని జానకి మాట కలిపింది. “అయ్యో పెళ్ళీ, పిల్లలూ....” అని సత్యవతమ్మ నాటకీయంగా చేతులు వెతకలేసి నిస్పృహ కనబరచింది. కూతురు పెళ్ళి మాట వచ్చేసరికి దేశ రాజకీయ పార్టీలను తిట్టి, ఛషట్కారాలు కురిపిస్తుందని ఎరిగిన భద్ర ఆమె ఆ నిస్పృహ నుంచి బయటపడక పూర్వమే మాట అడ్డం వేసింది. “ఊళ్ళో వుందిట కాదా. వుద్యోగం మానేసిందనీ, ఇక్కడే ప్రాక్టీసు పెడుతుందనీ ఎవరో అన్నారు.” “ఇంకా రాజీనామా ఇవ్వలేదట. దిక్కూ, దివాణం లేని ఎక్కడో మారుమూల వూళ్ళో, జనం మీరు మాకు వద్దో అంటూంటే, అక్కడెందుకే అంటే నీకు తెలియదమ్మా అంటుంది. అసలు గొడవ దానికి ఇక్కడ బోర్డు కట్టడం ఇష్టం లేదు. అడవిలోనన్నా మేలే అంటుంది. అతడికి పోటీ వచ్చినట్లు అవుతుందనో యేమో-ఏమీ చెప్పదు.” “పోటీ మాట ఏలా వున్నా ఈ చిన్నవూళ్ళో ఇబ్బందిగానే వుంటుంది. దానికి తోడు ఒకే వీధిలో అంత ఎడంలో ఎదురు బొదురు యిళ్లు కూడాను.” వాళ్ళ మాటలేమిటో, దేనిని గురించో అర్థంగాకపోయినా భద్ర సంజ్ఞ గమనించి జానకి వూరుకుంది. సత్యవతమ్మే ప్రారంభించింది. “జానకీ, భద్రా మీరిద్దరూ చెప్పి దానిని వొప్పించాలి. వెధవ చచ్చినాడు, ఆ ముసలి వియ్యంకుడు పీనుగ లేకపోతే కుర్రాడు మంచివాడు. ఇంకా మన వస్తువే కాస్త పెంకి ఘటం. చెప్పొద్దూ. ఎదుట వుండి కనిపిస్తూంటే కాపురం కుదుటపడుతుందని నా ఆశ.” “అన్నీ సర్దుకొంటాయి....” అని భద్ర ఆశ్వసనం ఇవ్వబోయింది. “సర్దుకోక ఏం చేస్తాయి? అయితే మన ప్రయత్నం వుండొద్దూ? ఏమీలేదు. రైళ్ళూ, బస్సులూ మారి రెండు రోజులు ప్రయాణం చేస్తేగాని చేరలేని వుళ్ళో....” “ఎక్కడది?” అంది జానకి వూరుకోలేక. “ఆదిలాబాదు జిల్లాయట. నెలరోజులు ఏమైపోయిందో అని హడలి చచ్చేం. మందులివ్వక జనాన్ని చంపేస్తూందంటూ కరపత్రం వేశారు. కొమరయ్యగారు తెచ్చి యిచ్చేరు.” తమ వూరి పరిణామాలు ఎరగని జానకికి ఆ వ్యక్తి ఎవరో తెలియదు. “కొమరయ్యగారూ?” “విశ్వనాధంగారూ, ఆయనా జాయంటుగా కంట్రాక్టులూ, ఎరువుల వ్యాపారమూ చేస్తున్నారు. వరంగల్లు వారిది. ఇక్కడే వుంటున్నారు.” “చాటున చెప్పకోవాలి. ఛస్తే చెప్పుకోవాలంటారు. చాల మంచివారు. రెడ్లు. అసలు పేరు కుమారగిరిరెడ్డిట. ఆయనే ఆ కరపత్రం తెచ్చేరు! అప్పుడు ఆయన్నే తోడు చేసుకొని వాళ్ళ నాన్న ఎల్లాగో వెళ్ళేరు. వచ్చేలోపున ఎన్ని కబుర్లు? ఎన్ని నీలివార్తలు?....” తెలంగాణా గంద్రగోళం కబుర్లు వినాలని జానకి ఆతురత కనబరిచింది. కాని సత్యవతమ్మ వినిపించుకోలేదు. “ఆ పాడు వూళ్లు వదిలెయ్యి అని అంతా చెప్పాం. వాళ్ళ నాన్నగారు దానికి పెళ్ళప్పుడు ఓ పాతికవేలు యిచ్చారు. చాలకపోతే నా నగలు ఇచ్చేస్తా. ప్రాక్టీసు పెట్టుకో. ఈ వూళ్ళోకి రా. లేదా అమలాపురం, రాజమండ్రి, కాకినాడ-ఎన్నిచోట్లు లేవు. ఉహు కాదంటుంది. “నీ మొహం నాకు కనిపించకూడదు జాగ్రత్త....” అని సొడ్డేసినట్టు....” అదేదో అర్థం గాకపోయినా, అది భార్యాభర్తల మధ్య తగవు అయివుంటుందని జానకి భావించింది. ఇటువంటివి ఒకరు సలహా యివ్వగలవీ, యిస్తే ఆచరించగలవీ కాదనిపించింది. ఏదో ఒకటి అనాలి గనక భద్ర చిన్న సలహా యిచ్చింది. “సుశీల వూళ్ళో వుంది గనక, అతణ్ణి పండుక్కి పిలవండి. ఎదుటపడితే వాళ్ళే సర్దుకుంటారు.” “అయ్యో....” అని సత్యవతమ్మ నుదురు కొట్టుకుంది. నిరాశ వెనుక వెంబడించే తీవ్రపదజాలానికి భయపడి భద్ర వెంటనే ఆమె స్థితికి అంగీకారం తెలిపింది.  “ఔనులేండి. ఆ మాటా నిజమే. తండ్రి మాట ప్రకారం పెళ్లాన్ని పుట్టింటికి పంపేసి, చాటుమాటున తనే వస్తుంటానంటే అభిమానం వున్న ఏ ఆడది ఒప్పుకొంటుంది? గతి లేనిదీ, మతిలేనిదీ అయితే ఏమోగాని....” తన కూతురు చేసింది సరిగ్గా లేదనిపిస్తున్నా ఆమె అభిమానం న్యాయమే అన్న ప్రశంస సత్యవతమ్మకు చాల తృప్తినిచ్చింది. కాని, అసలు స్థితి మనశ్శాంతి నివ్వలేకపోతోంది. “అన్నీ వున్నాయి. అంచుకు తొగురు ఒక్కటేలేదు” అని డీలాపడిపోయింది. “ఆడదానికి అణుకువ వుండాలి. చైనావాడు దేశంలోకి వస్తేనేం? దేశం పదట కలిస్తేనేం! మగాళ్ళేదో ఏడుస్తారు. ఆ గొడవలన్నీ పెట్టుకోకపోతే వాళ్లకి కాలక్షేపం వుండదు. మళ్లీ మన్నే చంపుకు తింటారు. పడి వుండనీ. ఇంత వుడకేసి పడెయ్యడమూ, పిల్లల్ని చూసుకోడమూ గాకపోతే తనకీ రాజకీయాలెందుకు?” ఆ అభిప్రాయాలు వెంటనే ఖండించతగినవనిపించేయి జానకికి. రాజకీయాలు మగాడి కాలక్షేపానికి? పిల్లల్ని కనడం, పెంచడం ఆడదాని జీవిత లక్ష్యం? మరెందుకు సుశీల చేత మెడిసిన్ చదివించినట్లు? డబ్బుకా? గొప్పకా? నోరు తెరవకుండా భద్ర కాలు తొక్కేస్తూంది. ఏమిటో కధ! జానకికి ఈమారు కొంచెం అర్థం అయినట్లనిపించింది. అర్థమూ కాలేదు. “దేశం పాడైపోతే మనకి మగాళ్లు దక్కుతారా? పిల్లలు దక్కుతారా? చూడండి, రంగమ్మగారిని....” అంది భద్ర. ఏదో బాధకొద్దీ అనేసినా దేశం పాడైపోవడం సత్యవతమ్మకీ ఇష్టం కాదు. సిగ్గుపడి వెంటనే సర్దుకుంది.... “ఆ మాట ఆ వియ్యంకుడు పీనుక్కి వుండొద్దూ. కమ్యూనిస్టుననీ, గడ్డలిస్టుననీ తగలడతాడు....” తాను భయపడ్డట్టే అయింది. సత్యవతమ్మ ఛషట్కారాలకు అందుకొంది. ఇంక వదలదు. వెంటనే మాట మళ్లించడానికి ప్రయత్నించింది. “సుశీల అప్పుడే నిద్రపోకపోతే వోమారు నేను రమ్మన్నానని చెప్పండి. ఏదీ ఏడున్నరే అయిందా, మళ్లీ....” “ఔనండీ” అంది జానకి. భద్ర ఎత్తు పారింది. సత్యవతమ్మ లేచింది. “మీరూ చుదువుకున్నవాళ్లు. కాస్త చెప్పండి తల్లీ! చెట్టంత కూతురు మోడులా తిరుగుతూంటే చూడలేకున్నాను.” ఇరవయ్యారో ప్రకరణం “కాలు తొక్కి చంపేసేవేమిటి? పచ్చిపుండైపోయింది.”-అని జానకి కాలు రాసుకుంది. భద్ర నవ్వింది. “గుడ్లెట్టే కోడిలా వున్నావు, నోరు తెరుచుకుని. ఏమన్నా నోరు విప్పేవో యింట్లో ఎవ్వరికీ అన్నయోగం, నిద్రయోగం వుండదు. ఇంకా పిల్లలకి అన్నాలు పెట్టలేదే, ఏమిగతిరాయని నా గుండెలు యింతసేపూ టువ్వుటువ్వుమంటున్నాయి తెలుసా?” సత్యవతమ్మ పూర్వపు వ్యక్తిని తలుచుకొని జానకి ఆశ్చర్యం కనబరుస్తూ లేచి కుంటింది. “వెనకటి మనిషి కాదు” అంది. ఆమె కుంటడం చూసి భద్ర విచారపడింది. “అంత గట్టిగా తొక్కేనా?” ఆ మాటకు సమాధానం యివ్వకుండా సత్యవతమ్మలో యింత మార్పు ఎలా వచ్చిందో కారణాలు వూహిస్తూంది జానకి. “విశ్వనాధంగారు బతికి వున్నారా?” “నిక్షేపరాయుడులా. పెళ్లికొడుకులా వున్నాడు. మిల్లు మూడో కొడుకు చూసుకొంటున్నాడు. ఆయన ఢిల్లీ, హైద్రాబాదు, ఈ ఊరు మధ్య కదురులా తిరుగుతున్నాడు. కొంతకాలం ఆ గ్రూపు అంటాడు. ఈవేళ ఈ నాయకుడు పిలిచేడంటున్నాడు. ప్రస్తుతం రిక్విజిషన్ నోటీసు మీద సంతకాల హడావుడిలో వున్నాడు. ఒక్కరోజున యింటిపట్టున వుండడు.” “అందుకే ఆవిడకి కాస్త వూపిరి చేరింది” అనుకొంది. “వెనుక నోరు విప్పేది కాదు. ఇప్పుడా కాలం కూడదీసుకుంటున్నట్లు మాట్లాడేస్తూంది.” “పదేళ్ల నుంచి యింటి పరిస్థితులు మారేయి. పిల్లలంతా పెద్దవాళ్లు అయ్యారు. పెళ్లిళ్లయాయి. చదువుకొన్న కోడళ్ళూ, అల్లుళ్ళూ వచ్చారు. తనకీ రాజకీయహోదా పెరిగింది. మరి పెళ్లాం మీద చెయ్యిచేసుకోడము మానేడు.” “అరవయ్యోపడిలో పడ్డాకకూడ కొట్టడమా?” అంది జానకి నొసలు చిట్లించి. “నిజమే అనుకో. వో మారు లోకువ యిచ్చేక మగవాడే కాదు, ఆ పెద్దరికాన్ని ఎవ్వరూ వదులుకోరు. అదీగాక కొట్టినా కొట్టకపోయినా కొడతాడన్న భయమో? అదిప్పుడు లేదు. కోడళ్ళూ, అల్లుళ్ళ ముందు తాను చిన్నపుచ్చుకోనక్కర్లేకుండేందుకు ఆయనే పెళ్ళాన్ని కాస్త మంచిగా పలకరించడం నేర్చుకున్నాడు....” “పోనీలే పాపం.” “అసలు మార్పు సుశీల పెళ్లితో వచ్చింది. ఈ పెళ్లి చేయడం విశ్వనాధంగారికి యిష్టం లేదు. ఈవిడదే పట్టుదల.” “వాళ్లు బంధువులా? కాదే. ఇద్దరి శాఖ ఒకటి కాదు కూడాను.” భద్ర నవ్వింది. “కమ్యూనిస్టులు పెళ్లాల్ని కొట్టరు. ప్రేమగా చూసుకొంటారు. సభలనీ, వూరేగింపులనీ, సంఘాలనీ కాస్త ప్రపంచం చూడనిస్తారు. ఉమ్మడి కుటుంబంలో మగ్గెయ్యరు....అని మీబోటివాళ్ళంతా వూళ్లో వో పెద్దనమ్మకం కలిగించి పోయేరు. ఆవిడ అదే పట్టుక్కూర్చుంది. పైగా పిల్లా, పిల్లాడు యిష్టపడ్డారు. సుందరరావుగారికి యిష్టం లేదట. కానీ కొడుకు యిష్టానికి వదిలేశారు. కట్నం యిస్తాను అన్నా రంగనాయకులు పుచ్చుకోనన్నాడు. కూతురుకు యిచ్చుకోమన్నాడు. ఇన్ని కలిసొచ్చాయి. పెళ్ళయింది. ఓ ఏడాది కాపురం చేశారు. ఇంతలో చైనా దండయాత్ర వచ్చింది. తప్పు చైనాదే అందిట సుశీల. సరిహద్దులో యుద్ధం చల్లారినా యింట్లో చల్లారలేదు. తండ్రి ఆదేశంతో అభివృద్ధి నిరోధక కూటానికి చెందిన పెళ్ళాన్ని రంగనాయకులు పుట్టింటికి పంపేసేడు. ఇందాకా ఆమె గొడవకంతకూ కారణం అది....” “దారుణం....” “మరీ అన్యాయంలే, అయినా....” మాట మధ్యలోనే భద్ర నిగ్రహించుకొని వూరుకొంది. “ఏదో అనబోయేవు. కానీ....” “ఒద్దులే. మీరంతా ఏడుస్తారు.” జానకి ఒక్క క్షణం వూరుకుంది. “ఊళ్ళో వాళ్ళన్నా సర్దుబాటు చెయ్యలేక పోయారా?” “లాభం లేదు. సుశీల చాల తెలివిగలది. మీరు చెప్తుంటారే, శాంతియుత సహజీవనం. అది సాధ్యమవుతుందేమోనని ప్రయత్నించింది. నువ్వు సుందరరావుగారిని ఎరుగుదువుగా. కోడలి రాజకీయాభిమానాలు సరియైన దారికి తేవాలని ఆయన నిరంతరోపన్యాసాలు ప్రారంభించేరు. ఉండి వుండి ఒక్కమాటతో సుశీల ఆయనకి విపరీతమైన కోపం తెప్పించేది....చివరకు ఆ పీడ భరించలేకపోయింది.” “మొగుడేమంటాడు.” “అతడి రాజకీయ దీక్ష అదివరకే స్థిరపడింది. అతడు పిత్రుభక్తికి కలియుగ రాముడు.” “తండ్రీ కొడుకూ ఒకటయ్యారన్నమాట”-అంది జానకి. “అదీ సరికాదు. అతడూ దానిని రాజకీయాల వరకే ఆపాలనుకొన్నాడు.” “మరి.” “ఇంట్లో గొడవ ఎక్కువయ్యేసరికి వెళ్ళి చదువు పూర్తిచేసుకోమని అతడే ప్రోత్సహించేడు.” “ఏం చదివింది?” “మెడిసిన్ మూడో ఏడాదిలో వుండగా పెళ్ళయింది. అది పూర్తి చేసింది.” “మంచి పని చేసింది.” “అంతా అదే అనుకున్నాం. ఏడుస్తూ కూర్చోకుండా పోయి చదివింది.” “మరి వాళ్ళు కలియలేదు?” “అంతే అనాలి. కోరి చేసుకొన్న పెళ్ళాం. రంగనాయకులు కొంతకాలం ఎటూ తేల్చుకోలేకపోయాడు. సుశీలే హద్దు గీసిందట.” “ఏమంటుంది?” “చదువు పూర్తి అయ్యేవరకూ మామూలుగానే వున్నారు. అంటే ఆవిడ పుట్టింట్లోనే వుందిలే. తరవాత ఒకటి చెప్పింది....మన రాజకీయాల మంచిచెడ్డలు కాలక్రమాన తేలుతాయి. మనం కలిసి కాపురం చెయ్యవచ్చుననుకొంటే ఆ యింట్లోంచి వచ్చెయ్యి. వేరే కాపురం పెట్టుకుందాం. అలా కాదు, నువ్వు పుట్టింట్లోనే వుండు. కడుపు చెయ్యడానికి నే వస్తుంటానంటే కుదరదు. గుమ్మం దిగు....” అని హద్దు గీసింది. “అబ్బ! ఏం మాటలే! అది. మరీ మోటుగా తయారయేవు?”-అంది జానకి. పకపక నవ్వే భద్ర యిచ్చిన సమాధానం. ఇరవయ్యేడో ప్రకరణం “ఏం జాన్ బాగున్నావా?” అంటూ పలకరిస్తున్న జానకినిగాని, ఆమె వెనకనేయున్న యువకుణ్ణిగాని జాన్ గుర్తుపట్టలేకపోయాడు. “చిత్తమండి”-అని తెల్లబోయి చూస్తూంటే తానే పరిచయం చేసుకొంది. “నేను జానకమ్మను.” అతనికి గుర్తు రాలేదు. ఎదుటవున్న నాగరికమూర్తికి ఆ పేరు అతికినట్లులేదు. అతడు ఎరిగిన జానకమ్మ పల్లెటూరి, బ్రాహ్మణ వితంతువు. పెళ్ళి చేసుకొన్నా ఆమెను అతడు ప్రస్తుత రూపంలో వూహించలేకున్నాడు. అతని కళ్ళు చూసి జానకి నవ్వింది. “ఇంకా గుర్తు రాలేదు. మరిచిపోయేవు.” ఆ మాటను అతడు ఒప్పుకోలేదు. అంత ఆప్యాయంగా పిలిచిన మనిషి తన్ను బాగా ఎరిగి వుండాలి. ఆమెను తాను మరిచిపోయేడు. “అబ్బెబ్బే! తమరిని మరిచిపోవడమా? ఎప్పుడొచ్చేరు? ఎక్కడికొచ్చేరు.” ఎక్కడికొచ్చేరో తెలుస్తే ఆమె ఎవరో వూహించవచ్చునని అతని ఆలోచన. “మొన్న సాయంకాలం వచ్చేం”-అంది జానకి. తెలియలేదు. కాని అతడు బయటపడలేదు. “చాలాకాలానికి వచ్చేరు.” ఆమెనీమధ్యకాలంలో చూసిన గుర్తులేదు. కనక ధైర్యంగానే అనేశాడు. “మమ్మల్ని మరిచిపోయింది, నిజానికి మీరే....ఆ అబ్బాయి మీ కొడుకా? పేరేమిటి?” జాన్ చాలా తెలివిగా తన ప్రశ్నలన్నీ ఏరుకున్నాడు. వీనిలోవేనికీ ఆమెను ఎరిగివుండనక్కర్లేదు. కొద్దిపాటి ఆలోచనవుంటే చాలు.... ఆ ప్రశ్నలతో జానకి అతడు తనను గుర్తించినట్లే అర్థం చేసుకొంది. చిన్న నవ్వు....’ఔను....రవీంద్ర’ అనే సమాధానాలు, జాన్‌కు కావలసిన సమాధానం ఇవ్వలేదు. “అక్కడే వుంటున్నారా? ఏపేట మరిచిపోయాను?” అన్నాడు. “బైకుల్లాలో....” ఆ పేరు అతడు ఎక్కడా చదివిన గుర్తులేదు. చదివినా గుర్తులేదు. “అబ్బాయి ఎక్కడ చదువుతున్నారు. ఏం చదువుతున్నారు?” “బొంబాయిలోనే, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో....” ఒక్క క్షణంలో జాన్ ఆమె ఎవరో గ్రహించేడు. విశ్వం భార్య! జానకమ్మ! తను అంతవరకూ తెలిసినట్లు నటిస్తున్నాననే మాట మరిచి, సంతోషంతో ఆమెకోసం అక్కడున్న కుర్చీపీట వెయ్యబోయేడు. “చాల కాలానికి వచ్చేరు. మంచి....” తన శరీరస్థితిని మరచి హడావిడిగా ఒక కాలు మీద బరువంతా మోపి, తిరిగి వొంగోడంలో తూలి బోర్లా పడిపోయేడు. “అయ్యో!” జానకీ, రవీ చటుక్కున వచ్చి, చెరోరెక్కా పట్టుకొని లేవదీసేరు. “ఎక్కడన్నా దెబ్బతగిలిందా?” అని అతనిస్థితి ఎరిగిన జానకి అడిగింది. “అల్లా పడిపోయేరేం, కళ్ళుగాని తిరిగేయా?” అన్నాడు రవీంద్ర. వీరి రాకతో పనులు ఆపి, కొలిమి పాక వద్ద పనిచేస్తున్నవాళ్ళు నిలబడి ఆ సంభాషణ వింటున్నారు. జాన్ పడిపోవడంతో వాళ్ళంతా పరుగెత్తి వచ్చారు. ఒకరు కుర్చీ పీట నాలుగు కాళ్ళూ ఆనేలా చూసి వేశాడు. మరొకరు దానిమీద కూర్చునేటట్లు సాయం చేసేడు. తన అశక్తత అల్లా ప్రదర్శితం అయినందుకు జాన్ చాల చిన్నపుచ్చుకొన్నాడు. పైగా అంతమంది అక్కడ చేరడం, తన విషయంలో ఆదుర్దా కనపరచడం కష్టం అనిపించింది. కోపం వచ్చింది. అందర్నీ పట్టుకు తిట్టడం లంకించుకున్నాడు. “....కొడుకుల్లారా! ఏం సందు దొరుకుతుందా, పని ఎగగొట్టుదామా అని చూస్తూంటారు. సందు దొరికితే చాలు! పోండి.” అతని తిట్లూ, కేకలూ విని జానకి ఆశ్చర్యపడింది. ఇరవయ్యేళ్ళ క్రితం మాలపల్లెలో పడుచుకారు ఈ జాన్ నాయకత్వాన ఎంతో ఆత్మాభిమానం చూపేవారు. వాళ్ళు మాటలో, మన్ననలో చూపుతూ వచ్చిన శ్రద్ధను సత్యానందం యెంతో మెచ్చుకొనేవాడు. ఇప్పుడీ పడుచువాళ్ళెవ్వరూ తిట్లకు మొగం చిట్లించినట్లు కూడా కనబడలేదు. ఆమె మనస్సుకు కష్టమే తోచింది. “తొందరపడకు జాన్!” తొందర వద్దన్న మాట అతని మనస్సును రగిలించింది. ఒక్క క్షణం క్రితం ఆమె రాకకు సంతోషం తెలిపేడు. కాని, ఆమె యిప్పుడు తన ఎదుట వుండడం సహించరానిదిగా కనిపిస్తూంది. కాని ఆమెను తిట్టలేడు. “కడుపు నిండినవాళ్ళు ఎంతలేసి మాటలన్నా తొందరపడ్డట్లనుకోరు. నాబోటి బక్కవాడు ఏం చేసినా, ఏమన్నా తొందరపాటుగానే వుంటుంది.” అతని మాటలలో కనిపించిన కసికి జానకి నిర్విణ్ణురాలయింది. అది యెందుకో అర్థం కాలేదు. భద్ర మాటలు గురించేమో. ఇంక అక్కడ వుండడం మంచిదిగా తోచలేదు. “మళ్ళీ కనిపిస్తా. వుంటాలే. నీ పనిచూసుకో” అని కొడుకుని పిలిచింది. “వెడదామా?” తన తొందరపాటుకు జాన్ సిగ్గుపడ్డాడు. సర్దుకొన్నాడు. “ఈ అవిటివాణ్ణి జ్ఞాపకం వుంచుకొని వచ్చేరు. సంతోషం.” జాన్ మర్యాదకు లేవబోయేడు. కాని, చేతకాలేదు. “విప్లవకరపాత్ర ఇంకా ముగియలేదన్నాం కాంగ్రెసుకి. అందుచేతనే, వాళ్ళ పోలీసాళ్లు ఇంతతో వదిలేశారు.” జాతీయోద్యమ గతిలో వివిధ దశలలో కాంగ్రెసు పాత్ర ఏమిటని యెప్పటికప్పుడు కమ్యూనిస్టు పార్టీ చర్చలు జరుపుతూనే వుంది. దానినిబట్టి పార్టీలో పంధాలో తీసుకొనే యెత్తుగడలు వుంటాయి. ఆ చర్చలతో అనంతంగా ఘర్షణ సాగుతూనే వుంది. అది తేలలేదు. పార్టీ బద్దలయింది. చిద్రువలైంది. కాని ఆ సమస్య అలాగే సెలవేస్తూనే వుంది. ఇరవైఏళ్ల క్రితం పార్టీలో విశ్వం వాదించిన మాటలతో జాన్ అతని భార్యను యెత్తిపొడుస్తున్నాననుకొన్నాడు. కాని జానకి అది తన అభిప్రాయాలను యెత్తిపొడుస్తున్నట్లుగానే తీసుకొంది. “మనం కమ్యూనిస్టులం. వ్యక్తిగతంగా మనం నష్టపడ్డాం. కష్టాలూ పడ్డాం. దాని పరిమితిని పట్టి దేశస్థితిని లెక్కపెట్టకూడదు.” జాన్ భగ్గుమన్నాడు. “కమ్యూనిస్టుపార్టీ సభ్యుడయ్యేడంటే అతడు వ్యక్తిగతమైన బంధాలనూ, వర్గబంధాలనూ వదుల్చుకోగలిగినట్లే. లేకపోతే ఈ ముళ్ళదారిలో కావాలని అడుగు పెట్టలేడు....” జానకికి ఆ విశ్వాసం లేనట్లే అలవోకగా చిరునవ్వు నవ్వింది. “నేనల్లా అనుకోలేను. లెనిన్ అయినా యెంతో మధనం, మనస్తాపం పొందకుండా వ్యక్తిగత ఆలోచనల్నీ, సబ్జక్టివిజాన్నీ వదుల్చుకొంటూ వచ్చేరని నేను అనుకోలేను. ఆ బలహీనత మనుష్యుడిలో సహజంగా వుంటుంది. కమ్యూనిస్టు అయినవాడు బుద్ధిపూర్వకంగా ప్రయత్నించి దానినుంచి బయటపడడానికి ప్రయత్నిస్తాడు. బ్రాహ్మణత్వం, పంచమత్వంలాగ బూర్జువాతత్వం, కార్మిక వర్గస్వభావం జన్మసంచితాలు కావు. పార్టీ కార్డుతో పట్టుబడేవీ కావు.” జాన్ తెల్లబోయినట్టు ఆమె వంక చూసేడు. “1950 లో తెలుగుదేశంలో జరిగిందీ, ఈవేళ జరుగుతున్నదీ జాన్‌కి మాత్రమే దెబ్బలు తగలడం ఒక్కటేనా? దేశంలో బలి అయిపోయినా, పోతున్నా కుర్రవాళ్ళ ప్రాణాలకి విలువలేదూ. ఇరవై ఏళ్ళ స్వాతంత్ర్యం తర్వాత, మనిషి ఇతర గోళాలక్కూడా పోయి వచ్చేటంతగా సైన్సు వృద్ధిపొందిన 1970 నాడు కూడా జాన్‌కు చొక్కాలేకపోవడం ఒక్కటేనా జరుగుతూంట....” ఇల్లాంటి ప్రశ్నలనామె చాలా వింటూంది. ఇంకా వినవలసి వుంటుందనీ తెలుసు. వాదనబలంలో లేదు వీనికి సమాధానం. ఒకరి అనుభవం నుంచి వ్యక్తి నేర్చుకొనేది చాలా తక్కువ. అతడే చూసుకోవాలి. ఆ అనుభవాన్ని కొందరు ఎన్నటికీ పాటించరు. నేర్చుకోలేరు. కొందరు చేసిన తప్పే చేయరు. కాని, వాళ్ళ జీవితంలో ఎన్నడూ సరిగ్గా సముచితమైన పని చేయరు....ఇప్పుడు తనకీ వాదం ఎందుకు?....అనిపించింది. నాలుగు రోజులుండి, నలుగురినీ చూసిపోదామని వచ్చినదానికి యీ రాజకీయ వాగ్వివాదాలు ఎందుకనిపించింది. జాన్ రాజకీయాలు ఎల్లా వున్నాయో వూళ్లోకి వచ్చిన రోజునే తాను వింది. అవి తనకు నచ్చవు. కానీ వచ్చింది. వాదం కోసమా? ఇష్టంలేక సాచేసింది. “సరిలే. ఇప్పుడా చర్చలెందుకుగాని....” జాన్ ఒప్పుకోలేదు. ఒక్క క్షణం క్రితం ఆమె తానూ కమ్యూనిస్టునే అని చెప్పింది. కమ్యూనిస్టు ఎన్నడూ తన వాదాన్ని చెప్పుకోడానికి సందేహించకూడదు. తప్పో వప్పో చర్చలో తేలుతుంది. అంతే కాని, పారిపోవడమా? “మీరు కమ్యూనిస్టునే అన్నారు కాబోలు....” “ఏమిటో పోనిద్దూ. కమ్యూనిస్టుననుకుంటే సరిపోతుందా? మన జీవితాన్ని మనం నడుపుకొనే పద్ధతి దానిని నిరూపించాలిగాని....” ఆ మాట ఒప్పుకోడానికి జాన్‌కి ఏ మాత్రం అభ్యంతరం లేదు. అదే తానూ చెప్తాడు. కాని, ఆ మాటనే జానకీ అంది. ఏ అర్థంలో అందో తట్టలేదు. జానకి ఒక్కక్షణం ఆగి, మళ్ళీ అంది.... “మంచి కమ్యూనిస్టు ఎల్లా వుండాలి? లీ షావ్-చీ వో....” చెవి మీద తేలు కుట్టినంతగా జాన్ ఉలికి పడ్డాడు. “చెప్తూ, చెప్తూ లీ షావ్-చీ నే చెప్పేరూ? రివిజనిస్టు కుక్క.” జానకికి అసహ్యం కలిగినా నవ్వింది. “మనం చాలా కుక్కలకి పెద్దరికం ఇచ్చాము. వాటి ఏడుపులన్నీ గౌరీకల్యాణం పాడుతున్నట్లే తీసుకొని నోరు తెరుచుకు విన్నాం. గౌరీకల్యాణం కాదు, కుక్కల ఏడుపురా అన్నా అర్థం కాని దశ. ఏం చేస్తాం. దేశ దౌర్భాగ్యం!” అంటూ గిర్రున తిరిగింది. “పోయొస్తా. వెళ్ళేలోపున వీలైతే మళ్ళీ కనిపిస్తా.” ఇరవయ్యెనిమిదో ప్రకరణం జానకి వెళ్ళిపోయాక జాన్ చాలా వ్యధపడ్డాడు. ఆమె తనను చూడడానికి వచ్చిందంటే తన మీద అభిమానం వుంచిందన్నమాట. వచ్చేటప్పుడు తనతో తెచ్చిన అభిమానాన్ని వెళ్ళేటప్పుడు ఆమె తీసుకెళ్ళలేదు. ఆమాట తోచినప్పుడు అతనికి చాలా బాధ కలిగింది. ఆమె వచ్చి తనను చూడవలసిన పనిలేదు. ఒక్క సుందరరావు తప్ప వెనుకటి కమ్యూనిస్టు మిత్రులలో ఒక్కరూ తనను చూడడానికి రారు. కాని, ఆమె వచ్చింది. వచ్చిన మనిషిని తాను నొప్పించేడు. దానివలన తాను సాధించినదేమిటి?-అనే ప్రశ్న కలిగింది. తానన్న మాట మాత్రం ఏమిటనే ఆలోచన వెంటనే కలిగింది. రాజకీయాలను గురించి తాను తన అభిప్రాయాలను గట్టిగా చెప్పేడేగాని జానకిని ఏమీ అనలేదు. చైనా రివిజనిస్టును యీసడించేడేగాని, కనీసం డాంగేపేరన్నా ఎత్తలేదు. కనక జానకి నొచ్చుకోవడం అనవసరం! ఆమె అభిరుచులూ, అభిమానాలూ, వర్గస్వభావం బయటపడ్డాయి తప్ప తన తప్పు లేదు. విప్లవ అప్రమత్తతను చూపించేడు తాను. “పెట్టీ బూర్జువా, ఇంటలెక్ట్యుయల్, రివిజనిస్టు....ఆ....ఇండివిడ్యుయలిస్టు....” కాని జానకికి తగిలించిన యీ విశేషణాలు ఏవీ ఎంతోసేపు అతని మనస్సుకి శాంతినివ్వలేదు. తన ప్రవర్తనలో ఏదో లోపం వుండి వుండాలి- పాతిక ముప్పయేళ్ళ క్రితం తాము తెచ్చిన ప్రజాయుద్ధ వాదాన్ని ఎందరో హర్షించలేదు. తిట్టేరు. మొగాన ఉమ్మివేసిన ఘటనలు కూడా వున్నాయి. కాని- ఆ రోజులనాటి సత్యానందం గుర్తువచ్చాడు. చాలమందికన్న తమరిని సమర్థవంతంగా ఎదిరించినవాడే. కాని, ప్రజల కష్టాలలో కలిసి వచ్చేవాడు. మిత్రుడయ్యేడు. చివరికి తమ పార్టీవాడయ్యేడు. కాని, తాను? తమతో వచ్చేవాళ్ళని కూడా ఎందుకు తరిమేస్తున్నాడు? ఊళ్ళో అందర్నీ తిట్టేడు. పోనీ వాళ్ళు తనకు వ్యతిరేకులు. కాని జానకి? మనస్సులో ఏదో అసంతృప్తి కొట్టుమిట్టాడుతున్న ఘట్టంలో వీరాస్వామి పుస్తకాల సంచితో వచ్చేడు. “ఏం మామా! బాగున్నావా?” మామూలు పరిస్థితిలో అయితే ఏదో పుల్లవిరుపు మాటతో మనస్సు నొప్పించడానికి ప్రయత్నించేవాడే, జాన్. కాని యీవేళటి మనస్థితి వేరు. నెమ్మదిగానే పలకరించేడు. “ఏమిట్రోయ్, శాన్నాళ్ళకి కనిపించేవు. ఆ సంచి అంతలా వుందేటి?” “సాహిత్య వారం.” అన్నాడేగాని పుస్తకాలు చూపించడానికి ప్రయత్నించలేదు. రెండు మూడేళ్ళ క్రితం వాళ్ళు యిల్లాగే తెస్తే, తాను వాటినన్నింటినీ తోసిపారేసేడు. మళ్ళీ తేలేదు. ఈవేళ ఎందుకొచ్చేడు?....నూతన మనస్థితిలో తానే అడిగేడు? “ఏం పుస్తకాలు తెచ్చేవు?” “పుస్తకాలు తేవడం కాదు-“ అన్నాడు వీరాస్వామి సంచి దగ్గరగా నొక్కుకుంటూ. జాన్‌కి కోపం వచ్చింది. “మరి?” “సాహిత్యవారంతో పాటు మేం స్థానికంగా నిర్బంధ వ్యతిరేక వారం కూడా జరుపుతున్నాం. ఈవేళ పాలెంలో సభ. దానికి నువ్వు అధ్యక్షుడుగా వుండాలి.” వీరాస్వామి దేశంలో పడుచువాళ్ళు నిర్మాణం మాట వదలి టెర్రరిస్టు ధోరణికి ఎల్లా ఎగబడుతున్నారో చెప్పేడు. ఏ సమస్యనూ సరిగ్గా పరిష్కరించక, జనద్వేషం తెచ్చుకొన్న ప్రభుత్వం, ప్రజల కోసమే మహాత్యాగాలకి సిద్ధపడ్డ ఆ యువకుల మీద, వాళ్ళ అనాలోచిత పంథాను వుపయోగించుకొని జనం మీద కసి తీర్చుకొనేందుకు ఎల్లా ప్రయత్నిస్తూందో చెప్పేడు. ఇప్పుడు జగజెట్టులవంటి కుర్రవాళ్ళని కాపాడుకోడానికీ, ప్రజావుద్యమాలలోకి ప్రజల్ని తెచ్చేటందుకూ, ప్రభుత్వాన్ని ఒంటరిని చేసేటందుకూ, మనం అందరం కలిసి పని చెయ్యాలని మా కోరిక-అన్నాడు. వీరాస్వామి ఎత్తును గ్రహించేనన్నట్లు జాన్ నవ్వేడు. “పోలీసాళ్ళ పద్దులోకి ఎక్కించి మీరు చోద్యం చూడడానికా?” అరవైరెండు నుంచీ “ఇది దుందుడుకు విధానం” అనడం రాజకీయాల్లో పోలీసు చిఠ్ఠాలకి పేరు సప్లయి చేయడంగా ఎదుర్కోడం అలవాటయింది. జాన్ ఆ అలవాటుకొద్దీ అనేశాడు. కాని మీటింగు వుద్దేశం గుర్తు వచ్చి తన పొరపాటు అర్ధం అయింది. ఈమారు కూడా వీరాస్వామి వెనకటల్లే తనని హేళన చేస్తాడని అనుకొన్నాడు. “పోలీసువాడిని గురించి అంత భయపడే వాడికి విప్లవం గురించి అంత ఆర్భాటం, అరుపులు ఎందుకంటార”న్న ప్రశ్నకు బదులు వీరాస్వామి అనునయించబోవడం ఆశ్చర్యమే అనిపించింది. “నీలాంటివాడే అల్లాగంటే ఎలాగ? నువ్వు అల్లా అంటే ప్రభుత్వం ఎత్తు పారినట్లే కదా. కొట్టిపారేస్తే మరి వుద్యమాలూ వుండవు. నోరెత్తే దమ్ములూ ఎవరికీ వుండవనే కదా వాళ్ళ ఆలోచన....” ఇంకా ఏం చెప్పునో? తాను భయపడినట్లే అనుకుంటున్నాడనిపించింది. వెంటనే సర్దుకొన్నాడు. “కూర్చుని లేవకుండా వున్నా, నేనెందుకురా. మరొకర్ని చూడు. ఒకటి ఆలోచించు. సత్యానందంగారింటికి విశ్వంగారి భార్య వచ్చేరు. చదువుకున్న ఆవిడ. ఆవిడ వుంటే బాగుంటుంది....” కాని వీరాస్వామికి జాన్ వుండడంలో విశేష ప్రయోజనం కనిపించింది. “పోలీసాళ్లు చేసే దురన్యాయాలు చూపడానికీ, చెప్పడానికీ నీవే వుండాలని మేమంతా అనుకున్నాం. ఆవిణ్ణి మాట్లాడమందాం.” జాన్ ఒక్కమారు కాళ్ళకేసి చూసుకొన్నాడు. ఇందాకా క్రింద పడ్డప్పుడు పెచ్చులేచిన మోచేయి తడుముకొన్నాడు. “ఏనాడో ఈ పనికి పూనుకోవలసింది” అన్నాడు. “మా పార్టీ ప్రభుత్వం ఆలోచనల్నీ చర్యల్నీ ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తూనే వస్తూంది!” అన్నాడు వీరాస్వామి. తమ పార్టీ కూడా ఏమీ లోటు చెయ్యలేదన్నాడు జాన్. “మా పత్రికలో సంపాదకీయాలు వ్రాశారు.” కాని యువత, ఎందరో విద్యావంతులు ఈ దుస్సాహసిక పంథాకు ఎందుకు విరగబడుతున్నారు? మావో పిలుపు ఒక సద్యః కారణం కావచ్చు. కాని, 1930-35 లో ఆకర్షించలేని దుస్సాహసికత ఈవేళ ఎల్లా, ఎందుకు ఆకర్షిస్తూంది? తమ కార్యక్రమాలు దానికెంతవరకూ బాధ్యం? ఉగ్రవాదుల్ని తమకు ద్రోహం చేసినవారినిగా నిందించే మార్క్సిస్టుల వద్దా, వారిని దారి తప్పిన స్వార్ధ త్యాగులుగా వర్ణించే తమ వద్ద కూడ ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదని వీరాస్వామి ఎరుగును. కాగితం ఖర్చు కన్న తాము ఇద్దరూ ఇంతవరకు ఈ విషయమై విశేషంగా చేసినదేమీలేదనీ ఎరుగును. వూరుకొన్నాడు. జాన్ సర్దుకొన్నాడు. “ఒకరినొకరం అనుకొనేదేముందిలే. ఇప్పుడేనా తోచింది. మీరే నయం. కుర్రాళ్లు. వస్తాలే, కానీండి.” ఇరవయితొమ్మిదో ప్రకరణం వీరాస్వామి వెళ్ళగానే జాన్ కొలిమిపాక దగ్గరకెళ్ళి పనివాళ్ళందర్నీ పిలిచేడు. “రాత్రి అమ్మవారి గుడి దగ్గిర మీటింగుంది. మీ వాళ్ళని పదిమందినీ వెంటేసుకురండిరా.” “ఏం మీటింగేంటి?” ఒక్కనిముషం క్రితం వీరాస్వామి తమకూ చెప్పేడు. అంతకుపూర్వం కూడా అందరికీ అందరికీ తెలుసు. కాని, ఏమీ ఎరగనట్లే అడిగేరు. తమకు యిష్టం లేనట్లు విసుక్కున్నారు. కొందరు పోలీసాళ్ళ భయం కూడా వెలిబుచ్చేరు. వాళ్ళకి ఎల్లా చెప్పాలో జాన్‌కి తెలియలేదు. వోపిగ్గా చెప్పే అలవాటు ఈ ఇరవయ్యేళ్ళలోనూ పోయింది. ఎక్కడినుంచి ఎల్లా ప్రారంభించాలో కూడా తోచలేదు. కోపం వచ్చింది. “ఎదవనాయాళ్ళలారా! ఇప్పుడే గదంటరా యీరాసామి చెప్పేడు.” “సెప్పేడులే. ఇప్పుడీ తగులాటం ఎందుకని. ఏదో పని చేసుకు బతుకుతున్నాం....” పరమేశు అడ్డువేశాడు. “ఒరే పరమేశుగా” అన్నాడు జాన్. “సెప్పు.” “మీ గూడెంలో గుడిసెలెన్నిరా?” “నలబయ్యారు.” “అందులో కాపరాలెన్నిరా?” “మూడేళ్ళక్రితం తొంబయిరెండు.” “ఈ మూడేళ్ళలో ఎవరూ మనువాడనే లేదంటరా!” అన్నాడు జాన్. “సేనామంది ఆడేరు.” అడిగినదానికే చెప్పి వూరుకొంటూ వుంటే జాన్‌కి కోపం వచ్చింది. “సేనమంది అంటే లెక్కలేదంట్రా. నాకు నీ సంగతి ఎరికలేదనే” నవ్వేడు. “వో నూరు వుంటయ్యా!” ప్రతి కుటుంబానికీ ఇల్లేసుకుందికి బంజర్లో చోటు కావాలని ఏటా తాసీల్దారుకూ, కలక్టరుకూ ఆర్జీలు పెడుతూ తిరుగుతున్న వాళ్ళల్లో పరమేశు ఒకడు. ఆతడు కమ్యూనిస్టు పార్టీవాడు. తన రహస్యాలు లాగడానికి జాన్ ప్రయత్నం అని అనుమానం. జాన్ మార్క్సిస్టు. విసుక్కున్నాడు, పరమేశు.   “నే లెక్క తియ్యలేదు.” జాన్ సర్దుకొని “పోనీలే” అన్నాడు. “అంటే గుడిసెలేనా లేనివాళ్ళు ఒక్క మీ పేటలోనే ఏభయిమంది వున్నారు.” “మీ పార్టీ వాడే జోగయ్యగారిని పెట్టకపోతే దివాను ఆక్రమించిన అయిదెకరాలూ ఎన్నడో లాక్కునుండేవాళ్ళం. మాకే కాకుండా వూళ్లో సేనామందికి వుండేవి” అన్నాడు పరమేశు. వూళ్లో కమ్యూనిస్టుపార్టీ విడిపోయినాక జరిగిన అనేక కక్షసాధింపు పనులలో ఆ భూమి గొడవ ఒకటి. అందులో తమ పార్టీ పద్ధతి సరికాదేమోనని మధ్య మధ్య అనిపించినా, జనాన్ని చేర్చుకొని, బలపరచుకొనేందుకు వుంటుందనే ఆశతో తల వూపుతూ వస్తున్న జాన్ దానికి సమాధానం ఇవ్వలేదు. “ఈ గవర్నమెంటుండగా మనకి ఇళ్ళూ లేవు. వాకిళ్ళూ లేవు. మన గవర్నమెంటు రాంగనే పనులు జరుగుతాయి. పదేనేళ్ల క్రితం ఛాన్సు వచ్చింది. కాని పడనీలేదు. ఊరికే చావడం గాని. అందుకోసం వీలైన చోట్లల్లో అల్లా మనోళ్ళని కూర్చోబెట్టి చెయిజారిపోకుండా చూస్తున్నాం. ఆ రోజు రావాలి.” “వస్తూంది. నోరు తెరుచుక్కూకో....” అంటూ పరమేశు వెనక్కి తిరిగేడు. “అల్లాగ లేనోళ్ళకి బూము లివ్వాలని, పెద్దోళ్ళ అన్యాయాలు పోవాలని అన్నందుకే మనూరి కేశవరావుగారిని గవర్నంటు హింసపెట్టి చంపింది.” “మన్నీ చంపడానికా. మన కెందుకులే ఈ సబలు....” అని నలుగురూ లేచిపొయ్యేరు. ముప్పయ్యో ప్రకరణం నలుగురికీ నచ్చేలా చెప్పి సభకు తీసుకెళ్ళడానికై తాను చేసిన మొదటి ప్రయత్నం ఫలితం చూసి జాన్ స్తబ్ధుడైపోయాడు. లోపల పరమేశేదో చెప్తున్నాడు. వాడే తన ప్రయత్నం అంతా భగ్నం చేశాడనిపించింది. తాను వడ్రం, కమ్మరం నేర్పి మంచి పని వాడినిగా చేసిన పరమేశు తనకే మేకై కూర్చున్నాడు. విశ్వాస ఘాతకుడు అని తిట్టుకున్నాడు. “ఒరే పరమేశూ!” నిశ్శబ్దంగా పాకలోంచి వచ్చి పరమేశు “ఏంటి?” అన్నాడు. వాని గంభీరమైన, బలిష్ఠ విగ్రహం, ప్రశాంతమైన స్వరం విన్నాక జాన్ వానిని పోయి మరో పని చూసుకోమనలేకపోయాడు. వాడెళ్ళిపోతే తన పాక పడుకొంటుంది. అల్లాంటి పనివాడు మరొకడు దొరకడు. తగ్గేడు. “ఏం పనిరా నువ్వు చేస్తున్నది? పనివాళ్ళని నాకు ఎదురు తిప్పుతున్నావటరా?” ఆ స్వరంలో ఆరోపణకు బదులు ఆక్రందనం వినిపించింది. పరమేశు ఖచ్చితంగానే అన్నాడు. “మరి సూరయ్యగారి బండికి పోలుకర్ర వేసి రేపు తెల్లారేటేలకు ఇయ్యాలన్నారు. పట్టాలింకా కాల్చనన్నా లేదు. ఏం చేస్తా?” అంటూ రోడ్డు వేపు చూసి ఉలిక్కిపడ్డాడు. “అరుగో. సూరయ్యగారే వస్తున్నారు. ఏం చెప్తావో?” జాన్ చిరాకుపడ్డాడు. “సూరయ్యగారిదైనాక సుబ్బయ్యగారిది. ఆయెనక మరోరిది. ఇలా యేస్తూనే వుంటావు. ఈలోపున ఏ పోలీసోడో వచ్చి రమ్మంటాడు. అడిగేవోడు, పెట్టేవోడు లేకుండా చస్తాం.” సూరయ్య వస్తూనే కార్కానా చుట్టూ తిరిగి వచ్చాడు. తన పని తాబేలు నడకలో నడుస్తూందనిపించింది. “ఏమయ్యా! మన పని రేపటికి కూడా అయ్యేలా లేదే. మాట ప్రకారం చెయ్యలేకపోతున్నావు. నీకూ పనులు యెక్కువైనాయల్లే వుంది....” జాన్‌కి బదులు పరమేశు సమాధానం ఇచ్చేడు. “మీ పనే చేస్తున్నామండి. సాయంకాలానికి పట్టాలు ఎక్కించేస్తాం.” జరగవలసిన పని పట్టాలు ఎక్కించడం కానే కాదు. సూరయ్యకి తెలుసు. ఆ మాటే అన్నాడు. రాత్రి తెల్లవార్లూ చేస్తేగాని తెమలదు. “రాత్రి ఇళ్ళ నుంచి కూడు తేడానికి మనిషిని పెట్టండి. సాయంకాలం కాఫీ తాగిరాండి. సత్తెం హోటలులో చెప్పి వెడతా. రాత్రి టీ కావలసి వుంటుందేమో ఆ ఏర్పాట్లు చూడండి. ఎల్లాగయినా రేపు పొద్దుటికి....” “అవదండి....” అన్నాడు జాన్ ఖండితంగా. “అల్లాగంటే ఎల్లాగయ్యా! దీపావళి ముసురు రాకుండా అరటిగెల తోలెయ్యాలని కదా. మళ్ళీ  పైబండి చూసుకోనా....” సూరయ్య అనునయంగా మాటలాడుతుంటే జాన్ కఠినంగా చెప్పలేకపోయేడు. పరమేళు అందుకున్నాడు. “మీ పనే చేస్తున్నామండి. కాని, చెయ్యడానికేనా వ్యవధి కావాలి కదండి.” “రాత్రికి మనుష్యుల్ని పెట్టు. మంచి పనివేళా పని చెడింది. అదనం అవుతే ఇచ్చేద్దాం” అన్నాడు సూరయ్య. “రాత్రికి....” పరమేశు నీళ్లు నములుతూ జాన్ ముఖం చూసేడు. “రాత్రి మీటింగు వుందండి” అన్నాడు జాన్. “పని చెయ్యలేము. నేను పరమేశూ కూడ వుండం.” సూరయ్య మందహాసం చేసేడు. “మొన్న వూరేగింపు. ఈవేళ సభ. రేపు మరొకటి. మరి పనులెలాగయ్యా?” జాన్ దానిని హాస్యంగానే పరిగణించేడు. “ఇవే కదండి మాకు సినిమాలు,” “మొన్నటి వూరేగింపంటే అర్థం చేసుకోగలను. కేరళలో మీ పార్టీ ప్రభుత్వాన్ని కూలదోసి కమ్యూనిస్టులు అందులో దూరేరు కనుక ద్రోహం చేశారన్నారు. ఆ ద్రోహానికి అసమ్మతి అన్నారు. బాగుంది. కాని వాళ్లు ఈవేళ పెడుతున్న సభకి నువ్వు అధ్యక్షత ఏమిటి?....” “సైన్సు మేష్టారి కేశవరావుగారిని పోలీసులు చంపేశారు.” “ఔనుట పాపం” అన్నాడు, సూరయ్య సానుభూతిగా. కాని, అతని ప్రశ్న మరింత విస్తరించింది. నక్సల్‌బరీ ఉగ్రవాదుల్ని పోలీసులు చంపారు. సరే కాని, వాళ్ళచేత బండబూతులు పడే జాన్ పార్టీ, సత్యానందం పార్టీ కూడా వాళ్ళ విషయంలో పనులు మానుకొని సభలూ అవీ చెయ్యడం ఏమిటంటాడు. సూరయ్య పత్రికలు క్షుణ్ణంగా చదివే మనిషి. కమ్యూనిస్టులలోని వేరు వేరు శాఖలవారి ఆలోచనా ధోరణులలో వున్న తేడాలకన్న వాళ్ళ వాళ్ళ మధ్య వున్న ద్వేషాలు బాగా తెలిసినవాడు. జాన్ ఓర్పుగా చెప్పడానికి పూనుకొన్నాడు. “శ్రీకాకుళం కొండల్లో వాళ్ళకి అన్యాయాలు జరిగితేనూ, ఖమ్మం జిల్లాలో రైతులకి లేకుండా భూములు పెద్దోళ్ళు కాజేస్తేనూ కేశవరావుగారికి ఏం పట్టిందండీ!” సూరయ్య కేశవరావు ‘బుద్ధిహీనత’కు సానుభూతి తెలిపేడు. ‘బాగా చెప్పేవు’ అన్నాడు. “చదువుకుంటున్నాడు. మంచిగా చదువుతున్నాడట కూడా. కమ్మవారూ కాదూ. ఒక ‘ల’ కారం దాకా కట్నం యిచ్చి లక్షణమైన పిల్లను ఇస్తామని సంబంధాలు వస్తున్నాయట కూడానూ. అంతా పాడుచేసుకొన్నాడు. చివరికి ప్రాణం కూడా పోగొట్టుకున్నాడు.” తాను ప్రారంభించిన సంభాషణ ఎదురు తిరిగినట్లనిపించి జాన్‌కు విసుగు, కోపం వచ్చేయి. “అదే జబ్బండి మాది కూడా. తిని కూర్చోలేక పెట్టుకొనే బాడఖా వ్యవహారాలండి” అంటూ వెటకారం చేసి, మూతి ముడుచుకున్నాడు. ముప్ఫయ్యొకటో ప్రకరణం రాత్రి తొమ్మిది గంటలకు పాలెంలో అమ్మవారి గుడి దగ్గర బహిరంగ సభకు జాన్ అధ్యక్షుడని మెగాఫోన్‌లో వీరాస్వామి చెపుతూంటే విన్న సుందరరావు మొదట నమ్మలేదు. తప్పు విన్నాననుకొన్నాడు. పనిమనిషి వీధిలోంచి వస్తూంటే అడిగాడు. తాను విన్నదానిని ఆమె ధృవపరచింది. ఆ మాట వినగానే సుందరరావుకి వొళ్ళెరగని కోపం వచ్చింది. కొడుకుని పిలిచేడు. వెంటనే జాన్ వద్దకు ఎవరినేనా పంపి రప్పించమన్నాడు. వీరాస్వామి రివిజనిస్టు పార్టీవాడు. వాళ్ళ పార్టీ తరపున నిన్న సత్యానందం వచ్చి నిర్బంధ వ్యతిరేక దినం జరుపుతున్నాం రమ్మంటే తమ పార్టీ నిరాకరించింది. ఇప్పుడు వాళ్ళు మీటింగు పెడితే జాన్ అధ్యక్షుడా? క్రమశిక్షణ లేకుండా ఇలా ప్రతి ఒక్కరూ తలో పెత్తనం చేస్తే పార్టీ ఏమంటుంది? రాజకీయ పార్టీ కప్పలతక్కెడా, పీతల మంగలమూ అయితే సార్లపడిందే. “జాన్‌ని పిలుచుకు రమ్మను.” సుందరరావు వుద్వేగాన్ని చల్లార్చడానికి రంగనాయకులు ప్రయత్నించాడు. “మీకున్న బ్లడ్‌ప్రెషర్‌కి అలా వుద్రేక పడడం మంచిది కాదు. కొంచెం నెమ్మదించండి.” కొడుకు సలహాతో సుందరరావు అగ్గిపుంతే అయిపోయాడు. రాజకీయ సమస్యను ఆరోగ్యం, జబ్బు పేరున దాటించెయ్యమంటున్నట్లు తోచి మరింత చికాకుపడ్డాడు. ఈమధ్య  రంగనాయకులు ధోరణిలో మెతకదనం ఛాయలు అధికాధికంగా కనిపిస్తున్నాయనిపించింది. ఇదొకటి. కాని వైద్యుడుగా అతని సలహాను పాటించవలసిన అవసరం వుందని ఈ మధ్య, ముఖ్యంగా మొన్నటి నుంచి బాగా తోస్తూంది. కష్టం మీద నిగ్రహించుకొని శాంతపడేందుకు ప్రయత్నించేడు. “మన శరీరం గట్టితనం, వోటితనం పట్టి దేశ రాజకీయాలు నడవ్వు” అని తన ఆవేశాన్ని సమర్ధించుకొనేందుకు స్వల్ప ప్రయత్నం చేశాడు. “మన శరీరానికి లాగే, రాజకీయాలకు కూడా ఆవేశాలూ, ఉద్రేకాలూ మంచివి కావండి” అన్నాడు రంగనాయకులు భయం భయంగానే. సుందరరావు అతని వంక చురుక్కుమనేలా చూసేడు. “ఎదుటివాడిని జోకొట్టడం, శాంతం పేరున చేతులు నలపడం మార్క్సిజానికి సరిపడదు. క్రమశిక్షణను భంగపరచి, పార్టీని ధ్వంసం చేస్తూంటే వూరుకోమనడం వుందే, జైలు భయం, లాఠీ భయం చూపించి విప్లవ చైతన్యాన్ని నీళ్లు కార్చడంవంటిదే. నీలో రివిజనిస్టు భావాలు తలఎత్తుతున్నాయి, జాగ్రత్త....” ఒక చిన్న మాట అడ్డం వేసినా తండ్రి రెచ్చిపోతాడనే భయంతో రంగనాయకులు చల్లగా వూరుకున్నాడు. “నేను పేట వెడుతున్నా, దారిలోనే గనక జాన్‌తో చెప్పి పంపిస్తాలెండి.” సుందరరావుకు కొడుకు మీద నమ్మకం తగ్గింది. “వద్దు. నే వెడతాలే.” ఆయన ఆరోగ్యం విషయమై భయం కలిగినా రంగనాయకులు ఏమీ అనలేకపోయాడు. ఓ నిముషం వుండి సుందరరావే అన్నాడు.  “ఆస్తులు, ఆరోగ్యాలు పోయి, అనేక అనర్ఘరత్నాలను పోగొట్టుకొని అనంత త్యాగాలు చేసింది, పార్టీని గబ్బు పట్టిస్తూంటే చూస్తూ కూర్చోడానికి కాదు. ‘మా పార్టీలో మెతకమనుషుల కోసం తడుములాడకండి. ఆ ప్రయత్నంలో మరో శతాబ్దం ఆగవలసి వస్తుంది’ అన్నారు, మన నాయకులు కలకత్తాలో. అది మన సవాలు. మన ప్రతిజ్ఞ. మన లక్ష్యం. గుర్తుంచుకో.” ముప్ఫయిరెండో ప్రకరణం దూరాన సుందరరావును చూడగానే జాన్ భయపడ్డాడు. రంగనాయకులు ఇప్పుడే చెప్పి వెళ్లాడు. డాక్టరయితే తాను అధ్యక్షతకు వొప్పుకోవడం మంచిదే అనుకుంటానన్నాడు. కాని ముసలాయనకది నచ్చలేదని ముందే హెచ్చరిక చేశాడు. ఆయన మాట విన్నాక ధైర్యమే కలిగింది. “ఇది ఒకరింటి పెళ్ళి కాదు. ప్రజాకార్యం. ఇందులో పాల్గొనడం పార్టీ లక్ష్యాలకు విరుద్ధం కాదు” అన్నాడు తాను. కాని సుందరరావు ముందు ఆ విశ్వాసం నిలబడలేకపోయింది. ఆయన చెప్పింది ఏదీ ప్రత్యాఖ్యానం చేయవలసినట్లు కనబడదు. కాని.... దేశానికి మార్క్సిజమే శరణ్యం! దానికి క్రమశిక్షణ గల మార్క్సిస్టు పార్టీ కావాలి. వరుసగా తన విశ్వాసాలనే సుందరరావు ఏకరువు పెడుతున్నాడు. కాదనవలసిన పని కనబడ్డం లేదు. “ప్రస్తుత రాజ్యాంగం ద్వారా సోషలిజాన్ని నిర్మించే అవకాశం వుంది, అంటారు రివిజనిస్టులు....” అంటూనే ‘ఏం ఔనా?’ అని గద్దించేడు సుందరరావు. “చిత్తం.” “మహాసముద్రంలాంటి మన దేశ రైతాంగం మధ్య అక్కడా అక్కడా చెదురు మదురుగా కనిపించే రైతాంగ, గిరిజన ప్రజల మిలిటెంటు పోరాటాలు చిన్న చీమలంత ద్వీపాలలా వున్నాయి. వాటిని చూపించి, పరిపక్వమైన జాతీయ విముక్తి యుద్ధాలంటూ అతిశయోక్తులతో కూడిన నినాదాలు ఇస్తున్నారు. వానికి అనుకూలంగా సిద్ధాంతాలు వల్లె వేస్తున్నారు, ఉగ్రవాదులు. “మన పంధా ఈ రెండు ధోరణులకీ చేరదు. ఒప్పుకొంటావా?” అన్నాడు. ఒప్పుకోకపోవలసిన అవసరం కనబడలేదు, జాన్‌కి. “ఎడా పెడా వస్తున్న ఈ సంఘర్షణలలో మనం మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలంటావా?” అన్నది సుందరరావు తరువాతి ప్రశ్న. “తప్పకుండా” అన్నాడు జాన్ ధైర్యంగా. టక్కున సుందరరావు ప్రశ్న వేశాడు. “మరి ఇప్పుడు నువ్వు చేసిన పనేమిటి!” అదే అతనికి అర్థం కాలేదు. “ఇది రివిజనిస్టులు ఏర్పాటు చేస్తున్న సభ. దానికి నువ్వు అధ్యక్షుడివి. అందులో వాళ్లు ఏమి మాట్లాడుతారో. దానికి నీవు బాధ్యత వహిస్తావా? ఏమీ మాట్లాడకపోయినా వాళ్ళ సభలో మనం మాట్లాడడం ఏమిటి? నీకంత నాయకత్వం కావాలంటే సభ ఏర్పాటు, పార్టీ తరఫున, నువ్వే....” నాయకత్వం మాట వచ్చేసరికి జాన్ చిన్నపుచ్చుకొన్నాడు. “నాయకత్వం కోసమే ఇది చేశానంటారా! మీరు కూడా.” “నేనడం కాదయ్యా! వూళ్లోవాళ్ళు, ప్రజలు అడిగారు. నిన్న వచ్చి సత్యానందం అడుగుతే నువ్వు ససేమిరా అన్నావు. ఈవేళ జాన్ ఒప్పుకున్నాడు.-అంటున్నారు.” “ఆయన మిమ్మల్ని అడిగేరనీ, మీరు కాదన్నారనీ వీరాస్వామి చెప్పలేదు.” “ఎందుకు చెప్తాడూ? మనం ఇంత ఇలాగున్నామని, ఎవరి మగ్గానికి వారే సేనాపతులమని గ్రహించేశారు.” జాన్ ఆలోచిస్తున్నాడు. చటుక్కున తోచింది. “అతడేనా నన్ను మార్క్సిస్టు పార్టీ తరఫున రమ్మనలేదండి. పోలీసు దౌర్జన్యాలకి గురయిన వాడినిగా....” “నీవు పార్టీ సభ్యుడవు. పార్టీ జీవితానికి భిన్నమైన జీవితం వుందా నీకు? ఇదెప్పటి నుంచి?....” ఏమనాలో జాన్‌కి తెలియలేదు. తన ఆలోచనల ప్రకారం వేరే జీవితం లేదు. కాని.... “పార్టీ శ్రద్ధ తీసుకోవలసిన కొత్త పరిస్థితి తెచ్చేవు. దీనిని పార్టీలో చర్చించవలసిందే.” జాన్ హడలిపోయేడు. సుందరరావే అడిగేడు. “ఏం చెయ్యదలిచేవు యిప్పుడు?” “చెప్పండి” అన్నాడు, జాన్ నీరసంగా. “మనది బూర్జువా, పెటీబూర్జువా పార్టీల వంటిది కాదు. విమర్శ, ఆత్మ విమర్శ మన పార్టీలో క్రమశిక్షణకి మూలం.” జాన్ చటుక్కున ఒప్పుకొన్నాడు. “నేను చేసింది తప్పే.” “అందరూ చేస్తారు తప్పులు. తప్పు చేయని వారెవరు?” అన్నాడు సుందరరావు వుదారంగా. రంగనాయకులు కూడా తప్పు ధోరణిలోనే వున్నాడని చెప్పడమో, మానడమో అర్థం కాలేదు. చెప్పకూడదనుకొన్నాడు జాన్. “తప్పు తెలుసుకోడం....” జాన్ ముఖం చిట్లించేడు. తాను మెత్తబడితే సవారీ ప్రారంభిస్తున్నాడనిపించింది. సుందరరావు గ్రహించేడు, తాను అతి చేస్తున్నానేమోనని. “అయిందేదో అయింది. సభకి అధ్యక్షుడివిగా వెళ్ళు.” “మరి!” “మన పార్టీ ఆధ్వర్యాన జరిగినట్లే సభ వుండాలి. మనవాళ్ళే మాట్లాడాలి.” అది సాధ్యమా అని ఆలోచిస్తూంటే సుందరరావు ఖండితం చేసి వెనుతిరిగేడు. “జ్ఞాపకం వుంచుకో, రేపు పార్టీకి రిపోర్టు తయారు చెయ్యి.” ముప్ఫయిమూడో ప్రకరణం బళ్ళగేటులో నిలబడి వున్న సుశీలను చూసి రంగనాయకులు చటుక్కున కారు ఆపేడు. పక్కగా వచ్చిన కారును చూసి వులికిపడి వెనక అడుగు వేసిన సుశీల వెంటనే వినిపించిన పలకరింపు విని తలయెత్తి చూసింది. “ఊరినుంచి ఎప్పుడొచ్చేవు?” రంగనాయకులు పలకరిస్తూనే కారు దిగివచ్చేడు. చూపులు, మాటలు నిలిచిపోయిన రెండేళ్ళ అనంతరం మగడు వచ్చి పలకరిస్తూంటే సుశీల నిస్తబ్ధురాలయింది. అటువంటి ఘట్టం తటస్థపడితే అభిమానపడి మాట్లాడక వూరుకోడం సరికాదనీ, ముఖ పరిచయంగల వారితో వ్యవహరించినట్లు మసలుకోడమే సబబు అనీ అదివరకే ఆమె అనేకమార్లు అనుకొంది. అల్లాంటి ఘట్టమే వస్తే తన ముఖ కవళికలను ఏలా అదుపులో పెట్టుకోవాలో కూడా ఒద్దికలు వేసుకొంది. తీరాచేసి అటువంటి ఘట్టం నిజంగా తటస్థపడేసరికి దిగ్భ్రమ కలిగినట్టయింది. వెంటనే మాట్లాడలేకపోయింది. అది సిగ్గు కాదు. అభిమానం కాదు. కోపం కాదు. చిత్రమైన మనస్థితి. గమ్మున మాట రాలేదు. పెద్దమనిషి పలకరిస్తూంటే సమాధానం యివ్వకపోవడం మాత్రం మర్యాదా? సర్దుకొంది. “రెండురోజులయింది.” ఒకమాట వచ్చేక మరి కష్టం కనిపించలేదు. మనస్సు నిలదొక్కుకుంది. “ఎవరూ చెప్పలేదే” అనుకొన్నాడు, రంగనాయకులు గట్టిగానే. ఎవరు చెప్తారని ఆశించేడో? సుశీల ఏమీ అనలేదు. అతని ముఖంకేసి వోమారు చూసి తల తిప్పుకొంది. ఆ చూపులో మనిషి నలిగినట్లు కనిపించేడు. ఎందుచేతనో? ఆరోగ్యంగా వున్నావా అని అడగడం ఉచితమా, కాదాయని తటపటాయించింది. కాని అడగలేదు. అతడే ప్రశ్నించేడు. “ఎక్కడికన్నా వెడుతున్నావా? ఇంటికేనా?” “ఇక్కడికే వచ్చాను.” “పని అయిందా?” ఆమె ఏమీ చెప్పలేదు. అతడే ఆహ్వానించేడు. “రా. పోదాం.” సుశీలకు ఏం చెయ్యాలో తోచలేదు. కదలలేదు. ఏమీ అననూలేదు. రంగనాయకులు కారు తలుపు తీసిపట్టుకొని మరల పిలిచేడు. “సుశీలా.” “మీరు వెళ్ళిరండి. నేను యింకా ఏవేవో తీసుకోవాలి.” “ఇందులో వెడుతూ తీసుకోకూడదా?” “యాదగిరి రిక్షా తీసుకొచ్చా. వాడు హోమియో స్టోర్సుకెళ్ళేడు. రాంగనే మిగతాపనులు చూసుకొని నెమ్మదిగా వస్తాం.” “అన్నీ పూర్తిచేసుకొనే వెడదాం. నాకూ ఏం తొందరలేదు.” చర్చ పొడిగించడం మర్యాదగా తోచలేదు. సుశీల చటుక్కున వచ్చి కారులో కూర్చుంది. కారు హోమియో స్టోర్సు ముందు ఆగింది. షాపు యజమాని రంగనాయకులును చూడగానే మెట్లు దిగి వచ్చి స్వాగతం యిచ్చేడు. “పెట్టెలలో సర్దుతున్నారు. ఒక్క పదినిముషాలు” అన్నాడు, క్షమార్పణ చెప్పుకొంటున్నట్లు, సుశీలతో. ఆమె రంగనాయకులు మొగం వేపు చూసింది. “మీరు వెళ్ళండి. నేను అవి తెచ్చుకొని వస్తాను. మీరు అనవసరంగా పని పాడు చేసుకోడం ఎందుకు?” “ఫర్వాలేదు. తీసుకొనే వెడదాం.” షాపువాడు లోపలికి ఆహ్వానించేడు. “లోపలికి దయచేయండి.” ఇద్దరినీ కూర్చోబెట్టి కాఫీలు తెప్పించేడు. కెల్లీలు తెప్పించేడు. “డాక్టర్ సుశీల మా వైద్య పద్ధతికి ‘కన్వర్టు అయ్యారు....” అన్నాడు అతడు ఆనందంతో. ఆతడు రంగనాయకుల వైద్యపద్ధతి నెరుగును. అల్లోపతి వైద్యం ఒక్కటే శాస్త్రీయం అని అతని భావం. అందులోనూ చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలనే అభిప్రాయం. అందుచేత అయన పెద్దమోతాదులతో, మంచి బలమైన మందులే వాడతారు. హోమియో స్టోర్సు యజమాని భావం గ్రహించి రంగనాయకులు చిరునవ్వు నవ్వేడు. ఏమీ అనలేదు. అతడు వాదన వేసుకోకుండా వూరుకోడం సుశీలకు ఆశ్చర్యం వేసింది. “మమ్మల్ని కొంచెం త్వరగా పంపేస్తారా?” అంది. షాపు యజమాని ‘ఇదిగో’ అంటూ పనివాళ్ళని తొందరపెట్టడానికి లోనికి వెళ్ళేడు. ఇంతకాలం తర్వాత సంభాషణ ఎల్లా ప్రారంభించాలో యిద్దరికీ అర్థం కావడం లేదు. ఇంతలో పనివాని చేత రెండు మూడు మందుల పెట్టెలూ, ఒక పుస్తకాల కట్టా పట్టించుకు వెళ్ళి షాపు యజమాని కారులో పెట్టించేడు. సుశీల లేచింది. “మరి సెలవా?” వెడదామని తనతో అనలేదని రంగనాయకులు గమనించేడు. అతడు ఆరేడేళ్ళనాటి తమ కొత్త కాపురపు రోజులతో ఆమె ప్రస్తుత పద్ధతులను అడుగడుగునా పోల్చుకొంటున్నాడు. తమ మధ్య ఎంత దూరం వుందో కొలుచుకొంటున్నాడు. “నా మూలంగా మీకు ఆలస్యం అయిపోతూంది.” మర్యాదలు, క్షమార్పణలే గాని, ఆ మాటల్లో సాన్నిహిత్యం కనబడలేదు. రంగనాయకులు లేచేడు. కారులో కూర్చున్నాక రంగనాయకులు మాట కలపడానికి ప్రయత్నించేడు. ఆమె చాలవానికి ఏకాక్షర సమాధానాలనిస్తూంటే, అతడు ఆ సంభాషణ ఎంతోసేపు సాగించలేకపోయాడు. వూరుకొన్నాడు. కారు పేట ఊరు దాటి అగ్రహారం రోడ్డుకి తిరిగింది. ఆమె ఏ దుకాణం వద్దా కారు ఆపమనలేదు. “ఏవో కొనాలనుకొన్నావనుకొంటాను.” “తరవాత చూసుకొంటాలెండి.” “అదేం.” “అదంత ముఖ్యమూ కాదు. దానికంత తొందరా లేదు.” ఆమె సందేహం అతనికి అర్థం అయిందనిపించింది. హోమియో షాపులో ఆమె పర్సు తీస్తూంటే తాను యిచ్చేసేడు మూడువందల వరకూ. “ఆ డబ్బు కూడా నేనే యిస్తానంటానేమోననా? ఇంక నా దగ్గర లేదు కూడాలే.” సుశీల చిరునవ్వు నవ్వింది. ఆమె కొనుక్కోదలచింది యీ వూళ్ళో కాదు. బండార్లంకలో. అది తమరు వెడుతున్న దారిలో లేదు. వెనక్కి వెళ్లాలి. అదే చెప్పింది. “నాలుగు నేత చీరలు తీసుకొందామని బండార్లంక బయలుదేరేను.” “చెప్పేవు కాదేం?” ఆతడు కారు తిప్పుతూంటే ఆమె వారించింది. “మీకెందుకీ అనవసర శ్రమ. తరవాత చూసుకొంటాలెండి.” ఆమె సాధ్యమైనంత దూరంగా వుండాలని చూస్తున్నట్లనిపించి కష్టం తోచింది. “నీతో రావడం అనవసరం అంటావు.” “అవసరం అనవసరం అనేవి మన పనుల ప్రాముఖ్యాన్ని పట్టే గాని ఎదటి మనిషిని పట్టీ, వాళ్లతో వుండే బాంధవ్యం పట్టీ కాదు గదా.” రంగనాయకులు తెల్లబోయేడు. తాను రాజకీయాల విషయంతో చెప్పిన మాటల్నే ఆమె యిప్పుడు నిత్య జీవితంలో పెట్టింది. అంతే తప్ప అవే మాటలు. తన మాటను తనకే వప్పచెప్పినట్లనిపించింది. ముప్ఫయినాలుగో ప్రకరణం బట్టలు కొనడానికి తమలాగే వచ్చిన జనాన్ని చూశాకగాని, రంగనాయకులుకు దీపావళి దగ్గిరలో వుందన్న మాట గుర్తు రాలేదు. “రెండు చీరలు నా కోసం కూడా ఎంపిక చేసిపెట్టు.” “చీరల ఎన్నిక వ్యక్తి అభిరుచి పట్టి వుంటుంది. ఒకరికి బాగున్నది మరొకరికి నచ్చకపోవచ్చు. కారుంది కదా. ఓ పదినిముషాల పని. ఎవరికో వారినే తీసుకొచ్చి చూపించండి.” అక్కడికక్కడే నిరాకరణకు సిద్ధపడలేక రంగనాయకులు అవి ఎవరికో చెప్పలేకపోయేడు. ఆమె ప్రక్కనే నిలబడి ఆమె ఎంపిక, తన పూర్వానుభవం జతపరచి తనకు కావలసినవి వర్తకుడితోనే చెప్పి పేకెట్ చేయించాడు. అవి ఎవరికనన్నా తెలుసుకోగోరుతుందేమోనని ఎదురు చూసేడు. వెనకటి మాదిరిగా బట్టల యెన్నికలో తన సలహా కోరుతుందేమోనని చూసేడు. అలా అడిగితే ఆమె తన పనులయందూ, అభిరుచులయందూ ఆసక్తి చూపుతున్నదనుకోవచ్చు. వివాహం అయిన కొత్తలో ఆమె తాను కట్టే చీరలు, తొడిగే జాకెట్లు, చేసుకొనే అలంకారాలు అతని అభిరుచికి సరిపడేలా వుండేటందుకు యెంతో శ్రద్ధ చూపేది. తన బట్టల ఎంపికను మీద పడేస్తుంటే ఒక విధమయిన తృప్తీ, ఆనందమూ కలిగేవి. ఆ ఎంపిక బాగుంది అంటే కొండెక్కినట్లుండేది. అవన్నీ జ్ఞాపకం వచ్చాయి. సుశీల ఏమీ అడగలేదు. రంగనాయకులు ఒక్క నిట్టూర్పు విడిచేడు. షాపువాడు అందించిన పేకెట్టు కారులో పడేసుకొన్నాడు. ఇంటివద్ద కారు ఆగడం, అందులోంచి రంగనాయకులు ముందు దగి వచ్చి తలుపు తీస్తూంటే కూతురు దిగడం చూసి, సత్యవతమ్మ మహదానందపడిపోయింది. గబగబ లోపలినుంచే పలకరించింది. “రా, నాయనా రా. లోపలికి రా. ఇదెక్కడ కనిపించింది?....” అని అడుగుతూనే అతనిని లోనికి తీసుకురావలసిన పనిని కూతురుకు పురమాయించింది. తాను వారికి ఆతిధ్యం సమకూర్చే హడావిడిలో లోనికి వెళ్ళిపోయింది. “రాండి, లోపలికి” అని సుశీల తల్లి ఆదేశాన్ని అమలు జరిపింది. ఇద్దరూ సావట్లోకి నడిచారు.  “కూర్చోండి” అని సోఫా చూపింది. “నారాయణతో చెప్పి పెట్టెలు లోపల పెట్టించేస్తా. నా మూలంగా మీకు చాలా ఆలస్యం అయిపోయి వుంటుంది.” ఈలోపున సత్యవతమ్మ కాఫీలు తయారుచేసి కూతురుని పిలిచింది. అతనిని సావట్లోనే కూర్చోబెట్టినందుకు కోప్పడింది. “నీకింకెప్పుడు బుద్ధి వస్తుందే?” అని విచారపడింది. “నాకు వచ్చిందమ్మా బుద్ధి, ఇదివరకే” అంది సుశీల నిర్లక్ష్యంగా. ఆమె కాఫీ తీసుకెళ్ళి యిచ్చింది. నారాయణ చేతికిచ్చి కారులో సామాన్లు పైకి పంపేసి, రంగనాయకులు అప్పుడే లోనికి వస్తున్నాడు. కాఫీ త్రాగుతూ అతడు ప్రశ్నించేడు. “సెలవు ఎన్నాళ్ళు పెట్టేవు?” “పదో తేదీన వెళ్ళిపోతా.” తాను ప్రశ్నించడం, ఆమె సమాధానం ఇవ్వడమే గాని, ఆమె వైపునుంచి మాట సాగడం లేదు. రంగనాయకులు యెంతోసేపు అలా సాగించలేకపోయేడు. కప్పు బల్ల మీద పెట్టి లేచేడు. “వెళ్ళి వస్తా.”  “మీరు చేసిన సాయానికి చాలా థేంక్సు.” కనీసం ఎప్పుడన్నా కనిపిస్తూండమని మాటమాత్రంగా కూడా అనలేదు. తానే అన్నాడు. “మళ్ళీ కలుద్దాం.” సుశీల మరోమారు గుమ్మంలోంచి ‘థేంక్స్’ చెప్పిందేగాని అంతకన్నా ఏమీ అనలేదు. అతడు వెళ్ళిపోయేక తన గదిలో పెట్టిన సామానులు చూసుకొన్నప్పుడు రంగనాయకులు తాను ఎవరి కోసమో అని కొన్న చీరల పాకెట్టు కూడా వానితోబాటుగానే వుంది. నారాయణను పిలిచింది. “వారే అన్నీ తీసి యిచ్చేరండి.” అతడు అవి బేరం ఆడినప్పుడే ఆమెకు అనుమానం వుంది. అది నిజం కావడం చిరాకనిపించింది. “పొరపాటున ఇచ్చి వుంటారు. పట్టుకుపోయి యిచ్చెయ్యి.” సుశీల ఆ చీరల పాకెట్టుతోబాటు మందుల కొట్టులో అతడిచ్చిన మూడు వందలూ కవరులో పెట్టి పంపేసింది. “డాక్టరుగారు ఇంట్లోలేక ఎక్కడికేనా వెళితే పెద్దవారు ఎవరుంటే వారికి ఇచ్చేసిరా.” నారాయణ వెళ్ళేసరికి రంగనాయకులు ఇంట్లోనే వున్నాడు. అతడు ఒక్కడే కాదు. సుందరరావు వున్నాడు. ఆయన భార్య వుంది. ఆ వివరం చెప్పినప్పుడు సుశీల మనస్సు తృప్తిపడింది. “సరిలే.” ముప్ఫయ్యయిదో ప్రకరణం వీరాస్వామి ఎంతో ఆదుర్దాగా, రోజుకుంటూ వచ్చి, జాన్‌కు సుందరరావు ఇచ్చిన ఆదేశాలను సత్యానందం చెవిని వేశాడు. “మీటింగు ఏర్పాట్లు చేశాం. ప్రచారం చేస్తున్నాం. అన్నీచేసి, జనాన్ని పోగుచేసి వారి చేతుల్లో పెడతామేమోనండి.” జాన్ కార్కానాలో పనిచేసే పరమేశు కబురు పెట్టేడు. కనక అది సరయిన సమాచారమే అయి వుంటుంది. ఆ వార్త వినగానే సత్యానందానికి మొదట కలిగిన ఆవేశంలో – “జాన్‌నే సభలోకి రానివ్వకపోతే ఏం చేస్తాడేం?” అనేశాడు. మరుక్షణంలో సర్దుకొన్నాడు. “మనవాళ్లని మాట్లాడనివ్వరూ? ఒప్పుకోకండి. పదిమంది చేరి తప్పదు అంటే ఏం చేస్తాడేం?” అన్నాడు. వీరాస్వామి విచారంగా అన్నాడు. “కొట్లాటదాకా వస్తుందండి. మనం దెబ్బలు తింటామని కాదండి. కాని, సభ చెడిపోతుంది.” సత్యానందం చాలా సేపు ఆలోచించేడు. గత అనుభవంతో నిజమే అనుకొన్నాడు. “నిజమే వీరాస్వామీ. అల్లా జరగకూడదు. ప్రభుత్వ దురంతాలకి వ్యతిరేకంగా కూడా మనం నలుగురం ఒక్క మాటమీద పనిచేయలేక పోయామంటే మన వుద్యమానికే పెద్ద దెబ్బ.” అయితే సత్యానందం ఇచ్చిన సలహా మాత్రం వీరాస్వామికి నచ్చలేదు. ఇంతవరకూ చేసినకన్న గట్టి ప్రచారం చెయ్యడం, సభను విజయవంతం చెయ్యడం, అది ముఖ్యం-అన్న సలహాను వీరాస్వామి వ్యతిరేకించేడు. “మన పార్టీకింక గౌరవం ఏం వుంటుందండి? మనల్ని మాట్లాడనివ్వకపోతే మనం వేరే సభ పెట్టుకొందాం.” పార్టీకి గౌరవం, బలం ఎల్లా కలుగుతుందనే విషయమై సత్యానందం కొన్ని ఏళ్ళుగా ఆలోచిస్తున్నాడు. పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా విద్యావంతులైన యువకులలోకీ, విద్యార్థులలోకి పూర్వంలోలాగ ప్రవేశించడం లేదు. నేటి యువకులు సులువుగా బతికెయ్యడం మీద ఆసక్తి చూపుతున్నారు గాని, సంఘం గురించీ, సమష్టి గురించీ ఆలోచించే దృష్టి వారికి లోపించిందనే వాదనలను ఉగ్రవాద ఉద్యమం తోసేస్తూంది. లోపం ప్రజలలో లేదు. వారి విషయంలో పార్టీలు తీసుకొనే దృక్పథంలో వుంది గాని-అని అతడు ఆలోచిస్తున్నాడు. ఆ ధోరణిలోనే వీరాస్వామిని నెమ్మదిగా దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నించేడు. ఈ సభల వుద్దేశం ఏమిటి? ప్రభుత్వం నిర్బంధ చర్యల నుపయోగిస్తూందంటే దేశంలో శాంతి – భద్రతలను అది తన వర్గానికైనా కల్పించుకోదా? నేరస్థుల్ని విచారణ చేసి శిక్షలు వేస్తే మనం తృప్తి పడతామా? ఉగ్రవాదుల దేశభక్తీ, ప్రజాసేవాసక్తీ, స్వార్దత్యాగమూ ఒక మూల ప్రభుత్వవర్గాల ద్వేషాన్నేగాని, ప్రజాభిమానాన్ని సంపాదించుకోవద్దా? అనేక ప్రశ్నలు. “వీటన్నింటినీ గురించి మన విశాలాంధ్ర రాయడం లేదాండి మరి?” “వారి ప్రజాశక్తీ వ్రాస్తూందిగా.” “మన పార్టీ తీర్మానాలు చేసింది.” “తీర్మానాలు చేయడం, ప్రకటనలు ఇవ్వడంలో రెండుపక్షాల నాయకులూ కూడా పోటాపోటీలు పడుతున్నారులే! వాటిని మనం అమలు జరపవద్దూ.” ఆతని అభిప్రాయం వీరాస్వామికి అర్థం కాలేదు. “ఇల్లా మనమే మన పనికి బందాలు వేసుకొంటూంటే....” జాన్‌ను సభాధ్యక్షుడుగా పిలవమన్న సత్యానందం సలహాకు అది అధిక్షేపం. దానిని అతడు పట్టించుకోలేదు. “దేశమూ, ప్రజలూకన్న పార్టీకి భిన్నమైన ప్రయోజనాలు లేవు. వాటిని రెంటినీ బలపరచడంలోనే పార్టీ బలపడుతుంది. మన పనులు ఆ లక్ష్యానికి తోడ్పడకపోతే పార్టీ బలపడదు. క్షీణిస్తుంది.” “పార్టీ బలంగా లేకపోతే ప్రజలకీ దేశానికీ ఏం సాయపడుతుందండి? పైగా విప్లవం యొక్క ప్రస్తుత దశలో మన పార్టీ....” “....నాయకత్వం వహించడం చరిత్ర నిర్దిష్టం కూడాను” అన్నాడు సత్యానందం అర్ధోక్తిలో. మోనం వహించడం ద్వారా వీరాస్వామి ఆ మాటను ఆమోదించేడు. సత్యానందం ఒక్క క్షణం ఆగి తన అభిప్రాయాన్ని విస్తరించాడు. “విత్తు ముందా, చెట్టు ముందా లాంటి సమస్య కాదయ్యా యిది. పార్టీని బలపరచుకొని ప్రజాసేవ ప్రారంభిస్తామనడం పాలకొల్లు గోపురం ఎత్తాలంటే ముందు ఆరునెల్లు బలియపెట్టమన్నట్లే వుంటుంది.” పార్టీని గురించి ఆ విధంగా ఆలోచించడం వీరాస్వామికి ఒప్పదు. కాని, సత్యానందానికి మార్క్సిజం మీదగల అనంత విశ్వాసం ఎరుగును. అతన్ని పార్టీ వ్యతిరేకి అనలేడు. తమవాడు. తమ యూనిటుకు కార్యదర్శి కూడా. ఇంక పైకి అనకపోయినా, ఒకప్పుడు అతడు గాంధేయవాది అనేది గుర్తు చేసుకొని తృప్తిపడుతుంటాడు. “మీ సలహా ఏమిటండి?” “జానే అధ్యక్షుడు, నిర్బంధ వ్యతిరేక సభ. దానిలో ఎవరు ప్రసంగించినా దానిని జయప్రదం చేయడం మన లక్ష్యం కావాలి.” “మనని మాట్లాడనియ్యకపోయినా?” “మనం కూడా మాట్లాడి తీరాలనడం, జానో మరొకరో వద్దనడం సభలో గలభా జరగడం అవసరమా?” “మన పార్టీని తిట్టినానా?” “ఆ తిట్ల వలన వాళ్లకి లాభం వుంటుందా, వుండదా అన్నది చూసుకోవలసింది వాళ్ళు. ప్రజల్లో మనం చేసే పనినిపట్టి....” వీరాస్వామి ఒప్పుకోలేదు. “….తిడితే చీరి ఎండెయ్యాలంటా.” సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. దీర్ఘకాల ప్రయోజనాలనూ, విస్తృత ప్రయోజనాలనూ గురించి ఆలోచించాలనడం గాంధేయవాదం, రివిజనిజం అని పేరుపెట్టే దశలో సత్యానందం నొక్కి చెప్పడానికి జంకేడు. “ఇదిగో వీరాస్వామి, ఇక్కడ సభను జరపవలసిన బాధ్యతని నువ్వు తీసుకొన్నావు. నేను పోతారం పల్లెలో వుంటాను కదా, మన లక్ష్యం చెడకుండా ఎలాచేస్తే బాగుంటుందో నువ్వు, పరమేశు, మిగతా మీ పేట వాళ్ళు ఆలోచించి చెయ్యండి.” సత్యానందం తన బాధ్యత నుంచి తప్పుకుంటున్నాడనిపించింది. “తమరే ఇక్కడి సభ సంగతి చూడండి. పోతారం సభకు మేమవరమో వెడతాము.” “అది మాత్రం ఏం సబబు?” వీరాస్వామి గడుస్తనంగా సమాధానం ఇచ్చేడు. “మీరు చెప్పిందే కద. అనుకున్నదానికి అభ్యంతరం లేకుండా పని జరగాలి.” సత్యానందం నవ్వేడు. “సహాయ నిరాకరణమా?” ముప్ఫయ్యారో ప్రకరణం సందెవేళకి వీరాస్వామి రెండెడ్ల బండి ఒకటి తోలుకువచ్చి జాన్ కొలిమి పాక వద్ద వదిలేడు. దాని నొగలకి ఇరువేపులా ఎర్రజెండాలు కట్టి వున్నాయి. “త్వరగా తయారవు, మామా! పదిమందిమీ కలిసి వూరేగింపుగా వెడదాం సభకి.” “బండి ఎందుకురా, నడిచొస్తా.” “ఆ కాళ్లతో తూలిపోతూ నువ్వు నడవకేం. చలి తిరిగేక కాళ్లు పట్టేస్తున్నాయన్నావు కూడాను.” అన్నాడు వీరాస్వామి. జాన్‌కు తన స్థితి తెలుసు. అసలే అంతంతగా వున్న నడక. వో వర్షం కురిసినా, కాస్త చలి బాగా వున్నా కలకవేస్తాయి కీళ్ళు. కాలు తీసి కాలు వెయ్యలేడు. కాని పుట్టి, పెరిగిన వూరు. కష్టం చేసి గడపవలసిన బ్రతుకు. అక్కడ ఓ చిన్న సభకి అధ్యక్షుడుగా పిలిచారని బండి మీద వూరేగడం ఎల్లాగో అనిపించింది. “వద్దెసే. నలుగురూ నగుతారు. కూలాడికి బండి కావలసి వచ్చిందా అనుకుంటారురా”-అన్నాడు. వీరాస్వామి ఒప్పుకోలేదు. అయితే జాన్ అభ్యంతరానికి అతడు వూహించిన కారణం వేరు. “బండి నొగలకి ఒక వేపున మా జెండా కట్టేను. రెండోది మీ జెండా. అలాకాదు. రెండువేపులా మీదే వుండాలంటే అల్లాగే చేద్దాం.” జాన్ చుర్రుమనేలా చూసేడు. అతని మనస్సులో కలిగివుండని అభిప్రాయం అది. జెండాలు చూసేడు. కాని, ఆ ఆలోచన కలగలేదు. “అది మీ జెండా ఎప్పటినుంచిరా. ఆ జెండా పట్టినందుకే కాళ్లు విరగ్గొట్టారు తెలుసా?” వీరాస్వామి సిగ్గుపడ్డాడు. రమారమి పాతికేళ్ళు జాన్ పట్టుకొన్నది అదే జెండా. ఇప్పుడేనా ఆశయాలూ, ఆదర్శాలూ విషయంలో ఆ జెండాతో జాన్‌కు పేచీ లేదు. ఆ మాటే చెప్పేడు జాన్. పైగా మరొకటి కూడా అన్నాడు. “అసలు నా చేతిలో వుండవలసిందే, ఆ జెండా....” వీరాస్వామి గడుగ్గాయి. ఆ అవకాశాన్ని వదులుకోలేదు. “ఇంకేం మామా! మేమంతా నీ వెనక్కాల వుండేవాళ్ళమే.” జాన్ కాదన్నాడు. “వద్దులే ఎందుకైతేనేం. వేర్పడ్డాం. అల్లాగే వుండనీలే.” అంటే అర్థం ఏమిటి? తమ జెండాయే బండి మీద వుండాలనా?....స్పష్టం కాలేదు. కాని, అదేమిటో తేల్చమని అడగదలచలేదు. ‘అతడినే చెప్పనీ.’ అనుకొన్నాడు. “అయితే మేం బువ్వతిని పదిమందినీ కేకేసుకు వస్తాం. అందరం వూరేగింపుగా వెడదాం. నినాదాలు ఏమిటివ్వాలంటావు? నాకు తోచినవి రాసుకొచ్చా. వింటావా?” ఆ మాట వినగానే జాన్‌కి ఇరవయ్యేళ్ళకి పూర్వం నాటి అలవాట్లు జ్ఞాపకం వచ్చేయి. “మంచి పని చేశావు, ఏవీ వినిపించు విందాం.” విన్నాడు. బాగున్నాయి-అనిపించింది. అవి ప్రధానంగా ప్రజా వుద్యమంలో ఐక్యతను గురించి నొక్కి చెబుతున్నాయి. వీరాస్వామి వెళ్లిపోయాక కూడా అతడిచ్చి వెళ్లిన కాగితంలోని నినాదాలు జాన్ ఆలోచనలను వదలలేదు. ఐక్యత అన్నమాట ప్రమాదకరం కాకపోవడమే కాదు. అవసరమే కూడా. కాని.... కమ్యూనిస్టు పార్టీ చీలిపోయింది. చాలమంది ఆ చీలిపోవటం వలన చాల నష్టం కలిగిందంటారు. తాను ఆ మాటనెప్పుడూ ఒప్పుకోలేదు. పార్టీ చీలిపోక తప్పదు. జాతీయ విప్లవంలో కాంగ్రెసు పాత్ర ఏమిటి?-దీని విషయమై పార్టీలో తాను యెరిగినప్పటి నుంచి భిన్నాభిప్రాయం వుంది. అంతక్రితం కూడా వుందన్నారు. అయితే అవి ఒక ఘట్టం దాకా ఘర్షించలేదు. స్వాతంత్ర్యం వచ్చాక ఆ వైవిధ్యంలో గుణాత్మకమైన మార్పు వచ్చింది. దానిని పార్టీ నాయకత్వం సరిపుచ్చబోయింది. కాని కుదరలేదు. భిన్నభావాలు గలవారిని కలిపి వుంచే ప్రయత్నంలో పార్టీలో పని అంతా స్తంభించింది. విడిపోయాక ఇద్దరూ ప్రజలలో తమ పార్టీని బలపరచుకొనేటందుకు పోటీపడి పనిచేస్తున్నారని తన భావం. కాని ఈ ఐక్యత?.... బలప్రయోగం సమాజంలో మంత్రసాని వంటిదని మార్క్స్ అన్నాడుట. దానిని తాము ఖచ్చితంగా బలపరుస్తున్నారు. మార్క్స్ నాటి పరిస్థితులు వేరు. నేడున్న పరిస్థితులలో శాంత పద్ధతులలో కూడ సోషలిజం వచ్చే అవకాశం లేకపోలేదు. అది విఫలం అయినప్పుడే బలప్రయోగం అంటున్నారు....రెండో వర్గం. అదే జరిగితే మరి విప్లవం అన్నదేముంది? కూడదని తన నమ్మకం. ఈ రెండు ధోరణులకీ ఐక్యత యెల్లాగ?.... కాని, కేరళలో మంత్రివర్గంలో తమ పార్టీ చెయ్యవలసిన పనిని సరిగ్గా చెయ్యలేదని తన అంతరాంతరాలలో వుంది. తమకు జనాన్ని తోడు తెచ్చుకొనేందుకు బదులు అందర్నీ యెదురు చేసుకొన్నారనిపిస్తూంది. అన్నింటికన్నా గొప్ప తప్పు భూసంస్కరణల చట్టాన్ని తీసుకురాకపోవడం. తానే తెచ్చి గౌరవం దక్కించుకోవాలని ఆలస్యం చేసినట్లు మంత్రి చెప్పడం క్షమార్హం కాదు. ప్రజల అవసరం కన్న పార్టీకి ప్రాముఖ్యం ఇస్తే, ఆమె దానిని మరింత సాగలాగింది. పార్టీ అవసరం కన్న తన ప్రతిష్ఠ, ఆమెకు యెక్కువయిందనిపించింది. మళ్ళీ అదే సమస్య. వీటికీ ఐక్యతకీ యెల్లా లంకె కుదురుతుంది? పార్టీ ప్రజల కోసమా? ప్రజలు పార్టీ కోసమా? ప్రజలా? పార్టీయా? హఠాత్తుగా అతని ఆలోచనా ధోరణిని భంగపరుస్తూ జోగయ్య మాట వినిపించింది. “ఇదిగో జాన్! సుందరరావుగారు నీకు ఈ నినాదాల కాగితం ఇవ్వమని పంపేరు. ఆనక వూరేగింపులోనూ, సభలోనూ ఇచ్చేందుకన్నారు.” జాన్ దానిని తీసుకొన్నాడు. మొట్టమొదట సందేహం కనబడలేదు. రెండు మూడు తప్ప మిగిలినవి ఏ మార్క్సిస్టు పార్టీకీ అభ్యంతరం కానివే. కాని, ఆ రెండు మూడిటి క్రిందా గీత గీసి వుంది. అవి తమ పార్టీ ప్రత్యేకత్వాన్ని నిలుపుకొనేందుకు వ్రాసినవి – అని అభిప్రాయమన్న మాట. జాన్ యెరుగును. ఆ పదాలు వుపయోగించాక పై నినాదానాల పస మిగలదు. ఏకభావం వుండదు. ఆ నిందలెవ్వరూ సహించరు! ముప్ఫయ్యేడో ప్రకరణం రాత్రి పాలెంలో అమ్మవారి గుడి దగ్గర జరిగే సభకి పిల్లల్ని వెంటవేసుకొని జానకి బయలుదేరింది. జాన్ సూచన అంటూ వీరాస్వామి వచ్చి పిలిచేడు. ఆ పిలుపు గురించి, వుత్సాహం చూపలేకపోయినా, మరియమ్మ వచ్చి చెప్పాక మరి కాదనలేకపోయింది. “నీకీ మీటింగుల సరదా ఇంకా పోలేదటే....” అంటూ భద్ర తాను ఇంట్లోనే బైఠాయించింది. “నువ్వు కూడా రారాదూ? బావ లేడు కదా. ఒక్కర్తివీ కూర్చుని ఏం చేస్తావు? లే!” అని జానకి ప్రోత్సహించింది. “అమ్మా! తల్లీ! మీకూ మీ మీటింగులకీ వో దండం! ఆ జరగడాలూ జరగడం జరిగిందిలూ వింటూంటే ఒంటి మీద తేళ్ళూ, జెర్రులూ పాకినట్లు వుంటుంది. వద్దు.” ఆమె ముఖభంగిమలు చూసి జానకి నవ్వింది. కాని, ఆమె అంటున్నదేమిటో అర్థం కాలేదు. “అదేమిటి?” “కమ్యూనిస్టులు సబ్జక్టివ్‌గా ఆలోచించకూడదని మార్క్సో, లెనినో ఎవరో అన్నారటగా?” “అనే వుంటారు. అన్నదెవరయినా అది మంచి లక్షణం కాదా” “దాన్ని మెలితిప్పి, జరగడం శబ్దం తెచ్చి, మీవాళ్ళు గబ్బు పట్టించినంత బ్రహ్మాండంగా మరొకరు చెయ్యలేరు. చివరికి తెలుగుభాషలో దానిని తప్పనిసరి సహాయక్రియ చేసిపెట్టారు. రేడియో విను. ఆ జరగడం వుపయోగించే జబ్బు యెంత బాగా వ్యాపించడం జరిగిందో తెలుస్తుంది.” జానకికా మాట తోచలేదు. ఆశ్చర్యంతో కళ్లు విప్పార్చి చూసింది. “కర్తృత్వం మీద వేసుకోవాలంటే మేము అల్లా చేశాం ఇల్లా చేశాం అనాలి. ఆ పని తగలడితే బాధ్యత తమదవుతుంది. ఆ బెడద తప్పించుకొనేందుకు తెచ్చేరు, ఈ జరగడాన్ని. మేము చేశాము కాదు. అది అల్లా జరిగింది. అందులో కర్త లేదు. కర్తృత్వం బాధా లేదు. దేశం రోజు బాగుండక అది అల్లా జరిగింది. మేమేం చెయ్యం? మీ ప్రారబ్ధం. ఏడవండి! అని చెప్పడం.” జానకి నవ్వింది. “కమ్యూనిస్టులు చెప్పే మాటలు, చేసే పనులలో ఒక్కటేనా నీకు నచ్చింది వుందా?” భద్ర తన అశక్తతను కనబరచింది. అంతలో- “శాంతియుత సహజీవనం ఒక్కటే నచ్చింది” అంది. “లేకపోతే బావకి విడాకులు ఇవ్వాలి గనక....” అని జానకి హాస్యమాడింది. “అంతే మరి. సుశీల అంటే ఒంటరిది. పుట్టిల్లంటూ వుంది. వో వుద్యోగం వుంది. గనక మీవాళ్లు చేసిన పనికి బ్రతికిపోయింది. నలుగురు పిల్లలతో నేనేం కావాలి?” “అప్పుడు బావనే పొమ్మందువేమో.” “ఒక్కొక్కప్పుడు అనెయ్యాలనే వుంటుంది. అంతలో పాపం అనిపిస్తుంది. పొమ్మంటే భోజనం ఏం చేస్తారు? పోనీలే వుండనిద్దామనుకొంటుంటాను.” జానకి నవ్వింది. “ఆ లెనిన్ దూరదృష్టి గలవాడు. మీ కమ్యూనిస్టులు తెచ్చే కుక్క జట్టీలు ఆ పుణ్యాత్ముడూహించేడు. వీళ్ళకి ఇంట్లో విస్తరి వేసే యోగం కూడా వుండదేమోనని ఆలోచించేడు. మనవాళ్ళు కర్మయోగాన్ని సృష్టించినట్లు ఆయనగారు ఈ శాంతియుత సహజీవనం పట్టుకున్నాడు. మీరంతా బ్రతికిపోయారు....” అంటూ గాంభీర్యం తెచ్చిపెట్టుకొని సిద్ధాంత నిర్వచనం చేసింది భద్ర. జానకి సభ నుంచి తిరిగి వచ్చేవరకూ భద్ర మేలుకొని కూర్చునే వుంది. ఆమె వస్తూనే ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండానే వెంటనే కాకినాడకు బయలుదేరాలంది. తొండలే విడిపించింది. “ఇంత రాత్రివేళ కాకినాడ ప్రయాణమేమిటమ్మా! అదీగాక దీపావళి వెడితేగాని నేనెక్కడికీ బయలుదేరబోవడం లేదు. అది సరే గాని....” భద్ర ఆమె మాటను వినిపించుకోదలచలేదు. “మళ్ళీ కాదనకు....” “పిల్లలంతా యింటికి వచ్చేరా?” “వచ్చేరు. అంతా పడకలేశారు. సరా. యింక విను. మీ బావా, నేనూ ఇదే చెప్పాలనుకొన్నాం. మన కక్షలూ, కార్పణ్యాలూ చచ్చేవాళ్ళ దగ్గర కాదు. అదాగాక....” భద్ర మాటలలో ఏదో విశేషం వున్నదనిపించి, జానకి ఆమె ముఖంవేపు చూసింది. “ఏమిటమ్మా నువ్వు చెప్పేది? నాకు కక్షలేమిటి? ఎవరా చచ్చిపోతున్నావారు?” భద్ర తెల్లబోయింది. “మీ బావ కనిపించేరా?” “ఆ.” “కనిపించి ఏమీ చెప్పలేదూ?” “లేదు. వీరాస్వామీ వాళ్ళూ వచ్చి ఏదో మాట్లాడుతున్నారు. త్వరగా యింటికి వెళ్ళమన్నాడు. అంతే.” భద్ర నిస్పృహగా తల వేలవేసింది. “నిన్ను వెంటనే తీసుకొస్తానని బయలుదేరేరు. ఈయనగారికి రాజకీయాల్లో మతి కూడా పోతూంది.” “వర్తమానకాల క్రియేగనక యింకా ఏ కొంచమో మిగిలివున్నట్లేనా అనుకోవచ్చా?”-అంటూ సత్యానందం యింట్లో అడుగుపెట్టేడు. “మీరూ, మీ పనులూ! తెల్లవారగట్ల రమ్మని గుర్రబ్బండి చెప్పేరా?” “ఏమిటే కథ? కాకినాడకి గుర్రబ్బండిలో ప్రయాణమా యేమిటి?” అని జానకి యెగతాళి చేసింది. “కంగారుపడకు. కూర్చో” అని సత్యానందం బుజ్జగిస్తూనే భార్యను శాసించేడు. రెక్కపట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టేడు. జేబులోంచి టెలిగ్రాం తీసి జానకి చేతుల్లో పెట్టేడు. “మీరు వెళ్ళిన వో పదినిముషాలకి వచ్చిందట. నేను రాగానే చెప్పింది.” “దీంట్లో ఏముంది, ఇంత కంగారుకి? మా ఎడ్రసు కావాలన్నారు. రాద్దాం.” “అసలు ఆ ఎడ్రసు అడగడంలోనే వుందని నా అనుమానం. ముసలాయన ఏ జబ్బుగానైనా వున్నారేమో. లేకపోతే హఠాత్తుగా మీ ఎడ్రసు యెందుక్కావలసి వచ్చింది?”-అన్నాడు సత్యానందం. జానకికి ఆ అనుమానం అర్థం లేనిదనిపించింది. “జబ్బుగా వుంటే మాత్రం ఎడ్రసు అవసరం ఏముంది? ఏదో మామూలుగా అడిగి వుంటారు.” “దానికి టెలిగ్రాం యెందుకు?” అంది భద్ర. “పోనీ నువ్వే చెప్పు.” “ఎడ్రసు కావాలన్నారు గనక పెద్ద ప్రమాదం ఏమీ వుండి వుండదు. కాని, యిచ్చింది టెలిగ్రాం కనక ఏ జబ్బుగానైనా వున్నారేమో. కాకపోయినా పెద్దతనం....” అంది భద్ర. “డెబ్బయి దాటివుంటాయనుకుంటా”-అంది జానకి సాలోచనగా. ఆ మాట చూస్తే భద్ర వాదన నచ్చినట్లే అనిపించింది. “డెబ్భయ్యయిదు” అన్నాడు సత్యానందం. “మళ్ళీ కాదనకు....” భద్ర మళ్ళీ ప్రారంభించబోయింది. మాట మధ్యలోనే జానకి తన అంగీకారం తెలిపింది. “వెడతాం లే. ముసలాయననీ, తండ్రిగారి వైపువాళ్ళనీ కుర్రవాడికి చూపించాలనేది మేం బయలుదేరిన కారణాలలో ఒకటి. నువ్వు చెప్పిందీ సబబుగానే వుంది. ఆయన పెద్దవారా...” “అయితే సర్దుకో. నేను సుబ్బరాజు బండి చెప్పివచ్చా. అమలాపురంలో కోటిపల్లి రేవులోకి వెళ్ళే మొదటి బస్సుకి అందించేలా రమ్మన్నా”నంటూ, సత్యానందం గడియారం వేపు చూసేడు. “ఒంటిగంట దాటింది. ఇంక పడకేం వేస్తారు. నువ్వు సర్దుకున్నావా?” “ఆ.” అంది భద్ర. “పిల్లలెవరు వస్తారు?” అని జానకి ప్రశ్న. “మళ్లీ యెల్లుండి వచ్చేస్తాం. వాళ్ళెందుకు?” అంది, భద్ర. ముప్ఫయ్యెనిమిదో ప్రకరణం “నానీ!” మంచి నిద్రలో వున్నా తల్లి పిలుపు వినబడి రవీంద్ర చటుక్కున లేచి కూర్చున్నాడు. కళ్ళు నులుముకుంటూ “ఇప్పుడెంత అయిందమ్మా!” అన్నాడు. “రెండున్నర. నువ్వు లేచి మొహం కడుక్కొని, వేణ్ణీళ్ళు సిద్ధంగా వున్నాయి. స్నానం చెయ్యి. కాకినాడ వెడుతున్నాం.” ఆ హఠాత్ప్రయాణం ఏమిటో అర్థం కాలేదు, రవీంద్రకు. “ఏమిటమ్మా అంత తొందర? రాత్రి అనుకోలేదే.” “లేదు. మనం వెళ్లేక తాతగారి నుంచి టెలిగ్రాం వచ్చిందట.” విషయం అంతా విని రవీంద్ర ఒక్క నిముషం ఆలోచించేడు. “దానికి టెలిగ్రాం ఎందుకు? ఎడ్రసు పంపమని వోకార్డు చాలదా?” “అందుకే భద్రా బయలుదేరుతూంది. మీ తాతగారు అనారోగ్యంగా వున్నారేమోనని-“ “సాధన వస్తూందా?” “దాని పనేముంది?” “ఎరగనిచోటి కెడుతున్నాం. కాస్త మాట్లాడడానికేనా వుంటుంది. లేకపోతే తోచదు.”-అని రవీంద్ర నసిగేడు. “ఎరగనిచోటికి వస్తున్నామని మున్నీని రమ్మన్నావా? అల్లాగే ఎక్కడికక్కడే స్నేహాలు చేసుకోవాలిగాని. మాటాపలుకూ కోసం మనుష్యుల్ని ఎగుమతి చేస్తూంటారా?” రవీంద్ర ఏమీ అనలేకపోయేడు. మున్నీ బొంబాయిలో వాళ్ల స్కూలులోనే చదువుకొంటున్న అమ్మాయి. చాలా మంచి అమ్మాయని కొద్దినెలలు తెగమెచ్చుకొన్నాడు. ఇంటిక్కూడా తీసుకొచ్చి పరిచయం చేసేడు. కాని తరవాత ఆమె మాటే మరిచిపోయేడు. ఒక్కనిముషం వున్నాక తన మాట తీవ్రతను తగ్గించేందుకు జానకి అంది. “దానికి చదువుంది....” రవీంద్ర కూడా సర్దుకొన్నాడు. “నాలుగురోజులకి మునిగి పోతుందిట. ఉండు, బయలుదేరతీస్తాను” అని లేచేడు. “కూర్చోవోయ్” అంటూ జానకి అతని చేయి పట్టుకొని కూర్చోపెట్టి అంది. “అత్తయ్య మనతో వస్తూంది. మరిక్కడ మామయ్యకి ఎవరు వండిపెడతారు?” మాట మధ్యలోనే జ్ఞాపకం వచ్చింది. ఆ దంపతుల్ని తాను కూడా కొడుక్కి అత్త, మామల్నే చేస్తూంది. “వెళ్ళేముందు మనం మాట్లాడుకోవాలి. అక్కడికెళ్లేక కుదరకపోవచ్చు. కూర్చో.” రవీంద్ర బుద్ధిగా కూర్చున్నాడు. “చూడు. అక్కడివాళ్లతో నాకేం పరిచయం లేదు. మీ తాతగారినీ, నాయనమ్మగారినీ ఒక్కమారు చూసేను. నువ్వదీలేదు. నువ్వు కూడా చూడాలన్నావు. బయలుదేరాం! ఆయన ఏమాత్రమో సంపాదించేరు. ఆ ఆశతో వచ్చామనుకొంటారేమో అని సందేహించాం....” “అవన్నీ ఆలోచించుకొన్నాం కదమ్మా!” “ఆలోచించినప్పుడు మనంతకి మనం బయలుదేరుతూన్నాం. కాని యిప్పటి స్థితి వేరు. వారుకూడా నీకోసం వాకబులో వున్నారు. రెండోది అత్తయ్య.” మళ్లీ అదేమాట. కొడుకు పిలుపు తన ఆలోచనలని దారి మళ్లించిందనుకొంది. “అత్తయ్యేమిటి?” “ఆమె నీకోసమే బయలుదేరుతూంది.” “ఎందుకు?” “నీకు అన్యాయం జరక్కుండా అడ్డుపడతానని చెంగు నడుమున దోపింది.” రవి ఆలోచించేడు. “లేనిపోని తగవుల్లో పడతామేమో. అసలు వెళ్లకపోతేనేం?” “ఇంతవరకూ వచ్చింది కనక మానడం సబబుకాదు. వెడదాం. వోమారు నలుగుర్నీ చూడు. నీకూ, నాకూ పెద్ద అభ్యుత్థానం జరుగుతుందనుకోకు. నీకోసం యిరవయ్యేళ్ళ అనంతరం వాకబు ప్రారంభించిన ముసలి ఆయన మీ నాన్నని చంపించెయ్యడానికి మనుషుల్ని పంపేరు....” “అప్పటి మనుష్యుల్ని వో మారు చూడాలి” అన్నాడు. “చూద్దువుగాని. మనం వచ్చిన రోజున వూరేగింపులోంచి రాయి విసిరి వీధిలైటు బద్దలు కొట్టేడన్నారు, జోగన్నఅని. వాడొకడు ఆ జట్టులో....” “ఓహో....” “ఇందాక మీటింగులో మొదట మాట్లాడేడు. అతని అన్నగారు సూరి అని వుండేవాడు. అతను ఆ రోజున ఆ దెబ్బలన్నీ తిని మీ నాన్న ప్రాణం కాపాడేడు. 50లో అతణ్ణి పోలీసులు కాల్చేసేరట.” ఇద్దరూ చాలాసేపు ఎవరి ఆలోచనల్లో వారు కూర్చుండిపోయేరు. చివరికి రవీంద్రే అన్నాడు. “మన ఆలోచనలన్నీ అనవసరం హైరాణా తప్ప వేరు కాదమ్మా.” “అంతే అయితే ప్రాణం సుఖమే. కాని, భద్రక్క వదిలేలా లేదే.”                                                                                                                                                                                                                                                                                                                       వారిని వెతుక్కుంటూ సత్యానందం వచ్చేడు. “ఏమిటిది జానకీ! భద్ర నువ్వేదో అంటున్నావంటుంది. న్యాయంగా అతడికి రావలసిన ఆస్తిమాట యెత్తవద్దన్మావుట. ఏమిటది? ఆయన కొడుకుల్లో విశ్వం ఒకడు. అతనికీ ఆ ఆస్తిలో వాటా వుంది తెలుసా?” “అసలు అధికారం వున్న మనిషే యెన్నడూ ఆ ఆశ పెట్టుకోలేదు బావా!....” “ముసలాయనకి కొడుకు మీద వున్న కోపం మనమని మీద వుండకపోవచ్చు.” రవీంద్ర తన అభిప్రాయం చెప్పేడు: “ఓమారు మిమ్మల్నందర్నీ చూడాలని బయలుదేరాం. వెడుతున్నాం గనక నాన్నగారి బంధువుల్ని కూడా చూడాలనుకొన్నాం. వారికీ అటువంటి అభిప్రాయమే ఏదో వున్నట్లు తెలిసింది. మంచిదే. వోమారు వెడతాం. చూసి వచ్చేస్తాం. లేనిపోని సమస్యలు కల్పించుకోవద్దు. అర్థంలేని పని అది.” సత్యానందం చాలా ఆప్యాయంగా అతని భుజం తట్టేడు. నవ్వేడు. “దారిలో మీ అత్తయ్యని వొప్పించు.” “నే చెప్తాలెండి. ఆమె నా మాట కాదనరు.” సత్యానందం పట్టలేనంతగా నవ్వేడు. “ఆవిడ సంగతి నీకు తెలియదు. కానీ, ప్రయత్నం చెయ్యి.” ముప్ఫయితొమ్మిదో ప్రకరణం దీర్ఘకాలం ఎడబాటు తర్వాత సుశీలను చూసినప్పుడు తనకు కలిగిన ఆనందమే, తన పలకరింపుతో ఆమెకూ కలగాలని డాక్టరు రంగనాయకులు కోరిక. కాని, ఆమె ఆనందంగాని, అభిమానంగాని చూపలేదు. కనబరచినదల్లా ఉదాసీనత. ఒకప్పుడు తనయందు యెంతో ప్రేమ కలిగి, తాను లేకపోతే బ్రతకలేనన్న సుశీల నేడు ఉదాసీన. ఆమె దృష్టిలో తానూ ఒక గ్రామస్థుడు. అంతే. ఇతర గ్రామస్థులతో వ్యవహరించినట్లయినా ఆమె తనతో మాట్లాడలేకుంది. అది చూస్తే బాధ కలుగుతూంది. వూళ్ళోవారికిచ్చేపాటి విలువ కూడా తనకు ఇవ్వలేదాయని మనస్సు మధనపడుతూంది. దానికితోడు తల్లీ, తండ్రీ ముందు నారాయణ తెచ్చి చీర ప్యాకెట్టు, డబ్బున్న కవరు ఇచ్చెయ్యడం మొగాన కొట్టినట్టే అనిపించి బాధ పడ్డాడు. తెల్లవార్లూ, ఒకటే ఆలోచనలు. తిరిగి వచ్చిన ఆ వస్తువులను చూసి వాటి కధ నారాయణ నోట, వానికి తెలిసినంతవరకు విని, తలిదండ్రులు ముఖ ముఖాలు చూసుకోడం మనస్సును కలిచేస్తూంది. ఇదివరకటిలాగ తండ్రి రాజకీయాలయెడ విశ్వాసం మనస్సులో కుదురుకోవడం లేదు. ఆ విశ్వాసంతో దూరంగా పెట్టిన భార్య దూరమైపోయింది. ఇంక మిగిలిందేమిటి? తమ మధ్య ఏర్పడిన అగాధం వ్యక్తిగతం కాదు. రాజకీయం. కాని తన రాజకీయాలకు అడుగూడిపోయిందనిపించి, కంగారు పట్టుకొంది. కాంగ్రెసులో క్రమంగా పెచ్చు పెరిగిపోతున్న పోలరైజేషన్‌తో సమంగా అతని రాజకీయ భావాలు గంద్రగోళంలో పడిపోతున్నాయి. కాంగ్రెసు ప్రభుత్వం దేశంలోని పెద్ద బ్యాంకుల్ని జాతీయం చేయడం అతడికి మంచిదనిపించింది మొదట. కాని, తన పార్టీ సిద్ధాంతవేత్తల వాదనలు విన్నాక దానికి పెద్ద విలువనివ్వనక్కర్లేదనే అనుకొన్నాడు. ఎ.ఇ.సి.సి.ని సమావేశపరచడం గురించి రేగుతున్న సంఘర్షణ, కాంగ్రెసులో చీలికలు, కుస్తీలు పెద్ద-చిన్న పిశాచాల తగువులాటగా మాత్రమే అనుకోమంటే-పోనీలే అనుకొన్నాడు. కాని కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రధామ భాగస్వామి అయిన తమ పార్టీ వ్యవహరించే తీరు అతనిని చాలా గంద్రగోళంలో పెట్టింది. తాము ఇతరులతో వ్యవహారాలు చెండనాడుకొన్నారు. కాని, ప్రజల్ని? అత్యవసరం అని తాము చెప్పే భూసంస్కరణల బిల్లును తీసుకురావడానికి రెండేళ్ళు ఎందుకు పట్టింది? ఆ ఆలస్యానికి రివిన్యూ మంత్రి చెప్పిన కారణం విన్నాక – ప్రజాశక్తి వ్రాతలూ, తన తండ్రి వాదనలూ నచ్చడం లేదు. అసలు తమ పార్టీ పుట్టుకే పెద్ద అభాండంగా కనిపిస్తూంది. సరిహద్దుల్లో చైనా జరిపిన (1962) దాడిని తానూ తండ్రీ సమర్థించారు. అది దేశద్రోహమని సుశీల ఎదుర్కోవడంతో తమ భార్యాభర్తల మధ్య తగవు రగిలింది. పాకిస్తాను చేసిన యుద్ధాన్నీ, దానికి చైనా పరోక్షంగా వత్తాసు యివ్వడాన్నీ తమ వాదనలు ఒక విధంగా సమర్థించేయి. దానితో తమ భార్యాభర్తల మధ్య తగవు తారస్థాయికి పోయింది. ఇప్పుడు తన స్థితి ఏమిటి? అంతర్జాతీయంగా చైనా, దేశంలో తమ పార్టీ మాటసాయం ఇచ్చేవారు కూడా లేకుండా చేసుకొన్నారు. మన తరపున మాట్లాడేవారు లేకపోవడమే సిసలైన మార్క్సిస్టు పంథాకు గుర్తు అయితే కేరళలో అది సిద్ధించింది. బెంగాల్‌లో కూడా ఆ రోజు అట్టే దూరంలో లేదనే తోస్తూంది. అయితే నిప్పచ్చరం చేసుకోవడం మార్క్సిజానికి తోడ్పడుతుందనే నమ్మకం కలగడంలేదు. నవంబరు 1వ తేదీ తర్వాత కేరళలో పెద్ద విప్లవం వచ్చినంతపని అవుతుందని తామంతా భావించేరు. కాని, ఈ నాలుగురోజుల పత్రికలూ చూస్తే జనం తమ కోసం ‘అయ్యో’ అన్నట్లేనా కనిపించడం లేదు. బూర్జువా పత్రికలు వార్తలు దాచేశాయన్నాడు తన తండ్రి. ‘పంక్తుల మధ్య చదవడా’నికి కళ్ళు పత్తికాయలు చేసుకొన్నా ఫలితం లేకపోయింది. పైగా నవంబరు 1న తాము తమ వూళ్లో జరిపిన వూరేగింపు ఘటనలు, మరునాడు సత్యానందంతో తండ్రి వ్యవహరించిన తీరు అతనికి వెక్కసమే కలిగించేయి. ఈ పూర్వరంగంలో ఆతడు భార్యను దూరం చేసుకోడంలో తప్పు చేశాననిపించసాగింది. తెలంగాణా అల్లర్లలో ఆమె చనిపోయిందన్నప్పుడు బాధపడ్డాడు. బ్రతికి వుందన్నప్పుడు సంతోషంతో ఒక ఉత్తరం వ్రాసేడు. కాని, ఈ పరిణామాల అనంతరం తన బాధ్యత అంతేనా అనిపించసాగింది. ఆ ఆలోచనలు బలపడ్డాయి. ఆమెను మరల దగ్గర చేసుకోవాలనుకొన్నాడు. తన ప్రవర్తన అనంతరం ఆమెలో పూర్వపు సహృదయత ఏర్పడడం అసంభవం అనే ఆలోచన కూడా అతనికి తోచలేదు. కాని, నేటి ఎదురు దెబ్బలతో అర్థం అయింది. సుశీలలో వెనకటి ఆప్యాయత లవలేశం కూడా మిగలలేదు. ఆమెను పూర్వపు మనిషిని చెయ్యడం ఎల్లాగ? తెల్లవార్లూ అదే ఆలోచన. తెల్లవారింతర్వాతా అదే ఆలోచన. ఆ అనుతాపంలో, ఒక దశలో, ఎంతో నిరాశ కలిగింది. “కేశవరావు తప్పు సిద్ధాంతాల్ని మరింతదూరం లాగి ప్రాణం పోగొట్టుకొన్నాడు. నేను జీవితం పాడు చేసుకొన్నా. మా యిద్దరిలో ఎక్కువ దురదృష్టవంతులు ఎవరు అనుకోవాలో.” నలభయ్యో ప్రకరణం ఏవేవో ఆలోచనలతో కొట్టుకుపోతూ రంగనాయకులు, అత్తగారు పలకరించేవరకూ తాను వారి గుమ్మంలోకి వచ్చేననుకోలేదు. “రావయ్యా. నిన్న సాయంకాలం యింట్లోంచి వచ్చేసరికే నువ్వు వెళ్ళిపోయేవు.” అంతవరకూ ఒక ధోరణిలో సాగుతున్న అతని ఆలోచనలు ఆమె పలకరించడంతో మరోదారి పట్టేయి. తన అనునయ ప్రయత్నాలు అవమానంతో అంతం కాకుండేందుకు పెద్దవాళ్ళ సహాయం కోరాలనుకొంటున్నవాడల్లా హఠాత్తుగా ఒక నిర్ణయానికి వచ్చేడు. తన రాజకీయ పశ్చాత్తాపం వేడిలో, భార్యతోడి అపవ్యవహారానికి ప్రాయశ్చిత్తంగా అవమానం భరిద్దామనే నిర్ణయానికి వచ్చేడు. “సుశీల లోపల వున్నదాండి?” “లోపలుంది. రా. మేడమీదికెళ్ళు.” వీధిలో తన భార్య ఎవరినో పలకరిస్తుండడం వినబడి సావిట్లో రేడియో వద్దనున్న విశ్వనాధం లేచి గుమ్మంలోకి వచ్చేడు. భార్య వెనక వస్తున్నవాడు అల్లుడు. “బహుకాలానికి. బహుకాలానికి. రావయ్యా. రా....ఏమే! ఏదీ అమ్మాయిని పిలు.” చాలాకాలానికి వచ్చినందుకు శిక్షగా వీధిసావిట్లోనే కూర్చోబెట్టి కబుర్లు చెప్పి పంపేస్తాడేమిటి ఖర్మ-అనుకొన్నాడు, రంగనాయకులు. వాళ్ళకి ఆ అవకాశం కలిగించతలుచుకోలేదు. “ఏదన్నా పనిలో వుందేమో కదిలించకండి. నేనే వెడతాను.” అతని వుద్దేశం, తన పొరపాటు అర్థం అయింది. విశ్వనాధం సర్దుకొన్నాడు. “మధ్య సావిట్లోంచి మెట్లున్నాయి. నీకు అడ్డమేమిటి? పైకి వెళ్ళు” అన్నాడు. అల్లుడు మెట్లుమీదుగా పైకి వెళ్ళాక విశ్వనాధం భార్యకు పనులు పురమాయించసాగేడు.... “కాఫీ టిఫిన్ ఏమన్నా....” “నిన్న మీరు తెచ్చిన ద్రాక్ష, ఏపిల్సు వున్నాయి....” “పళ్లేలలో పెట్టి, అమ్మాయిని పిలిచి, పైకి పంపించు-“ అన్నాడు. సత్యవతమ్మ సందేహిస్తూ అంది. “పాలేర్ని పంపి, ఇడ్డెన్లు తెప్పించలేరా?” “సరే. నువ్వీ లోపున మిగిలినవి చూడు. పనిపిల్లనీ, ఎవర్నీ పైకి పోనివ్వకు.” చాలా కాలానికి అల్లుడు యింటికి వచ్చాడు. అతనితో కూతురుకు ఏకాంతం కలిగించాలని పెద్దవాళ్ళ తాపత్రయం. “దుర్మార్గం అంతా తండ్రిది. లేకపోతే కుర్రవాడు చాల మంచివాడు. నిన్న పేటలో కనిపించిందట. బట్టలు తీసుకోవాలంటే కార్లో బండార్లంకా అక్కడికీ తీసుకెళ్ళి, తీసుకొచ్చి దిగపెట్టేడు” అంటూ సత్యవతమ్మ అల్లుడు మంచితనాన్ని వెయ్యిన్నొకటోమారు మెచ్చుకొంది. “అతడు మాత్రం? మనిషి మహా మంచివాడు. కాని, పాడు రాజకీయాలు....” సత్యవతమ్మ చటుక్కున అడ్డుపడింది. “సరిలెండి! మీ అందరికీ మిగిలినవే అవి.” విశ్వనాధం నవ్వుకొన్నాడు. నలభయ్యొకటో ప్రకరణం అద్దం ముందు కూర్చుని జడ వేసుకొంటున్న సుశీల గుమ్మంలో మాట వినబడి తిరిగి చూసింది. గుమ్మంలో రంగనాయకులు నిలబడి వున్నాడు. “రావచ్చా?” భార్యగా, ధైర్యంగా చనువు చూపలేకపోతున్నాడని ఆ అభ్యర్ధనే తెలుపుతూ వుంది. సుశీల ఒక చేత్తో జడ పట్టుకొని చటుక్కున లేచింది. ఎదురు వచ్చింది. గుమ్మంలో అతని పక్కనుంచే అడుగుపెట్టి వరండాలోకి దారితీస్తూ ఆహ్వానించింది. అక్కడ నాలుగైదు కుర్చీలు, బల్లమీద రెండుమూడు పుస్తకాలు, పక్కనున్న రాక్‌లో ఇన్ని పత్రికలు వున్నాయి. “కూర్చోండి. అయిపోయింది. మొహం కడుక్కు వచ్చేస్తా. ఈ లోపున ఏ పేపర్లో చూస్తూండండి.” ఆమె తన గదిలోకి వెళ్ళి రెండు మూడు పత్రికలు తెచ్చింది. అతడు అప్పటికీ నిలబడే వున్నాడు. సుశీల నొచ్చుకొంది. “నిలబడే వున్నారు. కూర్చోకపోయారా?” “నువ్వు వెళ్ళిరా.” సుశీల తిరిగి వచ్చేసరికి ఓ అరగంట పైగా గడిచింది. స్నానం చేసి, బట్టలు మార్చుకొని మరీ వచ్చింది. వచ్చేసరికి అతడు ఏదో ఆలోచిస్తూ అల్లాగే కూర్చుని వున్నాడు. ఇందాకా తాను సరిగ్గా చూడలేదు. కాని, మనిషి బాగా డీలా పడిపోయాడు. రాత్రి తెల్లవార్లూ నిద్రలేకపోవడం, ఆలోచనలూ, మనోవ్యధాతో మోహం పీక్కుపోయినట్లయింది. నాలుగు మూడు ఏళ్ళక్రితం అతనిని ఆ స్థితిలో చూసివుంటే సుశీల తల్లక్రిందులయిపోయి వుండేది. ఇప్పుడామెకు చిరాకు మాత్రమే కలిగింది. “మళ్ళీ ప్రారంభం కాబోలు. రెండేళ్లుగా ప్రాణం హాయిగా వుంది.” అనుకొంది. తన్ను భార్యాధర్మం నిర్వహించమని మళ్లీ పీడించడానికే ఈ రాకపోకలని నిన్నటినుంచీ ఆమె భయం. ఆ భయంతోనే అతడు వచ్చినప్పుడు తాను ఎల్లా వ్యవహరించాలో, ఎల్లా మాట్లాడాలో అన్ని కోణాల నుంచీ ఆలోచించుకొని వుంది. అతని ఆశలకి ఏమాత్రం జాగా ఇవ్వదలుచుకోలేదు. అయితే మనస్సుకి కష్టంగా వున్నా మర్యాద లోపం చెయ్యలేదు. “కాఫీ తీసుకొస్తా కూర్చోండి.” అంటూ జీడిపప్పూ, బిస్కట్లూ సర్దిన ప్లేట్లు ఎదురుగా టేబులు మీద పెట్టింది. “ఇవేం అనవసరం. సుశీలా కూర్చో. వో నిముషం కూర్చుని కబుర్లు చెప్తావని వచ్చా.” కూజాలోంచి గ్లాసులోకి మంచినీళ్ళు వొంపి తెచ్చి పక్కన పెట్టింది. ‘ఒక్క నిముషం’ అని ఆమె క్రిందకు వెళ్ళిపోయింది. నలభైరెండో ప్రకరణం “డికాక్షన్ వుందా, పెట్టాలా అమ్మా!”–అంటూ వంటింట్లోకి వచ్చిన కూతురుని సత్యవతమ్మ దీక్షగా ఎగాదిగా చూసింది.  ఆడంబరంగా లేకున్నా కూతురు అపరిశుభ్రంగా లేదని గమనించింది. రాకరాక మగడు వస్తే ఏదో సామాన్యమైన చీర మాత్రమే కట్టిందని కొంచెం అసంతృప్తి కనబరచింది. “అంతకన్న కాస్త మంచి చీర లేకపోయిందటే అమ్మా!” “దీని కేమమ్మా. శుభ్రంగా వుంటేనూ?” “ఔనులే. శుభ్రంగా వున్నా....” అంది, ఆమె మనస్సులో అసంతృప్తి అలాగే మిగిలి వుంది. కాని, ఆ మాటనింక సాగించలేదు. పళ్లేలలో ఇడ్లీ సర్దుతూంది. “పనిపిల్ల తెస్తుందిలే. నువ్వెళ్ళి కబుర్లు చెప్తూండు.” “ఇవన్నీ ఎవరు తెచ్చేరు? నాన్నగారు వెళ్ళేరా? ఇంట్లో పళ్ళూ, బస్కట్లూ అవీ ఉన్నాయి కదా? ఆయన్ని శ్రమ పెట్టేవా?” “ఇందులో శ్రమకేముంది? ఎవరన్నా పరాయివాళ్లకు చేస్తున్నామా, ఏమన్నానా?” అంటూనే స్వరం తగ్గించింది. “ఏమంటున్నాడు?” తల్లి ప్రశ్నకు ఏడవాలో, నవ్వాలో అర్థంగాక సుశీల పక్కున నవ్వింది. వేళాకోళంగా సమాధానం ఇచ్చింది. “అనేందుకు ఏముంది? వేరే కాపురం పెట్టుకొందాం. మా నాన్న పెట్టుకోమంటున్నారు. అన్నా”రంది. ఆ నవ్వుకూ ఆ మాటకూ పొంతన కుదిరినట్లు కనబడకపోయినా సత్యవతమ్మ ఆ మాటను నమ్మదలచింది. ఆమెకు అల్లుని మంచితనం మీద అంత విశ్వాసం. ఆ విశ్వాసంతోనే కూతురుకు నాలుగు మాటలు హితవు చెప్పింది. “కాపురం పాడుచేసుకోకు. ఉద్యోగం, సద్యోగం ఆడదానికి కొంతవరకు కాలక్షేపంగా వుండొచ్చు. కాని, అవి సుఖం ఇవ్వవు. పడుచు రక్తం బలిమిలో నాకొకరి లెక్కేమిటనిపిస్తుంది. కాని, కాస్త వడిమళ్లేక పలకరించేవాడూ, ఆదరించేవాడూ లేకపోతే....” తల్లి చెప్పకుండానే, రక్తం వడిమళ్ళక పూర్వమే అవన్నీ తనకు ఇప్పుడే దాఖలాగా కనిపిస్తున్నాయి. ఒంటరితనం బాధగానే వుంది. కాని, దానినుంచి బయటపడడానికై అవమానకరమయిన పరిస్థితికి తల ఒగ్గలేకుండా వుంది. కాని, ఆ మాట తల్లికి అర్థం కాదు. చాటుగా వస్తేనేం మగడే కదా. ఒకరో, ఇద్దరో పిల్లలు కలిగితే అతడే దారిన పడతాడంటుంది. లేదా, ఆ ముసిలాడు కలకాలం వుంటాడా?....అంటుంది. ఆ చర్చలూ, వాగ్వాదాలూ మగడు ఇంట్లో వుండగానే ప్రారంభం కావడం ఇష్టంలేక, తల్లి కళ్ళ ముందు నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడాలనుకొంది. “ఆయన ఒక్కర్నీ కూర్చోబెట్టి వచ్చా. మళ్ళీ పని పిల్ల ఎందుకు? ధెర్మాస్ గ్లాసులు వున్నాయిగా. కాఫీ వానిలో పొయ్యి.” తాను మాట్లాడడం నిలుపుతే, తల్లి మళ్ళీ ప్రారంభిస్తుందేమోనన్నట్లు గబగబ ఏదో ఒకటి చెప్పేస్తూంది. “గ్లాసులు శుభ్రంగా వున్నయ్యా?” “కడిగిపెట్టేను” అని తల్లి చెప్తున్నా మళ్లీ తాను కడిగి తెచ్చింది. వానిలో కాఫీ నింపింది. బయలుదేరుతూంటే సత్యవతమ్మ ఏదో సందుచేసుకొని మాట దూర్చింది. “మధ్యాహ్నం భోజనానికి వుంచెయ్యి.” “హాస్పిటలు మూసేయమంటావా?” “నీదంతా సోద్దెం. హాస్పిటలు పని అయ్యాకనే రాకూడదా?” కూతురు ఏమీ అనకపోయినా, ఆమె హడావుడి చూసి, ఆ జంట సఖ్యపడిపోయారనే ఆమె ధృవపరచుకొంది. సుశీల పైకి వెళ్ళిన మరునిముషంలో ఎవరో అతిధుల కోసం కాఫీ కావాలని లోనికి వచ్చిన విశ్వనాధం చెవిలో ఆ శుభవార్త పడేసింది. అతడు నవ్వేసేడు. “నీదంతా మాలోకం. వూళ్ళోకి పోలీసువాళ్లు వచ్చారు. సర్కిలూ, ఎస్. ఇ. ఇప్పుడు మన సావిట్లోనే వున్నారు. వాళ్ళకి ఆరు కాఫీలు పంపు. మనలో మనమాట. వాళ్లు వచ్చేరని తెలిసే అతగాడు ఇటు మళ్ళేడని నా వూహ.” సత్యవతమ్మ విస్తుపోయింది. కూతురు కాపురం కుదుటపడుతుందనుకొంటూంటే, మళ్ళీ ఈ జైళ్ళూ, అరెస్టులూ అడ్డమవుతాయేమోనని భయపడింది. ఏడేళ్ళ క్రితం చిన్నగా ప్రారంభమైన తగాదా జైళ్ళూ, కేసులూ మూలంగానే బిగిసి ఇంత తెచ్చిందని ఆమె అభిప్రాయం. “మరి వాళ్ళనిక్కడకెందుకు తెచ్చేరు?” భార్య ఆరోపణకి విశ్వనాధం తెల్లబోయేడు. “నే తేవడం ఏమిటి నీ మొహం. ఈవేళ కొత్తగా వచ్చేరా? ఎప్పుడు ఏ పోలీసు ఆఫీసరు వచ్చినా మన యింట్లో కాఫీయేనా త్రాగకుండా వెళ్ళేడా? అలాగే యిప్పుడూ వచ్చేరు.” “మరి అతని కోసం వచ్చేరని అంటారేం?” భార్య ప్రశ్నలకి విశ్వనాధం భగ్గుమన్నాడు. “ఎవరన్నారు? వెధవ ప్రశ్నలూ నువ్వూనూ. సరిగ్గా వినిపించుకోవు, ఏడవ్వు. ఊళ్ళో నాలుగు రోజుల నుంచి వూరేగింపులూ, సభలూ జోరుగా జరుగుతున్నాయిటేమిటని వచ్చేరు. వాళ్లు వచ్చేరనేగాని, ఎందుకు వచ్చేరో విని వుండడు. బుడుంగుమని మనింట్లో దూరేడు. క్రిందికి రానివ్వకు. మనం ఏదో చేసేశామని ఏడుస్తారు. ఆలోపున నేను వీళ్ళని వదుల్చుకుంటా.” విశ్వనాధానికి అల్లునియెడ వ్యతిరేకత లేకపోయినా, అతని రాజకీయాల మీద ఏమాత్రం గౌరవం లేదు. నలభైమూడో ప్రకరణం మర్యాదకు ఏమాత్రం లోటు రాకుండా, చనువుకు అవకాశం ఇవ్వకుండా సుశీల అసిధారావ్రతంగా వ్యవహరిస్తూంది. తాను తెచ్చిన ట్రే టీపాయి మీద పెట్టింది. “ముఖం కడుక్కుంటారా? ఇదిగో వాష్‌బేసిన్. కుళాయిలో నీళ్లు వస్తాయి. ఇంతలో తుండు తెస్తున్నా.” అతడు ముఖం కడుక్కునే లోపల గదిలోకెళ్ళి, చలవ చేసిన తుండు తెచ్చి వాష్‌బేసిన్ ప్రక్కనే వున్న ‘రాక్’ మీద వేసింది. దానిని తన చేతికి అందివ్వబోవడం లేదనే విషయాన్ని రంగనాయకులు గమనించేడు. అతడు ముఖం తుడుచుకు వచ్చేసరికి తినుబండారాలు సర్దింది. కాని రంగనాయకులు అవేమీ ముట్టుకోలేదు. “ఒక్క కాఫీ చాలునోయ్. ఇవన్నీ అనవసరంగా తెచ్చేవు.” “ఫర్వాలేదు....పోనీ రెండు బస్కట్లేనా తీసుకోండి.” అతడు మర్యాదకు ఒకటి తీసుకొని, కొరికి ప్లేట్‌లో పెట్టేసి, కాఫీ ముగించేడు. సుశీల పనిమనిషిని పిలిచి బల్ల శుభ్రం చేయించింది. పనిమనిషిని పంపేసి సుశీల వచ్చి, ఎదురుగా కుర్చీలో కూర్చుంది. “ఇప్పుడు చెప్పండి. రోడ్డు మీద క్లినిక్ తెరిచేరట....” సిగరెట్టు ముట్టించి తన సంభాషణ ఎక్కడినుంచి ప్రారంభించాలో తేల్చుకోలేక, సోఫాలో జేరబడి ఆలోచిస్తూ కూర్చున్న రంగనాయకులు ఆ ప్రారంభానికి తెల్లబోయేడు. ఏదో ముఖపరిచయం వున్నవాళ్ళు, యాదృచ్ఛికంగా కలుసుకున్నప్పుడు వేసే కాలక్షేపం ప్రశ్నలా వినిపించింది. అతడు నిరుత్సాహంగా ఆమె ప్రశ్నలకి ఒకటి రెండు సమాధానాలిచ్చేడు. క్రమంగా సంభాషణ మొండిపడింది. ఇద్దరూ ఒక్క నిముషం నిశ్శబ్దంగా కూర్చున్నారు. అతడు ఆరిపోతున్న సిగరెట్టుతోనే వేరొకటి ముట్టించి, మొదటిది ఆష్‌ట్రేలో నొక్కేసేడు. కాఫీ త్రాగేక ఈ అరగంటలో అది మూడో సిగరెట్టని సుశీల లెక్కపెట్టింది. సంబంధంలేని పరాయివాడయినా, అతి సన్నిహితుడయినా వ్యాఖ్యానం చేసే ఘట్టం. కాని అది చనువులోకి లెక్క అవుతుందేమోనని భయపడి వూరికుంది, ఇప్పుడు. రంగనాయకులు తల వంచుకొని, సిగరెట్టు చివరినుంచి, బద్ధకంగా లేస్తున్న సన్నని పొగతీగ వంక చూస్తూ ప్రారంభించేడు. “ఈ మధ్య మన జీవితం గురించి అస్తమానం ఆలోచన వస్తూంది.” సుశీల ఏమీ అనలేదు. ఒక్క నిముషం ఆగి అతడే ప్రారంభించేడు. “రమారమి ముప్ఫయ్యేళ్ళు వచ్చేయి. ఈ జీవితంలో మనకిగాని, దేశానికిగాని వుపయోగపడే పని ఏమన్నా చేశామాయన్న ప్రశ్న పదే పదే కలుగుతూంది.” ఆ ఆలోచనలకు తాను ఏ విధంగా ప్రతిస్పందించాలో ఆమెకు అర్థం కాలేదు. సహజమైన ప్రతిస్పందన కలగలేదు. వూరుకుంది. అతడు ఒక్క క్షణం ఆగి మళ్ళీ అన్నాడు. “తప్పు నాదేనంటే క్షమించగలవా?” ఆ ప్రశ్న కూడా అతనియందు సానుభూతి కలిగించలేదు. “నేను క్షమించడం కోసమా తప్పు మీద వేసుకోవడం?” అనిపించింది. అయితే అదే భావాన్ని మరో రూపంలో వ్యక్తీకరించింది. “క్షమించడానికి మీరు చేసిందేముంది? అదేమీ పెట్టుకోకండి.” “కాదు సుశీలా!” ఏవిధంగానూ గత జీవితాన్ని గుర్తు చేసుకోజాలనంత అసహ్యం సుశీల మనస్సులో పేరుకొని వుంది. దానిని మరిచిపోలేదు. తుడిచిపెట్టనూ లేదు. మరల మరల తవ్వుకొని మనస్సుకి వ్యథ తెచ్చుకొనే ధోరణి లేదు. అందుచేత ఆ ప్రయత్నాన్ని మొగ్గలోనే తుంపెయ్యాలి. చిరాకు అనిపించినా, ఖండితంగానే చెప్పింది. “మీకు కావలసింది విడాకులు. నాకేమీ అభ్యంతరం లేదు. ఒకళ్ళనొకళ్ళం అవమానించుకోకుండా తేల్చేసుకుందాం. నాకు సాధువమ్మలమీదా దేవుడమ్మలమీదా భక్తి లేదు. కాని, వాళ్ళ ఆశ్రమాలు మర్యాదగా విడాకులు తీసుకోడానికి ఉపయోగపడుతున్నాయి. అంతకన్న మంచిమార్గం వేరేదేనా వుంటే చెప్పండి. అలాగే చేద్దాం. దానికోసం ఈ క్షమార్పణలూ, చిన్నపుచ్చుకోడాలూ అనవసరం....” తన మాటలకు రంగనాయకులు బాధ పడడం కనిపించింది. “నాకు కావలసింది విడాకులు కావు సుశీలా! నువ్వు, నువ్వే కావాలి.” “నేనా?” ఆమె తల అడ్డంగా తిప్పింది. రంగనాయకులు ఆమె నిరాకరణను పట్టించుకోకుండా తన ప్రతిపాదనను స్పష్టం చేశాడు. “రెండేళ్ళ క్రితం అన్నావు. వేరే కాపురం పెట్టుకుందాం అన్నావు. మా నాన్నగారు కూడా....” తండ్రియందున్న భక్తి భావంతో ఆమాట అనేశాడే గాని, ఆ ప్రసక్తి తీవ్ర వ్యతిరేకత కలిగించవచ్చునని కానలేకపోయేడు. తన తండ్రి ఆలోచన అదేననడంతో సుశీల దానికి విలువనివ్వనక్కరలేదనే నిర్ణయానికి వచ్చింది. “ఏదో చిన్నతనం. అనుభవం లేకపోవడంచేత ఏమిటేమిటో అన్నాను. అవన్నీ యిప్పుడు తవ్వుకోవడం ఎందుకు?” “కాదు సుశీలా! నా బ్రతుకంతా ఎండమావుల వెంట పరుగులెత్తినట్లుగానే వుంది. ఈ బ్రతుకేమిటి? ఎందుకు బ్రతుకుతున్నానో అర్ధం లేకుండాపోయింది. సుశీలా నాకు నీ తోడు కావాలి....నమ్ము.” తనకామె అవసరం ఎంతో వుంది. ఆమాటే పదిమాట్లు చెప్పేడు. ఆ అవసరం యిదివరకు అనిపించి వుండలేదు. అది యిప్పుడెందుకవసరమయిందో చెప్పలేదు. అది దైహికావసరం కాదు. ఆత్మికావసరం. గతంలోలాగ రాజకీయాలు తృప్తినివ్వలేకున్నాయి. తండ్రిమీద భక్తి గౌరవాలు యిదివరకటల్లే ఆ రాజకీయాల మీద భక్తి విశ్వాసాల్ని కుదరనివ్వడం లేదు. వాటిని అనాలోచితంగా ఆమోదించలేకున్నాడు. తమరు విప్లవం అనుకొంటున్నది తమరిని ఏకాకుల్ని చేసింది. క్రియారూపంలో ఆ విప్లవం సహభావకుల మీద సాగిస్తున్న విద్రోహంగా తయారయింది. కల్తీలేని విశుద్ధ లక్ష్యం అన్నది అందర్నీ తిట్టడం, ఎవ్వరినీ సహించలేకపోవడం, పెద్దరికం కోసం ఏ పాడుపనినైనా సమర్థించడమూగా తయారయింది. తాను తప్పుదారిని పడ్డానా అనిపిస్తూంది. కాని సిద్ధాంతాలో? అవన్నీ మార్క్సో, లెనినో చెప్పినవేనే! వాటిని తప్పనాలా? కాక తాను అర్థం చేసుకోడం తప్పిందా?” ఎన్నో ప్రశ్నలు. అన్నీ ప్రశ్నలే. కాని, అవేవీ పైకి చెప్పలేడు. కాలక్రమేణా సుశీలకు చెప్పగలడేమోగాని, ఈ క్షణంలో అసంభవం. ఇప్పుడు చెప్పడానికైనా తన ఆలోచనలు తనకే స్పష్టంగా వున్నట్లు లేవు. అదికాక అభిమానమో? తనకిప్పుడు అసంతృప్తిగా అనిపిస్తున్న రాజకీయాభిప్రాయాల కోసమే సుశీలను దూరం చేసుకొన్నాడు. వాటియెడ తనకు యిప్పుడు విశ్వాసం లేదంటే ఆమె నమ్ముతుందా? ఆమెను నమ్మించడం కష్టం! కష్టం! ఆమె తన్ను ఒక్కమాట అనలేదు. ఏమన్నా అంటే, తిట్టినా, దవడలు వాయించినా సహించేవాడు. మెత్తపడుతూందనుకొనేవాడు. కాని, ఆమె ఎత్తుబడే వేరు.... “ప్రపంచానుభవం లేక భిన్నాభిప్రాయాలున్నా సహజీవనం సాధ్యమే అనుకొన్నా. కాని తెలిసింది. సాధ్యం కాదు....రెండేళ్ళ క్రితం నా ఆలోచనలూ, రాజకీయాలూ వట్టి ఎలిమెంటల్. ఇప్పుడు ఖచ్చితమైన అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఏర్పడి నువ్వు చేస్తున్నదేమిటని అడక్కండి. ఈ క్షణం వరకు తెలుగు దేశపు కవుల ఒరవడిలోనే నేనూ వున్నాను. జరుగుతున్న చరిత్ర నచ్చడం లేదు. ఎవ్వరిమీదా, దేనిమీదా విశ్వాసం, నమ్మకం లేదు. ఏదో జరగాలని తపన. ఆ జరిగేదాంట్లో అంతా పాల్గొనాలి. ఎవ్వరూ ఆటంక పరచరాదు. కాని, అందరూ పాల్గొనడం లేదు. ఎన్నో ఆటంకాలు. పాల్గోని వారిమీద కోపం. ఆటంకాలకు అసహనం. నేనొక్కర్తెనూ చెయ్యగలది కాదని నిరుత్సాహం. ఆ నిరుత్సాహానికి మూలం మిగతా ప్రపంచం. కనక వాళ్ళంతా విప్లవ, అభివృద్ధి నిరోధకులు. నేనే విప్లవమూర్తిని. నన్నెవ్వరూ గుర్తించకపోతే విప్లవానికి భవిష్యత్తేముంటుంది? అదింకోబాధ. ఇంత అవ్యవస్ధితమైన మనస్సుతో మీకు నేను తోడేమిటి? తోడుమాట దేవుడెరుగు...ఇదుగో చూసేరా. నాకేమాత్రం నమ్మకంలేని దేవుడు కూడా నాలుక చివరే వున్నాడు. ...నేను మీకు జీవితంలో ఆలంబన ఏమిటి?” ఆమె తనను, తన రాజకీయాల్ని, తన పార్టీని ఎగతాళి, యద్దేవా చేస్తున్నట్లనిపించి రంగనాయకులు తెల్లబోయేడు. “ఇప్పుడవన్నీ తవ్వుకోడం అవసరమా? మనం జీవితాన్ని….మళ్ళీ....సరికొత్తగా….” సుశీల తల తిప్పింది. “చూడండి, నేనేమీ తవ్వుకు రాలేదు. నా మనస్థితి చెప్పేను. వద్దంటారూ....మా బాగు....” రంగనాయకులు కంగారుగా-”వద్దనడం లేదు”-అన్నాడు. “జీవితాన్ని సరికొత్తగా ప్రారంభించడం అంటే ఏమిటి మీ ఉద్దేశం? కొత్తదిగా కాదు. ఉన్నది ఉన్నట్లుగా నడపగలమా? ఇదివరకు జరిగింది అంతా ఏమౌతుంది? ఎప్పటికప్పుడు కొత్తగా ప్రారంభిస్తూండడానికి మనకున్న జీవితాలెన్ని?” రంగానాయకులు నిర్వాక్కుడయ్యాడు. సుశీల తల అడ్డంగా తిప్పింది. “వద్దు. మీకు సాధ్యంకాని పనులు ఎత్తుకోవద్దు. మీ మనస్థితికి కేరళా, పశ్చిమబెంగాలూ సజీవ సాక్ష్యాలు. నేను ఎక్కడో దూరంగా పడి ఉంటున్నా. నన్నొదిలి వెయ్యండి. మంచో, చెడ్డో, పొరపాటో, గ్రహపాటో జరిగిపోయింది. దానినిప్పుడు చెరిపివెయ్యలేము. చేయగలదల్లా నేను ఇందాక చెప్పింది.....” “క్షమించి, మరచిపోలేవూ?” “నేను క్షమించడానికి ఎంత దానిని? మరచిపోవడంతో పనేముంది? జ్ఞాపకం వుంచుకొని చేసేదేముంది?” రంగనాయకులు వచ్చిన పని విఫలం అయింది. మోకాళ్లమీద చేతులు ఆనించుకొని లేస్తూంటే ఒక్కక్షణం సుశీల మనస్సు కదిలి పోయింది. ఆ మనిషికి అభినయం చేతకాదు. ఏదో మానసిక సంఘర్షణలో వుండి వస్తే తాను తరిమెయ్యడం లేదు గదా అనిపించింది. కాని, అంతలో టేబిలుమీద ‘అశాంతి’ పత్రిక కనిపించింది. దానిలో నవంబరు 1 న అగ్రహరంలో జరిగిన ఊరేగింపు వార్త గుర్తువచ్చింది. ఆ పత్రిక రంగనాయకులు మిత్రుడే తెస్తున్నాడు. దానిలో రంగనాయకులు వ్రాస్తూంటాడు. ఆ వార్త గుర్తు వచ్చేక అతని యెడ కలిగిన అనుతాపం ఆవిరైపోయింది. మెట్లవరకూ సాగనంపి సుశీల బహు మర్యాదగా సెలవు తీసుకొంది. “సెలవు” “థేంక్స్.” నలభైనాలుగో ప్రకరణం వంటింటి గుమ్మంలోంచి సత్యవతమ్మ పలకరించింది. “అప్పుడే వెళ్ళిపోతున్నావా?” అతనిని ఆపుచెయ్యడం ఆమె ఉద్దేశం. సావిట్లో పోలీసు అధికార్లు ఇంకా కాఫీలు తాగడంలోనే వున్నారు. అటువేపు అల్లుణ్ణి రానీయవద్దని మగని ఆదేశం. కాని, ఆమె అతడు దిగిరావడం చూడనేలేదు. తాను చూసేటప్పటికే అతడు సావడి గుమ్మంలో వున్నాడు. పలకరిస్తే  అతడు ఆగుతాడని ఆమె వూహ. కాని, అతడు వెనకకన్నా చూడలేదు. పరధ్యానంగానే సమాధానం ఇచ్చేడు. “మళ్ళీ వస్తానండి.” సావట్లో అడుగు పెట్టేసరికి కుర్చీలలో పోలీసు ఆఫీసర్లు. గుమ్మంలో మెట్ల క్రింద ఇద్దరు పోలీసులూ కనబడి గతుక్కుమని నిలిచిపోయేడు. సబినస్పెక్టరు పలకరించనే పలకరించేడు. “హలో! డాక్టరు గారు!” వెంటనే ఆ డాక్టరు ఎవరో సర్కిల్ ఇనస్పెక్టరుకు పరిచయం చేసేడు. “లోకల్ మర్క్సిస్టుపార్టీ....” విశ్వనాధం తన బంధుత్వం తెలిపేడు. “మా అల్లుడు....” “ఎవరు, డాక్టరమ్మ భర్తా?” అల్లుడిని కూర్చోమననా, వద్దా అని సందేహిస్తున్న విశ్వనాథం, అతడక్కడి నుంచి కదలకపోవడం చూసి ఆహ్వానించేడు. “రావయ్యా, కూర్చో.” “దయచేయండి డాక్టరు గారూ! తమరు మాకిక్కడ పరిచయం కావడం చాలా మంచిదయింది” అంటూ ఎస్. ఐ. తన ఆహ్వానం కూడా జతపరిచేడు. రంగనాయకులు కూర్చున్నాడు. విశ్వనాధం అతడు వెళ్ళిపోడానికి కారణం చూపిస్తూ-”ఈవేళ క్లినిక్‌కు వెళ్ళడం ఆలస్యం అయిందేం”? అని అందించేడు. “రోడ్డుమీద మనం చూసిన....” సర్కిలు జ్ఞాపకానికి సబినస్పెక్టరు సాయం ఇచ్చేడు. “రెడ్‌గార్డ్ క్లినిక్ వీరిదే” అన్నాడు. ఔనన్నట్లు రంగనాయకులు తల ఊపేడు. “ఏదన్నా పనిమీద వెళ్ళేరా?” “ప్రత్యేకంగా ఏం లేదు” అన్నాడు సర్కిలు. “నక్సల్‌బరీ ఉగ్రవాదుల్ని సమర్థిస్తూ, ఈ చుట్ట ప్రక్కల పది గ్రామాల్లో ఊరేగింపులూ, సభలూ, తీర్మానాలు, టెలిగ్రాములూ చాలా ఉధృతంగా సాగుతున్నట్లు రిపోర్టులు వచ్చేయి. మీ పార్టీ కూడా అందులో ఉన్నదట....” రంగనాయకులు ధృడకంఠంతో పోలీసు ఉద్యోగి మాటను సవరించేడు. “అవేమీ ఉగ్రవాదుల చర్యల్ని సమర్ధించడానికి జరగలేదు. ఉగ్రవాదులని పేరెట్టి మీకూ, ఊళ్ళల్లో పెత్తందార్లకీ అడ్డం అనుకొన్నవారిని అరెస్టు చెయ్యడం, చంపడం పనికి రాదంటున్నారు. మీటింగులలో అదొక భాగం....” “దానిలో మీ పార్టీ కూడా....” “అల్లా చంపడానికి మేమూ వ్యతిరేకమే” “డాంగేగారి పార్టీతో మీరూ....” ఊరేగింపులూ, సభలలో తమకు పాత్రలేదని పోలీసువానికి చెప్పడానికి అభిమానం అనిపించింది. “ఒక్కవారే కాదు. నాగిరెడ్డిగారి పార్టీ...” “వారిందులో కథానాయకులేనాయే. చెప్పేదేముంది?” తన మాటకు అడ్డం రావడం చిరాకు అనిపించింది. కటువుగా అనేశాడు. “బుద్దిగలవాడెవడేనా చెప్తాడు. ఈ రెండురోజుల సభలకీ మా మామగారు, పద్మనాభంగారూ. కాంగ్రెసులో వున్న రెండు శాఖలూ కూడ ఈ వూరికి సంబంధించినంతవరకు చేరేరు.” రంగానాయకులు లేచేడు. “నాకు పనుంది సెలవు.” “ఒక్కమాట” అన్నాడు ఎస్. ఐ. డాక్టరు కూర్చున్నాడు. “చెప్పండి.” “మీ నాన్నగారు మరొకవిధంగా సెలవిచ్చేరు. తమరు చెప్పింది వేరుగా ఉంది” అంటూ సర్కిలు వేపు తిరిగి, “ఇందాకా మనం మాట్లాడింది వీరి తండ్రిగారితోనే” అన్నాడు. “సుందరరావుగారు?” “చిత్తం” అన్నాడు ఎస్. ఐ. తండ్రి ఏం చెప్పేడో వాళ్ళనుంచే వినాలని రంగనాయకులు నిరీక్షించేడు. సబినస్పెక్టరు అది చెప్పకుండా విషయాంతరం ఎత్తుకొన్నాడు. “నవంబరు 1వ తేదీన మీరందరూ ఊరేగింపుగా వెళ్లి సత్యానందం గారి ఇంటివద్ద అల్లరి చేశారనీ. వారి వీధిలైట్లు పగలగొట్టేరనీ తెలిసింది.” రంగనాయకులు ఖండితంగా గర్జించేడు. “వట్టి అసత్య సమాచారం!” “మా వద్ద మీవాళ్ళ సాక్ష్యమే వుంది సార్! కాగితం సాక్ష్యం….” అని నవ్వేడు సి.ఐ. రంగాయకులు తెల్లబోయేడు. సత్యానందమేనా, మరెవ్వరేనా రిపోర్టు చేసేరేమో. అతని ఆలోచనలు పలువిధాలుగా పోయాయి. ఇంతవరకూ జరిగిన సంభాషణ అంతా తనచేత వాగించడానికి ఆడిన నాటకం అనిపించింది. “సాక్ష్యం వున్నప్పుడింకేం. కేసు పెట్టడానికి అభ్యంతరం ఏం వుంది? కేసు పెట్టమని డిమాండు చేస్తున్నాను. విచారణలో అన్నీ తేలుతాయి.” సర్కిల్ ఇన్‌స్పెక్టరు కనుసంజ్ఞతో సబినస్పెక్టరు తన జేబులోంచి ‘అశాంతి’ పత్రిక పైకి తీసేడు. దూరం నుంచే చూపుతూ....”ఈ పత్రిక మీద మీ అభిప్రాయం ఏమిటి సార్!” అనడిగేడు. “ఎందుకోసం?” “అందులో పడే వార్తలు నమ్మవచ్చునా అని....” “నమ్మకమైన వార్తలే వేస్తారనాలి” అన్నాడు, రంగనాయకులు. అంతలో ఏదో తోచింది. మళ్ళీ అన్నాడు. “కాని, పత్రికల వార్తలన్నింటికీ వున్న ఇబ్బందే దానిలో వానికీ వుంటాయి. విలేకరుల వార్తలన్నింటికీ బాధ్యత వహించడం కష్టం.” “దీనిని చదివి చెప్పండి” అని పత్రికలో ఒక వార్త చూసి చేతికి అందించేడు. సబినస్పెక్టరు చూపిన శీర్షిక చదివేసరికి రంగనాయకులు తల తిరిగిపోయింది. “కమ్యూనిస్టుల ఊరేగింపుపై రివిజనిస్టుల అఘాయిత్యం: ప్రజలచే తగు సమాధానం; రివిజనిస్టు నాయకుని బహిరంగ క్షమార్పణ.” చదవడానికి వ్యవధినిచ్చి సబినస్పెక్టరు తన అభిప్రాయాన్ని ధృవపరుస్తూ తన మాట జ్ఞాపకం చేశాడు. “మాకు తగిన సాక్ష్యం లేందే మాట్లాడం సార్!” రంగానయకులుకి ఏం చెప్పడానికీ తోచలేదు. తండ్రి పంపివుంటాడు. ఎందుకిల్లాంటి పని చేసేడు? అడగాలి. చర్రున లేచేడు. “కూర్చోండి. అప్పుడే వెళ్ళిపోతానంటారే.” “రోగులు కనిపెట్టుకొని వుంటారు. వెళ్ళాలి. మీరు విచారణ కానివ్వండి. ఏదన్నా పనుంటే ఒంటిగంట వరకూ క్లినిక్‌లోనే  ఉంటా” అంటూ రంగనాయకులు వెళ్ళిపోయేడు. నలభైఐదో ప్రకరణం ఇంటికి వెడుతూనే రంగనాయకులు తండ్రిని నిలేసేడు. “ఏమిటా వార్త? ఎవరు పంపేరు? మన పార్టీకి పరువేమన్నా మిగులుతుందా?” అన్నిటికన్న రంగానయకులకి పెద్ద దిగులు అబద్ధాలూ, అతిశయోక్తులూతో పార్టీకి ప్రతిష్ఠ మిగలదని. కాని, ఆ వార్త గురించి తండ్రి చేసిన వ్యాఖ్య అతడిని నిరుత్తరుణ్ణి చేసింది. “మన ఊరేగింపుని అల్లరి చేయడం జరిగిందా లేదా? జరిగినచోటు ఏది?  మన ఊరేగింపులో వాళ్ళు గాక అక్కడ ఉన్న వాళ్ళెవరు? నా చొక్కా చిరిగింది. నా మొహాన ఉమ్మివేయడం జరిగింది. అంత అల్లరి చేసినా మన వాళ్ళు ఘట్టిగా నిలబడ్డం జరిగిందా, లేదా? చివరికి సత్యానందం అంతమంది ముందు అన్న మాటల అర్ధం ఏమిటి?”-అనేక ప్రశ్నలు. “....ప్రజలు గట్టిగా ప్రతిఘటించారు. తగిన శాస్తి చేశారు. దానితో రివిజనిస్టులు నీళ్ళు నములుతూ నిష్క్రమించేరు.” .....ఏమిటీ వాక్యాల అర్ధం? జోగయ్య చేసిన పనిని సమర్ధిస్తూన్నారనేనా? అల్లాంటి పనులు చెయ్యమని హుషారు చెయ్యడమేనా? రంగనాయకులు ఆక్రోశానికి జాలి ఉట్టిపడేలా చూడడమే సుందరరావిచ్చిన సమాధానం. “నాన్నగారూ! మీకు నేను చెప్పవలసినవాడిని కాను. కాని, మీరు చెప్తున్న దాని మీద మీకు నిజంగా నమ్మకం ఉందా? ఈ పద్ధతులు పార్టీని బలపరుస్తాయా? ఏమిటిది?” ఎప్పుడూ తనకు ఎదురుచెప్పని కొడుకు నేడు తన ఇంగితాన్నే ప్రశ్నిస్తున్నాడు. సుందరరావుకు కోపమూ, ఆభిమానమూ కలిగేయి. “ఒరేయ్! పార్టీకి ఏది బలం? ఏది క్షేమం అనేది మొన్న పుట్టిన నీనుంచి నేర్చుకోవాలంటావు. మనది సమరశీలమైన పార్టీగా నిర్మించాడు లెనిన్. అది అల్లా వుండాలసిందేనని ఆయన అభిప్రాయం. అల్లాగే వుంటుంది. మనమీద దుర్మార్గం చేస్తే ఊరుకోము. కంటికి కన్ను, పంటికి పన్ను వసూలు చేసి తీరుతాం.” చివరి మాట అనేటప్పుడు తండ్రి కళ్ళలో కనిపించిన కాఠిన్యం చూసి రంగనాయకులు వెరగుపడ్డాడు. ఒక్కక్షణం ఈ మనిషికి మతి సరిగ్గా ఉన్నదా అనిపించింది. అంతలో ఆయనకున్న ఉద్రేక స్వభావం, రక్తం పోటు జ్ఞాపకం వచ్చేయి. తగ్గేడు. కాని ఈమారు కూడా తన అభిప్రాయాన్ని స్పష్టంగానే చెప్పేడు. “అయితే సత్యానందంగారి గేటుమీద దీపం రాయిపుచ్చుకు బద్దలు కొట్టడం మన పార్టీ కార్యక్రమంలో భాగంగానే జరిగిందనుకోవాలా?” కొడుకు ప్రశ్న సుందరరావుకి ఇబ్బందిగా కనిపించింది. తమతమ పార్టీ వాళ్ళు చేసిన, పైకి చెప్పుకోలేకపోయినా, తమరు కాదనలేని ఘటనలు జరిగినప్పుడు మూజుమానీగా అవన్నీ ప్రజల పనిగా, ప్రజల న్యాయమైన కోపోద్రేకానికి ప్రతిచర్యగా జరిగినట్లు చెప్పుకోవడం ఎప్పటినుంచో సంప్రదాయంగా వస్తూంది. అందరూ అదేపని చేస్తున్నారు. కొత్తేముంది? దీనికి ఇంత గొడవా ప్రశ్నలూ ఏమిటి? “ఇది చిన్న విషయమే. శాంతంగా ఆలోచిస్తే కూడదని నేనూ అంటాను. కాని, ఏ ఫలితాన్నీ విడిగా చూడకూడదు. దానికి మూలం ఎటువంటి కవ్వింపో ఆలోచించాలి. కార్యాకారణ సంబంధం గమనించకపోతే వచ్చే ముప్పే ఇది....” తండ్రితో ఇంక మాట్లాడి లాభం లేదనుకొన్నాడు. ఇంకొక్క ప్రశ్న ఉండిపోయింది. తన తండ్రి చెప్పిందీ, సభల గురించి తాను చెప్పిందీ తేడాగా ఉందన్నాడు ఎస్.ఐ. ఏమిటో అది. అడిగేడు. సుందరరావుకు ఆ ప్రశ్న మళ్ళీ కోపం తెప్పించింది. “మీటింగులూ, అక్కడ జరిగేవానితో పార్టీకేమీ సంబంధం లేదని చెప్పా...జాన్ తన స్వంత పూచీపై దానిలో పాల్గొన్నాడని చెప్పా, నక్సల్‌బరీలని సమర్ధించేరన్న నెపంతో దాడి మనమీద పడిపోకూడదు. అక్కడ జరిగేవానికీ, చెప్పేవానికీ మన బాధ్యత లేదు. మన యూనిట్లని మనం కాపాడుకోవాలి. మన బలం పెంచుకోవాలి.” రంగానాయకులికి ఆ ధోరిణి వెక్కసం అనిపించింది. “ఈవేళనుంచి నేను కూడా నా స్వంత పూచీమీద ఆ సభలలో కలగచేసుకోవాలనుకొన్నా. ఈవేళ నరేంద్రపురం పాలెంలో సభకి వెడుతున్నా, ఏమంటారు?” “ఏం బెదిరిస్తున్నావా?” రంగనాయకులు ఒక్క క్షణం జంకేడు. “ఇందులో బెదిరింపేం వుంది?” “పార్టీ వ్యవహారాలలో బంధుత్వాలు అడ్డం కావు. నువ్వు వెళితే జాన్ లాగే నువ్వూ క్రమశిక్షణ భంగానికి సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది.” రంగానాయకులకి అది కొత్తగా వినిపించింది. “అతనిమీద క్రమశిక్షణ ఎందుకు?” సుందరరావు కొడుకును ఆలోచనలో పెడుతున్నానని తృప్తి పడ్డాడు. “తెలుస్తుందిగా.” “చెప్పండి, వింటా.” సుందరరావు తృప్తిగా కుర్చీలో సర్దుకొన్నాడు. పెదవులు ముడిచి ఇంత పొడుగు చేసి ఒక్కనిముషం గంభీరంగా కూర్చున్నాడు. “చెప్తా విను. పార్టీని సంప్రదించకుండా దాని ప్రతిష్ఠకు భంగకరంగా, స్వంత నిర్ణయాలు చేసేయగల వ్యక్తివాద స్వభావం, తరవాత పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా, అది నిర్ణయించిన నినాదాలను నిర్లక్ష్యం చేసి, పార్టీ శత్రువులతో కలిసి ప్రజా ప్రయోజనాన్ని భంగాపరచడం...చాలునా?” “చాలు. నాకూ సంజాయిషీ అడిగించుకోవాలనుంది. జాన్ చేసినది మంచిదనే నేనూ అనుకొంటున్నా....” తెల్లబోతున్న తండ్రి తెరుకొనేవరకూ ఆగి మళ్ళీ అన్నాడు. “దానివలన ప్రజాకార్యం, ప్రయోజనం నెరవేరుతుందనేదే నా విశ్వాసం!” అని రంగనాయకులు లేచేడు. “మీరు చేస్తున్నది ఎంత నష్టమో వినాశకరామో మీకు తోచడం లేదు. జోగన్న చేసింది పార్టీ క్షేమమూ, జాన్ చేసింది ప్రజాప్రయోజనాలకు నష్టమూ అయితే నేను ఆవిధంగా నష్టపరచడమే మంచిదనుకొంటున్నా.” తన బెదిరింపు వ్యర్ధం అనిపించేక సుందరరావు నీళ్ళు కారిపోయేడు. మిగిలినదొక్కటే... “పెళ్ళాన్ని మంచి చేసుకొనేందుకు అదే మార్గం అనుకొన్నావు....” “లేదు. ఇంక ఆ దారి మూసుకుపోయింది. నాలాగే ఇతరుల జీవితాలూ పాడు కాకూడదని!” రెండో భాగం ఒకటో ప్రకరణం కాకినాడలో బస్సు దిగి జానకి తిన్నగా హోటలుకే రిక్షా మాట్లాడింది. సరాసరి మామగారింటికి వెళ్ళడానికి ఆమెకి మనస్సు ఒప్పలేదు. “అప్పుడే పది కావచ్చిందా? ఎటూ కానివేళ వెళ్ళి వాళ్ళని ఇరుకున పెట్టడం. ఏ హోటలులోనో గది తీసుకొని, విశ్రాంతి తీసుకొని వస్తాం.” ఇరుకున పెట్టడంకన్న ఆ యింట్లో తనకి ఎటువంటి స్వాగతం లభిస్తుందో అన్న అనుమానం ఆమెను ప్రధానంగా వేధిస్తూంది. ఎప్పుడూ మొగమేనా చూసివుండని కోడలి మీద, ఆ కొడుకు పోయాక, వారికి అభిమానం వుండవలసిన పనీ లేదు. ఆ అవకాశమూ లేదు. పైగా గతరాత్రి మీటింగులో వుపన్యసించవలసి రావడం, తరవాత ప్రయాణ సన్నాహంతో నిద్రే లేదు. తోడు గుర్రపుబండిలో, బస్సులలో ఇరుక్కుని ప్రయాణం. చాల అలసటగా వుంది. తాము వెళ్ళవలసిన యింట్లో పరిస్థితి ఏమిటో తెలియదు. అందరూ ఆరోగ్యంగానే వున్నా, అంతా ఆదరణా, అభిమానమూనే చూపినా కొత్త యిల్లు. ఎరగని జనం. ఒక్క నిముషం విశ్రాంతిగా వుండాలన్నా సాధ్యం కాదు. అగ్రహారంలో వుండగా ఇవన్నీ ఆలోచించుకొన్నవే. హోటలులో జానకీ, కొడుకూ దిగాలన్నదీ, ఏ హోటలులోనా అనేదీ అక్కడే నిశ్చయించుకొన్నారు. కాని తీరా సమయం వచ్చేసరికి భద్ర హోటలు ఆలోచనను వొప్పుకోలేకపోయింది. ఆమెకు మేనత్తగారింటితో పుట్టింటితో వున్నంత అనుబంధం వుంది. అయినా జానకి రాకుండా తానా యింటికి వెళ్ళనంది. “ఇంటికి పెద్దకోడలివి. నువ్వు హోటలులో దిగడం, నేను తగుదునమ్మా అని ఆ యింటికి వెళ్ళడమూనా? మహా బాగుంటుంది. నడు, నేనూ హోటలుకే వస్తా. నీకంటె దగ్గరదాన్నా, వాళ్ళకి?” జానకి నవ్వింది. “నీ యిష్టం. యిందులో దగ్గర దూరం మాట ఏముంది? వీలూ, చాలూ గాని!” భద్ర మళ్లీ ఆలోచనలో పడింది. తాను వచ్చిన పనికి, జానకి హోటలులో దిగడమే అనుకూలం అనుకుంది. “తేల్చుకో త్వరగా” అని జానకి తొందరపెట్టింది. భద్ర రిక్షాను కేకేసి, తన నిర్ణయం చెప్పింది. “గాంధి నగరమే వెడతా.” “పరిస్థితి ఏమిటో, వో అరగంటలో ఫోన్ చేస్తాను. చెప్పు. విశేషం ఏమీ లేకపోతే, ఒక్క గంట నిద్రపోయి వస్తాం.” రెండో ప్రకరణం స్నానం చేసి వచ్చేక ప్రాణం హాయిగా వుంది. ఇంకా రవీంద్ర స్నానాల గదినుంచి బయట పడలేదు. అతడు వచ్చేక భోజనం. ఈలోపున అత్తవారింటి పరిస్థితి తెలుసుకోవచ్చు. అవసరం అనుకొంటే.... డైరీ తీసి నెంబరు వ్రాసుకొని, హోటల్ లౌంజిలోకి వెళ్ళి ఫోన్ చేసింది. ఆవలివేపునుంచి ఎవరిదో స్త్రీ కంఠం. “కుమారస్వామిగారిల్లు. ఎవరు కావాలి?” “నా పేరు జానకి. అగ్రహారం నుంచి వచ్చిన భద్రగారున్నారా?” “ఇప్పుడే వస్తారు. లైన్‌లో వుండండి.” ఫోన్ క్రిందపెట్టి ఆమె వెళ్ళినా, ఆయింట జరుగుతున్న సంభాషణలన్నీ జానకి చెవిని బడుతున్నాయి. “ఎవరో జానకట. నిన్ను పిలుస్తున్నారమ్మోయ్. నువ్వు వచ్చినట్లు ఇంట్లోనే నలుగురికీ తెలియలేదు. ఆవిడకెల్లా తెలిసిందోగాని....” తరవాతిమాట భద్రది. “మీ పెద్ద తోడికోడలు. మేమిద్దరం కలిసే వచ్చేం.” ఆమె తన భర్త తమ్ముడి భార్య. ఏ తమ్ముడో? ఎందరు తమ్ముళ్లో? ఆమె తన భర్త తమ్ముడి భార్య. ఏ తమ్ముడో? ఎందరు తమ్ముళ్లో? మరుక్షణంలో భద్ర ఫోన్ తీసుకొంది. “ఎవరు జానకీ!” “ఔను. అక్కడంతా క్షేమమేనా?” “ఆ. ఏం కంగారు లేదు. విశ్రాంతి తీసుకొని రా. మామయ్యకీమధ్య బ్లడ్‌ప్రెషర్ కొంచెం హెచ్చిందట. అంతే. మరేం విశేషం లేదు.” “ఎవరితోటి భద్ర మాట్లాడుతూంది, అప్పుడే” అని లోపలినుంచి ఒక వృద్ధకంఠం. బహుశా మామగారు అయివుంటారు. “మేం వచ్చినట్లూ, ఇక్కడ దిగినట్లూ చెప్పలేదా?....” అని జానకి ప్రశ్న. భద్ర నవ్వింది. “పనిగా చెప్పలేదంతే....నువ్వు మంచిపనే చేసేవు.” జానకి నవ్వింది. “నువ్వూ మంచిపనులే చెయ్యాలని ప్రయత్నించు. లేనిపోని గొడవలు పెంచకు.” జానకి వుద్దేశం అర్థం అయినా భద్ర దానిని అర్ధం చేసుకోనట్లే మాట్లాడింది. “నాదేం వుందే, అయినా నీకున్న మొండితనం నాకు లేదే తల్లీ!” “శ్రీ శ్రీ చెప్పినట్లు ‘వడ్డించిన విస్తరి’ నీ జీవితం. నీకెందుకు వస్తుందమ్మా? నాది అవసరం. మరి నేనుండనా....” జానకి ఫోన్ పెట్టేసింది. అప్పుడే వచ్చిన రవితో ‘భోజనానికి లేద్దామా?” అని కదిలింది. “అత్తయ్యగారేనా?” “ఔను. తాతయ్యగారు తిరుగుతూనే వున్నారుట! మనం ఓ గంట విశ్రాంతి తీసుకొని వెళ్ళవచ్చు.” “భోజనం గదిలోకి తెమ్మంటా.” “నేను చెప్పానులే. నడు.” భోజనం చేస్తుండగా సెర్వరు కబురు తెచ్చాడు. “ఎవరో ముసలి ఆయనా, వారి భార్యా, ఒక అమ్మాయి వచ్చేరు. మీ పేరు అడుగుతున్నారు.” జానకి ఎవరా అని ఆలోచనలో పడ్డా, సెర్వరుకు చేయవలసిన పని పురమాయించడంలో పొరపడలేదు.   “నా కోసమేనా?” “చిత్తం. జానకమ్మగారు ఒక గంట క్రితమే వచ్చేరని చెప్పేరు.” “మనల్ని ఇక్కడ ఎరిగిన వారెవరు? మనం వచ్చినట్లేనా ఎవరికి తెలుసునబ్బా.” అన్నాడు రవీంద్ర సాలోచనగా. “మేడమీదికి తీసుకొచ్చి లౌంజులో కూర్చోబెట్టు. తలో కాఫీ ఇయ్యి. పేర్లు తెలుసుకో....” అని సెర్వర్‌ను పంపేసి, కొడుకు ఆలోచనలకి సాయపడింది. “మనల్ని ఎరిగింది అత్తయ్య. ఆవిడే చెప్పాలి. ఎవరికి? మీ తాతయ్యగారు, నాయనమ్మగారు వచ్చివుంటారా? ఏమో....” అంటూ జానకి ఆలోచనలూ, అనుమానాలూ కలబోసింది. సెర్వరు తిరిగివచ్చేడు. వారు కూర్చున్నారు. పేర్లు అడిగితే ఇవ్వలేదు. “భోజనం చేసి రానీ కూర్చుంటాం” అన్నారు. “సరే” అంది జానకి. భోజనం కాగానే సెర్వరు ప్లేట్లు తీసుకు వెళ్ళిపోయేడు. రవి పెట్టెలోంచి స్కెచ్ పుస్తకం తీస్తున్నాడు. “ఇప్పుడవి ఎందుకోయ్?” రవి నవ్వేడు. “బొమ్మలు గీసుకుంటూ కూర్చుని మర్యాదలు మరిచిపోతావు గనక” అని హెచ్చరించింది. ఇద్దరూ, తమ గదికి తాళం పెట్టి వెలుపలకు వచ్చారు. దగ్గరకు వెళ్ళి పరిచయం చేసుకొనేవరకూ ఆగంతకులు ముగ్గురూ, గుర్తించలేదు తమరిని. తమకోసం వచ్చేరని తెలుసును గనక తప్ప వారు ముగ్గురూ ఎవరో తెలియలేదు జానకికి. ఆమె ముసలాయనను ఎన్నడూ చూడనేలేదు. అత్తగారిని చూసింది. కాని, పోలికలు తెలియలేదు. ఆ అమ్మాయి ఎవరో....” “నమస్కారమండి. నా పేరు జానకి. తమరు నా కోసం అడిగేరట.” ఆ మాట వినగానే చిన్న అమ్మాయి లేచింది. చటుక్కున ప్రతి నమస్కారం చేసింది. “మా భద్ర వదిన చెప్పింది. మీరు యిక్కడ వున్నారని. వీరు మా నాన్నగారు, మా అమ్మగారు....” అంటూ పరిచయం చేసింది. వృద్ధదంపతులు వారిని చూసినప్పుడు తాము వచ్చినది వారికోసమేననుకోలేదు. హోటలులో దిగిన మరి ఇతరులెవరో అనుకొన్నారు. కాని, పరిచయం వారిని నిస్తబ్ధుల్ని చేసింది. తమ ఎదుటనున్న ఆ గంభీరవిగ్రహాన్ని చూసి, జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. చేతి కర్రమీద గడ్డం ఆన్చి, ముందుకు వంగి నిశ్శబ్దంగా చూస్తున్నాడు, ఆయన. ఆ చూపులలో ఏదో అనుమానం. ఆశ్చర్యం, ప్రశంస కనిపిస్తున్నాయి. తాము వచ్చింది ఈమెకోసమేనా? జానకి బ్రాహ్మణాగ్రహారంలో పుట్టి పెరిగిందన్నారు. ఆ లక్షణాలేవీ తన యెదుటనున్న విగ్రహంలో లేవు. సూర్యకాంతమ్మ కూడా తెల్లబోయింది. తన కొడుకు మరణించేడు. అతని భార్య ఆంధ్ర బ్రాహ్మణ వితంతువులాగ సంప్రదాయ సిద్ధంగా ముసుగుతో వుండడం ధర్మం. ఆ ఆకారం లేకపోయినా దీనంగా, రోగిష్టిగా ముక్కుతూ, మూలుగుతూ, బెదురుతూ, భయం భయంగా ఎంతో దయనీయంగా వుండి వుంటుందని ఆమె కల్పన. కాని వారి ఎదటనున్న విగ్రహం వారి ఆలోచనలకు ఏమాత్రం సరిపడలేదు. ఆమె బాగా ఎత్తరి. ఆ ఎత్తుకు తగిన పుష్టితో మంచి ఆరోగ్యంగా కనిపిస్తూంది. అక్కడక్కడ తెలుపు తిరుగుతున్నా పెద్ద జుట్టు. నీటుగా దువ్వి వలలో బిగించింది. కుడి చేతిన రెండు బంగారు గాజులు. ఎడమ మణికట్టున వాచి తప్ప ఇతర నగలు లేకపోయినా శరీరవర్ణం ఆ లోటు కనబడనీయడం లేదు. నిరాడంబరంగా వున్నా మంచి ఖరీదయిన చీర కట్టింది. ఆమెను చూసి, ఎవరో తెలుసుకోగానే ముసలువాళ్ళిద్దరి మనస్సులూ విభిన్నభావ సంభ్రమాలకి లోనయ్యేయి. వారా సంభ్రమం నుంచి తేరుకొనే లోపునే జానకి కూమారుని వంక తిరిగింది. “నానీ. చూడు. వీరు నీ తాతగారు! వీరు నాయనమ్మగారు.” రవీంద్ర చేతులు జోడించి వినయంగా నమస్కారం చేసేడు. అతని రెక్కబట్టుకొని ముందుకు నెట్టుతూ అతని పరిచయం చేసింది. “మీ మనమడు. పేరు రవీంద్ర.” ముసలివాళ్ళ దృష్టి మళ్ళింది. ఎదుటనే వున్న తల్లి పోలికలు కనిపిస్తున్నా, అంతకన్న భిన్నమైన ఏవో పోలికలు ఇద్దరి మనస్సులలోనూ మెదిలాయి. ముసలాయన ఆశీర్వదిస్తున్నట్లు చేయి జాపేడు. అతనిలో కొడుకును చూసుకొంటూంటే కంఠం నిండి వచ్చింది. సూర్యకాంతమ్మ కూడా కదిలిపోయింది. డగ్గుత్తికతో-“ఇలారా, నాయనా!” అంది. ముసలివాళ్ళ పరిస్థితి చూసి జానకి కదిలిపోయింది. చిన్నగా కొడుకును ముందుకు నెట్టింది. అతడు పోయి వృద్ధదంపతుల నడుమ కూర్చున్నాడు. జానకి వారితో వచ్చిన పడుచు ప్రక్కన కూర్చుంది. “నువ్వెరివో తెలిసింది. కాని పేరు ఎరగనమ్మా!” ఆ ఏకవచన ప్రయోగం సూర్యకాంతమ్మకు నచ్చలేదు. “మీ ఆడపడుచు” అని గుర్తు చేసింది. జానకికి అర్థం కాలేదు. “మిమ్మల్ని పరిచయం చేయడంలోనే తానెవరో చెప్పేసింది, గడుస్తనంగా.” మళ్ళీ ఏకవచనం? సూర్యకాంతమ్మకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. మొగం ఎర్రబడింది. కుమారస్వామి భార్య వుద్దేశం గ్రహించేడు. “మా ఆఖరు అమ్మాయి రమణి” అని పరిచయం చేసేడు. సూర్యకాంతమ్మ ఆమె చదువు చెప్పింది. “ఎం. ఎస్‌సి. చదువుతూంది. సెలవులకి వచ్చింది.” తన కూతురు చదువులో కూడా ఏమాత్రం తక్కువ కాదు సుమాయని జ్ఞాపకం చేయడం ఆమె వుద్దేశం. కాని జానకి ఆమె అసలు హెచ్చరికనింకా గ్రహించలేదు. “చాలా బాగుంది. సబ్జక్టు ఏమిటమ్మా!” కుమారస్వామి భార్య మాట్లాడేందుకేమాత్రం అవకాశం ఇచ్చినా రభస సృష్టించగలదని భయపడ్డాడు. ఇంక తానే ఇతరుల మాట చొరనివ్వకుండా సంభాషణ ఎత్తుకున్నాడు. “మీ పెద్ద వదినగారమ్మా! కాలేజీలో లెక్చరరు. ఏమిటి మీ సబ్జక్టు” కోడలు అయినా, తనకన్న బాగా చిన్నదైనా చనువుగా ఏకవచన ప్రయోగం చెయ్యలేకపోయేడు. “తమరు నన్ను మన్నించడం న్యాయం కాదండి. నువ్వనడం తప్పు కాదు.” చటుక్కున సూర్యకాంతమ్మ అందించింది. “ఆడపడుచును నువ్వనకూడదు. ఆ మాత్రం తెలియదా?” జానకి తెల్లబోయింది. ఇందాకటి నుంచీ ఆమె ప్రయత్నం అదన్నమాట. అంతలో సర్దుకొని క్షమార్పణ చెప్పుకొంది. “క్షమించండి.” తల్లి మాటకు రమణి సిగ్గుపడింది. “ఏమీలేదు. చిన్నదానిని మీరు మన్నించడం ఏమిటి?” జరగవలసిన పని జరిగిపోయేక కుమారస్వామి మనమని వంక తిరిగేడు. ఆప్యాయంతో అతని భుజం మీద చెయ్యి వేసేడు. “భద్ర చెప్పింది.” “ఎండలో కష్టపడి వచ్చేరు. మేమే వస్తున్నాము. అత్తయ్యతో చెప్పింది అమ్మ.” దానికి ఆ వృద్ధుడు చెప్పింది ఏమిటో తల్లి కొడుకులిద్దరికీ కొరుకుడు పడలేదు. “ఇరవయ్యేళ్ళ క్రితం ఇలాగే హోటలు నుంచి వాడిని తీసుకెళ్ళలేకపోయా. వాడు మళ్ళీ ఇంటికి రాలేదు. అల్లాంటి పనే మళ్ళీ చేస్తానేమోననిపించింది. నిన్ను చూడాలనే వచ్చేనోయ్....” అన్నాడు ఆయన. రవీంద్ర ‘థేంక్స్’ తెలిపాడు. తండ్రి మాటలకి వ్యాఖ్యానంలాగ రమణి చెప్పుకుపోయింది. “భద్ర వదిన చెప్పింది. సరిగ్గా తండ్రి పోలికే. ఆ వయస్సులో అతడు అల్లాగే వుండేవాడంది. ఇంక ఆయన ఒక్క నిముషం ఆగలేదు.” ఒక్క నిముషం ఆగి మళ్ళీ చెప్పింది. “మా అన్నయ్యని చూసిన గుర్తు కూడా లేదు నాకు. వాళ్లు మరిచిపోలేదు. ఓమారు ఇంటికి వచ్చేడట. ఇద్దరూ ఆయన అని తెలియక చిరాకు పడ్డారట. తెలిసి చేసింది కాదు, ఆ పని. కాని, దాని ఫలితం మనస్సుని కోతపెడుతూనే వుంది.” జానకికి ఆ ఘటనలు, ఆ చరిత్రలు ఏమీ తెలియవు. కాని ఆ వృద్ధదంపతుల మనోభావాలు కర్ణాకర్ణిగా వింది. ముసలాయన పంపిన మనుష్యులే భర్త మీద దౌర్జన్యం చేయడం తెలుసు. కనక వారి మనస్సు కోత గురించి ఆమెకు ఏమాత్రం సానుభూతి కలగలేదు. కాని, ఆ యిద్దరిలో తన భర్త మీద దౌర్జన్యం చేయించేడన్న కుమారస్వామిని చూస్తూంటే జానకికి ఆ కథ నిజమే అయి వుంటుందా అనిపించింది. కాని, సూర్యకాంతమ్మ యెడ ఆమెకు సద్భావం కలగడం లేదు. చిన్నప్పుడు పెళ్ళికాకపూర్వం ఆమెను మద్రాసులో చూసింది. అప్పుడైనా ఆమె ఎల్లాగో వున్నట్లే అనిపించింది. మగని దివాన్‌గిరీ ఆమెకు మెడనరం పట్టించింది. ఆ వుద్యోగం యిప్పుడు లేకపోయినా ఆ నరం సర్దుకొన్నట్లు లేదు. ముసలాయన మనమడి భుజం పట్టుకొని కోడలివేపు తిరిగేడు. “మీరిద్దరూ లేవండి. మనింటికి పోదాం. మనిల్లు వుండగా మీరిక్కడ వుండడం బాగులేదు.” “లేవండమ్మా!” అని సూర్యకాంతమ్మ మగని పిలుపును బలపరిచింది. వారు వచ్చేరన్నప్పుడే విశ్రాంతి ఆశ వదులుకొంది, జానకి. “మేమూ బయలుదేరే ఏర్పాటులోనే వున్నాం” అంటూ కొడుకును రాక్షాలు చూడమని పురమాయించింది. “ఇక్కడ టాక్సీలు లేవులా వుంది” అంది రమణితో. “అక్కర్లేదు, కారుంది.” “అయితే సరే. వస్తున్నాము. ఒక్క క్షణం కూర్చోండి....నానీ, ఏమన్నా తీసుకోవాలా?....మీరు కూడా రాండి! మొఖం కడుక్కోరూ!” అని రమణిని బయలుదేరతీసింది. “మీరు అల్లా నన్ను మన్నిస్తూంటే నాకు చచ్చినంత సిగ్గుగా వుంది.” “ఏమీ లేదు.” కుమారస్వామి కూతురును పిలిచేడు. “డ్రైవరుని పిలు. కూలి కుర్రాడిని తీసుకొని పైకి రమ్మను.” “ఏం కావాలం”ది జానకి. “మీ సామానులు తెచ్చి కారులో....” జానకి అటువంటి ప్రశ్నా, సమస్యా రాగలదని ముందే సిద్ధపడింది. “అద్దె రెండు రోజులకి ముందే కట్టేశాను. వుండనియ్యండి. తరవాత చూడొచ్చు.” అమె తన ఆహ్వానం కోరుతూ హోటలులో తాత్కాలికంగా మకాం పెట్టలేదన్న మాట. తమ యింట బసచేసే ఆలోచన ఆమెకు లేదని ముగ్గురూ గ్రహించేరు. “అల్లా ఎందుకు చేశావమ్మా!” అని మాత్రం అనగలిగేడు కుమారస్వామి. అయితే ఆ మాటలోనే మనస్సులోని నొప్పి అర్థం అయింది. నిరుత్సాహంగా- “సరే....సరే....లేవండి” అన్నాడు. జానకి రమణినీ, కొడుకునూ వెంటబెట్టుకొని తమ గదివేపు నడిచింది. ఆమెవేపే చూస్తున్న సూర్యకాంతమ్మ నెమ్మదిగా అంది. “ఏమిటా వేషం? ఏమి పోకిళ్ళు? ఏమిటా విరుగుబాటుతనం?” భార్య మనస్సులోని ఈర్ష్యను కుమారస్వామి అర్థం చేసుకొన్నాడు. “ఆమెతో లేనిపోని గొప్పలకుపోయి కలహం పెంచుకోకు. ఈ కుర్రాడేనా దగ్గరగా రానీ.” “ఏం ఫర్వాలేదు. వాళ్ళూ ఎత్తుమీదే వచ్చారు. బెంగెట్టుకోకండి.” మూడో ప్రకరణం తమ గదిలోకి వెళ్ళేక జానకి కబుర్లు ప్రారంభించింది. తాను వెడుతున్న యింట్లో పిల్లలు ఎవరుంటారో, ఎందరు వుంటారో తెలుసుకోవాలి. పిల్లలున్న చోటికి చేతులూపుకొంటూ వెళ్ళడం మర్యాద కాదు. కొందరికిచ్చి మరికొందరిని వదలడం సబబూ కాదు. “మీ చిన్నన్నగారు ఎక్కడుంటున్నారు?” “మనం వెడుతున్న యింట్లోనే. ఇంకో అన్నయ్య ద్వారకానగర్‌లో వుంటున్నారు.” “అయితే జ్యోతి అని ఒక వదినగారు వుండాలి. ఏ అన్నగారి భార్య?” “మీరు చిన్నన్నయ్య అన్నారే ఆయన భార్య. చనిపోయి పదేళ్ళయ్యింది.” “అయ్యో పాపం! పిల్లలా?” “లేరు. మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. ఈమెకు నలుగురు....” “ద్వారకానగర్‌లో అన్నయ్యకి?” “ఇద్దరు. ఆవిడ మీలాగే లెక్చరరు.” “ఆయన?” “ఆయనాను.” “మీకు అక్కగార్లుండాలి కదూ?” “ఇద్దరు. వాళ్ళ అత్తవారిది ఈ వూరే. పెద్దావిడది జగన్నాధపురం. రెండో ఆమె ఈండ్రపాలెంలో వుంటున్నారు.” గదిలోకి అప్పుడే వస్తున్న రవీంద్ర తల్లి సంజ్ఞమీద వారి దగ్గరకు వచ్చేడు. డబ్బు తీసుకెళ్ళి నాలుగైదు బిస్కట్ పేకెట్లు, స్వీట్స్ పట్టుకురా నానీ!” “అంతకంటె పళ్ళు తేవడం బాగుంటుంది కాదమ్మా!” “బాగుంటుందనుకో. కానీ పళ్ళ దుకాణాలు ఎక్కడున్నాయో నీకెల్లా తెలుస్తుంది? బిస్కట్లు, స్వీట్స్ అయితే దిగువనున్న కిళ్ళీషాపులో వున్నాయి.” “ఔననుకో. పళ్ళయితే తాతగారు కూడా తినగలుగుతారు.” అతని సమాధానం విని రమణి నవ్వింది. తండ్రి విషయంలో అతడు కనపరచిన ఆప్యాయతకు ఆమె ఎంతో సంతోషించింది. అతని చేయి పట్టుకొంది. “రా నేను చూపిస్తా.” ఇద్దరూ వీధిలోకి బయలుదేరేరు. “ఇప్పుడే వచ్చేస్తాం. మీరు వుండండి. వదినగారు వస్తున్నారు.” అని రమణి తల్లిదండ్రులను సమాధానపరచింది. జానకి వారి వెనకనే వచ్చింది. “ఎక్కడికమ్మా వాళ్ళిద్దరూ వెళ్ళేరు?” “వాడు ఏదో కావాలనుకొన్నాడు. ఆమె చూపిస్తానన్నారు.” “డ్రైవర్ని పంపుతే అతడే తెచ్చేవాడు కదా” అన్నాడు ముసిలాయన. జానకి ఏమీ అనలేదు. మరో పావుగంటలో ఇద్దరూ తిరిగి వచ్చేరు. “లేవండి, వెడదాం.” “ఏంకావాలో తెచ్చుకొన్నారా?” అన్నాడు కుమారస్వామి. “ఆ” – అంది. రమణి తానే. నాలుగో ప్రకరణం కారు ఒక పెద్ద ఆవరణలో ప్రవేశించి ఒక మేడముందు నిలబడింది. ఆవరణ చాల పెద్దదే. దానిలో వో క్రమం లేకుండా పది కొబ్బరిచెట్లు, నాలుగు జీడిమామిడిచెట్లు, రెండు మామిళ్ళు కనిపించాయి. దొడ్డి అంతా మెరకలు, పల్లాలు. కొంతమేర ఇసుక. కొంతమేర మన్ను, నానా చెత్త మొక్కలతో కీసర, బాసరగా వుంది. రోడ్డునుంచి మేడ ముంగిలివరకూ దారి కాస్త తెరిపిగా వుందేగాని, శుభ్రంగా లేదు. దొడ్డిలాగే మేడ కూడా పెద్దదిగా కనిపిస్తూంది. దొడ్డిలాగే అదీ వెలవెలపోతూ వుంది. చటుక్కున చూస్తే ఏదో శిధిలమందిరం అనిపిస్తుంది. కాని, కాదు. అందులో శైథిల్యం ఏమీ లేదు. గుమ్మంలో కారు ఆగిన చప్పుడు విని ఏడెనిమిదిమంది పిల్లలు పరుగెత్తి వచ్చారు. అంతా మండిగం దగ్గర అటూ ఇటూ సర్దుకున్నారేగాని రాలేదు. రమణి వదినగారి వేపు చూస్తూ “అక్కయ్యలు ఇద్దరూ వచ్చేరులా వుంది.” అంది. “అందర్నీ ఇక్కడే చూడగలుగుతా” నంది జానకి. ముసలాయన కారు దిగి ఒక్కమారు వెనక్కి తిరిగి “రాండి” అని ఆహ్వానించి తాను ముందుకు నడిచేడు. “ఇంట్లో నలుగురినీ పరిచయం చేసుకొని పైకిరా, రవీ!” అని తను మేడ ఎక్కేడు. రవీంద్ర వినయంగా “అల్లాగే నండి” అన్నాడు. “నేను తీసుకొస్తాలెండి....” అని రమణి వాగ్దానం చేసింది. కుమారస్వామి మేడమీదకు వెళ్ళిపోయేక కుర్రవాళ్ళ పురోగమనం ప్రారంభమయింది. క్షణం క్రితం పిల్లలులాగా ఒదిగివున్న వాళ్ళంతా పెద్దపులులులాగా తయారయేరు. వాళ్ళను నిలబెట్టడానికీ, ఎవరెవరేమిటో చెప్పడానికి రమణి ప్రయత్నించింది. కాని సాగలేదు. కొడుకు చేయిపట్టుకొని జానకి గుమ్మంలోకి వచ్చేసరికి ఎనిమిదేళ్ళ పిల్ల గబగబా ముందుకు వచ్చింది. “మీరు ఎవరూ?” వెనకనే వున్న రమణి ముందుకువచ్చి ఆ పిల్లను దగ్గరకు తీసుకుంది. “పెద్ద అత్తయ్యగారిని అలా అడగవచ్చునా?” అని మందలించింది. ఆ పిల్ల ఎవరో చెప్పడానికి జానకి వేపు తిరిగేసరికి అంతకన్న పెద్ద వాడు ముందుకొచ్చేడు. “ఏం కావాలి? ఎందుకొచ్చేరు?” ఈమారు పక్కనేవున్న సూర్యకాంతమ్మ వో అడుగు ముందుకు వేసి వానిగడ్డం పుణికింది. “ఏం కావాలా? నీ కోసమే, నిన్ను చూసిపోదామనే వచ్చేరురా” అంది. అంటూనే ప్రక్కకితిరిగి “పెద్దాతని పెద్దకొడుకు....” అంది. అంతలో తెలివి తెచ్చుకుని సర్దుకొంది. “అదే సీతాపతి కొడుకు.” తన భర్తను ఆ యింట్లో పెద్దకొడుకుగా కూడా మరచిపోయారని జానకి గ్రహించింది. ఇంతలో డ్రైవరు పళ్ళబుట్ట తెచ్చి అక్కడ పెట్టడంతో పిల్లల దృష్టి అటు మళ్ళింది. ఇంట్లోకి దారి విడింది. లోపలి హాలులోకి వెళ్ళేసరికి నలుగురైదుగురు ఆడవాళ్లు కూర్చుని వున్నారు. సూర్యకాంతమ్మ వారికి రవీంద్రను పరిచయం చేసింది. “రామానుజమ్మగారూ! ఇదిగో. ఇతడు మా విశ్వపతి కొడుకు. ఈవిడ ఇతని తల్లి. బొంబాయిలో వుంటున్నారు. ఈవేళనే వచ్చారు.” జానకి ఆ పండు ముత్తయిదువుకు నమస్కారం తెలిపింది. ఎవరన్నారో మొదట తెలియకపోయినా ఒకరివెనకనొకరు “కూర్చోండి. కూర్చోండి” అని నలుగురూ ఆహ్వానించేరు. వారితోపాటు చాపమీద కూర్చుంటూ కొడుకుతో “తాతగారు రమ్మన్నారు కదా. వెడతావా. బుల్లి అత్తయ్యగారిని తీసుకెళ్లు” అంది. సూర్యకాంతమ్మ మొదట పరిచయం చేసింది అతడినే అయినా, కూర్చున్నవారిలో ఒకావిడ మళ్ళీ అడిగింది. “మీ అబ్బాయా? ఇలా రా నాయనా?” రమణి ఆమె ఎవరో చెప్పింది. “పెద్ద అత్తయ్య.” రవీంద్ర నమస్కారం తెలిపేడు. “నీ పేరేమిటయ్యా!” ఒకమారు చిన్న అత్తయ్య, ఇంకోమారు పిన్నమ్మ, మరోమారు రామానుజమ్మ వరసగా, అనంతంగా వేస్తున్న ప్రశ్నలకు రవీంద్ర బెరుకు బెరుకుగా సమాధానాలు ఇస్తున్నాడు. మధ్యమధ్య నన్ను బయటపడెయ్యమన్నట్లు రమణివంక చూస్తున్నాడు. ఆమె తెల్లబోయి, నిస్సహాయంగా నిల్చుంది. “ఏం చదువుకున్నావు?” “తెలుగు వచ్చునా?” అందరూ తలొకటీ, క్రమం లేకుండా అడుగుతున్న ప్రశ్నలు కొద్దిసేపటిలో ఒక క్రమంలో పడ్డాయి. రామానుజమ్మే అడిగింది. “కొడుక్కి పోచ పడిందా అమ్మా!” ఆ అవకాశం చూసుకొని రవీంద్ర వారి మధ్యనుంచి దాటుకొన్నాడు. “తాతయ్యగారు కనిపెట్టుకొని వుంటారు. వెళ్ళొస్తానండి.” పెద్ద మేనత్త ధారాళంగా అనుమతించింది. “వెళ్ళిరా అమ్మా!” ఊహించి వుండని ప్రశ్న వలన కలిగిన సంభ్రమం నుంచి జానకి సర్దుకొంది. “లేదండి.” “అదేమిటమ్మా! ఇరవయ్యేళ్ళ కొడుకుండగా ఎవరో కర్తృత్వం మీద వేసుకొని తద్దినం పెట్టడం కర్మ ఏం వచ్చింది? అలా ఎందుకు చేశావు, తల్లీ!” అని పెద్ద ముత్తయిదువ రామానుజమ్మ అనుతాపం చూపింది. అనుకోని దారికి మళ్ళిన సంభాషణకు జానకి మరింత తత్తరపడింది. తద్దినం, కర్తృత్వం వగైరా మాటలతో మనస్సులోని గాయం పచ్చి చేసింది. బాధ కలిగింది. నిగ్రహించుకొని వూరుకుంది. ఈమారు రామానుజమ్మ సూర్యకాంతమ్మకు సలహా యిచ్చింది. “మీరు పెద్దవాళ్ళిద్దరూ వో మంచి ఘడియ చూసి, వో జందెప్పోగు వేసెయ్యండి. బ్రాహ్మడికి గర్భాష్టకంలో ఉపనయనం అయిపోవాలి. రోజులిలా వచ్చేయి గనకగాని, మా చిన్నప్పుడు ఇలా వుండేదా?” జానకికి బురదలో చిక్కుపడ్డట్టు అనిపించింది. ఒడుగు చేయడం, సాంప్రదాయికాచారాలూ యెడ తనకు విశ్వాసం లేకపోవడమే కాదు. ఖచ్చితమైన అభ్యంతరాలున్నాయి. వేల సంవత్సరాలు మానవజాతి సాధించిన మానసికపురోగతిని అవహేళన చేయడమే, వానిని ఆచరించబోవడమని ఆమె విశ్వాసం. కాని ఆ వాదనలూ, ప్రతివాదనలూ ప్రవేశపెట్టేందుకు అది సమయమూ కాదు, సందర్భమూ కాదు. అక్కడున్న జనం దానిని వినిపించుకోనూ లేరు. హఠాత్తుగా రంగంలో భద్ర ప్రవేశించి, కొద్దిసేపు ఆమెనా చిక్కులోంచి బయటపడేసింది. మనస్సు కూడదీసుకొని తయారుకావడానికి ఆ వ్యవధి సరిపడింది. “ఎంతసేపయిందే జానకీ, వచ్చి? ఈ పొరుగునే మా వూరి అమ్మాయి వుంది. వోమారు చూసివద్దామని అలా వెళ్ళా....” “అత్తగారూ, మామగారూ హోటలుకే వచ్చేరు. విశ్రాంతి మాట తరువాత చూసుకోవచ్చని వారితో వచ్చా....” “రవీంద్ర ఏడీ?” “వాళ్ళ తాతగారితో వున్నాడు.” సూర్యకాంతమ్మ తెగిపోయిన సంభాషణను తిరిగి అతుకుపెట్టింది. “రవీంద్రబాబుకి మమ్మల్ని ఇక్కడ వొడుగు చేసెయ్యమంటున్నారు రామానుజమ్మగారు.” భద్ర కళ్ళలో కొంటెతనం కనబడింది. “బాగానే వుంటుంది. అయితే జానకి ఏమంటుంది?”  “కడిగిన ముఖం, వేసిన దంఝం వుండటం మంచిదంటారు పెద్దలు” అని కృష్ణవేణి అంది. “అవును నీ కూతురుకు ఈడే కూడ. పనిలో పని ఆ ముడి కూడా వేయించెయ్యండి. మేనరికం....” అంటూ రామానుజమ్మ నవ్వింది. కృష్ణవేణి సాంప్రదాయికాచారాలు పాటించే సనాతన కుటుంబంలో కోడలు. తన తమ్ముడు వితంతువును వివాహం చేసుకొన్నాడు. ఆ జంటకి పుట్టినవాడు రవీంద్ర. అతనికి పిల్లనిస్తుందా? కాని, ఆమాట చెప్పవలసిన పనిలేదు. నవ్వేసి వూరుకుంటే పోతుంది. కాని, ఆమె వూరుకోలేదు. వెంటనే తన కుటుంబం యొక్క శిష్టత్వాన్ని వర్ణించింది. “ఈనాడు కూడా మావారు మూడుప్రొద్దులా సంధ్య వార్చందే విస్తరి దగ్గర కూర్చోరు.” భద్ర అంత ఒడుపుగానూ అనేసింది. “మా జానకికి బ్రాహ్మణ్యం, పూజలూ అంటూ చేపలపడవలు కాంట్రాక్టు చేసే వాళ్ళంటే అసలు భరించలేదు.” కృష్ణవేణి భర్త హరనాధం కాకినాడ రేవులో, ఆంధ్రప్రభుత్వం చేపలు పట్టడానికై ప్రవేశపెట్టిన మోటారుబోట్లు కాంట్రాక్టు చేశారు. కృష్ణవేణి తెల్లబోయింది. జానకికి అసలు విషయం తెలియకపోయినా భద్ర వెక్కిరింతను అర్థం చేసుకుంది. సర్దుబాటుగా అంటున్నాననుకొంది. “ఈ కర్మకాండల మీద నాకూ, మావాడికీ కూడ నమ్మకంలేదండి” నలుగురూ తెల్లబోయేరు. ఆడదానినోట అటువంటి భావం వినడం వారందరికీ ఆశ్చర్యంగానే వుంది. సూర్యకాంతమ్మే ముందు తేరుకొంది. “మనం చేస్తున్నవన్నీ నమ్మకం వుండే చేస్తున్నామా? పెద్దలనాటి నుంచీ వస్తున్న అలవాట్లూ, ఆచారాలూ....” ఒకరికి మనచేత్తో ఉపనయనదీక్ష ఇవ్వడం అనేది మహోత్తమపుణ్యకార్యంగా జమ. ఈ వృద్ధాప్యంలో తలవని తలంపుగా స్వర్గద్వారాలు తెరిచే అటువంటి మహోత్కృష్ట కార్యం చేయగల అవకాశం వచ్చింది. దానిని ఆమె పోనియ్యదలచలేదు. జానకీ వదలలేదు. “నమ్మకం లేకపోవడమే కాదు. అది తప్పు అని తెలిసి చెయ్యడం” “మనం బ్రాహ్మలుగా పుట్టడం కూడా తప్పేనా?” అంది రామానుజమ్మ ఎంతో బాధతో! “ఏం చదువులు వొచ్చేయర్రా”-అని అంగలార్చింది. “మన పుట్టుక మన నిమిత్తం లేకుండా జరిగిపోయింది. అందరిలాగే మనమూ పుట్టాం” అంది భద్ర. “ఓ దారం మెళ్ళో వేసుకుని ఆ పుట్టుకకి ఘనత ఆపాదించుకోడం, మిగిలిన వాళ్ళందరికీ దూరంగా వుండడం అదీ....అసలు తప్పు....” అంది జానకి. సంభాషణ ఆ విధంగా తిరగడం అందరికీ సముద్రపు నీళ్లు పుక్కిలించినట్లు అనిపించింది. కృష్ణవేణి హేళన చేసింది. “మా అమ్మకోడళ్లు పండితురాళ్లు.” సూర్యకాంతమ్మ రుసరుసలాడింది. “గుణాలకొద్దీ రణాలు.” జానకి చిరునవ్వులో మనస్సులోని క్రోధాన్ని దాచిపెట్టింది. భద్ర ముఖం జేవురించడం చూసి వూరుకోమన్నట్టు కన్నుగీటింది. విషయం వేడిలో పడిందని గ్రహించి రామానుజమ్మ చటుక్కున మాటమార్చింది. “నువ్వుంటున్నది బొంబాయిలోనా అమ్మా?” పదినిముషాలు ఆమాటలూ ఈమాటలూ చెప్పి జానకి లేచింది. “ఒక్కమారు మామగారికి కూడా కనిపించి వస్తా. తరవాత అందరి దర్శనం చేసుకుంటా, సెలవిప్పిస్తే.” “ఉంటారా! మా యింటిక్కూడా వోమారు రాండి” అని ఆహ్వానించింది కృష్ణవేణి. “అందరినీ చూడాలనేకదా వచ్చింది.” అంటూ భద్రను వెంటదీసుకొని మేడమీదికి వెళ్ళింది. “మహాగర్విష్టిలా వుంది”  అంది కృష్ణవేణి. “మాట దుడుకుతనం ఎక్కువ”….అంది శారద, ఆమె తోడికోడలు. ఆమె ఇంతసేపూ నిశ్శబ్దంగా కూర్చుని సంభాషణ వింటూంది. అయిదో ప్రకరణం ఇంటికి రాగానే సీతాపతి భార్యముఖతః జానకి రాక గురించి విన్నాడు. కాఫీ కప్పుతో పాటు వివరాలు కూడా అందచేసింది, కళ్ళు తిప్పుతూ. “చాల ఘటికురాలల్లే వుంది. మహా తెలివిగలది....మగాళ్లు ఆవిడ ముందు యెందుకూ చాలరు.” “అంటే....” అన్నాడు, సాలోచనగా. “నన్నూ, రాజామణినీ పీకి పిండిపెట్టినట్లు అనుకున్నారు మీ అమ్మగారు. గరిట కాల్చి వాతబెట్టినట్లు నోరు నొక్కేసింది....” అని జానకి ఘటికురాలుతనానికి బలం చేర్చింది. సీతాపతిరావు వూరుకొన్నాడు. తన అమాయకత్వాన్ని చెప్పేందుకై అత్తగారి రాలుగాయితనాన్ని వర్ణించ బూనుకొందా, ఆ రోజున అసలు విషయం బయటపడదు. “వాళ్ళ కుర్రాడెల్లా వున్నాడు?” “అబ్బో, తల్లిని మించిన గడుస్తనం. తాతగారిని బాగా లాయమారుతున్నాడు. ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టి బొమ్మ గీసేడు. తాతగారి కోసమని అతడే బత్తాయిలూ, ఆపిల్సూ కొనుక్కొచ్చాడుట. మొత్తం మీద తల్లీ కొడుకూ ముసలాయన్ని బుట్టలో పెట్టేరు.” బుట్టలో పెట్టడం యెందుకో శారద చెప్పనక్కర్లేదు. సీతాపతి యోరుగును. ఆస్తి కోసం. ఈమధ్య పంపకాలు, ఆస్తివాటాలు గురించి ఇంట్లో చర్చలు వస్తున్నాయి. శారద తన వుహలు నిరాధారం కాదని సాక్ష్యాధారాలు చూపించింది. “పెద్దాడు కడుపున పడ్డప్పుడు కాన్పు కష్టమయి చచ్చిపోతానేమోనని అంతా కాంగారుపడ్డప్పుడు మీ అమ్మా నాన్నా వచ్చి చూడలేకపోయేరు. అలాంటివాళ్లు ఆవిడ వచ్చి హోటలులో దిగిందని భద్రమ్మగారు చెప్పేసరికి గడగడలాడుతూ స్వయంగా వెళ్ళి దర్శనం చేసుకొని మరీ తీసుకొచ్చేరు.” “భద్ర వచ్చిందా?” “అసలావిడ వెంట వదలడం లేదు. మీద ఈగవాలితే చెప్పుచ్చుకుంటూంది.” “వాళ్ళిద్దరికీ మంచి స్నేహమటలే....” అన్నాడు సీతాపతిరావు. “స్నేహం లేదు సింగినాదం లేదు. మనం యెరగని స్నేహాలేమిటి? బొంబాయిలో ఇల్లు వుందట. ఏమాత్రమో పిచికలు దగ్గర చేరేవుంటాయి. మచ్చిక చేసుకొంటే, కానీ ఖర్చు లేకుండా కూతురికి మొగుడు అమరుతాడు.” “బాగుంటాడా?” ఎంత బాగుంటాడో శారద ఒక చిన్న ఉదాహరణతో చెప్పేసింది. “చేసుకోవచ్చునైతే మీ బుల్లి చెల్లెలు పైకి పోనివ్వదు.” “ఏమిటా మాట? ఎవరన్నా వింటే....” సీతాపతిరావు నిస్సహాయక గదమాయింపు వినిపించేడు. శారద లెక్కచేయలేదు. “చూస్తుంటే లేదుగాని, వింటే వచ్చిందా? ఆ కుర్రాడిని మీ చెల్లెలు ఒక్కక్షణం వెంట వదలడం లేదు. ఎక్కడ ఏం లోటు వస్తుందో. యెక్కడ కష్టపడిపోతాడో అని వెయ్యి కళ్ళతో కనిపెట్టి ఉంటూంది. చివరకి మేటినీ పేరెట్టి లాక్కుపోయింది.” సీతాపతిరావు ఏమీ అనలేదు. ఒక్క నిముషం ఊరుకుని శారద మళ్ళీ అంది. “కుర్రాడు బాగానే ఉన్నాడు. గునపంలా, ఒడ్డూ పొడుగూ వుంది. అయితే చదువూ సంధ్యా అట్టే వున్నట్టు లేదు.” “అదేం మరి? బొంబాయిలాంటి పట్టణంలో వుండి, తాను చదువుకొని వుద్యోగం చేసుకుంటూ కూడా ఆమె కొడుక్కి చదువెందుకు చెప్పించలేదు?” “రాదేమో! ఏం గొడవో ఏమో కాని, భద్రమ్మగారు మాత్రం డిగ్రీలమీద వెలపరం చూపిస్తున్నారు. మంచి ఆర్టిస్టు. స్వతంత్రమైన జీవనం. వెధవ డిగ్రీలు వుండి లాభమేం? అంటూ అతణ్ణి తెగ మెచ్చుకొంటున్నారు.” “ఆవిడేం మాట్లాడలేదా? ఎంతసేపూ భద్ర ఏమందో చెప్తున్నావు?” “మూగిదేం కాదు. కొడుకు వడుగు చెయ్యలేదా అన్నారు ఎవరో అక్కడ. ‘వడుగెందుకు?బ్రాహ్మడి ఎక్కువేమిటి? ఎవళ్ళు పుట్టినా ఒకటే దారి! చెరిగేసింది....బాబోయ్.....” “మా అమ్మ ఏమంది?” “ఆవిడ ధోరిణి ఏమీ నచ్చలేదు మీ అమ్మగారికి. అందుచేత వాళ్ళు కూడా మీ అమ్మగారిని వదిలేసి నాన్నగారిని పట్టుకున్నారు” అని శారద తేల్చింది. “ఉహూ” అన్నాడు సీతాపతి సాలోచనగా. ఆరో ప్రకరణం తండ్రిని చూసి విషయాలు తెలుసుకోవాలని సీతాపతిరావు మేడమీదికి వెళ్ళేడు. ఆయన హాలులో పడక కుర్చీలో కళ్ళు మూసుకొని పడుకొని వున్నాడు. తలగట్ల కుర్చీ వేసుకు కూర్చుని తల్లి ఆయన నుదురు రాస్తూంది. తమ్ముడు లక్ష్మీపతి కూడా అక్కడే వున్నాడు. “అలా పడుకున్నారేం?” అని సీతాపతిరావు నెమ్మదిగా ప్రశ్నించేడు. “ఏం లేదు. కొంచెం అలసటగా ఉందన్నారు” అంది సూర్యకాంతమ్మ. “భోజనం చేసేక ఓ నిముషం పడుకోవాలి. ఈ వేళ కుదిరింది కాదు. అంతే. మరేం లేదు.....” అన్నాడు కుమారస్వామి. “అటువంటి పనెందుకు చేశారు? వయస్సు వచ్చాక కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. ఎంత అవసరమైన పనివున్నా ఆరోగ్యం కన్నానా?” అని సీతాపతి సన్నగా మందలించేడు. కొడుకు మందలింపు ముసలాయనకు చాలా సంతృప్తి కలిగించింది. “విశ్వపతి పెళ్ళాం, కొడుకూ వచ్చి హోటలులో ఉన్నారన్నారు. ఇంటికి రమ్మందామని వెళ్ళేను. దానితో నిద్ర చెడింది.” “మీదంతా లేనిపోని హైరాణ. ఊళ్ళోకి వచ్చినావిడ ఇంటికి రాకుండా వెళ్ళిపోతారా! వెళ్లి పిలుస్తేగాని రారంటే నేనో, తమ్ముడో వెళ్లి వచ్చేవాళ్ళం కదా! మీరు ఎందుకంత ఆయాసపడ్డం!” సీతాపతిరావు తన తండ్రి అనలోచితంగా, అనర్హుల విషయంలో ఆ ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు తేల్చేడు. “శారద చెప్తూంటే నాకు నమ్మకం కలగలేదు. ఎడ్రసు అడుగుతూ నిన్ననేకదా వైర్ చేశాం. విమానంలో రావాలన్నా వ్యవధి చాలదే! అప్పుడే ఎల్లా వచ్చేరంటాను నేను. అది వివరం చెప్పలేకపోయింది. మీరు చూసేరా? వాళ్ళేనా? గోగోల్ వ్రాసిన ఇన్ స్పెక్టర్ జనరల్ లో లాగ ఎవరినన్నా చూసి వాళ్ళనుకొంటున్నారా అన్నాను.” “అబ్బెబ్బే అదేం మాట. వాళ్ళే ....” అన్నాడు కుమారస్వామి. “ఊరికే హస్యనికన్నాను. అంతే. మీరు చెప్పినట్టే అంది శారద. అలా ఎందుకనుకుంటారు? భద్ర చెప్పిందిగదా అంది. ఇంతకీ ఆమె వచ్చిందట. ఏది?” “టెలిగ్రామ్ చూసి కంగారుపడి తానూ వచ్చేశానంది. వీళ్ళిద్దరూ నాలుగురోజుల క్రితం అగ్రహారం వచ్చేరట. మన వైర్ చూడగానే ఎలాగో అనిపించింది. పెద్దవాళ్ళు ఎలా ఉన్నారో యేమో. చూసివద్దామని అప్పటికప్పుడు బయలుదేరేమన్నారు.” అన్నాడు కుమారస్వామి. “మన వైర్ లో ఎవరికన్నా ఆరోగ్యం, అనారోగ్యం మాట వ్రాసినట్లు లేదే!” అని సీతాపతి తన అనుమానానికి ప్రాతిపదిక లేకపోలేదని సూచించేడు. “ఏం  లేదు. కాని, మనం ఎడ్రసు అడగడమే సూచనగా భావించేమంది” అన్నాడు కుమారస్వామి, తన ఆరోగ్య వ్యవహారం ఇంకా కొందరికి ఆదుర్దా కలిగిస్తూందన్న సంతృప్తితో. “తమాషాగా వుంది” అన్నాడు సీతాపతి. ఒక నిముషం వుండి మళ్ళీ మొదలుపెట్టేడు. “కూడా భద్ర రావడం మంచిపని చేసింది. ఎందుకొస్తేనేం? మంచి పని చేసింది. వాళ్ళిద్దర్నీ కూడా మనం ఎరగం. ఎప్పుడూ చూడనైనా లేదు. ఆ స్థితిలో మనకే కాదు. ఆమెకీ ఎంతో చికాకే. నిజంచేత మన కన్న ఆవిడకే చాల బాధ కలిగి ఉండేది. నేను ఫలానా అంటే మనం నమ్మడమా? నమ్మకపోవడమా?” “సరాసరి ఇంటికి రాలేదు. బ్రతికిపోయాం. లేకపోతే ఆ వేషం, ఆ నడక నాకు చాలా అసహ్యం అనిపించేయి. నేను మాట దాచుకోలేను. అనేస్తాను కూడా....” అని తన అమాయకత్వం వలన కలగవలిపి, తప్పిపోయిన ఇబ్బందులను తలుచుకుని తృప్త పడింది సూర్యకాంతమ్మ. “అట్టే తెలివితక్కువగా మట్లాడకు” అంటూ కుమారస్వామి భార్యను గదిమేడు. జానకి వేషభాషలలోగాని, మాటలలోగాని తెచ్చి పెట్టుకొన్నట్లు లేదని కొడుకులకు వర్ణించేడు. వెంటనే సీతాపతి తండ్రి మాటను సమర్ధించేడు. “మంచి ఉద్యోగంలో వుంది. బాగా చదువుకుంది. ఉంటున్నది బొంబాయి వంటి మహాపట్నంలో. సంఘంలో ఆమెకున్న స్థానంపట్టి ఆమె వేష భాషలుండడంలో ఆశ్చర్యంలేదు.” “ఉద్యోగినిగా పదిమందితో బ్రతికే మనిషి ఏడుపు మొహం, ఈడుపు కాళ్ళు, దరిద్రం వోడుతూ ఉంటారా యేమిటి? ఆవిడది గట్టి ప్రాణం. ఉద్దండపిండం అయి వుంటుంది! ఇక్కడినుంచి వెళ్ళేసరికి మెట్రిక్ మాత్రమేట చదువుత! అల్లాంటిది పరాయి రాష్ట్రంలో వుద్యోగం చేసుకొంటూ, చదువుకొని లెక్చరరుగా పని చేస్తూందంటే, ఆవిడ దర్శనం చేసుకుంటే జన్మ తరిస్తుంది.” -అని లక్ష్మీపతి అతిశయ అభిమానం కనబరిచేడు. అతని భార్య చదువుకొంది. ఆమె కూడా స్త్రీల కాలేజీలో లెక్చరరు. అది తల్లికి ఇష్టం లేదు. చివరికి వెళ్ళి వేరే కాపురం పెట్టుకోవలసి వచ్చింది. తల్లిని ఉడికించడానికి అతడీ అవకాశాన్ని వుపయోగించుకొన్నాడు. మేనత్త జానకి వేషభాషలయెడ అయిష్టాన్ని వెలిబుచ్చినప్పుడే పైకివచ్చి, అంతా విన్న భద్ర కూడా తన అయిష్టం తెలిపింది. “చచ్చిపోయిన వాళ్ళకోసం అస్తమానం ఏడుస్తూ కూర్చోరు ఎవరూ! కన్నవాళ్ళు మరిచిపోయినా, కట్టుకొన్నదానికి....” సూర్యకాంతమ్మ బుస్సుమంది. “కనక ఎడాదికోమాటు తద్దినం కూడా పెట్టనక్కరలేదు.” “బ్రతికుండగా తినేశారు. చచ్చిపోయాక మహామూడుతుంది” అంది భద్ర అసహ్యం ఉట్టిపడేలా. సూర్యకాంతమ్మ పళ్ళు కొరుక్కుని తల విదిలించింది. ఆడవాళ్ళ మాటలలో మగవాళ్ళు కలగజేసుకోకుండా తమ ధోరణిలో ఉన్నారు. “ఆమె మంచి సమర్ధురాలనడంలో సందేహం లేదు” అన్నాడు సీతాపతిరావు తమ్ముని మాటలను సమర్థిస్తూ. వెంటనే సూర్యకాంతమ్మ అందుకుంది. “అయ్యో సమర్ధురాలుగాకేం? వాడు జబ్బుపడి మంచాన వుంటే.” “ఆ జబ్బు కూడా ఏమిటో, ఎందుకొచ్చిందో అది కూడా చెప్పు” అంది భద్ర కసిగా. ఇరవయ్యేళ్ళ క్రితం అగ్రహారంలో ఠాణేదారు పంపిన మనుష్యులు కొట్టిన దెబ్బల మీద, మద్రాసులో పోలీసువాళ్లు మరో వరస కొట్టేరు. ఆ దెబ్బలకు విశ్వం మంచాన పడ్డప్పుడు జానకి అతనికి పరిచర్య చేసిన విషయాన్నీ సూర్యకాంతమ్మ ఎత్తుకుంది. ఠాణేదారు చర్యకు వెనక ఆనాడు దివానుగా వున్న కుమారస్వామి ప్రోత్సాహం వుంది. ఆ విషయాన్ని భద్ర గుర్తు చేసింది. ఆనాటి కథలు తడువుతూంటే కుమారస్వామికి చికాకు కలిగి, అటు ఇటు కదులుతున్నాడు కుర్చీలో. భద్ర మాటను సూర్యకాంతమ్మ లెక్కచెయ్యలేదు. “....పక్కలో కూర్చుని ఏం కబుర్లు? ఏం నవ్వులు? ఎన్ని కథలు? నే నొచ్చేసరికి చల్లగా జారుకొనేది? అప్పుడే అనుకొన్నా....” “ఎప్పుడది? అతడీ ఇంట్లో ఎప్పుడున్నాడు? ఆవిడ ఎప్పుడొచ్చేరు?” అన్నాడు లక్ష్మీపతి ఆశ్చర్యంగా. “మద్రాసులోలే....” అంది తల్లి. “అప్పటికింకా వాళ్ళకి పెళ్లి కాలేదు” అంది భద్ర. పెళ్ళిమాట వచ్చేసరికి సూర్యకాంతమ్మ భగ్గుమంది. “పెళ్లి! వెధవముండకి పెళ్లి! నువ్వూ, నీ మొగుడూ చేసిన పని కాదిది? రోగపడి వుండగా, రహస్యంగా దాచడం పేరున తీసుకు వచ్చి వాడి మంచం దగ్గర పెట్టేరు. నాకు తెలీదు అనుకోకు. అసలు వాడు దాన్ని ఎరగడు. మీరే అంటగట్టేరు. కాలి పారాణి తడి ఆరకుండా ఒకణ్ణి మింగింది. తర్వాత వీడు. “నీ పద మెంత సిరిగల పాదమే యమ్మా!” దీనిని కట్టకపోతే వాడు బ్రతికి ఉండేవాడేమో....” “ఇతరుల జోక్యం లేకపోతే ఈ ఇంట్లో అన్నీ వేరే విధంగానే ఉండేవి” అంది భద్ర, చుర్రుమనేలా చూస్తూ. “ఏమిటే భద్రా! నువ్వు కూడా దానితో సమంగా....” అన్నాడు కుమారస్వామి నొప్పిగా. “ఏం లేదు మామయ్యా! ఆ పెళ్ళికి కొంతవరకు భాధ్యురాలిని నేను. అతగాడికి ఇల్లు కదిలి వీధిలోకి వెడితే దెబ్బలూ, కట్టిపోట్లూ తినకుండా తిరిగి ఇంటికి వచ్చే అలవాటు లేకుండాపోయింది. కనీసం కట్లుకట్టి, కాపడం పెట్టడానికేనా వో మనిషి ఉండాలని నేనే ప్రోత్సహించా. దాని గొంతు కోసింది నేనేనని ఇప్పుడు బాధ పడుతున్నా-” అంటూ చివాలున లేచి విసురుకు వెళ్ళిపోయింది. ఏడో ప్రకరణం కొడుకూ, భార్యా కాదన్నా, బొంబాయి మనుమడి ఎడ్రసు కోసం టెలిగ్రాం ఇప్పించినవాడు కుమారస్వామి. భార్యను బలవంతపెట్టి, హోటలులో వున్న జానకినీ, కొడుకునూ తమ కోడలూ, మనుమడూగా ఇంటికి తీసుకవచ్చినవాడు ఆయనే. కానీ, జానకిని చూసేక, ఆమె స్వతత్రంభావాల్నీ, గాంభీర్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ చూసేక అమెయెడ మెప్పుతోపాటు ఒక విధమైన ఈర్ష్యాభావం కూడా తలఎత్తింది. ఆమె తన దయాదాక్షిణ్యాలతో నిమిత్తం లేకుండా జీవించగలదు. సరాసరి హోటలులోనే దిగడం, రాత్రి భోజనానికి రా నిరాకరించడం, కేవలం నలుగురినీ పలకరించడానికి మాత్రమే ఆ ఇంటికి రావడమూ కష్టం అనిపించింది. ఆ కష్టపెట్టుకోడానికి కారణం కోసం వెతుకుతూ అనుమానించ దగిన స్థితిలో ఆమె కొడుకును తీసుకువచ్చిందని నమ్మకం కల్పించుకో ప్రయత్నించేడు. వాళ్ళు అగ్రహారం వచ్చిన రోజున సత్యానందం, భద్రా కూడా గుర్తించలేకపోయారన్న వార్తను బలంచేసుకుని ఆలోచనలు సాగిస్తూండగా, సీతాపతిరావు మాటలు ఆలోచించ వలసినవిగానే తోచాయి. భద్ర వెళ్ళిపోయేక సీతాపతి మళ్ళీ అసలు సమస్య గుర్తుచేసేడు. “అసలు మనుష్యులే అయ్యుంటారు.” ఆ ధృవీకరణ ఉద్దేశం దానికి వ్యతిరేకమయిన ఆలోచనలు సృష్టించడానికి మాత్రమేననీ, ఆస్తిలో వాటా పెట్టాలనే భయంతో ఆ అనుమానాలు సృష్టిస్తున్నాడనీ లక్ష్మీపతికి అన్నమీద అనుమానం. తల్లి తన భార్య మధ్య వైమనస్యాలలో అన్నగారూ, ఆయన భార్యా అవలంభించిన ధోరణిని అతడు ఎప్పుడూ అనుమానిస్తూ వచ్చాడు. అన్నగారి మాటను అవహేళన చేస్తూ....”భద్ర వదినేనా మనవేనా?” అన్నాడు. “ఒక్కొక్క ఘట్టంలో అదీ అలోచంచవలసే వుంటుంది-” అన్నాడు సీతాపతి. లక్ష్మీపతి తెల్లబోయేడు. “మనం ఎన్ని వినడంలేదు. మహా మహా వాళ్ళు బోల్తా కొడతారు. భద్ర ఊడిపడిందా? ఆ మధ్య విఘ్నేశ్వరరావు మేష్టారి తమ్ముడునంటూ ఒకడు వచ్చేడు. ఆయనకో తమ్ముడుండినమాట నిజమే. పదిహేను, పదహారేళ్ళ వయస్సులో ఇంట్లోంచి పారిపోయేడు. చాలకాలం వెతికేరు. జాడలేదు చచ్చిపోయేడనుకొన్నారు. తద్దినాలు కూడా పెడుతున్నారు. వో పాతికేళ్ళు పోయేక వో రోజున నేను మీ తమ్ముడినంటూ హాజరయ్యేడు. ఏమిటి గుర్తు? కథల్లోలాగ పుట్టుమచ్చలో,  అమ్మకట్టిన తాయెత్తులో, మరొకటో ఏమీలేదు. ఎవరూ గుర్తు పెట్టుకోలేదు. తల్లికూడా చెప్పలేకపోయింది....” తమ్ముడని తెలిసినా విఘ్నేశ్వరరావు ఎరగనట్టు నటిస్తున్నాడని వీధిలోవాళ్ళు అనుకొన్నారు. రామచంద్రాపురం తాలూకాలోది వో పాతిక ఎకరాల పల్లమూ, స్వగ్రామంలోదీ, కాకినాడలోదీ ఇళ్ళూ వున్నఅన్నదమ్ములు పంచేసుకొన్నారు. ఒకరు అమ్ముకు లేచిపోయేరు. వేరొకరు పెంచి పెద్దది చేసుకొన్నారు. పెద్ద సంసారంవున్న విఘ్నేశ్వరరావు తన వాటా ఇల్లూ, భూములూ నిలుపుకొన్నాడు. ఆ రోజున ఆ తమ్ముణ్ణి గుర్తిస్తే అవన్నీ తిరగతోడాలి. ఈ గొడవలన్నీ ఎందుకని వూరుకొన్నాడంటారు. “ఆస్తి వున్నచోట పెళ్ళామే ఎరగనంటుంది. భోనాల్ సన్యాసి కేసు వినలేదా?-అన్నాడు లక్ష్మీపతి. అన్నదమ్ముల సూటిపోటీ మాటలు వింటూ ఊరుకోలేక పోయేడు కుమారస్వామి. “ఒరేయ్. ఏదన్నా విషయం వచ్చినప్పుడు నాలుగు దిశలనుంచీ ఆలోచిస్తాం. ఆలోచించడం అంటే అందరూ తలోమూలకి లాగడం కాదు.” “అందర్నీ అనుమానించడమా?” అన్నాడు, లక్ష్మీపతి. “నేనేమీ ఎవ్వరినీ అనుమానించలేదు” అంటూ సీతాపతి తన వాదాన్ని సమర్థిచుకొన్నాడు. ఆ చర్చను తెంపేస్తూ కుమారస్వామి ఆదేశించేడు. “భద్రని పిలవండి పైకి.” సూర్యకాంతమ్మ మెట్లవేపు బయలుదేరింది. “అనుమానించవలసినవైతే వేరే వున్నాయి. ఈమెను అన్నయ్య పెళ్ళి చేసుకొన్నాడా? ఆ కుర్రాడు వాళ్ళ పిల్లవాడేనా?  ....ఇంకా ఎన్నో వున్నాయి. అవేమీ నే తీసుకురాలేదు” అంటూ సీతాపతిరావు తానేమీ తప్పుపని చేయడం లేదని నిరూపించుకొన్నాడు. భద్రను వెంటబెట్టుకొని సూర్యకాంతమ్మ వచ్చింది. ‘కూర్చో’ మంటూనే కుమారస్వామి భద్రను ప్రశ్నించేడు. “విశ్వపతి పెళ్ళి ఏ పద్ధతిలో జరిగింది?” “ఏం?” అంది భద్ర అనుమానంగా. ఈమారు సీతాపతి స్పష్టంగానే అడిగేడు. “ఏమీలేదు. అది నిజమైన పెళ్ళేనా? కాదా? అన్నది జరిగిన పద్దతినిపట్టి వుంటుంది కదా!” భద్రకు కోపంవచ్చింది. కళ్ళు ఎర్రబడ్డాయి. కాని, ఇంకా ఏం వస్తాయో విందాం-అన్నట్టు చూస్తూ వూరుకొంది. “విషయం వచ్చింది గనక అడగవలసి వచ్చింది. లేకపోతే వీటి అవసరం వచ్చేదికాదు. వాళ్ళ పెళ్ళి ఏ పద్ధతిగా జరిగిందన్నానని నీకు కోపంవచ్చింది....” “ఒళ్ళు మండేమాటకి కోపం ఎందుకు?”-అని భద్ర విసిరేసింది. “పోనీ నువ్వు ఏమన్నా తప్పదు. అది హిందూ మతధర్మం ప్రకారం జరిగిందా?” భద్ర ఖండితంగా చెప్పేసింది. “లేదు.” “పోనీ, రిజిస్ట్రేషను?” “నే నెరిగినంతవరకు లేదు.” “దండలపెళ్ళి అయివుంటుంది. కమ్యూనిస్టులు సభలలో పెళ్ళిళ్ళు అయాయనిపిస్తారు. దానికి విలువ ఏముంది?” “వాళ్ళకో పిల్లాడు కలిగాడు. పెళ్ళికి అంతకన్న విలువ ఏం వుంది?-“ అంది భద్ర రోషంగా. ఆమెచేతిలో ఏముంటే అది విసురుతుందనే భయం లేకపోతే సీతాపతిరావు నవ్వి ఉండేవాడు. “పిల్లలు కలగడానికి పెళ్ళి కావడానికీ సంబంధంలేదు. ఆడదీ మగాడూ వుంటే, వాళ్ళు వద్దనుకోకపోతే తప్ప బోలెడంత మంది పిల్లలు, పెళ్ళి ఉద్దేశం వేరు.” “ఏమిటా వేరూ, చిగురూ? ఆత్మిక పవిత్రతా. ఔన్నత్యంవంటివా?”-అంది భద్ర హేళనగా. “సందేహం ఏముంది?” అన్నాడు, సీతాపతి. మిగతా వాళ్ళంతా అతి శ్రద్ధగా ఆ వాగ్వాదం వింటూ కూర్చున్నారు. “ఆ ఆత్మిక పవిత్రతా, ఔన్నత్యమూ, అగ్నిహోత్రం ముందు కళ్ళనీళ్ళు పెట్టుకొంటేనూ, రిజిస్ట్రారుముందు కొయ్యబొమ్మలా మొహం పెట్టుకొని, దస్తావేజుమీద చేసినట్లు సంతకం చేస్తేనూ మాత్రమే పట్టుబడుతుండా?” “ఎన్నిమాటలు నేర్చేవే?”-అంది, దవడలు నొక్కుకుంటూ సూర్యకాంతమ్మ. కుమారస్వామి చిరునవ్వు నవ్వుతున్నాడు. ఆయన ఈ చర్చను కావాలనే సాగనిస్తున్నాడని భద్ర నిశ్చయించుకొంది. లక్ష్మీపతి ఏమీ మాట్లాడం లేదు. దీనిలో అతని పాత్ర ఏమిటో? “కాదనుకో. కాని, ఎవరేనా అనవచ్చు, మాదీ పవిత్రబంధమే. మా అత్మలకూ ఔన్నత్యం లభించింది. ఆస్తిలో వాటా యివతల పెట్టమనవచ్చు. వానికి కొలబద్దలేమున్నాయి? ఆ పేరుతో ఎవరన్నా, దేశంలో ఎక్కడన్నా ఆస్తికయినా హక్కు చూపవచ్చు.” “ఆ హక్కు కోరకపోతే....” “పేచీ ఏం వుంది? వాళ్ళు తమ అత్మోన్నతికీ, పవిత్రతకీ సాక్ష్యాలూ, నిదర్శనలూ చూపించనక్కర్లేదు.” భద్ర ఒక్కనిముషం మాట్లాడలేకపోయింది. “ఆత్మానందాన్ని, ఐహిక భోగానికి జతచేయబోతేనే సమస్యలన్నీ”-అని సీతాపతి సూత్రీకరించేడు. భద్ర కోపాన్ని దిగమింగుకుంది. “ఒకప్పుడు మరియమ్మ అనే కమ్యూనిస్టు ఇలాగే చెప్పింది. అది వాళ్ళ సిద్ధాంతాల తిక్కక్రింద కొట్టిపారేశా. ఇప్పుడు ఆమాటే నీనోట వినిపించింది. ఆశ్చర్యమే. అయితే మీ ఇద్దరిలో తేడా లేకపోలేదు. ఆ కమ్యూనిస్టులు కట్టె విరిచినట్లు చెప్పేరు. నీనుంచి అసలు విషయం రాబట్టడానికి అరగంట పట్టింది.....” ఆ పోలిక సీతాపతికి నచ్చలేదు. మరియమ్మ అంటే ఎవరో? కిరస్తానీ అంటే బహుశా ఏ హరిజనో అయివుంటుంది. ఏం పోలిక? “”మంచి సామ్యమే తెచ్చేవు” అన్నాడు. “అదీ ఓ పొరపాటే”-అని భద్ర తనమాట సవరించుకొంది. “వాళ్ళు మాట్లాడేదేమిటో వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. నీకు తెలియదు. అంతే తేడా!” లక్ష్మీపతి చిరునవ్వుతో మెచ్చుకుంటూ భద్రవేపు చూసేడు. సీతాపతి ముఖం ఎర్రబడింది. సూర్యకాంతమ్మ నోరు తెరిచింది. కుమారస్వామి నవ్వేసేడు. “ఏదో కాంగ్రెసువాడని పిల్లనిస్తే అతడు కమ్యూనిజం పుచ్చుకు కూర్చున్నాడు. సరి. ఆయన అడుగుజాడలలో నడుస్తూ, భారతీయ గృహిణిననిపించుకొన్నావు”-అని హాస్యం చేసేడు. భద్ర ఒక నిశ్చయానికి వచ్చింది. “మీరెవ్వరూ బాధపడకండి. జానకి పెళ్ళి ఎల్లా జరిగినా దాని అత్మకేమీ ఢోకా కలగలేదు. బావ చిన్నప్పుడు మీరు పెట్టింది, ఏం తిన్నాడో. ఇల్లువదిలాక మీనుంచి ఒక్కకానీ ఎరగడు. అది అతడి పెళ్ళాం. ఆస్తి కోసం వచ్చిందనుకొంటారేమోనని దాని హడలు. ఆ ప్రోత్సాహం నాది. తండ్రికి న్యాయంగా రావలసింది కొడుక్కు సంక్రమించకుండా ఎందుకు అడ్డుపడతావని నేనే పెచీపెట్టా. కాని అదే ఒప్పుకోలేదు. “ఇరవయ్యేళ్ళ కాలంలో వాడి ఎడ్రసు కావాలంటే దొరకకపోయిందా? నాకా భ్రమ లేదు. నువ్వు పెట్టుకోవద్దు” అంది. “ఆ కుర్రాడు దాని కొడుకు. దారిపొడుగునా నన్ను ఊదరెట్టేశాడు. ఆస్తిమాట ఎత్తవద్దన్నాడు. నా అంతట నేను ఎత్తనని మాట ఇచ్చేను. అటువంటి మనుష్యులు వాళ్ళిద్దరూ. మీ ఇంటికి సరాసరి నేను వచ్చాను. కాని, అది రాలేదు. పోయి హోటలులో దిగింది. కుర్రవాడు పెద్దవాడయ్యాడు. ఎప్పుడేనా తనవాళ్ళ నెవరినీ చూపించనే లేదంటాడేమోనని తీసుకు బయలుదేరింది. మీ టెలిగ్రాం లేకపోయినా ఓ రోజున వచ్చి మీ నలుగురినీ పరిచయం చేసి వెళ్ళిపోయేది. మీరు పిలుస్తారనే ఆలోచే లేదు దానికి. మీరు పిలిచినట్లుగా భావించడంలేదు. ఒక్కటి. టెలిగ్రాం చూసి, పెద్దవాళ్ళని కుర్రవాడు చూడలేకపోతాడేమోనని కాస్త హడావిడి పడింది. దానికీ నేనే కారణం....” తమరి గురించి జానకి ఊహలంటూ భద్ర చెప్తూంటే నలుగురూ స్తబ్దులయ్యారు. “నా మాట విని ఆస్తి గురించి బెంగపడకండి. అది ఆస్తికోసం రాలేదు. నేనే మొదట ఏమో అనుకొన్నా. కాని నేనూ ఇప్పుడు దాని అభిప్రాయాన్నే బలపరుస్తున్నా. మీ ఆస్తి స్పర్శ ఏమూలనుంచి తగిలినా వాళ్ళకి క్షేమం కాదు. మీకేనా అది అరగడంలేదు. దానికెందుకు? కనీసం మాట దక్కించుకోండి. తన మగడి వాళ్ళు ఎటువంటి మనుషులో దానికి వినికిడిమీద మాత్రమే తెలుసు. తెలిసిందేదీ మీకు ప్రతిష్ఠ అయినది మాత్రంకాదు. నాకు తెలుసు. ఇప్పుడది రుజువు చేసుకోవద్దు....” భద్ర మరి సమాధానానికి ఎదురు చూడకుండా లేచి వెళ్ళిపోయింది. లక్ష్మీపతి కూడా లేచేడు. “ఇంక అనవసరమయిన మనోవ్యధ ఎందుకు? మనసులు పాడు చేసుకోవద్దు. అందరూ మనలాగే వుండరు.....” “భద్ర మాటలకేం గాని....” అంటూ సీతాపతి ఏదో చెప్పబోయేడు. కాని, లక్ష్మీపతి వినదలచుకోలేదు. “చీకటిపడింది. ఆస్తిమీద, అందులోనూ పిలిచి ఇస్తామంటున్నా, అంత మమకారంలేని మనిషి ఎలా ఉంటారో, పలకరించి ఇంటికి వెడతా....” అంటూ ఓ అడుగువేసి మళ్ళీ వెనక్కితిరిగేడు. “రేపు ఆమెనూ, కుర్రాడినీ మా ఇంటికి తీసుకెళతా. భద్రతో చెప్తా. మీరు ముగ్గురూ రండి. దేవతార్చన అక్కడే చేద్దురుగాని....” సూర్యకాంతమ్మ నవ్వింది. “దంజ్యాలు తీసేశాక అర్చన ప్రారంభించేవేం?” లక్ష్మీపతి నవ్వేడు. ఎనిమిదో ప్రకరణం లక్ష్మీపతి హోటలుకౌంటరు వద్ద గుమాస్తాను అడిగేడు. “పదో గదిలోవారున్నారా?” ఉన్నట్లు తెలుసుకొని పైకెళ్ళేడు. లౌంజ్‌లో కూర్చుని సెర్వరు కుర్రవానికి తనపేరు వ్రాసిన చీటీ ఇచ్చి పంపేడు. రెండు నిమిషాలలో రవీంద్ర వచ్చేడు. ఆ వచ్చినవారు తన పినతండ్రే అయివుండవచ్చుననే ఆలోచనే లేదు. వస్తూనే పరిచయం తెలుపుకొన్నాడు. “నేనే రవీంద్రను....తమరు” “ఆ చీటీ పంపింది నేనే; రా ఇల్లా కూర్చో....” రవీంద్ర సంకోచిస్తూ పక్కన కూర్చున్నాడు. లక్ష్మీపతి అతని చేయి తనచేతిలోకి తీసుకుని రాస్తూ అన్నాడు. “ప్రవర ఇల్లాంటి సందర్బాలలో స్వయం పరిచయానికి వీలుగా వుంటుంది. కాని ఏం చెయ్యను! నేను లక్ష్మీపతినంటే నీకు తెలియలేదు. మనమధ్య బంధుత్వం కలిపిన మనిషిని మనం ఇద్దరం ఎరగం. మన బంధుత్వంలో ఉన్న సమానలక్షణం అది. ఇంతకీ నువ్వు రవీంద్రవేనా?”-అని నవ్వేడు. “మీరు చూడాలనుకున్న జానకీదేవి మా అమ్మగారే.” “నేను మీ నాన్నగారి తమ్ముళ్ళలో ఒకడిని. పేరు చెప్పే కదా.” రవి మరోమారు నమస్కారం తెలిపేడు. “మధ్యాహ్నం తాతయ్యగారింటికి వెళ్లాం. రమణి అత్తయ్యా నేనూ మంచి ఫ్రండ్సు అయాం.” లక్ష్మీపతి చటుక్కున ఆనేశాడు. “మిగలినవాళ్ళు కాలేకపోయారన్నమాట.” రవీంద్ర గంభీరంగా అదేం కాదన్నాడు. “అదేం కాదండి. మిగతా వాళ్ళంతా బాగా పెద్దవాళ్ళో, బాగా చిన్నవాళ్ళో కాదాండి.” లక్ష్మీపతి మనస్సులో అతనిని మెచ్చుకున్నాడు. “అక్కడ రాజామణి అన్నామె కనిపించిందా?” “పేర్లు చెప్పలేనండి. ఇద్దరు అత్తయ్యలు....రమణిగారితో కలిసి ముగ్గురు అత్తయ్యల్ని చూశా. ఒక పిన్నమ్మగారు కనిపించేరు.” “మీరు చూడని ఆమె ఇంకొకామె వుంది.” “ఔనౌను. రమణి అత్తయ్య చెప్పారు. ద్వారకానగర్‌లోనో, మరెక్కడనో ఉన్నారట ఆమె. కాలేజీలో లెక్చరరట. రేపు ఏదో వేళ వెళ్లి వారిని చూసిరావాలనుకున్నాం.” “వెతుక్కుంటూ మీరు వెళ్ళవలసిందేగాని, వారెవ్వరూ రారా?” అన్నాడు లక్ష్మీపతి కొంటెగా. రవీంద్ర గ్రహించినట్లు లేదు. “ఇందులో వంతులకేముందండి. మేము వచ్చినట్లేనా వారు ఎరగరు కదా. తెలియగానే తాతయ్యగారూ, నాయనమ్మగారూ వచ్చేరు. పాపం ఎండలో రావడం చేతనో ఏమో తలనొప్పి వచ్చింది.” లక్ష్మీపతికి ఆ సమాధానం బాగా నచ్చింది. సంతోషంగా భుజం తట్టేడు. “అదీ అలావుండాలి. హుందాగా-” తన మాటలో విశేషం ఏం ఉండి, పినతండ్ర్రి ఆ సంతోషం తెలిపాడో రవికి అర్ధంకాలేదు. అతని ముఖం వంక చూసేడు. ఆ కళ్ళలో నీళ్ళు కనబడ్డాయి. కంగారు పడ్డాడు.... “నేనేమన్నా....” లక్ష్మీపతి కళ్ళు వొత్తుకున్నాడు. “ఏమీ లేదు. నీ సమాధానం నాకెంతో సంతోషం కలిగించింది. మీ అమ్మగారు నీకు మంచి మనస్సు ఇచ్చేరు. ఆ ఆరోగ్యం కాపాడుకో. సుఖపడతావు.” అతని అభిప్రాయం ఏమిటో, ఎందుకో తెలియలేదు. ఊరుకున్నాడు. లక్ష్మీపతి మాట మారుస్తూ-”ఏం చదివేవు?” అన్నాడు. రవీంద్ర చెప్పేడు. లక్ష్మీపతి ఆసక్తితో అతని ముఖంవంక చూసేడు. “కళాకారుడి వన్నమాట. మా ఇంట్లో ఒక ఆర్టిస్టు! చాల బాగుంది” తన చదువుకి ఈ సంఘంలో విలువ వున్నట్లు అంగీకరించిన కొద్దిమందిలో ఈయన ఒకడు. ఆమాటే చెప్పినప్పుడు లక్ష్మీపతి నవ్వేడు. “ఏం విచారపడకు. ఇందులో ఒక రహస్యం వుంది. నిజంగా ప్రతిభ, ప్రజ్ఞ ఉంటే తప్ప దీనిలో రాణించలేరు. మేష్టరీ, డాక్టరు, వకీలు లాంటి వాళ్ళ చదువులున్నాయి చూడు. పేస్ మార్కుల మట్టుకు ఏదో పింగిస్తే మరి వాళ్ళకింక ఫర్వాలేదు. దేశాన్ని చిత్రవధ చేసేసినా మరి అడిగేవాడుండడు. చిత్రకారుడిది అలా కాదు. బొమ్మ అందంగా వుంటే చాలదు. గీతలు భావస్ఫోరకం కాకపోతే మన ముఖం ఎవడూ చూడడు. అణా డబ్బులు రాలవు. కనక ఇందులో పేస్ మార్కులు తెచ్చుకొన్నానంటే చాలదు. ప్రతిభ వుండాలి. ప్రజ్ఞ కూర్చుకోవాలి. సులువుగా బ్రతికేసే దారి ఎదట వుండగా అనవసరశ్రమ ఎందుకనే మనస్తత్వం తప్ప ఏం ఫర్వాలేదు....తాతగారి స్కెచ్ వేసవట కదా.” “మేం రావడంలో ముఖ్యమైన ఉద్దేశం బందులందరివీ ఫోటోలో స్కెచ్ లో తీసుకోవాలనేనండి. మేము ఎవ్వరినీ ఎరగం కదాండి.....” “వారంతా నిన్ను ఎరుగుదురా?” “ఎరగరనుకోండి. నేను తెలుగుదేశాన్ని చూడనే లేదు. అన్నీ కలసివస్తాయని రెండుమూడేళ్ళుగా అనుకొంటూ వస్తున్నాం. కుదరలేదు.” “పోనీలే. మంచిపని చేశారు. అమ్మ ఏం చేస్తున్నారు?” “తల పోటుగా వుందని పడుకున్నారు.” లక్ష్మీ పతి అలోచించేడు. “సరి లేపకు. రేపు ప్రొద్దున్న వస్తా. మీ ఇద్దరూ మా ఇంటికి....ఎక్కడో తెలుసా? ద్వారకానగర్....అక్కడికి....” “తాతయ్యగారికి ప్రామిస్ చేశాం.” “నేను చెప్పే వచ్చేను.మళ్ళీ చెప్తా.” లక్ష్మీపతి ఫోన్ తీసేడు. “నాన్నగారూ! నేను లక్ష్మీపతిని....వదినగారు ఒంట్లో బాగులేదని పడుకొన్నారుట....రవీంద్రని చూశా....రేపు సెలవు పెడతాను....వీరిద్దరూ మా ఇంటికి వస్తారు....రమణిని తీసుకుని మీరిద్దరూ రాండి. భద్ర ఉందా? పిలవండి....అంతా కాఫీలకే రాండి.” మరుక్షణంలో ఫోన్ మీద భద్ర గొంతు వినిపించింది. జానకి తలపోటు మాటవిని కంగారు పడింది. “నేను రానా?....” “రాగలవా? నువ్వు మాట్లాడి వప్పించగలుగుతే ఈ రాత్రికే మా ఇంటికి తీసుకు వెడతా. పిలిస్తే పలికే తోడు లేకుండా, పొరుగూళ్ళో.... హోటలు....” రవీంద్ర ఆటంకం చెప్పాడు. “పొరుగూరూ, హోటలూ ఏమిటండి. బాగానే ఉందండి.” “మనవాళ్ళ ఇళ్ళకన్న హోటలే బాగుంటుందంటావు? భలే వాడివిలో....(ఫోనులో) అబ్బే రవీంద్ర....” “నిన్ను పిలుస్తూందోయ్” అని ఫోన్ అందించేడు. “నేను....అత్తయ్యగారూ! కాఫీ తాగి పడుకుంది....నిద్రపోతూంది....ఫర్వాలేదు....చీకట్లో రాకండి….అబ్బే! ఏం లేదండీ....కావలిస్తే నేను పిలుస్తాగా....నంబరుంది....” తొమ్మిదో ప్రకరణం తెల్లవారేసరికి తల్లీ, కొడుకూ స్నానాలు సహా పూర్తిచేసేశారు. ఆకాశం మబ్బుమబ్బుగా ఉంది. చలిగా ఉండి జానకి స్వెట్టరు వేసింది. “అంత చలిగా ఉందా?-” అన్నాడు రవీంద్ర. “చన్నీళ్ళు పోసుకున్నా కదా? చలి అనిపిస్తూంది.” “వేణ్ణీళ్ళు తెప్పించుకోవచ్చు కదా, అమ్మా! రాత్రి ఒంట్లో బాగులేదని పడుకొన్నావు కూడాను....ఏమన్నా జ్వరంగాని....” అంటూ తల్లి చేయి పట్టుకు చూసేడు. “జ్వరం ఏం లేదోయ్. కాస్త బడలిక చేసిందంతే. ఓ కప్పు కాఫీ తీసుకుంటే....” జానకి బటన్ నొక్కింది. దూరంలో ఎక్కడో గంట మోగిన చప్పుడు. “ఏదన్నా టిఫిన్ కావాలా?” రవీంద్ర వద్దన్నమాట పూర్తి కాకపూర్వమే సెర్వర్ హడావిడిగా వచ్చేడు. “రెండు కాఫీలు!....” కాఫీ చప్పరిస్తూ జానకి నెమ్మదిగా ప్రశ్నించింది. “ఎల్లా ఉంది అనుభవం?” రవీంద్ర ఒక్క నిముషం ఆలోచించేడు. “చాల గందరగోళంగా ఉంది. రమణి అత్తయ్య నాకు నచ్చింది. తాతయ్యగారు కూడా ఫర్వాలేదు. అయతే ఒకటి అనిపిస్తూంది. మనిషి తన మనస్సులోని చీకటి కోణాల్ని ప్రత్యేకించి తనవాళ్ళ దగ్గరే చూపిస్తాడు ఎందుకో మరి.” ఆ జిజ్ఞాస ఎందుకు వచ్చిందా-అనుకొంది జానకి. “ఏం? ఎందుకనుకొన్నావు?” “కారణం చెప్పలేను. రమణి అత్తయ్య మాట్లాడుతుంటే, మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నట్లు వుండదు. మిగిలినవారితో ఏమిటో ఎబ్బెట్టుగానే ఉంది....” “వయస్సు తేడాలు కావచ్చునేమో.” “పెద్దఅత్తయ్యగారి కాంతం నాయిీడుదే కద….” ఆ అమ్మాయి మాటలు, చేతలు బహుశా జానకికీ నచ్చలేదో ఏమో. ఆమె ఆలోచిస్తూ ఊరుకుంది. “ఆ టెలిగ్రాం పట్టి మన ఆలోచనలు చాల తలక్రిందులుగా నడిచేయి. మనం ఇక్కడ అవాంఛనీయ అతిధులం....” అన్నాడు రవీంద్ర. జానకి మ్లానహాసం చేసింది. “అగ్రహారంలో మనం అత్తయ్యగారింటికి సరాసరి వెళ్ళగలిగాం. ఇక్కడ తిన్నగా హోటలులో దిగేం. బంధుత్వం లెక్కచూస్తే వీళ్ళు మనకు దగ్గర. కాని, మన మనస్సులలో ఆ దగ్గరతనం లేదు. పైకి చెప్పక పోవచ్చు. కాని, మనపనిలో ఆ భావం వుంది. అదే వారి మనస్సులలో ప్రతిబింబిస్తూందేమో...” తల్లి సుదీర్ఘ సమాధానం రవీంద్రకు తృప్తి కలిగించలేదు. “మనం చేస్తున్న పనుల మంచి చెడ్డల్ని విమర్శించుకోడం, పరిశీలించుకోడం మంచిదే. తప్పు కాదు. కానీ, మనం చేసేవన్నీ తప్పుగానే అనుకుంటే....” “తప్పు అనుకోడం కాదోయ్. ప్రతి చిన్న విషయంలోనూ క్రియ-ప్రతిక్రియ ఉంటాయి. దానిని తెలుసుకోడం ఆత్మనిందకు కాదు. పరాయి వాళ్ళ పనుల్ని కేవలం వ్యతిరేక దృక్పధం నుంచే చూడకుండా కొంచెం హద్దు పెట్టుకోవాలి....” రవీంద్ర ఏ సమాధానమూ చెప్పేలోపున సెర్వరు వచ్చి చీటీ అందించేడు. జానకి చీటీ చూస్తూనే కప్పు బల్లమీద పెట్టింది. “మీ బాబయ్య వచ్చేరు.” “అప్పుడే వచ్చేశారే-” “వారిని కూర్చోబెట్టి కాఫీ ఇయ్యి. వస్తున్నామని చెప్పు....” “వారితో ఒక అమ్మగారు కూడా ఉన్నారు. చిన్నబాబును తీసుకొచ్చేరు” అన్నాడు సెర్వరు. జానకి ఆశ్చర్యం కనబరచింది. “భార్యనీ, పిల్లవాడినీ తీసుకోచ్చేరులా వుంది. ఈ చలిలో....సరి. నువ్వెళ్ళి చెప్పు” అని సెర్వరును పంపేసింది. ఇద్దరూ లౌంజ్‌లోకి వెళ్లేసరికి లక్ష్మీపతి లేచి రెండడుగులు వేసేడు. రవీంద్ర వెంటనే పరిచయం చేసేడు…. ”బాబయ్యగారు....” అతను వెంటనే భార్యవేపు తిరిగి “మా వదినగారు....” అని పరిచయం చేశాడు. జానకి గబగబ వెళ్ళి తోడికోడలు చంకనున్న రెండేళ్ళ పసివానిని అందుకోంది. “కొత్త ఉందా?” “పిలిచేవాళ్ళుండాలేగాని ....” అని రాజామణి చిరునవ్వుతో అందించింది. వాడు కళ్ళు చక్రాల్లా చేసి తనను అందుకొన్న కొత్తమనిషి వంక చూస్తున్నాడు. “నన్ను ఎరగవు” అంటూ జానకి వాని బుగ్గలు పుణికింది. వాడు చిరునవ్వు నవ్వేడు. “మేము ఫ్రండ్సు అయాం” అని జానకి మిగిలిన వారివేపు తిరిగింది. “రాండి. కూర్చోండి....పొద్దున్న లేచేక చెప్పేడు....” నలుగురూ కూర్చున్నారు. “రాత్రి వచ్చేను. తలపోటుగా ఉందని పడుకున్నారట.” వెంటనే రాజామణి మాట కలిపింది. “ఇంటికొచ్చి చెప్పేరు. ఒంటరిగా హోటలులో ఎందుకు వదిలేసేరు. తీసుకురాకపోయారా?-అన్నా. వచ్చెయ్యవలసింది.” “పెద్ద ఇదేం లేదు. పగలంతా అటూయిటూ తిరగడం. కొత్త చోటు, కొత్త పరిచయాలు. ఆ ఎక్సైట్ మెంట్ వలన కలిగిన బాధ. అందులో వెనకరాత్రి అసలు నిద్ర లేదు కూడా. అంతే. నిద్రపోయేసరికి తగ్గిపోయింది.” “అయినాను! ఒంటిరిగా ఉండడం....” అని రాజామణి అంది. “ఒంటరితనాని కేముంది? రవి వున్నాడు.” “నిజమే అనుకోండి. అయినా దగ్గరలో వున్నాం గనక...” థేంక్సు తెలిపి, జానకి మాట మార్చింది. “మీరు కాలేజీలో పనిచేస్తున్నారట కాదూ. ఏ కాలేజీ....అసలు ఇక్కడవున్న కాలేజీలు ఏమిటో తెలియవనుకోండి....” రాజామణి తన వుద్యోగ స్థలం....వివరాలు చెప్తూండగా, సెర్వరు అందరికి ప్లేట్లతో టిఫిన్‌లు తెచ్చేడు. లక్ష్మీపతి ఆశ్చర్యం కనబరిచేడు. “ఇది చాలా బాగుంది. మిమ్మల్ని తీసుకెళ్ళాలని మేం వస్తే, మీరు మాకు విందు చేస్తున్నారు” అంది రాజామణి. “రెండు ఇడ్డెన్లు విందా?” అంది జానకి. “మరి మా ఫ్రెండ్ మాటేమిటి?” అంటూ కుర్రవాడిని తీసుకుని గదిలోకి వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పుడు అతని చేతిలో ఒక ఆపిలూ, ఒక చక్రకేళీ వున్నాయి. పదో ప్రకరణం మేనత్త మగని కబురు విని మేడమీదికి వెళ్ళేసరికి భద్రకి మేనత్త ఆక్రోశం వినిపించింది. ఒక్క క్షణం నిలబడింది. “మీరు ఎల్లాగూ మానరు. నన్ను మాత్రం వీధిలో పడెయ్యకండి. ఆడపిల్లలకి అన్యాయం చెయ్యకండి. రమణి ఇంకా పెళ్ళికుంది. దుడుగూ దుడుగూ చేతులు కడుక్కుని కూర్చోవద్దు.” అంటూ సూర్యకాంతమ్మ చర్రున గదిలోంచి ఇవతలికి వచ్చింది. అక్కడ భద్రను చూసి గతుక్కుమంది. “నీకోసమే ఎదురు చూస్తున్నారు వెళ్ళు.” “వస్తున్నా.” భద్ర రాంగానే కుమారస్వామి పెద్ద వుపోద్ఘాతం లేకుండా తన మనస్సులోని నిర్ణయాన్ని ఆమె ముందు పెట్టేడు. “అతనికి కొంత ఆస్తి ఇవ్వాలని అనుకొంటున్నా.” మేనత్త మాటల్నిపట్టి అటువంటిదేదో వున్నదని గ్రహించినా కుమారస్వామి నోట స్పష్టంగా విన్నాక భద్రకు ఆనందమే కలిగింది. కాని, సాయంకాలం జరిగిన చర్చల అరుచి ఇంకా మెదడును పట్టి వదలలేదు. నిగ్రహించుకొంది. “అనవసరమేమో, మామయ్యా! ఆస్తులిస్తేనే బంధుత్వాలా? అయినా బావల్నీ, వదినల్నీ, చెల్లాయిల్నీ, అత్తయ్యనీ అడగండి. వాళ్ళకి ఈ దృష్టి లేదు.” కుమారస్వామి క్లుప్తంగా అనేశాడు. “అందరూ ఎరుగుదురు” ఒక్క క్షణం ఆగి మళ్ళీ అన్నాడు-“ఒప్పుకొన్నారు.” “సరి. చెప్పేదేముంది? మీ యిష్టం.” “ముసలివాళ్ళం. ఎప్పుడే అవసరాలు వస్తాయో. డబ్బు పంచదలచలేదు.” “అది వుంచుకోండి. రమణి చదువూ, పెళ్ళీ మిగిలి వున్నాయి కదా” అంది భద్ర. “ఇంక భూములు, ఇళ్ళు, స్థలాలు....” “ఒకటి చెప్పవచ్చునా?” “కానీ....” “వాళ్లు తెలుగు దేశంలో వుండే ప్రయత్నంలో లేరు.” “ఏదో శివసేన గొడవలుగా వుంది. అక్కడేం వుంటామంది ఆవిడ.” “నిజమే. ఆ క్షణంలో అనిపించినా ఎక్కడికెడుతుంది? ఎక్కడ మాత్రం అలాంటి గొడవలు లేవు గనక! అవి సాగనిస్తే పిల్ల హిట్లర్లు ఈసుళ్ళలా పుట్టకురారూ? ఏం ఫర్వాలేదు.” “మీరంతా రాజకీయాలలో మునిగి తేలుతున్నవాళ్లు. మీకు తెలుస్తాయి.” “ఏం తెలియనివాడిలా ఏం నటిస్తావు, మామయ్యా? వాళ్ళంతా మీ బోటివాళ్ళ వర్దీలో పెరుగుతున్నవాళ్ళేగా?” “పక్కదారిన పడ్డాం....చెప్పు” అంటూ కుమారస్వామి ప్రస్తుతం జ్ఞాపకం చేసేడు. భద్ర తాను ఎక్కడ పక్కదారి పట్టిందో జ్ఞాపకం చేసుకొనేందుకు ఒక్క క్షణం ఆగింది. “బొంబాయిలో దానికి వుద్యోగం వుంది. ఇంకా పది పన్నెండేళ్లు చెయ్యొచ్చు. ఓ యింట్లో ఫ్లాట్ వుంది. వాడు ఏవేవో ఆలోచనల్లో వున్నాడు. అతడికీ మన ప్రాంతం వస్తేకన్న అక్కడనే భవిష్యత్తు వుంటుందనే భావం వుంది.” తన మాటలు వింటున్నదీ, లేనిదీ చూసుకొనేందుకు వో క్షణం ఆగింది. “ఊ చెప్పు” అన్నాడు కుమారస్వామి సాలోచనగా. “మీరు భూమి పంచితే వాళ్ళేం చేసుకొంటారు?” తన వాదాన్ని బలపరుస్తూ భద్ర భూమిని ఇస్తే వున్న ఇబ్బందుల్ని వివరించింది. “ఇంక అయినకాడికి అమ్ముకుపోవాలి. లేదా ఎవరికో అమరకం చెయ్యాలి. ఆ డబ్బు రాదు. మనం ఎరగని గొడవలా?” “నీ అభిప్రాయం ఏమిటి మరి?” “ఎక్కువ తక్కువో కొంచెం సర్దుకొని డబ్బు ఇస్తేనే మేలు.” “ఊ.” కుమారస్వామి ఆలోచించేడు. “బొంబాయిలో యిల్లు వాయిదాల పద్ధతి మీద తీర్చుకొనేటట్లు తీసుకొన్నదయి వుంటుంది” అన్నాడు. “తాను వుద్యోగం నుంచి రిటైరయ్యేనాటికి ఆ బాకీ కూడ తీరి ఇల్లు తనకి వస్తుందన్నట్లు జ్ఞాపకం.” “అది ఆమె పేరిటే వుండి వుంటుంది.” “సహజం. తీర్చవలసిందీ, సంపాదనపరురాలూ అదే కదా” అని భద్ర అందించింది. కుమారస్వామి మరో విషయం ఆలోచించేడు. “ఎంత ఇవ్వవలసి వస్తుందో తెలుసుకో. డబ్బు ఒకేమారు కట్టేస్తే వడ్డీ వుండదు గనుక తగ్గుతుంది. ఇల్లు ఇచ్చేస్తారు. అది కుర్రవాడికి వ్రాసేస్తాను.” భద్ర మొదటి భాగానికి సంతోషించినా, చివరి చేర్పు విని తెల్లబోయింది. “అంటే....” “నేను కుర్రవానికి యివ్వాలనుకుంటున్నా. నువ్వు మాట్లాడి చూడు.” “నేను అలాంటి మాటలకి పనికిరాను. కొడుకుల మీద మనకున్న ప్రేమ అందరికీ వుండదు. అదలా వ్రాయదు. నన్నే అడిగితే వద్దని చెప్తా.” కుమారస్వామికి ఆ మాట చాల తీవ్రంగా తగిలినా విచలితుడు కాలేదు. ప్రశాంతంగా అన్నాడు. “కుర్రవానికి నేనిచ్చేది స్థిరాస్తిగా వుండాలి. నేనే చెప్తా.” “దానిని అవమానం చెయ్యకండి. అది చాలా అభిమానస్తురాలు.” “ఇది అవమానమైతే అభిమానమెలా వుంటుందో? కుర్రవానికి పాతికవేలు రాకుండా అడ్డుపడడం అభిమానం అనిపించుకుంటుందా?” “మన నిఘంటువులు వేరు.” పదకొండో ప్రకరణం గుమ్మంలో కారు ఆగిన చప్పుడు విని రవీంద్ర కిటికీలోంచి తొంగి చూసేడు. తాతగారి కారు. కుమారస్వామి దిగడానికి వీలుగా డ్రైవరు తలుపు తీసి పట్టుకు నిల్చుని వున్నాడు. రవి గబగబ యోదురు వెళ్ళేడు. కారులోంచి కాలు క్రిందబెడుతూ కుమారస్వామి అడిగేడు: “బాబయ్య లేడా?” “మీ కోసం ఇప్పటిదాకా చూసి, ఇప్పుడే యెవరో స్నేహితులు వచ్చి పిలుస్తే అలా వెళ్లేరు.” మనమని భుజం మీద ఒక చెయ్యివేసి, రెండో చేతిలోని చేతికర్ర నేలని ఆనించి కుమారస్వామి బహుదర్పంగా ఇంటివేపు అడుగు పెట్టేడు. సూర్యకాంతమ్మ కారు దిగడానికి జాప్యం చేస్తూంది. తమ కారు వచ్చేసరికి కోడలు వచ్చి స్వాగతం పలకాలి. రాజామణి ఆ అభిమానాన్ని ఇంతవరకూ పాటించింది. కాని, ఈవేళ రాలేదు. జానకి ఈ యింట్లో వుంది. ఆమె యెదుట రాజామణి ఇంకాస్త అణకువగా మర్యాద చేయాలనేది ఆమె ఆశ. కాని, తీరా వచ్చేసరికి మామూలు మర్యాద కూడా కరువైంది. నడుస్తున్న రవీంద్ర నిలబడి నాయనమ్మ ఇంకా కారు దిగనే లేదని గమనించేడు. “నాయనమ్మగారు!” అన్నాడు. తన నిరీక్షణ నిరుపయోగం అని గ్రహించిన సూర్యకాంతమ్మ తానే కారు దిగింది. డ్రైవర్‌కి ఏదో పని పురమాయిస్తున్నట్లు నటిస్తూ ‘పదండి. వస్తున్నా’ నంది. “రమణి అత్తయ్య ఏరి? రాలేదా?” అన్నాడు రవీంద్ర. “మీ ఇద్దరికీ దోస్తీ బాగా కలిసిందిలా వుంది” అంటూ మీసాలలోనే నవ్వుకొన్నాడు, కుమారస్వామి. “ఆమె చాలా మంచిది.” కుమారస్వామి ఈ మారు పైకే నవ్వేడు. “మిగిలిన వాళ్ళెవరూ నీకు నచ్చలేదన్నమాట.” ఆ వ్యాఖ్యానానికి రవీంద్ర కంగారు పడ్డాడు. సిగ్గుపడ్డాడు. ‘అదేం కాదండి’ అన్నాడు. కుమారస్వామి మనమని వీపు తట్టి దిలాసా యిచ్చేడు. “తమాషాకు అన్నాను. భద్రా, అదీ మీ చిన్నత్తగారింటికి వెళ్ళేరు. ఓ పావుగంటలో వస్తారు.” ఇద్దరూ నెమ్మదిగా సావిట్లోకి వచ్చారు. తాత అందించిన కర్ర గోడకి జేరవేసి, కండువా మడతకుర్చీ వీపున వేసి రవీంద్ర ఉపచారం చేస్తూంటే కుమారస్వామి శరీరాన్ని భారంగా పడకకుర్చీలోకి దింపేడు. “రామయ్య తండ్రీ.” తాతగారి సేవ ముగించి ఈమారు రవీంద్ర నాయనమ్మ వేపు తిరిగేడు. “అమ్మా, పిన్నిగారూ లోపల వున్నారు. రాండి” అని అటు దారితీసేడు. “వస్తున్నా కాదటోయ్” అంది సూర్యకాంతమ్మ. తెలుగులో సర్వసమ్మేళనల నిశ్చితార్థం తెలియకపోయినా, నాయనమ్మ స్వరంలో ఏదో విలక్షణత తోచి రవీంద్ర గతుక్కుమన్నాడు. అసలు యింటికి కొంచెం విడిగా వున్న వంట యింట్లోంచి జానకి కంఠం వినిపించింది. “తాతయ్యగారూ నాయనమ్మగారూ వచ్చేరా? లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టు.” ఆమె చేతిలో పని వుంది. అది పూర్తి చేయకపోతే పాడయిపోతుంది. ఆమె మాట పూర్తిగాక పూర్వమే వెనక వేపున రవి గొంతు వినిపించింది. “నాయనమ్మగారు వచ్చేరమ్మా!” జానకి పని మధ్యలో ఒక్క క్షణం వెనక్కి తిరిగింది. “వచ్చేరా? కూర్చోండి....ఆ పీట అలా వెయ్యరా నాన్నా!” “వంట నీకు వప్పజెప్పి ఆవిడగారు యెక్కడికి వెళ్ళిందీ?” అంది సూర్యకాంతమ్మ. ఇక్కడా కంఠస్వరమే పట్టియిచ్చి, జానకి తెల్లబోయింది. “మన వంట పనికిరాదో ఏమో కర్మ” అనుకొంది. చెప్పనేనా చెప్పిందికాదే అనుకొని పైకి మాత్రం సర్దుబాటుగా అంది. “పిల్లలకి నీళ్లు పోస్తున్నారు. వస్తారు.” “ఇదో దురలవాటు. కూలీనాలీ చేసుకొనేవాళ్ళ యింటికి బంధువులు వస్తే, వాళ్ళూ వేతలకీ, కోతలకీ పోవాలట! ఏం మర్యాద పని!” అని కోప్పడింది. జానకి చిరునవ్వుతో అంది. “కూలివాడింటికి జమీందార్లు రారుకదా. వచ్చేవాళ్ళూ కూలివాళ్ళే అయివుంటారు. అందులో అమర్యాద యెవరికి?” సూర్యకాంతమ్మ తెల్లబోయింది. ఆమె ధోరణిని కనిపెడుతున్న జానకి పొయ్యి దగ్గర నుంచి తిరక్కుండానే కొడుక్కు పని వప్పచెప్పింది. ఆడవాళ్ళ చెండాటలో అతని ప్రమేయం వుండకూడదు. “తాతయ్యగారికి మంచినీళ్ళు కావాలేమో తెలుసుకో. కూర్చుని కబుర్లు చెప్తూండు. చేతిలో పని కాగానే నేనూ వస్తున్నా.” “అలాగేనమ్మా” అంటూ రవీంద్ర గ్లాసులూ, జగ్గూ తీసుకొని సావిట్లోకి వెళ్ళిపోయేడు. “చెప్పినట్టల్లా వింటున్నాడు. బాగానే తయారు చేశావు.” అది మెచ్చుకోలో వెక్కిరింతో స్వరంపట్టి అర్థం కాలేదు. “తయారీకేముంది! మనం మంచిగా వుంటే వాళ్ళూ వుంటారు. మనం ప్రేమగా వుంటే దగ్గరవుతారు. దులపరించుకొంటే దూరం అవుతారు.” అతి సామాన్యంగా వున్న ఆ మాటలోకూడ తన జీవితాన్ని వెక్కిరించినట్లయి సూర్యకాంతమ్మ రవిలిపోయింది. “మావాడు మాకు దూరం అయింది, మేము దులపరించుకోడం చేతనే అంటావు?” అనేసింది, పట్టలేక. తనమాట సరాసరి తగిలిందని గ్రహించేక ప్రత్యర్ధి ముఖం ఎట్లుందో చూడాలనే కాంక్షను అతి నిగ్రహం మీద జానకి అణుచుకొంది. కాని సమాధానం ఇవ్వలేదు. వినిపించుకోనట్లూరుకుంది. సూర్యకాంతమ్మ తన ప్రశ్నకు సమాధానం రాకపోవడం తృప్తిగాలేదు. “ఏం అడిగితే మాట్లాడవేం....” అని గద్దించింది. జానకి ఆమె గద్దింపు విననట్లు వెనక్కు తిరిగింది. “అదేమిటి నిలబడే వున్నారా?” అంది మాట మారుస్తూ. “ఎంత నాటకం ఆడుతున్నావే, నీ మొహంమండా” అని తిట్టుకొన్నా పైకి ఏమీ అనలేకపోయింది. తన మాటపైన మిగలనందుకు మనస్సులో రవరవలాడిపోయింది. అవకాశం చూసుకొని, మగనితో చెప్పుకోనిదే ఆ కోపం చల్లారనూ లేదు. “మహా పొగరుబోతు-“ అంది. ఏదో జరిగిందని కుమారస్వామి గ్రహించేడు. “ఏమయింది?” ఈమారు స్వరసమ్మేళనలు లేకుండా పుస్తకపాఠంలా తమ మధ్య జరిగిన సంభాషణను చెప్పింది. భార్య స్వభావం ఎరిగిన కుమారస్వామి జరిగిన విషయం ఇంచుమించుగా వూహించడం కష్టం కాదు. అంతా విని నవ్వేడు. సూర్యకాంతమ్మ చర్రుమంది. “ఎందుకా నవ్వు?” “ఒకటి చెప్తా వింటావా?” “ఏమిటంది”-సూర్యకాంతమ్మ రుసరుసలాడుతూ. “నీ గొప్పతనం వట్టి ఎరువునగ. నీ మగడు ఒకప్పుడు దివాన్గిరీ చలాయించేడు. అదీ నీ గొప్పతనం.” “ఆడదాని కంతకన్న అదృష్టం ఏం వుంటుంది?” “నీ భారతనారీ ధర్మదీక్షా, సంతృప్తీ నీ మొగుణ్ణి కావడం చేత నాకు బాగానే వినిపించవచ్చు. కాని, ప్రతివాళ్లూ అల్లా అనుకోరు.” “దానికి అర్హత వుండాలి.” “ఔనౌను. ఆమె స్వంతంగా రెక్కలు ముక్కలు చేసుకొంటేగాని బ్రతకలేని దురదృష్టవంతురాలే. కాని, ఆ దురదృష్టమే ఆమెలో వున్న గొప్పతనానికి మూలం. ఆమె కాళ్ళమీద ఆమె నిలబడగలదు. అదీ ఆత్మవిశ్వాశం. ఒకరి ప్రేక్ష్యం అక్కరలేదు. అదీ ఆమె గర్వం. ఒకరి ఆసరా వుందన్న గర్వం కాదు, లేకపోయినా బ్రతుకుతానన్న ధీమా.” కోడలి విషయంలో అంత మెచ్చుకోలును సూర్యకాంతమ్మ సహించలేకపోయింది. పన్నెండో ప్రకరణం  “సత్యానందం రాత్రి టెలిఫోన్ చేశాడు. వాళ్ళ పెద్దకొడుకు రామకృష్ణ వరంగలు నుంచి వచ్చేడుట....” ముసలాయన మాట పూర్తికాకుండానే రవీంద్ర ఉత్సాహంతో అడిగేడు. “ఎప్పుడు?” వెంటనే తల్లివేపు తిరిగి “మనం వ్రాయగానే వచ్చేసేడన్నమాట” అన్నాడు. జానకి నెమ్మదిగా అడిగింది. “ఎప్పటివరకూ వుండేదీ చెప్పారా?” కుమారస్వామి నసిగి, అనుమానిస్తూంటే, సూర్యకాంతమ్మ చెప్పింది. “సోమవారంనాడు కాలేజీలో వుండాలిసిందే. వెంటనే రమ్మన్నాడు.” “మనమూ వెడదాం” అన్నాడు రవి. మాట మధ్యలోనే లక్ష్మీపతి ‘అప్పుడే’ అన్నాడు. “ఇప్పుడే వెళ్ళడం ఏమిటి? మీరు వచ్చిందేది? వున్నదేది?” అంది రాజమణి. అప్పుడే హాలులోకి వస్తున్న భద్రకు కూడా అదే సలహా యిచ్చింది. “మీమాటే చెప్పుకుంటున్నాం. రాకరాక వచ్చేరు. ఇప్పుడే ప్రయాణం అంటున్నారుటేమిటి? అతడినే రమ్మని వైర్ చెయ్యండి.” “ఔను. భద్రా. బాగుంటుంది. అల్లా చేద్దాం. అతడిని చాలాకాలమయింది చూసి....” అంటూ లక్ష్మీపతి భార్య సూచనను సమర్థించేడు. “ఎంత సులువుగా అన్నారర్రా” అంటూ భద్ర నవ్వింది. రాజామణి తెల్లబోయి “ఏం?” అంది. “అంతమాట అన్నావు. చాలులే. వో కప్పు కాఫీ ఇయ్యి. మళ్ళీ మీ యింట ఏమీ పుచ్చుకోలేదని నెపం వేస్తావు” అంటూ భద్ర జానకితో కూడా చెప్పింది. “పదిగంటలకి బస్సు వుందట. వచ్చేటప్పుడే కనుక్కున్నాం.” “మేమూ వస్తున్నాం” అంది, అన్నీ నిర్ణయం అయినట్లే జానకి. “వెడితే అది వెడుతుంది. మీరు వెళ్ళడానికి వీలులేదు....” అన్నాడు లక్ష్మీపతి. “ఒక్కరోజు కూడా వుండకుండానా?” అంది రాజామణి. మళ్ళీ మొదలయింది. “ఎంతసేపు రావాలి. ఎంతసేపు పోవాలి. వీలైతే మళ్లీ వస్తా. రామకృష్ణని వోమారు రమ్మని వ్రాశానా మరి....” అంది జానకి దృఢస్వరంతో. “రామకృష్ణ తన కాబోయే భార్యను కూడా వెంటబెట్టుకొనే వచ్చేడుట. నీకు చూపించి పాస్ చేయించాలనుకొన్నాడో యేమో....” అంది నెమ్మదిగా, అవకాశం చూసుకొని భద్ర. “గట్టివాడే.” భద్ర చిరునవ్వుతో ఆమె మెచ్చుకోలును అంగీకరించింది. “వీళ్ళిద్దర్నీ తీసుకురమ్మనీ, కావలిస్తే మళ్ళీ వెడుదురుగాననీ చెప్పేరు” అంది భద్ర జానకిని బలపరుస్తూ. “ఆ మాట కూడా చెప్పేడన్నమాట. మరింకేం?” అంది జానకి లేస్తూ. అంతవరకూ అన్నీ వింటూ కూర్చున్న కుమారస్వామి “నేను చెప్పకుండానే ప్రయాణ సన్నాహంలో వుంది” అనుకొన్నాడు. “అప్పుడే తొమ్మిదయింది. హోటలులో ఎక్కౌంట్సు సరిచేసుకు బయలుదేరాలి. మాకు సెలవివ్వండి....” అంది జానకి. కుమారస్వామి ఇంక వూరుకుంటే లాభం లేదన్నట్లు తన కుర్చీలో నిటారుగా కూర్చుని....”నీతో రెండుమాటలు చెప్పవలసి వున్నాయి. కనీసం ఒక రోజన్నా ప్రయాణం వాయిదా వేస్తే సావకాశంగా మాట్లాడవచ్చుననుకొన్నాను. ఈ హడావిడిలో నేనేం చెప్పేది? మీరు ఏం ఆలోచిస్తారు? దారిలోనో, ఇంటికి వెళ్ళాకనో భద్ర చెప్తుంది. ఆలోచించి నాకు వ్రాయండి” అన్నాడు. భద్ర కాదంది. “నేను సరిగ్గా చెప్పలేను. మీరు ఎదటపడి కూడా మధ్య నా రాయబారం ఏమిటి? నాకేం తెలియదు.” విషయం ఏమిటో అర్థంకాక అందరూ ముఖముఖాలు చూసుకొంటున్నారు. కుమారస్వామి అందర్నీ కూర్చోమన్నాడు. “ఆ నా మాటేదో నేనే చెప్తాను. దానికి సమాధానం వెంటనే ఇవ్వనక్కర్లేదు. ఆలోచించుకు చెప్పండి.” అదేదో ఆస్తి విషయం అయివుంటుందని నలుగురూ అర్థం చేసుకొన్నారు. అయిష్టంగానే జానకి కూర్చుని చెప్పేదేదో త్వరగా కానియ్యమన్నట్టు ముఖంవేపు చూసింది. కుమారస్వామి చెప్పేడు. “రవీంద్ర విషయం.” జానకి అప్రయత్నంగా రవీంద్రను భుజంమీద చెయ్యివేసి పక్కకు తీసుకొంది, రక్షణ యిస్తున్నట్టు. “అతనికి ఏదో ఏర్పాటు చెయ్యాలనుకొంటున్నా.” తడారిపోతున్న గొంతుతో జానకి నెమ్మదిగా అంది. “అదంతా అనవసరం. అనవసరం.” కుమారస్వామి తన అభిప్రాయం వివరించాడు. “తాత్కాలికంగా పాతిక, ముప్ఫయివేల ఆస్తి యివ్వాలని వా వూహ. అది అతనికి స్థిరాస్తి రూపంలో వూండాలని నా వుద్దేశం.” “వద్దు, తాతయ్యగారూ! అలాంటి ప్రయత్నం వద్దు.” అన్నాడు రవీంద్ర ఆదుర్దాతో. “నువ్వేం చెప్పకోయ్” అని శాసించేడు కుమారస్వామి. ఆ శాసనాన్ని సాధ్యమైనంత మృదువు చెయ్యడానికి, “నువ్వింకా కుర్రాడివి. నాలుగేళ్లు పోతేగాని....” అన్నాడు, చిరునవ్వుతో. మళ్లీ ఒక్కక్షణం ఆగి తన ప్రతిపాదన నలుగురి ముందూ పెట్టేడు. “నువ్వు యింటికి యిరవయ్యేళ్లదాకా వాయిదాలు కట్టాలనుకుంటాను.” జానకి ఏమీ అనలేదు. “ఆ ధనం ఒక్కమారే యిచ్చేస్తే వడ్డీ తగ్గుతుంది.” ఈమారు కూడా ఔనూ కాదూ అన్న సమాధానం రాలేదు. ఒక్క క్షణం ఆగి కుమారస్వామే తరువాయి అందుకున్నాడు. “ఆ డబ్బు వెంటనే జమకట్టేద్దాం.” లక్ష్మీపతి వెంటనే “ఆ ఆలోచన చాల మంచిదే” నన్నాడు. “మళ్లీ యిదేమిటమ్మా, ఇప్పుడు....” తల్లి ఏమీ మాట్లాడలేకపోవడం చూసి, రవీంద్ర ఆదుర్దాగా, నెమ్మదిగా అడిగేడు. ఆమె “నాకేనా, ఏమీ తెలియదు”-అంది. నిన్నటినుంచి ఆ యింట్లో జరుగుతున్న చర్చలేవీ ఆమెవరకూ రాలేదు. తన ప్రతిపాదనను ఎంతో సంతోషంతో స్వీకరించవలసిన యిద్దరూ మౌనంగా వుండడం చూసేక కుమారస్వామి వుత్సాహం చల్లారింది. కాని తప్పదు. తన ప్రతిపాదన పూర్తి చెయ్యాలి. “డబ్బు కట్టేశాక ఆ యిల్లును రవీంద్ర పేరిటికి యాజమాన్యం మార్పించాలి. అది నేనాతనికి యిచ్చినట్లు వుండాలి.” తండ్రి ప్రతిపాదనకు లక్ష్మీపతి చిన్నపుచ్చుకొన్నాడు. రవీంద్ర ముఖం జేవురించింది. కాని భద్ర హాస్యం చేసింది. “మామయ్య గడుసువాడు. ఇరవయ్యో, పాతికో వేలిచ్చి నలభయి, ఏభయివేల యిల్లు యిచ్చామన్న పేరు కొట్టెయ్యాలని ఎత్తు.” మనస్సులో ఆ అవరోధానికి కష్టం అనిపించినా కుమారస్వామి తొందరపడలేదు. “అమ్మాగారు కొడుక్కు ఆ మాత్రం యివ్వతగరా?” “అమ్మగారు యిచ్చేదానికి యీ మెలిక యెందుకు?” అన్నాడు లక్ష్మీపతి. “ఈయనకు వయస్సు పెరిగినకొద్దీ మతిపోతూంది”-అనుకొని విసుక్కొన్నాడు. రవికి ఆ మెలికలోని గూఢార్థం అవగతమయి ముఖం జేవురించింది. జానకి ముసలాయనకు తనమీద గల అపనమ్మకం ఈ ప్రతిపాదనకు మూలం అనుకొంది. కోపం వచ్చింది. కాని, అంతలో సర్దుకొంది. “మీకు వానియందున్న అభిమానానికి చాల సంతోషం. ఆ ఫ్లాట్‌కి పదిహేనేళ్ళు దరిదాపుగా కట్టాలి; ఇప్పటి లెక్కన, నా వుద్యోగకాలం మరో పదిపన్నెండేళ్ళు వుంది. ఆ కాలం లోపల కట్టెయ్యగలను. నాకు సాధ్యం కాకపోతే అప్పుడు వాడే చూసుకొంటాడు. ఏదో సంపాదనలో పడతాడు గనుక కష్టం కాదు. వాడి ఖర్చులు వాడు చూసుకొంటే నేను నా వ్యవధిలోపలే పూర్తి చెయ్యగలననుకొంటున్నా....” “త్వరగా తేలిపోయే అవకాశం వుందిగనక....” అన్నాడు కుమారస్వామి. “అదే చెప్పబోతున్నా” అంది జానకి. “రవీంద్ర పేరిట మార్చవలసిన అవసరం నాకేమీ కనబడదు. నిజానికి యీ క్షణం వరకు వాడికి నేను, నాకు వాడు తప్ప ఆసరా ఎవ్వరూ లేరు. వాడికి వయస్సు వచ్చింది. చదువూ ఒకదశకు వచ్చింది. ఏదన్నా వుద్యోగంలో చేరతాడు. పెళ్ళీ చేసుకొంటాడు. మూడోమనిషి వచ్చాక, తన కుటుంబం పెరిగాక అతని అభిమానాలూ, ప్రేమలూ మరో ఆశ్రయం చూసుకోడం సహజం. నేను ఎవ్వరికీ బరువుకావడం నాకిష్టం వుండదు. నాకూ ఒక ఆధారం వుండాలి. ఆయిల్లు నాది....” “నీ కొడుకు నీకు అన్యాయం చేయడు.” అన్నాడు కుమారస్వామి. తనకూ కొడుకుకూ మనస్పర్థలు సృష్టించడానికే ఈ ప్రసంగం తెస్తున్నట్లు కుమారస్వామి ఆలోచనలకు జానకి అర్ధం తీసింది. “నేనూ అదే ఆలోచిస్తున్నా. ఒక మంచి విషయం గుర్తు చేశారు. తల్లేమిటి, కొడుకేమిటి – ఆస్తి, డబ్బు విషయంలో ఎవరి జాగ్రత్తలో వారుండడం మంచిదే. నాకింతవరకు ఆ ఆలోచన లేదు. మీరు జ్ఞాపకం చేశారు. తప్పేంలేదు. వ్యవహారధర్మం అన్నది చాల గౌరవనీయమైన మాట. సందేహం లేదు. మీ వయస్సు దానిలో పండిపోయింది. కనక మీ ఆలోచన శిరోధార్యంగాని కొట్టివేయవలసింది కాదు....ఆ యిల్లే నా ఇన్నేళ్ళ శ్రమకి మిగిలేది. ఆమాత్రం ఆసరా నాకు వుండాలి. అది వాడికి బదలాయించే వుద్దేశం నాకు లేదు. వాడు అడగనూ లేదనుకోండి. ఆ ఆలోచన వాడికి వుందనుకోను.” “లేదు. నేనెప్పుడూ అనుకోలేదు. అనుకోను.” అన్నాడు రవీంద్ర లేస్తూ. జానకి లేచింది. “సెలవిప్పించండి.” “అయితే నాకు తోచిన పద్ధతిలో నేను నా అభిప్రాయం అమలు జరుపుతాను.” జానకి ఏమీ అనలేదు. గంభీరంగా వీధివేపు నడిచింది. “రవీ! రిక్షాని పిలువు.” సావట్లోంచి కుమారస్వామి కొడుక్కు పని పురమాయించేడు. “డ్రైవర్ని పిలిచి వారిని బస్ వరకూ తీసుకెళ్లి విడవమను.” “అక్కర్లేదు మామగారూ! ఈ కాస్త దూరంలో కారు అనవసరం” అంటూ రిక్షాలో అడుగుపెట్టింది జానకి. పదమూడో ప్రకరణం భద్ర కూడా వెళ్ళిపోయేక కుమారస్వామి కొడుకులనిద్దరినీ పిలిపించేడు. “ఈపాటికి వాళ్ళు బస్సు ఎక్కే వుంటారు” అన్నాడు కుమారస్వామి. వాళ్లు తన ఔదార్యాన్ని గుర్తించకుండా వెళ్ళిపోయినందుకు ఆయనకు కష్టంగానే వుంది. కాని పైకేమీ అనలేదు. “మీరు మర్యాదగా వ్యవహరించలేదు. ఆమె తన మర్యాద దక్కించుకొని తప్పుకొన్నారు. డబ్బు ఆశను తల్లీకొడుకుల మధ్య ప్రవేశపెట్టబోవడం చాలా అన్యాయం. అల్లా చెయ్యడంలో మీ వూహ ఏమిటి?”-అంటూ లక్ష్మీపతి తండ్రిని దుయ్యపట్టుకొన్నాడు. సీతాపతి తండ్రిని సమర్థించేడు. “సాయపడతానంటే చెండనాడుకుపోయిన వాళ్ళని సమర్థిస్తావేం? పాతిక ముప్ఫయివేలు....” లక్ష్మీపతి అన్నగారివేపు అసహ్యం వుట్టిపడేలా చూసేడు. “నీ పాతిక-ముప్ఫయివేలకి విలువ ఎంతో అర్థం అయిందా? నువ్వు పంపుతానన్న కారులో కూడ అడుగుపెట్టలేదు. రిక్షా చేసుకొన్నారు. నీ విలువ అది!” “పీడాపోయిరి. నెత్తిమీద పెద్దమ్మ తాండవిస్తూంటే అదృష్టం పట్టాలంటే మాటలా?” అంది, సూర్యకాంతమ్మ నిర్లక్ష్యంగా. “అక్కర్లేదని తోసుకుపోయిన వాళ్ళని బతిమాలీ, బామాలీ, భంగపోతారేం ఖర్మ!” భార్య మాటలు కుమారస్వామికి వోదార్పునివ్వలేదు. కరుగ్గా కొడుకుల్ని ఆదేశించాడు. “మీరిద్దరూ వుండండి. రిజిస్ట్రారు ఆపీసుకి వెడదాం.” లక్ష్మీపతికి అర్థం కాలేదు. “ఏమిటి పని?” కుమారస్వామికి కోపం వచ్చింది.. “నా ఆస్తి తినడానికి మిగిలిన వాళ్ళకెంత అధికారం వుందో విశ్వపతి కొడుక్కీ అంత అధికారం వుంది.” “మా సంతకాలు అవసరమా? అది మీ స్వార్జితం” అన్నాడు సీతాపతి. “అది నా స్వార్జితమే. కాని, తర్వాత మీరెవ్వరూ అన్యాక్రాంతం చేశాననడానికి వీలులేకుండా మీరు కూడా వుండాలనుకొంటున్నా.” తండ్రి ఆవేశం చూసి సీతాపతి జంకేడు. “ఇది మరీ బాగుంది. పెద్దతనం వస్తున్నకొద్దీ బుద్ధి పెడతలపట్టడం అంటారు-ఇదే కాబోలు!” అంటూ సూర్యకాంతమ్మ కోప్పడింది. ఒక గంట క్రితం తనను భారతనారీరత్నం అంటూనే ఎందుకూ కొరగాని దద్దమ్మగా చిత్రించడం, కోడల్ని దురదృష్టవంతురాలు అంటూనే ఆకాశానికి ఎత్తడం ఆమె మరవలేదు. ఆ కోపం తీరలేదు. ఈమారు కుమారస్వామి నవ్వలేదు. నెమ్మదిగా చెప్పలేదు. కంయ్‌మన్నాడు. “ఛ, పో అవతలికి. తాచుపాము, పెద్దపులి నయం నీకన్న....” సూర్యకాంతమ్మ ఏడ్పు మొహం పెట్టి జారుకొంది. కుమారస్వామి తన నిర్ణయాలను స్పష్టంగా చెప్పేడు. “అగ్రహారంలో పొలం నాలుగెకరాలూ కుర్రవాని పేర వ్రాసేశాను. గుమాస్తా వెంకటేశ్వర్లుకి చెప్పి పంపించా. ఈపాటికి రిజిస్ట్రారు ఆఫీసులో దాఖలుచేసి వుంటాడు. మనం వెళ్ళి సంతకాలు పెట్టాలి. తయారుకాండి.” ఒక్కనిముషం ఆగి మళ్ళీ అన్నాడు, “దీపావళి బహుమతిగా వానికి అందాలి.” లక్ష్మీపతి ఆశ్చర్యంగా తండ్రి ముఖం చూసేడు. “అది పల్లెలవాళ్ళు ఇళ్ళకని దరఖాస్తులు వెయ్యడం, తాసీల్దారు శాంక్షను చెయ్యడం....” “కలక్టరు ఆ వుత్తర్వులు రద్దుచేశాడు” అన్నాడు సీతాపతిరావు. “కాని వాళ్ళు దానిమీద ఆశ వదులుకోలేదు. అప్పీళ్ళు చేస్తున్నారు. రాయబారాలు నడుపుతున్నారు.” “అవేం లాభం లేదోయ్. చట్టరీత్యా తగిన బందోబస్తు చేశాం....” అన్నాడు కుమారస్వామి. “కాని....” లక్ష్మీపతికి అనుమానం తీరలేదు. “నాకు తెలుసు. జోగన్నగాడిని కుక్క కాపలాకి పెట్టిందెందుకు? ఎవ్వళ్ళూ వచ్చి ఆక్రమించుకోకుండా వాడు! ఇప్పుడు ఆ భయం అక్కర్లేదు. వాళ్ళ నాన్నమీద వున్న అభిమానంతో పల్లెలవాళ్లు ఇంక అది కావాలనరు. వీళ్ళ వ్యవహారాలు చూసిపెట్టే బాధ్యత సత్యానందం తీసుకొంటాడు. నాకు తెలుసు. కనక అసలు భయం లేదు.” “వొద్దు. కుర్రవాడిని ఈ గొడవల్లోకి నెట్టవద్దు. నాకిష్టం లేదు. ఏగాని యివ్వకపోయినా సరేగాని, వాడిని లేనిపోని గొడవలలోకి దూర్చి పాడు చేయవద్దు.” కుమారస్వామి అనునయించేడు. “ఇందులో గొడవలు లేవు. గంద్రగోళాలు లేవు. లేనిపోని దుశ్శంకలు పెట్టకు.” “వాడికి ఇంత డబ్బు ఇవ్వండి....” లక్ష్మీపతి మార్గాంతరం చెప్పేడు. “నేను సంపాదించింది నా చేతులతో అమ్మలేను. మీకు డబ్బు ఇచ్చేసి ఆ భూములు నేను చూసుకోలేను. నాకా వయస్సూ లేదు. అభిరుచీ లేదు. మీకిచ్చేస్తున్నా. ఏం చేసుకొన్నా మీ యిష్టం. చేసుకోండి. మానుకోండి. అమ్ముకోండి. పంచిపెట్టుకోండి. వీలయితే నే బ్రతికి వుండగా ఆ పని చెయ్యకండి. నేను హరీ అన్నాక మీ యిష్టం!” “ఇంక బ్యాంకులో డబ్బు మా యిద్దరిదీ. మా తరువాతనే దానిని ఎవ్వరికిచ్చినా?” “కొంత వాళ్ళకివ్వండి. దానిని మేం ఇద్దరం సర్దుతాం....” అన్నాడు లక్ష్మీపతి మళ్ళీ. “నేనెక్కడినుంచి తెచ్చేది? నాది మా పై ఖర్చులకే చాలడం లేదు.” అన్నాడు, సీతాపతి భయం భయంగా. కుమారస్వామి చిన్నగా నవ్వేడు. “వదిలెయ్యండి. నేను ఎవరి దయమీదా ఆధారపడతలచలేదు.” కాని లక్ష్మీపతి తండ్రిని వదిలిపెట్టలేదు. “అల్లాంటప్పుడు ఆ సలహా ఆమెకు మీరే ఎందుకిచ్చేరు?” ఇంక ఆపమన్నట్లు కుమారస్వామి చేయి వూపేడు. “ఆమె తన గోరోజనం కనబరచింది. నాకు చాల సంతోషం కలిగింది. మంచి ఆత్మవిశ్వాసం వున్న మనిషి. నాకు నచ్చింది. ఈ భూమిని వుపయోగించుకోగలది ఆవిడే. మీరిద్దరూ కూడ కాదు. ఆమెకు భద్రా, సత్యానందం ఆసరాగా వుంటారు. మీకు ఆ వూళ్ళో మంచినీళ్ళు కూడా పుట్టవు. నాకు తెలుసు. మరోచోట భూమి యిస్తే వాళ్లు ఏమీ చేసుకోలేరు. నేను ఆలోచించే అది యిస్తున్నా. మరి ఏమీ చెప్పకండి....లేవండి!” కుమారస్వామి కొడుకులిద్దరూ లేచేరు. “మంచిదే, కానీండి,” అన్నాడు లక్ష్మీపతి, కండువా భుజాన వేసుకొంటూ. పధ్నాలుగో ప్రకరణం కాకినాడ బస్సుస్టాండులో కనబడ్డప్పటినుంచీ ‘ఎవరా అతడు’ అని జ్ఞాపకం చేసుకొనేటందుకు ప్రయత్నిస్తూంది. అతనుకూడా అల్లాంటి అనుమానంతోనే వున్నట్లు తోచింది. భద్రకు చూపి ఎవరంది. “మనూరివాడే. మీ పార్టీవాడే, వెంకట్రావు.” “వెంకట్రావు!” లీలగా జ్ఞాపకం వచ్చింది. తానూరు వదలి వెళ్ళేసరికి వో యిరవై ఏళ్ళ కుర్రవాడు. కొద్దిపాటి చదువు. కూలిపని చేసుకు బతికేవాడు. పెద్ద కుటుంబం. గడ్డు బీదరికం. అల్లాగే వచ్చి, మధ్య మధ్య పార్టీపనుల్లో సాయపడేవాడు. కాని అతని పేరు వెంకట్రావా? “అతని పేరు వెంకట్రావేనా?” “అయితే తాతన్న అనేవారులే. కాని అసలు పేరు వెంకట్రావే....” జ్ఞాపకం వచ్చింది. తాతన్న, ఇళ్లు కాలిపోవడం....సాయంకోసం వసూలైన డబ్బు కొద్ది....ఎవరికివ్వాలని చర్చ....దారిద్ర్యం, ఇంటి ఇబ్బందులూ చూసి అతడి పేరు సహాయం ఇచ్చేవాళ్ళ లిస్టులో చేర్చడం....అతడు వద్దనడం....ఆనాటి వ్యక్తి కనిపించేడు. సంతోషం అయింది. కోటిపల్లిలో దిగగానే పలకరించింది. “ఏం తాతన్నా! బాగున్నావా?” ఎవరా తన్ను తాతన్న పేరుతో పిలిచేవారని వెంకట్రావు నిలబడ్డాడు. “కాకినాడ నుంచి వస్తున్నావా? కొడుకు బాగా చదువుతున్నాడా?”-అని భద్ర కుశలప్రశ్న వేసింది. “వీరు ఎవరో జ్ఞాపకం వుందా?” అంది భద్ర. తనను తాతన్న అని పిలిచినవారు ఎవరో తెలియలేదని చెప్పడానికి సిగ్గుపడ్డాడు. “ఎక్కడో చూసేననిపిస్తూందండి. కాని గ్యాపకం రాలేదండి.” చటుక్కున గుర్తు వచ్చింది. “అమ్మమ్మమ్మ!” అని తన మరుపుకు చాలా నొచ్చుకొన్నాడు. “పద్మనాభంగారి చెల్లమ్మగారు.” భద్ర గమ్మున సర్దింది. “మీ బంధువురాలే. విశ్వంగారి భార్య.” వెంకట్రావు ఉత్సాహం చల్లబడింది. నెమ్మదిగా విచారస్వరంతో కుశలం అడిగేడు. “బాగున్నారా? అమ్మా? బాబు ఉన్నారన్నారు. ఈయనేనా? బొంబాయిలోనే ఉంటున్నారా?” జానకి అతని ఆప్యాయతకు కదిలిపోయింది. అతని పరిస్థితి తెలుసుకోదలచింది. “ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నావుట.” అతడో రైతు వద్ద ఓ ఎకరం, మరొకరి వద్ద పన్నెండు కుంచాలూ కౌలుకు తీసుకున్నాడు. చేలో అయిదు బస్తాల ధాన్యం, గడ్డి మిగిలింది. ఎకరన్నర అరటి తోట వేసేడు. నిరుడు రైతుకు పదహారు వందలు ఇవ్వగా ఓ వెయ్యి మిగిలింది. “బాగానే ఉందండి.” “ఎంతమంది పని చేస్తారు!” రోజు కూలి అయినా కిడుతుందా అని తెలుసుకోదలచింది జానకి. వెంకట్రావు అవన్నీ అలోచించి లాభం లేదన్నాడు. “ఆ లెక్కలు వేస్తె మా కూలిలో సగం కిట్టినా గొప్పేనండి. మా ఇంటిదీ, నేనూ ఏటిపొడుగునా, రాత్రీ పగలూ పనిలోనే ఉంటామండి. పని ఎద్దడి రోజుల్లో పిల్లగాళ్ళొస్తారు. ఆ నాలుగురోజులూ బడికి పోవడం మానాలండి. పైగా కూలికి మనుష్యుల్ని పెడుతూనే ఉండాలి. అదేం లెక్కకట్టి లాభం లేదండి. భూమి మాదికాదు. కౌలుకి దొరికింది. అదే గొప్పగా వుందండి. ఆ పొలంలోనే కూలి చేస్తున్నామనుకోండి....” “లెక్కలేకుండా వ్యవసాయం ఏమిటయ్యా!....” అంది జానకి. “అదీ నిజమేకానండి....” అని వెంకట్రావు నీళ్ళు నమిలేడు. లెక్కలకి సరిపడదు. అన్నీ లెక్కలోకి రానూ రావు. గట్లమీద వేసిన బెండలో, పెండలం, కంద వంటివో నాలుగు రోజులు కూరలకి వస్తాయి. అది లెక్కకి వచ్చేటంత వుండదు. కాని, ఓ పూట గడుస్తుంది. ఆ భూమే తనది అయితే? జీవితం ఎంతో సుఖంగా నడిచేది. తమ కష్టానికి తగిన ఫలితం వుండేది. కడుపునకింత తిండికి తడుముకోనక్కర్లేకపోయేది. భూమి తనది కాకపోయినా హోదా పెరిగింది. అతడిప్పుడు రోజు కూలీ కాదు. రైతు. ఆ ప్రతిష్ట తక్కువది కాదు. కావాలంటే ఎక్కడన్నా ఓ వంద రూపాయలు అప్పు పుడుతూంది. పిల్లల్ని చదివించగలుగుతున్నాడు. హోదా పెరగడంచేత కాదు. దేశ పరిస్థితి మారింది. చదువులకి జీతాలు ఇవ్వనక్కరలేదు. హరిజనులకు ఇచ్చే విద్యార్ధి వేతనాలూ, సాయాలూ సంపాదించుకోడం తెలిసింది. కాని... “లెక్క వేసుకొంటే గుండెలు ఆగిపోతాయండి. ఏదో నడిచిపోతూంది. వెనకటికన్న బాగుంది. అంతే...” “అదెల్లాగోయ్....!” అంచనాకి దొరకని డబ్బు ఎక్కడినుంచి వస్తుంది?  ధరలు పెరిగిపోతున్నాయి. ఇంట్లో జనం పెరుగుతున్నారు. సౌకర్యాలూ, అవసరాలూ పెరుగుతున్నాయి. ఉత్పత్తి పెరుగుతూంది. కాని, పంపిణీలో మార్పు లేదు. ఫలితంగా ఏ రెండింటికీ పొంతన లేదు. జీవితం ఏదో గడుస్తూంది. ఈ స్థితి ఇలా ఎందుకుందో ప్రశ్నేనా వేసుకోవద్దు అనుకుంటున్నాడు వెంకట్రావు. ఇరవై ఏళ్ళ క్రితం ఈతడే ఊరేగింపులలోనూ, సభలలోనూ పాడిన పాట గుర్తు వచ్చింది. ఎండలో వానలో ఏనాటి కానాడు బండచాకిరి చేసి బ్రతుకుతావేగాని దినము నీ కూలితో-కూలోడా! తిండైనా గడుచునా-కూలోడా? జానకి ఆ మాట గుర్తుచేస్తే వెంకట్రావు ఒక్క నిముషం అలోచించేడు. “ఊళ్ళల్లో చాలా మార్పు వచ్చిందండి. పల్లెల్లోనూ. ఆ రోజుల్లో ఆరణాలు, అర్ధరూపాయి కూలి గొప్పగా ఉండేది. ఈ వేళ మూడు రూపాయలు మగాడికి మామూలు. ఊరికే చదువులు వచ్చేయి. అన్నిచోట్లా స్కూళ్ళు వచ్చేయి. పంటలు పెరిగాయి. ఉద్యోగాలూ ఫరవాలేదు. ఎలిమెంటరీ స్కూలు మేష్టరుకీ, బంట్రోతుకీ నూరూ ముప్పాతికా జీతం ఎరుగుదుమాండి!” “అయితే ఏమంటావు?” “మనం వెనకటి పద్దతిలోనే ఆలోచించకూడదండి. పిచ్చికుంచాల్ని గురుంచి పాతికేళ్ళ క్రితం ఇచ్చిన ఉపన్యాసాలు ఈవేళ జనాన్ని కదలించవు. జీవితం సుఖవంతం అయిందనను. కాని, మన ఆలోచనల స్థాయి మారాలి. ఎల్లా మారాలి? ఎందుకు మారాలి? ...ఏమో. నాకు అర్ధం కావడం లేదు.” మనస్సులో గూడు కట్టుకొన్న ఏవో ఆలోచనలు దారి దొరికి బయటపడినట్లుగా అనిపించి జానికి అతని మాటలు వింటూ కూర్చుంది. “ఒక్కటి చెప్పమంటారా? మా పల్లెలో పుట్టిన కుర్రాడొకడు ఈవేళ ఇంజనీరయ్యేడు. మావాడు పాలిటెక్నిక్ చదువుతున్నాడు. ఇద్దరు బియేలయ్యారు. పది గుడిసెల్లో రేడియోలున్నాయండి. ఆరు సైకిళ్ళు.” అమెరికా నిరుద్యోగి కుంటుంబాలు కూలిపని వెతుక్కుంటూ స్వంతలారీలో ఒక రాష్ట్రం నుంచి వేరొక రాష్ట్రానికి తిరుగుతున్నట్టు ‘గ్రేప్స్ ఆఫ్ రాత్’ లో చదవడం గుర్తు వచ్చింది, జానకికి. “దేశ సంపద పెరుగుదలపట్టి దారిద్ర్యం మట్టుకూడా పెరుగుతుంది.” “అందుకేనండి. స్వాతంత్ర్యానికి పూర్వం చెప్పినవే...ఆలోచించినవే...” వెంకట్రావు మాటను సగంలోనే జానకి అడ్డుకొట్టింది. “కాని తిండి, పని అందరికీ లేదు. అదొకటి. గుంటూరు జిల్లా భీమవరం సర్పంచ్ నీ, మరో పది పన్నెండు మందినీ చంపేసి పేటనంతనూ తగులబెట్టిన ఘటన జరిగి ఇంకా ఆరునెలలు కాలేదు. ఇల్లాంటివన్నీ ఏమిటి?” ఆ ప్రశ్నకు వెంకట్రావు ఆశ్చర్యమే కనబరిచేడు. “మీరు చదువుకొన్నవారు. దానికి కారణం, సమాధానం మీకు అర్ధం కాలేదనుకోను. అగ్రహారంలో నాలుగు రోజులు వున్నారనుకొంటా. ఇరవయ్యేళ్ళకీ ఇప్పటికీ అక్కడ తేడా కనిపించనేలేదా?” ఈ మారు తన స్థానం మారినట్లు అనిపించింది. మార్క్సిస్టులతో వాదించినప్పుడు తాను ముదలకిస్తూ వచ్చిన ప్రశ్నలనిప్పుడు వెంకట్రావు తెస్తున్నాడు. వాదనకి కూడా తాను ఈ స్థితిలో వుండడానికి ఆమె మనస్సు ఒప్పుకోలేదు. “చూశాను. గ్రామంలో మార్పు వుంది. కాని, సమాజ స్థితిలో మార్పు వుందా? సంపద పంపిణీ మారిందా?” మాటల మధ్యలో పడవ రేవు దాటింది. బస్సువేపు నడుస్తూ వెంకట్రావు అన్నాడు. “మీ ఉద్దేశ్యం ఏమిటో నాకు తెలియదు. ఈ ఇరవయ్యేళ్ళూ దేశాన్ని పాలించింది కమ్యూనిస్టుల ప్రభుత్వంకాదు. కబుర్లు ఏం చెప్పినా వారు సోషలిజం స్థాపనకు ప్రత్నించేరనలేము. కాంగ్రెసు చీలిక తరవాత ప్రభుత్వంలో నిలదొక్కుకొంటున్న ఇందిరమ్మ కూడా ఈ వ్యవస్థను మార్చలేదు. ఈవేళ కనిపిస్తున్న అభినివేశం చాలదు, క్రియ జరగాలంటే...నాకు నమ్మకం కలగడం లేదు. ఈ వృద్ధజంబుకాలన్నీ మళ్ళీ ఇటే తిరిగి, ముక్కుతాళ్ళు బిగుస్తుంటారు. ఈ దశలో సమాజ వ్యవస్థ మారిందా అన్న ప్రశ్నకు అర్ధం ఏమిటి? మార్పు వచ్చి తీరాలని కోరేది మనం. ఆ మార్పు రాలేదంటే మన ఆలోచనలలో, మన పనులలో ఏదో లోపం వుందేమోననుకొని తిరిగి చూసుకోవడం అవసరం కాదూ? మన లక్ష్యాన్ని సాధించగల కృషి మనం చెయ్యడం లేదు.” ఒక్క నిముషం ఆగి వెంకట్రావు మళ్ళీ సాగించేడు. “మనం ప్రజలలో ఒక దశలో పనిచేయడానికి పనికివచ్చాం. ఆ దశ మారేసరికి మనకి కాళ్ళూ చేతులూ ఆడలేదు. ప్రజల ఉద్యమానికి జీవం ఇవ్వలేకపోయాం. పై పెచ్చు క్షీణింపచేశాం. మావో ధర్మమాయని ఉద్యమం చీలికలయిపోయినా పూర్తిగా నిర్జీవం కాకుండా నిలబడిందని నా ఊహ. ఆశ్చర్యపడకండి. చాలా మంది ఒప్పుకోరు. “1950 తరవాత 62 వరకూ మన పనులు ఏమిటో చెప్పండి. డిసిప్లిన్ పేరుతో ఒకరినొకరం దిగతీసుకొన్నాం. విడిపోయాక పోటీకయినా జనంలోకి వెడుతున్నాం....” “ఐక్యతకు కూడా డైలెక్టిక్స్ వర్తిస్తుందన్నాడు మావో. శుద్ధ సత్యస్వరూపంగా ఆలోచించకూడదంటావు.” అంది జానకి ఆశ్చర్యంగా. “సందేహం ఎందుకు? మనపార్టీ చరిత్ర దానికి ప్రత్యక్ష ప్రమాణంగా ఉంటేనే. రెండు దృక్పథాలలో ఏది మేలో చరిత్ర...” “డార్విన్ సిద్దాంతం పని చేస్తుందంటావు?” “నిస్సందేహంగా. కేరళ, పశ్చిమ బెంగాలు చూడండి. అన్ని అవకాశాలు చేతుల్లో ఉన్నా అంత అద్భుతంగా ఆత్మహత్య చేసుకోగల శక్తిని మనవాళ్ళు కనబరచేరంటే ఏమనుకోవాలి?....” ఆ మనవాళ్ళు మార్క్సిస్టులు. తామంతా ఒకప్పుడు కలిసే వున్నామనీ, ఇప్పుడూ తమ లక్ష్యం ఒకటేననీ మరవలేదన్నమాట. మంచిదే అనుకొంది జానికి. కాని, జానకి అంగీకరించలేకపోయింది. “ఎంత సర్వనాశనం అవుతూంది? ఎంత నష్టం?” “తప్పదు. ప్రకృతి సూత్రం! ప్రకృతిలోనే వుంది బోలెడు నష్టం, వ్యర్ధం” అన్నాడు వెంకట్రావు. బస్సులో ప్రమాణం చేస్తున్నంత సేపూ మాటలు లేకపోయినా ఆలోచనలు మాత్రం ఆ పరిధి నుంచి బయటపడలేదని అగ్రహారంలో దిగుతూనే వెంకట్రావు అన్న మాటలు స్పష్టం చేశాయి. “ఉమ్మడిపార్టీ వారసత్వంలో వాళ్ళు పెద్దవాటాయే పుచ్చుకొన్నారు. ప్రజలా, పార్టీయా? ఏది ముందు? పార్టీ బలంగా వుంటే ప్రజలకి సేవ చేస్తుంది. బాగా సమర్ధవంతంగా చేస్తుంది. అందుచేత ముందు పార్టీని బలపరచుకోవాలన్న ధోరణిలో పడ్డాం. ప్రజలకి సేవ చెయ్యడంలో పార్టీ బలమవుతుందనే ఆలోచన వదిలేశాం. దానినే వాళ్ళూ పట్టుకొన్నారు. ఇంతవరకు ఈ ఏడెనిమిదేళ్ళలో వాళ్ళు చేసింది అదే. చేస్తున్నది అంతే.” ఒక్క క్షణం వూరుకున్నాడు. “మనకు కూడా కొద్దో గొప్పో ఆ వారసత్వం మిగలకపోలేదు. కాని దానిని వదల్చుకొనేందుకు పని ప్రారంభించేం. అది కాస్త సుగుణం. భవిష్యత్తు మీద ఆశ మిగిల్చింది.” ఆ సంతృప్తి, దుఃఖం, బాధ చూసి జానికి నిర్విణ్ణురాలయింది. “ఇది నా అభిప్రాయం మాత్రమేనండి” అంటూ గిరి గీసుకొని అతడు తన అభిప్రాయం తేల్చేడు. “ప్రజల కోసం పార్టీ గాని, పార్టీ కోసం ప్రజలు కాదండి.” “మంచి మాట అన్నావయ్యా!” అంది జానకి. మూడో భాగం ఒకటో ప్రకరణం గుమ్మంలో నిలబడ్డ రామకృష్ణను చూడగానే జానకి గతుక్కుమంది. బలిష్టమైన, ఉన్నత విగ్రహం. వయస్సుకిమించి కనిపిస్తున్నాడు. మంచి తెలివీ, ఆలోచనావున్న ముఖం. తెలిసిపోతూనే ఉంది. కాని, నిల్చున్న తీరులో కనిపించే నిర్లక్ష్యం, మిలమిలలాడుతున్న కళ్ళలో కనిపించే అవిశ్వాసం,-ఆ ఆకారానికీ ముఖానికీ పొందిక లేదు. ఏదో లోపం వుంది. ఎక్కడుందో అర్ధం కాలేదు. పలకరించింది. “నన్నెరగవు, పరిచయం చేసుకుందాం...” రామకృష్ణ మాట పుల్లవిరిచినట్లు కటువుగా వినబడింది. “ఎరక్కపోవడమేమిటి? ఎరుగుదును. మీరు జానకి. అతడు రవి” భద్ర నవ్వింది. “లోపలికి నడవండి” అంటూ, తాను వెళ్ళిపోయింది. ఆమె మాటను రామకృష్ణ వినిపించుకున్నట్టులేదు. తన వాదం సాగించేడు. “ఇంక మీకు నేనెవరో తెలియలేదంటే....” కొత్త మనిషిని, తమ ఇంటికి అతిధిగా వచ్చినామెను, తన తల్లికీ తండ్రికీ ఎంతో ఆప్తురాలనుకునే ఆమెను కటువుగా అనెయ్యడానికి జంకేడు. అతని సందేహం చూసి జానకే అందించింది. “నా తెలివితేటల్ని అనుమానించాలంటావు. అంతేనా?”-అని నవ్వింది. రామకృష్ణ తనకా అనుమానం లేదన్నాడు. “అయితే నా నిజాయితీని శంకించాలంటావు.” “అది చాల తీవ్రమైన పదం....” “మరి?....” “మీరూ సంప్రదాయం, మర్యాద, పెద్ద మనిషి తరహా మాటున చలామణి అవుతున్న బూర్జువా అసత్యాలకు దాసులేనే అనిపించింది. మిమ్మల్ని గురించి నేవూహించుకున్న చిత్రం వేరు....” అతను అర్ధం అవుతున్నాడనుకొంది జానకి. “చూసేవా. ఒకరు చెప్పినదాన్ని బట్టి ఊహించుకొన్న చిత్రం వేరుగా వుంటుంది. మనం కళ్ళతో చూసి, ఏరుకున్న ప్రతిబింబం వేరుగా వుంటుంది. తమాషా ఏమిటంటే వాళ్ళందరి చిత్రాలలో లాగే మనదాంట్లో కూడా ఆత్మ ప్రత్యయములైన అభిమానాలూ, ఆలోచనలూ ప్రతిబింబిస్తాయి. అని నిజంగా మనచూపుకి మసక అద్దాలు కాక మానవే.” “అంటే మనం మన నిజాయితీని కూడా అనుమానించుకోవలసిందే నంటారు.” జానకి తల కదిలించింది. “చూడు, నిజాయితీకి కొలబద్దలు ఏమన్నా వున్నాయంటావా? లేక కాళిదాసు దుష్యంతుడికిలాగా కొలబద్దలుగా ఉపయోగించగల నిజాయితీ కొందరికి మాత్రమే ఉంటుందంటావా?” రామకృష్ణ కనుబొమలు ముడేశాడు. “ఆ దుష్యంతుడు ఏం చెప్పాడో నాకు తెలియదు. ఒక ఫ్యూడల్ యుగపు కవి ఒక ఫ్యూడల్ ప్రభువు నోట ఏం చెప్పించివుంటాడో ఊహించగలను....” “ఔనా మరి. మన ఆలోచనలు మనల్ని ఎలా తప్పుదారి పట్టించే అవకాశం వుందో చూడు. నువ్వు నన్ను, నేను నిన్ను ఇంతక్రితం చూడలేదు. ఆఖరుకి ఫోటోల్లో కూడా.” రామకృష్ణ  తల తిప్పేడు. “ఏ వీధిలోనన్నా తారసపడితే, వీరు ఫలానా అని చెప్పుకోగల స్థితి మనకిద్దరికీ లేదు.” రామకృష్ణ అంగీకరించేడు. “కాని, ఇక్కడ మనకిద్దరికీ తెలిసింది. ఎలాగ? మీ అమ్మతో కలిసి మేమిద్దరం వస్తున్నామని నీకు తెలుసు. అలాగే నువ్వు వచ్చి ఇంట్లో వున్నానని నేనెరుగుదును. నన్ను మీ అమ్మతోగాక వేరే ఎక్కడో చూసి వుంటే, నిన్ను ఇక్కడగాక ఏ రోడ్డుమీదనో చూసి వుంటే....” “గుర్తించలేము” అన్నాడు రామకృష్ణ. “ఇంతక్రితం నా పలకరింపును మర్యాద పేరిట అబద్ధంగా వర్ణించావే, ఇప్పుడేమంటావు?” “ఇదిలా జరుగుతే, అదలా జరుగుతే ననే తర్కం తప్పిస్తే, మీరు నన్ను, నన్ను మీరు గుర్తుపట్టగలిగేమన్న విషయంలో తేడా వుందా?” “తర్కాన్ని ఒక్కొక్కప్పుడు విషయం సరిగ్గా అర్థం చేసుకునేందుకు బుద్ధిపూర్వకంగా ప్రవేశపెడతాం. కొన్ని సందర్భాలలో తెలియకుండానే తర్కభాగం పూర్తి అయిపోతుంది. ఇక్కడ జరిగిందదే. ఎందుచేత? మీ యింటి దగ్గరకు మేం వచ్చేసరికి ఇరవయ్యేళ్ళ కుర్రవాడు ఎవరు కనిపించినా రామకృష్ణ అనే అనుకోనా?....” రామకృష్ణ నవ్వేడు, ఆమెకు సమాధానం ఇవ్వకుండా రవీంద్ర చెయ్యిపట్టుకొన్నాడు. “నువ్వు రవీంద్రవు. దానికి తర్కం అక్కరలేదు. నీ ఫోటో సాధన దగ్గిర చూశా. నీ బొమ్మలన్నింటిని అనూరాధా, సాధనా చూపించేరు. చాల బాగున్నాయి. నువ్వు నిజమైన ప్రజాకళాకారుడివి.” “అంటే?-“ అన్నాడు తెల్లబోయిన రవీంద్ర. “అంటే బూర్జువా, ఫ్యూడల్, పిత్రుస్వామిక, ఆటవిక కళకారుడివి కాదు. నిజమైన విప్లవచిత్రకారుడివన్న మాట”-అని జానకి ఎగతాళి చేసింది. రామకృష్ణ ఒక్క క్షణం మింగేసేలా చూసి వెళ్ళిపోయేడు. తన పొరపాటుకు జానకి నాలుక కరుచుకుంది. రెండో ప్రకరణం “మన జీవితాలు ఎక్కడో పట్టాలు తప్పాయి. ఎక్కడ తప్పేయో తెలియడం లేదు. కాని, తప్పిపోయాయి. తప్పేయి. నువ్వేమన్నా సలహా ఇవ్వగలవేమోననే నిన్ను తప్పకుండా తీసుకురమ్మన్నా. అవసరమైతే మళ్ళీ వెడుదువుగాని....” అంటూ సత్యానందం ఇంటికి వస్తూనే జానకిని కూర్చోబెట్టేడు. ఒక్కక్షణం క్రితమే రామకృష్ణతోటి సంభాషణ చెమటలు పట్టించింది. చివరగా అతనిని వేళాకోళం చేసి వ్యవహారం పాడుచేశానని పశ్చాత్తాప పడుతున్న జానకి, సత్యానందం నిరుత్సాహానికి కూడా మూలం రామకృష్ణే అయివుంటాడనుకొంది. “ఏం రామకృష్ణ వాదనలు వేసుకుంటున్నాడా?” సత్యానందం చాలా నిరుత్సాహం కనబరచేడు. “వాదనా? వాదనకి దిగుతే అదో అందం. ముందే తిట్టుబోతుతనంతో మన నోరు నొక్కడం. తర్వాత తన నిర్ణయాలు వినిపించడం. ఇందాకా నీతో ప్రారంభించినట్లే. అయితే కొత్తదానివీ, ప్రధమమూ గనక కొంచెం సందేహించేడు.” “తిట్టుబోతుతనం?” అని జానకి ఆశ్చర్యంగా కనుబొమ్మలెత్తింది. “వాడిప్పుడు ఉగ్రవిప్లవవాది. మనం అంతా పురుగుల్లాంటివాళ్ళం. ఎట్సెట్రా”-అని సత్యానందం మందహాసం చేశాడు. “వస్తూనే వాడో పద్యం నాకిచ్చేడు.” “ఏమిటది?” సత్యానందం జేబులోంచి ఒక కాగితం మడతతీసి, జాగ్రత్తగా విప్పి, చేతికిచ్చేడు. “మహా జాగ్రత్తగా వుంచేవే?” అంది. “కాకపోతే ఎలాగ? తెలుగుదేశంలో భిన్నతరాల మధ్య ఏర్పడుతున్న అనుబంధాలకు అది అద్దంలా అనిపించింది.” జానకి ఒక్కమారు పైనుంచి క్రిందికంటా చూపు సారించి “ఏమిటిది?” అంది. “నంగిమాటల దొంగవంచకుడిని, కొడుకుమీద గుత్తాధిపత్యం చేసే పెట్టుబడిదారుని, ముందుచూపులేని గుడ్డిగవ్వని, పేడపురుగుని, పెంటపురుగుని, విషక్రిమిని, ధర్మరాజుగా చెలామణి అయ్యే రోజులింకలేవు. నీ స్వేచ్ఛాసాహసాల్ని భస్మంచేసి లొంగదీసుకునే ప్రయత్నం ఇకసాగదు.” విశేషణాలు బదలాయించి చదువుతూ సత్యానందం గొంతుపట్టేసినట్టు టక్కున ఆగేడు. “మీవాడు కవిత్వం వ్రాస్తాడన్నమాట.” “వాడిది కాదు. వరంగలులో వాని నేస్తుడు ఎవరో వ్రాసేరట.” “బాగుంది.” “వాళ్ళమ్మకింకా తెలీదు. తనవాటా డబ్బు ఇచ్చెయ్యమని వచ్చేడు” “-అంటే రివిజనిస్టుతో సంబంధం వుంచుకోడం ఇష్టంలేకనా?” “ఆయుధాల కోసం....” “ఉహూ.” “అడవుల్లోకి పోతాడుట.” “చదువు మానేశా....” “ఇదివరకే మానేసి వుండకపోతే....మన విద్యావిధానం ఒక పెద్ద కుట్ర....” అన్నాడు. జానకి మనసులో అనేక ప్రశ్నలు మెదిలేయి. తండ్రికీ కొడుక్కూ వైమనస్యాలు వచ్చి ఈరూపం తీసుకున్నాయా? అసలు కుర్రవాడు ఎలాటి వాడు? దుస్సాహసాలు పెరిగాయా? వాటికి ఈ అతివాదం ఒక ముసుగా? డబ్బుకోసం ఈ పద్ధతులనవలంబిస్తున్నాడేమో? కాని, ఆ ప్రశ్నలేవీ పైకి అడగలేదు. తాను ఎంత ఆప్తురాలననుకున్నా, తానే సలహా చెప్పమంటూ ఆ ప్రస్తావన తెచ్చినా కొడుకును గురించి తండ్రి ఏం చెప్పగలడు? “గట్టి ఉద్దేశంతోనే అన్నాడంటావా?” సత్యానందం తల తిప్పేడు. “చిన్నప్పుడు వుద్యమాలు, పార్టీలు, రాజకీయాలూ అంటే నాకూ, మిత్రులకీ ఎంత అభినివేశం, ఆవేశం వుండేదో ఈ వేళ వానిలో అంతకన్నా తీవ్రమైన ఆవేశం వుంది. తన పూర్వతరం మీద వానికున్న ద్వేషం, అసహ్యం మాకెప్పుడూ లేదేమో. మనందర్నీ గురించీ వాడి నిర్వచనం ఒక్కటే. ఫిక్సడ్ డిపాజిట్ల ఆదాయం మీద బ్రతుకుతున్నారు-అన్నాడు.” జానకి ముఖాన చిరునవ్వు తోచింది. “బాగుంది. మంచి ఉపమానం.” సత్యానందం విస్తుపోయేడు. జానకి కూడా అలాగే అంటూందే! “కాకినాడలో నా మరిదిని చూశా. ఆయనకూ ఈ అభిమానాలూ, అసహ్యాలూ ఇంత తీవ్రంగానూ వున్నట్లనిపించాయి. ఇక్కడ మీవాడు. నేనెరగను కాని, పోలీసులు చంపేసిన కేశవరావూ ఇంత తీవ్రం, తీండ్రం చూపేవాడట....” “కుర్రవాళ్ళు. ఒళ్ళెరగని శివాలు. మార్క్సిస్టులు బండిని పెడదారికి పట్టించారు. ఆ బండి అగాధంలోకి ఈడ్చేస్తూంది.” “బావా, బండి పెడదారి పట్టడంలో మన బాధ్యత అసలు లేదనుకోకు. అంతర్జాతీయంగా పరిస్ధితులు మారి శాంతియుత పద్ధతులలో కూడ సోషలిజం వచ్చే అవకాశాలున్నాయని నీ వాదం. గీపెట్టుకు చచ్చినా అది జరగదని వాళ్ళవాదం....పరమార్ధంలో కమ్యూనిస్టులా, మార్క్సిస్టులా వాదనలకి కీలకం అది.” “అంతేలే. దానికి వ్యక్తిగత స్వార్థాలూ, అహంకారాలూ జతపడి గంద్రగోళపరిచాయి గాని....” అన్నాడు సత్యానందం. “ఈవేళ మనం కుర్రవాళ్ళని నిందించవలసిన పనేమిటి? నిన్న ఏదో సందర్భం వచ్చి మా మరిదిగారు భార్యతో అంటున్నాడు. ‘ఈ వ్యవస్థకు శస్త్రచికిత్స చేసి, కొత్తవ్యవస్థను స్థాపించాలంటే త్యాగాలు, బలిదానాలు తప్పవు’ అంటున్నాడు. ఎవరిదో కవిత్వంలోంచి కాబోలు. ఆ చదివిన పద్ధతి అలా వుంది.” సత్యానందం జ్ఞాపకం చేసుకొన్నాడు. “రామకృష్ణా అన్నాడమ్మా! అటువంటిదే. చెప్తావుండు-‘నేను చిందించిన రక్తం ఈ సంధ్య, నేటి స్వప్నం రేపటి ఉషస్సు-అదీ” అన్నాడు. “ఔనా! యువతరంలో రేగుతున్న మహోజ్వలమైన జ్వాల అది! కాని, రాజకీయపార్టీలు యువజనులు తేలిగ్గా బతికెయ్య చూస్తున్నారంటున్నాయి. మన పార్టీ యువతరాన్ని ఆకర్షించలేక పోతున్నదని మనం అందరం, ఇద్దరు కలుసుకున్నప్పుడల్లా గోలపెట్టడం మామూలైపోయింది. ఇప్పుడేమంటావు? వాడు బాగా చెప్పాడు. ఫిక్సడ్ డిపాజిట్ల మీద బ్రతుకుతున్నామన్నాడూ? బ్రహ్మాండంగా అన్నాడు....” జానకి ఫక్కున నవ్వేసింది. సత్యానందం నుదురుకొట్టుకున్నాడు. “కాని, దాని ఫలితం ఎంత భయంకరం? మన పిల్లలు తమకూ, దేశానికీ కూడా కాకుండా అయిపోతున్నారు. ఈ త్యాగాలు, ఈ ఆత్మార్పణలు నిష్ప్రయోజనం కావలసిందేనా? ఏమిటి దారి?” జానకి “వాళ్ళని మార్చడం సులభం కాదు”-అంది. “వాళ్ళకి చావు భయం లేదు. ఆస్తి మమకారం లేదు. దేశం బాగుపడాలనే మహదావేశం వుంది. కాని, వారు దారి తప్పేరు. తమ త్యాగాలు, సాహసాలు, దేశభక్తి కొరగాకుండా చేసుకొంటున్నారు. ఏం? ఎందుచేత? వాళ్ళ తండ్రులు ఎంతెంతో త్యాగాలు చేసినవాళ్ళే. ఎంతో అనుభవం వున్నవాళ్ళే. కాని, వీళ్లు అనుభవంలేని వాళ్ళలాగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? దానికి కారణం మనం!” “మనమా?” అన్నాడు సత్యానందం విచారం, దిగ్భ్రమతో. “మనమే. ఇంకా అనుమానమా? 1948-50 పోరాటాలు వ్యక్తి హింసావాదంగా దిగజారి శిథిలం అయాయి. కారణం ఏమిటి? ప్రజాపోరాటాలు వ్యక్తి దౌర్జన్యవాదంగా ఎందుకు మారినాయి? ఓ వంటబ్రాహ్మణ్ణో, ఓ గ్రామ కరణాన్నో, పటేలునో పెద్ద పధకం వేసుకొని చంపడం విప్లవకార్యం ఎందుకయింది? ఒక మహోద్యమంలో దౌర్జన్యాలు జరగడం వేరు. దౌర్జన్యాలనే వుద్యమంగా నడపడం వేరు. ప్రజావుద్యమాలలో వున్న ఈ కీలకాన్ని గురించి మనం చెప్పడానికి ఏం ప్రయత్నించేము? చెప్పు! ఈ విధంగా సిద్ధాంతజ్ఞానాన్ని మన తరువాతి తరానికి ఇవ్వలేదు. ప్రజాసంఘాలను నిర్మించడం కాగితాలకే పరిమితం చేశాం. మహా అయితే పార్టీలోని ముఠాల బలాబలాల ప్రదర్శనకు అవి రంగస్థలం అయాయి తప్ప మనం చేసిందేమిటి? తమరి నెదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి యువతరం చేతికి నిర్మాణాల బలం యివ్వలేదు. మెదడుకు సిద్ధాంతాల పరిజ్ఞానం కలిగించలేదు. వాళ్ళు ప్రపంచాన్ని చూసేసరికి ఏం మిగిలింది? చిద్రుపలైన పార్టీలు. ఛాయామాత్రమైన అనుభవం. భయానకమైన తప్పుడు భావాల వారసత్వం. మనం వదిలిన కొస వాళ్లు అందుకొన్నారు. ప్రజాసంఘాలనవసరం. వ్యక్తిగత సాహసచర్యలతో విప్లవం. రెనే దెబ్రే పుస్తకం చదివేవా? గువేరా డైరీ చదివేవా? అవి వాళ్ళకి ప్రమాణ గ్రంధాలయాయంటే తప్పెవరిది? తప్పొప్పులు వేర్పరించుకోలేని స్థితికి వాళ్ళని వొదిలేశాం. బావా! తప్పు మనది. యువతరం నష్టపడింది. దాని బాధ్యతలో ఎవరిదెంత వాటాయన్న జిజ్ఞాస అనవసరం. ఏం చెయ్యాలో ఆలోచించాలి.” సత్యానందం లేచి ఆందోళనగా అటూ, ఇటూ పచార్లు చేయడం ప్రారంభించేడు. “రామకృష్ణ విషయం ఏం చెయ్యను?” “మీ రామకృష్ణని దృష్టిలో పెట్టుకొని ఏమీ చెయ్యలేవు. నువ్వు మంచిదనుకున్న పని చేయి. అది నిజంగా ప్రజలకు సాయపడుతూందనే విశ్వాసం కలిగి, తమదారి తప్పు అనే పరిజ్ఞానం ఏర్పడితే తప్ప యువజనం తిరిగి చూడదు....” “ఈలోపున?....” “ఈ ఇరవయి పాతికేళ్ళ అవజ్ఞతకి మూల్యం చెల్లిస్తాం. మనం ప్రజల విషయంలో ద్రోహమే చేసేమంటే కోపం వస్తూందా? నిజంగా మనం చేసిన దాని ఫలితం అదే. దానికెంతో మూల్యం చెల్లించాలి. ఇంకా అది పూర్తికాలేదు. ఒకతరం జనాన్ని పోగొట్టుకొన్నాం. ఇప్పటికేనా కళ్ళు తెరుస్తామా?....” సత్యానందం తల చేతబట్టుకొని కూలబడ్డాడు....”అయ్యో!” మూడో ప్రకరణం తూర్పు కోస్తా బహు తీవ్రమైన తుపాను దెబ్బకి అల్లల్లాడి పోతూంది. ధారాపాతంగా వర్షం, చెట్లని మెలితిప్పేస్తున్న గాలి. తలుపులు బిగించి లోపల కూర్చున్నా ప్రకృతి విజృంభణకు ఇళ్ళే కదిలిపోతూన్నట్లనిపిస్తూంది. రామకృష్ణకి మంచం దిగాలని కూడా అనిపించడంలేదు. వెంటిలేటర్లలోంచి పడుతున్న వెలుతురు చూస్తే తెల్లవారినట్లుగా వుంది. కాని మబ్బుల్లో ఎంత పొద్దుపోయిందీ తెలియడం లేదు. గాలి హోరు, వాన హోరులో యింట్లో ఎవరన్నా లేచేరో లేదో కూడా తెలియడం లేదు. ఒక్క నిముషం లేచి కూర్చుని, మళ్ళీ పడుకుంటూండగా తల్లి గొంతుక వినిపించింది. “ఏరా?” కంఠస్వరం కొత్తగా వినిపించి రామకృష్ణ వులికిపడ్డాడు. “ఊ” అంటూ దుప్పటి సడలించకుండానే మంచం మీద సర్దుకొన్నాడు. “ఏం ఇంకా లేవలేదూ?” “రాత్రి గాలికి నిద్రపట్టలేదమ్మా!” “ఇనప్పెట్టె లాంటి ఇంట్లో పరుపులూ, దిండ్లూ మధ్య పవ్వళించేవు. బయట గాలీ, వానగా వుంది గనక నీకు నిద్ర పట్టలేదు. కదూ.” “గాలికి ఇల్లే వూగిపోతూంటేను?” “ఈ వన్నెవాడివి అడవుల్లో, దారీతెన్నూ లేని పుంతల్లో, తిండీ తిప్పలూ లేకుండా పోలీసాళ్ళు ఏ మూలనుంచి వస్తున్నారోయని కాపలా కాచుకుంటూ ఒక్కరోజన్నా నిలబడగలనని ఎల్లా అనుకొన్నావోయ్.” తన రాక ఏమిటో, ఎందుకో తండ్రి ఆమెకు చెప్పేసేడన్న మాట. చెప్పకుండా వుంటాడని తానూ అనుకోలేదు. ఆ మాటవింటే ఆమె ఏడుస్తుంది. బ్రతిమాలుతుంది-అని అతని అంచనా. ఆమె ఏడ్పును చూడలేడు. తనకీ ఏడుపు వచ్చేస్తుంది. అల్లాంటి పరిస్థితిని ఎదుర్కోలేకనే అతడు ఇంటికి రావడానికీ, తండ్రిని డబ్బు అడగడానికీ తటపటాయించేడు. కాని, ఇంక ఆలస్యం అయిపోతూంది. పళ్ళ బిగువు మీద వచ్చేడు. తల్లి వూళ్ళోలేదు. సంతోషం కలిగింది. తండ్రితో జగడం వేసుకొన్నాడు. లేకపోతే ఈ బంధాలనుంచి బయటపడడం సాధ్యమయ్యేలా కనిపించలేదు. రాజకీయాలలో తేలిక చేశాక, ఆయన జీవితాన్నే వెక్కిరించడం, ఆయన నడవడికను యద్దేవా చెయ్యడం, ఆయననే తుస్కారించడం కష్టం కాలేదు. కాని, తండ్రిలాగ తల్లి వాదన వేసుకోదు. ఏడుస్తుంది. ఆమెను అపహాస్యం చేసేందుకు ఆమెకు రాజకీయాలు లేవు. ప్రేమగా బ్రతిమలాడుతుంది. ఆవిడ ఆయుధాలు భిన్నం. వాటిని ఎదుర్కోడం గురించి తెల్లవార్లూ ఆలోచిస్తూనే వున్నాడు. ఏమీ తోచలేదు. మెండితనంగా భరించి, తోసుకుపోవడం తప్ప మరి దారి లేదనుకున్నాడు. కాని, తీరా చూస్తే ఆమె ధోరణి తాను భయపడినట్లుగా లేదు. వాదనలోకి వెడితే అది తనకు అనువైన మార్గమే. అందుచేత దుప్పటి కూడా తియ్యకుండానే ఆమె దాడిని ఎగతాళిలో తోసెయ్యబోయేడు. “కించిద్భోగం భవిష్యతి-అన్నారు కదమ్మా!” ఈమారు తల్లి నిజంగా నెత్తిన పెద్ద బాంబే పడేసింది. “సరస్వతితో సరాగాలు కూడా కించిద్భోగంలో భాగమేనా?” రామకృష్ణ ముసుగు లోపలనే నీరు విడిచిపోయేడు. నిజానికి సరస్వతి తన భార్య. తమ చదువుల మూలంగా ఆగేరు. తమ ప్రయత్నాలు గురించి ఆమెతో చెప్పాలనే ఆలోచనతోనే ఆమెను అగ్రహారం రమ్మని రాసేడు. వచ్చింది. తల్లిలేని అవకాశం తీసుకొని, ఆడపిల్లల్ని క్రిందికి పొమ్మని మేడ స్వాధీనంలో వుంచుకొని ఆమెతో ఈ రెండురోజులు మంతనాలు సాగించేడు. ఆ మంతనాలకు ముందు అతడు ఏ నిర్ణయాలు చేసుకొన్నా, ఆమె ఎదుట అవి నిలబడలేదు. అవి ఎవ్వరికీ తెలియలేదని అతని విశ్వాసం. ఇప్పుడు తల్లి ఆ ప్రసక్తి తెచ్చేసరికి గుండెలు ఆగిపోయినట్లయింది. మాట్లాడలేదు. భద్ర వదలలేదు. ఝణంఝణ లాడించసాగింది. “ఎవరు మీ నాయకుడు? కోయల్నీ కొండవాళ్ళనీ పట్టివుంచి, ఏకంచేసి నిలపడంకోసం అతడు నాలుగు తెగలనుంచి పెళ్ళాల్ని చేసుకొన్నాడుట! ఈమధ్య అయిదోదాన్ని కూడా కట్టుకొన్నాడని పత్రికల్లో చదివాం.” పత్రికలనేసరికి రామకృష్ణకి వెర్రికోపం వచ్చింది. దుప్పటి తన్నేసి లేచేడు. “బూర్జువా, ప్రజాద్రోహి, అభివృద్ధి నిరోధక, రొచ్చుగుంట పత్రికల మాటలు నమ్మకూడదమ్మా!” “నమ్మకూడనిదేది? అయిదోపెళ్లి మాటా? మొదటి నాలుగూ కూడానా? కాక, అసలు అతడే అబద్ధమా?....” భద్ర కుర్చీ లాక్కుని కూర్చుంటూ, ఆ సదసత్సంశయం తెల్చుకోదలచుకొన్నట్లు డుబాయిస్తూంటే రామకృష్ణ తెల్లబోయేడు. “ఏం మాట్లాడవు?....” అని భద్ర గద్దించింది. “నేనెప్పుడూ ఆలోచించలేదు”-అన్నాడు పిల్లిలా. “ఇంక ఏమిట్రా నువ్వు ఆలోచించింది? అడువుల్లోకి నువ్వేనా వెళ్ళడం, లేక దేశాన్నంతనీ అడవులకి పట్టిద్దామనుకున్నావా? మీ నాయకత్వం సంఘాన్ని ఎక్కడికి తీసుకెడుతుంది? మీరు అసహ్యించుకుని విషం కక్కే బూర్జువా, ఫ్యూడల్ యుగాలకి కూడా కాదు. ఇంకా వెనక్కి. సెల్యూకసు కూతుర్ని చంద్రగుప్తుడు పెళ్లి చేసుకొన్నాడు. గజపతిరాజుల కూతుర్ని కృష్ణదేవరాయలు చేసుకొన్నాడు. బహు భార్యత్వమే కాదు. ఆడుదాని ద్వేషం కూడా వాళ్ళకి పాటింపు కాకపోయింది. ఈనాటి పడుచు వాళ్లు ప్రేమా, పెళ్లీ అంటున్నారు....” “నేనేమన్నానమ్మా!....” అన్నాడు రామకృష్ణ సమాధాన పరిచే ప్రయత్నంలో. “ప్రేమించేను. పెళ్లి చేసుకొంటానన్నావు. మేమంతా సంతోషించాం.” “మరి?” “ఇదేమిటి? అడవుల్లోకి పోతానంటూ నీకు మళ్లీ ప్రేమ-పెళ్ళి ఏమిటి? ఎందుకు? దాని గొంతు కొయ్యడానికా? లేకపోతే మీ నాయకుడిలా ఇక్కడొకర్నీ అక్కడొకర్నీ కట్టుకొని మైదానాలకీ పర్వత ప్రాంతాలకీ వారధి కడదామనా?” రామకృష్ణకి మాట తోచడం లేదు. తన మనస్సులోనిది పూర్తిగా చెప్పడం ఇష్టంలేదు. ఏం చెప్పాలో, ఎంతవరకు చెప్పాలో అర్థం కావడంలేదు. “బహు భార్యత్వాన్ని ఆఖరుకి చట్టం కూడా నిషేధించింది. అది బూర్జువా ప్రభుత్వం చేసిన చట్టం గనక ధిక్కరించాలా? కుళ్ళిపోయిన, కుష్టు సమాజంలోని ఆచారం గనక నిరాకరించాలా? విప్లవానికి అవసరమైతే ఆ శ్రీకృష్ణపరమాత్మ కాలం నాటికి సర్దుకొన్నా ఫర్వాలేదా?....” తానూ, తన మిత్రులూ ఎవ్వరూ కూడ ఆ వార్తలో వున్న గుంట చిక్కుల్ని గురించి ఆలోచించలేదు. ఒక విధంగా నలుగురు పెళ్ళాల్ని చక్కబెడుతున్న అతని మగటిమిని మెచ్చుకొన్నారేమో కూడా. అతడు పార్టీలో ఎటువంటి నాయకుడో తాము ఎరగరు. గెరిల్లా యుద్ధపు అవసరాలు కొత్త నాయకత్వాన్ని, కొత్త నిర్మాణాన్ని తెస్తాయన్నాడు రెనేదెబ్రే. ఇప్పుడు తల్లి మరో ప్రశ్నను తెస్తూంది. సామాజిక లక్ష్యాలు కూడా మారుతాయా? ఆ ఆలోచనలలో తల్లి తన సమాధానం కోసం కాచుకొని వున్నదని కూడా మరిచేడు. కాని, ఆమె వదలలేదు. “ఏం మాట్లాడవు?” అని గర్జించింది. “ఏం చెప్పమంటావు?” “ఏమిటా? మిమ్మల్ని పెళ్లి చేసేసుకోమన్నాం. చదువులు కావాలన్నారు. సరేనన్నాం. ఇప్పుడు త్యాగం చెయ్యడానికి అడవుల్లోకి పోతానంటూ ఆ అమ్మాయిని రప్పించి, ఇక్కడ కాపురం ప్రారంభించడంలో ఏమిటి నీ వుద్దేశం?” “మాట్లాడుకోడం కూడా పనికిరాదా?” అన్నాడు, రామకృష్ణ మొండిగా. మనస్సులో రగులుతున్న కోపాన్ని భద్ర అణుచుకొన్నా, అతని మొండి సమాధానానికి ఏ రూపంలో సమాధానం ఇవ్వాలో అర్థం కాలేదు. తల్లినోరు నొక్కగలిగిన ధైర్యంతో రామకృష్ణ మరో అడుగు ముందుకు వేసేడు. “నీకెవరు చెప్పారో, వట్టి కల్పనలు. మేమంత నిగ్రహం లేని వాళ్ళమా?....” ఇంకా అతడెటువంటి ధీమా, దబాయింపూ చూపగలిగేవాడో, కాని భద్ర భగ్గుమంది. “సరస్వతీ!” ఆ పిలుపు కోసమే, గుమ్మం వెలుపల నిలబడి వుందోయేమో, ఆ పిలుపు గొంతులో వుండగనే సరస్వతి గదిలోకి వచ్చింది. భద్ర కుర్చీ వెనుక తల వంచుకొని నిలబడింది. ఆమె రాకతో అతనికి పరిస్థితి అర్థం అయిందనిపించింది. ఇంకా ఏం చెప్పింది? ఎంతవరకు చెప్పింది? పోలీసువాడికేనా ఇలా చెప్పేసే మనిషే కదా అనిపించింది. “ఇంత బలహీనురాలా తనకి పెళ్లాం?” అనిపించింది. కోపం వచ్చింది. మంచం మీద నుంచి వురుకుతున్నట్లు గమ్మున జరిగి, కాళ్ళు క్రిందకి వ్రేలాడేసుక్కూర్చుని ముందుకు వంగేడు. “నువ్వే చెప్పావా?” సరస్వతి కంగారుపడింది. “వారికి అన్నీ తెలిసిపోయాయి.” భద్ర మధ్యవుండి అతని చూపుల తీవ్రతకి తల పంకించింది. “వీడూ....నువ్వు ఎన్నుకొన్న మగడు! ఒక్కక్షణం క్రితం సర్వం మిధ్య అన్నాడు. ఈ క్షణంలో డబాయిస్తున్నాడు. కళ్ళెర్ర జేస్తున్నాడు. అభాజనుడు....” అని భద్ర కుర్చీలోంచి లేచింది. అదివరకు తాను చేసింది తప్పో ఒప్పో కాని, ఇప్పుడు చేసింది మాత్రం గొప్ప తప్పు అని రామకృష్ణ గ్రహించేడు. తల్లిని శాంతపరచడం తక్షణావసరం. అంతకన్న ముఖ్యావసరం సరస్వతి మంచితనాన్ని కాపాడుకోవడం. నూతన రాజకీయాలు గతాన్నంతనూ తుడిచి పెట్టేద్దామంటున్నాయి. పెళ్ళి అనేది కొత్తదా, పాతదా? ఏ రూపంలో? అవన్నీ ఆలోచించుకోవలసి వుంటుందనుకోలేదు. ఇప్పుడా వ్యవధి లేదు. చటుక్కున సర్దుకొన్నాడు. “హఠాత్తుగా అడుగుతే, ఏం చెప్పాలో తెలియక....” “అప్పుడేరా, మన అంతరంగం బయటపడేది. అప్పుడే నువ్వు ఏం మనిషివో, ఎటువంటివాడివో....” ఒక్క విదిలింపుతో అతనిని పక్కకు పెట్టింది. “నువ్వు పెద్దచదువు చదువుతున్నావు. మంచిచెడ్డలు ఎరుగుదువు. కాని ఆడపిల్లవు. వీడు నా కొడుకే అయినా జాగ్రత్త. పెళ్ళిచేసుకోండి వెంటనే....” అంది. సరస్వతి తల వొంచుకొంది. “రిజిస్టర్డు పెళ్ళి చేసుకొని ఆరునెలలయిందండి.” “ఔనమ్మా!” అన్నాడు, ప్రాధేయపూర్వకంగా రామకృష్ణ. భద్ర తెల్లబోయింది. ఒకవిధంగా ఇంతవరకూ మనస్సును వేధిస్తున్న చింతతీరింది. కాని, అదివరకు లేని కొత్త బాధ కలిగింది. తమ అంగీకారం వున్నా, తమకు తెలియకుండా పెళ్ళి చేసుకోడం ఎందుకు? తమరిని ఖిన్నపరచడం నూతన రాజకీయాలలో భాగమా? భద్ర ఒక్క క్షణం వూరుకుంది. ఆమె వెనుకనుంచి సరస్వతి ఏదో సంజ్ఞ చేస్తూంది. కాని, రామకృష్ణకు అది అర్థం కాలేదు. చేసేది లేక సరస్వతే ముందుకు వచ్చింది. “నాదేనండి తప్పు. నా పట్టుదలేనండి.” ఆమె మాటలు వినిపించుకోనట్టు భద్ర కొడుకును అడిగింది.... “అడవులకి పోయే ఆలోచన కొత్తగా పుట్టిందా?” అంది. “ఇద్దరం కలిసి వెళ్ళిపోవాలనేనమ్మా!” భద్రకు దుఃఖం ఆగలేదు. గబగబా గదిలోంచి నిష్కృమించింది. వెనక వస్తున్న కొడుకునూ, కోడలినీ చేయి విదిలింపుతో వారించి, తలుపులు ‘ఛట్టు’నవేసి వెళ్ళిపోయింది. సరస్వతి భర్తను కోప్పడింది. “మామూలుగా జరిగిపోయేవాటికి పెద్ద పెద్ద మాటలతో మెలికలు వెయ్యడం, సాఫీగా జరిగే వానిని గొడవలోకి తేవడం ఎందుకంటే విన్నారు కాదు. చూడండి. అనవసర విప్లవంతో ఎంత రభస తెచ్చారో.” క్రిందనుంచి పిలుపు వినబడి ఇద్దరూ ఆలకించారు. “రామకృష్ణా! సరస్వతీ! రవీ!” సరస్వతి గుమ్మంవేపు కదులుతూ. “రాండి”-అంది. “జానకమ్మగారు!” నాలుగో ప్రకరణం రాత్రి తెల్లవార్లూ పెనుగాలి, కుంభవృష్టి. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తగ్గుతున్నట్లనిపించి సత్యానందం వీధి తలుపు తెరిచాడు. ఝుమ్మున గాలి అతని చేతుల నుంచి లాక్కుని తలుపుల్ని గోడకేసి కొట్టింది. విసురుకు వర్షపుజల్లు వరండా దాటి సావట్లోకంటా వచ్చేసింది. మబ్బులు మూసుకొని వున్నా వీధంతా తెరిపిగా కనిపించింది. వాకిట్లో వున్న పువ్వుల మొక్కలు ఒక్క ఆకు లేకుండా దుళ్లిపోయి నేలనంటుకుపోయాయి. కొమ్మలు విరిగి దొడ్డి అంతా దొర్లుతున్నాయి. వీధిలోవున్న కొబ్బరిచెట్ల తలలు వడేసి మెలి తిప్పినట్లు, విరిగిపోయి వ్రేలాడుతున్నాయి. వాని మొవ్వుటాకులు కూడా నిల్చుని లేవు. చాల ఆకులు చిరిగిపోయి మానుచుట్టూ రాచుకొంటూ వ్రేలబడి వున్నాయి. ఇంటికి ఎదురుగా వున్న పెంకుటింటి మీద పెంకులు జారిపోయాయి. పెణకలు విరిగిపోయాయి. అది చూసేక హరిజనపేట మాట గుర్తు వచ్చింది. పడుకోబోయేటప్పుడు అనుకొన్నారు, వాళ్ళని గురించి. ఆమాట తోచగానే మనస్సు కలకవేసింది-“పేటవాళ్లు ఏమయిపోయేరో....” ఇనప్పెట్టెలా వున్న తమ యిల్లు ఈకాడికి వచ్చింది. హరిజనపేటలు నామరూపాలు మిగిలాయా? ఆడాళ్లు, ముసిలాళ్లు, పిల్లలు, ఏమయ్యారో.... ఒక్కక్షణం ఆగలేకపోయేడు. రాత్రే ఎందుకు వాళ్ల సంగతి చూడలేదనిపించింది. అందులో పంచాయతీబోర్డు అధ్యక్షుడుగా కాడా తనకు ఆ బాధ్యత వుంది. అంతకన్న అధికం కమ్యూనిస్టుగా. తన అశక్తతకి సిగ్గుపడ్డాడు. జానకి చెప్పినట్లు కుర్రాళ్లు తిట్టేరంటే ఆశ్చర్యమేముందని తన్ను కించపరుచుకొన్నాడు. “మెత్తదనం, మెత్తదనం” అనుకున్నాడు. భార్యని కేకేసేడు. వంటింట్లో వున్నదేమో ఆమెకు మాట వినిపించలేదు. జానకి వచ్చింది. “ఏం బావా?” “వీధి తలుపు వేసుకోండి.నేనల్లా పల్లేకేసి పోయొస్తా. ఒక్క యిల్లు కూడా వుండేలా లేదు. అంతా ఏమయ్యారో.” ఆ మాట తమకందరకూ రాత్రే తోచింది. కాని, ఆ చీకట్లో, గాలిలో, వర్షంలో వెళ్ళడం సాధ్యం కాదనిపించింది. చెట్లు కూలుతున్నాయి. నీటికి మెరకలూ, పల్లాలూ సరిసమానం అయిపోయాయి. చలి. జాలిపడ్డారు. ఇరవయ్యేళ్ళ పరిపాలన అనంతరం కూడా దేశాన్ని ఆ స్థితిలోనే వుంచిన కాంగ్రెసును తిట్టుకొన్నారు. తమ అసమర్థతను చూసి మనస్సులోనే గుంజాటన పడ్డారు. అంతే. వూరుకున్నారు. “నడు, నేనూ వస్తున్నా” నంది. “ఈ గాలీ, వర్షంలో నువ్వెందుకుగాని, నువ్వూ భద్రా ఇంత గంజేనా కాచండి. అవసరం కావచ్చు.” ఆ మాటా నిజమే అనిపించింది. “అయితే కుర్రాళ్ళని తీసుకెళ్ళు” కుర్రవాళ్ళని సుఖంగా పడుకోనివ్వక గాలీ వానలో కష్టపెడతామా అనిపించింది. “ఎందుకులే, పడుకున్నారు పడుకోనీ....” కాని, జానకి ఒప్పుకోలేదు. “ఇల్లా దయతలచే కుర్రాళ్లని పాడుచేస్తున్నాం.” అంది. “రామకృష్ణా! రవీ!” అని పిలుస్తూ లోపలికి వెళ్ళింది. ఆమె ఆలోచన మంచిదేననిపించి వరండాలోకి వేసిన కాలు వెనక్కి తీసుకొని, సత్యానందం వెనక్కి జరిగేడు. అయిదో ప్రకరణం వాళ్ళు ముగ్గురూ గుమ్మంలోకి వెళ్లబోతూండగానే, గేటు తలుపులు తీసుకొని ఎవరో వెనకనుంచి నెట్టుకుని వస్తున్నట్టు డాక్టరు రంగనాయకులు తూలిపోతూ వరండాలోకి వచ్చేసేడు. వస్తూనే ఉపోద్ఘాతం ఏమీ లేకుండానే క్షమార్పణ వినిపించేడు. “క్షమించాలి. సత్యానందంగారూ! మిమ్మల్నడక్కుండా....” అతని స్ధితి చూసి సత్యానందం తనను అడక్కుండా చేసిన అపరాధం గురించి ఆసక్తి కనబరచలేదు. “ఈ గాలీ వర్షంలో ఎక్కడినుంచి వస్తున్నావు! ఆ బట్టలేమిటి? వళ్ళంతా బురదేమిటి? క్షమించమని అడగడానికి ఇంత తుపాను వేళ....” జానకి కోసం వెనుతిరిగి చూసేడు. వీధిలోకి బయలుదేరుతున్న వారికోసం కాఫీలు తీసుకొని ఆమె వస్తూంది. సత్యానందం రంగనాయకులును కూర్చోబెట్టి ఒక కప్పు చేతికిచ్చేడు. “ముందిది త్రాగు. తరవాత చెప్పు.” రంగనాయకులు తాను వచ్చిన పని చెప్పబోవడం, సత్యానందం గద్దించి కాఫీ గుర్తుచేయడంతో మరి వూరుకొన్నాడు. కాఫీ త్రాగి కప్పు క్రిందపెట్టేడు. “ధేంక్సు.” “ఇప్పుడు చెప్పు. నాకు నువ్వేం అపకారం చేసేవో, ఎందుకు ఆ క్షమార్పణ చెప్పుకోవలసి వచ్చిందో?” “మీకుగాని, హెడ్మాస్టరుకుగాని చెప్పకుండా హైస్కూలు బిల్డింగు తాళాలు బద్దలు కొట్టేశాను....” తాను ఏమంటాడో వినడానికి రంగనాయకులు మాట నిలిపేడని గ్రహించి సత్యానందం వూరుకొన్నాడు. “ఎందుకని అడగరేం?” సత్యానందం నవ్వేడు. “చెప్పు.” “హరిజన పల్లెల వాళ్ళని తీసుకొచ్చి అందులో ప్రవేశపెట్టేను. ఆఖరు జట్టు కూడా వచ్చేరు. నేనిల్లా వస్తున్నాను.” సత్యానందం కళ్ళ నీళ్లు వచ్చేయి. “నేను చేసివుండవలసిన పని నువ్వు చేసేవు. నిన్ను క్షమించడమెందుకయ్యా!” ఓ రాత్రివేళ జాన్‌ని మోసుకొని నలుగురు కుర్రవాళ్ళు క్లినిక్‌కు వచ్చి లేపేరు. అతని పాక కూలిపోయింది. అదివరకే ఆకులెగిరిపోయాయట. పెద్ద దెబ్బలు తగల లేదు. కాని పాత గాయాలు....మనిషి పడిపోయేడు. అతనిని సర్దేసరికి మరో ఇద్దరు పల్లెనుంచి వచ్చేరు. వాళ్ళంతా కొంపలుపోయి నెమ్మదిగా వూళ్ళోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. అందరూ తలోదారి అయ్యేరు. వాళ్ళకేదో చోటు చూపాలి. “నాకేం తోచలేదు. వెంటనే హైస్కూలు బిల్డింగులు గుర్తు వచ్చాయి. వాళ్ళని తీసుకెళ్ళేను. మీకెవ్వరికీ చెప్పడానికి వ్యవధి లేదు. ఏదో చెయ్యాలి....” సత్యానందం అతనిని మెచ్చుకున్నాడు. “చాల మంచి పని చేసేవు. చాలా మంచిపని చేసేవు.” రంగనాయకులు సంకోచిస్తూ మళ్ళీ మొదలెట్టేడు. “మీ పల్లెను మీ నుంచి విదదియ్యాలనే ఆలోచనతో కాదు. వాళ్లు ఏమైపోతున్నారో అనిపించి బాడవలో మాలపల్లె వాళ్ళని కూడా తీసుకు వచ్చేను....” సత్యానందం హృదయం నిండి వచ్చింది. కంఠం గద్గదికం అయ్యింది. “ప్రజలకు సాయపడేందుకు పార్టీలు కాని వారిని మీవాళ్ళు, మావాళ్ళు అని పంచుకొనేందుకు కాదు. నువ్వు నాకంటె చిన్నవాడివి. నిన్ను మెచ్చుకోవడం తప్ప నీమీద నా మనస్సులో కలిగిన భావాన్ని మరో విధంగా చెప్పలేను. కాని చాలా మంచిపని చేసేవు.” రంగనాయకులు సెలవు తీసుకొని లేచాడు. నాలుగు అడుగులు వేసి, మళ్ళీ వెనక్కి వచ్చేడు. “డాక్టర్! నాకు ఒక ఆలోచన కలిగింది” అని సత్యానందం వెనుదిరుగుతున్న రంగనాయకుల్ని చూసి అన్నాడు. “నాకో అభిప్రాయం కలిగింది. చెప్తాను. ముందు మీరేదో చెప్పబోయేరు. కానీండి”-అన్నాడు, రంగనాయకులు. “ఈ తుఫాను కలిగించిన నష్టం ఎంతో ఇంకా తెలియదు. కాని వీధుల్లో చెట్లస్థితి చూస్తే చాల తీవ్రంగా వున్నట్లే అనుకొంటున్నా. వరదలూ, తుఫానులూ వెనక వచ్చే అంటురోగాల నష్టం తక్కువేం వుండదు. తుఫానుని మనం ఆపలేకపోవచ్చు. కాని, అంటురోగాల విషయంలో ఏ కొంచెమన్నా చెయ్యగలుగుతాం.” తన మనస్సులోని ఆలోచనలను చదువుతున్నట్లే వినిపించి రంగనాయకులు తెల్లబోయాడు. “నేనూ సరిగ్గా ఆ విషయమే చెప్పాలనుకొంటున్నా. మీరే ఎత్తుకున్నారు” అన్నాడు. “పంచాయతీ బోర్డు నుంచి మందులకి కొంత సొమ్ము ఖర్చుచేద్దాం. కనీసం వూరువరకైనా వైద్యసహాయం నాలుగు మూలలా అందేటందుకు ఏర్పాటు చెయ్యగలవా?” అన్నాడు సత్యానందం. రంగనాయకులు అంతపని తన ఒక్కనివల్లా జరగదన్నాడు. కాని అతడు చెప్పిన వుపాయం నిరాకరించతగినదిగా కనిపించలేదు. “మీ రామకృష్ణ వూళ్ళో వున్నాడు.” అయితే కొడుకు ఆ పనికి ఒప్పుకుంటాడనే విశ్వాసం సత్యానందానికి లేదు. అతడూ ఎదటనే వున్నాడు. కనక తన అవిశ్వాసాన్ని కనబరచలేదు. అందుచేత ఉమ్మడిగా సలహా యిచ్చేడు. “ఆ బాధ్యత నువ్వు తీసుకో. నీకు కావలసిన సహాయం అడుగు. ఒక్క రామకృష్ణేనా? సుశీల వుంది. క్వాలిఫైడ్ డాక్టర్....” రామకృష్ణ తన అనంగీకారం అక్కడే తెలిపేడు. అసలీ వైద్యవిద్యే వట్టి బూటకం అన్నాడు. “మాకు నేర్పేది మందులు అమ్ముకొనేవాళ్ళకి జేబులునింపే చదువు. మన జనసామాన్యం వాటిని కొనలేదు. వారికి అందుబాటులో వుండే కూరాకు వైద్యం మాకు చేతకాదు. ఇదంతా వట్టి హంబగ్. నేను రాను.” దానిమీద చర్చ ప్రారంభమయి అసలు విషయం మూలబడుతుందని జానకి చటుక్కున ఆడ్డుబడింది. “రామకృష్ణ వాదనలో కొంత కొంత నిజం లేకపోలేదు. అయితే ఎంత నిజం, ఏది నిజం అనేది చర్చించడానికి సమయం కాదు. ఎవరికి తోచినపని వారు చేద్దాం.” రంగనాయకులు ‘ఔన’న్నాడు. “మీరెవ్వరైనా సుశీలతో మాట్లాడగలుగుతారా! ఈలోపున నేనింటికిపోయి బట్టలు మార్చుకొని వస్తా.” ఆ దంపతుల మధ్యనున్న వైమనస్యాల నెరిగినవారెవ్వరూ రంగనాయకుల ప్రతిపాదనను అంగీకరించలేకపోయేరు. వారి తటపటాయింపును గమనించినట్లు రంగనాయకులే మళ్ళీ అన్నాడు. “ఇంటికెళ్ళేటప్పుడు ఆవిడని నేనే అడుగుతాను. మా కంపౌండరుని, మహిళా సంఘం నర్సునీ సాయం తీసుకొందాం. సత్యానందంగారూ! ఇది నా ఒక్కడివల్లా కాగలదికాదు. నలుగురం చేద్దాం. మీరంతా సరేనంటే జరుగుతుంది.” మారు సమాధానం కోసం కూడా నిలబడకుండా రంగనాయకులు నిష్క్రమించేడు. జానకి సత్యానందానికి సలహా ఇచ్చింది. “నువ్వు సుశీలతో మాట్లాడు. అతని ఆలోచన మంచిదే.” ఆరో ప్రకరణం బట్టలు మార్చుకొని రమ్మనీ, తాను ఈలోపుగా స్కూలుకు వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చూస్తాననీ రంగనాయకులును పంపేడుగాని, సత్యానందం వెంటనే కదలడానికి వీలులేకపోయింది. హైస్కూలు హెడ్మాస్టరునూ, మరో ఇద్దరు టీచర్లనూ వెంటబెట్టుకొని కామేశ్వరరావు వచ్చి పడ్డాడు. వస్తూనే సుందరరావూ కొడుకూ తుపాను పేరుతో తమరు కష్టపడకుండా మాలపల్లెలను కూడగట్టుకొనేందుకు పన్నిన కుట్రను వివరించడం ప్రారంభించేడు. “అత్తగారి సొమ్ము అల్లుడు ధారపోసినట్లు హైస్కూలులోకి తెచ్చి తమ పల్లెవాళ్ళని మకాం పెట్టించేడు. మనకి చేతగాకనే వూరుకొన్నామా? హెడ్మాస్టరుది, స్కూలులో పూచికపుల్ల కదలకుండా చూసుకోవలసిన బాధ్యత. స్కూలు కమిటీ సెక్రటరీ విశ్వనాధం వున్నారు. పంచాయతీ అధ్యక్షులు మీరున్నారు. ఎవ్వరితోనూ చెప్పకుండా తన బాబు ముల్లె అయినట్లు అందులోకి తెచ్చిపెట్టేడు. ఇదేమిటంటే చూసేరా అని యాగీ చేసి మనల్నందర్నీ అప్రతిష్ఠల పాల్చేయొచ్చు. వూరుకొంటే చూసేరా మా పార్టీ పూనుకోలేకపోతే....” కామేశ్వరరావు వాగ్థోరణి చికాకు కలిగిస్తున్నా సత్యానందం ఏమీ అనలేకపోతున్నాడు. అతడు తన పార్టీ సభ్యుడు. మిగిలిన ముగ్గురూ సభ్యులు కాదు. అతనిని వారి ముందు ఏమనడానికీ వీలు లేదు. “మనం ముందే పూనుకొని వుంటే సుందరరావుగారికి అవకాశం వుండేది కాదు. చెయ్యలేకపోయేం. ప్చ్!” అన్నాడు, అతి సామాన్యంగా. “మనం బాధ్యతలు గలవాళ్ళం. సుందరరావులా ఎల్లా చెయ్యగలం?” కామేశ్వరరావు అవమానాన్ని పనిమాలా కోరుతున్నాడనిపించింది. కాని సత్యానందం చాల జాగ్రత్తగానే తూచినట్టు మాట్లాడుతున్నాడు. “బోర్డు అధ్యక్షుడుగా మరి నే చెయ్యవలసిన బాధ్యతలు? వదిలెయ్యి. కనీసం మానవులయెడ మానవులు చూపవలసిన సద్భావం కూడా చూపలేకపోయేను. అదీ నా విచారం....” ఇంక నువ్వు కట్టిపెట్టిమన్నట్లు అతని వేపు వీపు తిప్పి హెడ్మాస్టరును అడిగేడు. “ఇంత గాలీ-వానలో వచ్చేరు. ఇదేనా విషయం?” “చిత్తం.” “మొన్న మీ యింటి బల్బు పగలగొట్టేరు. మీరూరుకొన్నారు. ఈవేళ హైస్కూలు గేట్లు విరగగొట్టేరు....” అని కామేశ్వరరావు మళ్ళీ సుందరరావు అపరాధ సహస్రం గుణించ ప్రారంభించేడు. అతని మాటలు పట్టించుకోకుండా సత్యానందం హెడ్మాస్టరుతోనే మాట్లాడేడు. “మేస్టారూ! ఏం భయం అక్కర్లేదు. అనుమతి కోసం అధికార్లని అడగడం, చెయ్యడం సాధ్యమయ్యే పనికాదు. ఆ సమయంలో చెయ్యగలదేం లేదు. సుందరరావుగారు మనుష్యమాత్రుడుగా చెయ్యవలసిన పనే చేశారు....” పార్టీనాయకుల మధ్యనున్న కక్షలూ, అహంకారాలూ ఎరిగి, గాలి వాటం చూసుకుని, చుక్కానిపట్టే తెలివితేటలుగల హెడ్మాస్టరు సత్యానందం మాటలను తప్పుగా అర్థం చేసుకొన్నాడు. కామేశ్వరరావు వట్టి కబుర్లరాయడని ఎరుగును. ఆ వారంలో తమ పార్టీ జరుపుతున్న కార్యక్రమాలలో కలియకుండా ఏదో పని వుందని విజయవాడ వెళ్ళి నిన్ననే వచ్చేడని తెలుసు. అతనియెడ కోపంతో సత్యానందం సుందరరావు పార్టీమీద గల ద్వేషాన్ని మరిచాడని వుహ సాగించేడు. అందుచేత తన ధోరణిని సవరించుకొన్నాడు. “అది సత్యమే కానీండి. కాని గేటు విరగ్గొట్టడం తాళాలు పగలగొట్టడం....చాలా గొడవ తెస్తుందండి. పైగా లైబ్రరీ, రికార్డులు, ఫర్నిచరు, సైన్సు పరికరాలు ఏవి పాడుచేసినా కొంపలారిపోతాయి....” “ఏం ఫర్వాలేదు మేస్టారూ! మనుష్యుల ప్రాణాలకన్నా ఎక్కువేమిటి, ఇవన్నీ. ఒకవేళ ఏదన్నా జరిగినా, పొరపాటున జరుగుతుంది గాని బుద్ధిపూర్వకంగా చెయ్యరు. అటువంటివి వస్తే సర్దుకోవాలి. సర్దుకొందాం. లేవండి. వోమారు స్కూలుకేసి వెళ్ళివద్దాం. రాగలరా?” “చిత్తం.” “మీరు?” మిగిలిన టీచర్లు ఇతర పనులు కారణం చెప్పారు. “పనులు చూసుకోండి. కామేశ్వరరావూ మన వాళ్ళు నలుగురినీ వోమారు తీసుకురాగలవా? వాళ్ళకి భోజనాల యేర్పాటు యేదో చూడాలి కదా.” “మా దూడల పాక పడిపోయింది.” “దూడలకి దెబ్బలు తగలలేదు కద.” “లేదు. ఆవుని యింటి వసారాలోకి తెచ్చేం కనక బతికిపోయింది.” “పోనీలే” అని సంతృప్తి కనబరచేడు సత్యానందం. “పాకలో అటక నిండా కమ్మా, డొక్కా తడిసిపోయింది. దానినేదో చూడకపోతే రేపు పొయ్యిలో పిల్లి లేవదు.” “అయ్యయ్యొ పాపం. డొక్కపేడు తడిస్తే ఎల్లాగ? మాలపల్లెలకి ఇవన్నీ అలవాటే. కనక వెళ్ళిరా....” సత్యానందం అవహేళనకి కామేశ్వరరావుకి కోపం వచ్చింది. కాని, ఏమీ అనలేదు. “రామకృష్ణా! నువ్వు పోయి వెంకటేశ్వరరావు, మందేశ్వరరావుల్ని పిలుచుకురా. స్కూలు దగ్గరికి రమ్మను. ....రాండి మేస్టారూ! మీకేం పని లేకపోతేనే. ప్రజాసేవ నిర్బంధం కాదు. పైగా సుందరరావుగారికి తగిలినట్లు చీవాట్లు కూడా తగలొచ్చు!” ఏడో ప్రకరణం కొంతదూరం వెళ్ళేక సత్యానందానికి జ్ఞాపకం వచ్చింది. “మీరు స్కూలుకి వెళ్ళండి. నేను విశ్వనాధంగారితో మాట్లాడి వీలైతే తీసుకొస్తా. సాధ్యమైనన్ని గదులు చూపించండి. కొంచెం పెద్ద వాళ్ళని చూసి, గంద్రగోళం చెయ్యకుండా చూడమనండి. అంతలో వాళ్ళకేదో ఏర్పాడు చూస్తాం.” హెడ్మాస్టరు “చిత్తం” అని ముందు కడుగువేసేడు. స్కూలు దగ్గరకు వెళ్ళేసరికి చూసిన దృశ్యానికి హెడ్మాస్టరు తల తిరిగిపోయింది. వర్షంలోకి దింపడం ఇష్టంలేక ఇద్దరు అమ్మలు తమ పిల్లల్ని స్కూలు అరుగు కొసన దొడ్డికి కూర్చోబెడుతున్నారు. చూడగానే హెడ్మాస్టరు కోప్పడ్డాడు. “వుండవలసిన చోటు ఇల్లా గలీజు చేసుకొంటే అపరిశుభ్రం మాట అల్లా వుంచండి, ఏ అంటురోగాలన్నా వచ్చేయంటే....” హెడ్మాస్టారు గొంతు వినగానే ఎక్కడెక్కడున్నవాళ్ళూ ఆయన ఎదుటికి వచ్చేరు. దండాలు పెట్టేరు. రాత్రి తాము పడ్డ ఇబ్బందులు చెప్పుకొన్నారు. డాక్టరు రంగనాయకులు చేసిన సాయం పొగిడేరు. హెడ్మాస్టారు తాను రాగానే కనిపించిన అసహ్యకర దృశ్యాన్ని మరవలేకున్నాడు. అంతమందిని తడిగుడ్డలు, బాడికాళ్లు, తడిసి చీకిరి బాకిరిగా వున్న తలలుతో ఒక్క చోట చూసేసరికి మరింత అసహ్యం కలిగింది. “అత్తగారి ఆస్తిని అల్లుడు ధారపోశాడన్నట్లు రంగనాయకులుగారిదేం పోయింది? విద్యాలయం అంటే ఎంత పరిశుభ్రంగా వుండాలి? అది సరస్వతీదేవి ఆలయం అన్నమాట. దానిని ఎంత పవిత్రంగా వుంచాలి?” సరస్వతీదేవి మందిరాన్ని అపవిత్రం చేస్తూ తాను వచ్చేసరికి జరుగుతున్న అకార్యాన్ని చెప్పేడు. “ఇల్లాంటి అభాగ్యులు కనకనే పొట్ట చీరి డోలు కట్టినా ‘ఢం’ అని పలకడం లేదు.” అక్కడ చేరిన వాళ్ళంతా వచ్చింది మొదలు ఆ క్షణం వరకు ఏదో మూల ఆ విధంగా దేహబాధలు తీర్చుకొన్నవాళ్లే. కాని, ఒక్కరూ ఒప్పుకోలేదు. తాము తప్ప మిగతావారినందర్నీ కలిపి తిట్టేరు. తమకేం తెలియదన్నారు. “ఎదవనాయాళ్ళండి, బుద్దిలేని యెదవలండి.” హెడ్మాస్టరు వాళ్ల బలహీనత నెరుగును. దానినక్కడ వదిలేసి వుండాలి. అతి సహజములైన దేహబాధలకు మార్గం చూపాలి. వాళ్ళ స్థితి గమనించాలి. సమయం చూడాలి. సానుభూతితో వాళ్ళకి చెప్పాలి. కాని అవేమీ ఆయనకు పట్టలేదు. తన రాజ్యంలోకి అడవి మృగాల్లా ఈ అలగాజనం వచ్చి సర్వం ధ్వంసం చేసేస్తున్నారనేదొక్కటే బాధ. కాని, తరిమెయ్యలేడు. గ్రామంలోని రెండు బలమైన పార్టీలు వాళ్లయెడ సానుభూతి చూపుతున్నాయి. వారికి సాయం చేయడానికి పూనుకొన్నాయి. తానేం చెయ్యగలడు? ప్రతి చిన్నదానికి నసపెట్టగలడు. వాళ్ళని సాధ్యమైనంత త్వరగా పోయేటట్లు అరికాళ్ల క్రింద మంటలు పెట్టగలడు. అదే ప్రారంభించేడు. “ఇదిగో చూడండి. పిల్లలు కూర్చునే బెంచీలు యిల్లాగేనా బాడి చేయడం?” అయిదు నిముషాలు ఆ వుపన్యాసం సాగింది. మళ్ళీ మరో విషయం. “బీరువాలూ, పుస్తకాలూ, కాగితాలూ ఎవ్వరూ ముట్టుకోకుండా చూడండి. అయ్యో! రికార్డు గది తలుపు తాళం కూడా విరిచేసేరే. గుమాస్తా ఏడుస్తాడు. అందులోకెవ్వరూ వెళ్ళవద్దు....” అందరికీ విసువు పుట్టింది. కోపం వస్తూంది. తమ స్థితి చూడముచ్చటగా వుందని వాళ్లూ అనుకోడం లేదు. కాని ఏం చేస్తారు? మారుగుడ్డ లేదు, మార్చుకొనేందుకు. హోరున వర్షం కురుస్తున్నా వొళ్లు శుభ్రం చేసుకొందుకు ఇన్ని నీళ్లు పట్టడం సాధ్యం కాదు. ఏమీలేదు. కడుపులోకి తిండి లేకపోయినా దేహ బాధలు తప్పవు. వానిని తీర్చుకొనేందుకు ఏర్పాట్లు లేవు. తమ గుడిసెల్లో అలవాటుపడ్డదే యిక్కడా చేశారు. మామూలు పరిస్థితుల్లో అయితే తామూ అలా చెయ్యరు. తమకూ తెలుసు. కాని,.... కాస్త సానుభూతి చూపడం లేదు. ఎల్లా బ్రతికొచ్చేరని లేదు. గంజి తాగేరా? పిల్లగాళ్ళు అల్లా ఏడుస్తున్నారు. వాళ్ళకి బువ్వ మాటేమిటి?-ఒక్కమాటా, పలుకూ లేదు. వచ్చింది మొదలు ఒకటే రంధి. ఈమారు హెడ్మాస్టరు పంధా మార్చేడు. గోడనున్న గాంధిగారి పటం చూసి ఆయన హరిజనులకు చేసిన సేవ ఎల్లా బూడిదలో పోసిన పన్నీరయిందో చెప్తూ దుఃఖపడ్డాడు. ఆ దుఃఖభారంతో సుమతీశతక పద్యం జ్ఞాపకం చేసుకొన్నాడు. “కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి....” “నోర్ముయ్యి” అన్న ఆదేశం వినబడి హెడ్మాస్టరు “ఆ....” అని తల ఎత్తేడు. ఎదుట గుమ్మంలో రామకృష్ణ కళ్ళ నిప్పులు కురిపిస్తూ ఒక్కమారు విదిలించేడు. “మీలో ఒక్కడు నోరు మూయించలేకపోయేడా? ఇందాకటి నుంచి చూస్తున్నా. ఒకటే వోండ్రపెట్టడం. మీరూరుకుంటే ఇల్లాగే మీకు వెర్రెత్తించెయ్యగలడు. తన్నండి నాలుగు. చూస్తారేం.” రామకృష్ణ ముందుకు రావడం చూసి హెడ్మాస్టరు హడలిపోయేడు. పారిపోవడానికి ప్రయత్నిస్తూంటే లోపలికి గెంటేసేడు. అతని భయం, బలహీనత స్పష్టమైన కొద్దీ రామకృష్ణకి కసి పెరుగుతూంది. “ఇది విద్యాపీఠమా? సరస్వతీ మందిరమా? ఈ రికార్డులు వాళ్ళని రక్షిస్తవా? ఈ గాంధీ వాళ్ళని ఉద్ధరించేడా....” ఒక్కొక్క వస్తువును హెడ్మాస్టరు కాళ్ళ ముందు విసిరికొట్టేడు. నాయకుల పట్టాలు నేలబెట్టి కొట్టేడు. రికార్డులన్నీ బీరువాలోంచి లాగి బయట పారేసేడు. ఇంత గంద్రగోళం జరుగుతున్నా, హరిజన పేటలవాళ్ళు ఒక్కళ్లూ అతనికి సాయం రాలేదు. పరమేశు గుమ్మంలో నిలబడి వున్నాడు. అతని పక్కనే ఒక కుర్చీ వేయించుకొని జాన్ కూర్చున్నాడు. పేటల్లో పడుచుకారు అంతా హెడ్మాస్టరును చూసి నవ్వుతున్నారు. రామకృష్ణ ఒక్కొక్క సంచెడు రాకార్డులు విసిరిపారేసినప్పుడూ వో పటం నేలబెట్టి కొట్టినప్పుడూ విజయధ్వనులు చేస్తున్నారు. కొంతసేపటికిగాని రామకృష్ణకు ఆ భీభత్సకాండను నడపడంలో తనకెవ్వరూ తోడురాలేదని గ్రహణకు రాలేదు. గుమ్మంలో రివిజనిస్టొకడూ నయా రివిజనిస్టొకడూ నిలబడీ, చదికిలబడీ వున్నారు. వాళ్ళు ప్రజాప్రవాహానికి అడ్డుకట్టు వేస్తున్నారనిపించింది. “లేవండి. దారికడ్డం తొలగండి.” పరమేశు కదలలేదు. “తొందరపడకండి. ఆయనను తిట్టి లాభం ఏమిటి? వీళ్ళను ఆడిస్తున్నవాళ్ళూ, ఆసరాగా వున్నవాళ్ళూ వేరు. రాండి.” జాన్ అతనిని సమర్థించేడు. “ఇది ఒక్కళ్ళవలన అయ్యే పని కాదు బాబూ!” రామకృష్ణ తెల్లబోయేడు. జనం ఒక్కళ్లు కదలడం లేదు. తిడుతూంటే కదలలేదు. వాళ్ళకి తోడు నిలిస్తే కదలలేదు. వాళ్ళతో వున్న రాజకీయవాదులు తన పక్క చేరడానికి బదులు తన్ను తొందర పడవద్దంటున్నారు. దేశమా ఏమయిపోతున్నావనిపించింది. చేతిలోని పుస్తకాలు హెడ్మాస్టరు మొగాన కొట్టేడు. “తిట్టు. నీచేత తిట్లు తినడానికే వీళ్లు పుట్టేరు. ఈ పందులకి బురదలో దొర్లాలని తప్ప మరో కోరిక లేదు. దొర్లనీ. దొర్లినందుకు తిట్టు” అంటూ ఆవేశం పట్టలేక భళ్ళున ఏడ్చేడు. ఎనిమిదో ప్రకరణం సత్యానందం వాళ్ళకోసం అన్నాలు పట్టించుకొస్తూ ఆ కేకలూ, ఏడ్పూ విన్నాడు. ఆ కేకలు ఎవరి మీద? ఆ ఏడ్పేమిటి? స్వరం అనుమానం కలిగించినా అది కొడుకుదే అనుకోలేకపోయేడు. తాతన్న ఎదురొచ్చేడు. అతని ముఖంలో ఆత్రం కనబడుతూంది. ఎవరికో ముఖం చాటు చేస్తున్నట్లు కనబడుతున్నాడు. “ఏమిటది వెంకట్రావూ?” తాతన్న కధ అంతా చెప్పేడు. “అబ్బాయిగారు తొందరపడుతున్నారు. ఇటువంటి పనుల వలన విప్లవం రాదని మీరేనా చెప్పండి.” అంత ఆదుర్దాలోనూ సత్యానందానికి నవ్వొచ్చింది! “విప్లవం ఆలోచన వచ్చేవరకూ మీరంతా ఎందుకూరుకున్నారు? నువ్వున్నావు, పరమేశు, జాన్ ఇందరున్నారు. హెడ్మాస్టరును మొదటే మందలించలేకపోయారా?” అన్నాడు సత్యానందం. “అసలు తప్పు మనవాళ్ళదండి.” “అల్లాంటి తప్పు చేస్తుంటే మీరెందుకు వూరుకున్నారు?” “మన మాట ఎవరు వింటారండి. పోవోయ్! మహా చెప్పొచ్చేవు అనేస్తే....” సత్యానందం వెరగుపడ్డాడు, ఆ మాటకి. తమ మాట జనం వినరేమోనన్న అనుమానం కమ్యూనిస్టులకి కలిగి వుండని రోజులు, ఆనాటి వారి ఆత్మవిశ్వాసం గుర్తువచ్చి, నిట్టూర్పు విడిచేడు. “ఇదిగో వెంకట్రావు! హెడ్మాస్టరు చదువుకొన్నవాడు. ఇంగితం తెలిసి వుండాలి. తెలియలేదు. గుడిసెల్లో మురికికూపాల్లో బతికిన జనం వీళ్లు. వాళ్ళకి ఆరోగ్య సూత్రాలు తెలియవు. పైగా వాళ్ళున్న పరిస్థితి ఏమిటి? పోనీ, తెలిసినవాళ్లు మీరంతా వున్నారు. మీరు ఎందుకు చెప్పలేదు? అలాగని హెడ్మాస్టారి కథ ముదురుతున్నప్పుడు ఆయనతో అయ్యా! మీరు చేస్తున్న పని మంచిది కాదని....” వెంకట్రావు “బాబోయ్” అన్నాడు. “ఆయన అలా వున్నారనా! పైకి మెత్తగా వుంటూ ఎంత పనేనా చెయ్యగలడు. స్కాలర్‌షిప్ రావడం ఆలస్యం చేస్తే చాలదా? ఆ కక్ష పెట్టుకొని కుర్రగాళ్ళ పరీక్ష తప్పించేస్తే?....” సత్యానందం తెల్లబోయేడు. అంతలో అతని వంక జాలిగా చూసేడు. మళ్ళీ తామంతా కొంచెం ఇంచుమించు అదే ధోరణిలో వ్యవహరిస్తున్నామని గుర్తు వచ్చింది. “నీదేముందిలే. మన బతుకే ఒరగేసుకుపోవడంగా తయారయింది. కనీసం కుర్రవాళ్లు ఆరోగ్యంగా వున్నారు. వాళ్ళకి హృదయం వుందనిపించుకున్నారు. ఆ ఆవేశాలు మన అసమర్ధతకి రియాక్షన్ ఏమో!” తొమ్మిదో ప్రకరణం రిజిష్టర్డు కవరులో వచ్చిన దస్తావేజును చూసి సత్యానందం ఆశ్చర్యపడ్డాడు, పోస్టుమాస్టరు చెప్పినప్పుడే. కవరు చేతికి వచ్చేవరకూ, అదేమిటో అర్ధంగాక ఒకటే కంగారు పడ్డాడు. ముందు వుత్తరం కోసం వెతికేడు. అది లేదని నిశ్చయించుకున్నాక కాగితాలు విప్పేడు. దస్తావేజు. మొదటి మారు చదివినప్పుడు ఆ కంగారులో ఏమీ అర్థం కాలేదు. ఇంటి పేరుతో సహా రవీంద్రనాధరావుకు  దానక్రయద్యధికారాలతో భూమినిస్తున్నట్టున్న దస్తావేజుకి తలా తోకా కనబడలేదు. ఎవరో ఆ రవీంద్రనాధరావు? మరల మొదటికి వచ్చేడు. ‘ఆ’ అనుకొన్నాడు. తన తెలివితక్కువతనానికి ఒక్కమారు నవ్వుకున్నాడు. “భద్రా, జానకీ.” వాళ్లు వచ్చేలోపున మరోమారు చదివేడు. ఈమారు నవ్వు రాలేదు. ఆలోచనలో పడ్డాడు. “ఎందుకు పిలిచావు?” అంది జానకి. “ఆ కాగితాలేమిటి?” అంది భద్ర. చూడమంటూ దస్తావేజు జానకి చేతబెట్టి, విషయం భార్య చెవిని వేసేడు. “బాడవ పొలం మీ మామయ్య మనమని పేర వ్రాశారు. అదీ దస్తావేజు.” భద్ర సంతృప్తి కనబరచింది. “గుడ్డిలో మెల్ల.” సత్యానందం ఏదో చెప్పబోయి, మళ్ళీ అంతలో వూరుకొన్నాడు. “మేం వచ్చిన సాయంకాలం నుంచీ గాలీ-వానగానే వుంది. తుఫాను వచ్చిన తర్వాత వచ్చిన మొదటి టపా ఇది. ఆయన ఎప్పుడు రిజిస్టరు చేయించేరు? ఎప్పుడు పోస్టు చేశారు?” అంది భద్ర. “అది సరే. ఈ భూమి ఎక్కడుంది? ఆయనకు ఈ వూళ్ళో భూమి వున్నదని విన్న గుర్తు లేదే” అంది జానకి. “దివానుగా వున్నప్పుడు సంపాదించేరులే” అన్నాడు సత్యానందం. ఆ సంపాదన ఏమాదిరిదో క్రమంగా బయటపడింది. కుమారస్వామి దివానుగా వున్న రోజుల్లో కరణానికి, రివెన్యూ ఇనస్పెక్టరుకూ ఇంత మేతవేసి బాడవలో మురుగు కాలవనానుకొని వున్న బంజరు భూమిని తనపేర పట్టా పుట్టించుకొన్నాడు. పేరు మారింది. పన్ను చెల్లుతూంది. కాని అది ఎవ్వరికీ తెలియదు. లంక మాలపల్లిని జమీందారు లంకలోంచి తరిమేయగలిగేడు. 1948 లో ప్రారంభమైన నిర్బంధ విధానంతో మాలపల్లె గట్టిదెబ్బ తినేసింది. అటుతర్వాత బాడవలో బంజరుకోసం దరఖాస్తు  పెట్టేరు. అప్పుడున్న హరిజన తాశీల్దారు సంతకం పెట్టేడు. కాని, తీరా చూస్తే అది దివాను పేరట పట్టా అయివుంది. అది అన్యాయం అని గ్రహించి తాశీల్దారు పాత కాగితాలు తిరగవెయ్యడం ప్రారంభించేడు. అతని నోరు మూయడం సాధ్యంగాక ఎక్కడికో బదిలీ చేయించేరు. కాని భూమి విషయం తగువులో పడింది. కథనంతనూ చెప్పి సత్యానందం ఆ విధంగా మనుమనికి ఆ భూమి వ్రాయడంలో వున్న ఎత్తుగడను ఊహించేడు. “పల్లెవాళ్ళ తరపున కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నం చేస్తూనే వుంది. తిరగతోడుతూనే వుంది, వ్యవహారాన్ని. పార్టీ చీలిపోయేక పల్లెలోనూ చీలిక వచ్చింది. ఆ భూమిని మీ మామగారు జోగన్నకి కౌలు కిచ్చేరు.” “ఏ జోగన్నకి?” అంది జానకి ఆశ్చర్యంతో. “మరే జోగన్న! రంగమ్మవ్వగారి జోగన్నే” అంది భద్ర. “మరి అతడు మార్క్సిస్టేమో” అని, జానకి ఆశ్చర్యం కనబరచింది. “మీ మామగారు రాజకీయాలు ఏమీ ఎరగనట్లుంటాడు గాని, చాణక్యుడు. కమ్యూనిస్టు పార్టీలోవున్న తగవులకి మూలం తెలిసినా తెలియకపోయినా పట్టుదలలు గ్రహించేడు. జోగన్నని పిలిచి కౌలూ, కదపా లేకుండా ఆ భూమిని చేసుకోమన్నాడు...” “మరి సుందరరావుగారు ఎలా వొప్పుకొన్నారు?” అంది జానకి. “మాలపల్లె, మాదిగపల్లెల వాళ్ళు అంతా తమ పార్టీపక్షాన వుంటే ఒప్పుకోనేవాడు కాదు. కాని, అటూ ఇటూ అయ్యేరు. తమ పార్టీలోకి రానివాళ్ళని శిక్షించేందుకు, ఆశ పెట్టేందుకు అదో ఆయుధం అనుకున్నాడు. జోగన్నకి వెనకబలం ఇచ్చేడు.” అంతా ఒక్క నిముషం ఊరుకొన్నారు. ఆ పేచీ లోతులు మనస్సుకి పట్టినాక జానకి “మరి ఇప్పుడిదేమిటి?” అంది. “ముసలాయన మంచి యౌగంధరాయణం తలపెట్టేడు. పల్లెవాళ్ళు పేచీ మానలేదుగా. మీమీద అభిమానంగా వున్నాను గనుక, ఆ అభిమానంతో నేను పల్లెవాళ్ళని దిగతీస్తాననో, లేకుంటే విశ్వం అంటే వున్న గౌరవం, అభిమానంకొద్దీ...” జానకి నవ్వింది. “వాళ్ళే వదిలేసుకుంటారనా?” అంది. “అలాంటిదేదో ఆయన మనస్సులో వుండి వుంటుంది” అన్నాడు సత్యానందం. “మీరు మరీ ‘సినికల్’ గా తయారవుతున్నారు. ఏది చేసినా తప్పులెన్నే అలోచంలోంచేనా చూడడం?” అని భద్ర కోప్పడింది. “అలాగే అనుకొంటూండు” అన్నాడు సత్యానందం. పదో ప్రకరణం ఆ కబురు విన్నప్పుడు రవీంద్ర దిగ్భ్రమ చెందినట్టు తల్లి ముఖం వంక చూసేడు. “ఏమిటిది? భూమి ఏమిటి? మనకెందుకు?”-అన్నాడు. జానకి నవ్వింది. “విశ్వనాధ సత్యనారాయణగారి భాషలో చెప్పాలంటే ఎందుకనే ప్రశ్న ఏమిటి? నీ పూర్వజన్మ సంచితం అనుకో. ఆ నమ్మకం లేకపోతే పూర్వావురుష సంచితం అనుకో. ఏదయినా ఫలితం ఒక్కటే. నీకు అయిదెకరాల భూమి రావలసి వుంది. వచ్చింది. నువ్వు వద్దనుకొన్నా మానలేదు. మీ తండ్రిగారు కాలదన్నుకు పోయినా పోలేదు. మామయ్య చెప్పినట్టు తాశీల్దారు ఆ భూమిని పల్లెవాళ్ళకి ఇళ్ళ స్థలాలకి ఇచ్చివేస్తానన్నా సాగలేదు. ఆ భూమి నీది. నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఎవ్వరూ-ఆఖరుకి నువ్వు కూడా కాదనలేని విధంగా-నీ చేతికి వచ్చింది. రాజ్య పురుష ముద్రిక నెత్తిన వేసుకొని మరీ వచ్చింది. కర్మకైనా కర్మ తప్పదు. ఆ ముద్రిక మొహాన వుంటే తప్ప జీవుని కర్మసంచితానికి కూడా విలువ లేకపోవడం దురదృష్టమే, అనుకో...” ఆ మాటల ధోరణికి రవీంద్ర తెల్లబోయేడు. ఎగతాళికి నలుగురూ నవ్వేరు. రవీంద్రకు అభిమానం కలిగింది. “నాకీ భూమి అక్కర్లేదు.” కాకినాడనుంచి తల్లి అంత తొందరగా వచ్చెయ్యడానికి కారణం తాతగారు చూపిన వ్యవహార ధోరిణి అవమానకరంగా ఉండడమేనని అతని మనస్సులో కష్టంగానే వుంది. ఆ కష్టం అతని కంఠస్వరంలో, మాటతీరులో వినిపించి చటుక్కున నవ్వులు నిలిచిపోయేయి. జానకి ఆప్యాయంగా అతని భుజంమీద చెయ్యివేసి దగ్గరకు తీసుకొంది. “భూమి అక్కర్లేదంటే ఏమౌతుంది? అది నీ పేర పెట్టేశారు. ఇంకనుంచి హరిజనులు ఇళ్ళస్థలాల కోసం పెట్టే తగువు నీతో జరుగుతుంది.” అన్నాడు సత్యానందం. “ఆ భూమి నాకక్కర్లేదు మొర్రో అంటూంటే నాతో తగువెందుకు?” అన్నాడు రవీంద్ర.  “ఎవరిక్కావలసింది వాళ్ళని పట్టుకుపొమ్మనండి.” “భేషయిన ఆలోచన. ఇళ్ళులేని వాళ్ళని వేసుకోండని హుషారిస్తే క్షణంలో రెండు సమస్యలూ పరిష్కారం అయిపోతాయి.” అని రామకృష్ణ తన ఆనందం వెలిబుచ్చేడు. “బాగుంటుంది కాదూ?” అన్నాడు రవీంద్ర. జానకి వెక్కిరించింది. “అల్లా, ఇల్లాంటి బాగుండడమా? బ్రహ్మాండంగా వుంటుంది. మాలపల్లె, మాదిగపల్లె మాకంటె మాకంటారు. ఈలోపున కమ్యూనిస్టులు-మార్క్సిస్టులు అది మాదేనంటారు. ముందొచ్చినవాడు వెనకవాడిని, వాళ్ళిద్దరూ తరవాత వాడిని తన్నుతారు. వీళ్ళందర్నీ కలిపి జోగన్న తంతాడు. మంచి చూడముచ్చటగా వుంటుందిలే...” తన ఆలోచనకు అంత విపరీత పర్యవసానం కల్పించినందుకు రామకృష్ణ ఉలిక్కిపడ్డాడు. “ఇచ్చెయ్యదలచుకొన్నప్పుడు సరిగ్గా వీధులువేసి, స్థలాలు విడదీసి ఇవ్వాలి. ఎవ్వరో ఒక్క పార్టీవాళ్ళనో, ఒక్క మతంవాళ్ళనో, ఏ బలవంతుడో మిగిలినవాళ్ళని గదిమెయ్యకుండా...” అంటూ సత్యానందం భూమి పంచడానికి వోపద్ధతి సూచించేడు. “మన చెయ్యి లేకపోతే అన్నీ వాటంతటవే సర్దుకుంటాయి. జనం అంత బుద్ధిహీనులుకాదు. వాళ్ళకి తమ క్షేమం తెలియదా?” అన్నాడు. రామకృష్ణ, తన ఆలోచనలను సమర్ధించుకుంటూ. “అదేం మాటలెండి. జనం తమ బాగును తామే చూసుకోగలిగితే ఈ దురవస్థ ఎందుకు?” అంది సరస్వతి. సంభాషణ ధోరిణి వింటూన్న భద్ర మనస్సులోని ఆవేదనను నిలుపుకోలేకపోయింది. “”మీకేమన్నా మతిపోయిందేమిటి? నిరాధారంగా వున్న స్థితిలో వో నాలుగైదెకరాలు ఇచ్చేడాయన. ఆయన సంపాదించిన పద్ధతి బాగులేదని వంకలెంచుతున్నారుకదా. ఆయన ఎవరి భూమన్నా లాక్కున్నాడా? దిక్కూ దివాణంలేని బంజరేకదా తీసుకున్నది. బంజర్లు ఆక్రమించుకోమన్నది మీ ఉద్యమంకాదా?” అంటూ భద్ర ఆ భూమిని అట్టే ఉంచుకొనేందుకై నైతిక వాదాల్ని సమకూర్చడానికి ఆయాసపడుతూంది. ఆ మాట విని సత్యానందం ఫక్కున నవ్వేడు. “అయితే ఆ భూమి వదులుకోకుండా అట్టే ఉంచుకోడం న్యాయమేనంటావు.” “ఎప్పుడూ తమరూ తమ సుఖాలూ....తమ కుంటుంబాల సంక్షేమం....ప్రపంచం ఏమైపోయినా సరే-చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష. ఈ కుళ్ళు వ్యవస్థ, కుష్టు సమాజం....ఇందులో మనుష్యుల మనస్సు...అంత సులభంగా మారదు....”-అంటూ రామకృష్ణ తన తీర్పు వినిపించేడు. జానకి తాపీగా అడిగింది. “మరి దీనికి మందేమిటంటావు?” “దోపిడిని ప్రోత్సహించే ఈ వ్యవస్థను సమూలంగా పెకలించే....నిర్మూలించే సాంఘిక చైతన్యం....సాంస్కృతిక చైతన్యం ఆచరణలోకి రావాలి”-అంది సరస్వతి. “అంతేనా?”-అని జానకి. రామకృష్ణ తలతిప్పేడు. “ప్రపంచంలోని మట్టిని, గాలిని సాంతం పంచుకొంటూ సామాన్యజనం అన్ని హక్కుల్నీ అనుభవించే అవకాశం ఇచ్చేది ఈ మహా చైతన్యం.”-అని సరస్వతి తన మాటకు వ్యాఖ్యానం జతపరిచినది. “ఆ చైతన్యమే సామాన్యజనం....సామూహికంగా....అగ్ని పర్వతంలాగా....విరజిమ్మే లావా....అదే విప్లవం....” “అంటే సామాజిక చైతన్యం ... ఒక పద్ధతిలో సాగే నిర్మాణయుతమైన చైతన్యం అవసరమంటావు.” అని జానకి నిగ్గదీసింది. “కాదనలేదే....” అన్నాడు రామకృష్ణ. “మరి ఇంతకు పూర్వం నువ్వు రెండు సమస్యలూ పరిష్కారం కావడానికి ఒక మార్గం చూపేవే. ఈ రెండింటికీ పొత్తు ఏవిధంగా చూపుతావు?” అంది జానకి. “ఈ కుర్రనాగామ్మలిద్దరూ తెలీని ప్రజ్ఞలకిపోయి, ఆ కాస్త భూమీ వదిలేస్తామంటూంటే నువ్వు నక్సలైట్ పద్ధతి మంచిదా చెడ్డదా అని పట్టుకొన్నావెం?” అని భద్ర జానకిని కోప్పడింది. జానకి చాల గంభీరంగా తిరిగి చూసింది. “నా ఆస్తి వాడిపేర వ్రాయడానికి నిరాకరించేను. కనకనే వాడి తాతగారు ఆ భూమి వాడిపేర పెట్టేరు. అది వాడి ఆస్తి. దానిని గురించి సలహా ఇచ్చే అధికారం కూడా నాకు లేదు.” “మా కుర్రవాళ్ళకి వదిలేస్తే ప్రపంచం ఎప్పుడో బాగుపడేది” అన్నాడు రామకృష్ణ. “వాళ్ళకేం తెలుసునే-” అంది భద్ర. జానకి ధీమాగా అంది. “ఏం ఫర్వాలేదు. ముసలాయనకి కుట్ర బుద్ధి వుందనుకోడం ఎందుకు? మంచికే చేసేరనుకొందాం. ప్రస్తుతం వున్న పరిస్థితిలో రవీంద్ర ఆ భూమిని ఇళ్ళ స్థలాలకు ఇచ్చేయ్యాలనుకోడమే బాగున్నట్లు తోస్తూంది సుమా!”-అంది. “అయిదెకరాలూనా?” అంది, భద్ర. అంతా వదిలెయ్యకుండా కొంతేనా మిగుల్చుకోమంటున్నట్లు. జానకి ఔనంది. “అది వాడి ఆస్తేం కాదు ఆని తండ్రి తాతలదీ కాదు. ఊరివాళ్ళ భూమి. ఏకారణానో వాడిచేతికి వచ్చింది. ఆస్తి మమకారం ఏర్పడి నేను వదలనంటే నేను చెయ్యగలదేం లేదు. కాని, అల్లా జరగడంలేదు. వాడు న్యాయమైనపనే చేస్తానంటున్నాడు. దానికి అడ్డుపడడం, మినహాయింపులు పెట్టడం ఎందుకేమిటి? వద్దు. మంచిపనికి మనం అడ్డంకావద్దు. ఆపని ఎల్లాచేస్తే మంచిదో, మనకు తెలిసింది చెప్దాం. ఎక్కడైనా పొరపాటు వస్తే సరిదిద్దుదాం. అంతేగాని, ఊరిభూమిని మిగుల్చుకోమని మనం సలహా ఏమిటి? నువ్వేమంటావు. బావా!” పదకొండో ప్రకరణం ఒక రాత్రివేళ వీధి తలుపు దబదబ బాదిన చప్పుడు వినిపించి సుందరరావు ఇంట్లో యావన్మందీ ఒక్కమారుగా లేచి కూర్చున్నారు. అందరికీ ఒక్కటే ఆలోచన కలిగింది. పోలీసులు ఇల్లు చుట్టుముట్టి తలుపు కొడుతున్నారని అందరికీ ఒక్కమారే అనిపించింది. హైస్కూలులో రామకృష్ణ తుఫాను రోజున హెడ్మాస్టరును కొట్టబోవడం, తిట్టడం, రికార్డులు నేలను విసిరికోట్టడం, దేశనాయకుల పటాలు పగలగొట్టడమూ వార్త జనశక్తి పత్రికలో యువజనులు గ్రామంలోని పెద్దలు చేస్తున్న అన్యాయాలమీద జరిపిన పెద్ద తిరుగుబాటు చర్యలా వర్ణించబడింది. దానిని ఆధారం చేసుకొని పోలీసులు గ్రామంలో అరెస్టులు చేస్తారనే వదంతి ఒకటి వ్యాపించివుంది. రిపోర్టులేమన్నా వెళ్ళాయేమో. యేమని వెళ్ళేయో ఎవ్వరూ ఎరుగరు. మునసబు అనేక రకాలుగా మాట్లాడి మరింత గందరగోళం కలిగిస్తున్నాడు. యేవో కొన్ని అరెస్టులు జరుగుతాయనేది కింవదంతి. ప్రభుత్వ దౌర్జన్య విధానాన్ని ఖండిస్తూ సభలు పెట్టడంచేత నక్సలైట్లకు దమ్ము చిక్కిందనేది ఒకవాదం. దానికన్న హైస్కూలు తాళాలు పగలగొట్టి హరిజనులను పంపిన సుందరరావు మీదనే తప్పు మోపేవాదమూ వుంది. ఆ మానసికాందోళనలో అందరికీ అది పోలీసులదాడి సూచనగానే వినిపించింది. లక్షిందేవమ్మ ఆదరాబాదరాగా మగడు పడుకున్న చోటికి పరుగెత్తింది. అప్పటికే ఆయన లేచివున్నాడు. చొక్కా వేసుకొంటున్నాడు. వెనకనుంచి వీధి తలుపులు బాదుతున్న చప్పుడు వినిపిస్తూనే ఉంది. లక్షిందేవమ్మ ఏడుపు మొహం పెట్టింది. “వచ్చేసేరు.” సుందరరావు సాధ్యమైనంత గంభీరంగా ముఖం పెట్టేడు. “అరెస్టుల వార్త వెంటనే ఊళ్ళో తెలిసేలాగ చెయ్యండి” ఒక్క క్షణం ఆగి మళ్ళీ అన్నాడు; “సత్యనందానికి చెప్పి వెంటనే విశాలాంధ్రకి  టెలిగ్రాం పంపించమనండి.” అప్పుడే అక్కడకు వచ్చిన పెద్దకూతురు విశాలాక్షి ఆశ్చర్యం కనబరచింది. “విశాలాంధ్రకా?” తన ఆదేశం పునరావృత్తం చేయవలసి వచ్చినందుకు సుందరరావు చిరచిరలాడేడు. “ఔను”, ఒక్కక్షణం ఆగి, తన అభిప్రాయం స్పష్టంగా చెప్తే తప్ప వాళ్ళకి అర్ధం అయ్యేలా లేదనుకొన్నాడు. “మిగిలిన పత్రికల వాళ్ళకి నక్సలైట్ అనే పేరుంటే వారిని ఏంచేసినా పట్టడం లేదు. అరెస్టు చేసినా, చంపేసినా పేర్లు కూడా తెలియనివ్వడం లేదు. మనది వారపత్రిక అయిపోయింది. కనీసం అన్యాయం జరిగి పోతున్నదని వ్రాస్తూంది. విశాలాంధ్ర....” వప్పగింతాల మాదిరిగా వినిపిస్తున్న ఆ మాటలు విని లక్షిందేవమ్మ బావురుమంది. వీధిలో ఇంకా తలుపు కొడుతూనే వున్నారు. సుందరరావుకి చిరాకు పుట్టింది. “తరవాత ఏడవడానికి బోలెడంత వ్యవధి వుంటుంది. లే. విను, చెప్పేది.” “సుందరావు బాబూ” ఆ కంఠస్వరం జోగన్నది. సుందరరావు గుర్తుపట్టేడు. “జోగడు కాదూ తలుపుకోట్టేది?” లక్షిందేవమ్మ ఎడుపుమాని ఆలకించింది. సుందరరావు ఆ స్వరం జోగన్నదని స్థిరపరుచుకొన్నాడు. అయినా ఆలోచనలు పోలీసుల్నీ, అరెస్టుల్నీ  వదిలిరావడంలేదు. కనక జోగయ్య మరో పనిమీద వచ్చి ఉంటాడనే ఆలోచనే పోలేదు. “ఈ గాడిద కొడుకు తీసుకొచ్చినట్లుంది”-అంటూ చాల దిగాలు పడ్డాడు. “తలుపు తీయండి. పగలకొట్టి పోగలరు. పారిపోతున్నామంటూ,ఇక్కడే....” పన్నెండో ప్రకరణం తనదంతా వట్టి కంగారేనని తెలిసేక సుందరరావు మనస్సు కుదుటపడడానికి బదులు కోపోద్రిక్తం అయింది. “ఏమిటింత రాత్రివేళ వచ్చేవు? వో రాత్రివేళ తలుపులు దబదబ లాడించి, ఊరందరినీ ఆదరకొట్టే బదులు, తెల్లవారేక రాకూడదూ? ఏమంత రాచకార్యం మునిగిపోయింది?” ఆ విసురుచూసి జోగయ్య నవ్వేడు. “ఏం పోలీసులనుకొన్నారా? బందిపోటు లొచ్చేరనుకొన్నారా?” ఏమనుకున్నాడో సుందరరావు చెప్పలేదు. చుట్టుప్రక్కల ఇళ్ళవాళ్ళకి కూడా తమకు కలిగిన అనుమానాలే వచ్చేయి. కిటికీల్లోంచి తొంగి చూస్తున్నారు. పోలీసులెవరూ కనబడ్డంలేదు. ఉన్నదల్లా జోగన్న. వాళ్ళు మళ్ళీ కిటికీలు మూసేసుకున్నారు. ఒకరిద్దరుమాత్రం తలుపు తెరుచుకు వీధిలోకి వచ్చి వాకబు ప్రారంభించేరు. “ఏమిటయ్యా హడావిడి!” సుందరరావు మనస్సు మండిపోతూంది. ఆ కోపాన్ని హాస్యం మాటున దాచిపుచ్చుతూ అలవోకగా తేల్చివేసేడు; “మనవాడు బుద్ధికి బృహస్పతే. కాని, బుద్ధి నిలకడకి మర్కట కిశోరం నయం. ఏదో గొప్ప ఆలోచన తోచివుంటుంది. దాన్ని తెల్లవారే వరకూ మగ్గేస్తే పులిసిపోదా? ఏమోయ్! అంతేనా? చూడు. ఎంతమందికి నిద్ర పాడుచేసేవో....” జోగయ్య నవ్వుతూనే వున్నాడు. సుందరరావుకి చిరాకు కలిగినా పైకి తానూ నవ్వేడు. “ఇరవై, పాతికేళ్ళనుంచి చూస్తున్నా, ఒక్కలాగే వున్నావోయ్.” “బాగా చెప్పేవు” అని శ్రోతలు కూడా అంగీకరించి, నిద్ర తరవాయి అందుకోవడానికి వెళ్ళిపోయేరు. నలుగురూ వెళ్ళిపోయేక సుందరరావు జోగాన్నను సావట్లోకి తీసుకువచ్చి కూర్చోబెట్టేడు. తానూ కూర్చున్నాడు. “చెప్పు” “ఊళ్ళో తాము పెడుతున్న సభలలో మనం కలిసిరానందుకు రివిజనిస్టులు మనమీద ప్రతీకారచర్యలు ప్రారంభించారు. మిమ్మల్ని ఏం చెయ్యలేరు. ‘ఊరందరికీ నేను లోకువ. నాకు నంబికొండయ్య లోకువ’ అన్నట్లు నేను దొరికాను. నామీద పడ్డారు.” సభలు పెట్టడంలో తాము కలియకపోవడం, రివిజనిస్టులు కసితీర్చుకోడం మాట వచ్చేసరికి సుందరరావు సావధానంగా సర్దుకు కూర్చున్నాడు. ఒక్కక్షణం క్రితం జోగయ్య కలిగించిన ఆందోళన, కోపం మరిచిపోయేడు. “అసలేం జరిగిందో చెప్పు.” “కుమారస్వామిగారి పొలం నేను చేస్తున్నాను కదా. ఇస్తున్నానో, మానుతున్నానో ఆ పెద్ద బ్రాహ్మడు ఎప్పుడూ కూడ, ఏమిటింతే ఇచ్చేవేం అని అడగలేదు. ఆయనకి మన పార్టీ మీద అభిమానమే కాదు. సాటి బ్రాహ్మణాడిననీ, పిల్లలవాడిననీ నామీద ప్రత్యేకించి అభిమానం....” “వట్టి భ్రమలకేం గాని, అసలు ఏం జరిగింది?”-అని సుందరరావు అతని వాక్ప్రవాహాన్ని అడ్డగించేడు. “భ్రమ కాదండి. నిజం. ఆయన అన్న మాటలివి. వెనకోమాటు మీకు చెప్పేనుకూడా. ఆ రోజున నాకోసం స్వయంగా కబురు పంపి చెప్పిన మాటలే. ‘ఏమోయ్! జోగన్నా. నేనూ పెద్దవాడినైపోయేను. అదీగాక, అందరూ అన్ని పనులకీ తగరు. నీలాగ నేను దేశం కోసం పాటుపడాలంటే సాధ్యం కాదు. నాకు చేతా కాదు. నువ్వు ఆ భూమి చేసుకో. బ్రతుకు. పిల్లలవాడివి. సాటి కులంవాడివి. నేనే దేశానికి సేవ చేస్తున్నట్లు సంతోషిస్తాను”-అని పదిమాట్లు వప్పచెప్పేడు. “అసలు విషయం చెప్పవోయ్ బాబూ!” సుందరరావుకు అర్థరాత్రి వేళ హడావిడి చేసి తన కులం, దేశసేవ గురించి జోగన్న చెప్పుకోడం చిరాకుగా వుంది. పైగా ఆ భూమిని జోగన్న చేయడాన్ని తామంతా బలపరిచారు. కులం చూసీ, అతని దేశసేవ చూసీ కాదు. అతని రౌడీతనానికి తమ పార్టీ మద్దతునిచ్చి, అది కాస్తా రివిజనిస్టుల పాలబడకుండా నిలిపేరు. ఇప్పుడదంతా తన ప్రజ్ఞే అంటే? “ఆ భూమి నాకు లేకుండా చేస్తే తప్ప పార్టీని దెబ్బతియ్యలేమనుకొన్నారు కాబోలు. అది కాస్తా వ్రాయించుకొన్నారట.” “ఎవరు, ఆ వ్రాయించుకొన్నది?” “జానకి కొడుకు పేర వ్రాయించేరట.” “అదేమిటి?” “ఏమిటేమిటి? కోడలేగా జానకి. ఆ కుర్రాడు మనుమడే కాదండి?” “ఔను సుమీ ఆ బంధుత్వం ఒకటి వుంది కాదూ. ఔను. అతనికి వ్రాసి ఇచ్చేడన్నమాట, ముసిలాయన.” సుందరరావు ఆ సమాచారాన్ని మనస్సుకు పట్టించుకొనేసరికి ఒక్క క్షణం ఆలస్యం అయింది. ఈలోపున జోగన్న తన కధ సాగించేడు. “వారం పదిరోజుల క్రితం సరిగ్గా తుపానుకి ముందు సత్యానందం స్వయంగా పెళ్లాన్ని తోడిచ్చి పంపించి చేయించిన పని ఇది....” సత్యానందం ఈ పని చెయించేడంటే విప్లవానికి అది ద్రోహచర్యగానే భావించడం సుందరరావు స్వభావం. జోగయ్య తమ పార్టీవాడు. అందుచేత మరీ ముఖ్యం. అతనికి వత్తాసునివ్వక తప్పదు. “ఏం ఫర్వాలేదు. నీమీద కసి తీర్చుకోడం అంటే పార్టీమీద కసి తీర్చుకోడం అన్నమాట. అది అంత సులభం కాదు. పార్టీ అంతా నీ వెనకనుంటుంది. ఫర్వాలేదు. కాని, అసలు ఏమయిందో చెప్పు....” అన్నాడు సుందరరావు. ఆమాత్రం దిలాసా ఇస్తే జోగన్నకు సంతృప్తి కలగలేదు. తానా మాట చెప్పగానే ఇంత ఎత్తు ఎగిరిపడి, తారాజువ్వలా లేస్తాడని అతని వుద్దేశం. అది జరగలేదు. కనక జరగవలసిందేమిటో తానే చెప్పేడు. “ఇదేం లాభంలేదు. మనం కూడా చప్పబడిపోతున్నాం. పిల్లి గుడ్డిదైతే ఎలక ‘ఏదో’ చూపిందిట. వీళ్ళని కాలరాసెయ్యక పోతే లాభం లేదు. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అని మాటల్లో చెప్తే చాలదు. చేతలు. చేతల్లో చూపాలి. మనలో ఆ జివ తగ్గిపోతూందనే నక్సలైట్లు విడిపోయేరు. ఇంకేనా మనకి తెలివి కలగకపోతే....” తన పార్టీ స్తంభాలు కదిలిపోతున్నట్లే సుందరరావు వులికిపడ్డాడు. “భూమి పట్టా ఆయనపేర వుంది. కాని, అందులో నువ్వు ఆరేడేళ్ళ నుంచి....” “పదేళ్ళయింది దానిలో చేరి....” “ఔనా మరి. ఒక్క కాగితమన్నా వుందా, కౌలు పేరునో, అద్దె పేరునో....ఏదో మాటగానన్నా....”-అని సుందరరావు ఆ భూమిని స్వాధీనంలో అట్టే వుంచుకోడానికి చట్టసంబంధమైన అవకాశాలేమున్నాయో తెలుసుకొనడానికి ప్రయత్నించేడు. “ఆ ముసలాడు దివాన్గిరీ వూరికే వెలిగించేడా? ఒక్క కాగితం ముక్క పుట్టనివ్వలేదు. ఎప్పుడెళ్ళినా కబుర్లతోనే కడుపునింపి పంపేస్తూ వచ్చేడు.” అంతేకాదు. ఆ పొలం చుట్టూ ముళ్ళతీగ వేయించి, మకాంపాక, నూయి, ఇతర మెరుగులు చేయించినది కుమారస్వామే. అందులో వేసిన మొక్కామొటికా చూడడానికి పాలేరుని పెట్టింది ఆయనే. మకాంపాకలో కాపురం వుంటూ, ఆ భూమి అంతా తనదిలాగ తిరగడం తప్ప జోగన్నకి బాధ్యత లేదు. ఆ పనికని నెలకేదో ఇంత అని కుమారస్వామి మనియార్డరు చేస్తున్నాడు. ఈ వివరాలేవీ సుందరరావు ఎరగడు. ఇప్పుడవన్నీ విని విసుక్కున్నాడు. “మరి ఏం చేస్తావు?” “మీరే చెప్పండి. మన పార్టీ పేరు ఇంతవరకూ వుపయోగించుకొని, ఇప్పుడు రివిజనిస్టుల చేతికి ఆ భూమి వప్పచెప్తూంటే మనం ఏమాత్రం ఒప్పుకోకూడదు”-అని జోగన్న నిర్దేశించేడు. కాని, దానిని జోగన్న చేతిలో నిలవబెట్టడం ఎల్లాగో సుందరరావుకి అర్థం కాలేదు. ఆలోచించేడు. ఆయన ఆలోచనలను త్వరితపరుస్తూ జోగన్న చెప్పుకుపోతున్నాడు. “నేను మార్క్సిస్టును. పార్టీ కార్యకర్తను. అందుచేతనే నాకు నిలవనీడలేకుండా చేస్తున్నారు. అల్లాచేస్తే లొంగిపోయి వాళ్ళ పార్టీలో చేరతానని వాళ్ళ వూహ. ఈ వార్త నాకు చెప్పిన కరణంగారు వెళ్ళి సత్యానందాన్ని కలుసుకు మాట్లాడమని అప్పుడే ఉచితసలహా ఇచ్చేరు కూడా....” “అలాంటి పని చేసేవు గనక. కొంప తవ్వుకుపోతుంది”-అన్నాడు సుందరరావు. “అందుకేగా ముందు మీవద్దకు వచ్చింది.” “చట్టరీత్యా ఆ భూమిని నిలుపుకొనేందుకు నీవద్ద ఆధారాలేవీ లేవు.” “నేను మార్క్సిస్టు పార్టీ వాడిని. మంచికీ చెడ్డకీ పార్టీని అంటిపెట్టుకొని వున్నాను. ఈ స్థితిలో నన్ను ఆదుకోవలసిన బాధ్యత పార్టీ మీద వుంది.” అతని డిమాండు చూసి సుందరరావు చిరచిరలాడేడు. “పార్టీ మన లాభాలకు కాదయ్యా. మనం పార్టీకోసం గాని....” అన్నాడు. ఆ మాటకు జోగయ్య ఛర్రుమన్నాడు. “అన్నింటికీ నన్ను వాడుకున్నారు, తిడితే భేష్ అన్నారు. రాయి విసురుతే భళా అన్నారు. తీరా మీ అవసరం వచ్చేసరికి నాలిక మడత వేస్తున్నారు.” “తొందరపడకు.” అని సుందరరావు అతనిని శాంతపరచడానికి పూనుకొన్నాడు. “ఇప్పుడున్న మార్గం ఒక్కటే.” జోగన్న రుసరుసలాడుతూ ‘ఏమిటది’-అన్నాడు. “జాగ్రత్తగా విను. ఆలోచించు....ప్రస్తుతం వున్న స్థితిలో నిన్ను అక్కడినుంచి పొమ్మంటే నువ్వు చెయ్యగలది లేదు.” “ఏం లేదూ? నన్ను పొమ్మనడానికి ఎన్ని గుండెలుండాలి? ఎవరంటారో అనమనండి చూస్తా.” “ఏం చేస్తావోయ్!” “ఏం చేస్తానా? కత్తెడైతే పొడిచిపారేస్తా.” “అలాంటి తెలివి తక్కువ మాటలు చెప్పకు. చేయకు. ఉరి తీసి పారేస్తారు. పిల్లలవాడివి.” “ఇంత పిరికితనం! మాటలు చూస్తే మాత్రం కోటలు దాటిస్తారు. పెద్ద మార్క్సిస్టులమని కబుర్లు మాత్రం....” “ఈపాటికి కట్టిపెట్టు. చావదలుచుకుంటే వెళ్లు. కాదు పార్టీ సాయం కావాలంటే చెప్పినట్లు విను....” జోగన్న తగ్గేడు. “ఏం చెయ్యమంటారు?” “ఇది నువ్వొక్కడివీ తట్టుకోలేవు.” “అందుకేగా వచ్చింది.” సుందరరావు ఒక్క నిముషం ఆగేడు. “మన పార్టీకి చెందిన ఇళ్లు లేనివాళ్లందర్నీ ఆ పొలంలోకి వెళ్ళి పాకలు వేసుకోమందాం.” “మరి నాకు లాభం ఏమిటి?” “నువ్వు ఆ యిల్లు వదలనక్కర్లేదు. లేపితే అందర్నీ లేపాలి. లేపేరా పార్టీ అంతా ఒక్కటిగా నిలబడుతుంది. మీ నివాసస్థలాల నుంచి మిమ్మల్ని లేపాలంటే....” “కాని, హరిజనుల మధ్యన బ్రాహ్మణాణ్ణి....” సుందరరావు అసహ్యం కనబరిచేడు. “కమ్యూనిస్టు  పార్టీలో కులభేదాలు చెల్లవు. నీకిష్టం లేకపోతే, అక్కడి నుంచి ఇవతలికి వచ్చెయ్యి. మరో దారి లేదు. ఆ భూమిని పార్టీ వదలదు.” “నేనక్కణ్నుంచి కదలను.” “కదలకు. నేను కదలమనడం లేదు. నిన్ను కదపకుండా తోడు నిలబడాలనే నా వూహ. వెళ్లు. పైకి పోనివ్వకు. ఎల్లుండి....ఎల్లుండేమిటి....రేపే....తెల్లవారేసరికి పేటలవాళ్ళచేత....” “అదేం కుదరదు. అది నా భూమి. ఎవడన్నా పాక, గీక వేశాడంటే అగ్గిపుల్ల గీసేస్తా. జాగ్రత్త.” సుందరరావు నవ్వేడు. “అట్టే, గప్పాలు చెప్పకు. కాళ్లు, చేతులు కట్టి ఆ మంటల్లో పారెయ్యగలరు.” “ఏ లం....జ....కొడుకు వస్తాడో, చూస్తా. అల్లాంటిపని చేసేవంటే ముందు నీ కొంపకి చిచ్చెట్టేస్తా” అని జోగన్న లేచేడు. “ఏడిశావులే. నిష్కారణంగా ప్రాణం మీదికి తెచ్చుకోకు” మన్న మాటలు సుందరరావు నోట్లో వుండగానే జోగన్న వీధిలోకి జువ్వలా దూసుకుపోయేడు.   పదమూడో ప్రకరణం సత్యానందం నూతి పెరట్లో ముఖం కడుక్కుంటూంటే సరస్వతి వచ్చి కబురందించింది. “మీకోసం ఎవరో వచ్చేరు, మామయ్యగారూ!” “కూర్చోమను అమ్మా! వస్తున్నా.” “సావిట్లో కూర్చోబెట్టేను.” అతడు వేవేగ ముఖం కడుక్కుని అంత ప్రొద్దుటే వచ్చిందెవరా అనుకొంటూ హాలులో అడుగుపెట్టేసరికి జోగన్న బల్లమీద కూర్చుని వున్నాడు. సత్యానందాన్ని చూడగానే వులికిపడ్డట్లు లేచి, చేతులు జోడించి దండం పెడుతూ జోగన్న ఎదురువచ్చేడు. “బుద్ధి గడ్డితింది. క్షమించండి-అని అడగడానిక్కూడా మొహం చెల్లడం లేదు. క్షమించేనంటే తప్ప, పిల్లలవాణ్ణి బతకలేను....” గడగడలాడుతూ పశ్చాత్తాప ఖిన్నమూర్తిలా జోగయ్య వచ్చి తన కాళ్ళమీద పడిపోతూంటే, సత్యానందం చట్టున వెనక్కితగ్గి, అతని భుజాలు పట్టుకొని నిలబెట్టేడు. “ఏమిటీ అన్యాయం? నాకేం అన్యాయం చేశావని నిన్ను క్షమించడం? బాగుంది. ఇది మరీ బాగుంది. మీ పిల్లలకేం వచ్చింది? అంతా బాగున్నారా?....” తన పిల్లలకేం కాలేదని జోగన్న చెప్పేడు. తుఫాను బాధితులు ఇళ్ళు వేసుకొనేందుకు ప్రభుత్వం యిస్తానన్న డబ్బుకోసం దరఖాస్తు పెట్టేడు. తాశిల్దారు వచ్చి సాయం కావలసిన వాళ్ళ పేర్లలో తనదీ చేర్చేడు. “మరింకనేం, ఫర్వాలేదు. ఈలోపున కావలసిన సాయం....” మళ్ళీ జోగన్న దండాలు మొదలుపెట్టేడు. “మీ మనస్సు అంత గొప్పది. తెలుసుకోలేకపోయేను. వెధవని. సుందరరావు ఇశారా యిస్తే, ఏదో గొప్పపని చేస్తున్నాననుకొని, రాయి విసిరి, మీ వీధిలైటు బద్దలు కొట్టేసేను. ఆయన చెప్పేడు. నేను విన్నా. వెధవని, కుంకని....” జోగయ్య ఛటఫటా చెంపలు వాయించుకుంటూంటే, సత్యానందం చటుక్కున అతని చేయి పట్టుకొన్నాడు. “వోస్. అదా! దానికింత బాధ పడాలా? ఏమీ లేదు. అప్పుడే మరిచిపోయా. పైగా నువ్వు విసిరినట్లు మేము చూడలేదు. అనుకోలేదు....” “మీ మనస్సు గొప్పతనం అది. చవటపీనుగుని కానలేకపోయేను.” “ఇంక మళ్ళీ అవేం చెప్పకు. అల్లా చెయ్యడం తప్పని తోచింది. చాలు. మళ్ళీ అల్లాంటివి చెయ్యకపోవడమే....” మాట మధ్యలోనే జోగన్న అందుకొన్నాడు. “ఇంకానా?....ఇంక అల్లాంటి వెధవపని చేస్తానా? ఇంక ఆ అనుమానం తగిలితే చెప్పుచ్చుకు కొట్టండి ఇంక అల్లాంటి పనులు చెయ్యమనే వాళ్లతో ఏమీ సంబంధం పెట్టుకోను. మీకు వ్రాసి ఇస్తున్నా....” జోగయ్య జేబులోంచి ఒక కాగితం మడతతీసి, విప్పి సత్యానందం చేతికిచ్చేడు. “చిత్తగించండి. దీని నకలు సుందరరావు ముఖాన కొట్టివచ్చేను. నేను మీ పార్టీలో చేరిపోడానికి వచ్చేను....” సత్యానందం ఉలికిపడ్డాడు. “ఇప్పుడు ఆ ప్రసక్తి ఏం వచ్చింది? సావకాశంగా ఆలోచించుకో. తొందరవద్దు.” గ్రామంలో రౌడీగా, చంపడానిక్కూడా వెనుతియ్యనివాడుగా ప్రసిద్ధీ, స్వానుభవమూ వున్నా, 52 ఎన్నికలలో తమతో పనిచేసినాక జోగయ్యను పార్టీలో చేర్చుకొన్నారు. కూడదన్నవాళ్లు, ఎప్పుడో తప్పు చేసినందుకుగాను మరి బాగుపడే అవకాశం లేకుండా చెయ్యరాదన్న సమాధానంతో గమ్మునైపోయారు. అతనిని పార్టీలో చేర్చుకోరాదన్న వారిలో సత్యానందం ఒకడు. పార్టీ విడిపోయినప్పుడు అతను మార్క్సిస్టుల వెంటబోవడం కమ్యూనిస్టు పార్టీ అదృష్టంగా భావించినవారిలో అతడొకడు. ఇప్పుడు తిరిగివస్తానంటూవుంటే భయమే అనిపించింది. “మనవి రెండూ ఏకలక్ష్యం గల పార్టీలు. ఇప్పుడు యేవో విభేదాలు....” “చెప్పేకాదా! బుద్ధి గడ్డి తిని మార్క్సిస్టులతో చేరేనని....వాళ్లవలన దేశం ఉద్ధరించబడుతుందని భ్రమపడ్డా. వాళ్ళ విప్లవపదజాలం చూసి మోసపోయా.” జోగయ్యను బాగా ఎరిగిన సత్యానందం ఆ ఆత్మ విమర్శనకు ఉబ్బితబ్బిబ్బు కాలేదు. పైగా కొత్త చిక్కులు ఎదురు కాగలవని భయపడ్డాడు. ఇలాంటి ఫిరాయింపులకు బ్రహ్మానంద పడేవాళ్ళ చేతిలో కాగితం పడితే, కళ్ళకద్దుకొని విశాలాంధ్రకు పంపేస్తారు. వాళ్లు గుడ్డిగా వేసేస్తారు. ఇంక ఇక్కడుంటాయి తమ పాట్లు. వూళ్లోవాళ్ళే కాదు. జోగయ్యే తమ మొహాన ఉమ్మేసినా వేస్తాడు. జోగయ్యకు తన స్థానం, దానికి గల బలం బాగా తెలుసు. తన చేతిలో కాగితం చదివి వినిపించసాగేడు. “కమ్యూనిస్టు పార్టీ ఉమ్మడి పార్టీగా కలిసి వున్నప్పుడే-ఇప్పటికి దరిదాపుగా పదిహేనేళ్ళనుంచి నేను పార్టీ సానుభూతిపరుడుగా, పార్టీ సభ్యుడుగా వుంటున్నా. అంతకు పూర్వం కూడ ప్రజాజీవన సాధనాలన్నింటినీ బూర్జువా, భూస్వామి వర్గాలూ, వారి పడితొత్తులుగా బ్రతుకుతున్న కాంగ్రెసు ప్రభుత్వమూ తమచేత బట్టుకొని, దేశంలో అనేక కొట్లమందిని బహిరంగంగా తమ ఇనప పిడికిలితో పట్టివుంచినట్లే నన్నూ నొక్కి వుంచినా, నా మనస్సు, నా ఆత్మ విప్లవపార్టీ అయిన కమ్యూనిస్టుపార్టీతోనే వుంది. 1952 ఎన్నికల నుంచి నా వోటు కంకి, కొడవలికే పడింది....” సత్యానందం ఏదో అనాలి గనక, “ఔనౌను. నాకూ గుర్తుంది” అన్నాడు. ఆ ఎన్నికలలో జోగన్న ఎన్నికల క్యాంపులో వలంటీరుగా వున్నాడు. ఆ మాట అన్నాక తన పొరపాటు గుర్తు వచ్చింది. ఎలా సర్దుకోవాలో తోచక కంగారు పడ్డాడు. కంగారు కప్పిపుచ్చుకొనేందుకు పొడిదగ్గు నటించేడు. జోగయ్య తన పత్రంలో మాటలకి ముఖతః వివరణనిచ్చేడు. “నాబోటి సందిగ్ధాత్మకులకి మీరే దారి చూపేరు. ఆ గడ్డు నిర్బంధపు రోజుల్లో కమ్యూనిస్టు పేరుచెప్తే పట్టుకుపోయి కాల్చివేస్తున్న రోజుల్లో మీరు బాహాటంగా ప్రకటన చేసి “కమ్యూనిస్టు పార్టీతో చేరుతున్నాను. ఏం చేస్తారో చెయ్యండి” అన్నారు. ఆనాటికి మీకు కమ్యూనిస్టులయెడ విశ్వాసం లేదు. విశ్వంగారిని అన్యాయంగా కాల్చివేసినందుకు అసమ్మతిగా మీరు ఆ ప్రకటన చేశారు. చేరేరు....” తనకు 1950 నాటికి కమ్యూనిజం మీద విశ్వాసం ఏర్పడిందనీ వారి పంధా మాత్రమే నచ్చలేదనీ చెప్పాలని వున్నా జోగయ్య మాటలకి తాను సమాధానం చెప్పుకోడం ఇష్టంలేక సత్యానందం తెరిచిన నోరు మూసేసుకొన్నాడు. జోగయ్య తన ధోరణి సాగించేడు. “దేశ భవిష్యత్తు కమ్యూనిస్టు పార్టీతోనే వుందని నమ్ముతున్నా, భయంతో మూల ఒదిగి కూర్చున్న మాబోటిగాళ్ళకు, మిమ్మల్నీ, మీ సాహసాన్నీ చూసేసరికి, కనువిప్పే కలిగింది. మీరు మాకు ‘మార్గదర్శీ మహర్షి....” తన మాటల ప్రభావం సత్యానందం మీద ఏ విధంగా వుంటూందో గమనించడానికి, ఒక్క నిముషం ఆగి, అతని ముఖంలోకి చూసేడు. జోగయ్యకు తాను మార్గదర్శినయ్యాననడం గర్వం కలిగించడానికి బదులు సత్యానందానికి అసహ్యమే కలిగించింది. కాని ఏమీ అనలేకపోయేడు. “మీబోటి అసలు, సిసలు అభిమానులంతా పార్టీలోకి వచ్చాక కూడా, అందులో వుండడానికి ఏ మాత్రం అర్హతా లేని మాబోటిగాళ్ళు దానిని వదలలేదు. దానికి గబ్బు పట్టించాం. మీబోటివాళ్ళందర్నీ బయటికి పోయేలా చేశాం. ఇంత చేసిన నన్ను “మార్గదర్శీ మహర్షిః” అంటున్నావంటే....” దానిని అవహేళనగా భావించే అవకాశం, అవసరం జోగన్నకు కనబడలేదు. “మీరింకేమంటారు? మాకు ఎంత భక్తి విశ్వాసాలు పార్టీ మీదున్నా మంగలి మంత్రిత్వం దొరికింది. గాడిదలకి నాయకత్వం ఇచ్చి గంగిరెద్దులా తలలు వూపేం.” ఆ సంభాషణ వెక్కసమనిపించి, సత్యానందం జోగన్న చేతిలోని కాగితం తీసుకుని చదవడంలో మునిగిపోయేడు. ఆఖరున మడిచి జేబులో పెడుతూ-“పార్టీశాఖ ముందుంచుతాను. నేనిది వుంచుకోవచ్చా?” అన్నాడు. “మీకివ్వడానికే తెచ్చేను. దయవుంచండి. నన్ను పరాయివాడుగా చూడవద్దు. మీతో కలుపుకోండి. అదీ నా ప్రార్థన.” సత్యానందం ఒక్క క్షణం ఆలోచించేడు. అసలు విషయం చెప్పకుండా అతనిని ఆహ్వానించేడు. “రాత్రి ఒక ముఖ్యమైన విషయం గురించి సమావేశం జరుపుతున్నాం. దానికి నువ్వూ....” “రావచ్చునా?” “సానుభూతిపరుల్నే కాదు. కాంగ్రెసువారిని సహా పిలుస్తున్నాం. మార్క్సిస్టుపార్టీ ముఖ్యుడివి, నీకు....” జోగన్న మొగం యింత పొడుగుచేసి బుస్సుమన్నాడు. “ఆ పార్టీవాడినని మీరనడం అవమానంగా భావిస్తా!” సత్యానందం అది సరికాదన్నాడు. “మీకు కనువిప్పు కలిగించిన అంశం ఏమిటో నాకు తెలియదు. అయినా పార్టీలతో మనకున్న అనుబంధాలు అంత సులభంగా తెంచుకోగలమా?” తెంచుకోగలమనడం అనిశ్చిత బుద్ధికి వుదాహరణ అవుతుందేమోననే భయంతో జోగన్న దిగులు మొహం పెట్టేడు. “అదీ నిజమే అనుకోండి. ఇదివరకు ఇల్లా ఎన్నిమార్లు అనుకోలేదు. కాని చెయ్యగలిగేనా? అయితే ఈమారు పరిస్థితి వేరు. నేను నిశ్చయం చేసేసుకున్నా....” “సరి, సరి. కాగితం చదివేను కాదూ. చూద్దాం. రాత్రి....” “తప్పకుండా వస్తా.” జోగన్న సెలవుదీసుకొని గుమ్మం దాకా వెళ్ళేడు. పొలం విషయం సత్యానందం తనకు తానై ఎత్తుతాడని తలుస్తే, అతడు మాట్లాడనేలేదు. ఇంక తానే ఎత్తాలి. చటుక్కున ఏదో జ్ఞాపకం వచ్చినట్టు అడిగేడు. “ఒక సంగతి తెలిసింది.” “ఏమిటది?” “నేను కాపురం వుండి చేసుకుంటున్న బాడవ పొలం....” “ఔను. కుమారస్వామిగారా పొలం మనమడికి వ్రాశారు. నిన్ననే సాయంకాలం టపాలో దస్తావేజు అందింది.” “ఆయన నాకిచ్చేసిన పొలం అది....” “నేనెప్పుడూ వినలేదే....” “పెద్దవాళ్ళు ఏం చేసినా చెల్లుతుంది”-అని జోగన్న తన వ్యథ వెలిబుచ్చేడు. “ఈవేళ సభ దానిని గురించే. ఆ కుర్రవాడు తనకా భూమి అక్కర్లేదంటున్నాడు. పల్లెలవాళ్లు ఇళ్ళ స్థలాలకి కోరడం, తాశీల్దారు శాంక్షన్ చేయడం....” “ఎప్పటి మాట అది. పదిహేనేళ్ళనాటి మాట....” “ఔను, నువ్వూ ఎరుగుదువు. పల్లెలవాళ్ల ఇళ్ళ స్థలాలకి ఇచ్చేస్తానంటున్నాడు ఆ కుర్రవాడు....” “ఆ,” అన్నాడు జోగన్న. “ఔను. ఒక పార్టీ అనకుండా పల్లెల్లో ఇళ్ళు లేని కుటుంబాలవారికి ఇచ్చెయ్యాలని అనిపించింది అతనికి. ఒక పద్ధతి ప్రకారం స్థలాలు కేటాయించడం, ఎందరికి కావలసి వుంటుందో....” “అది నాకిచ్చిన భూమి....” అన్నాడు జోగన్న నీరసంగా. “ఆ విధంగా కాగితం వుంటే తీసుకురాండి. పేచీ పూచీ లేకుండా ముందే సర్దేసేద్దాం....” జోగన్నకు ఏం తోచలేదు. “మీటింగెక్కడ? ఎప్పుడు?” “రాత్రి తొమ్మిదింటికి స్కూలు దగ్గరే. పల్లెలవాళ్లు ఇంకా అక్కడే వున్నారు కదా. వాళ్ళందర్నీ మరో చోటికి రమ్మని శ్రమ పెట్టటం ఎందుకని....” జోగన్న ఈమారు సెలవు తీసుకోడం మరిచిపోయేడు. పద్నాలుగో ప్రకరణం “ఇంత పొద్దుపోయి వస్తున్నారు, ఎక్కడనుంచీ....” “ఇసుక పూడిలో న్యూమోనియా కేసుంది కదూ, వెళ్ళేసరికి కలరా కేసొకటి తెచ్చేరు.”….అంటూ నడుస్తూనే రంగనాయకులు పరధ్యానంగా సమాధానం చెప్పేడు. అంతలో అడిగినదొక ఆడమనిషనీ, స్వరం ఎరిగినదేననీ అంతరాంతరాలలో అనిపించి చటుక్కున ఆగి వెనుతిరిగి చూసేడు. సుశీల. తనను ఇంత పొద్దుపోయి వస్తున్నానందేగాని, ఆమె కూడా అంతే కాదూ. “నువ్వు, ఇంతదాకా హాస్పిటలులోనే వున్నావా? ఏం కొత్తరోగులు వచ్చేరా?” తుపాను బాధితుల సహాయార్థం అన్ని పార్టీలవారూ కలిసి గ్రామంలో ఏర్పరచిన వైద్యశాలలో సుశీల రామకృష్ణ సహాయంతో పని చేస్తూంది, ఈ నాలుగు రోజులుగా. అది తన ప్రోత్సాహంతోనే ఏర్పడిందని తెలిసినా, కేవలం తమ పార్టీ పెత్తనం కింద లేదు. అధికార కమ్యూనిస్టుల స్థానిక నాయకుడు దాని ఏర్పాట్లు చూస్తున్నాడు. కనక తన తండ్రి అభ్యంతరం వుంది. ఇంకా తను ఆయనని తోసేసి బయటపడే మనస్థితిలో లేడు, తప్పదనిపిస్తున్నా. ఆయన బ్లడ్‌ప్రెషర్ ఆరోగ్యం దృష్ట్యా ఇంకా తొందరపడలేననుకొంటున్నాడు. కాని, రోజూ ఏదో వేళప్పుడు వెడుతున్నాడు. సాయం చేస్తున్నాడు. సలహాలిస్తున్నాడు. ఈ రాకపోకలలో సుశీలతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నాడు. ఇద్దరిమధ్యా వారంక్రితం వున్న దూరం తగ్గుతూంది. అదే అతని గొంతులో ప్రతిధ్వనించింది. అతని కంఠంలోని ఆదుర్దా తనను గురించా, తుపాను తర్వాత గ్రామాలలో వ్యాపించగలవనుకొంటున్న అంటురోగాల్ని గురించా అనుకొంది సుశీల. “స్కూలులో పేటలవాళ్ళకి ఇళ్ళస్థలాల కేటాయింపు గురించి నిశ్చయించడానికి నలుగురూ చేరేరు. మీరు వస్తారని చాలసేపు చూసేరు. రాలేదు. మీ పార్టీ వాళ్ళెవ్వరూ రాలేదు.” తన ప్రశ్నకది సమాధానం కాదు! పైగా మరో ఆరోపణ. “మా నాన్నగారు....” “లేదు.” “జాన్!” “వచ్చేడేమిటి? అక్కడే వున్నాడు. కాని, అంతవరకూ అక్కడున్న మీ పార్టీవాళ్లు సమయానికి వెళ్ళిపోయేరు.” రంగనాయకులు ఏదో చెప్పబోయి వూరుకున్నాడు. “అక్కడినుంచే వచ్చేవు కాబోలు, ఏం నిర్ణయించేరు?” “నువ్వే అక్కడికి వచ్చి వుంటే మా నిర్ణయాలు ఇంకా సమగ్రంగా వుండి వుండేవి. ఇప్పుడు అరకొరగా వదలవలసి వచ్చింది” అన్న మాటలు వినబడేవరకూ అతడు సుశీల వెనక మరికొందరున్న విషయమే గమనించలేదు. “మీరూ వున్నారా? ఇంక మనకి రాజకీయాలలో వేలు పెట్టాలనే ఆసక్తి లేదు. డాక్టరు వృత్తిలోనే మనం చెయ్యగలదేదో చెయ్యడం....” “అలాగని వూరుకోగలిగేవా? పేటలవాళ్ళని హైస్కూలులోకి తీసుకురావడం నీ ధర్మమే అని ఎందుకనుకొన్నావు?” అంది జానకి. రంగనాయకులు నిరుత్సాహంగా నిట్టూర్పు విడిచేడు. “మనుష్యుడు అలవాట్లకి దాసుడు. అదే అతని బలహీనత....” అన్నాడు రంగనాయకులు. “కాని, నీ విషయంలో ఆ బలహానత జనానికి ప్రయోజనకరం. లేకపోతే ఏమవుతుందో ఆలోచించు. నీ వృత్తిధర్మం తప్పకుండా నువ్వు చేస్తావు. కాని ఈవేళ మన రోగాలలో మూడు వంతులు దారిద్ర్య మూలకాలు. మన దేశ రాజకీయాలకీ, దేశ దారిద్ర్యానికీ వున్న సంబంధం ఎరిగిన వాడివి.” రంగనాయకులు చేయి విదిలించేడు. “ఎరుగుదును. ఎరుగుదును. కాని....వద్దులేండి. వదిలెయ్యండి. మనకవి జీర్ణం కాలేదు.” నాలుగైదు రోజులుగా అతని కుటుంబ వ్యవహారాలు పలు ముఖాల వింటూ వస్తున్న జానకి అతని నిస్పృహకి కారణం గ్రహించడం కష్టం కాలేదు. అతడి మార్క్సిస్టు పార్టీ పంధా తనకి తాను దిగ్బంధం చేసేసుకొంటూంది. ఆ దిగ్బంధంలో కాస్త ఆలోచించగల వాళ్ళకి ఊపిరి సలపడం లేదు. ఇదోరకమైన ఆత్మహత్య. “ఏమోనయ్యా! మీరంతా ఇలా అవుతున్నారు. దానితో గోరంత పనులు కొండంతయి కూర్చుంటాయి. సరే ఇప్పుడీ వీథిలో చర్చలేమిటి గాని, భోజనం చేసేవా?” అంటూ ఆమె సుశీల భుజం తట్టింది. “భోజనమా?” అని రంగనాయకులు జ్ఞాపకం చేసుకొనేందుకు ప్రయత్నించేడు. “లేదనుకుంటా. లేదు. కాఫీ పదిమాట్లు పడింది. ఇంక భోజనం ఏమిటి?” అన్నాడు. జానకి నవ్వింది. “గట్టివాడివే. భోజనం కూడా మరచిపోయే స్థితికి వచ్చేవన్న మాట. వ్యవహారం చాలా బాగుంది....సుశీలా! ముందు ఇంటికి తీసుకెళ్ళు. ఆఖరుకి ఇన్ని అటుకులేనా మజ్జిగలో వేసి ఇయ్యి....” అని ఏకటాకీన బండి తోలింది. సుశీల సంకోచిస్తూనే ఆహ్వానించింది. వారంనాడు తాను విడాకులు తీసుకోమని అతనిని ప్రోత్సహించిన విషయాన్నీ, దానికి వెనకనున్న వైమనస్యాన్నీ ఆమె మరిచిపోలేకుండా వుంది. ఈ రెండు మూడు రోజుల్లో జానకి ఆ విడాకుల ఆలోచన యెంత పొరపాటో చెప్పి వొప్పించినా, ఆ వొప్పుదలను కార్యరూపంలో పెట్టడం సాధ్యంకాలేదు. కాని, ఇప్పుడు జానకే చొరవ తీసుకోడంతో తప్పుకోలేక పోయింది. “రాండి, ఫలహారమన్నా చేద్దురుగాని. తరవాత మాట్లాడుకోవచ్చు. మీరు కూడా రాండి” అని పనిలో పనిగా జానకిని కూడా ఆహ్వానించింది. పదేళ్ళ వైమనస్యాలూ, మూడు నాలుగేళ్ళ ఎడబాటూ, ఘర్షణలతో నిండిపోయిన మనస్సులో ఆప్యాయత, చనువు, అధికారం చోటు చేసుకోలేకుండా వున్నాయి. వారి మనస్థితిని అర్థం చేసుకొంది జానకి. “నడవండి. నడివీధిలో ఈ కబుర్లు బాగులేదు.” రంగనాయకులు వారం క్రితపు అనుభవంతో జానకి ప్రోత్సాహాన్ని వుపయోగించుకోలేకపోయేడు. తుఫాను బాధితుల సాయం కోసం సుశీలను వచ్చి తన క్లినిక్‌లో పనిచెయ్యమన్నాడు గాని, ఆమె నిరాకరణను మరిచిపోలేదు. దేశం కోసం వస్తానంది. వచ్చింది. ఆమె తనతో కలిసి పనిచేయడానికి ఒప్పుకుంటుందనుకోలేదు. కాని ఒప్పుకొంది. వచ్చింది. ఆ రాక తన కోసం కాదని మొదటనే అర్థం చేసుకొన్నాక, అత్యవసరమైనంత వరకే ఆమెతో ప్రసక్తి పెట్టుకుంటున్నాడు. ఇవన్నీ జానకికి తెలియకపోవచ్చు. ఆమె యెదట ఏమీ అనలేక సుశీల పిలిచింది. ఆ స్థితిలో తాను ఆమెను చిక్కుల్లో పెట్టకూడదనుకున్నాడు. “ఇంకా పోయి స్నానం చెయ్యాలి. బట్టలు మార్చుకోవాలి. ఇంటికి పోయి రేపు కనిపిస్తా. సెలవు.” సుశీల ఈమారు ధైర్యం చేసింది. “మీ బట్టలు కొన్ని ఇక్కడే వున్నాయి; హీటర్‌లో నీళ్లు కాగుతున్నాయి. ఇప్పుడెళ్ళి చన్నీళ్ళు స్నానం చేస్తారా? మంచి మాటే.” రంగనాయకులు కింకా ధైర్యం చిక్కలేదు. సందేహించేడు. “ఇంత రాత్రివేళ అందరికీ అనవసర శ్రమ కదూ.” సుశీల అతని మనసు గ్రహించింది! “శ్రమాలేదు. ఏమీలేదు. నడవండి.” ఆ కంఠంలో అధికారదర్పానికి రంగనాయకులు తృప్తిపడ్డాడు. “థేంక్స్....” అని ఆమె ప్రక్కన అడుగు వేసేడు. “ఎందుకేమిటి?” “ఇంత రాత్రివేళ వెళ్ళి ఇంటిల్లిపాదికీ నిద్రాభంగం చెయ్యాలి.” అతని నిస్సహాయతను అర్థం చేసుకొన్న సుశీలకు కంఠం నిండి వచ్చింది. “నేనిక్కడున్నానుగా” అంటూ సుశీల తండ్రి ఇంటి గుమ్మం ఎక్కింది. గుమ్మం క్రీనీడలో రంగనాయకులు ఆమెను కౌగిలించుకొన్నాడు. సుశీల ప్రతిస్పందన అతనిని ప్రోత్సహించింది. ముఖాన్ని ముద్దులతో నింపుతూ ఆ ఉద్వేగంతో కళ్ళనీళ్ళు పెట్టుకొన్నాడు. పదిహేనో ప్రకరణం మీటింగులో జరిగిన విషయాలు వివరిచడానికి సుశీల నాలుగైదు మార్లు ప్రయత్నించింది. కాని రంగనాయకులు వినిపించుకోలేదు. “వదిలెయ్యి. ఈ గొడవలే మన జీవితాన్ని పాడుచేశాయి. మరి బుద్ధి వచ్చింది. ఎవరి కష్టసుఖాలు వారు చూసుకోగలరు.” “చూసుకోలేకపోతున్నారని అర్థం అయింది కదా! ఇన్నేళ్ళు ఎంత బాధపడ్డా ఇళ్ళస్థలాలు చూపు మేరకి కూడా రాలేదు. ఊరి పెత్తందార్లు అడ్డం వారి దయాధర్మాలతో నడిచే మంత్రులూ, ఆఫీసర్లూ అడ్డం. అసలీనాడున్న వ్యవస్థలో బీదవాడి ఉనికే అసంభవం అయింది.” “ఇప్పుడేమన్నా మారిపోయిందా?” అన్నాడు రంగనాయకులు. అతని ప్రశ్న అర్థం అయింది. “వ్యవస్థ మూలమట్టుగా మారి, ప్రపంచమంతా చక్కబడేవరకూ ఏదో ఒక చోటనో, ఏ కొంచెమో సమకూడిన లాభాన్ని వుపయోగించుకోకూడదంటారా?” “నేనేమీ అనలేదు. ఇళ్ళస్థలాలు పుచ్చుకోడం నిర్బంధం కాదు. తమకు అనవసరం అనుకుని కొంతమంది పుచ్చుకోలేదు. దానికి కష్టపెట్టుకోనక్కరలేదు.” సుశీల కష్టపెట్టుకోలేదు. కాని, స్థలం అనవసరమయి పల్లెలలో ఒక రాజకీయ పార్టీకి అనుచరులైనవారు దూరంగా వున్నారని ఆమె అనుకోలేదు. తెల్లవారేసరికి వారు ఎందుకు సభలో లేరో ఊరంతా గుప్పుమంది. మిగిలిన పార్టీలవారంతా ఆ అయిదెకరాల ప్రదేశంలో వెలిసే పేటలో వీధులు ఎంత వెడల్పుండాలి! పాఠశాలకి ఎంత స్థలం ఎక్కడ వదలాలి? కుటుంబానికి ఎంత భూమి కేటాయించాలి? అనే విషయాల మీద తర్జన భర్జనలు సాగిస్తూంటే మార్క్సిస్టు పార్టీ అనుయాయులు ఆ వూరి పల్లెలోనివారేగాక, చుట్టుప్రక్కల గ్రామాల పల్లెలవాళ్ళు కూడా వచ్చేసి ఆ భూమిలో తెల్లవారేసరికి హద్దులు పెట్టేసుకొన్నారు. కొన్ని గుడిసెలు రాత్రికి రాత్రే తయారయాయి. మిగతావాళ్లు చీమల్లాగా అవిశ్రాంతంగా పని సాగించేస్తున్నారు. సర్వసేనాధిపతిలాగ సుందరరావు ఆ కార్యక్రమాన్నంతనూ దగ్గరుండి నడిపిస్తున్నాడు. పదహారో ప్రకరణం ఊరంతా తీర్థప్రజలా బాడవపొలంకేసి వెళ్ళి చూసి వస్తున్నారు. “జనం ఇంతకాలం వోర్మి పట్టింది. ఇంకెంతకాలం? ప్రజలదీ భూమి. దానిని కుమారస్వామి హరిస్తూంటే చూస్తూ వూరుకొన్న ప్రభుత్వానికి, తమ ఆస్తిని స్వాధీనం చేసుకొన్న ప్రజల్న ఏమనడానికీ నైతిక అధికారం లేదు.” అన్నాడు సుందరరావు. “తమ హక్కును ధృవపరుచుకొంటున్న ప్రజలు అవరోధాల్ని సహించరు. దెబ్బకి దెబ్బ తీస్తారు. దౌర్జన్యాన్ని దౌర్జన్యంతో ప్రతిఘటిస్తారు”-అని హెచ్చరించేడు. “ఇంతకాలం ఆర్జీలు, దరఖాస్తులూ అంటూ రివిజనిస్టులు బూర్జువా, భూస్వామివర్గ కాంగ్రెసు ప్రభుత్వ రధానికి ప్రజల్ని లాగుడు పశువులుగా చేసిపెట్టేరు. బలవంతుల దౌర్జన్యాలూ ధనవంతుల పన్నాగాలూ ఇంకానా? ఇకపై చెల్లవు!”-అని ఎలుగెత్తి నినదించేడు. ఒకదాని వెనుక నొకటిగా ఈ వార్తలు వస్తూంటే రంగనాయకులు తన తండ్రి మొండితనానికి విస్తుపోయేడు. “ఇంతకాలం పట్టిన ఓర్పు ఈవేళ హఠాత్తుగా పోయిందే మీ నాన్నకి?” అంటూ మామగారు, విశ్వనాధం ఎగతాళిగా పకపక నవ్వేడు. “ఏమయినా యుగంధరుణ్ణి చంపి పుట్టేడయ్యా! ఆ భూమినుంచి “స్క్వేటర్సు” ను తొలగించడానికి పోలీసు సాయం కోరితే ప్రభుత్వం-రివిజనిస్టులూ షరీకయ్యారని యాగీచేయవచ్చు. ఊరుకొని భూమి ఎల్లాగూ వదిలెయ్యదలుచుకొన్నాం గదా-యాగీ ఎందుకు? ఏ మాలపల్లె వాళ్ళు అనుభవిస్తేనేం, వూరుకుందాం-అనుకొంటే సత్యానందం వాళ్ళూ నవ్వులపాలవుతారు. మరి పలకరించే వాళ్ళుండరు. కర్ర తీస్తే....” “మధ్యన పల్లెల వాళ్లు కొట్టుకు చావడమేగా. ఈ యౌగంధర్యం పర్యవసానం?”-అని సుశీల ఈసడించింది. ఆమె వరస చూస్తే రాత్రి తన్ను ఇంటికి తీసుకొచ్చినందుకే పశ్చాత్తాపపడుతున్నట్లనిపించింది. రంగనాయకులు లేచేడు. ఆ వ్యాఖ్యాలలో నిజం వుంది. తనకు తెలుసు. తన తండ్రి ఆలోచనలన్నీ ఒకేదారిన పోతున్నాయి. ముందు తమ పార్టీని బలపరుచుకోవాలి. దానికై ఇతరులికి ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలోని రెండో జట్టుకి నామరూపాలు లేకుండా చెయ్యాలి. ఆయన దృష్టిలో తక్షణ కర్తవ్యం అది. తన మామగారి వూహ నిజమే అయివుంటుంది. కాని దానిని తాము ఆపలేరు. మరేమిటి చెయ్యడం? “క్లినిక్‌కు వస్తున్నావా?” “మీరు వెళ్ళండి.” రంగనాయకులు ఒక్క క్షణం ఆగేడు. “నా మీద కోపం పెట్టు....” సుశీల అర్థోక్తిలోనే కట్టె విరిచినట్టు సమాధానం చెప్పింది. “మీ పార్టీ కోసం కాదు నే వచ్చేది. జనం కోసం. ఆ కుర్రాళ్ళూ, నేనూ సహాయ కార్యక్రమాలలోకి రావడం మీ కోసం కాదు. అందుచేత మేము ఈ పూటనుంచి వెళ్ళమేమో అనుకోకండి. మీరు చూపినట్టు ఒంటెత్తు....” రంగనాయకులు బాధపడ్డాడు. “ఈ కుట్ర పనిలో నాకు వాటా లేదనీ, ఇందుకోసమే రాత్రి మీటింగుకు దూరంగా వుండలేదనీ నమ్మలేవూ?” “మీ గత చరిత్ర ఆ విశ్వాసం కలగనీయడం లేదంది” బండగా సుశీల. “మీ వైరాగ్యం, రాజకీయాలకు దూరంగా వుంటాననడం ఆ వొంటెత్తుతనానికి మారురూపాలేననే జ్ఞానం లేకపోయింది.”-అనేసింది కూడా. రంగనాయకులికి అభిమానం అనిపించింది. సుశీల మొహం ముడుచుకొనే వీడ్కోలు యిచ్చింది. ఆమె మరల రమ్మనలేదని గమనించేడు. కుదుటబడిందనుకున్న తన జీవితం మళ్ళీ మొదటికొచ్చింది. దేశంలో ప్రజల జీవితం అల్లకల్లోలంగా వుండగా ఒక వ్యక్తికి సుఖజీవితం వుండదన్న మాట గుర్తు వచ్చింది. “ఎవరన్నదీ మాట”-అనుకుంటూ గుమ్మం దిగేడు, రంగనాయకులు. పదిహేడో ప్రకరణం వీధిలోకి వచ్చేక మాములుగా ఇంటివేపు అడుగుపెట్టేడు. కాని, మనస్సు ఎదురు తిరిగింది. అది తన తండ్రి యిల్లు. రక్త బంధుత్వమే కాదు. రాజకీయ సమభావం కూడా ఆ యింటిని ఆత్మీయం చేసింది. ఇటీవల రాజకీయ భావాలు సందేహాస్పదం అవుతున్నకొద్దీ ఆ యింటికి రావడం, అక్కడ వుండడం కష్టంగానే వుంది. ఈవేళటి ఘటన రాజకీయ సమభావాన్ని పూర్తిగా చంపేసింది. తండ్రి అనుసరిస్తున్న ఈ మార్గం ఎక్కడికి తీసుకెడుతుంది? రంగనాయకులు నిలబడిపోయేడు. ఇంటికి వెళ్లాలనిపించలేదు. తిన్నగా క్లినిక్‌కు వెళ్ళేడు. అది తాళం వేసివుంది! తాళం చెవికోసం ఇంటికెళ్లాలి. లేకపోతే కంపౌండరు తెచ్చి తలుపు తెరిచేవరకూ కూర్చోవాలి. వరండాలో రోగుల కోసం వేసిన బల్లమీద కూర్చున్నాడు. రోడ్డున పోతున్నవారు ఆశ్చర్యంగా చూసేరు. ఒకరు అడిగేసేరు కూడా. “ఏమిటి డాక్టరుగారూ. అల్లా వున్నారేమిటి? అక్కడ కూర్చున్నారు, తాళంచెవి లేదా?” “కంపౌండరు వస్తున్నాడు”-అని అబద్ధమాడేడు. అప్పటికింకా ఏడు కూడా కాలేదు. కంపౌండరు ఎనిమిది దాటితేగాని రాడు. ఎదుటింటి వెంకట్రామయ్య లోపలినుంచే ఆ సమాధానం విని కుర్చీ తెచ్చి అరుగుమీద వేశాడు. ఆహ్వానించేడు. “రాండి. ఇల్లా కూర్చోండి డాక్టరుగారు. అక్కడ ఒక్కరూ కూర్చున్నారేమిటి?” ఇంక అక్కడ కూర్చోడం సాధ్యమనిపించ లేదు. నోటికి వచ్చిన అబద్ధం ఆడేడు. “ఏం లేదు. హైస్కూలుకెళ్ళి నలుగుర్నీ వోమారు చూసిరావాలి. కంపౌండరుకి కబురు పంపేను. వస్తూంటాడు. రాగానే అల్లా పంపించండి.”-అంటూ రోడ్డుమీదికి వచ్చేడు. “వెడుదురుగాని. కాస్త కాఫీ తీసుకు వెళ్ళండి….” అంటూ వెంకట్రామయ్య మెట్లు దిగి వచ్చేడు. వస్తూనే తన గోడు ప్రారంభించేడు. “మీరు మొన్న ఇచ్చిన మందు పనిచేసినట్లే కనిపిస్తూంది. కడుపు వుబ్బరం....” రోగాల గురించి ఆలోచించే స్థితిలో లేదు మనస్సు. కాని, ఆ మాట చెప్పలేకపోయేడు. “తగ్గుతుంది. నాలుగురోజులు మానకుండా తీసుకోండి. పథ్యం జాగ్రత్త-“ అంటూ ముందుకు నడిచేడు, రంగనాయకులు. ‘వస్తా,’ వెంకట్రామయ్యని వదుల్చుకొన్నాక మరి అక్కడ నిలవబుద్ధిపుట్టలేదు. హైస్కూలు మాట తోచాక వెళ్ళి జాన్‌తో మాట్లాడాలనిపించింది-‘అతడికి ఈ కుట్ర తెలిసివుంటుంది? తెలిసి కూడా రాత్రి సభలో పాల్గొని వుంటాడా?” కాని, జాన్ ఎరగడని తేలింది. “మీరు రాలేదు, నిన్నటి సభకి. అప్పటికేమీ అనిపించలేదు. కాని, పొద్దున్న ఈ వార్త వినగానే అపనమ్మకం అనిపించింది, చెప్పొద్దూ.” అన్నాడు జాన్. జాన్ ఎరగడు. అతనికి సన్నిహితంగా వుండే నలుగురు, అయిదుగురు హరిజన పల్లెవాళ్లూ ఎరగరు, సుందరరావు పధకాన్ని. వాళ్ళంతా ఇప్పుడు చిరచిర లాడుతున్నారు. జాన్‌లో విప్లవజ్వాల చల్లారిపోయిందన్నారు. అతనితో వుండడం అతనిని గౌరవించడం వలననే తమకు ఇళ్ళ స్థలాలు లేకుండాపోయాయి-అని వారి విచారం. ఆమాట వినగానే జాన్‌కు చిర్రుపుట్టింది. “ఇప్పుడేమయింది? వెళ్ళండి. మీరూ వో పాక వెయ్యండి. సాయంకాలం లోపున వీపులకి మందెయ్యమని మళ్ళీ వద్దురుగాని.” “మేమే అంత గాజులు తొడిగించుకున్నాం. మామీద చెయ్యెవడు వేస్తాడో రమ్మను. ఖైమా వండేస్తాం.” అన్నాడు, శేషప్ప కస్సుమంటూ. “ఆ వచ్చేవాళ్ళు నీచేత దెబ్బలు తినడానికి రారు. పోలీసులూ, తుపాకులూ బందోబస్తుతో వస్తారు. దెబ్బలు తిని బయటికి గెంటించుకోవాలంటే వెళ్ళండి”-అన్నాడు జాన్ పిరికిమందు పోస్తూ. “పోలీసుల్ని తెప్పిస్తారంటావా?”-అన్నాడు కాశయ్య అక్కడి నుంచి జారుకుంటూ. “కూర్చో వెళ్ళకు” అని జాన్ గదిమేడు. కాశయ్య నిలబడ్డాడు. “ఆ అయిదెకరాలూ ఇళ్ళకోసం మనకి వదిలేస్తామన్నారు. ఇంటికి అయిదు సెంట్లు వుండాలనుకున్నాం. పేర్లు తీసుకొంటే అందరికీ వచ్చేలా లేదు. నాలుగే అనుకొన్నాం. అందులో నీ పేరూ వుందా?”-అని జాన్ అడిగేడు. “మా అన్నయ్య పేరు లేదు” అన్నాడు కాశయ్య. “అతడికి పుంతలో వుందిగా.” “ఆడూ, నేనూ ఒకేచోట వుండాలి” అన్నాడు మొండిగా కాశయ్య. “మరి నిన్నొదిలి ఆడెల్లి అక్కడ హద్దులు పెట్టుకొన్నాడేం?” కాశయ్య మాటాడలేదు. “ఇల్లా జరుగుతుందని నీకు తెలుసునన్నమాట” అన్నాడు జాన్, అనుమానంతో, ఉక్రోషంగా. “నాకేం తెలియదు”-అని కాశయ్య నిర్లక్ష్యంగా విసురుకుపోయేడు. అతడు వెళ్ళినవేపే చూస్తూ జాన్-‘ఈడికి తెలుసును’ అన్నాడు. మిగిలినవాళ్ళు అంగీకరించేరు. “ఈపని చెయ్యవలసినప్పుడు చెయ్యలేదు. అవసరం లేని ఈ క్షణంలో చేశాం. పల్లెవాళ్ళమీది అభిమానమా, మనకి పేరు రావాలనే దురహంకారమా? గొప్ప తప్పు చేశాం. అన్యాయం....”అని రంగనాయకులు బాధ. జాన్ తన మనస్సులో అనుమానం బయటపెడుతూ రంగనాయకులు మాటకు అడ్డంవచ్చేడు. “వీళ్ళని ఖాళీ చేయించడానికి సత్యానందంగారు పోలీసుల్ని తెస్తారేమో....” “ఆశ్చర్యం ఏముంది? వాళ్ళకి మాత్రం ప్రతిష్ఠ అక్కర్లేదూ, ఈపాటికే ఆ పని చేసి వుండకపోతే....” తామే ఇవ్వడానికి సిద్ధమైన వస్తువును, చేతిలోంచి వొడేసి లాక్కుంటే ఎవరికైనా కోపం వస్తుంది. కోపం వచ్చేక ఔచిత్యానౌచిత్యాలు చూడడు. తనకు శక్తి వుంటే అదేదో తానే చూస్తాడు. లేకపోతే  తోడు తెచ్చుకొంటాడు. ఆ ఆలోచనతోనే  రంగనాయకులు తక్షణం తాము ఏదో ఒకటి చెయ్యాలన్నాడు. “మన పార్టీల మధ్య వున్న కక్షతో నాన్నగారు ఈ పని చేసేరు. ఇప్పుడు సత్యానందంగారు పోలీసు సహాయం కోరితే మనం ఆశ్చర్యపడనక్కర్లేదు. జరిగేదదే. ఇది ఒకప్పుడు గవర్నమెంటు బంజరు అయినా ఒకరికి పట్టా అయిన భూమి అది. దానిని వారు పంచిపెడతామనుకొన్నారు. గనుక మనం చేసిన పని తప్పే. మనం చేసిన ఈ పనితో వొళ్ళు మండి నిన్నటి రాత్రి వుద్దేశం మార్చుకొని, అది తమవాళ్ళకే ఇవ్వాలనే పునర్నిర్ణయానికి వచ్చినా రావచ్చు” అన్నాడు. “తమవాళ్ళకే అంటే” అన్నాడు శేషప్ప. “మీ నాన్నగారు మిమ్మల్ని లెక్కేసుకోలేదు. ఇప్పుడు ఆరూ మమ్మల్ని వొదిలేస్తారంటారా?” అని అతని మనస్తాపం. అతని విచారం చూసి జాన్ వెక్కిరించేడు. “ఈడూ మీవాడే బాబూ! ఈడికీ వో నాలుగు సెంట్లు ఇమ్మని ఆరితో సెప్తాలే.” “నువ్వే సెప్పాలి. ఆరు నీ మాట విన్నారు. నడం డెస్సే. మనమే అడుక్కుందాం.” వాళ్ళిద్దరు ముగ్గురూ వెళ్ళిపోతూంటే, చూస్తూ రంగనాయకులు మందహాసం చేసేడు. “మనకంటే రివిజనిస్టాళ్ల మనసులూ, ఆలోచనలే ఆరోగ్యవంతంగా వున్నాయి డాక్టరుగారూ!” అన్నాడు జాన్. “ఇప్పుడేం చేద్దాం?” “అదే తోచడం లేదు....ఈ పార్టీతోనూ, పార్టీ కార్యక్రమంతోనూ సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పి, బాడవ పొలం ఆక్రమణ తప్పు అని బాహాటంగా రంగంలోకి దిగకపోతే మా నాన్నగారి విసురు తగ్గదు. వీళ్లందర్నీ పోలీసు లాకప్పులకీ, పల్లెల్లో కొట్లాటలకీ బలి కాకుండా కాపాడడానికి అదొక్కటే మార్గం. మనం ఈ పద్ధతిని వ్యతిరేకించాలి. తప్పదు. నువ్వు రాకపోతే నేనొక్కణ్ణేనా దిగి తీరుతా. వీళ్లు మనని అగాధం, సుడిగుండంలోకి దింపేరు. చాలు!” అన్నాడు రంగనాయకులు. పద్ధెనిమిదో ప్రకరణం నిముషాలమీద బాడవ పొలంలోంచి మార్క్సిస్టు బైఠాయింపుదార్లని వెళ్లగొట్టేందుకు ఏం చేద్దామంటూ కామేశ్వరరావు సైకిలుమీద హడావిడిగా వచ్చేడు. బైఠాయింపుదార్లు వట్టినే భూమి ఆక్రమించుకొని ఇళ్లు వేస్తున్నారనేకన్న నక్సలైట్ల దాడిగా రిపోర్టునిస్తే త్వరగా పని జరుగుతుందేమో ఆలోచించమని సలహా పట్టుకు వచ్చేడు. అప్పుడే సుందరరావును కలుసుకొని వచ్చిన సత్యానందం మనస్సులో ఎంత మంట మండుతున్నా ఆ సలహాలకు కటకట పడ్డాడు. “నువ్వు కమ్యూనిస్టువి కూడా. నువ్వు అంటున్నదేమిటో తెలుసా?” “ఇంకా మెత్తమెత్తగా మాట్లాడతారేమిటండీ. మీరిల్లా నీళ్లు నమిలే మన పార్టీనీ దశకు తెచ్చారు”-అని కామేశ్వరరావు చుర్రుమన్నాడు. సత్యానందానికి నవ్వొచ్చింది. “ఏం చేద్దామంటావు? స్పష్టంగా చెప్పు.” “మీ గాంధేయ కమ్యూనిజం మనల్ని గంగలో దింపుతుంది. లేకపోతే మన పార్టీని బలపరచేటట్లుగా ఆ ఇళ్ల స్థలాలను కేటాయించడానికి బదులు పార్టీ భేదాలతో నిమిత్తం లేకుండా ఇళ్ళులేని హరిజనులందరికీ అని అడ్డం పెట్టేరు....” “ఇది నా మొదటి తప్పు. జానకీ విన్నావా?”-అన్నాడు సత్యానందం. తన వాదాన్ని యింత తేలిగ్గా తీసుకొంటూంటే కామేశ్వరరావుకు కోపం మిక్కుటమయింది. “దేశంలో పోలరైజేషన్ వచ్చేసింది. మీరిది గమనించకపోవడం ఆత్మ వినాశకరంగా పరిణమిస్తూంది....” “బాగుందయ్యా, బాబూ! పోలరైజేషన్ వచ్చింది. సరే. ఎవరి మధ్య? నాకూ సుందరరావుకూ మధ్యనా? మార్క్సిస్టు-లేక కమ్యూనిస్టు పార్టీల మధ్యనా? లేక ఈ రెండు పార్టీల వెనకా వున్న వాళ్ళ మధ్యనా? ఈ పోలరైజేషన్‌లో మన ఆత్మనాశనం గాకుండా నేనేం చెయ్యాలిసుంటుంది? వాళ్ళని నక్సలైట్‌లని పోలీసు రిపోర్టు ఇవ్వాలి. వాళ్ళొచ్చి ఆ పోలరైజేషన్‌లో నష్టకరంగా వున్న అంశాన్ని కోసి పారేస్తారు, కాదూ? ఇప్పుడు పోలీసులూ, మనమూ కాంగ్రెసు ప్రభుత్వము దానిని బలపరుస్తున్న బూర్జువా-భూస్వామి వర్గాలు ఈ పోలరైజేషన్‌లో ఒక అంశం అన్నమాట. చాల బాగుంది. అద్భుతంగా వుంది....” సత్యానందం స్వరంలో గడిచినకొద్దీ హేళన బలపడుతూ అవహేళన విస్పష్టమయింది. చిట్టచివరకు విసవు, తేలికతనం విస్పష్టమయ్యాయి. తన పోలరైజేషనూ, పోలీసు సహాయం కోరాలనడమూ మీద చేసిన వ్యాఖ్య విని కామేశ్వరరావు నిర్విణ్ణుడయ్యేడు. “కామేశ్వరరావు, క్షమించు. తుఫాను ముందు మనం జరిపిన మీటింగులకి నువ్వు రాలేదు. నక్సలైట్లను గురించి మన అభిప్రాయమేమిటో నీవు తెలుసుకున్నట్లు లేదు. పార్టీ వారిని తప్పుదారి తొక్కిన దేశభక్తుల్నిగా, ప్రజాహితం కోరిన త్యాగమూర్తుల్నిగా భావిస్తూంది. ప్రభుత్వం ప్రజాక్షేమం కొంచెం కూడా కూర్చలేక పోవడం, తత్ఫలితంగా యువతలో వచ్చిన నిస్పృహా, తెగింపూ వారిని సృష్టించాయి. పోలీసులూ, నిర్బంధాలూ వారిని అణచలేవు-అని మన వాదం. యువకులలో విధ్వంస దృష్టిగాక, విప్లవదృష్టి కలిగించడానికి మనకో కార్యక్రమం వుంది. పోలీసు సాయం కోరడం మాత్రం దానిలో భాగం కాదు....” “ఇప్పుడేం చేస్తారు మరి?” అన్నాడు కామేశ్వరరావు, తడిసిన పిల్లిలా ముడుచుకుపోతూ. “అదే ఆలోచిద్దాం. కూర్చోండి” అంది జానకి. సుందరరావుతో జరిగిన సంభాషణను సత్యానందం సూక్ష్మంగా చెప్పాక కామేశ్వరరావు మళ్ళీ అడిగిన ప్రశ్న “ఏం చేద్దామంటారు?” అనే. “నువ్వు మళ్ళీ అదే ప్రశ్న అడుగుతావనుకోలేదు” అన్నాడు సత్యానందం. ఏమడగాలనుకొన్నాడో కామేశ్వరరావుకి అర్థం కాలేదు. తెల్లబోయేడు. “పాకలు వేసినవాళ్లు ఎందరు? ఎవరెవరు?-అనే ప్రశ్న వేస్తావనుకొన్నా....” గత రాత్రి నూరుమందికి స్థలాలు చూపగలమనుకొన్నారు. సుందరరావు పిలుపుకు వచ్చినవారు ముప్ఫయిమంది. వాళ్ళలో ఒక పాతికమంది తామూ స్థలం కేటాయించినవారే. అయిదుగురు పై వూళ్ళ వాళ్లు....ఇద్దరికి పుంతలో స్థలాలున్నాయి. “పొలం అంతా జనమే కనిపిస్తున్నారు. ముప్ఫయిమంది పై చిల్లరేనా?” అన్నాడు ఆశ్చర్యంగా, కామేశ్వరరావు. “భూమిలో బైఠాయించారని పోలీసు రిపోర్టు ఇద్దామన్నావే. ఆ బైఠాయింపుదారులలో ఏ నలుగురైదుగురో తప్ప మిగతా అంతా. మనం బైఠాయించమందామనుకొన్నవాళ్ళే.” “మిగతా భూమి అల్లాగే వుందన్నమాట.” “లేదు. జోగన్నకి పాకా, పాకచుట్టూ వున్న రెండేకరాలు పైగా చెలగా అట్టే వుంచారు. అది అతడిదీ-అదే అనుకొన్నా.” “అయివుంటుంది. అబ్బాయితో నిన్న జోగన్న అల్లాంటిదే ఏదో చెప్పేడట. మీ తాతగారు, ఆ పొలం చూసినందుకు సగం నాకిస్తానన్నారు-అన్నాడుట.” “నాతో మాట్లాడినప్పుడు అంతా తనకే ఇస్తానన్నారన్నాడులే” అన్నాడు సత్యానందం. “ఇప్పుడేం చేస్తారు?” కామేశ్వరరావుది మళ్ళీ అదే ప్రశ్న. “ఏం చేస్తా”రనిగాక “ఏం చేద్దా”మనుకుంటే మంచిది కాదూ?” అని సత్యానందం మరో చురక తగిలించేడు. కామేశ్వరరావు నిరుత్తరుడయ్యేడు. “పోనీ ఏం చేశావని అడుగు. నేను రవీంద్రను వెంటబెట్టుకొని బాడవపొలం వెళ్ళేను. మన లిస్టులో వున్న వాళ్లందరికీ పాకలు వేసుకోమని చెప్పివచ్చాం.” “మీరు చెప్పేదేమిటి. వాళ్ళే వేసేసుకొంటున్నారుగా....” అన్నాడు కామేశ్వరరావు. “అంతే కాదుగా! వాళ్లు వేసుకొన్నట్లు మనకు దాఖలా కావాలి. కనక మధ్యాహ్నం 3 గంటలకు హైస్కూలుకి వచ్చి, జాన్‌కు చెప్పాలి. అతడు రశీదు ఇస్తాడు. అలా పుచ్చుకోకపోతే, అతడు స్థలం ఆక్రమణ చేసినట్లు లెక్కగట్టి తీసుకోవలసిన చర్యలు తీసుకొంటాం....” “అంటే?....” “అవసరమైన వన్నీను....! “పోలీసును....” “నీకు పోలీసు రంధి పట్టుకొందే” “మరి....” “స్థలాలు ఇవ్వాలనుకున్న వాళ్లు ఇంకా డెబ్బయిమందివరకూ వున్నారు. మనకి తన రాక గురించి చెప్పి, చీటి తీసుకోని వాళ్ళకి స్థలం వుండదు. అది మరొకరికిచ్చేస్తాం.” “వాళ్ళల్లో వాళ్లు కొట్టుకొంటారేమో”-అన్నాడు కామేశ్వరరావు. “పోలీసు వాళ్ళేగాని మనవాళ్లకి కొట్టే అధికారం, దెబ్బలుతినే అధికారం లేదా?” “పాకవేసినవాడు కదలకపోతే....” “చూద్దాం. వానికి ఇతరత్రా స్థలం లేకపోతే ఇద్దాం. తప్పేముంది? సుందరరావుగారు ఏదో చిక్కులు తెచ్చేరు. దానికి మనం రెచ్చిపోవడం అర్థం లేదు. కొంచెం వోర్పూ, ఆలోచనా చూపుతే....” “మంచిపని చేసేవు”-అంటూ జానకి లేచింది. పంధొమ్మిదో ప్రకరణం సాయంకాలం అయ్యేసరికి సుందరరావు వోడిపోయాననుకొన్నాడు. కొడుకు-తన మీద అంత భక్తి విశ్వాసాలుగల కొడుకు-ఈ ఇరవయ్యేళ్లూ తననే అంటిపెట్టుకొనివున్న జాన్- -ఇద్దరూ బహిరంగంగా తన చర్యను దుయ్యబట్టినా సుందరరావు జంకలేదు. పెద్ద రాజకీయపుటెత్తులో తమ పరమ శత్రువైన ‘రివిజనిస్టు’ పార్టీని నేల కరిపించేశాననుకొన్నాడు. “పోలీసుల్ని తెచ్చేరా వీళ్ల పార్టీకి జనంలో పుట్టగతులుండకుండాపోతాయి. వూరుకున్నారా హరిజనపల్లెల్ని వదులుకోవలసిందే....అషయుతే భూదానం-ఇషయితే గోదానం....భేషుగ్గా కుదిరింది. తన్నుకు చావనీ” అనుకున్నాడు. కాని మధ్యహ్నం అయ్యేసరికి రంగు మారింది. జోగన్నకి వదిలిన రెండెకరాల చిల్లరలో సత్యానందం జనాన్ని ప్రవేశపెట్టేడు. గ్రామంలో కమ్యూనిస్టుపార్టీ సభ్యులంతా, సానుభూతిపరులంతా హరిజనపేటలవారితో పెద్ద వూరేగింపుగా వచ్చారు. అడ్డం వచ్చిన జోగన్నను ఈడ్చేశారు. తాత్కాలికమైన హద్దులు పెట్టి పేరు పేరున ఇచ్చేశారు. ఆ భూమి పంపకం ఉద్యమంలో, -రెండో భాగంగా తాను ప్రవేశపెట్టిన వారికి స్థల నిర్దేశం ప్రారంభించేరు. ఆ జనాన్నీ వారి ఉత్సాహాన్నీ చూసేక తాను తెచ్చినవాళ్లు నీళ్ళు కారిపోయేరు. వాళ్ల ధైర్యం నిలపడానికి తాను చేసిన ప్రయత్యాలు ఫలించలేదు. ఒక్కొక్కళ్ళే జాన్ దగ్గరకు కదులుతున్నారు. ఒకరు-ఇద్దరు-నలుగురు-అయిదుగురు.... “చెరువుకు గండి పడింది” అన్నాడు సత్యానందం కొడుకు, రామకృష్ణ నవ్వుతూ. నిజమే. గండి పడింది. దానిని పూడ్చగల శక్తి తనకు లేదు. నిన్న ప్రొద్దుటినుంచి పడుతున్న శ్రమతో తల తిరిగిపోతూంది. ఇంక అక్కడ అనవసరం తానుండడం. వెనుదిరిగేడు. కాని, రెండడుగులు కూడా వెయ్యకుండానే పడిపోయాడు. స్మృతి తప్పుతున్న స్థితిలో ఎవరో తన పేరు పలుకుతున్నారు. “సుందర....” తరవాత ఏం తెలియదు.... నిస్సహాయ స్థితిలో ఉన్న తన్ను చేతులమీద ఇంటికి చేర్చేరు. ఇద్దరు డాక్టర్లు కష్టపడి తన్ను బ్రతికించేరు.... కాని, కాలూ చెయ్యి లేదు. మాట లేదు. కళ్లు వున్నాయి. తెలివి వుంది. చెవులు వినిపిస్తాయి. తానొక జీవచ్ఛవం! తానేమీ చెయ్యలేడు! తన ఈ స్థితికి కారకులే తనకు మందులిచ్చి బ్రతికిస్తున్నారు. చూసుకో నిన్ను ఏ స్థితికి తెచ్చామో అని వెక్కిరించడానికే తన్ను బ్రతికిస్తున్నారనిపించింది. మాలపల్లెలు వరసన తన్ను చూడడానికి వస్తున్నారు. గ్రామంలో జనం వస్తున్నారు. పైవూళ్ల వాళ్లు వస్తున్నారు. వారందరూ రావడం తనమీద ప్రజలకుగల అభిమానానికి చిహ్నం అంటూంటే మనస్సు రగిలిపోతూంది. “అబద్ధం. వీళ్లు ద్రోహులు. విప్లవ ద్రోహులు, వీళ్ళెవరూ నామీద ప్రేమతో రాలేదు. విప్లవాన్ని పూర్తిగా చంపేమో లేదో చూసుకొనేందుకు వస్తున్నారు.”-అని అరవాలనుంది. కాని నోరు లేదు. తన అశక్తతకు కన్నీళ్లు కారేయి. ఆ కళ్లనీళ్ళు చూసి చేసిన వ్యాఖ్య మరీ హింసించింది. “మీకేం చెయ్యలేకపోయేను. అశక్తుడినైపోయానని కన్నీరు పెట్టుకుంటున్నారు” అంటున్నారు. “లేదు. మీ పీక పిసికెయ్యాలనుంది. మీరంతా చస్తేగాని, మీ చితాభస్మం మీద గాని భావిసుఖమందిరం నిర్మించబడద”ని ఎలుగెత్తి చెప్పాలనుంది. సత్యానందం, జానకి, ఆ కుర్రాడు ఆమె కొడుకు, వీళ్ళంతా శత్రువులు. విప్లవానికి శత్రువులు. పరమ శత్రువులు. సుందరరావుకి మరల స్పృహ తప్పింది. మళ్ళీ స్ట్రోక్ వచ్చిందని రంగనాయకులు కంగారుపడ్డాడు. ఈమారు సుందరరావుకి మరల తెలివి రాలేదు. ఆ మెదడు నరాలు రాగద్వేషాలను ప్రకటించలేవు. శత్రు-మిత్రుల్ని వేర్పరించలేవు. రంగనాయకులు బావురుమన్నాడు. “ఈదారి ఇక్కడికి ఆఖరయిందా?” End of Project Gutenberg's Ee Daari Ekkadiki, by Rama Mohana Rao Mahidhara *** END OF THE PROJECT GUTENBERG EBOOK ఈ దారి ఎక్కడికి? (రధచక్రాలు - ఉత్తరగాధ) *** Updated editions will replace the previous one—the old editions will be renamed. Creating the works from print editions not protected by U.S. copyright law means that no one owns a United States copyright in these works, so the Foundation (and you!) can copy and distribute it in the United States without permission and without paying copyright royalties. Special rules, set forth in the General Terms of Use part of this license, apply to copying and distributing Project Gutenberg™ electronic works to protect the PROJECT GUTENBERG™ concept and trademark. Project Gutenberg is a registered trademark, and may not be used if you charge for an eBook, except by following the terms of the trademark license, including paying royalties for use of the Project Gutenberg trademark. If you do not charge anything for copies of this eBook, complying with the trademark license is very easy. You may use this eBook for nearly any purpose such as creation of derivative works, reports, performances and research. Project Gutenberg eBooks may be modified and printed and given away—you may do practically ANYTHING in the United States with eBooks not protected by U.S. copyright law. Redistribution is subject to the trademark license, especially commercial redistribution. START: FULL LICENSE THE FULL PROJECT GUTENBERG LICENSE PLEASE READ THIS BEFORE YOU DISTRIBUTE OR USE THIS WORK To protect the Project Gutenberg™ mission of promoting the free distribution of electronic works, by using or distributing this work (or any other work associated in any way with the phrase “Project Gutenberg”), you agree to comply with all the terms of the Full Project Gutenberg™ License available with this file or online at www.gutenberg.org/license. Section 1. General Terms of Use and Redistributing Project Gutenberg™ electronic works 1.A. By reading or using any part of this Project Gutenberg™ electronic work, you indicate that you have read, understand, agree to and accept all the terms of this license and intellectual property (trademark/copyright) agreement. If you do not agree to abide by all the terms of this agreement, you must cease using and return or destroy all copies of Project Gutenberg™ electronic works in your possession. If you paid a fee for obtaining a copy of or access to a Project Gutenberg™ electronic work and you do not agree to be bound by the terms of this agreement, you may obtain a refund from the person or entity to whom you paid the fee as set forth in paragraph 1.E.8. 1.B. “Project Gutenberg” is a registered trademark. It may only be used on or associated in any way with an electronic work by people who agree to be bound by the terms of this agreement. There are a few things that you can do with most Project Gutenberg™ electronic works even without complying with the full terms of this agreement. See paragraph 1.C below. There are a lot of things you can do with Project Gutenberg™ electronic works if you follow the terms of this agreement and help preserve free future access to Project Gutenberg™ electronic works. See paragraph 1.E below. 1.C. The Project Gutenberg Literary Archive Foundation (“the Foundation” or PGLAF), owns a compilation copyright in the collection of Project Gutenberg™ electronic works. Nearly all the individual works in the collection are in the public domain in the United States. If an individual work is unprotected by copyright law in the United States and you are located in the United States, we do not claim a right to prevent you from copying, distributing, performing, displaying or creating derivative works based on the work as long as all references to Project Gutenberg are removed. Of course, we hope that you will support the Project Gutenberg™ mission of promoting free access to electronic works by freely sharing Project Gutenberg™ works in compliance with the terms of this agreement for keeping the Project Gutenberg™ name associated with the work. You can easily comply with the terms of this agreement by keeping this work in the same format with its attached full Project Gutenberg™ License when you share it without charge with others. 1.D. The copyright laws of the place where you are located also govern what you can do with this work. Copyright laws in most countries are in a constant state of change. If you are outside the United States, check the laws of your country in addition to the terms of this agreement before downloading, copying, displaying, performing, distributing or creating derivative works based on this work or any other Project Gutenberg™ work. The Foundation makes no representations concerning the copyright status of any work in any country other than the United States. 1.E. Unless you have removed all references to Project Gutenberg: 1.E.1. The following sentence, with active links to, or other immediate access to, the full Project Gutenberg™ License must appear prominently whenever any copy of a Project Gutenberg™ work (any work on which the phrase “Project Gutenberg” appears, or with which the phrase “Project Gutenberg” is associated) is accessed, displayed, performed, viewed, copied or distributed: This eBook is for the use of anyone anywhere in the United States and most other parts of the world at no cost and with almost no restrictions whatsoever. You may copy it, give it away or re-use it under the terms of the Project Gutenberg License included with this eBook or online at www.gutenberg.org. If you are not located in the United States, you will have to check the laws of the country where you are located before using this eBook. 1.E.2. If an individual Project Gutenberg™ electronic work is derived from texts not protected by U.S. copyright law (does not contain a notice indicating that it is posted with permission of the copyright holder), the work can be copied and distributed to anyone in the United States without paying any fees or charges. If you are redistributing or providing access to a work with the phrase “Project Gutenberg” associated with or appearing on the work, you must comply either with the requirements of paragraphs 1.E.1 through 1.E.7 or obtain permission for the use of the work and the Project Gutenberg™ trademark as set forth in paragraphs 1.E.8 or 1.E.9. 1.E.3. If an individual Project Gutenberg™ electronic work is posted with the permission of the copyright holder, your use and distribution must comply with both paragraphs 1.E.1 through 1.E.7 and any additional terms imposed by the copyright holder. Additional terms will be linked to the Project Gutenberg™ License for all works posted with the permission of the copyright holder found at the beginning of this work. 1.E.4. Do not unlink or detach or remove the full Project Gutenberg™ License terms from this work, or any files containing a part of this work or any other work associated with Project Gutenberg™. 1.E.5. Do not copy, display, perform, distribute or redistribute this electronic work, or any part of this electronic work, without prominently displaying the sentence set forth in paragraph 1.E.1 with active links or immediate access to the full terms of the Project Gutenberg™ License. 1.E.6. You may convert to and distribute this work in any binary, compressed, marked up, nonproprietary or proprietary form, including any word processing or hypertext form. However, if you provide access to or distribute copies of a Project Gutenberg™ work in a format other than “Plain Vanilla ASCII” or other format used in the official version posted on the official Project Gutenberg™ website (www.gutenberg.org), you must, at no additional cost, fee or expense to the user, provide a copy, a means of exporting a copy, or a means of obtaining a copy upon request, of the work in its original “Plain Vanilla ASCII” or other form. Any alternate format must include the full Project Gutenberg™ License as specified in paragraph 1.E.1. 1.E.7. Do not charge a fee for access to, viewing, displaying, performing, copying or distributing any Project Gutenberg™ works unless you comply with paragraph 1.E.8 or 1.E.9. 1.E.8. You may charge a reasonable fee for copies of or providing access to or distributing Project Gutenberg™ electronic works provided that: • You pay a royalty fee of 20% of the gross profits you derive from the use of Project Gutenberg™ works calculated using the method you already use to calculate your applicable taxes. The fee is owed to the owner of the Project Gutenberg™ trademark, but he has agreed to donate royalties under this paragraph to the Project Gutenberg Literary Archive Foundation. Royalty payments must be paid within 60 days following each date on which you prepare (or are legally required to prepare) your periodic tax returns. Royalty payments should be clearly marked as such and sent to the Project Gutenberg Literary Archive Foundation at the address specified in Section 4, “Information about donations to the Project Gutenberg Literary Archive Foundation.” • You provide a full refund of any money paid by a user who notifies you in writing (or by e-mail) within 30 days of receipt that s/he does not agree to the terms of the full Project Gutenberg™ License. You must require such a user to return or destroy all copies of the works possessed in a physical medium and discontinue all use of and all access to other copies of Project Gutenberg™ works. • You provide, in accordance with paragraph 1.F.3, a full refund of any money paid for a work or a replacement copy, if a defect in the electronic work is discovered and reported to you within 90 days of receipt of the work. • You comply with all other terms of this agreement for free distribution of Project Gutenberg™ works. 1.E.9. If you wish to charge a fee or distribute a Project Gutenberg™ electronic work or group of works on different terms than are set forth in this agreement, you must obtain permission in writing from the Project Gutenberg Literary Archive Foundation, the manager of the Project Gutenberg™ trademark. Contact the Foundation as set forth in Section 3 below. 1.F. 1.F.1. Project Gutenberg volunteers and employees expend considerable effort to identify, do copyright research on, transcribe and proofread works not protected by U.S. copyright law in creating the Project Gutenberg™ collection. Despite these efforts, Project Gutenberg™ electronic works, and the medium on which they may be stored, may contain “Defects,” such as, but not limited to, incomplete, inaccurate or corrupt data, transcription errors, a copyright or other intellectual property infringement, a defective or damaged disk or other medium, a computer virus, or computer codes that damage or cannot be read by your equipment. 1.F.2. LIMITED WARRANTY, DISCLAIMER OF DAMAGES - Except for the “Right of Replacement or Refund” described in paragraph 1.F.3, the Project Gutenberg Literary Archive Foundation, the owner of the Project Gutenberg™ trademark, and any other party distributing a Project Gutenberg™ electronic work under this agreement, disclaim all liability to you for damages, costs and expenses, including legal fees. YOU AGREE THAT YOU HAVE NO REMEDIES FOR NEGLIGENCE, STRICT LIABILITY, BREACH OF WARRANTY OR BREACH OF CONTRACT EXCEPT THOSE PROVIDED IN PARAGRAPH 1.F.3. YOU AGREE THAT THE FOUNDATION, THE TRADEMARK OWNER, AND ANY DISTRIBUTOR UNDER THIS AGREEMENT WILL NOT BE LIABLE TO YOU FOR ACTUAL, DIRECT, INDIRECT, CONSEQUENTIAL, PUNITIVE OR INCIDENTAL DAMAGES EVEN IF YOU GIVE NOTICE OF THE POSSIBILITY OF SUCH DAMAGE. 1.F.3. LIMITED RIGHT OF REPLACEMENT OR REFUND - If you discover a defect in this electronic work within 90 days of receiving it, you can receive a refund of the money (if any) you paid for it by sending a written explanation to the person you received the work from. If you received the work on a physical medium, you must return the medium with your written explanation. The person or entity that provided you with the defective work may elect to provide a replacement copy in lieu of a refund. If you received the work electronically, the person or entity providing it to you may choose to give you a second opportunity to receive the work electronically in lieu of a refund. If the second copy is also defective, you may demand a refund in writing without further opportunities to fix the problem. 1.F.4. Except for the limited right of replacement or refund set forth in paragraph 1.F.3, this work is provided to you ‘AS-IS’, WITH NO OTHER WARRANTIES OF ANY KIND, EXPRESS OR IMPLIED, INCLUDING BUT NOT LIMITED TO WARRANTIES OF MERCHANTABILITY OR FITNESS FOR ANY PURPOSE. 1.F.5. Some states do not allow disclaimers of certain implied warranties or the exclusion or limitation of certain types of damages. If any disclaimer or limitation set forth in this agreement violates the law of the state applicable to this agreement, the agreement shall be interpreted to make the maximum disclaimer or limitation permitted by the applicable state law. The invalidity or unenforceability of any provision of this agreement shall not void the remaining provisions. 1.F.6. INDEMNITY - You agree to indemnify and hold the Foundation, the trademark owner, any agent or employee of the Foundation, anyone providing copies of Project Gutenberg™ electronic works in accordance with this agreement, and any volunteers associated with the production, promotion and distribution of Project Gutenberg™ electronic works, harmless from all liability, costs and expenses, including legal fees, that arise directly or indirectly from any of the following which you do or cause to occur: (a) distribution of this or any Project Gutenberg™ work, (b) alteration, modification, or additions or deletions to any Project Gutenberg™ work, and (c) any Defect you cause. Section 2. Information about the Mission of Project Gutenberg™ Project Gutenberg™ is synonymous with the free distribution of electronic works in formats readable by the widest variety of computers including obsolete, old, middle-aged and new computers. It exists because of the efforts of hundreds of volunteers and donations from people in all walks of life. Volunteers and financial support to provide volunteers with the assistance they need are critical to reaching Project Gutenberg™’s goals and ensuring that the Project Gutenberg™ collection will remain freely available for generations to come. In 2001, the Project Gutenberg Literary Archive Foundation was created to provide a secure and permanent future for Project Gutenberg™ and future generations. To learn more about the Project Gutenberg Literary Archive Foundation and how your efforts and donations can help, see Sections 3 and 4 and the Foundation information page at www.gutenberg.org. Section 3. Information about the Project Gutenberg Literary Archive Foundation The Project Gutenberg Literary Archive Foundation is a non-profit 501(c)(3) educational corporation organized under the laws of the state of Mississippi and granted tax exempt status by the Internal Revenue Service. The Foundation’s EIN or federal tax identification number is 64-6221541. Contributions to the Project Gutenberg Literary Archive Foundation are tax deductible to the full extent permitted by U.S. federal laws and your state’s laws. The Foundation’s business office is located at 809 North 1500 West, Salt Lake City, UT 84116, (801) 596-1887. Email contact links and up to date contact information can be found at the Foundation’s website and official page at www.gutenberg.org/contact Section 4. Information about Donations to the Project Gutenberg Literary Archive Foundation Project Gutenberg™ depends upon and cannot survive without widespread public support and donations to carry out its mission of increasing the number of public domain and licensed works that can be freely distributed in machine-readable form accessible by the widest array of equipment including outdated equipment. Many small donations ($1 to $5,000) are particularly important to maintaining tax exempt status with the IRS. The Foundation is committed to complying with the laws regulating charities and charitable donations in all 50 states of the United States. Compliance requirements are not uniform and it takes a considerable effort, much paperwork and many fees to meet and keep up with these requirements. We do not solicit donations in locations where we have not received written confirmation of compliance. To SEND DONATIONS or determine the status of compliance for any particular state visit www.gutenberg.org/donate. While we cannot and do not solicit contributions from states where we have not met the solicitation requirements, we know of no prohibition against accepting unsolicited donations from donors in such states who approach us with offers to donate. International donations are gratefully accepted, but we cannot make any statements concerning tax treatment of donations received from outside the United States. U.S. laws alone swamp our small staff. Please check the Project Gutenberg web pages for current donation methods and addresses. Donations are accepted in a number of other ways including checks, online payments and credit card donations. To donate, please visit: www.gutenberg.org/donate. Section 5. General Information About Project Gutenberg™ electronic works Professor Michael S. Hart was the originator of the Project Gutenberg™ concept of a library of electronic works that could be freely shared with anyone. For forty years, he produced and distributed Project Gutenberg™ eBooks with only a loose network of volunteer support. Project Gutenberg™ eBooks are often created from several printed editions, all of which are confirmed as not protected by copyright in the U.S. unless a copyright notice is included. Thus, we do not necessarily keep eBooks in compliance with any particular paper edition. Most people start at our website which has the main PG search facility: www.gutenberg.org. This website includes information about Project Gutenberg™, including how to make donations to the Project Gutenberg Literary Archive Foundation, how to help produce our new eBooks, and how to subscribe to our email newsletter to hear about new eBooks.